వాడుంటే బాగుండు

నాకు తెలుసు, కాదు తెలవదు

అంతా తెలుసు, అసలేం తెలీదు

నుదుటి  లోపల పురుగులు

చేతులు చొప్పించి తీసెయ్యాలి

సీతాకోక చిలుకలకై

మిణుగురు మెరుపులకై

రెక్కలున్న ఆకాశాలకై

ముసిముసి పువ్వులకై

కపాలాన్ని ఖాళీ చెయ్యాలి

కలవరించాలి పలవరించాలి

పర… వశమై విలపించాలి

రాసిందంతా కొట్టేసి

బొద్దింక మీసాల్తో

తడుముకోవాలి

బొద్దింకలే చెప్పగలవు

చీకటి రుచీ వాసన

@@@@

చనిపోవడమంటే బయ్యం

చావు తెలుస్తుంది

పుట్టడానికి బయమెయ్యదు

అది తెలవదు

తెలియనట్టు కూడా తెలవదు

ఆట

అటలో తొండి

దాక్కున్న వాళ్లు కనిపెట్టబడే లోగా

నియమాలు మారిపోతాయి

నియమాలు తెలిసేలోగా ఆట అయిపోతుంది

బానే దాక్కున్నాం గాని, కనిపెట్టేదెవరింతకీ?

కొందరు బహుశా ఎప్పటికీ కనిపెట్టబడరు

ఛివరి వాక్యం రాసేస్తారున్నట్టుండి

దాన్ని ఎవరూ కొట్టెయ్య లేరు

దేన్నయి తినే బొద్దింకలు కూడా

@@@

‘ఇప్పుడా వెళ్తావు,

నాకేమవుతోందో నీకు తెలీడం లేదు’

అన్నాడు, అప్పుడు, వాడు

వెళ్లిపోతూ నవ్వి నేను చెయ్యూపినట్టు గుర్తు

‘తెలుసు’ నని చెప్పడమెలాగో తోచక

‘ఏం తెలుస’ని నిలదీయడానికి

బదులుగా చెయ్యి వూపడానికైనా

వాడు ఇప్పడు లేడు

వాడుంటే బాగుండు; నవ్వడానికి,

ఎక్కడికేనా వెళ్తున్నప్పుడు

చెయ్యి వూపడానికి, చెయ్యి వూపి

ఎక్కడికేనా వెళ్లిపోడానికి

వాడుంటే బాగుండు:

నాకేం తెలీదని తెలుసుకోడానికి

ఎవరూ వుండరు

ఏమీ తెలవదు

తెలవదని కూడా తెలవదు

17-8-2015

Leave a comment