అయ్యయ్యో, అవి చలం మాటలే!

బ్రహ్మద్వేషం అన్నద్వేషం ఒక భావుకుడి డైలెమా అనే పేరుతో ఆంధ్ర జ్యోతి వివిధలో నేనొక వ్యాసం రాశాను, దానికి రెండు ప్రతి స్పందనలు వచ్చాయి. జవాబు వెంటనే పంపాను. నిడివి సమస్య వచ్చింది. తరువాత నిడివి తగ్గించి పంపాను. ఎట్టకేలకు నేను చివరి సారి పంపిన దాన్ని కూడా ఎడిట్ చేయాల్సి వచ్చినట్టుంది. ఎడిటర్లకు బాగానే పని పెట్టినట్టున్నాను. థాంక్యూ వెరీ మచ్, ఫ్రెండ్స్! ఇక్కడ (ఫేస్ బుక్ లో) ‘వివిధ’ లింకు ఇస్తున్నాను. అదే సమయంలో చివరి సారి నేను ఎడిట్ చేసి పంపిన నా వ్యాసం పాఠం కూడా ఇస్తున్నాను. బాపూజీ నన్ను కుల వాది అన్నారని నేను అన్నట్లు ‘వివిధ’ ప్రచురించిన పాఠంలో వుంది. ఆయన ఆలా అనలేదు. అలా అనలేదు అని స్పష్టం చేసి, ఆపైన ఆయన అన్న దానికి నా వ్యాఖ్య నేను చేశాను. ఇది నా ఎడిటర్ మిత్రులను తప్పు పట్టడం కాదు. అదే స్థాయి మిత్రులైన బాపూజీ గారు నన్ను అపార్థం చేసుకోకూడదనే కోరికతో చెబుతున్న మాట. అందుకే నేను ఫైనలైజ్ చేసిన పాఠాన్ని ఇస్తున్నాను.

 

న్న ద్వేషం బ్రహ్మ ద్వేషం: ఒక భావుకుని డైలెమా’ అనే నా వ్యాసం మార్చి 14 ‘వివిధ’లో అచ్చయింది. దానిపై మార్చి 28న  తాడికొండ కె శివకుమార శర్మ, ఏప్రిల్ 18న బి ఆర్ బాపూజీ ప్రతిస్పందించారు. ఇది సంక్షిప్త సమాధానం. వివరాలు మరెప్పుడైనా, ఎక్కడైనా.

నేను చలం మీద ఆంచెనా ప్రకటించలేదు. చలాన్ని తక్కువ/ఎక్కువ చేయలేదు. చలం చేసింది ‘బ్రాహ్మణ కులానుకూల వాదం’ అనే నా మాటకు ఆధారం ఆయన బ్రాహ్మణుడనే నా ‘జ్ఞానం’ కాదు. ‘బ్రాహ్మణీకం’ కథలో రామయ్య నాయుడు పాత్రను చిత్రించిన తీరు దానికి ఆధారం. బాపూజీకి నా అసలు పేరు, కులం తెలిసినంత మాత్రాన నన్ను కులవాది అనడం కుదరదు. నా పనులలో, రాతలలో అలాంటిదేమైనా వుంటే ఆ మాట అనాలి. అనకపోతే తప్పు. బాపూజీ అలా అనలేదు. అనలేం కదా అంటూ సన్నాయి నొక్కు నొక్కారు. పాత్రికేయంగా ఆ నొక్కు విలువ తెలుసు కాబట్టే ఎడిటర్లు దాన్ని బ్లర్బుగా వాడుకున్నారు. చలం కథ పేరు ‘బ్రాహ్మణీకం’. కథలో ఆయన డీల్ చేసింది వివిధ కోణాల్లో ‘బ్రాహ్మణీకా’న్నే, నాయుడిని కథలోకి తెచ్చిందీ ‘బ్రాహ్మణీక’ చిత్రణ కోసమే.

బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ఒకప్పుడు ప్రగతి శీలం. ఇప్పటి దళిత వాదం లాగానే. ఆనాడది శూద్రకులాల వైపు నుంచి బ్రాహ్మణాధిపత్యాన్ని ప్రశ్నించిన ఉద్యమం. ఆ ప్రశ్న ఇంకా వేడి వేడిగా వున్న రోజుల మీద చలం వ్యాఖ్యానం నాయుడి పాత్ర. రామయ్య నాయుడు అనే పేరు కాకతాళీయం కాదు. నాకు రామస్వామి చౌదరి గుర్తుకొచ్చారు, మీకు గుర్తు రాకపోతే వదిలెయ్యండి. చలం చేతిలో ఆ పాత్ర చిత్రణ ఎలా వుందనేది చర్చనీయం. ఇవాళ ఆ చర్చ మరింత రిలవెంట్. కథలో చలం ఎవర్ని హీరోల్ని చేశారు, ఎవర్ని విలన్లు చేశారు అనేవి చూడాల్సిన విషయాలే.

