అనుభవానికి వచ్చిన కామ్రేడరీ

స్మృతి 29

ఇల్లు వదిలి వూళ్లు తిరిగే పనులు దాదాపు ఎప్పుడూ చేయలేదు నేను. ఎస్సెస్సెల్సీ లోగా నాకు తెలిసినవి నాలుగే నాలుగు వూళ్లు. మా వూరు గని, ‍అమ్మ వాళ్ల వూరు కొండమీది బొల్లవరం. మొదటి హైస్కూలు గడివేముల, రెండో హైస్కూలు తలముడిపి.

ఎమ్మే తరువాత చాల రోజులు ఎటూ వెళ్లకుండా వూళ్లోనే వున్నాను. పార్టీ పని మొదలెట్టాక, ఒక చోటు అని లేకుండా, జిల్లా అంతా దున్నేశాను. తెలియని వూళ్లెన్నో తెలిసి వచ్చాయి.

సాధారణంగా ఇల్లు కదలని వాడికి, కాలేజీలో వున్నప్పుడు రూము కదలని వాడికి…. ఒక్క సారిగా కాళ్లకు చక్రాలు మొలిచినట్టయ్యింది.

అది కొద్ది ఆ రోజులే. ఆ తరువాత చేసినవన్నీ మళ్లీ పరమ స్టేషనరీ పనులే. హైదరాబాదులో వుండి పార్టీ పత్రిక, సాహిత్య రంగం పనులు చూస్తున్నప్పుడు… మాగ్జిమమ్ జిల్లా కేంద్ర పట్టణాలకు వెళ్లే వాడినేమో.

వర్కింగ్ జర్నలిస్టుగానయితే ఆ పదారేండ్లు మరీ ‘సుస్థిరో’ద్యోగం. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లకు కూడా రానని చెడ్డ పేరు తెచ్చుకున్నాను. వరుసగా రెండు రోజులు సెలవు పెట్టి, వెళ్లడం కుదిరేది కాదు.

జర్నలిజం అంటే రిపోర్టింగ్. ఊరు తిరిగి వార్తలు సేకరించాలి. మనుషులతో మాట్లాడి సంఘటనల నిగ్గు తేల్చాలి. కొట్లాటల్లో ఫ్రంట్ లైన్లోకి వెళ్లి చూసి రాయాలి. నేనేమిటి ఇలా ఈ మూల సౌధంబులో, నలు చదరపు చెక్క క్యాబిన్లో, ఎండకన్నెరుగని అంతఃపురంబులో… అని తెగ గింజుకునే వాడిని. మిత్రుడు, కార్టూనిస్టు శ్రీధర్ తో “పెద్దన్నా, నా కెందుకింత జీతం ఇస్తున్నారు వీళ్లు, ఏం చేస్తున్నాన్నేను, కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నాన’ని నా మీద నేను విసుక్కునే వాడిని.

‘ఈనాడు’ వదిలేశాక కూడా ఆశ వుండేది నాకు. తిరుగుబోతు పని చేయాలనే ఆశ. ఎవరేనా నన్నొక కబ్ రిపోర్టర్ గా తీసుకుంటారా అని తెగ ప్రయత్నించాను. ‘టైమ్స్ అఫ్ ఇండియా’, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’, ‘ఇండియా టు డే’ ఆఫీసులకు వెళ్లి నా కేసు చాల ఆర్డెంట్ గా వివరించేను కూడా. అప్పుడేమో వయసు అడ్డొచ్చింది. ‘నువ్వు యాభై దాటావు, ఈ కాలానికి పనికి రావు’ అనేశారు. వామపక్షులని పేర్వడసిన వారిదీ అదే మాట. అవేం పక్షులో ఏమో. రిపోర్టింగ్ అంటే, అదేమన్నా గుమ్మడి కొండ ఎత్తడమా, దానికి వయసుతో ఏం పని అని విసుక్కునే వాడిని లోలో.

ఊళ్లు తిరిగి పని చేయాలని చేసిన ఎన్‍ జీ వో ఎక్స్పెరిమెంట్ల సంగతి తరువాతెప్పుడో చెబుతా.

గతకాలపు సంగతులు ఇప్పుడు చెప్పడం రాత్రి వచ్చిన కలను పొద్దున చెప్పడం వంటిదని, కలలో కాలం మెలికలు, డిటౌర్లు తిరగడం మామూలని… ఈ కాలమ్స్ మొదట్లోనే రాసి, ఒక ‘సందు’ పెట్టుకున్నాను గనుక, ఇప్పుడు చెప్పినా అనాక్రానిజమని మీరు అనరు గాని, ఎన్‍ జీ వో ల సంగతి బాగా తరువాత చెప్పుకుందాం, ఓఖే?!

కర్నూలు టౌన్హాల్ లో పెళ్లి చేసుకోడానికి ముందు, ఆ తరువాత… ఆ కొద్ది రోజుల్లో… మునుపు చూడని వూళ్లెన్నో చూశాను. అప్పటికి పేరు మాత్రమే విన్న… ఆ ‘చిందుకూరు’, ఆ ‘జూటూరు’… అవెట్టా వుంటాయో అనుకుంటూ వుండిన వూళ్లెన్నో చూశాను.

తమాషా ఏమిటంటే, మా వూరి పక్కనే వున్న జలకనూరు కూడా అప్పటికి చూసి వుండలేదు నేను, పార్టీ పని కోసం మొదటి సారి ఆ వూరు వెళ్లి, ఒక ఎత్తైన చోటి నుంచి మా వూరిని చూసి, “ఓర్నీ, మావి ఇంత దగ్గరి వూళ్లా?” అని ఆశ్చర్యపోయాను.

చాల ఎక్కువగా నన్నూరు రామస్వామన్నతో, కొన్ని సార్లు వీరన్న తాతతో కొత్త కొత్త వూళ్లు వెళ్లడం,.. అప్పుడే పరిచయమైన కొత్త కొత్త మనుషులతో… ఆజన్మబంధమేదో వున్నట్టు వ్యవహరించఢం… మొదట కాస్త విచిత్రంగా వుండినా, రాను రాను గొప్పగా వుండేది.

చెప్పొద్దూ, చాల పని చేశాం కాని, ‍అది పని చేయడమని అనిపించలేదు. బాల్యంలోని ఏదో ఆటని మరి మరి ఆడినట్టుగా, అప్పట్లాగే ఆటలో మునిగిపోయి అన్నం తినడం మరిచి పోయి అమ్మతో తిట్టించుకోబోతున్నట్టుగా వుండేది.

మేము వెళ్లే వాటిలో వేంపెంట, ప్రాతకోట, దుర్వేసి వంటి… సేద్యపు నీరున్న… సంపన్న గ్రామాలు కూడా వుండేవి. ఆ గ్రామాల్లోని సంపన్న రైతులలో ‘మా’ వాళ్లుండే వారు. అక్కడ ఎంచక్కా వరి బువ్వ దొరికేది. ఉప్పలపాడు, లొద్దిపల్లె, వండుట్ల, పైబాగల, బైరాపురం వంటి మారు మూల, పేద గ్రామాలు కూడా వుండేవి. అక్కడ జొన్న రొట్టె, కొర్ర బువ్వ ఇంకా బాగుండేవి. అన్నిటికీ మించి.. ఆహారంలో, వ్యవహారాల్లో మా జీవితం ఒక్కో రోజు ఒకలా… చాల వివిధంగా వుండేది. ఇక ‘నా’ గురించి ‘నేను’ ఆలోచించుకోడానికి, దిగులు పడ్డానికి… టైమెక్కడ?

దిగులుకు టైము లేకపోవడమే నిజమైన శాంతి అనుకుంటాను. అలా కానిది శవ-శాంతి ఎందుకు కాదో విజ్జ్ఞులు చెప్పాలి

మేము వెళ్లిన ఇళ్లలో సుబ్బరమైన తెల్లని గ్లాస్గో ధోవతుల వాళ్లు, మాసిపోయిన నీర్కావి పంచెల వాళ్లు వుండే వారు, మొగమంత కళ్లై పలకరించే అమ్మలు, అక్కలు, ‘ఆ, వచ్చారా ఇగ మా ఆయన్ని యాడికో తోల్క పోతారు, ఈన ఇంటికి మల్లెప్పుడొచ్చాడో ఏందో, ఏం ముదనష్టపు సంత మాకు’ అని మమ్మల్ని చూసి మూతులు ముడిచే ఇల్లాళ్లు… ఓహ్…. వాళ్లంతా నా వాళ్లు అనుకోడంలో ఒక అద్భుత ఆనందం.

అది నటన కాదు. నా నుంచి నటన కాదు. వాళ్ల నుంచీ కాదు. అక్కడ నటన అవసరం లేదు. మేము ఏదో ఇచ్చి పోదామని వచ్చిన గవర్మెంటోల్ల కాదు. ఏదో ఇచ్చిపోతామని వాళ్లకు చెప్పడం లేదు. రానున్న ఎన్నికల్లో వాళ్ల వోట్లు మాకు వేయాలని మేము అడగడం లేదు. అయినా ఒక కానరాని, మెటీరియల్ కాని అనుబంధం మా మద్య. ఆ అనుబంధం నిజం.

కమ్యూనిస్టులకు చాల ఇష్టమైన పదం ‘కామ్రేడరీ’. కామ్రేడ్ అని ఒకరినొకరు పిలుచుకోడం. కమ్యూనిస్టు ‘కామ్రేడరీ’ని నేను మనసారా అనుభవించిన రోజులవి.

ఒక రోజు నేను, గార్గేయపురం కాంతన్న కలిసి నడుస్తున్నాం. కాంతన్న గార్గేయపురం ప్రముఖుడు, ఎన్నార్ బంధువు కృష్ణమూర్తికి తమ్ముడు.

ఎందుకో ఏమో, గార్గేయపురం నుంచి… బస్సు ఎక్కకుండా… నడిచి వెళ్తున్నాం, కర్నూలు వైపు. మధ్యలో ‘మిలిటరి మిద్దెలు’ అని ఒక వూరు. ఎప్పుడో ప్రభుత్వం కొందరు సైనికులకు ఇచ్చిన స్థలాల్లో వాళ్ల వారసులో, స్థలాలు కొన్న వాళ్లో ఇళ్లు కట్టుకోడం వల్ల ఆ వూరికా పేరు వచ్చింది.

“మరే, మనకు ఈ వూర్లో ఎవరూ తెలదు కదా, మనం పొయి విప్లవం గురించి చెబితే వింటారాంటావా?” అన్నాఢు కాంతన్న.

కాంతన్న ప్రశ్న నాక్కూడా విచికిత్స కలిగించింది. ఔను, వీళ్ల కోసమే కదా విప్లవం, అది వీళ్లకు కొంచెమైనా తెలుస్తుందా, వెళ్లి చూడాలనిపించింది. వెళ్లి అక్కడ చర్చి ముందు చెట్టు కింద నిలబడ్డాం. ఇద్దరు పెద్ద వాళ్లు వచ్చి పలకరించారు. మేము వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నామని చెప్పాం. వాళ్లతో కూర్చుని, మేము ఎవరమో ఏం చేస్తున్నామో, పేద వాళ్లందరూ ఏ విధంగా మాకు బంధువులో చెప్పే కొద్దీ, కాసేపట్లో అక్కడ ఇరవై మంది పోగయ్యారు. మా మాటలు శ్రద్ధగా విన్నారు. ఎవరో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చారు. ఏమైనా తిని వెళ్లమని అడిగారు.

ఆ రోజు మేము మాట్లాడిన వాటిలో వాళ్లను ఆకర్షించినదేమిటి? ఆ విషయంలో నాకెలాంటి సందేహం లేదు. ‘మేము ఎన్నికల్లో పాల్గొనం’. కనుక వాళ్లను ఓట్లు అడగబోవడం లేదు. ‘మేము ఏ మత పూజారులం కాము’. చందాలూ అవీ అడగడబోవడం లేదు. ‘మేము ఏమీ ఇవ్వడానికి రాలేద’ని ముందే చెప్పాం, ఆ పంపకాల పేచీలూ ఏమీ వుండవు.

అయినా, మేము వాళ్ల జీవితాల గురించి మాట్లాడుతున్నాం. మాకు ఏ స్వార్థం లేకుండా మాట్లాడుతున్నాం. వాళ్ల ఓటు సాయం, కర్ర సాయం… ఏమీ మాకు అక్కర్లేకుండానే వాళ్లతో మాట్లాడుతున్నాం. వాళ్లకు అవసరమైతే మేము అండగా వుంటామంటున్నాం. దాదాపు అన్ని నక్సలైట్ పార్టీలలో, బృందాలలో వుండిన ఈ విస్పష్ట ప్రకటిత నిస్వార్థమే వాళ్లకు ప్రజల్లో అంత బలం ఇచ్చిందని నా అభప్రాయం.

ఈ అభిప్రాయం, ఈ అవగాహనే నన్ను చిరకాలం ముందుకు నడిపించింది.

మరి ఆ తరువాతేమయ్యింది హెచ్చార్కే!, … … ఎందుకలా మరి…? … అని అడగాలనిపిస్తోంది మీకు.

అడగాలని నాకూ అనిపిస్తోంది.

జవాబు దిశగా నన్ను నేను తవ్వుకోవడమే ఈ కాలమ్స్ లో ప్రయత్నం. ఇక్కడ నేనొక తవ్వుకోలను మాత్రమే. తవ్వుకోలంత నిరపేక్షిక దృష్టితో వుండాలని సంకల్పం. దారి తప్పితే చెప్పండి.

పెళ్లైన తరువాత సుమారు ఇరవై రోజులు ఇద్దరం మండ్లెంలో జయ వాళ్ల ఇంట్లోనే వున్నాం. టౌన్ హాల్ లో పెళ్లి తరువాత ఇంటికి పోదాం రండి అని మా అమ్మ పిలిచింది. అప్పుఢు గనికి వెళ్లడం కన్న మండ్లెం వెళ్లడమే బాగుంటుందనిపించింది నాకు. వారం, పది రోజులు మండ్లెంలో వుండి వస్తామని అమ్మకు చెప్పాను.

మండ్లెంలో వుంటూనే చుట్టు పక్కల గ్రామాలు వెళ్లే వాడిని, ఎక్కువగా రామస్వామన్నతో.

ఒక సాయంత్రం ప్రాతకోట. లక్ష్మాపురం గ్రామాలకు వెళ్లి తిరిగి మండ్లెం రాగానే, ఇంట్లో చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ ప్రకటించారని.

నేను వెంటనే అజ్ఞాతం లోనికి వెళ్లాలి. అప్పటికే గనిలో మా ఇంటికి పోలీసులు వెళ్లారని తెలిసింది. సుబ్బారెడ్డి మామ, జయ వాళ్ల నాన్న… నన్ను వెళ్లి ‘తోటలో వుండుపో’ అని చెప్పాడు.

నాకు వినబుద్ధి కాలేదు. పగళ్లు సరే, పార్టీ పని మీద వూళ్లకు వెళ్లే వాడిని. రాత్రులు ఇంటికి దూరంగా వెళ్లడమా? జయను వదిలిపెట్టి పోవాలనపించడం లేదు.

ఆఁ, గని అంటే… అది మా సొంత వూరు కాబట్టి ఇంటికి వెళ్లారు పోలీసులు…. నేనేం పెద్ద విప్లవకారుడినని…. మొన్న మొన్ననే కదా పార్టీలో చేరింది…. నన్ను మరీ అంతగా పట్టించుకోరులెద్దూ…. నాకు పెళ్లైందని తెలుసుకుని, అత్త గారి వూరు ఏదో తెలుసుకుని ఏమొస్తారు…. రారులే అంటో ఇంట్లో వుండిపోయాను.

తెలుసు. అవన్నీ వుత్తి సమర్థనలు. నేను తక్షణం అజ్జ్ఞాతం లోకి వెళ్లాలి. అది ఎలా వెళ్లాలో తెలీదు. తెలీకపోయినా ఫరవాలేదు. మామయ్య చెప్పినట్టు తోటకు వెళ్లి వుండొచ్చు. తరువాతేం చేయాలో ఆలోచించుకోవచ్చు.

అసలు విషయం ఆ ఇరవై రోజులుగా తెలిసి వచ్చిన దాంపత్య జీవితాన్ని వదులుకుని వెళ్లలేని అచ్చపు బలహీనత నాది.

(తవ్వుకోల బాగానే పని చేస్తోంది కదూ?!. తవ్వే కొద్దీ ఉక్కు ఏదో తుక్కు ఏదో బయట పడుతోంది కదూ?!) 🙂

ఆ రాత్రి గడిచి పొద్దు పొడిచింది. నేను పడ్సాలలో. కింద పీట మీద, స్తంభానికి వీపు ఆన్చి కూర్చుని, పాలకూరతో జొన్నరొట్టె తింటున్నాను. జయ నడుముకు కొంగు చుట్టి నిలబడి ఏదో మాట్లాడుతోంది.

మండ్లెం సర్పంచ్, పేరు చిన్న రామి రెడ్డి అనుకుంటా… ఆయన్ని వెంట బెట్టుకుని వచ్చారు నందికొట్కూరు సబిన్స్పెక్టర్ రెడ్డప్ప, మరి ఇద్దరు కానిస్టేబుల్స్.

(ఆది ఆ సర్పంచ్ తప్పించుకోలేని పని, పాపం. వూరి వాళ్లు ఆయన్ని బాగా తిట్టుకున్నారు, కొత్తగా పెళ్లైన వాళ్లని విడదీసినందుకు).

అది నా మొదటి, చివరి అరెస్టు.

రొట్టె తినడం పూర్తి చేసి, అక్కడే గుంజకు తగిలించి వున్న నా బ్రౌన్ ప్యాంటు వేసుకున్నాను.

ప్యాంటు వేసుకుని జయ వైపు చూశాను. తను నఢుం దగ్గర చెక్కిన చీర చెంగు అలాగే వుంది.

అంత వరకు అన్నీ మా చేతుల్లోనే వున్నాయనుకున్నాన్నేను. నేను ఏం చేయదల్చుకున్నానో అది చేశాను. ఎవరి అనుమతి, అంగీకారాల కోసం ఎదురు చూడలేదు. అన్ని సమస్యలు నేను చూసుకుంటాననే భరోసా జయకు ఇచ్చి వుంటాను. మా జీవిత సమస్య దేన్నైనా మాకు ‍అనుకూలంగా ట్యాకిల్ చేయగలనని నేను అనుకున్నాను. నా అవగాహన మేరకు, జయమ్మకు కూడా అలాంటి ఇంప్రెషన్ ఇచ్చి వుంటాను. తనని చూసి దైర్యం చెప్పడం వంటిదేమీ చేయలేకపోయాను. నాకే చాల కన్ఫ్యూజింగ్ గా, క్లమ్జీగా వుండింది.

మొదటి సారి పరమ నిస్సహాయంగా, పోలీసు ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ మధ్యన, మహా నేరమేదో చేసిన వాడి వలె నడిచాను. ఇప్పటికీ గుర్తు ‘ఇప్పుడు బజారులో నేనెలా నడవాలి’ అని కాస్త ఆలోచించాను. బుర్రంతా క్లమ్జీగా, కలగాపులగంగా వుండింది.

ఏదో గిల్టీ ఫీలింగ్ కూడా వుండింది. జయ గురించి. ఈ గిల్టీ పీలింగ్ వెనుక నున్నది మగదురహంకారం కాదని ఎలా అనగలను? నిజానికి, ఆ తరువాత పరిణామాల్లో జయ నా కన్న చాల మెరుగ్గా వ్యవహరించింది. అత్యవసర సమయంలో సహచరుడు దగ్గర లేకుండా పోయాడని భయపడలేదు. మా పాపను నవమాసాలు మోసి, కని, పెంచింది. తన బియ్యే చదువును పూర్తి చేసుకుంది. రెండేళ్ల తరువాత నేను జైలు నుంచి తిరిగి వచ్చే సరికి పచ్చని సంసారం ఒకటి నా కోసం ఎదురు చూస్తోంది.

అప్పుడు, ఆ క్లమ్జీ వుదయం మండ్లెం బజారులో నడుస్తున్నప్పుడు… ఆ నిరామయంలోనే… నేను ఒక్క సారిగా పెద్ద వాడినయిపోయిన పీలింగ్. బాల్యమంతా ఒక్కసారిగా కరిగిపోయిన ఫీలింగ్. కొన్ని నిమిషాల ముందు వుండిన బేఫికరు తనం లేదు. నా మీద ఏదో చాల పెద్ద బాధ్యత వుందనే స్పృహ.

అంతకు ముందరి నేను, ఆ తరువాత నేను ఒకటి కాదు అనే స్పృహ.

చాల కాలం తరువాత అదే పెద్దరికపు స్పృహలో, కాకపోతే ఒక పెను నిరాశ నుంచి బయటకు కొత్త దారులు వెదుక్కుంటో రాసుకున్న గీతం…..