వ్యాసంలోని విషయాల్ని నేను శూద్రుల బాధలు సొంతంగా తెలిసిన వాడిగా చెప్పాలనుకున్నాను. అందుకే నా శూద్రత్వాన్ని వ్యాసంలో పేర్కొన్నాను. బాపూజీ నా మీద సత్యాగ్రహించి కులాల కేకలు వేయాలని కాదు. శూద్రత్వం ఒక ఉనికి… ఒకానొక ఉనికి… అది ‘గొప్ప’ అనడం లేదు నేను. ‘చాల గొప్ప’ అనీ అనడం లేదు. బాపూజీ క్లయింటు చలం బ్రాహ్మణ కులం గొప్పదని, దాని జోలికొస్తే కాలి దగ్ధమవుతారని స్ఫురింపించాఢు.

బ్రాహ్మణులు గొప్ప అనే చలం మాటల్నిబాపూజీ తమ స్పందనలో ఉటంకించారు.  “రామయ్యే హిందూ విజ్ఞాన చరిత్రను నిష్పక్షపాత బుద్ధితో చదివి వుండినట్లయితే ఈ బ్రాహ్మణత్వమే, ఆ ప్రత్యేకతే, ఆ భేదభావమే బ్రాహ్మణ తపో ప్రయత్నాలకు, ఆధ్యాత్మిక ఆశయాలకు ఆ శుచిత్వమే, ఆ ఆచారమే యెట్లా అవసరమై, ఎన్నడూ యే దేశీయులూ అందుకోలేని ధర్మాన్నీ, కళనూ, జీవితాన్నీ, సూక్ష్మ వేదాంత రహస్యాల్నీ; యోగ మంత్ర శక్తుల్నీ తమకే గాక, యేనాడో లోకాన్నంతా ఉద్ధరించగల ఆత్మ తత్వాల్ని సాధించేందుకు బ్రాహ్మలకి ఎట్లా సహాయపడ్డవో తెలుసుకుని వుండును. ఏమైతేనేం, యీ ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ (inferiority complex) తో నేత్రానందమైన కాలంలో, ఎట్లా అంతకన్న ఔన్నత్యాన్ని ప్రయత్నించగలడు రామయ్య! Creature of the times”. ఇందులో వున్న ప్రతి ‘చారిత్రక’ విశేషమూ తిరస్కరణీయమే. ఈ మాటల తరువాత, చలానిది ‘బ్రాహ్మణ కులానుకూల వాదం’ కాదని బాపూజీ అనగూడదు. ఆ యొక్కటి తప్పఅనడం కూడా కుదరదు. ఇంకా వున్నై.

బ్రాహ్మణుల్లో వుండే కొన్ని మూఢత్వాలను చలం ఈ కథలో విమర్శించిన మాట నిజమే. వారి ‘అత్మౌన్నత్య’ భావనని కోప్పడిన మాట నిజమే. అవి వారి ప్రగతికి అడ్డు పడుతున్నవనే భావనతో చెప్పినవే. మంచిదే. అవే వారిని గొప్ప వారిని చేశాయని చలం చెప్పాడు. ఆ ‘భేదభావం’ వల్లనే వాళ్లు ఏవేవో సాధించారని అన్నారు. అదే బ్రాహ్మణేతర కులాల గురించి చెబుతూ… రామయ్య నాయుడి (విపరీత)  మనస్తత్వానికి “రామయ్య పూర్వ చరిత్ర, అతడి పూర్వుల మృత చరిత్ర కారణం” అన్నాడు. అది అతడి వ్యక్తిగత బలహీనత కాదు. ఆ కులం యొక్క బలహీనత. రామయ్యది పొలాల్లో కష్టపడిన చరిత్ర. అది మృతం, క్రౌర్యం ఎట్సెట్రా. చలం ఉగ్గడించే వాళ్లది అలా కష్టపడని చరిత్ర. అది గొప్ప చలానికి. కథలో ఆ సాయంత్రం రామయ్య నాయుడు మందుల షాపులో ఎందుకు కూర్చున్నాడట? రామయ్యకు “మందుల దగ్గర కూచోడం అలవాటయిపోయింది. అది అతని తప్పు కాదు. ఇంకా గవళ్ల స్వేచ్ఛ అలవాట్లని మరిచిపోలేని అతడి భార్య తప్పు”. ఆమె స్వేచ్చ అలవాట్లేమిటో గాని, ఈ వాక్యాలు ఆమెకు కాంప్లిమెంటు మాత్రం కాదు.

చలంలోని ఈ కోణానికి ఆనాటికి మన సమాజంలో మార్క్సిజం లేకపోవడం కారణమని బాపూజీ అన లేరు. అలా అనడం ఇక్కడ అచారిత్రకం. శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ గీతాలూ, ఈ కథ దాదాపు ఒక కాలానివే.

రామయ్య నాయుడు పాత్ర కథలోకి సహజ గతితర్కం వల్ల వచ్చినది కాదు. చలం సృష్టించినది. అది కథ. చరిత్ర కాదు. నాయుడు నిజం మనిషి కాదు. కల్పిత పాత్ర. నాటి సమాజంలోని ఒక క్రియా శీల విషయం మీద చలం వ్యాఖ్యానం నాయుడు. “రామయ్యకి బ్రాహ్మలంటే కోపం, బ్రాహ్మణ వ్యక్తుల మీద కాదు. ఆ కులం మీద. ఈ కోపానికి, ఆ కోపం ఈ నిమిషంలో కల్పించిన ఘోర పర్యవసానాలకీ, కృతయుగం నాటి నించి వొచ్చే ఈ వర్ణభేదమూ, వర్ణస్తులూ కారణం. తండ్రి జవానుగా పని చేసే యింట్లోనూ రామయ్య ఆ బ్రాహ్మణుల నుండి పొందిన నీచత్వమూ అసలు పునాది. ఫలితం బ్రాహ్మణేతర సభ్యత్వం”. రామయ్య నాయుడే కాదు. అలాంటి అనుభవాలున్న వారు ఎవరైనా, అందుబాటులో వుంటే, బ్రాహ్మణేతర సభ్యత్వమే తీసుకుంటారు. అది న్యాయం. కాని, సుందరమ్మ వంటి నిస్సహాయను. అతి దీన స్టితిలో వున్న స్ర్తీని కాంక్షించరు. ఆ పనిని… ఈ చలం పాత్ర మాత్రమే చేస్తుంది. అదే దాని ‘ప్రత్యేకత’. కేవలం బ్రాహ్మణ కుల వ్యతిరేకత కారణంగానే… అదర్వైజ్ చాల మంచి వాడు… ఒక నిస్సహాయను కాంక్షించాడని అసహజ క్యారెక్టరైజేషన్ కు దిగాడు చలం.

బాపూజీ ఏమంటున్నారు?: “బ్రాహ్మణీకం నవలలో, ఈ ఘట్టాన్ని చలం వర్ణించినప్పడు, ఆ తగలబడడం ‘బ్రాహ్మణీకపు మహిమ వల్ల జరిగిందని’ రచయిత ఏ మాటలు చెప్పలేదు. ఇవి చలం మాటలే అనడం అన్యాయమైన అపార్థం….  బ్రాహ్మణీకపు మహిమ వల్ల అనే మాటలు లేనే లేవు.”

కథలో ఏముంది? లెట్మీ కోట్. చివరి పేజీ. చలం మాట: “…. ఈ లోకపు సంకుచిత వాసనల్ని- శరీర స్వల్ప బంధనాల్ని తెంచుకున్న ఆమె (సుందరమ్మ) ఆత్మ అతిక్రమించి- వూర్థ్వ లోకాల జ్వలించే మహా శక్తులతో- బ్రాహ్మణ తేజస్సుతో సంబంధం కల్పించుకుంది.” … ….(రామయ్య) ఇంకో కాలు వెనక్కి వేశాడు. ఆమె కళ్ల లోంచి జ్వలించే వెలుగును భరించలేక భగ్గున మండిపోయినాడు. నిలువునా కాలిపోయినాడు. భస్మమైనాడు. వెనుకనే మండే దీపం అతని పంచకంటుకుందా? అతని శరీరం లోంచి- కాళ్ల మధ్య నించి లేచిందా మంట. ….. బ్రాహ్మణ కడపటి మహత్యం బ్రాహ్మణీకం. ఈ కలియుగాన సుందరమ్మతో అంతమైంది”

పాఠక మహాశయా! బి ఆర్ బాపూజీ ఏం చెప్పారో, చలం ఏమన్నాడో చూశారుగా? ఈ వర్ణనల్లోని ‘బ్రాహ్మణ తేజం’, ‘బ్రాహ్మణ కడపటి మహత్యం’, ‘బ్రాహ్మణీకం’ ఇవేవీ నా మాటలు కావు.