//పంజరం//

రేణువు రేణువులో వెదుక్కుంటున్నా
నేను పుట్టక ముందే పోగొట్టుకున్న
ఒక ఒయాసిస్సు కోసం

చౌరస్తాలో నిలబడి అడుక్కుంటున్నా
కార్లనూ బస్సులనూ
కంప్యూటర్లనూ వేడుకుంటున్నా
నా గీతం నాకిచ్చేయండని

నన్ను నేను తవ్వుకుంటున్నా
కలుషిత రక్తం జల్లెడ పట్టుకుంటున్నా
తడిసిందైనా తడవనిదైనా
ఒక్క అగ్గిపుల్ల కోసం

కాసింత జీవితమైనా
దొరక్కపోతుందా అని
వెయ్యి అబద్ధాల్లో ఒక్కటైనా
నిజం కాకపోతుందా అని
ఈ కాంక్రీట్ చెట్ల కింద
కన్నీళ్ల ముళ్ల మీద
నేనింకా తపసిస్తూనే వున్నా

క్షణాలు గడ్డ కట్టి గంటలవుతున్నాయి
గంటలు రాశులు పడి దశాబ్దులవుతున్నాయి
పెనం మీద కాలం మాడిపోయి
పెను నిర్దయగా మారిపోతోంది
అయినా అదేమిటో వెర్రి మోజు
ఈ దేశం గాలి మీద
గాలి వాలు మీద

అలస్యంలో తడిసి నిరీక్షణలో కాగి
చెవి గూబలు డప్పుల్లా బిగిశాయి కాబోలు
రాకుతున్న ఆకుల గలగలలే
రణ నినాదాల్లా ధ్వనిస్తున్నాయి
చివ్వున శిరసెత్తి చూస్తే ఏమున్నది?
కిటికీ రెక్క మీద
అనిర్దిష్ట చిత్రాల వాన తప్ప
రాను రాను తనలోకి తాను
ముడుచుకుపోతున్న
అతి హింసాత్మక నిశ్శబ్దం తప్ప
పంజరం లోపలే
రెక్కల టపటప చప్పుళ్లు తప్ప

ఎన్నికల పరీక్షనాళికలో
అంటుగట్టిన పాపాయి జన్మించనే లేదు
ఎందులకా పుత్రోత్సాహము తండ్రీ!
కురుక్షేత్ర సమరం ప్రారంభం కానే లేదు
ఎందులకీ విచికిత్స ఫల్గుణా!
రెండో ప్రపంచ యుద్ధం నాడు
ఆడిన జూదంలో ఓడిన వాళ్ల మనం
అనుజన్ములనూ అరుణకేతనాన్నీ
పందెంలో ఒడ్డిన వాళ్లం మనం
డెబ్బై ఏళ్ల తరువాతా
అజ్జ్ఞాతంగానే మిగిలిపోయిన వాళ్లం

ఇంకా బృహన్నల వేషాలేనా?
అర్ధరాత్రి కీచక వదలేనా?
ఆగమించే ఆహవానికి
పాశుపతాలు సంపాదించేదెప్పుడు?
చరిత్ర పునరుల్లేఖనానికై
పాళీల్లాంటి కత్తులు
కత్తుల్లాంటి పాళీలు
సానబెట్టేదెప్పుడు?

(‘అబద్ధం’ కవితా సంపుటి (1987-92) 1,2,3 పేజీలు)

(ఫిర్ మిలేంగే)

21-09-2016

Advertisements
Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

నదులంటే కొన్ని స్నానఘట్టలా??? (5)

 

పోయిన నెల మాంఛి హాస్య కథ చెప్పి మీ పొట్టలు చెక్కలు చేశాను కదూ?!.

నేను ముందే హెచ్చరించాను. పొట్ట చెక్కలను కలిపి కుట్టుకునే పరికరాలు మీ దగ్గర రెడీగా వుంచుకోవాలని.

హెచ్చరిక విని జాగర్త పడిన వారు జీవించి వుంటారు. పడని వారు?  వాళ్లు కూడా వుంటార్లెండి!

మరలాగయితే, ‘ఉండడమా వుండకపోవడమా…’  అని పోయిన్నెల హెడ్డింగులో ఆ ప్రశ్న ఎందుకోయ్ అంటారేమో హామ్లెట్లు అయిపోకుండా మిగిలిన ఆమ్లెట్లు.

ఇలా అడుగుతారని నాకు ముందే తెలుసు.

అదేంటో నాకు అన్నీ ముందే తెలుస్తుంటాయి. ఎప్పుడేనా తెలియక పోతే, మా ఎడిటర్ రంగా వున్నాడుగా, అన్ని సంగతులు ముందే చెప్పడానికి, అవి నిజం కాకపోతే, బలవంతంగా నిజం చేయడానికి….  ఒక చేత్తో జోతిష్యం కుండలి, ఇంకో చేత్తో పేపర్ కట్టర్ పట్టుకుని.

నేనేమయినా పేపర్ కట్టింగునా… ఆయన దయ్యం ఎడిటర్లకు… అనగా ఘోస్ట్ ఎడిటర్లకు…. వీలుగా, అరఠావు తెల్ల కాగితాలకు అతుక్కుని, ఎల్లోగా ఎంత రస్టు పట్టినా కదలక, రాజును మించిన రాజభక్తితో రిసెర్చ్ అండ్ రెఫ్రెన్సు గ్రూపులో, ఆ మూల షెల్ఫంబు లోని… వుబ్బు ఫైలులో ఒద్దిగ్గా కూర్చుని వుండిపోటానికి.

పేపర్ కట్టింగును కాను కనుక, అరిచేతిలోని ప్రాణాలు గుండె పాకెట్లో దోపేసి, హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ లో మాట్లాడుతున్నట్టు చేతులూపుకుంటూ వెళ్ళాను, ఆ ఉదయం ఎడిటర్ రంగా ఆఫీసుకి, నాకే అడ్రెసు తెలీని నా గదిలో పీడకలల నిద్రను చుట్ట చుట్టి, ఒక మూలకు నెట్టి.

ఈ సారి ఎడిటర్ రంగా నన్ను మంచి కథ రాసుకురానందుకు కొట్టడానికి రాలేదు. ఆసలా సంగతే ఎత్తలేదు. నా రాశి ఫలాలు మరీ ఉచ్ఛల జలధి తరంగాలై ఎగుస్తున్నట్టున్నాయి.  ఒక ఫ్రీ ల్యాన్సరు రచయితకు ఇవ్వాల్సిన ప్రోటకాల్ థూ.. ఛా.. తప్పక పాటిస్తూ, నేను ఆఫీసులోకి పోగానే ట్రింగ్ బెల్లు కొట్టి, బాయ్ కి టీ చిట్టీ చింపి ఇచ్చాడు. “మంచి కథ మరెప్పుడైనా రాద్దువులే. నా జోస్యం ప్రకారం మరణించడం కూడా మరెప్పుడైనా చేద్దువులే, తొందరేం లేదు’ అన్నాడు కుడి అరిచెయ్యితో అభయ ముద్ర పట్టి, సుప్రసన్న సుందర వదనారవిందుండై. నేను అవాక్కైపోయాను.

‘అంటే… అంటే… రంగా గారూ…. మరే నండీ… నేను చనిపోతానని మీరు చెప్పిన టైం అయిపోయిందండి. యాచ్చువల్లీ, అది ఎప్పుడో అయిపోయిందండీ. యమ కింకరులు మీ జోస్యం ప్రకారం నేను అనుకుని పట్టుకుపోయిన అమాయకుడు అమాయకుడని తెలిసి వెనక్కి పంపేరటండి. అక్కడ నా ప్లేసు ఖాళీగానే వుందటండి. ముగింపు ముందుగా నిర్ణయమయ్యుండే మంచి కథలు రాయని మహా  పాపానికి గాను, నన్ను వేయించడానికి పెట్టిన నూనె బానలీ, దాని కింద పొయ్యిలో మంటా… అన్నీ అలాగే వున్నాయటండి. వాళ్లు నన్ను ఎక్కడ ఎప్పుడైనా కనిపెట్టి, పట్టుకోవచ్చు. వాళ్ళకు ఇన్ఫార్మర్లుగా, మన… అంటే, మీ… జోతిష్యం ఏజెంట్లు కూడా ఆపరేషన్ డార్క్ హంట్ ఆపినట్టు లేరండి. మీరు ‘మరెప్పుడైనా’ అంటున్నారు. థాంక్సండీ. అరువు ఆయుష్షు బరువు చేటే అనుకోండీ. ఎన్నాళ్లు బతికుంటే అంత బాగుంటుంది కదా. కాని వాళ్లు…  వాళ్లూరుకుంటా…రంటా…రాం…డీ’ అన్నాను కాస్త అశగా, మాట వెనక్కి తీసుకుంటాడేమోనని భయంగా, ఆ ‘టెంపరరీ ఫీలింగ్ అఫ్ వెల్ బీయింగ్’ని వీలయినంత పొడిగిద్దామన్నట్టు సుదీర్ఘంగా….

“అలా కాదులే. యముడు గారితో నేను మాట్లాడానులే. ప్రెస్ కాన్ఫరెన్సుల్లోనే మాట్లాడాలని ఏం లేదు. తను నాకు పర్సనల్ దోస్తు కూడా. మనోళ్ళకు కూడా చెప్పాన్లే, ఆపరేషన్ డార్క్ హంట్ కాసేపు ఆపమని” అన్నాడాయన, ‘కాసేపు’ అనే పదాన్ని కత్తి మాదిరి తిప్పి, కసక్కున ఒరలో దోపినట్టు దోపి.

“నిజమా. సార్” అన్నాన్నేను. ఆయన వంటి సాయుధ జ్యోతిష్కుని పాలిట పడిన నాకు మరణం ‘కాసేపు’ ఆగడం కూడా గొప్పే. “యముడు మీకు పర్సనల్ ఫ్రెండు కూడానా?!” అన్నాను సీనియర్లకు తైరు కొట్టేప్పుడుపయోగించే ఓ రకం వంకర మాడ్యులేషన్ తో.

“నేను అప్పుడప్పుడు ఆఫీసుకు ఆలస్యంగా వస్తుంటాను, అదెందుకంటావ్? రోజూ ప్యాంటు వేసుకొచ్చే వాడిని, అప్పుడు పంచె కట్టుకొస్తుంటాను, అదెందుకంటావ్?”

“ఆ, ఏమోనండి, ఊరికే సంప్రదాయ పరిరక్షణ కోసం అనుకున్నా…” వున్నట్టుండి ఈ ప్యాంటూ పంచెలు ఎందుకొచ్చాయో అర్థం కాలేదు.

“అదేనోయ్, సంప్రదాయ పరిరక్షణ ఎందుకు, అదీ అప్పుడప్పుడు?” ఆయన కళ్లెగరేశాడు.

ఎడిటర్ రంగా అప్పుడప్పుడు ఆఫీసుకు ఆలస్యంగా, అదీ పంచె కట్టుకుని రావడం నిజమే. అప్పుడు ఆయన నుదుటి మీద కుంకం బొట్టు, చేతిలో ఒక సంచీ కూడా వుంటాయి. సంచీ లోంచి తమలపాకుల వంటివేవో కనిపిస్తాయి. అగరు వత్తుల తరహా పరిమళం కూడా వుంటుంది. దేనికదే చెప్పుకోవాలి, ఎడిటర్ రంగా బాగా ట్రాన్స్పరెంట్ మనిషి. ఏదీ పెద్దగా దాచుకోరు. ఇంతకూ కొత్తగా ఈ సంప్రదాయ పరిరక్షణ ఏమిటో!

ఈయనకు  జ్యోతిష్యం, పేపర్ కట్టింగ్, ఎడిటోరియల్ రైటింపించింగ్, జోస్యాలు చెప్పింగ్, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో అడ్దదిడ్డం కొశ్చిన్లేసి నాయకులని తికమక పెట్టింగ్, తరువాత  వాళ్ళతోనే బెట్టింగ్, తెలుగు జనాల్ని కన్విన్సింగ్ చేయడం కుదరకపోతే కన్ఫ్యూజింగ్… ఇవి కాకుండా ఈయనకు ఇంకా ఏవేవో విద్యలు వచినట్టున్నాయ్రా బాబో అనుకున్నాను నాలో నేను.

“ఏం లేదోయ్. ఏదో కుల వృత్తి. పూజలు, పెళ్లళ్లు అవీ చేయడం నాకు వీలు కాదు. పత్రిక పనే చేతి నిండా వుంటుంది. ఈ లోగా నీలాంటి మాట వినని వార్తాహరులు. సంభవిస్తామని నమ్మ బలికి తీరా రాసి అచ్చేశాక సంభవించం యుగే యుగే అనే వార్తలు. క్షణం తీరిక వుండదు. అలాగని, ఈ వార్తా హరణం పని … అదే, వార్తాహరుని పని… మానుకోలేం కదా. కుల వృత్తి మరిచిపోకుండా వుంటానికని తద్దినాలకూ వాటికి భోక్తగా, ఒక్కో సారి ఆ క్రతువు చేయించడానికి వెళ్లి వస్తుంటాను. అది ముగించుకుని, అలాగే ఆఫీసుకు వస్తుంటాను నుదుటి బొట్టూ, పంచె కట్టూతో” అని గల గల నవ్వేశారాయన. నేనూ చాల ఇష్టంగా నవ్వాను.

ఆయన అదృష్టం మరి. ఈ ఎడిటరు వుద్యోగం అదీ లేకపోయినా తనను ఆదుకోగల పని ఒకటుంది. ఉద్యోగం వుంది గనుక… వేన్నీళ్లకు చన్నీళ్లు.

చెప్పులు కుట్టే వృతి, బట్టలు నేసే వృత్తి, పంటలు పండించే వృత్తి, గొర్రెలు కాచే వృత్తి… అలాంటి పని ఏదైనా.. కాసేపు చేసి రావడం కుదరదు. ఆ వృత్తుల్లో జనాలతో కాళ్లు మొక్కించుకోడం వుండదు. కాళ్లు మొక్కించుకోడం ఒక పనిగా ఇంకే వృత్తిలోనూ కుదరదు. ఎడిటర్ రంగా గారి వృత్తికి వున్న సౌలభ్యం ఇక దేనికీ లేదు.

“అదీ సంగతి. తద్దినాలకు వెళ్ళడం, అవి చేయించడం అంటే ఏటనుకున్నావు?యముడితో డైరెక్టుగా పని. మా లావాదేవీలు మాకు వుంటాయి. మా దోస్తీలు మాకుంటాయి. ఇదొక డివైన్ కాంట్రాక్ట్”

“అంటే, రంగా గారూ!… అంటే…. “

“అంటే.. అంటే.. అని ఆ నత్తి మాటలేంటోయ్?”

“అంటే, మీరు జ్యోతిష్యం చెప్పడం, అవసరమైతే దాన్ని నిజం చేయడానికి మీరే నడుం కట్టడం.. అంతా యముడితో దోస్తీ వల్లనేనా?”

“పిచ్చోడా, ఒక్క యముడితోనే ఆన్ని పనులవుతాయా? మా లాంటోళ్ళం దేవతలందరితో సంబంధాలు వుంచుకోవాలి” అన్నాడాయన.

“ఔనౌను కదా, మరిచి పోయానండోయ్” అన్నాను.

నాకెందుకో  లోలోపల భయం. అక్కడి నుంచి వెళ్లిపోదామని కోరిక. వీలు కుదిరితే దేశం నుంచే పారిపోదామని బలమైన కోరిక.

వెళ్ళలేను. వెళ్లినా అక్కడ కూడా ఎడిటర్ రంగా మనుషులుంటారని విన్నాను.

అన్యధా శరణం నాస్తి. ఆయనే శరణు. బుద్ధి గడ్డి తిని వచ్చేశాను, నాక్కూడా అడ్రసు తెలీని నా గది నుంచి. ఇప్పుడు నా తక్షణ తద్దినం నుంచి నేను తప్పించుకోవాలంటే ఎడిటర్ రంగా తప్ప దారి లేదు.

నేను మౌనంగా కూర్చున్నాను. బాయ్ తెచ్చిపెట్టిన కాఫీ కప్పు నోటికి మరీ చల్లగా తగిలింది.

“నువ్వా భయాలేం పెట్టుకోకు. యముడికి నేను చెబుతాలే…. ఈ పుష్కరాలూ అవీ అయ్యాక చూద్దామని”

‘పుష్కరాలేంటండీ….” నా మాట మధ్యలో ఆగిపోయింది. ‘పవిత్ర కృష్ణా పుష్కరాలు’ మొదలైపోయాయి కదా. పన్నెండు రోజుల హడావిడి.

“నీ కథలూ అవీ పక్కన పెట్టు. తరువాత చూద్దాం. వెళ్లి మాంఛి వార్తా కథలు రాసుకురా పో. పుష్కరాలు కవరు చేయడానికి స్టాఫ్ చాలి ఛావడం లేదు. నాకా… ఇలాంటప్పుడు పత్రిక పనులు కాకుండా వేరేవే ఎక్కువ. నీకు తెలిసిందేగా” అని నవ్వారాయన.

తెలుస్తెలుసు. పుష్కరాల్లో స్నానాలు అవీ చేయించడం, తద్దినాలూ అవీ పెట్టించడం… ఓహ్, ఆయనకు బోల్డు పనులుంటాయి. అక్కడ స్టాఫ్ అసలే చాలరు.

“సో, దేర్ఫోర్, నువ్వు ఈ పని చేస్తే భుక్తి, భక్తి ఆపైన నువ్వు తెగ అంగలార్చే సామాజిక ప్రయోజనం. పద పద, పద ముందుకు, భయమెందుకు, మున్ముందుకు”

ఆయన లేచి వచ్చి నా కుర్చీని తలుపు వైపు తిప్పి ముందుకు తోస్తారేమో అనిపించి, అప్రయత్నంగా కుర్చీని గట్టిగా పట్టుకున్నాను. “ఇందులో సామాజిక ప్రయోజనం ఏమిటి సార్?”, అడిగాను, అదే చావు పట్టుదలతో.

“భలే వాడివే, అదేం ప్రశ్న. నదులు మనుషుల్ని కలుపుతాయి కదా? వాటిని పూజించడం సామాజిక ప్రజా ప్రయోజనం కాదూ?”

“మనుషులు నదుల వద్ద చేరి బతుకుతారు. నదుల వద్ద జనం ఎక్కువైతే ఏ వాగులు వంకల వద్దనో చేరి బతుకుతారు. పూజలూ అవీ ఎందుకు సార్!”

“నీకేమైనా పిచ్చా? పూజల కోసమని అందరూ ఒక చోట చేరడం లేదా?”

“జనం ఎట్టాగూ నదీ తీరాల్లోనే వుంటారు. కనీసం చిన్న వాగుల తీరాల్లోనైనా వుంటారు. బతకడం కోసమే ఆయా చోట్లకు చేరుతుంటారు. మళ్లీ ఇలా ఒక చోటికి రావడమెందుకు సార్? జనం వాళ్ళ వూర్లు వదిలేసి ఏవే రెండు మూడు ఘాట్లకో వచ్చి స్నానాలు, పూజలు, తద్దినాలు ఎందుకు”

“సిన్నోడా నీకు పిచ్చి ముదిరింది. అందరూ విజయవాడ వంటి కొన్ని చోట్లకు వస్తారు. ఎక్కడున్న వాళ్లు అక్కడే వుంటే అందరు కలిసేదెలా? జాతి ఐక్యమయేదెలా?”

“అదేంటి సార్. ఎవరో కర్నూలు జిల్లా ముచ్చు మర్రి అనే వూళ్లో పుష్కర స్నానానికి ఘాట్ ఏర్పాటు చేస్తే, ‘ఠాట్ వీల్లేద”ని అక్కడ144 సెక్షనీ ఏదో పెడతారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్నానం చేస్తే ఏం సార్? ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏ విజయవాడ లాంటి కొన్ని చోట్లనే వుంటారా? ఉంటే ఏ వూరు, ఏ నది భరిస్తుంది? ఒకే చోట చేరి జనం తొక్కుకు కు చావడమెందుకు?” నా ఆవేశంలో నేను ఎక్కడున్నానో  మర్చిపోయాను.

“నీకేం తెలియదు. అందరూ ఒక చోటికి చేరితే ఆ తిరునాళ్ళలో ఎంత వ్యాపారం, ఎంత వాణిజ్యం? అక్కడ జరిగే పూజా పునస్కారాల వల్ల, పిండప్రదానాల వల్ల మన సంస్కృతి ఎలా వర్ఢిల్లుతుందో చూడు. అవన్నీ చూసి, వార్తా కథలు రాసుకొస్తావనుకుంటే నువ్వేమిటోయ్? నువ్వు ఇక ఎప్పటికీ బాగు పడవా, ఆయ్” అంటూ ఈసారి నిజంగానే తన కుర్చీ లోంచి లేచారు ఎడిటర్ రంగా.

కిటికీ లోంచి పడిన ఎండ చారకు ఆయన చేతిలో పేపర్ కట్టర్ కోసుగా మెరుస్తోంది.

మరుక్షణం నేను అక్కడ లేను. ఉండి వుంటే ఎక్కడా లేకపోయే వాణ్ణి. వాయు వేగ మనో వేగాలతో నాకే చిరునామా తెలియని నా గదికి చేరి దాక్కున్నాను. పుష్కరాలు అయిపోయాయి గాని, గది వదిలి రావాలని లేదు. బయ్యం.

దాక్కున్నాను గాని, యమ కింకరులో, దేశమంతటా వున్న రంగా గారి ఇన్ఫార్మర్లో ఎవరో ఈ గది అడ్రస్సు కనిపెట్టేస్తారని బయ్యం.

పోనీ మీరు చెప్పండి మహాత్ములారా మహర్షులారా! ఈ నది భక్తి మనుషులను కలుపుతుందా? విడదీస్తుందా??

 

రచన తేదీ 14-08-2016

(సెప్టెంబ‍ర్‍2016 చినుకు)

 

Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment

నా కథానాయిక 

స్మృతి 28

ఈ వారం ఒక ప్రేమ కథ. మా కథే.

జయ, నేను… కావడానికి బావ మరదళ్లమే. కాని, రెండు వేర్వేరు పాయలం. ఇద్దరం మరొక పెద్ద నదిలో కలిశాం. ఆ నది పేరు ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల కమిటీ. ఈ రెండు పాయలు ఒక నదిలో కలవకపోతే, అసలు ఒకటయ్యేవో లేదో. అది తల్చుకుంటే భయమేస్తుంది. రెండు పాయల మధ్య ఒక గల గల సంభాషణ మాత్రం ఎప్పటి నుంచో వుంది. పుట్టినప్పటి నుంచి కాకపోయినా, బుద్ది తెలిసినప్పటి నుంచీ.