దీపం పంచెకంటుకునే దగ్గర చలం ఒక ప్రశ్నార్థకం వుంచారు. అక్కడది ఎందుకుంది? దీపం అంటుకోడం అనే ప్రమాదం వల్లనే రామయ్య కాలిపోలేదని, ఇందులో వేరే ఫ్యాక్టర్స్ వున్నాయనే స్ఫురణ ఇవ్వడం చలం ఉద్దేశం. ఆ వేరే ఫ్యాక్టర్సే ‘బ్రాహ్మణీకం మహత్యం’.

హారర్ కథల్లో చివరాఖర్న సమస్య సాల్వ్ అయ్యేది సైకాలజిస్టు వల్లనా, మంత్రగాడి వల్లనా అనే సందేహాన్ని అలా వుంచేస్తాడు రచయిత. అది ఉద్దేశపూర్వకం. ఒకే సారి హేతు వాదుల్ని, భూత వాదుల్ని ఆకట్టుకోడానికి… అదొక స్టాండర్డు ముగింపు. ‘బ్రాహ్మణీకం’ కథ అలా ఎందుక్కాదు? చలమంటే మనకు అభిమానం కనుకనా? మన బిడ్డ చేస్తే చిలిపితనం, మంది బిడ్డ చేస్తే తులువతనమా?

నా వ్యాసం శీర్షికలో ‘ఒక భావుకుని డైలెమా’ అనే నా మాటను బాపూజీ తప్పు పట్టారు. చలం మీద నిర్థారణలు చేశాను కాబట్టి ‘డైలెమా’ అనగూడదన్నారు. నా ‘డైలెమా’ కేవలం చలానికి సంబంధించినది కాదు. అసలా వ్యాసం చలం మీద కాదు. ‘ఆత్మ’ తదితర అంశాలెన్నిటి విషయంలోనో నేను ఇదమిత్థంగా తేల్చుకోని సంగతులున్నాయి. ఉదాహరణకి “Religion is the sigh of the oppressed creature, the heart of a heartless world, and the soul of soulless conditions. It is the opium of the people”. అనే మార్క్స్ మాటలోని ‘సోల్’ ఏమిటో నాకు స్పష్టత లేదు. ఆ రకం జిజ్ఞాసతో చేసే అధ్యయనం పలుమార్లు మతం, కులాల వద్దకు తీసుకెళ్తోంది. భారతం అంటే నాకు చాల అభిమానం. ప్రపంచంలో మరెక్కడా అంత గొప్ప ఎపిక్ స్టోరీ లేదని అనుకుంటాను. అందులో ఆడుగడుగున వచ్చే గో బ్రాహ్మణ పూజ అంటే పరమ అయిష్టం. ఈ నొప్పి నా వ్యాసంలో వుంది. వీటన్నిటినీ కలిపి ‘ఒక భావుకుని డైలెమా’ అన్నాను.

ఔను, బ్రాహ్మణీకం నవలలో చివరి భాగాన్నే తీసుకున్నాను. మరేం చేయను? ఒక బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం మనిషి చచ్చిన కుక్క చావు వ్యాసంలో నాకు ముఖ్యం. అతఢి సృష్టి కర్త అతడికొక కుక్క చావును కేటాయించి, దానికి బాధ్యతను ఐడియాలజీకి కేటాయించాఢు. రామయ్య వచ్చింది కథ చివర్లోనే. “మహిషాసుర మర్ధని మొదలయినవి అవి రామయ్య నాయుడి ఊహలు” అంటారు బాపూజీ. ఔను, అవి రామయ్య ఊహలు. అవి అతడి ఊహలని మనకు చెబుతున్నది చలం. అమెలో ‘బ్రాహ్మణ తేజా’న్ని చూసిందీ, చూపించిందీ చలం. సైద్డాంతికంగా, మానసికంగా బ్రాహ్మణ వ్యతిరేకి అయిన రామయ్యకు సుందరమ్మలో బ్రాహ్మణ తేజం ఎలా కనిపిస్తుందో, అతడి దృష్టిలో ఆమె మహిషాసుర మర్దని ఎలా అవుతుందో నా ఊహలకతీతం.

బ్రాహ్మణీకం అంటే బ్రాహ్మణ కులజులు అని కాదు. బ్రాహ్మణవాదాన్ని ఇష్టపడే వారని అర్థం. వారిని వ్యతిరేకించాలి. ఇంకా అలా వుండిపోవడానికి వాళ్లకి లేని సిగ్గు వాళ్లను వ్యతిరేకించడానికి మనకెందుకు? విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ తప్పు కాదు. లెజిటిమేట్ ఘర్షణను ద్వేషమనడం తప్పు. మనిషిని మనిషి ద్వేషించని లోకం కోసం పాటు పడదాం.

Ends

 

Leave a comment