ఆ సంభాషణలో భాగాంగా నా కాలేజీ దినాల నుంచీ మా మధ్య ‘ప్రేమ’ లేఖలు నడిచాయి. ఆ కోట్, అన్ కోట్ ఎందుకంటే, మా వుత్తరాల్లో అలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఏమీ వుండేవి కావు. చాల పెద్ద వాళ్ళ లాగ ఏ రవీంద్రుని ‘గీతాంజలి’ చదివాననో, అందులో ఇలా వుందనో రాసుకునే వాళ్ళం. చెలం గారి ‘అమీనా’ చదివి నాకేం నచ్చలేదు అదేమిటో అని రాసుకునే వాళ్ళం. రంగనాయకమ్మ ‘ఇదే నా న్యాయం’ చదివి, ఔను అదే న్యాయం అని ఏదో కనిపెట్టిన ఉత్సాహంతో చెప్పుకునే వాళ్ళం. బాపు బొమ్మల దాశరథి అనువాదాల గాలిబ్ గీతాలు చదివి, నిజంగా ‘నరుడు నరుడవుట దుష్కరము’ కదా అని యుగళ దిగులు పడే వాళ్ళం, వుత్తరాల్లో.

అప్పుడు సత్యనారాయణ అనే పేరుతో తిరుగుతూ వుండిన ఉల్లిగడ్దల వీరన్న అంటే మా ఇద్దరికీ చాల ఇష్టం. ఆయనది ఆదోని. జౌళి మిల్లు కార్మికుల నాయకుడుగా మొదలై సీపీ గ్రూపులో ముఖ్య నేతగా ఎదిగిన విప్లవకారుడు. పార్టీ కర్నూలు జిల్లా సెక్రెటరీ. ఆయన తరచు జయ వాళ్ళ వూరు మండ్లెం వెళ్ళే వాడు. ఆ చుట్టుపక్కల తంగెడంచ, కిష్టరావు పేట తదితర గ్రామాల్లో బలమైన ప్రజా వుద్యమం వుండేది.

ఆయన ఎక్కువగా, ఊరికి దూరంగా వున్న జయ వాళ్ళ తోటలో విశ్రాంతి తీసుకునే వాడు. అక్కడి తోట బావి లోనే స్నానాలు, ఈతలు, జయ వాళ్లు తెచ్చే భోజనాలు. చాల మంచి వ్యక్తి. పెద్ద చదువరి కాదు. నిలువెల్ల కార్మిక చైతన్యం. ఆయన మాటలు పెద్దవారిని, యువజనులను అందరినీ ఆకట్టుకునేవి. ఆయన మా జయకు చాల ముందు నుంచే పరిచయం.

మేము రెండు వేర్వేరు పాయలం అన్నది అందుకే.

అయితే, రెండు పాయల మధ్య అన్ని విధాల సంభాషణ వుండేది. రాజకీయ విషయాలు సైతం చర్చించి కలిసి నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. చిట్ట చివరి వరకు అదే చేశాం. మాదొక కమిటీ కాని కమిటీ.

జయ ఇంటర్మీడియట్ తరువాత కర్నూలు కె వి ఆర్ ఉమెన్స్ కాలేజీలో బి ఏ లో చేరింది. చదువు సరే. తను రాజకీయంగా ఏం చేయాలి? నాలాగే సీపీ గ్రూపుతోనే వుందామె మనస్సు. అది ఇద్దరికీ తెలుసు. కర్నూలులో అప్పటికి పిడిఎస్ యూ లేదు, ఇద్దరు కామ్రేడ్లు తప్ప.

మరి నెక్స్ట్ బెస్ట్ ఏమిటి? ఎస్ ఎఫ్ ఐ.! జయ ఎస్ ఎఫ్ ఐ లో చేరడమే గాక క్రియాశీలంగా పని చేసింది. డాక్టర్ బ్రహ్మా రెడ్డి, సరస్వతి వంటి వారితో తనకు స్నేహ సంబంధాలు వుండేవి. వాళ్లు నాకు పరిచయమయ్యింది కూడా జయ వల్లనే. జయ ఎస్ ఎఫ్ ఐ లో పని చేయడం… మా ఇద్దరి వుమ్మడి నిర్ణయమేనని తరువాతెప్పుడో బ్రహ్మా రెడ్దికి చెప్పాం.

చాల రోజుల తరువాత, కర్నూలులో పిడి ఎస్ యూ కొంచెం ఫుట్ హోల్డ్ సంపాదించాక, ఎస్ ఎఫ్ ఐ వాళ్లకు అసలు సంగతి తెలిసి వుంటుంది. ఎందుకంటే నాకు వీలు దొరికినప్పుడల్లా లేడిస్ హాస్టల్ కు వెళ్లి జయతో కబుర్లు చెప్పి వచ్చే వాడిని. జయ కూడా కర్నూలులో మా పార్టీ ఆఫీసుకు వచ్చి, గంగిరెడ్డన్న తో మాట్లాడేది.

గంగి రెడ్డన్న మా ఇద్దరిని, మరి ఇద్దరిని కూర్చో బెట్టి గతి తార్కిక భౌతిక వాదం పాఠం చెప్పారొక రోజు. పరిమాణాత్మక మార్పులు జరిగి జరిగి, ఒక్కసారిగా గుణాత్మక మార్పు జరగడం గురించి చెబుతూ గంగి రెడ్డన్న ‘లంఘనం’ అనే పదాన్ని విచిత్రంగా పలకడం, దానికి తగినట్టు భుజాలెగరేయడం… ఇప్పటికీ ఒక ప్లజెంట్ జ్ఞాపకం నాకు.

అప్పుడు జయకు సెలవులు. ఆ క్లాసు తరువాత, తను వెళితే వాళ్ల వూరు వెళ్ళాలి. వెళ్ళొచ్చు. భయమేం లేదు. ఛెళ్ మా వూరు వెళ్దాం అన్నాన్నేను. ఓకే అంది జయమ్మ. ఇంకేం ఇద్దరం మా వూరు వెళ్ళాం. అలా వెళితే ఏమి అర్థం వస్తుంది అనే ఆలోచనే రాలేదు మాకు. జయమ్మ అంతకు ముందు వాళ్లమ్మతో, చెల్లితో కలిసి మా ఇంటికి వచ్చేది కదా, అందరం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. రాత్రి బయటరుగు మీద నేను, తమ్ముడు, జయ గడ్ది ఒల్లె పరుచుకుని పడుకుని, నిద్దర వచ్చే వరకు చుక్కలు ఎంచే వాళ్ళం కదా… ఇదే అంతే… మా ఇద్దరి దృష్టిలో.

మా ఇంట్లో ఎవరూ ఏమీ అనలేదు. ఏమని అంటారు. నాతో కలిసి వచ్చిందనే మాటే గాని, జయకు అది అమ్మమ్మ ఇల్లు. అప్పటికి అమ్మమ్మ లేకున్నా, మేనమామ ఇల్లు. రెండో రోజు అనుకుంటా, మా అమ్మ… మా కళ్ళంలో గడ్డి కోయడానికి వెళ్తూ జయమ్మను కూడా తీసుకెళ్లింది, తనకూ ఒక కొడవలి ఇచ్చి, గడ్డి కోయడానికి.

దటీజ్ టూ మచ్, కదూ?!

అప్పుడర్థమయ్యింది మాకు.

మేము పెళ్లి చేసుకుని భార్యా భర్తలుగా వచ్చామని అనుకుంటున్నారని. అయినా మాకు ‘దిమ్మ తిరిగినట్టు కావడం’ వంటిదేమీ జరగలేదు. నేను మా అమ్మను కుంచెం కోప్పడ్డానంతే, మమ్మల్ని అలా అనుకున్నందుకు. అమ్మ తిరిగి కోప్పడింది… ఎదిగి వచ్చిన పిల్లను, పెండ్లి కాని పిల్లను… అలా వెంట తీసుకువస్తావా, అది తప్పు కాదా అని.

అంతే కాదట. మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బాగున్నా లేకున్నా, మేము ఏ క్షణం నుంచి అనుకుంటే ఆ క్షణం నుంచి ఆలుమగలమే నంట. బావా మరదలంటే అంతే నంట. ఈ సంగతి చాన్నాళ్ళ తరువాత జయ చెల్లి రాధమ్మ పెళ్లిలో తెల్సింది మాకు, రాధమ్మను పెండ్లి కూతురును చేస్తూ నలుగు పెడుతున్నారు. తన రెండో అక్క మహేశ్వరి నలుగు పెట్టలేదు. ఎందుకంటే ఆమెను ‘ఇత్తనపింటి’ వాళ్ళ ఇంటికిచ్చి పెండ్లి చేశారు కాబట్టి… అని చెప్పారు. (నెరవాటి, ఇత్తనపింటి అనేవి వేర్వేరు ‘శాఖ’లు రెడ్లలో). ఓహో, సరేలే, వీళ్ల ఆచారాలూ వీళ్ళు… అనుకున్నాం మేము. ఆ తరువాత జయను పిలిచారు నలుగు పెట్టడానికి. ఈ పద్దతులు తనకు నచ్చవు అని చెప్పేసింది జయ. నేను వుండబట్ట లేక ఆ ఆడవాళ్లను అడిగాను. మహీని వేరే శాఖ అబ్బాయితో పెండ్లి చేసింది మీరు, అలా చేశామని ఇప్పుడు నలుగు పెట్టనివ్వంది మీరు. జయకు అసలు పెండ్లే కాలేదు కదా? మీరు చెప్పే అర్థంలో మేము పెండ్లే చేసుకోలేదు కదా? అని నిలదీశాను.

నేను తీశాను గాని, వాళ్ళేం నిలబడి పోలేదు. ఫట్ మని జవాబు చెప్పారు. మీరు పుట్టినప్పుడే మీకు పెండ్లయిపోయింది. మేనరికం బావామరదళ్ళు… పెండ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పెండ్లి చేసుకున్నట్టే లెక్క, అందుకని జయమ్మ నలుగు పెట్టొచ్చు అన్నారు.

అదన్న మాట, ఇద్దరం కలిసి వూరికి వెళితే మా వైవాహిక సంబంధాన్ని అమ్మ నాన్న గ్రాంటెడ్ గా తీసుకోడానికి కారణం. ఆ తరువాత జయ వాళ్ల వూరికీ వెళ్లినా తను అలా మా ఇంటికి రావడాన్ని వాళ్ళ అమ్మ నాన్న తప్పు పట్టకపోవడానికి కూడా అదే కారణం.

మరి అంత ‘చక్కని’ కారణం వుంది కదా, మా మానాన మమ్మల్ని వదిలెయ్యొచ్చుగా. వదిలెయ్యకుండా అతిగా కల్పించుకోవాలని చూడడంతో మేము కొన్ని తీవ్రవాద చర్యలు తీసుకోకతప్పలేదు.

నేను విశాఖలో ఎమ్మే చదువుతున్నప్పుడే జయమ్మ తలిదండ్రులు ఎడ్లబండి కట్టుకుని మా వూరు వెళ్ళారు, అనవసరపు ‘పిల్ల పెత్తనా’నికి. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం చేసుకుంటారా అని అడగడానికి వెళ్ళడాన్నే (లేదా వైస్ వెర్సా) పిల్ల పెత్తనం అంటారు. జయ వాళ్ళమ్మ నాన్న పదివేల రూపాయలు వరకట్నమిస్తామని మా నాన్నతో ఒప్పందం చేసుకున్నారు.

అదంతా చాల అనవసరమైన యవ్వారం. ఈ వార్త తెలియగానే నేను మా అమ్మ నాన్నల్ని కోప్పడ్డాను. ఈ కట్నం కబుర్లేమిటి అని. పాపం నాన్న నాతో ఏమీ అనలేదు. ఆ తరువాత, వుమ్మడి మిత్రుల ద్వారా రెండు కుటుంబాల మధ్య గరం గరం సంభాషణలు నడిచాయి. చెల్లెలికి కట్నం నిజంగా ఇద్దామని ఏమీ లేదు. అన్నకు దాన్ని వదులుకునే ఉద్దేశమూ లేదు. మా ఇద్దరితో సంబంధం లేకుండా, మాకు తెలీకుండా, ఇండైరెక్టుగా ఆ లావాదేవీ జరిగిపోవాలని నాన్న కోరిక. కట్నం ఖర్చు లేకుండా, ఆలాగని ఇవ్వం అని చెప్పే పని లేకుండా… పెండ్లి జరిగిపోవాలని చెల్లెలి కోరిక.

మాటలు మా దాకా లీకయ్యేవి. కొన్ని మాటలు మరీ కంపు కొట్టేవి.

ఇద్దరం కెవిఆర్ కాలేజీ చిగురాకు జొంపాల మధ్య కూర్చుని అలోచించేశాం. ఇది కుదరదు. వీళ్ళు మన పెండ్లి చేసుడేంది. మనమే చేసుకుందాం అనేసుకున్నాం. రెండు కుటుంబాల మధ్య మాటల మంటల్ని ఆర్పడానికి అదొక్కటే మార్గం అని అర్థమైపోయింది. అదీగాక, కుటుంబాల పట్ల మా లాయల్టీలు కూడా మమ్మల్ని కాస్త బాధించేవి. వాటి వల్ల మేమెక్కడ దూరమయిపోతామో అని భయమేసేది. అయిన కాడికి అయ్యింది, తరువాత సంగతి తరువాత, ముందు పెండ్లి చేసేసుకుందాం. తరువాత పెద్దోళ్ళు వాళ్లకు వాళ్ళే దగ్గరవుతారని అనేసుకున్నాం.

మా అలోచన చెప్పగానే గంగిరెడ్డన్న ఓకే అనేసి, అటు ఇటు మాట్లాడ్డానికి ఓ వారం రోజూ సమయం తీసుకున్నాడు. ‘మీరు అవునన్నా కాదన్నా వాళ్లు పెండ్లి చేసుకుంటారు. వచ్చి, శుభాకాంక్షలు చెప్పండి’ అని వాళ్లకు చెప్పేశాడు.

మా పెళ్లి వొద్దని ఎవరంటారు? జయమ్మంటే మా నాన్నకు చాల ఇష్టం. తన చెల్లెలి లాగే జయమ్మ జొన్న రొట్టెలు చాల బాగా చేస్తుందని ఆయన మురిపెం. మరదిని (మా తమ్ముడిని) ఒరే తరే అనకుండా ఎంచక్కా పేరు పెట్టి పిలుస్తుందని, అన్నిటికి మించి చదువుకుందని… చివరికి…. నేను సిగ్గు పడకుండా చెప్పాలంటే… ఎత్తులో లావులో కూడా మా ఈడు జోడు బాగుంటుందని ఆయన అనుకునే వాడు. ఎటొచ్చీ, తనకు రావలసిన పదివేలు పోతున్నాయని, తన మాట నెగ్గకపోయెనే అని ఆయన బాధ. ఆ రోజుల్లో ఆది చాల పెద్ద మొత్తమే. ఆయనకు వున్న అప్పులు చాల వరకు తీరిపోయేవి ఆ డబ్బుతో. ఆ ‘ఎకనమిక్ ఫ్రంట్’ లో మేము చేయగలిగిందేమీ లేదు. పోనీ, నేను ఉద్యోగం చేసి ఆ ‘గండి’ పూడుస్తానా అంటే, ఆ ఆశలూ లేవు. ఆయన దుఃఖం పూర్తిగా సమంజసం.

మేము మరి చాల కాలం ఆగగలం. నాకు తలమునకలుగా పని వుండింది. తాలూకా పట్టణాల్లో అప్పుడప్పుడే పిడిఎస్ యు సంబంధాలు పెరుగుతున్నాయి. జయ అప్పటికింకా బియే రెండో సంవత్సరమే. ఆగడమే సరైనది. కాని, ఆగడం వల్ల మాటల యుద్ధాలు ఇంకా పెరుగుతాయి. వాటికి తట్టుకోలేక, మేము దూరమయ్యే ప్రమాదం కూడా వుంది. అది జరగ్గూడదు.

మా పెండ్లి పనులు మేమే చక చక మొదలెట్టేశాం. జూన్ 10న కర్నూలు టౌన్ హాలులో మేమిద్దరం పెండ్లి చేసుకుంటున్నామని ఒక తెల్లని కార్డు ముద్రించాం. దానిలో ‘ఎవరూ కానుకలు తీసుకు రావొద్ద’ని ఒక గమనిక రాశాం. దానితో పాటు ‘ భోజనాలూ అవీ వుండవు’ అని మరో గమనిక కూడా చేర్చాం.

పెండ్లి రోజు దూరంగా కూర్చుని మా నాన్న ఏడ్చింది ఇందుకోసమేనేమో. ఎందుకు అనేది ఆయన చెప్పడు కదా?! నేను అడగను కదా?! తన కొడుక్కు పిల్లనిచ్చేటోళ్లు కార్లేసుకుని వస్తారని ఆశ పడే వాడు. అలాంటిది, కొడుకు పెండ్లి… ఆయన భాషలో చెప్పాలంటే, బిచ్చగాళ్ళ పెండ్లిలా… పప్పన్నాలు, పాయసాలు లేకుండా జరగడమే మా పెండ్లి రోజు ఆయన కళ్ళలోని ఉప్పెనలకు కారణమేమో. యామ్ సారీ నాన్నా!

పెండ్లికి ఎవరొస్తారులే అనుకున్నాం. కాని. మా బంధువులంతా వచ్చారు. పురోహితుడు లేని ఈ పెళ్లి ఎలా వుంటుందోనని క్యురియాసిటీ కూడా పని చేసి వుంటుంది. స్నేహితులంతా వచ్చారు. కర్నూలు టౌన్ హాలు క్రిక్కిరిసింది. రెండు అండాల నిండా చల్లని నీళ్లు పోసి, అందులో రస్నా పొడి కలిపాం. అదే ఆ రోజు మా పెండ్లి అతిధులకు మేము ఇచ్చిన విందు.

మేము గమనికలో కోరినట్టే ఎవరూ కానుకలు తీసుకు రాలేదు. మా అమ్మ వాళ్లన్న పెద్ద కొడుకు, మా నారాయణ రెడ్డి బావ, తను మాత్రం ఒక చేతి గడియారం తెచ్చి, తీసుకోవాలని బలవంతం చేశాడు, ‘మీ నాయ్న, నా పెండ్లిలో పెట్టిన సదివింపులు మీకు తిరిగి ఎట్ట ఇయ్యల్రా మల్ల?’ అని ప్రశ్నించాడు. ‘మా నాయ్నకు ఇంకా ముగ్గురు కొడుకులుండారులే, బావా!’ అని గడియారం వెనక్కి ఇచ్చేశాను, పరమ నియమ నిష్ఠా గరిష్టుండనయ్.

నా ప్రాణ స్నేహితుడు పుల్లయ్య తెచ్చిన పోర్టబుల్ రేడియో ఒక్కటే ఆ రోజు మేము తీసుకున్న పెళ్లి కానుక. దాన్ని తన గుర్తుగా చాన్నాళ్లు నాతో వుంచుకున్నాను. మరి మరి బ్యాటరీలు కొనడమంటే డబ్బులు ఖర్చు అని దాన్ని ఎప్పుడూ వుపయోగించలేదు. ఊరికే అలా వుంచుకున్నామంతే. పార్టీలో బాగా పనుల్లో వుండగా పుల్లయ్య పెళ్లి. నేను వెళ్ళడం కుదరలేదు. అలాంటి అలక్ష్యానికి మరి కొందరు మిత్రుల లాగే పుల్లయ్య కూడా నన్ను చాన్నాళ్ళు క్షమించలేదు.

కృష్ణ రాజ్ సింగ్, తానీషా, అజయ్, జయరామి రెడ్డి, చంద్ర శేఖర రెడ్డి, జి ఎన్ కృష్ణ మూర్తి, శ్రీనివాస రెడ్డి, రామ స్వామన్న, బొల్లారం చెన్నయ్య, గార్గేయపురం కృష్ణ మూర్తి, నన్నూరు వెంకటరెడ్డి, గోకారి, రామన్న గౌడ్… అప్పటి పార్టీ వాళ్ళందరూ వచ్చారు.

గుర్తు చేసుకుంటే కుంచెం బాధేసే విషయం ఒకే ఒకటి. దగ్గర్లో వున్న స్టూడియో నుంచి ఫోటోగ్రాఫర్ ను పిలిపించాం. అతడు ఫోటోలు తీశాడు. అతడితో ప్రింట్స్ వేయించి తీసుకునే లోగా ఎమ్నర్జెన్సీ వచ్చింది. నేను ముషీరాబాద్ డిస్త్రిక్ట్ జైలుకు తరలి పోయాను. రెండేండ్ల తరువాత స్టూడియోకి వెళ్లి ఆ నెగటివ్స్ కోసం ఒక పూటంతా వెదికాం. నో యూజ్. మాకు పెళ్లి ఫోటోలు లేవు. మా తమ్ముడు, శివుడు అప్పటి తన చిన్న కెమెరాతో, అదీ హాలు బయట, సూర్యకాంతిలో తీసిన కొన్ని.. బాగా చిన్ని… ఫోటోలు మాత్రం కొన్నాళ్ళు మాతో వుండేవి. అవి హాలు బయట తీసిన ఇండివిజువల్ ఫోటోలు, మేము ఇద్దరం వున్నవి కాదు.

ఆ రోజు మేము ఇచ్చిన ఉపన్యాసాలు తల్చుకుంటే ‘వామ్మో’ అనిపిస్తుంది. దాని సారాంశమేమిటంటే మేము పెళ్లి చేసుకుంటున్నది సంసారం చేయడానికి కాదు. విప్లవం చేయడానికి అని. 🙂

జయమ్మ ఏమీ భయపడకుండా, మేము ఒక అసాధారణమైన మంచి పని చేస్తున్నామనే ఆత్మ విశ్వాసంతో మాట్లాడింది. బహుశా అది మొదటి సారేమో తనను చీరలో చూడడం. కాలేజీలో చూశానేమో. ఏమో గాని. ముదురాకు పచ్చ చీర, బ్లూ జాకెట్, కాంతి వెదజల్లే మొహం…. భయపడుతుందని అనుకున్నానేమో, తనను అలా చూడడం నాకు చాల గొప్పగా వుండింది.

వాళ్ళ వూరికి వెళ్లినప్పుడు, ఇంటి ముందు బావి గడ్డ తిరుగుతూ చూసే వాడిని. తను బయటరుగుల వద్ద వుంటే, నన్ను చూడగానే కళ్లు, పెదిమలు విచ్చుకుని… అద్భుతం అనిపించేది. వాళ్ల పక్క వూరు తర్తూరులో ఏటా తిరుణాల జరుగుతుంది. అందరం కలిసి వెళ్ళే వాళ్ళం, తిరుణాలకు. ఆ ఎండలో, ఒక్కోసారి చమటల వల్ల కష్టంగా వున్నప్పుడు కూడా జయమ్మ నాకు చల్లని నీడలా, హాయిగా కనిపించేది.

అప్పుడే కాదు, తను ఎప్పుడూ అంతే.

నాకు కొన్ని ‘నిస్సహాయత’లున్నాయి. కొన్ని మీకు తెలుసు. ఇప్పుడు ఈ నిస్సహాయతా మీకు తెలిసిపోయింది.

//ఒక నిస్సహాయత//

సున్నితమైన వాటినే ముట్టుకోవాలనిపిస్తుంది
ముళ్లు గుచ్చుకుంటాయని తెలిసీ గులాబీ పువ్వుని
ముడుచుకుంటాయని తెలిసీ అత్తపత్తి ఆకుని, వేళ్లు
కాలుతాయనీ తెలిసీ మండే పొయ్యిని తాకాలనిపిస్తుంది

ఒకానొక సారి ఒక దుమ్ము రేగే తిరుణాల సందడిలో
గోల గోలగా నడిచిపోయే జన సమూహాల మధ్య
రంగు రంగుల ఎద్దుల బొడ్డార్లు, తాళ్లు, తలుగుల మధ్య
ఎండకు నీడనిచ్చే తన కళ్ళ కాంతిని ముట్టుకున్నాను

స్పర్శ తీరదనిపించే కోరికయ్యింది, విరహమయ్యింది,
సాఫల్యమయింది, ఓదార్పయ్యింది, అహరహమయ్యింది
తను అప్పుడప్పుడు వేళ్ళు కాలే జ్వాల అవుతుంది, తాకితే
ముడుచుకునే అత్తపత్తి మొక్క, ముళ్లున్న గులాబీ రెమ్మ

ఏం చేయను? ఏమీ చేయలేను! నేను తనను ప్రేమిస్తున్నాను

15-3-2010

(‘గొడ్డలి బుజం’, పేజ్: 14)

(వచ్చే వారం కర్నూలు జిల్లా లోనే మరికొన్ని కబుర్లు)

14-09-2016

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

ఒక జవాబు, ఒకే జవాబు

స్మృతి 26

అదొక అద్భుతం. మిరకిల్. అంత గాఢమైన అనుభవం అంతకు ముందెప్పుడూ నాకు కలగ లేదు.

ఆ అనుభవం ఇచ్చిన అనుభూతి మరి డజను వత్సరాలు… ఆ తరువాత కూడా… నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్ను నడిపించింది… నడిపిస్తోంది. అది కాసేపు తాయిలమైంది. కాసేపు బెత్తమైంది. ముందుకు లాగే ముకు తాడైంది. వెనుక నుంచి అదిలించే ముల్లు గర్రయింది.

గంగిరెడ్డి వెంకట కొండారెడ్ది వెంట బయల్దేరానని చెప్పాను కదూ! రెండు మూడు రోజుల్లో వస్తానని అమ్మకు మాత్రం చెప్పి వచ్చాను. తిరిగి మా వూరికి వెళ్లడానికి చాల రోజులు పట్టింది. వెళ్లినా, పార్టీ పనుల మధ్య వెళ్లి ఒకటి రెండు రోజులు వుండే వాడిని.

నా రాజకీయ ఆరంగేట్రంలో మొదటి రోజు వెళ్లింది ఉప్పలపాడు గ్రామం. మా ఊరు లాగే అది కూడా బస్సు రోడ్డుకు ఎడంగా వుండిన వూరు. కాస్త నడవాల్సి వుండింది. ఇప్పుడెలా వుందో మరి.

మేము వెళ్లిన ఇల్లు ఒక సారాయి అంగడి. ఇల్లంతా ఒక అరుగు లాంటి ఎత్తైన వేదిక మీద వుంటుంది. దళితుల ఇళ్లు వూరికి దిగువన వుండటం వల్ల, వాన నీరు బజారు లోంచి ఇళ్ళలోకి రాకుండా అలా ఎత్తు మీద కడతారు. ఆ ఇల్లు మెట్లెక్కి వెళితే, ఒక పెద్ద గది. కింద బండ చట్టం (ఫ్లోరింగ్) లేదు. నేల శుభ్రంగా అలికి వుంది. ఒక పక్కన పీపాలు. సారాయి అనుకుంటా. పేడతో అలికిన నేల మీద పగుళ్లు వున్న చోట్ల చీమల బార్లు. అవి ఇంట్రూడర్లలా కాకుండా మా వంటి అతిధులే అనిపించాయి. మాకు విస్తర్లతో అన్నం పెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికో పయనమైన పోతున్న చీమల్ని చూస్తూ మామూలు పప్పు అన్నమే పరమాన్నంలా, పలావులా గొప్ప ఇష్టంతో తిన్నాను ఆ పూట.

బాగా జ్ఞాపకం వుంది, అన్నం తింటూ నేనేం అనుకున్నానో.

“ఇప్పుడు నేను దిగులు పడాల్సిందేమీ లేదు. నేనుగా నిర్ణయం తీసుకుని, చేయాల్సిన పనులేమీ లేవు. పనులు జరగడం లేదే అని అతి ఆరాటం అక్కర్లేదు. శివాయిజమా భూములు దున్నుకుని సేద్యం చేసుకుంటున్న పేదలను భూస్వాములు, పోలీసులు తొలగించకుండా ఎలా చూసుకోవాలన్నదే ఇక్కడ నా ముందున్న సమస్య. ఓహ్, ‘నా’ కాదు, ‘మా’ ముందున్న సమస్య. అది నేనొక్కడినే చూడక్కర్లేదు. మిగతా కామ్రేడ్సు, సానుభూతిపరులైన లాయర్లు, నాయకులు నిర్ణయిస్తారు. నేను వాళ్ళతో కలిసి నడవాలి… రద్దీలో బస్సెక్కుతున్నప్పుడు వెనక, పక్కల మనుషులు తోయడం వల్ల ముందుకు పోయినట్టు”

ఆ ఆలోచనలు ఇచ్చిన మనశ్శాంతిని మీకు మాటల్లో పెట్టి చెప్పలేను. ‘బండ రాయి ఆత్మ కథ’ అని, ఆ ఫీలింగ్ నే ఒక కథగా రాశానెప్పుడో తరువాత.

ఆ సెల్ఫ్ అస్యూరెన్సు, బేఫికర్ తనం కేవలం నాలోనిది కాదు. ఉద్యమం లోనిది. నా చుట్టూరా వుద్యమకారుల ముఖాల్లోనిది. ఆ కాంతి నా లోనికి ప్రవహించింది, అంతే. ఆ అంతశ్శాంతిని వదులుకోడం ఎవరికీ సులభం కాదు.

ఉప్పల పాడులో భూస్వామి పేరు స్వామి రెడ్డి. తను మా వూరిలో నా బాల్య స్నేహితుడు బాగ్గెమ్మ కొడుకు పుల్లా రెడ్డికి పిల్లనిచ్చిన మామ. స్వామి రెడ్డికి సాయంగా పుల్లా రెడ్డి మా వూర్నించి ఒక లారీలో మనుషుల్మి పంపించాడు కూడా నట. నాకు ఆలస్యంగా, అప్పుడే తెలిసింది. పుల్లా రెడ్డి నా యీడు వాడే. వంద ఎకరాల ఆస్తికి, ఒక్కడే… తండ్రి లేని… వారసుడు. స్కూలు కాలంలో తన స్నేహితులతో కలిసి నన్ను కొట్టి ఏడిపించే వాడు. అతడిని ఎదుర్కొనే పోరాటం, ‘భలె భల్లే’ అనుకున్నాను. మేము ఎదురెదురు పడేంత దూరం రాలేదు. ఉప్పలపాడు పేద వాళ్ళ నుంచి వచ్చిన మూడు నాలుగు ప్రతిఘటనలకే స్వామి రెడ్ది రాజీకి వచ్చాడు. తొంభై ఎకరాల ప్రభుత్వ భూమి పేదల వశమయ్యింది.

నేను పార్టీ పనుల్లో భాగంగా హైదరాబాదులో వున్నప్పుడు, ఒక సారి కర్నూలు బస్ స్టాండులో పుల్లా రెడ్డిని కలిశాను. స్నేహంగా పలకరించాదు. చాల దిగులుగా కనిపించాడు. అది అతిగా తాగడం వల్ల వచ్చే ‘దిగులు’ కూడా. మానసికం కాదు. శారీరకం. కొద్ది రోజులకే తన మరణ వార్త కూడా విన్నాను. తను గుర్తొచ్చినప్పుడంతా చాల బాధేస్తుంది. తన వంటి వుదాహరణలు మా వూళ్ల నుంచి ఇంకా రెండు మూడు వున్నాయి,. జీవించడానికి సరైన శిక్షణ వుండి వుంటే, తగిన మార్గదర్శకత్వం దొరికి వుంటే, వాళ్ళు చాల సుఖంగా సంతోషంగా జీవించాల్సింది. ఆ శిక్షణ, దర్శనం లేకపోవడంతో వాళ్ళ ఆస్తి పాస్తులే వాళ్లకు వురి తాళ్లయ్యాయి.

నేనూ, జయ ఇప్పటికీ అనుకుంటాం. మనకు ఎంత తెలిసిందో ఎంత తెలియలేదో ఏమో గాని… ఆ కాస్త మార్క్సిస్టు దర్శనం, ఉద్యమ స్పర్శ వుండడం వల్లనే కదా, బతుకు ప్రతి మలుపులో… వున్నంతలో సరైన దారిని ఎంపిక చేసుకోగలిగాం.. బతుకులో ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని డిటౌర్లు, మెలికల మలుపులు తిరిగినా…. మనకు మనం మిగల గలిగాం. మంది కోసం ఏం చాతనయితే అది చేస్తున్నామనే సంతోషాన్ని కాపాడుకోగలిగాం.

మార్క్సిస్టు దృక్పథం. శ్రామిక ప్రజలతో వీలయినంత సాన్నిహిత్యం… ఈ రెండూ అత్యవసరం… మనుషులు నిర్భయంగా బతకడానికీ, నిర్భయంగా మరణించడానికి.

ఉప్పల పాడు గ్రామం పార్టీకి కొత్తగా సంబంధాలు వచ్చిన వూరు. అచ్చంగా ఆ భూమి పోరాటంలో వున్న వాళ్లు మాత్రమే తెలుసు. అందుకని మిగతా వూరి గురించి నాకు తెలియదు. మేము వెళ్లిన రెండో వూరు పుసులూరు బొల్లవరం. అది ‘ఎన్నార్’ వాళ్ళ వూరు. ఆ వూరు హంద్రీ నది తీరంలో వుంటుంది. ఏరు ఇప్పుడెలా వుందో ఏమో. మేటలు మేటలుగా ఇసుక. ఏటిలో నీరు ఎక్కువగా లేనప్పుడు ఇసుకలో కలింగిరి, కరబూజ పండ్లు పండించే వారు. తీరం మీద గంగ రేగు చెట్లు, కొబ్బరి చెట్లు కూడా వుండేవి. ఏరు దాటగానే… (లేక ఏటి కన్న ముందేనా?) పొలాలు.

వేరుశనగ పొలాల్లోంచి ఎవరో పిలిచారు మమ్మల్ని.

చెన్నయ్య. చాల కలుపుగోలు మనిషి. తను ఏం మాట్లాడాడో ఏమో, తన మొదటి మాటతోనే అందరం హాయిగా నవ్వుకున్నాం. తరువాత తన సరదా మాటల్లో ఒకటి “కొత్త పిట్ట దొరికినట్టుంది”. కొత్త పిట్ట నేనే. వలేసి పట్టుకొచ్చింది గంగిరెడ్డన్న. ఎందుకో ఆ సాదృశ్యం ఏమీ తప్పు కాదనిపిస్తుంది, ఇప్పటికీ.

అందరం అంతే. ఎవరి వలలోనికి వాళ్ళం. వలలం కూడా మనమే. ఎవరి ‘స్లాట్’ లోనికి వాళ్ళం. వెదికి వెదికి స్లాట్ దొరికించుకుని మరీ చేరిపోతాం మన స్లాట్స్ లో మనం.

ఊళ్లోకి వెళ్ళాక మొదటి పరిచయం సుంకులు. తనను నేను లాస్ట్ టైమ్ చూసే సరికి ఎంపీటీసీ గా వుండినాడు. మొదటి సారి కనిపించినప్పుడు… అరుణోదయ రామారావు, కానూరి తో పాటు బుర్రకథ దళంలో తానొక వంత పాట సభ్యుడు. తనూ, వాళ్ల అబ్బాయి (దత్తత కుమారుడు) సామన్న నాంది నాటకంలో పాత్రధారులు కూడా, రామారావు తో పాటు.

పుసులూరు బొల్లవరం ఒక ప్రత్యేకమైన వూరు. అది నీలం రామచంద్రయ్య (ఎన్నార్) సొంత వూరు. ఆ వూరు వున్నంత వరకు రామచంద్రయ్య వుంటారు. అంతగా ఆయన్ని ప్రేమించే వూరది. ఊరి వాళ్ళలో రాజకీయ సిద్ధాంతాల లోతు పాతులు తెలిసిన వాళ్ళు తక్కువ. ప్రేమ. కల్తీ లేని ప్రేమ. రామచంద్రయ్యకు చెడ్డ పేరు తెచ్చే పని ఏదీ మనం చేయగూడదు అనేంత ప్రేమ, 1976 లో ఆయన పోలీసు హీనత్వానికి బలైపోయినా.

మా కుటుంబంలో నేనే పెద్ద కొడుకును కావడం వల్ల… దాయాదులో కూడా నా కన్న పెద్ద పిల్లలు లేకపోవడం వల్ల…. నాకు అన్న వరుస అయ్యే వాళ్ళంటే చాల ఇష్టం. అలా అన్న వరుసయ్యే మనిషి ఒకరు పుసులూరి బొల్లవరంలో వుండే వారు. జయమ్మ కుటుంబం వైపు నుంచి బంధువు. తన పేరు సత్యనారాయణ రెడ్డి. తరువాతెప్పుడో ఏదో రైల్వే ప్రమాదంలో మరణించాడు. నేనా వూరు వెళ్ళే నాటికి తను పార్టీలో క్రియాశీలుడు. కొత్తగా కామ్రేడ్ ఇన్ ఆర్మ్స్ అయ్యాడు. అన్న అని పిలిచే వాడిని కాదు గాని, అలా పీలయ్యే వాడిని.

ఆ వూళ్లో ‘అప్పొజిషన్’ అనేది లేకుండె. అందరూ ఎన్నార్ పార్టీ యే. అంటే సీపీ గ్రూపు విప్లవ పార్టీయే. తరువాత పీపిల్స్ వార్ లో ఒకరిద్దరు అక్కడి నుంచి పని చేశారు. ఎటువంటి ఘర్షణలు లేవు. ఊళ్లో అందరూ ఐక్యంగానే కాకుండా, అప్పుడెందువల్లనో కాస్త ‘బేఫికరు’గా కూడా వుండే వారు. బొల్లవరం వెళ్తే, జీవితం ఏమంత కష్టభరితం కాదు అనిపించేది. నిజానికి, చాల సార్లు నాకు అలాంటి ‘ఫీలింగ్ అఫ్ వెల్ బీయింగ్’ ఇచ్చిన మరొక వూరు వేంపెంట. ఆ రెండు వూళ్ళలో ఒక్కడినే బజార్లలో తిరుగుతుంటే ‘కమ్యూనిజం’లో తిరుగుతున్నట్టనిపించేది. బజారులో నడుస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఆప్యాయంగా పలకరించే వారు. వెళ్ళేది ఒక ఇంటికి, తినేది ఇంకో ఇంట్లో. ఊరంతా మన ఇల్లే ఆన్నట్లుండేది.

నిజంగానే అప్పటికి. మరీ అంత గుంట చిక్కులు లేవేమో వూళ్ళలో.

బొల్లవరంలో ఏవో కొన్ని ఘర్షణలు జరిగినట్టున్నాయి. కాని అవి నిజంగా చెడ్డ వారైన ఒకరిద్దరితో వచ్చిన ఘర్షణలే. కుల సమస్య లు కావు. పేచీ విషయాలు నేరుగా, సూటిగా వుండేవి.

రెండు వూళ్లలో కాస్త నెమ్మది వాతావరణం వుంటానికి వేరే కారణం కూడా వుంది. రెండు వూళ్లూ కాస్త కలిగిన వూళ్ల కిందే లెక్క. బొల్లవరం హంద్రి నదీ తీరంలో వుండడం వల్ల కొంత తరి భూమి కూడా వుండేది. వేంపెంట కెసి కెనాల్ గ్రామం. దాని వల్లనే కొందరు కోస్తా రైతులు వేంపెంట వచ్చి తమ సొంత సెటిల్మెంటుకు ‘శాంతినగర్’ అని పేరు పెట్టుకున్నారు. వేంపెంట ‘శాంతి నగర్’ లోని రైతులు కూడా కొందరు కమ్యూనిస్టులుగా, వూరి రాజకీయాలలో పాల్గొనడం నేను చూశాను.

ఆ నాడు రాయలసీమలో ఏ వూరికైనా ఏ మాత్రమైనా సేద్యపు నీటి వసతి వున్నట్టయితే ఆ వూరొక మినీ ‘స్వర్గమే’. జనం పచ్చగా కనిపించే వారు. మా వూరు, గనిలో, కాల్వలు చెరువుల సౌకర్యం లేదు. మొన్న మొన్నటి వరకు ఎక్కడ బావి తవ్వినా సేద్యానికి తగిన నీరు దొరికేది కాదు. ఇటీవల బోరు బావుల కల్చర్ వచ్చాక చాల మంది రైతులు బోర్లు వేసి, ఆ నీటితో వరి పండిస్తున్నారు. ఇప్పుడు మా వూరి వాళ్ళు వూళ్లో పండిన వరి అన్నం తినగలరు. బోరు బావులకు ముందు ఆ మాట కలల్లోనే సాద్యం.

మా నాన్న కోశంబాయి చేను అనే చోట ‘జోము’ నీరు పారడం చూసి, దాన్ని ఆపి వరి పండిద్దామని కతువలెన్ని కట్టాడో చెప్పలేం. ‘కతువ గట్టి కతువ గట్టి జిమ్మె వాయెనా’ అని గద్దర్ పాట పాడుకోవాలనిపిస్తుంది ఆయన భాగీరథం తల్చుకుంటే. బోరు బావులు వచ్చాక అది మా వూరికి బాగా అచ్చొచ్చింది. వేరే చాల చోట్ల వాటి వల్లనే రైతులు దివాళా తీశారు. (‘జోము’ అంటే, నేల నుంచి నిరంతరం వూటగా నీరు వుబుకుతుంటుంది. ఊట బాగా ఎక్కువగా వుంటే పంటలకు వుపయోగపడుతుంది. బాగా తక్కువగా వుంటే, వూరికే వూరించి, మా నాన్న వంటి పేద రైతుల ఉసురు పోసుకుంటుంది.)

బొల్లవరం, వేంపెంట, మద్దూరు మొదలైన గ్రామాల విషయం వేరు. వాళ్ళకు చాల కాలంగా నీటి వసతి వుంది. ఆయా గ్రామాల్లో వచ్చిన సామాజిక ఘర్షణలకు… ఈ కంపేరిటివ్ సంపన్నత కారణమా? ఆ సంపన్నతను సక్రమంగా పంపిణీ చేసుకోలేని వ్యవస్ఠ కారణమా? ఈ కార్య కారణాల్ని వూళ్లలో కొందరు గ్రహించినా, తదనుగుణంగా వూరిని మార్చుకోడానికి వాళ్లు ప్రయత్నించకపోవడం, మార్చుకోలేక పోవడం కారణమా?

లేక మనిషి స్వాభావికంగా మరీ అంత స్వార్టపరుడా? తనకు వుండడం కాదు, మరొకరికి వుండకపోవడం ముఖ్యం అయిపోయే దుస్వార్థ పరుడా? ఇది నిజమైతే, అతడి స్వభావం… ఒనిడా టీవి ప్రకటన తరహా మైండ్ సెట్ మారడానికి మనం ఇంకా చాల దూరం పయనించాలా? ఇంకా చాల ఘోరాల గుండా పయనించాలా?

అదేమో గాని, అప్పటికి నాకొక దారి దొరికినట్టే అయ్యింది. దారి దొరికిందని నేను అంతగా కన్విన్స్ కావడానికి ఒక కారణం పుసులూరు బొల్లవరం, వేంపెంట వంటి గ్రామాల్లోని.. పార్టీ నాయకత్వం లోని సుహృద్ వాతావరణం, ఉప్పలపాడు వంటి గ్రామాలలో ప్రజా ప్రతిఘటన సాధిస్తున్న విజయాలు.

ఉన్నంతలో ఒక మార్గం ఎన్నుకోడానికి అప్పుడు నాలో పని చేసిన రాజకీయ విశ్లేషణను కొద్ది మాటల్లో మీకు చెప్పక తప్పదు.

నేను యూనివర్సిటీలో వున్నప్పటికే… ఆనాడు ఇండియాలో అమలవుతున్న విప్లవ మార్గాల గురించి తెలుసు.

మొదటిది: ‘ఉన్నదొకే దారి; చారు మజుందారి’. ప్రజా సమస్యల మీద చిన్న పెద్ద పోరాటాలు ఏమీ అవసరం లేదు. సాయుధ పోరాటం ఒక్కటే మార్గం. సాయుధ పోరాటం ఒక్కటే మన పని. ప్రజా సంఘాలు పెట్టడం, వాటి ద్వారా పని చేయడం ఏమీ అవసరం లేదు. సాయుధ పోరాటానికి పిలుపునిస్తే చాలు ప్రజలు వచ్చేస్తారు. ఆ పిలుపును విష్పరింగ్ క్యాంపెయిన్స్ (గుస గుసల) ద్వారా కూడా చెయ్యొచ్చు. వాళ్ళకు పిలుపు చేరితే చాలు. ఎలా చేరినా ఫరవాలేదు. వర్గ శత్రువులను… అంటే వూళ్ళలోని భూస్వాములను ఒక్కొక్కరిని ఏరేస్తూ పోవడమే ఇక. ఒక వూళ్లో ఒకరిద్దరు భూస్వాముల్ని తొలగిస్తే చాలు. మిగతా భూస్వాములందరూ పారిపోతారు. ఊరు మనదవుతుంది. అలా చాల వూళ్లు మనవి అయ్యే కొద్దీ, ఆ వూళ్ళ మధ్యలో వుండే పట్టాణాలు, నగరాలు… గ్రామాల ముట్టడి మధ్య లోకి వచ్చేస్తాయి. వాటిని ప్రజలు అక్రమిస్తారు. నగరాలు చేజిక్కడమంటే రాజ్యాంగ యంత్రం చేజిక్కడమే. ఇది స్థూలంగా చారు మజుందారి.

నాకు ఈ దారి మొదట్నించీ నచ్చలేదు. ఊళ్ళు ప్రజల చేతికి వస్తే వాటి మధ్య నున్న నగరాలు ఎక్కడికి పోతాయి, అవి, వాటి లోని రాజ్యాధికారం ఇక ప్రజలవే అనేది మాట మాత్రం చాల కన్విన్సింగ్ గా వుండింది. అది సాధ్యం అని కూడా ఆనాటి పరిస్టితులలో నాకు గట్టిగా అనిపించింది. కాని. ఒకటి రెండు చర్యలతో భూస్వామ్యాన్ని వదిలించుకోడం… ఆ చర్యల కోసం, పిలుపు ఇస్తే చాలు జనం వచ్చేస్తారనడం ‘పాజిబిలిటీ’కి, ‘ప్రాబబిలిటీ’కి అవతలిదిగానే నాకు కన్పించింది.

ఇక మిగిలినవి రెండు మార్గాలు… ఆనాటికి ప్రచారంలో వున్న మేరకు.

ఎక్కడికక్కడ ప్రజా సంఘాలను నిర్మించాలి. ప్రజలను ప్రజా సమస్యలపై కదిలించాలి. ఇండియా ప్రాధమికంగా భూస్వామ్య దేశం (అర్థ భూస్వామ్య దేశం). కనుక, ప్రజలు భూస్వాముల భూములను ఆక్రమించుకోడం ద్వారా, భూస్వాముల ఆర్థిక బలాన్ని దెబ్బతీసి, వారిని లొంగదీయాలి. ఆవిధంగా గ్రామాల్ని ప్రజాధీనం చేసుకోవాలి. భూములను ఆక్రమించుకోడానికి జనం అప్పటికే సాయుధులై వుంటారు గనుక, నగరాల్ని… నగరాల్లోని రాజ్యాధికారాన్ని… సాయుధ పోరాటం ద్వారా ప్రజలు చేజిక్కీంచికోవాలి అనేది మిగిలిన రెండు మార్గాల ఉమ్మడి సారాంశం.

డివి, టిఎన్, సిపీ ల నాయకత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవ కారుల కమిటీలో దీని గురించి చర్చలు జరిగాయి. డివి, టిఎన్ ఇద్దరూ భూమి పోరాటం లేకుండా సాయుధ పోరాటం కుదరనే కుదరదన్నారు. సీపీ అలా కాదు. ప్రజలు భూమి కోసం మాత్రమే కాకుండా… కూలీ రేట్లు, గ్రామాల్లోని అన్యాయాల వంటి పాక్షిక సమస్యల మీద కూడా కదిలి వస్తారు. అప్పుడే వారి మీద భూస్వాములు, పోలీసుల నిర్బంధం వస్తుంది. ప్రజలు తాము సాధించిన చిన్న చిన్న విజయాలను కాపాడుకోడానికి, నిర్బంధాన్ని ప్రతిఘటించడానికి ఆత్మ రక్షణ దళాలుగా సాయుధులు కావాలి. ఈ సాయుధ ప్రజలు భూస్వాముల భూములను ఆక్రమించుకుని, వారి అధికారాన్ని కూలదొయ్యాలి. తాము భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూములనూ, అధికారాన్నీ కాపాడుకోడానికి ప్రజలు ఆ ఆయుధాలను వుపయోగిస్తారు. భూస్వాముల భూములు ఆక్రమించకుండా సాయుధ పోరాటం నిలదొక్కుకోలేదు అని సిపీ వర్గీయులు వాదించారు.

ఈ రెండు మార్గాల మధ్య తేడా… పాక్షిక సమస్యలపై సంఘటతమైన ప్రజలు సాయుధులు కావాలని సీపీ; భూస్వాముల భూములు ఆక్రమించాకనే వారు సాయుధులు కావాలని డీవి రావు.

ఇప్పడు మీకు అర్థమై వుంటుంది డివి గ్రూపు నాయకుడు సుబ్బారెడ్డి సాయుధ పోరాటానికి సంబంధించి వెంటనే కార్యక్రమం చెప్పలేకపోవడానికి కారణం. అది ఇంకా పాక్షిక సమస్యల పోరాట దశ. సుబ్బారెడ్డి ప్రకారం అప్పుడు జనం సాయుధులు కాగూడదు. సిపీ గ్రూపు ప్రకారం పాక్షిక సమస్యల మీద కదిలిన జనం లోంచి ‘ఆత్మ రక్షణ’ సాయుధ దళాలు తయారు కావాలి. దేర్ఫోర్, సాయుధ పోరాటం అప్పుడే మొదలయింది. చూడరాదూ… గోదావరి లోయలో మన సాయుధ దళాలు!

అప్పటి నా ఆశలు, అంచనాల మేరకు…. నా రాజకీయ వేదిక సీపీ నాయకత్వం లోని విప్లవకారుల కమిటీయే. ఆ అవగాహనకు తోడు… ఆనాడు కర్నూలు జిల్లాలో ఈ పార్టీయే ఒక పెద్ద శక్తి.

బహుశా, పుసులూరు బొల్లవరం నుంచి మేము నేరుగా కర్నూలు లోని పార్టీ ఆఫీసుకు వెళ్ళాం. అప్పుడు పార్టీ ఆఫీసు కొండారెడ్డి బురుజుకు దగ్గరగా వుండేది. పార్టీ ఆఫీసుకు వెళ్లిన వెంటనే కలిసిన వారు…. నన్నూరు నుంచి రామస్వామన్న, దైవందిన్నె నుంచి రామన్న గౌడ్, కర్నూలు బుధవారప్పేట నుంచి గోకారి, ఆఫీసులోనే వుండిన పర్ల గ్రామ యువకుడు… శత్రువుల దాడిలో కాలు పోగొట్టుకున్న శివా రెడ్డి… వీరందరి కన్న… నన్ను ఆకర్షించిన మనిషి మొలగవెల్లి సత్తెన్న…. అనగా ఇప్పుడు జగమెరిగిన అరుణోదయ రామా రావు.

తను అప్పటికి రామారావు అని కాకుండా సత్తెన్న అనే సొంత (?) పేరుతోనే వుండే వాడు.

సత్తెన్న అనే పేరే బాగుంది కదా, రాముడు దాన్ని ఎందుకు మార్చుకున్నట్టు అనిపిస్తుంటుంది నాకు.

రాముడిని మొట్ట మొదట కర్నూల్లో పార్టీ ఆఫీసులోనే కలిశాను. బహుశా నా పార్టీ జీవితంలో మొదటి వారంలోనే. తన పాటలు పద్యాలు విన్నాను. ఒక వ్యక్తికి దగ్గరగా కూర్చుని, ఆతడు అంత గొప్పగా పాడుతుంటే వినడం అదే మొదటి సారి. అంత అద్భుతమైన నాదం… గ్రామ ఫోను, స్ఫీకర్ల వంటి యంత్రాల నుంచి కాకుండా… ఒక సజీవ స్వరం నుంచి ప్రత్యక్షంగా వినడం నాకదే మొదటి సారి. రాముడు అందగాడు కూడా. నాంది నాటకంలో తెల్ల ప్యాంటు షర్టు వేసుకుని… ఇతడి ముందు నాగేశ్వర్రావు దిగదుడుపు… అనిపించే వాడు.

నిజానికి నాంది నాటకం గ్రామీణ ప్రజల మీద చూపించిన ప్రభావం చాల పెద్దది. అధ్యయన యోగ్యమైనది. డైలాగు నాటకానికి కాలం చెల్లిందనే మాట తప్పు అని ఈ నాటకం నిరూపించింది. అసలు సంగతి… రచయితలు… జనం సమస్యలను పక్కన పెట్టి… తమ ఎగువ మధ్య తరగతి, శిష్టవర్గ సమస్యలను… అందులోనూ… తమకే సరిగ్గా అర్థం కాని మానసిక సమస్యలను ప్రదర్శిస్తే… ఇంకా ‘వూరి’ సంస్కారం వదులుకోని ప్రజలకు ఎందుకు పడుతుందది? భౌగోళీకరణ వంటి అనిర్దిష్ట. సైద్ధాంతిక విషయాల చుట్టూ తిరిగే నాటకలతో జనానికేం పని.

ఇది కూడా సత్తెన్న రామారావు అయిపోవడం వంటిదేనంటే, రాముడు నన్ను కొట్టడానికి రాడనుకుంటాను. 🙂

31-08-2016

(వచ్చే వారం మళ్లీ కలుద్దాం)

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

ఉండటమా వుండకపోవడమా? అదీ ప్రశ్న!(4)

 

ఒక హాస్య కథ రాద్దామనుకుంటున్నా. మామూలు హాస్యం కాదు. కథ అయిపోయే సరికి నేల పాలయిన చెక్కలన్నీ ఏరుకుని, మీ పొట్టను మీరు మళ్లీ కుట్టుకోవాల్సి రావొచ్చు.

అసలు నవ్వొద్దని నొసలు ముడుచుకుని చదవడం మీ పొట్టలకు మంచిది.

నాకు మంచి కథ రాయడం రాదని ఎడిటర్ రంగా చెప్పారు. ఆ సంగతి నాక్కూడా తెలుసు అన్నాను. మరి రాస్తున్నావెందుకు అని ఎదురు ప్రశ్న వేశారు. ఏది మంచి కథో తెలియక, తెలుసుకుందామని రాస్తున్నానన్నాను.

ఈసారి ఆయన మాటలతో ఆపలేదు. ‘ఏది మంచి కథో తెలుసుకోడానికి చెత్త పోగేస్తావా, చంపేస్తా’నని చెయ్యెత్తారు. చేతిలో కోసుగా‍ పేపర్ కట్టర్ ఉంది. ఇది డిజిటల్ యుగం. మునుపు అంతా కత్తెర్లే. ఏ రోజు వచ్చిన పేపర్ల లోంచి ఆ రోజు కట్టింగ్స్ తీసి ఫైల్ చేయాలి. ఇక ఏ టాపిక్ మీద రాయాలంటే ఆ ఫైలు ముందేసుకుని చూసి రాయడమే. పత్రిక పని పెన్నులతో కాకుండా పేపర్ కట్టర్లతో మొదలయ్యేది.

ఎడిటర్ రంగా ఎడిటోరియల్ డిపార్ట్మెంటులో కాలు పెట్టింది ‘పేపర్ కటింగ్స్’ పనితోనే. ఆయనకు పెన్ను కన్న కట్టర్ వాడడమే బాగా తెలుసు. అది గుర్తొచ్చి, నేను కట్ చేయడానికి మార్క్ చేయబడిన న్యూస్ పేపర్ లా వణికిపోయాను.

నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఎట్టాగో కింది ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బయట పడ్డాను. ఆయనకూ, ఎవరికీ, ఆ మాటకొస్తే నాక్కూడా అడ్రసు తెలియని నా గదికి చేరుకున్నాగ్గాని, వూపిరి తీసుకోలేక పోయాను.

అప్పటికి వూపిరి తీసుకున్నాను గాని, ప్రాణాలు కుదుట పడ లేదు. అవి ఇంకా నా అర చేతిలోనే ఉన్నాయి. నేనొక మాలోకం. చేతి లోంచి వాటిని ఎక్కడ పారేస్తానో అని భయం. భయాన్ని తప్ప దేన్నైనా పారేసుకుంటాను నేను.

ఎడిటర్ రంగా వుద్దేశమేంటసలు? మంచి కథలు వచ్చేట్టు చూడాలనా? కాదనుకుంటా. ఆ పని పెద్ద ఎగ్జైటింగ్ గా ఉండదు. పోనీ, చెత్త కథలను, అవి తయారయ్యే చోటనే నరికెయ్యాలనా? అంతే అయ్యుంటుంది.

చెత్త కథకుల్ని చంపేస్తే చెత్త కథలు ఆగిపోతాయి. సింపుల్. గొప్ప విప్లవాత్మక భావన. ఒక చెత్త కథకున్ని ఖతం చేస్తే వూళ్లో ఉండే చెత్త కథకులందరూ వూరొదిలి పారిపోతారని థీరీ.

చెత్త కథకులు వూరొదిలి ఎక్కడికీ పోరు. కథల్ని కవితల్లోకి, వ్యాసాల్లోకి స్మగుల్ చేస్తారు. కనుక భూమ్మీద చెత్త కథల పునాదులనే పెకలించేయాలని ఇంకో థీరీ. ఒక చెత్త కథకు వ్యతిరేకంగా కాస్త-తక్కువ-చెత్త కథతో ఐక్యసంఘటన కట్టాలనేది వీళ్ల ముఖ్యమైన ఎత్తుగడ. చెత్త కథకులను కాదు చెత్త కథను నిర్మూలించాలి అని వీళ్ల స్లో-గన్. ఇది నాక్కొంచెం నచ్చేసింది. కథల్సంగతేమైనా, దీని ప్రకారం కథకుడు… అంటే నేను… సేఫ్ కదా.

ఎడిటర్ రంగాకి మాత్రం మొదటి థీరీనే నచ్చింది. ఐక్య అయినా ఇంకోటైనా కట్టడం కష్టం, cutటడం సులువు అంటాడాయన.

థీరీలదేముంది? ఎవరి థీరీ వాళ్లది. భగవంతుడి లాగ.

ఎడిటర్ రంగా కథక-శత్రు- నిర్మూలన సిద్ధాంతాన్ని ఇష్టపడితే, అది ఆయన ఇష్టం. దాన్ని నాతో మొదలెట్టాలనుకోడమే నా దురదదృష్టం.

దురదృష్టం కూడా అదృష్టమే. కనిపించదు. నేను దేన్నీ అదృష్టానికి వదిలేసే రకం కాదు.

జోతిష్యం మీద నమ్మకం లేక కాదు. జోతిష్యమంటే భయం.

నేను ఫలానా తేదీకి చచ్చిపోతానని ఎడిటర్ రంగానే ఇంతకుముందెప్పుడో చెప్పారు నాకు. ఆ మాట చెప్పినప్పుడు ఆయనొక సుప్రసిద్ధ దిన పత్రికలో భూత-సంపాదకీయాలు… అంటే ఘోస్ట్ ఎడిటోరియల్స్… రాస్తుండే వారు. భూతాలతో ఆయనకు అప్పుడే స్నేహం. జ్యోతిష్యం ఆయన హాబీ. వృత్తి, ప్రవృత్తి ఒకటయిపోయిన అద్భుత సందర్భం ఎడిటర్ రంగా.

ఆయన చెప్పిన, నా చావు తేదీ అయిపోయి ఐదేళ్లవుతోంది. ఇంగ్లీషు క్యాలెండరుతో, ప్రభవ విభవలతో, రంజాన్ నెలలతో… అన్ని విధాలుగా లెక్కలు వేసుకున్నాను. పాండవుల అజ్ఙాతవాసం అయిపోలేదని పొరపడిన దుర్యోధనుడి తప్పు నా నుంచి జరక్కుండా చూసుకున్నాను. ఓడిపోవడం మీద అంత షోకు ఉంటే, తరువాత్తరువాత యుద్ధంలో ఓడిపోవచ్చు. లెక్కలేసుకోడంలోనే ఓడిపోతే ఎలా?

అబ్బే, ఆ గండం గడిచి పోయింది. నేను వున్నాను. చనిపోకుండా వున్నాను. కొంచం కూడా చనిపోకుండా వున్నాను. తప్పిపోయిన నా మృత్యు ఘడియలకు, రంగాకు, ఆయన శిష్య కింకరులకు కనిపించకుండా జాగర్త పడుతున్నాను. కనిపిస్తే ఇంకా వున్నావెందుకని తిట్టి, ‘ఆల్మైటీ’ నవల్లో లాగ, వార్తను నిజం చేయడానికి, నన్ను చంపేస్తారని.

నాకేం, నా గది వుంది కదా, నాక్కూడా అడ్రసు తెలియనిది.

ముందుగా ముగింపు రాసేసి, ఆ తరువాత కథ రాయడం వంటిది జోతిష్యం. లేక జ్యోతిష్యం వంటిది కథ.

కథ చదివిన వాళ్లకు చివరికి మిగిలేది ముగింపే. పాఠకుడు చివరికంటా చదవకుండా మధ్యలోనే వదిలేస్తే ఏం మిగులుతుందని అడక్కూడదు. చదవాలంతే. మంచి పాఠకులకు ఇలాంటి షరతులు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చెబుతా, దీన్ని మీరు చివరికంటా చదివితే.

దేర్ఫోర్, మంచి లక్షణాలలో మొట్ట మొదటిది: ముందుగా రాసిన ముగింపు కోసం కథ నడవడం. కథ వంటి మహత్తర జీవికే అట్టాంటి షరతు వుంటే, నా వంటి అల్ప జీవి సంగతేంది? నేను చచ్చిపోవాల్సి వుండి చచ్చిపోకుండా వుండడం తప్పక నేరమే. జోతిష్య ప్రపంచం నన్నెలా క్షమిస్తుంది? ఈ అసంగతం ఎలా జరిగుంటుంది?

చిత్రగుప్తుని చిట్టాలో ఏదో గోల్‍మాల్ జరిగింది.

నా బదులు ఎవరు చచ్చిపోయారో ఏమో. నా వంటి ‘ఎనీ టైమ్ ఎనీ సెంటర్, రెడీ టు డై’ గాడు చావడం, ఓకే. కింకరుల తప్పిదం వల్ల నాకు బదులు యమపురి చేరిన అమాయకుడెవరో? చావంటే చచ్చేంత భయం వున్న వాడైతే, ఆ భయంతో చచ్చుంటే, ఆ హత్యా నేరం ఒకటా నా నెత్తిన?

తను చెప్పినట్టు కథలూ ఆపక, చావనూ చావక ఎడిటర్ రంగా మాట ఏదీ వినక ‘పాపం’ చేసింది నేను. నా పాపం తన పద్దులో పడి ఆ అమాయకుడు ఏ ఇనుప గోలెంలో సలసల కాగే నూనెలో వేగుతున్నాడో, పాపం.

‘కథంటే ఏమిట్రా నాయ్నా, అదేమైనా తినేదా ముడ్డి తుడుచుకునేదా, మీరైనా నన్ను తినే వుద్దేశమో తుడుచుకునే వుద్దేశమో లేకుండా ఇట్టా వేయించడమెందుకురా’ అని ఆ అమాయకుడు అరుస్తుంటాడు. ‘పశ్చాత్తాపం లేని పాపి’ అని యమ కింకరులకు మండిపోయి గోలెం కింద బర్నర్లు మరింత పెంచుతుంటారు. తను కథలు రాసేంత పాపిని కాదని చెప్పడానికి అతడు తల బయటికి పెడితే శూలాలతో పొడిచి గోలెం నూనేలోకి తోసేస్తూ వుంటారు.

చచ్చిపోవాల్సి వుండి కూడా, చచ్చిపోకుండా ఎందుకు వున్నాన్నేను? అది ఎందుకో తెలీదు గాని, సరిగ్గా అందుకే రాయకుండా వుండాల్సి వుండి రాస్తున్నానంటే ఎడిటర్ రంగా ఒప్పుకోడు.

ఎడిటర్ రంగా మీకు బాగా తెలుసో లేదో. మీకూ మరొకరికి తెలియకపోతేనేం. ఆయనొక జగమెరిగిన జర్నలిస్టు. తన ‘భూత’ కాలం తరువాత, కొన్ని శిష్య భూతాల్ని సంపాదించి, తను కూడా సంపాదకీయాలు రాయని సంపాదకుడయ్యాడు. చాల బిజీ. ‘ఇప్పుడు నిన్ను చంపే తీరిక లేదు నాకు. ఇంకొన్నాళ్లు వుండాలనుకుంటే వుండి చావు. అందాక రాయకుండా వుండి చావు’ అంటారాయన. ఉండకపోవడం, రాయకపోవడం రచయితకు ఒకటే కదా అని ఇంత చావు బతుకుల మధ్య నాకు తోచే మడత ప్రశ్న.

ఇట్టాంటి ప్రశ్నలు నాకు భలే తోస్తుంటా‍యి. అవి అలా తోస్తుండబట్టి నా బండి ముందుకు నడుస్తోంది. ఈ తోపుడు సంగతి మాత్రం ఆయనకు చెప్పలేదు.

మన లోకం లోనే కాదు, ముక్కోటి లోకాల్లో పలుకుబడి గల పాత్రికేయుడాయన. నేరుగా యమలోకం వెళ్లి, అక్కడ ఇంకేదో ప్రెస్ కాన్ఫరెన్సు జరుగుతుండగా మధ్యలో లేచి, చిత్ర గుప్తుని మీద అవినీతి ఆరోపణలు చేసి, దానికి తన వద్ద చాల రుజువులున్నాయని ఉద్ఘాటించి, తిరిగొచ్చి తన పనులు తాను చూసుకుంటూ కూర్చుంటే చాలు. వాటికి రుజువులు ‘చూపమని’ ఎవరూ అడగరు. రుజువులు వున్నాయని గట్టిగా అంటే చాలు.

ఇంకేం. అన్ని లోకాల్లో అన్ని ఛానల్లు, అంతటి ఆసక్తి కర కర కర కబురు మరొకటి దొరికే వరకు, దాన్నే చెబుతుంటాయి, వత్తులు పలక్కూడదని యాంకర్లకు జాగ్రత్తలు జారీ చేసి.

వార్తను పదే పదే చెప్పడం వాళ్లకు విసుగనిపిస్తే (శ్రోతలకు కాదు, ఛానెళ్లకు) ప్యానెల్‍ చర్చలు పెట్టి ‘యమలోకంలో అవినీతి’ అంటూ ఒకరు చెప్పేది మరొకరు వినకుండా, మరెవర్నీ విననీయకుండా చర్చలు అరిపిస్తారు. ఆ మద్యలో, ఏలిన వారు నా సంగతి చూడక పోవడంలో అవినీతి వుండొచ్చని ఎవరో అనుకుంటున్నట్టు ఎడిటర్ రంగా తన పత్రికలో చిన్న సింగిల్ కాలమ్ వార్త వేసేస్తే చాలు. మన పని మటాష్.

కథా సాహిత్యం పాడైపోకుండా చూడాలని ఆయనకు అంత పట్టుదల. చాల సామాజిక స్పృహ కల్గిన నిబద్దుడాయన. నిబద్ధత, సామాజిక స్పృహల మీద అయన ప్రసంగాలు విని చాల సార్లు కోల్పోయిన స్పృహ వుంది నాకు. ఆ సంగతి ఆయనకు ఎప్పుడూ చెప్పలేదు, నా స్పృహలో నేను వుండటం వల్ల.

ఆయనకు మరొక విషయం కూడా చెప్పలేదు. కథా సాహిత్యం మీద ఆయన రాసిన విమర్శ వ్యాసాలు, సమీక్షల పుస్తకాలు చదివాన్నేను. ఆయన మెచ్చుకున్న కథలు కథా సాహిత్య నికషోపలా‍లు అనే సంగతి ఆయన చెప్పడం వల్లనే నాకు తెలిసింది. మళ్లీ ఆ కథలను చదివితే తెలీ లేదు, అదేంటో.

ఆయన మెచ్చిన కథల కోసం వెదుకుతూ ఇంకేవో కథలు చదివాను. అందులో బాగున్నవన్నీ ఎడిటర్ రంగా మెచ్చికోల్ దెబ్బల నుంచి తప్పించుకోవడం గొప్ప ఫీటు. ఎడిటర్ రంగా పత్రిక(ల)లో గాని, ఆయన మెచ్చుకోలు జాబితాల్లో గాని ఎక్కడా ఆ కథలు చిక్కవు, దొరకవు.

పాపం ఈ ప్రివిలేజ్ కోసం ఆ కథలు పడే పాట్లు చూస్తే జాలేస్తుంది.ఆలాంటి ఒక కథ మధ్యలో ఒక పాత్ర ఒళ్లు మరిచి నేను పేద వాడిని, కాని మంచి వాడిని కాను అంటుంది. మంచి వా‍డిని కాకపోవడం వల్లనే ఇంకా బతికున్నానని కూడా అంటుంది. రంగా స్పృహలో వున్న వాళ్ళకు వళ్లు మండుతుంది. రూలు ప్రకారం పేదవాళ్లు ఆటొమాటిక్‍గా మంచి వాళ్లై వుండాలి. అది కథా నీతి. ఆ నీతి తప్పిన పాత్రను రచయిత అదేదో తన సొంత బిడ్డ అయినట్లు సానుభూతితో రాస్తాడు.

ఇంకో పాత్ర తానొక మహోద్యమం మధ్యలో ఒకమ్మాయిని చూసి మోహపడిన సంగతిని వైన వైనాలుగా వర్ణిస్తుంది. ఒకసారి ఆమెను ముట్టుకున్నానని, ఆ స్పర్శ కోసం చచ్చినా ఫర్లేదనిపించిందని తెగ మురిసిపోతుంది.

మరో కథలో రైతు పాత్ర తన ఆత్మహత్య లేఖలో వ్యవసాయం గురించి ఒక్క ముక్క కూడా లేకుండా జాగర్త పడుతుంది. రైతు ఆత్మహత్యల లెక్కల్లోంచి కొన్ని అంకెలను తగ్గించే దారుణానికి ఒడిగడుతుంది.

మంచి కథలో, రచయిత తనకు తెలిసిన సంగతులు చెప్పకూడదు. చెబితే నోస్టాల్జియా అవుతుంది. తెలియనివి చెప్పాలి. దాన్ని మేజికల్ రియలిజం అంటారు. ముల్లు గుచ్చుకుంటే ఎలా‍ వుంటుందో చెప్పాలంటే రచయితకు ఎప్పుడూ ముల్లు గుచ్చుకోకపొయ్యుండాలి. తను ఎప్పుడూ అడపిల్లగా వుండని వాడే ఆడపిల్లగా కథ రాయాలి. పరకాయ ప్రవేశం అంటారు దాన్ని. అబ్బాయి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమ్మాయికి ఎలా ఉంటుందో మగ రచయిత చెప్పాలి. అబ్బాయికి ఎలా వుంటుందో ఆడ రచయిత చెప్పొచ్చు, కావాలంటే.

తనకు నిజంగా తెలిసింది రచయిత ఎప్పుడూ చెప్ప గూడదు.

ఇలా ఎడిటర్ రంగా విమర్శలు చదివి ఎంత జ్ఙానినయ్యానో ఆయనకు చెప్పాలని అనిపించింది. మొదటికి మోసమని, వూరుకున్నాను. ఆయన మనం చెప్పింది చెప్పినట్లు వినడు. మాటల మధ్య పేపర్ కట్టర్ పెట్టి కెలుకుతాడు.

చెప్పకుండా వూరుకోడం చాల కష్టంగా వుంటుంది. నోట్లో అల్సర్ బాధ పెడుతున్నట్టు పెదిమలు గట్టిగా బిగించుకోవాలి. అది అల్సర్ కాదని అనుమానం రాకుండా, ఆయన చూస్తుండగా నోట్లో వేలు పెట్టుకుని పెదిమల లోపల మసాజ్‍ చేసుకోవాలి. ఆయన చెప్పే హోమియోర్వేదం మందుల పేర్లు శ్రద్ధగా రాసుకోవాలి, ఇంకేవీ రాసి లేని కాగితం మీద, తరువాత చించేయడానికి వీలుగా.

అందుకని నేను నా గదిలోనే వుండిపోయాను, నాక్కూడా అడ్రసు తెలియని గదిలో. మరేం భయం లేదు. ప్రాణాలు అరచేతిలోనే ఉన్నాయి. వాటిని ఇంకా పారేసుకోలేదు. నేను కూడా మొండోన్నే, జ్యోతిష్యాన్ని అంత వీజీగా గెలవనిస్తానా?

మామూలుగానైతే నేను ఏ బ్రాందీ షాపు ముందు రోడ్డు మీద ఎన్నో ప్లాస్టిక్ గ్లాసు ఎన్నో గుటకలో సులభంగా దొరుకుతానో ఎడిటర్ రంగాకు తెలుసు. అక్కడెక్కడా వుండకుండా వుండడం కష్టంగా వుంది. రాయకుండా వుండడం ఇంకో కష్టం. ఎప్పుడో దొరికిపోతాను. ఎడిటర్ రంగా జోతిష్యం నిజం కాక తప్పదు. ఓ పదిరవయ్ ముప్పయ్యేళ్లు అటు ఇటుగా.

అదండీ కత. నవ్వకం కుదరకపోతే కొంచెం తవ్వకమైనా కుదుర్తుందేమో చూడండి. మనం మొదట అనుకున్నట్టు మీరు నవ్వకుండా జాగర్తగా వున్నారు కదా? మీకు ఆ కష్టం కలక్కుండా చూడడా‍నికి నా వంతు పని నేను చేశానని చిన్న తృప్తి చివరాకరికి.
సెప్టెంబర్ 2016, చినుకు

Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment

పలు ప్రశ్నలు, ఒక జవాబు….?

స్మృతి 25

 

డివి గ్రూపు నాయకుడు మండ్ల సుబ్బారెడ్డి మా వూరు రావడం మా పోస్టల్ వుత్తరం చూసి మాత్రమే కాదు

ఆయనకు మా వూరు అంతకు ముందే పరిచయం.

మండ్ల సుబ్బా రెడ్డి వాళ్ళ వూరి పేరు వెల్గోడు. చండ్ర పుల్లా రెడ్డి వూరు కూడా అదే. ఇద్దరూ మొదటి నుంచీ కమ్యూనిస్టులు. కలిసి పని చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచి సహచరులు.

నేను పుట్టిన సంవత్సరం, 1951 లో, మా అమ్మ, వాళ్ళ వూరికి దగ్గరగా వున్న గడివేములలో బంధువుల ఇంట్లో వుందట. అప్పుడు కమ్యూనిస్టుల దాడులు జరుగుతున్నాయని, వాళ్లు దుర్మార్గులని, రైతుల ఇండ్ల మీద పడుతున్నారని బాగా ప్రచారంలో వుండడం వల్ల నిండు గర్భుణిగా వున్న మా అమ్మ, గడివేములలో బంధువుల ఇంట్లో తలదాచుకుందట. తను ఆ వూళ్లో వున్నప్పుడే, ఒక రాత్రి కమ్యూనిస్టులు గడివేముల పోలీసు స్టేషన్ మీద దాడి చేసి, తుపాకులు ఎత్తుకుపోయారని అమ్మ చెప్పేది.

ఆ సంఘటన నిజమే. అందులో ప్రాణ నష్టం కూడా జరిగింది. క్రాస్ ఫైర్ లో తెలియక చీకట్లో ఇంటి బయటికి వచ్చిన ఒక పెద్దావిడ చనిపోయిందట. దాని వల్ల కమ్యూనిస్టులు దుర్మార్గులనే ప్రచారం మరింత ఎక్కువయ్యుంటుంది.

తెలంగాణ సాయుధ పోరాటం చివర్లో, నిర్బంధం రీత్యా, పోరాటాన్ని నల్లమల ఆడవులకు విస్తరించే క్రమంలో జరిగిన దాడి అది. ఆ దాడికి నాయకత్వం వహించింది చండ్ర పుల్లా రెడ్డి. దానిలో మండ్ల సుబ్బా రెడ్డి కూడ వున్నారని చెప్పగా విన్నాను. ఆ తరువాత కూడా పుల్లా రెడ్డి, ఈయన మంచి సహచరులే. ఇద్దరూ కాస్త బంధువులు కూడా. సిపిఎం ‘శాంతి’ దినాలలో వెల్గోడు గ్రామ రాజకీయాలలో కలిసి పని చేశారు. బహుశా, నేను మొదటి సారి ఎర్ర జెండా పట్టుకుని కమ్యూనిస్టు పార్టికి ఓటు వేయాలంటూ పాల్గొన్న మా వూరి వూరేగింపులో సుబ్బా రెడ్డి వుండి వుంటారు. అప్పటికి నేను ఎలిమెంటరీ స్కూలు. లీలా మాత్ర జ్ఞాపకం.

అంత పాత స్నేహితులు తానూ, సీపీ. తరువాత వేరు గ్రూపులుగా చీలిపోయారు.
మండ్ల సుబ్బా రెడ్డి మా వూరికి వచ్చి మూడు రోజులున్నారు. మూడు రోజులూ ఏక బిగిన క్లాసులు. మేము సుమారు పదిహేను మందిమి చాల శ్రద్ధగా ఆయన మాటలు విన్నాం. అప్పటికి ఒకటి రెండేండ్ల ముందే డివి, టిఎన్, సిపి ల నాయకత్వంలోని ఎపిసిసిఆర్ (ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీస్) రెండుగా విడిపోయింది. (నేను కమిటీ పేరును కాస్త అటు ఇటుగా రాసి వుండొచ్చు). మండ్ల సుబ్బారెడ్డి మూడు రోజుల క్లాసులో అధిక భాగం ఆ కమిటీ చీలిక ఎలా జరిగింది, అందులో సిపి పాత్ర ఏమిటి అనే దాని మీదనే నడిచింది.

కమిటీ రెండుగా విడిపోవడంలో చండ్ర పుల్లా రెడ్డి పాత్ర కుట్ర పూరితమైనదని, కామ్రేడ్ రాధమ్మ తో ఆయన సంబంధాన్ని ప్రశ్నించినందుకే, దానికి జవాబు చెప్పలేక సీపీ పార్టీని చీల్చాడని సుబ్బారెడ్డి అన్నారు. ఇలాంటి నీతి సంబంధ వ్యవహారాలలో సీపీ నాయకత్వంలోని కామ్రేడ్లు చాల మంది ఆ బాటలోనే వున్నారని విమర్శగా చెప్పారు. దానికి ఇచ్చిన ఉదాహరణలతో… నా మానసిక మైదానానికి సంబంధించినంత వరకు… మండ్ల సుబ్బా రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.

ఆయన ఇచ్చిన ఉదాహరణల్లో ఒకటి వేంపెంట నెమలి చంద్ర శేఖర రెడ్డి అనే యువ కామ్రేడుకు సంబంధించినది. తను నా వయసు వాడు. గన్నవరంలో చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి వేశ్యా గృహానికి వెళ్ళాడు. అక్కడ తనతో వున్న అమ్మాయి ఆ వృత్తిలో ఎందుకు వున్నదని ఆమెతో చర్చ మొదలెట్టాడు. నిస్సహాయత కారణంగానే ఆమె అందులో వున్నట్లు గుర్తించి, తాను పెళ్లి చేసుకుంటానని, బయటికి వచ్చేస్తావా అని అడిగాడు. ఆమె సరేనంది. ఆమెను పెళ్లి చేసుకుని, వూరికి, తన ఇంటికి తెచ్చాడు. ఆ అమ్మాయి ఏ ఆర్నెళ్లో. ఏడాదో వుండి, ఈ జీవితం నచ్చక వెనక్కి వెళ్లిపోయింది.

అది నెమలి చంద్ర శేఖర రెడ్డి లాంటి వాళ్లు వున్న పార్టీ, స్త్రీ పురుష సంబంధాల విషయంలో వాళ్లు లూజు అన్నట్లు మండ్ల సుబ్బా రెడ్డి క్లాసులో మాట్లాడారు. నాకిది ఏమాత్రం కొరుకుడు పడలేదు.

సొంత ఇళ్లు, వూళ్లు వదిలిపెట్టి అడవులు పట్టిన ఇద్దరు స్త్రీ పురుషులు… సీ పీ రాధమ్మ… ఒకరంటే ఒకరికి ఇష్టమై… కలిసి బతకాలని నిర్ణయించుకుంటే అదేం తప్పో నాకు తోచ లేదు. వాళ్ళకు అప్పటికే పెళ్లిళ్లు అయ్యుండొచ్చు గాక. ఆ పెళ్లి-ఇళ్లలో ఇప్పుడు వాళ్ళు లేరు. చిరకాలంగా లేరు. వాళ్లు ఎంచుకున్న అడివి జీవితం ప్రకారం, ఇక వాళ్ళు ఆ పెళ్లిళ్లలో వుండే అవకాశం లేదు. అలాంటప్పుడు ఇద్దరు కలిసి బతికితే, పెళ్లి లేదా పెళ్లి లాంటిది చేసుకుంటే ఏం తప్పు? అలాంటి ఇస్యూ మీద పట్టు పట్టి ఒక ప్రజల పార్టీని చీల్చే దాక వెళ్తారా… అనేది నన్ను సుబ్బారెడ్ది పట్ల రెపెల్ చేసిన ఆలోచన. (ఆ ఒక్క పాయింటు మీదే పార్టీ చీల లేదనేది నిజమే. రాజకీయాంశాలు ముఖ్యం. అవి తరువాత మాట్లాడుకుందాం.)

చంద్ర శేఖర రెడ్డి వేశ్యా వృత్తిలో వున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆమెను ఎక్కడో దాపున వుంచకుండా తన ఇంటికి భార్యగా తీసుకు రావడం… అది అసలు తప్పు కాకపోగా, గొప్ప కూడా. మరి ఈయనేమిటి అది మహా నేరమైనట్టు మాట్లాడతారు అని కూడా నేను ప్రశ్నించాను. అది మా మొదటి పరిచయం కనుక మరీ గట్టిగా ప్రశ్నించినట్టు లేను. జవాబుగా ఆయన ఏం చెప్పారో గుర్తు లేదు. అది కాకుండా చంద్రశేఖర రెడ్డి గురించి తెలిసిన మరి కొన్ని విషయాలు కూడా నన్ను తనకూ, ఆ పార్టీకి చేరువ చేశాయి.

చంద్ర శేఖర రెడ్డి వాళ్ళ నాన్న పేరు నెమలి వెంకట రెడ్డి. వెంకట రెడ్డి యవ్వన కాలం నుంచీ వేంపెంట కమ్యూనిస్టు గ్రామం. వెంకట రెడ్డి, ఆ వూళ్లో ఇంకా చాల మంది సిపిఎం పార్టీతో వుండేవారు. ఆ వూళ్లో ప్రజలకు సంబంధించి ఏదో సమస్య వచ్చింది. అందులో వెంకట్రెడ్డి మరి కొందరు రైతులు ఒక పక్షం అయ్యారు. సిపిఎం పార్టీ నాయకత్వం పెద్దవారితోనే వుంది. కొందరు ఎపి సి సిఆర్… అంటే సిపి గ్రూపు విప్లవ రాజకీయాలతో ప్రభావితులై ఇంకో పక్షం వహించారు.

చంద్ర శేఖర రెడ్డి తదితర యువకులు విప్లవ రాజకీయాల వైపు నిలబడ్డారు. పోరాటం మిలిటెంటు రూపం ధరించే దాక వెళ్లింది. చంద్రశేఖర రెడ్డి వాళ్లు… ‘శివ’ సినిమా రావడానికి బాగా ముందే ఆ సినిమా సీన్లను కాపీ కొట్టి… సైకిల్ ఛైన్లు అవీ సేకరించి ఇళ్లలో వుంచడం మొదలెట్టారు. సైకిల్ ఛైన్లు నాన్న లకు తెలిసేలా ఇళ్ళలో వుంచడమంటే… కౌటుంబికంగా.. ఓపెన్ రెబెల్లియన్ ప్రకటించడమే. తాము ధర్మం అనుకునే వాటి కోసం తండ్రుల మీద యుద్ధానికి సిద్ధమని ప్రకటించడమే.

ఇవన్నీ నన్ను చంద్ర శేఖర రెడ్డి వైపు, సీపీ వైపు, సీపీ గ్రూపు రాజకీయాల వైపు ఆలోచింప జేశాయి. పార్టీలో క్రియా శీలుడిని అయిన తరువాత చంద్రశేఖర రెడ్డి, నేను మరింత దగ్గర అయ్యాం. సహచరులు మమ్మల్ని కృష్ణార్జునులు అని అనే వారు. మా మధ్య అలాంటి స్నేహ సంబంధం ఏర్పడింది. శేఖర్ గురించి మరి చాల విషయాలు చెప్పాలి మీకు.

నా పెళ్లి రోజు నా జేబులో 40 రూపాయలు వుండినయ్. పొద్దున్నే అవి కాస్తా పోయినయ్. కామ్రేడ్స్ కు అది చెప్పాను, నవ్వుతూ. చంద్రశేఖర రెడ్డి. “హేయ్, పెండ్లి కొడుకు అలా వట్టి జేబుతో వుండ గూడదు. జయమ్మ వాళ్ళ నాన్న నీకు కట్నమియ్యలేదు గదా. ఇదిగో నేనిస్తున్నా” అని వంద రూపాయలు కాగితం నా షర్టు జేబులో కుక్కాడు. “అయితే ఇక నువ్వు నాకు మామవు” అనేశాన్నేను. ఆ మరుసటి రోజు నుంచి జయ తనను చిన్నాన్న అని పిలవడం మొదలెట్టింది. తను నా కన్న ఒక ఏడాది చిన్న. ఇప్పటికీ తనను నేను మామ అనే పిలుస్తాను. జయ చిన్నాన్న అనే పిలుస్తుంది.

రెండు తరాల కమ్యూనిస్టు గ్రామం, వేంపెంట… తరువాత కాలంలో మరో విధంగా నొటోరియస్ కావడం పెను విషాదం. ఆ వూరి మీద పట్టు కోసం రెండు విప్లవ గ్రూపుల మధ్య సాగిన వైరం దానికి ప్రధాన కారణమనిపిస్తుంది. మన దేశంలో కులాల ప్రమేయం లేకుండా దేన్నీ సరిగ్గా వివరించలేం. వేంపెంటలో రెండు పార్టీల మధ్య పోటీని కేవలం కుల వివాదంగా చిత్రించారు. ప్రజల మధ్య వచ్చిన తగాదాలను శత్రు వైరుధ్యంగా పరిగణించి చేపట్టిన చర్యలు వేంపెంటను మరెప్పటికీ కోలుకోలేని స్ఠితికి తీసుకెళ్ళాయి.

వేంపెంట పక్కన ఒక పెద్ద వాగు ప్రవహిస్తుంది. దాని మీద కట్టిన బ్రిడ్జి మీదుగానే గ్రామంలోనికి వెళ్ళాల్సి వుంటుంది. ఆ వాగు పేరు నిప్పుల వాగు. విరసం సభ్యుడు పినాక పాణి… వేంపెంట ఘటనలపై… ‘నిప్పుల వాగు’ పేరుతో… ఒక నవల రాశారు. దానిలో మంచివి కాని పాత్రలకు రెడ్డి పేరు పెట్టడం ద్వారా… పాణి ఆ వూరి సమస్యను రెడ్లు- దళితుల సమస్యగా స్ఫురింపించారు. ఆ రెడ్ల నాయకుడిగానో, రెడ్డి నాయకులలో ఒకరుగానో (మరో పేరుతో) చంద్ర శేఖర రెడ్డి పాత్ర వుంటుంది.

ఈ ఘటనల తరువాత చాన్నాళ్ళకు నేను వేంపెంట వెళ్ళాను. చంద్ర శేఖర రెడ్ది ఇప్పటికి నాకు ప్రాణ స్నేహితుడే. తానేమైనా తప్పు చేసి వుంటే, అవి క్షంతవ్యాలే గాని, తల గొట్టి మొలేయాల్సినవి కావు. తన అతిధిగానే నేను వేంపెంట వెళ్ళాను. ఉళ్లో వుండగా ఒకరిద్దరు పాత మిత్రులను కలిసి అసలేం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నించాను. ఎవరితో మాట్లాడినా వారి మాటల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఉళ్లో మునుపటి కలివిడి తనం, భేఫికర్ తనం లేదు.

నేను మాట్లాడిన వారిలో ఒకరు చంద్ర శేఖర రెడ్డి కి చిన్నాన్న. పేరు శివా రెడ్డి. ఆయన ఒక కాలు బాగా కుంటుతూ, ఊతంగా కర్ర పట్టుకుని వచ్చారు, మేము వున్న చోటికి. ముసలి వాడు కాదాయన. మధ్య వయస్కుడు. గతంలో, ఎమర్జెన్సీకి ముందు… పూర్తి ఆరోగ్యంగా చూసి వుండడం వల్ల ఏమైంది అని ఆందోళనగా అడిగాను ఆయన్ని. ఆయన నవ్వి వూరుకున్నారు. తరువాత చెప్పారు.

ఒక విప్లవ గ్రూపు సాయుధ దళం… వేంపెంట ఘటనలపై… దగ్గరి అడివిలో పంచాయతీ నిర్వహించింది. తగాదాలో వున్న ఇరువాగుల వారినీ సామరస్య సాధనకని పిలిపించింది. దళ సభ్యులు సాయుధులుగానే వచ్చి కూర్చున్నారు. ఇరు వాగుల వారు…అంటే, దళ సభ్యులు ఎవరిని ఆర్గనైజ్ చేస్తూ వుండినారో వాళ్లు, వాళ్ళకు ఎవరి మీద ఫిర్యాదులున్నాయో వారు… తమ వాదాలు వినిపించారు. దళ సభ్యులు తీర్పు చెప్పారు. దళం వాళ్లు అవతలి పక్షం వారిది తప్పు అని తేల్చారు. అవతలి వాళ్లు దానికి సరే నన్నారు.

దళం వాళ్ళు ఆ వెంటనే శిక్షలు కూడా చెప్పేశారు. చెప్పడమే కాదు. శిక్షలని అమలు చేయడం కూడా మొదలెట్టారు. శిక్షలో భాగంగా కొందరిని అక్కడి నుంచి కాస్త దూరం తీసుకెళ్లి కొట్టారు. మరి కొందరిని… అలాగే దూరం తీసుకెళ్లి… కూర్చోబెట్టి, రెండు వరుస రాళ్ల మీదుగా వారి కాళ్ళను చాపి వుంచి, రెండు రాళ్ల మధ్య కాళ్ల మీద కోసు రాయితో కొట్టి, కాళ్లు విరగ్గొట్టారు. దళం వాళ్ళు అమలు జరిపిన ఈ శిక్షకు గురైన వారిలో చంద్ర శేఖర రెడ్డి చిన్నాన్న శివా రెడ్డి ఒకరు. ఆయన కాలు విరిగింది ఆ విధంగానే. అప్పటి నుంచి ఆయన కుంటి వాడయ్యాడు. శిక్షలు అమలు జరుగుతున్నప్పుడు దూరం నుంచి వినిపించే కేకలను తాము ఎలా విన్నామో కూడా శివా రెడ్డి చెప్పారు.

ఇంతకూ పంచాయతీలో తప్పెవరిదని తాము అనుకుంటున్నారని… నేను ఆరా తీయబోయాను. శివారెడ్డి ఇప్పుడా సంగతులు ఎందుకులే, ఇక మరిచిపోయి కలిసి బతుకున్నాం అని మాత్రమే చెప్పారు. వివరాల్లోకి వెళ్తే అంతా చాల కాంప్లికేటెడ్ గా వుంటుందని కూడా చెప్పారు. తమ తప్పు అసలేమీ లేదని ఆయన అనలేదు. నేను చంద్ర శేఖర రెడ్డితో కలిసి వూళ్లోకి వెళ్లి చాల మంది దళిత మిత్రులతో మాట్లాడాను. రాత్రి చాల సేపటి వరకు దళితుల ఇళ్ళ వద్దనే గడిపాం. తమాషా ఏమిటంటే వూళ్లో వాళ్ళ మధ్య శత్రు వైరుధ్యం లేదు. అందరిలో ఒక రిగ్రెట్ వుంది.

చంద్ర శేఖర రెడ్డి ఇప్పటికీ… నా స్నేహితుడే. పినాక పాణి మంచి మిత్రుడే. ఉళ్లో వున్నది రెడ్ది-దళిత వైరుధ్యం కాదు. సో కాల్డ్ అగ్ర వర్ణ నిమ్న వర్ణ వైరుధ్యం కూడా కాదు. రెండు లేదా కొన్ని రాజకీయ పార్టీల మధ్య ప్రయోజనాల వైరుధ్యమది. నేను తనను తిరిగి కలిసే సమయానికి, చంద్ర శేఖర రెడ్డి సిపి గ్రూపు తో లేడు. బహుశా, కొంత కాలం పాలక వర్గ పార్టీలతో రాసుకు తిరిగినట్టున్నాడు. ఆ పని ఎదిరి పక్షం వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. పినాక పాణి తన నవలలో ఒకరి పనులకు మరొకరి పేరు పెట్టడం ద్వారా… అది రెడ్డి- దళిత వైరుధ్యం ఎఫెక్ట్ తెచ్చారు.

భుజాన తుపాకులున్న ‘పంచాయతీ పెద్దల’ ఇన్ స్టాంట్ తీర్పులతో జనాల కాళ్ళు విరగ్గొట్టే అడివి న్యాయం ఏ విధంగా ప్రజాస్వామిక చర్చకు ప్రోది చేస్తుందో చెప్పాలని… మిత్రులను కోరుతూ.. పినాక పాణి ఎడిట్ చేసినదే… ‘ప్రజాస్వామ్యం కోసం చర్చ’ అనే పత్రిక/బులెటిన్ లో నేనొక వ్యాసం రాశాను. నాకు తెలిసినంత వరకు అందులో మూల ప్రశ్నకు…. అంటే, అలా తీర్పులు ఇచ్చి, అమలు చేయడం న్యాయం కాదనే విమర్శకు…. మాత్రం ఇప్పటి వరకు నన్నెవరూ కోప్పడినట్టు లేదు.

మా వూరిలో మండ్ల సుబ్బా రెడ్డి క్లాసు సమయానికి చంద్ర శేఖర రెడ్డి తన పిత్రు-వ్యతిరేక తిరుగుబాటును కొనసాగిస్తూ సిపి గ్రూపులో వున్నాడు. వాళ్ళ నాన్న వెంకట రెడ్డి సిపిఎం లో వున్నారు. ఆ దృశ్యం దానికది గొప్పగా, సింబాలిక్ గా వుండింది అప్పుడు. మండ్ల సుబ్బా రెడ్డి నుంచి ఆ కథలు వినే సరికి…. నిజం చెప్పాలంటే, సుబ్బా రెడ్డి మా వూరు నుంచి వెళ్లి పోయేప్పటికే… నా బుర్రలో నిర్ణయాలు జరిగిపోయాయి. దానికి అసలు కారణం ఆయన చెప్పిన ‘కథలు’ మాత్రమే కాదు. రెండు గ్రూపుల మధ్య రాజకీయ విభేదాలున్నాయి.

నా మనస్సులో అప్పటికప్పుడు నిర్ణయాత్మక పాత్ర వహించిన అంశమేమిటో మీరు సులభంగా వూహించొచ్చు. మేము ఇక ముందేం చేయాలి అనే ప్రశ్నకు జవాబు కోసమే మండ్ల సుబ్బా రెడ్డిని మా వూరికి పిలిపించుకున్నాం. మూడు రోజుల పాటు ఆయన చేప్పేదంతా శ్రద్ధగా విని, “ఇవన్నీ సరే కామ్రేడ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఎలా విప్లవం చేద్దాం. నాకు తక్షణం ఏమి కార్యక్రమం ఇస్తారు” అని అడిగాన్నేను. వెంటనే చేయాల్సిన పని ఏమీ ఆయన చెప్పలేదు. మూడు రోజుల క్లాసు అసంతృప్తిగా ముగిసింది.

తరువాత కబురంపి పిలిపించుకున్న వ్యక్తి గంగిరెడ్డి వెంకట కొండా రెడ్డి. తనది కోవెల కుంట్ల దగ్గర కాశి పురం అనే వూరు. ఆయన రాసిన నాటకం ‘నాంది’ రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి వారిచే ఎంపిక చేయబడి, మన్ననలందుకున్న విరసం ప్రచురణ. ఆయన మా వూరికి వచ్చి మాతో మాట్లాడింది ఒకే ఒక్క రోజు. ఆయన మాటల్లో మాకు బాగా నచ్చింది: ఆ తక్షణత్వమే. ఆయన చెప్పిన వాటిలో… ఎప్పుడో కాదు ఇప్పటి నుంచే సాయుధ పోరాటం… అనే మాట నాకు భలే నచ్చింది. చివరికి ఆయన్ని కూడా అడిగాను. “ఇప్పటికిపుడు మనం ఏంచేయాలి? తక్షణం చేయాల్సిన పని ఏమిటి?”

మా వూరికి కాస్త దూరంలో వున్న ఉప్పల పాడు అనే వూరిలో స్వామి రెడ్డి అనే భూస్వామి అక్రమ స్వాధీనంలో వున్న తొంభై ఎకరాల భూమిని ఆ వూరి భూమి లేని దళితులు అక్రమించి దున్నుకున్నారు. వాళ్ళ మీద దాడులు, పోలీసు కేసులు… ఇంకా జరుగుతున్నాయి. “అవి చూద్దాం పద. పార్టీ కార్య కర్తలకు చాల పని వుంది” అన్నారు గంగిరెడ్డి.

నా పలు ప్రశ్నలకు ఒక జవాబు దొరికింది. చాల సూటి జవాబు. నాకు నచ్చిన జవాబు. పలు కోణాలలో నాకు అనువుగా కనిపించిన జవాబు.

ఇంకేం. నేను కాలేజీకి వెళ్లినప్పుడంతా వుపయోగించే చిన్న లెదర్ కేసులో బట్టలు సర్దుకుని, ఆ సాయంత్రం గంగి రెడ్డి వెంట పార్టీ పనికి బయల్దేరాను.

తరువాత్తరువాత మా వూరికి అసలే వెళ్ళలేదని కాదు గాని, ఎప్పుడు వెళ్లినా ఒకటి రెండు రోజులకు మించి వూళ్లో లేను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను మా వూరికి పూర్తిగా దూరమయిపోయాను. రెక్కలొచ్చిన పక్షి గూడు వదిలి వెళ్లి నట్టు, ఆకాశమే వూరైపోయింది. రెక్కలు మంచివేనా? మంచివే. రెక్కలు కావాలంటే వేర్లు వదులు కోవాలేమో! చెట్టూ, పక్షి రెండూ నేనే కావాలంటే, అందరికీ కుదరదు కదా!

(వచ్చేవారం రాజకీయ ఆరంగేట్రం)
24-8-2016

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

ఔనది నిజంగా విప్లవాల యుగమే

స్మృతి 27

అప్పుడు జాతులు విముక్తిని, దేశాలు స్వాతంత్ర్యాన్ని, ప్రజలు విప్లవాల్ని కోరుకున్నారనే మాట నిజమే. అది నిజం కాకపోతే, కార్యదక్షత అనే పదానికి తగిన లక్షణాలేమీ లేని నేను ఏమేమో చేసి, ఓహో అనిపించుకోడం, నేనూ కొన్ని పనులు చేయగలనోచ్చి అనిపించుకోడం కుదిరేది కాదు.

అప్పటికి కర్నూలు జిల్లాలో విప్లవ విద్యార్థి వుద్యమం అంటూ ఏమీ లేదు. పి డి ఎస్ యూ అని ఒకటుందనిపించడం, కర్నూలు పట్టణంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం… అది విప్లవాల యుగం కాకపోతే, ఇంకెవరి సంగతేమో గాని, నాకు…. సాధ్యమయ్యేది కాదు.

మనుషులు తమకు తాము తయారవుతారనేది నిజం కాదు. మనుషులను స్థల, కాలాలు తయారు చేస్తాయి.

నేను పిడి ఎస్ యూ వుత్పత్తి అనుకుంటారు, నా మిత్రులు చాల మంది. అలా అనుకోడం నిష్కారణం కాదు.

ఇప్పుడు కాదు గాని ఒకప్పుడు పిడి ఎస్ యు (ప్రొగ్రెసివ్ డెమొక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్) అనే పదం నా నుంచి చాల ఎక్కువగా విన్పించేది.

మొదట్లో నాకు చేరువ అయిన కవి మిత్రులు దాదాపు అందరూ పిడి ఎస్ యూ కు చెందిన వారే. గుడిహాళం రఘునాధం, నందిని సిధా రెడ్డి, సుంకి రెడ్డి నారాయణ రెడ్ది నుంచి విమలక్క, ముత్యం, లక్నా రెడ్డి, నారాయణ స్వామి, సుధాకిరణ్, ఎన్ తిర్మల్, రోషన్ షుకూర్ వరకు… అందరూ నాకు మొదట పరిచయమయ్యింది పిడి ఎస్ యూ వాళ్లుగానే. తరువాతే వాళ్ళు రచయితలుగా తెలిశారు. నందిని సిధా రెడ్డి ‘బటువు దొరింది’ కథను, ‘నూతన’లో చూసి, భలే అనుకున్నాను. తను పిడి ఎస్ యూ అని తెలిసి మరింత సంతోషపడ్డాను.

కర్నూలు జిల్లా వుద్యమ పథంలో, నేను మొదట చేపట్టింది పిడి ఎస్ యూ పని. నేరుగా వెళ్లి ఒక వుద్యమం నిర్మించాలనుకోడం, నిస్సందేహంగా ఆ పనిలో దూకెయ్యడం… ఎన్ని సార్లు తల్చుకున్నా ‘భలే’ అనిపిస్తుంది.

సరిగ్గా ఛానెలైజ్ చెయ్యలేకపోయాం గాని, అప్పుడు ఇండియాతో సహా అన్ని ప్రపంచ దేశాలు విప్లవానికి సిద్ధంగా వుండినయ్. రాజకీయ అత్యుత్సాహం, సామాజిక రాజీ బేరాలు చేటు చేశాయి. తూట్లు పొడిచాయి.

నేను పని మొదలెట్టే సమయానికి, కర్నూల్లో ఒకరిద్దరు ఆర్ ఎస్ యు (ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్) వాళ్ళుండే వారు. వారిలో తానీషా అనే అబ్బాయి, మోహన్ రెడ్డి అనే ఇంగ్లీష్ లెక్చరర్ బాగా గుర్తు. కోల్స్ కాలేజీలో మరో ఇంగ్లీషు లెక్చరర్ కృష్ణ రాజ్ సింగ్ నాకు బాగా చేరువ ఆయ్యారు. తానొక విప్లవాభిమాని. ఏ గ్రూపూ కాదు. (ఎమర్జెన్సీ తరువాత గుండె పోటుతో మరణించారు).మార్టిన్ అనే ఒక మెడికల్ కాలేజీ డ్రాపవుట్, జయరామి రెడ్డి అని పక్కన తాండ్రపాడు గ్రామ సర్పంచ్ కూడా ఆ గుంపులో కనిపించే వారు.

వీళ్ళందరూ కలిసి నిర్వహించే చిన్న ‘సోషలిస్టు లైబ్రరీ’ ఒకటుండేది. ఆ గది మరీ చిన్నది. రెగ్యులర్గా కలుసుకుని మాట్లాడుకోడానికి చాలదు. ఆ పనికి కర్నూలు (పాత) బస్టాండు వెనుక, చిన్న బడ్డీ కొట్టులా వుండిన జి. పుల్లా రెడ్డి నేతి మిఠాయి దుకాణంలో కలిసే వారు. అక్కడ కూర్చుని కాఫీ తాగుతూ గంటల తరబడి విప్లవాలు మాట్లాడుకునే వారు.

నాకు తెలిసినంత వరకు… కర్నూలు లోని ఆ చిన్న షాపు ఒక్కటే అప్పటికి ‘జి పుల్లా రెడ్డి నేతి మిఠాయి’ దుకాణం. ఇప్పుడు అన్ని తెలుగు వూళ్ళలో… అమెరికాలో కూడా కనిపించే జి పుల్లా రెడ్డి గొలుసు షాపులకు మూలపుటమ్మ ఆ చిన్న గదే అనుకుంటా. దానికి ఎదురుగా అజంతా హోటల్. భలే రద్దీ, స్వీట్ షాపులో పెద్దగా జనం వుండే వారు కాదు.

రెండు పెద్ద టేబుళ్లు, వాటి చుట్టూ నాలుగైదు కుర్చీలు. ఆ పైన కాస్త ఎత్తు మీద స్వీట్ షాపు. అక్కడ ఎంత సేపు కూర్చున్నా ఏమీ అనే వారు కాదు.

హోటళ్లలో ‘మేక్ సీట్స్ ఫర్ అదర్స్’ అనే విజ్ఞప్తి బోర్డులను అప్పటికింకా కనిపెట్టలేదు. పేవ్ మెంటు మీద నిలబడి గబ గబా టీ తాగేసి వెళ్లే పద్ధతిని కూడా అప్పటికి ఆవిష్కరించ లేదు.

ఏ మాత్రం వీలున్నా నేనా గుంపులో, కబుర్లలో కలిసే వాడిని. పిడి ఎస్ యూ ను నిర్మించడంలో వున్న కష్టాలు, నా దిగుళ్ళు వాళ్లతో పంచుకునే వాడిని. భిన్న రాజకీయ మార్గాల వాళ్లం అనే సమస్య ఎప్పుడూ ఎదురు కాలేదు. కనీసం కర్నూలు మేరకు ఆ రేఖ బలంగా వుండేది కాదు.

ఆ గుంపులో ఒక చిన్న జోకు ప్రచారంలో వుండేది. డివి గ్రూపు వాళ్ళు విప్లవానికీ సిద్ధాంతాలు తయారు చేస్తారు. సీపీ వాళ్లు జనాన్ని పోరాటాలకు సమీకరిస్తారు. కొండపల్లి సీతారామయ్య వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారు అని. అందరం దాన్ని జోకుగానే తీసుకుని వాళ్ళం,

ఆ గుంపులోని అజయ్ అనే విద్యార్థి ఇచ్చిన ఐడియాతోనే, ఆ తరువాత, నా పనిలో మొదటి అడుగు వేశాను. అదెలాగో తరువాత చెబుతా. (అప్పుడు తను అమీబియాసిస్ తో బాధ పడే వాడు, ఇప్పుడెలా వున్నాడో?!)

కర్నూల్లో తాము పిడి ఎస్ యూ అని చెప్పుకునే మనుషులు అప్పటికి, నేను కాకుండా, ఇద్దరుండే వారు. ఒకరు మెడికల్ విద్యార్థి, రచయిత జి ఎన్ కృష్ణ మూర్తి. ప్రస్తుతం ఆయన గుంతకల్ లో డాక్టరుగా ప్రాక్టీసు చేస్తున్నారని విన్నాను. మరొకరు తరిగోపుల అనే వూరికి చెందిన కాలేజీ విద్యార్థి శ్రీనివాస రెడ్డి. ఆ ఇద్దరు… ఎవరికి వారుగా… నేను వెళ్లడానికి ముందు ఎప్పటి నుంచో వున్నారు. అంతకు మించి జనమూ లేరు. కార్యక్రమాలూ లేవు.

రాష్ట్ర స్థాయిలో జంపాల చంద్ర శేఖర ప్రసాద్, టి ప్రభాకర రావు, మధుసూదన రాజ్, బూర్గుల ప్రదీప్, శశి, కె. లలిత, శంకరన్న, రాజిరి తదితరుల నాయకత్వంలో పిడిఎస్ యూ అప్పుడొక దుర్నిరీక్ష్య శక్తి. హైదరాబాదులో జార్జి రెడ్డి హత్యానంతరం యువకుల ఆవేశాలు కేవలం ప్రతీకార చర్యలుగా ల్యాప్సవుట్ అయిపోకుండా, వాటిని ఛానెలైజ్ చేసి… పిడి ఎస్ యూ ఉద్యమంగా మలచడంలో తెర వెనుక నీలం రామ చంద్రయ్య, తెర ముందు జంపాల చేసిన కృషిని… అప్పటి వుద్యమకారులలో జీవించి వున్న వారెవరైనా రికార్దు చేయాలి.

వీలయితే 1968 ఫ్రెంచి ఉద్యమాన్ని… ఉద్యమ కారుడు కాన్ బాందీ, రచయితలు టామ్ నెయిర్న్, ఏంజిలా కాట్రోచ్చీ, తారిఖ్ అలీ… వర్ణించిన శైలితో ఆ నాటి తెలుగు విద్యార్థి ఉద్యమాన్ని రికార్డు చేయాలి. రెండింటి మధ్య చాల సామ్యాలున్నాయి.

నేను చూసిన మేరకు కూడా ఆనాటి పిడిఎస్యూ లో సుమిత్ సిధూ, గీత, లలిత వంటి ఫెమినిస్టులు. శ్యామల, రాజిరి, శంకరన్న, గూడ అంజయ్య వంటి దళితవాదులు, శశి, అశ్విని వలె… ‘అన్నమే కాదు, గులాబీలు కూడా కావాల’నే శిష్ట వర్గ అధునికులు’… ఎస్, 1968 ఫ్రెంచి విద్యార్థుల్లో వుండిన పాయలన్నీ ఇందులో వుండినయ్.

వెంకటరమణి తదితరుల నాయకత్వంలోని ఆర్ ఎస్ యూ రూపంలో ‘మరింత’ తీవ్ర వాద ఛ్చాయలు కూడా అనాడు వుండినయ్.

విద్యార్ఠులకు, శ్రామికులకు మధ్య పెరిగిన స్నేహానికి ప్రతినిధులుగా యాదగిరి వంటి యూనివర్సిటీ వుద్యోగులుండే వారు.

ఆ రోజుల హైదరాబాద్ విద్యార్థి వుద్యమాన్ని స్టడీ చేయగలిగితే… భారత విప్లవోద్యమాన్ని, దాని అన్ని ఛాయల్లో నక్సల్బరీ తరం వుద్యమాన్ని స్టడీ చేసినట్టే అవుతుంది. తరువాత్తరువాత విప్లవకారుల వల్ల జరిగిన తఫ్పులేమిటో, అంతటి ప్రచండ శక్తిని ఎందుకని వుపయోగించుకోలేకపోయామో తెలుసుకోడానికి కూడా అలాంటి అధ్యయనం అవసరం

నేను కర్నూలు జిల్లా వుద్యమంలో కాలు మోపే నాటికి ఉస్మానియా యూనివర్సిటీలోనే గాక, రాష్ట్రంలో కూడా జార్జి రెడ్డి ఒక కల్ట్ నేమ్ అయిపోయాడు. తానొక ప్రజా గాథ, లెజెండ్ అయిపోయాడు. తన పేరుతో ఎంత తీవ్ర వాదాన్నయినా చాల సులభంగా వివరించడానికి వీలు వుండింది.

నేను జార్జి ముఖ చిత్రంగా ప్రచురించిన పిడి ఎస్ యూ పత్రిక (బులెటిన్) ‘విజృంభణ’ను, పిఓ డబ్ల్యు ‘స్త్రీ విముక్తి’ని చేతిలో పట్టుకుని జనం లోకి వెళ్లిపోయే వాడిని. అంతే, అంతకు మించి నా దగ్గరేం లిటరేచర్ వుండేది కాదు.

నాకు హ్యండీగా దొరికిన మరో అంశం అప్పుడు పిడి ఎస్ యూ రాష్ట్ర స్థాయిలో చేపట్టిన అధిక ధరల వ్యతిరేక వుద్యమం. ప్రజా విజృంభణపై నాకు అనంత విశ్వాసం కల్పించిన మొదటి ఘటన. ఆ తరువాత ఇంకేవేవే ఇంకెన్నో మానసిక క్లేశాలు ఎదురై వుండొచ్చు. చాల తప్పులు చేసి వుండొచ్చు. ఉద్యమం నిర్మించలేమేమో అనే సందేహం మాత్రం కలగలేదు. వన్స్ ఫర్ ఆల్ ఆ సందేహం నా నుంచి పారిపోవడానికి ప్రేరణ ఫిబ్రవరి 25 అధిక ధరల వ్యతిరేక వుద్యమమే. ఇది అతి మాట కాదు. నిజం.

తేదీలూ, హార్డ్ ఫ్యాక్ట్స్ విషయంలో నేను బాగా వీక్. భావనల (కాన్సెప్టుల) మీద వున్న ప్రేమ వాటికి పునాది అయిన తడి లేని వాస్తవాల మీద వుండదెందుకో. పేర్లు, తేదీల వంటి ఫ్యాక్త్స్ విషయమై చేసే తప్పులు భావనలను అఫెక్ట్ చేయకపోవడం చాల సార్లు గమనించాను.

విద్యార్థిగా పరీక్షల్లో సోషల్ స్టడీస్ అనబడు చరిత్ర అంటే చాల ఇష్టం వుండేది. పాఠం చెబుతూ రమణమూర్తి సారు ప్రతి వాక్యం దగ్గర ఆగి నా వైపు చూసే వారు, పూర్తి చెయ్యమని. మార్కుల్లో కూడా చాల సార్లు నేనే క్లాస్ ఫస్ట్. అందులో, ఒక ఐదు మార్కుల ప్రశ్న మాత్రం నాకు ఎప్పుడూ కొరకరాని కొయ్యే. ఒక వరుసలో చారిత్రక ఘటనలు, మరో వరుసలో తేదీలు ఇచ్చి వాటిని మ్యాచ్ చెయ్యమనే వారు. చంద్రగుప్త మౌర్యుడు, క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం అనే రెండు మాటల్ని మ్యాచ్ చేస్తే ఒక మార్కు మనదే. అప్పుడు ఆ అయిదూ తప్పు రాసే వాడిని.

ఇంతకూ ఇప్పుడిది కరెక్ట్ రాశానా? ఏమో… 🙂

పరీక్షల్లోనే కాదు, బతుకు తేదీలక్కూడా నేను నమ్మకస్తున్ని కాను.

ఫిబ్రవరి 25 మాత్రం మరుపున పడదు. ఆ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాలని పిడి ఎస్ యూ పిలుపు. ఇది బాగా ముందస్తుగా అనుకున్న తేదీ. దానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి విద్యార్థి సమావేశానికి ఆహ్వానితుడిగా వెళ్ళాను.

అది మొదటి సారి నా పిడి ఎస్ యూ హీరోల్ని ప్రత్యక్షంగా చూడడం. హైదరాబాదులో రెండు మూడు రోజులుండడం కూడా అదే మొదటి సారి.

నగరంలో నా మొదటి ఆశ్చర్యం ఇరానీ సమోసాలు. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కి చాల్స్ (పెద్దినేని చలపతి రావు, అరుణోదయ) యూనినివర్సిటీ ఫ్రంట్ గేట్ దగ్గర వుండిన ఇరానీ హోటల్ కు తీసుకెళ్ళాడు. తినగా మిగిలిన సమోసాల్ని వెయిటర్ వెనక్కి తీసుకోడం విచిత్రం అనిపించింది. అప్పుడు కలిగిన ఆశ్చర్యం… ఎమర్జెన్సీ తరువాత, జయ వూరికి వెళ్లి, గదిలోఒక్కడినే వుంటున్నప్పుడు… వంటకు బద్ధకించి … పది రోజుల పాటు, ప్రతి పూటా సమోసాలే తిని, ఏకంగా నెల రోజుల పాటు జ్వరపడ్డాక గానీ పోలేదు.

రాష్ట్ర సమావేశంలో, ప్రసాదు ఇచ్చిన చిన్న సలహా నా పనిలో నాకు భలే వుపయోగపడింది. ఒక రోజంతా శంకరన్నతో పాటు వుండి, తానేం చేస్తున్నాడో చూడమని ప్రసాదు ఇచ్చిన సలహా. శంకరన్న అప్పటి వరకు తనకు పరిచయం లేని విద్యార్థులతో కూడా జంకు గొంకు లేకుండా పి డి ఎస్ యూ గురించి చెప్పి, వాళ్ళ సమస్యలు తెలుసుకుని, నెక్స్ట్ ఏం చేయాలో చెబుతుంటే శ్రద్ధగా విన్నాను, తను తిప్పుతున్న మీసం నన్ను కాస్త డిస్ట్రాక్ట్ చేస్తున్నా.

కర్నూలు వెళ్లి నన్ను నేను శంకరన్నగా వూహించుకుని పని మొదలెట్టాను.

మొదటి సారి వెళ్లింది వుస్మానియా కాలేజీ హాస్టల్ కు. మొదట హాస్టల్ విద్యార్థులకు నన్ను పరిచయం చేసింది అజయ్. ‘విజృంభణ’ బులెటిన్ మీద జార్జి బొమ్మను చూపించి, జార్జి రెడ్డి ఎవరు, తనను ఎందుకు హత్య చేశారు, మేము దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెప్పాను. కథలో వున్న వయ్లెన్సు, ఆ వయ్లెన్సుకు బలైన జార్జి ఆశయాలు…. పిల్లలను బాగా ఆకట్టుకునేవి.

సోషలిజం, కమ్యూనిజం వంటి మాటలు రానిచ్చే వాడిని కాదు. దానికి బదులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనే పద బంధానికి నా పద్దతిలో నేను వ్యుత్పత్తి అర్థం చెప్పే వాడిని. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం వుంది. ఇది ప్రగతి శీలం కాదు. ప్రగతి శీలమయ్యుంటే దేశం ఇంత హేయమైన స్టితిలో వుండేది కాదు. ప్రగతి శీలమైన ప్రజాస్వామ్యం కోసమే పిడిఎస్ యూ పోరాడుతున్నది…. ఇదీ ఆ రోజుల్లో నా మాటల సారాంశం.

విద్యార్థులకు ఈ మాటలు బాగా నచ్చేవి. ఎంత బాగా నచ్చేవంటే, సమావేశాలకు వచ్చే వాళ్ళ సంఖ్య రాను రాను పెరిగి, నాకు ఉత్సాహం, భయం రెండూ కలిగేవి. నేను అనుకున్నట్టు జిల్లాలో పిడిఎస్యూ పెరుగుతున్నదని, ఫిబ్రవరి నాటికి అధిక ధరల ర్యాలీ నిర్వహించగలుగుతామని వుత్సాహం. నేను చెబుతున్నది, నిజమేనా? నాకేం తెలుసని ఇన్ని సంగతులు ఇలా ఝమాయించి మాట్లాడేస్తున్నాను అని భయం.

నిజం చెప్పొద్దూ… ఆ వుత్సాహం, భయాల కలనేతే ఇప్పటికీ నేను.

నాకు తెలీదు. నాకు తెలుసు.

కేవలం కర్నూలు కాదు. ఆత్మకూరు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు… ఇలా ఎక్కడెక్కడ పార్టీకి ఉద్యమ సంబంధాలున్నాయో అక్కడికంతా వెళ్ళడం, ప్రిలిమినరీగా తెలిసిన ఒకరిద్దరిని పట్టుకుని హాస్టళ్ళకు, విద్యార్థుల గదులకు వెళ్ళడం, అక్కడ నేనొక శంకరన్నను అయిపోవడం, ‘విజృంభణ’ మీద జార్జి బొమ్మ చూపిస్తూ పిడిఎస్ యూ గురించి చెప్పడం.

ఈలోగా ఫిబ్రవరి 25 రానే వచ్చింది.

అప్పటికి కర్నూలులో చాల సమావేశాలలో మాట్లాడిన మాట నిజమే. విద్యార్థులు శ్రద్ధగా విన్న మాట కూడా నిజమే. అదంతా ‘మాస్’. ఆర్గనైజేషన్ కాదు. ఇంకా ఆ లెవెల్ రాలేదు. తేదీ అయితే దగ్గర పడింది. వాట్టుడూ? ర్యాలీకి విద్యార్థులను కదిలించేదెలా? ఎవరు? కార్యకర్తలు లేకుందా కార్యక్రమం?

అదీ గాక, వుద్యమం ఎప్పుడూ ఐక్య సంఘటన రూపంలో నడవాలని పార్టీ అవగాహన. ఇక్కడ వున్న ఈ నామ్ కే వాస్తే పి డి ఎస్ యూ జిల్లాలో అప్పటికే వేరూని వున్న ఎస్ ఎఫ్ వై వంటి సంస్థలను కలుపుకుని ముందుకు పోవాలి. వాళ్లు మాతో కలిసి వస్తారా?

నేను హెజిటేట్ చేయలేదు. మా ఆశయం… మా విప్లవం… వాళ్ళ ‘నయా రిబిజనిజం’ కన్న గొప్పది, సో, వాళ్లు ఆటోమేటిక్ గా మా మాట మన్నిస్తారనే ఊహ ఏదో నాలో బలంగా వుండిందనుకుంటాను. పాపం వాళ్ళకు తెలీదు, అందుకే అలా వున్నారు. రేపు మాపు సత్యం తెలుసుకుని ఇటు వైపు వస్తారు. అదీ నాలోని నిస్సందేహ సుపీరియారిటీ భావన.

అసలు తేదీకి వారం రోజుల ముందు కర్నూలు లోని ఎస్ ఎఫ్ ఐ ఆఫీసుకు వెళ్ళాను. ఆఫీసు బయట నర్సింహయ్య వాళ్ళు కూర్చుని వున్నారు. నన్ను నేను పి డి ఎస్ యూ విద్యార్థిగా పరిచయం చేసుకుని, ఎస్ ఎఫ్ ఐ నాయకులతో మాట్లాడాల్సి వుందని, ఫిబ్రవరి 25 వుద్యమం గురించి నిర్దిష్టంగా మాట్లాడ్డానికి ఎప్పుడు రావాలో తెలుసుకోడానికి వచ్చానని… చాల ‘పద్దతి’గా మాట్లాడాను. ప్రోటకాల్ ఏమాత్రం తప్పలేదు.

అప్పుడు డాక్టర్ బ్రహ్మా రెడ్డి కర్నూల్లో ఎస్ ఎఫ్ ఐ నాయకుడు. గఫూర్ రెండో స్టాయి. బ్రహ్మా రెడ్డి లోపల్నించి నన్ను చూసి కూడా చూడనట్టు మరో గదిలోకి వెళ్లి తన సంచీలో బట్టలు సర్దుకోడం మొదలెట్టాడు. అక్కడి నుంచే ఎవరో వచ్చి చెప్పారు. ఆయన పత్తి కొండ వెళ్తున్నాడని, ఇప్పుడు నాతో మాట్లాడడం కుదరదని, ఫిబ్రవరి 25 లోగా ‘కూడా’ కుదరదని… మరొక మాటలో చెప్పాలంటే, తనకు నాతో మాట్లాడడం కుదరదన్న మాట.

తరువాత్తరువాత బ్రహ్మా రెడ్ది తో బాగానే పరిచయం అయ్యింది. ఆ రోజు తన మీద నాకేం కోపం రాలేదు. తాను అలా వెళ్లిపోవడాన్ని వుద్యమ సమస్యల పట్ల అవగాహన లేకపోవడంగా, తన నిర్లక్ష్యంగా మాత్రమే తీసుకున్నాను. ‘అయితే సరేనండీ, ఇదీ విషయం, ఆ రోజు ర్యాలీలో మీరు పాల్గొన దలిస్తే చెప్పండి’ అనేసి వచ్చేశాను. నా పని పద్దతి, బ్రహ్మా రెడ్డి బట్టల సర్దుడు హడావిడిని పెద్దగా పట్టించుకోకపోవడం, అక్కడొక గాంట్ లెట్ విసిరినట్టు నా ప్రతిపాదన చెప్పి రావడం… సిపిఎం నాయకుడు నర్సింహయ్యకు నచ్చినట్టుంది. మరి కొన్ని నిమిషాలు ఆయన నాతో మాట్లాడారు. మా వూరి పేరు తెలుసుకుని… ‘ఓర్నీ గని పిల్లోనివా, విశాఖపట్నం నుంచి వచ్చి పని చేస్తున్నాడంటే, ఎవరో అనుకున్నానే’ అని ప్లజెంట్ గా ఆశ్చర్యపడి నన్ను సాగనంపారు.

ఎవరు కలిసొచ్చినా, కలిసి రాకపోయినా, పిడిఎస్ యూ కు తనదైన ఆర్గనైజేషన్ వున్నా లేకపోయినా… విప్లవం ఆగకూడదు కదా?! హైదరాబాదులో లలిత, గీత వాళ్ళు బస్సులెక్కి, క్లాసులకు వెళ్లి ప్రజా సమస్యలపై వుపన్యాసాలిచ్చే వారనే సంగతి అప్పుడు గుర్తొచ్చింది. అసలు తేదీకి ఒక రోజు ముందు ఉస్మానియా కాలేజీకి వెళ్లి, ప్రిన్సిపాల్ ను కలిశాను. నా బ్రోకెన్ ఇంగ్లీషులో ఆయనకు నా పని వివరించాను. నా ఇంగ్లీషు మరీ పగిలిపోయి లేదేమో ఆయన చాల స్నేహపూర్వకంగా విన్నారు. క్లాసులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతానంటే ఒప్పుకున్నారు. వెళ్లి నాలుగైదు క్లాసుల్లో మాట్లాడాను.

అప్పటికే నాకు దోస్తులైపోయిన అజయ్, అశ్విని మరి కొందరు… నా సమస్యను చిటికెల పందిరి వేసినట్టు పరిష్కరించారు. “మీరు రేపు పొద్దున్నే రండి సార్. వచ్చి లాంగ్ బెల్ కొట్టండి. అప్పటికి మేము కొందరికి చెప్పి వుంటాం. మీరు ఇప్పటికే క్లాసుల్లో మాట్లాడారు. బెల్లు ఎందుకు కొట్టారో పిల్లలకు తెలుసు. అందరూ ర్యాలీలో వచ్చేస్తారు” అన్నారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. అప్పటి వరకు స్వయంగా నేను ఏ విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్న వాడిని కాను. అలాంటి వాడిని ఒక ర్యాలీని లీడ్ చెయ్యడం, ఓర్నాయినో… వాళ్ళెవరికీ చెప్పలేదు, ఇప్పుడు మీకూ చెప్పడం లేదు. ప్యాంట్సులో కాళ్లు వణికాయి.

మరుసటి రోజు కాలేజీ తెరిచే సమయానికి వెళ్ళాను. వెళ్ళే సరికి బయట అజయ్ వున్నాడు. నేను సందేహించడం చూసి, తనే వెళ్లి లాంగ్ బెల్ కొట్టాడు. విద్యార్థులందరూ పోలోమని బయటికి వచ్చేశారు. నేను మెట్ల మీద నిలబడి ర్యాలీ ఎందుకో రెండు మాటలు మాట్లాడాను. ఛలో కలెక్టరేట్. ర్యాలీ బయల్దేరింది.

కవాతు అలవాటైన సైనికులు నడిచినట్ట్లు విద్యార్థులు నడిచారు. ఒక చోట మాత్రం ఒక చిన్న విద్యార్ఠుల గుంపు చేతుల్లోకి రాళ్ళు తీసుకున్నారు. నాకు బాగా పరిచయం వున్న విద్యార్థి ఎవరో వచ్చి వుప్పందించారు. నేను అక్కడికి పరిగెత్తాను. ‘షాపులు బంద్ చేయిద్దాం సార్’ అన్నారు రాళ్ళ చేతుల పిల్లలు. అది ఇప్పుడు మన కార్యక్రమంలో లేదు, వద్దని చెబితే రాళ్లు కింద పారేశారు.

అవాంఛనీయ ఘటనలేమీ లేవు. కొంత దూరం పోయాక, పోలీసులు వచ్చారు. ఈ ర్యాలీ ఏమిటి, ఎవరు నాయకులు అని ఆరా తీశారు. విద్యార్థులు నా వైపు చూపించారు. పోలీసులతో మాట్లాడడం కూడా నా కదే మొదటి సారి. నేను వెళ్లి రెండు మాటల్లో పిడిఎస్ యూ గురించి చెప్పి, ర్యాలీ ఎందుకో చెప్పాను. అది చెబుతున్నప్పుడు పోలీసాయన్ని ‘సార్’ అని సంబోధించానే అని నాలో నేను కుంచెం బాధ పడ్డాను. ఆ తరువాతెప్పుడూ పోలీసాయన్ని సార్ అని అనలేదని కాదు. ఎందుకో ఆ సాయంత్రం అందుకు కొంచెం గిల్టీగా ఫీలయ్యాను.

ర్యాలీ వల్ల లోకానికి ఏం జరిగింది? అలాంటి ఎన్నో ర్యాలీల వల్ల భారత పాలక వర్గాల్లో కదలిక వచ్చింది. ఆ కదలికల్లో ఒకటి… తీవ్రమైనది… ఎమర్జెన్సీ. కర్నూలు ర్యాలీ వల్ల నాకు జరిగిన మేలు మాత్రం అనన్యం. అది నాకిచ్చిన ఆత్మ విశ్వాసం అనన్యం. ర్యాలీ తరువాత నా జీవితం చాల మలుపులు తిరిగింది. చాల దుఃఖం కలిగిన సందర్భాలూ వున్నాయి. తల వంచడం వల్ల దుఃఖం పెరుగుతుందే గాని తరగదు. అన్యాయాన్ని, అబద్ధాన్ని ఎదిరిస్తూ బతికిందే బతుకు.

ఎందుకు, ఎలా అంటే చెప్పలేను గాని, పిలుపు ఇస్తే జనం పోరాటాలకు కదులుతారు, దానికి ప్రపంచం సిద్దంగా వుంది అని అప్పుడు చాల మందిమి అనుకోడానికి మూలం ఇలాంటి ఘటనలే .

ఎదిరి పక్షం బలాన్ని మరీ తక్కువ అంచనా వేశామేమో గాని, ప్రజా బలం గురించిన ఆ అవగాహన సరైనదేనని అప్పుడూ ఇప్పుడూ అనుకుంటాన్నేను.

07-09-2016

(వచ్చేవారం కర్నూలు లోనే మరి కొన్ని కబుర్లు)

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment