నిద్దర పోతున్న వూరు

స్మృతి 24.

గత వారం కావాలనే బ్రేక్ తీసుకున్నాను.

లోపల వున్నదేదో గడ్డ కట్టిన ఫీలింగ్. నిద్రలేవనివ్వని బద్ధకం. సరిగ్గా అలాగే వుండిందా అప్పుడు మా వూళ్లో నాకు? ఏమో!.

అలాగని, అప్పుఢు నేను బద్ధకంతో వూరికే వుండి పోలేదు. ఊరికే వుండిపోవడం నాకు చాతకాదు.

ఊరక వున్నప్పుడు నన్ను నేను భరించాలి. అది అసలే చాత కాదు.

అప్పుడు ఆ ఘటనలు నన్ను నడిపించాయా, నేను ఘటనల్ని నడిపించానా? చొరవ ఎవరిది?

అప్పుడే కాదు ఎప్పుడూ, ఇది నా విచికిత్స.

నా గురించే కాదు, అందరి గురించీ.

నేనూ నువ్వు …. మరీ అంత వేర్వేరు కాదని నా నమ్మకం. వేర్వేరయితే, అదెలాగో కాస్త చెబుదురూ.

ఘటనల్ని వాటి మానాన వాటిని వదిలేయ బుద్ధి కాదు మనకు. అలాగని అవి మన బుద్ధికి అనుగుణంగా మలగవు. ఒక నిరంతర వైరుధ్యం. ఒంటరి బాటలో రెండు బండి చక్రాల గరగర సంభాషణ, నిరంతరం.

బహుశా. అందర్నీ నడిపించే వైరుధ్యమిదే. ఒక్కొక్కొరిగా, సమూహాలుగా నడిపించే వైరుధ్యం.

సహజ గతి ఏదీ మనకు నచ్చదు. అంతెందుకు? సహజ పద్ధతి సెక్సుకు అవకాశం లేకనే కదా, స్యయంతృప్తి మార్గాలు? మళ్లీ, దాని వల్ల మానసిక శక్తులు వృధా అయ్యాయని నిర్వేదం? దీన్నుంచి ఏ సెక్సు నిపుణుడి సలహా నిన్ను రక్షించలేదు. నిన్ను నువ్వు కూడా రక్షించుకోలేవు. యు హావ్ టు గో త్రూ ఇట్. లేదా ఆ బాటను నడిచేసిన వారెవరో నీకు చెప్పాలి, అదీ నీకు నచ్చేలా. అనుకుంటాం గాని, ఏదీ సహజంగా వుండదు. ఉంటే, మనం దాన్నలా వుండనీయం. ఉండనిచ్చేట్టయితే ఇంత ‘నాగరికత’ లేదు. నాగరికత సమస్తం కృతకమే.

సహజ గతిలో నడిచి వుంటే ఏమయ్యేది? నేను మరొక ‘మాయూరు’ అయ్యేది. మా వూరి బండరాయి పెను నిద్దరనయ్యేది.

నిజంగా అలాగే అయ్యేదా? అలా అయ్యే వాణ్ని కాదేమో!

అలా అయితే ఏం? అలా కావడం తప్పా? అది కూడా ఏమో!!

రానున్నది తెలీదు, సరే, అయిపోయినదయినా తెలుసా? 🙂

ఒక మాట. నాకు చాల ఇష్టమైన మాట. ఎక్కడో కార్ల్ మార్క్సు చెప్పినది. నేనైతే ఈ మాటను కేరళ వేణు రాసిన పుస్తకంలో చదివాను. ఆ పుస్తకం పేరు “ప్రాబ్లెమ్స్ అఫ్ మావోయిజం- ఇండియన్ రెవల్యూషన్’ అనుకుంటాను. (బుక్ టైటిల్ కాస్త అటు ఇటు).

ఛాన్స్ అనీ విధి అనీ అంటారు. అలాంటిదేమీ లేదు. ఏదీ బై ఛాన్స్ జరగదు. కార్య కారణ సంబంధం లేకుండా ఏదీ లేదు. ఏదీ వుత్తినే జరగదు. ఏదీ హాం ఫట్ సంభవించదు.

ఉదాహరణకు…. ఒక గులక రాయిని ఒక వైపు నుంచి చెయ్యి పెట్టి తోస్తే, ఫలితంగా అది ఒక దిశలో కదులుతుంది. కదిలించేది కేవలం ఒక చెయ్యి అయితే, రాయి ఏ దిశలో కదలబోతున్నదీ ముందుగా చెపొచ్చు. దాని మీద రెండు లేదా మూడు చేతులు వుంచి రెండు లేదా మూడు వైపుల నుంచి తోస్తే? అది ఏ వైపు వెళ్తుందో చెప్పడం అంత వీజీ కాదు. ఆ రెండు లేదా మూడు వైపుల శక్తులను… వాటి ఇంటెన్సిటీలతో పాటు…. లెక్క గట్టి, వాటి రిజల్టాంట్ దిశను లెక్క గట్టాల్సి వుంటుంది.

అలాంటిది, ఒక వస్తువు మీద ఏ వెయ్యి శక్తులో పని చేస్తున్నప్పుడు, ఒక్కొక్క శక్తి ఒక ఇంటెన్సిటీతో పని చేస్తున్నప్పుడు… ఆ వస్తువు ఏ దిశగా పరిణమిస్తుందో ఎలా చెబుతావు? అది చెప్పాలంటే, ఆ శక్తులన్నీ నీకు తెలిసుండాలి. వాటి ఇంటెన్సిటీలు నీకు తెలిసుండాలి. ఆ ‘డేటా’ అంతా నీ వద్ద వుండాలి. ఆపైన వాటి రిజల్టాంట్ దిశను లెక్క గట్టాలి. ఈలోగా అది కదలకుండా వుండాలి.

చాల సార్లు ఇది సాధ్యం కాదు. వస్తువు మీద పని చేసే శక్తులన్నీ, వాటి ఇంటెన్సిటీలతో సహా మనకు తెలియవు. మనకు తెలీదు కదా అని, ఆ శక్తులు పని చేయడం మానవు. తమ పని తాము చేస్తాయి. వస్తువు కదుల్తుంది. ఏ దిశగా అనేది ముందస్తుగా చెప్పలేం. చెప్పలేం కనుక, కార్య కారణ సంబంధం లేదని అనలేం. కారణాలకు సంబంధించి పూర్తి సమాచారం (డేటా) మన దగ్గర లేదని మాత్రమే అనగలం.

ఛాన్సు లేక విధి అనే మాటలో మానవ యత్నాన్ని తక్కువ చూపు చూడడం వుంది. దొరికిన కారణాల్ని కూడా చూడనివ్వని బద్ధకం వుంది. కార్యకారణ సంబంధాన్ని అంగీకరించడంలో… ఇప్పుడు మనకు తెలియదు గాని, కాలం గడిచే కొద్దీ తెలుస్తుందనే వినయ వైఖరి వుంది. ఇప్పటికి వున్న డేటాతో కొన్ని నిర్ణయాలకు వచ్చి పనులు చేసుకునే క్రియాశీల వైఖరి వుంది.

గని గ్రామంలో చిన్ని రైతుకూలీ సంఘం వాళ్ళం పాటలు పాడాం. నాట్యాలు చేశాం. ఉపన్యాసాలిచ్చాం. ఊళ్లు తిరిగాం. దీని వల్ల బంధువుల్లో, మిత్రులలో మాకొక కొత్త ఇమేజ్ వచ్చింది.

ఊళ్ళో ఇలా పాటలూ అవీ నేర్చుకోడం, ఆడడం, పాడడం మాతోనే మొదలు కాలేదు. యువకులు బుర్ర కథలు నేర్చుకోడం, పాండవోద్యోగ విజయాల వంటి పద్యనాటకాలు నేర్చుకుని, చేతి చమురు వదింలించుకుని, ప్రదర్శనలిచ్చి, ఆ ప్రదర్శనల కథలను జీవితాంతం చెప్పుకోడం అంతకు ముందు కూడా వుంది.

నేను కాలేజీలో వుండగా… మా కన్న ముందరి జెనెరేషన్… గుడ్డిగారి రామిరెడ్డి చిన్నాన్న, కమ్మరి దీవయ్య కొఢుకు మురళి, చిన్ననుమంత్రెడ్డి కొడుకు సంజిరెడ్డి చిన్నాన్న, మరి ముగ్గురు… ఆరుగురు యువకులు…. రెండు బృందాలుగా… పని గట్టుకుని, ఎక్కడి నుంచో ఒక అయ్యవారిని పిలిపించుకుని బుర్రకథ నేర్చుకున్నారు. వాళ్ళు మొదటి సారిగా ప్రదర్శనకు గుమ్మడి కొండలోని రంగస్వామి దేవాలయానికి వెళ్లి మరీ పాడారు, ఏదో పండుగ నాడు. అప్పుడక్కడ నేనూ వున్నాను.

మా వూరికి సుమారు పది మైళ్ల దూరంలో వుంటుంది గుమ్మడి కొండ, కొండలో ఆ దేవాలయం. తరువాత్తరువాత మనం ఎటెటో వెళ్తాం, మళ్లీ కుదురుతుందో లేదో, ఇక్కడ మా గుమ్మడి కొండ గురించి ఇంకాస్త చెప్పనివ్వండి.

అది మూడు నాలుగు వరుసల కొండ. మొదటి వరుస కొండ పాదం వద్ద అడివిలో ఒక కోనేరు. నీళ్ళు ఎప్పుడూ మనిషి మునిగేంత లోతు వుండవు. బాగా పైన ఎక్కడి నించో, కొండ రాళ్ళ మీద దూకుతూ, చిన్న చిన్న మడుగులు, జలపాతాలు అవుతూ వచ్చే ఒక సెలయేరు కోనేట్లో చేరి, దాన్నుంచి రెండు మూడు పాయలుగా బయటికి పోతుంది. మా ప్రైవేటు బడి అయ్య వారితో పాటు వెళ్లి ఆ కోనేటి పక్కన బియ్యం పాయసం వండుకుని, పైన గుడికి నైవేద్యం తీసుకెళ్ళే వాళ్లం. కోనేటి దగ్గర్నించి కొండ మీదికి మెట్లు. కొన్ని కాదు. చాల మెట్లు. నాకు కాళ్ళు బాగా నొప్పెట్టేవి, పైకెక్కే సరికి. అన్ని మెట్లు.

అన్నీ ఎక్కేస్తే, ఒక పెద్ద బండరాయి. అది పైన ఒక గుట్ట మీంచి… చాల భాగం కిందికి జారి… పైన కొద్దిగా గుట్టకు అతుక్కుని మిగిలిందంతా గాలిలో నిలబడినట్లున్న పేద్ద బండరాయి. ఆ రాయికీ నేలకు మధ్య ఏమీ వుండదు, దాని చల్లని తడి తడి నీడ తప్ప. ఆ నీడ వున్న ప్రదేశంలో కనీసం యాభై మంది నుంచో వచ్చు. ఒకరి మీదొకరు కూడా నుంచో వచ్చు. అంత స్థలం, ఎత్తు. అదే దేవాలయం. రాయికి ఆధారం అవసరం లేకపోయినా, ముందు వైపు ద్వారబంధంతో ఒక గోడ, ఎడమ వైపు నేల నుంచి రాయి వరకు ఒక పొట్టి గోడ కట్టి, సుద్ద వెల్ల వేశారు. ఆ సుద్ద తెల్లని కాంతి వూళ్ళో మా ఇంటి మీద నుంచున్నా కనిపిస్తుంది, అడివి తల్లి నుదుట తెల్లని విబూది బొట్టులా. (దేవాలయం వైష్ణవ దేవుడిదయినా).

దీనికి ఒక కథ వుంది. అక్కడ అడివి చాల పెద్దది. అడివిలో వూళ్లు, తండాలు వున్నాయి. రంగస్వామి ఆ అడివిలో తిరుగుతూ తిరుగుతూ, ఎవరో కొండ పిల్లను మోహించాడట. కొండ మనుషులకు అది నచ్చలేదు. ఆయన్ని చంపేద్దామని వెంట పడ్డారు. (దేవుడు వాళ్ళ పిల్లను మోహిస్తే వాళ్ళకు కోపమా, పండగ చేస్కోక?). స్వామి పరిగెత్తుకు వచ్చి ఆ రాయి కింది దాక్కున్నాడట.

వాళ్లు విసిరిన గొడ్డలి గాటు ఇదే అని రాయి అడుగున ఒక పగులు చారను చూపిస్తారు జనం. ఆ పగులు చార వద్ద కుంకం బొట్లు పెట్టి వుంటాయి. అదే దేవుడు. తరువాత, ఒక విగ్రహం కూడా పెట్తినట్టున్నారు. (ఈ కథ తిరుపతి ఎంకన్న కత లాగా లేదూ. అట్టాగే వుంటాయి, వూళ్ళలో కతలు. ఎక్కడిక్కడ కత అక్కడే జరిగిందని అనుకుంటారు. అక్కడే జరిగిందని ఆనవాళ్లు కూడా చూపిస్తారు.)

ఈ సహజ సిద్ధ దేవాలయానికి మరో వైపు చాల లోతైన, బాగా పొడవైన ఆకు పచ్చని లోయ. లోయనిండా చెట్లు. వాటి శిరస్సులు మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. అంత దట్టమైన అడివి. అంత లోతైన లోయ. ఆకాశం మనకు పైన కాదు, కింద వున్నట్లుంటుంది. జాగర్తగా దిగితే ఆ లోయలోనికి దిగొచ్చు. అలా దిగే దారిలో ఒక గుహ. గుహలో ఒక చిరుత గండు (చీటా) కాపురం వుంటుందని చెప్పే వారు. ఆ దారిలో వెళ్ళే వారు ఒకటికి పది మార్లు చూసుకుని వెళ్ళే వారు.

నాకు లోయలో కిందికి దిగి అందులో తిరగాలని భలే కోరిక. కోరిక ఇప్పటికీ వుంది.
నా హైస్కూలు రోజుల్లోని ఆ రెండు బుర్రకథ దళాల వాళ్లు, వాళ్ల అయ్య వారు కింద కోనేట్లో స్నానాలు చేసి, తడి బట్టల నుంచి నీరు ధారగా కారుతుండగా మెట్లు ఎక్కి, ఆ ఏటవాలు రాయి కుంకం బొట్ల కింది నుంచుని ఏడాది కాలంగా తాము నేర్చుకున్న బుర్ర కథను గొప్ప శ్రద్ధతో పాడుతున్న దృశ్యం నాలో ఎప్పటికీ చెరగదు.

ఎంతిష్టం వూరి మనుషులకు కళలంటే. ఎంతిష్టం పాటలంటే.

అదే మమ్మల్ని మా వూరి వాళ్లకు చేరువ చేసిందప్పుడు. పోగా, మేము పాడుతున్నది వాళ్లకు తెలిసీ తెలీని దేవుడి గురించి కాదు. వాళ్ళవే అయిన సమస్యల గురించి. వాళ్ళ మానసాలలో ధనస్వామ్యం మీద వున్న కోపాన్ని మేము పాడాం. పని చేసే వాళ్ళలో ఒకరి మీదొకరికి వున్న ప్రేమను మేము పాడాం. మాకు వచ్చినట్టు పాడాం. కాని, ఇష్టమొచ్చినట్టు పాడలేదు. రంగస్వామి దేవాలయంలో బుర్రకథ పాడిన యువకులు ఎంత శ్రద్ధగా పాడారో అంత శ్రద్ధగా పాడాం. ఔను, అన్నమయ్య తన భక్తి గీతాలు ఎంత మనసు పెట్టి పాడాడో మేము అంత మనసు పెట్టి పాడాం. ఆయనకు అనూచానంగా వచ్చిన శిక్షణ వుంది. మాకు లేదు. మేము ఆ ఖాళీని మా మనసులతో నింపాం.

పరిగెత్తే నాగరికతకు దూరంగా చిరకాలంగా ఏ మార్పు లేకుండా, నిలవ నీటిలా కొనసాగే ఊరి ‘బోర్డమ్’ వల్ల కూడా… మా ఆటపాటల్ని, కొత్త మాటల్ని జనం ఇష్టపడి వుంటారు. ఇటీవల వూరిలో ఇళ్ళన్ని పాత రాతి గోడల్ని వదులుకుని, ‘కాంక్రీట్’ అవుతున్నాయి. అంతే, అంతకు మించి మా వూరిలో పెద్ద మార్పు వుందనుకోను. మేమూ మా పాటలు చేసింది కూడా… నిద్రా సదృశమయిన మా వూరి గాలిని కాస్త డిస్టర్బ్ చేసి ఆనందించడమే అనుకుంటాను.

అదేదీ అనుకుని చేయలేదు. సరిగ్గా అందుకే, మా రైతు కూలీ సంఘం సరిగ్గా ఎప్పుడు మొదలైందీ మేము చెప్పలేం. ‘ఇక మనతో కాదులే’ అని ఎవరి పనుల్లోకి వాళ్ళం ఎప్పుడు చెదిరిపోయామో అది కూడా సరిగ్గా చెప్పలేను. అప్పటికి ఆదోనిలో చదువుతున్న మా తమ్ముడు శివారెడ్డి, ఇంకో తమ్ముడు చంద్రా రెడ్డి కూడా మా ప్రదర్శనలకు వచ్చే వారు. లక్ష్మయ్య కుంట తండా లోనో, వండుట్ల లోనో మా చంద్రన్న డక్కి కొడుతూ పాట పాడడం చూసి… ఓహ్, ఇందరం కలిసి నడుస్తున్నాం, కాని ఎక్కడికి అనే వూహ నాకు అప్పుడు రాలేదు. మా వూళ్ళో మేము జరిపిన ఒకే ఒక మేడే వూరేగింపులో తమ్ముడు శివుడు ‘మనుషులు మారాలి’ సినిమాలోని పాటలు పాడుతూ ‘యూనియన్ జిందాబాద్’ అని నినదాలు ఇస్తున్నప్పుడు కూడా… ఇదంతా ఎక్కడికి అనే వూహ నాకు రాలేదు.

మేమేం చేస్తున్నామో మాకు తెలుసు గాని బాగా తెలీదు అని మాత్రమే అప్పుడు అనుకున్నాం. బాగా తెలుసుకుని మరింత బాగా పని చేయాలని అనుకున్నాం. మా చిన్న రైతు కూలీ సంఘం తనకు తాను ఎన్నాళ్ళో బతకదు, మాకు ఒక పార్టీ కావాలి అనుకున్నాం. మమ్మల్ని నడిపించే పార్టీ కోసం మా అన్వేషణ మొదలయ్యింది. డివి రావు గ్రూపు స్థానిక నాయకుడు మండ్ల సుబ్బారెడ్డికి. మా వూరికి వచ్చి మాకు తమ పార్టీ గురించి చెప్పాలని వుత్తరం రాశాం.

అవి విప్లవోద్యమం వుధృత దినాలు. 1975. వేరే జిల్లాల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అలాంటి రోజుల్లో ఈ పని మీద పోస్టల్ వుత్తరం తప్పు అని మాకు తెలీలేదు. ఆయన రావడం… ఆ తరువాత పుల్లారెడ్డి పార్టీ నుంచి గంగిరెడ్డి వెంకట కొండా రెడ్ది రావడం … దాంతో మా ప్రశ్నలకు ఒక జవాబు దొరికింది. చేయాల్సింది ఇదీ అని ఒక దారి దొరికింది. దాంతో పాటు ‘మాయూరిని’ తన నిద్రకు తనను వదిలేసి…. నేను దూరమయిపోయే ప్రక్రియ కూడా మొదలయ్యింది. ఆ ప్రక్రియను, మా వూరిని గుర్తు చేసుకుంటూ ‘ఈనాడు’ చివరి రోజుల్లో రాసిన పద్యం… ‘నకులుని ఆత్మకత’ నుంచి:

//మా వూరొక వూర్మిళ//

మనను తొలుస్తున్నదేమిటో
అది తొలుస్తున్నప్పుడు చెప్పలేం
చర్మం రేపర్ కింద
శిల్పాలమయ్యాక
ఏ షాపులోనో కళాంజలి ఘటిస్తాం
తీర్చిదిద్దినట్లున్న గాయాల్ని చూసుకుని
మురిసిపోతున్నట్టు నటిస్తాం
అయినా వులి తాకిడి స్మృతులుంటాయి
బతికి వున్న చెట్లం కనుక
ఆకుల నుంచి తల్లి వేర్లకు దారులుంటాయి

మనం ఎక్కడికి నడుస్తున్నామో
నడుస్తున్నప్పుడు చెప్పలేం
కావాలంటే ఇప్పుడు చెప్పగలను
గుమ్మడి కొండ గురించి
కొండ మీద కుట్టిన తేనెటీగల గురించి
ఇప్పుడు కొనలేకపోతున్న
అప్పటి తేనెల గురించి
అడివి రేగు చెట్ల కింద ఏరుకున్న
లొల్లాయి పదాల గురించి
వువ్వెత్తున ఎగసి, విరిగి పడబోయి,
హఠాత్తుగా ఆగిన కెరటం వంటి
కొండ కొమ్ము మీది ఏటవాలు రాయి గురించి
కావాలంటే ఇప్పుడు చెప్పగలను

బండరాయి అలా ఎలా నిలబడి వుందో
ముందే తెలిసిపోయి వుంటే
ఆయాసపడుతూ అన్ని మెట్లెక్కి
అక్కడి నుంచి అటు లోతైన లోయనూ
ఇటు ఏటవాలు బండరాయి కింద దాక్కున్న
రంగసామినీ ఆనందించే వాళ్లం కాదు
అయ్యవారి వెంట వెళ్లి కోనేటి పక్కన
తియ్య బువ్వ వండుకు తినే వాళ్ళం కాదు

లోయలో మరో లోకం
విరిగిపడిన ఆకాశాల్లా చెట్లు
ఆకాశాల మీదికి దిగుతుంటే ఒక గుహ
ఆగు, జాగర్త, అక్కడొక పులి వుంటుంది
పులి ఎలా వుంటుందో?!
ఆవులిస్తూ బద్ధకంగా పడుకుని
వుత్తినే కాసేపు చూడనిస్తుందా
విసుగు పడి పంజా విసురుతుందా

ఊళ్లో మిద్దెక్కి చూడాలి కొండను
రంగు వెలిసిన ఆకుపచ్చ దుప్పటి కప్పుకుని
మహాకాయుడెవడో మాగన్నుగా
పడుకుని వున్నట్టు గుమ్మడి కొండ
ఎంత బాగుంటుంది అలా నిద్ర పోవడం
ఆకలెరుగక దాహమెరుగక
ఏండ్లు పూండ్లు నిద్దరలో పరవశించడం

నిద్ర, ఓహ్, నిద్ర
నిద్ర గన్నెరు పొదల్లో
రక్తపింజరి భయంకర నిద్ర
నీలకంఠేశ్వరాలయ ప్రాకారం మీద
పండిత చర్చల సోమరి నిద్ర
పొలం నుంచి ఇంటికి ఇంటి నుంచి పొలానికి
నడిచే దుమ్ము నిద్ర ధూళి నిద్ర
పొరపాటున మేలుకున్న వారిని
బద్దకంగా సంధించి వదిలే
అతి పురాతన ధనువు నిద్ర
తన తనువులోంచి
బస్సులు దూసుకుపోయినా
ఎలక్త్రిక్ వైర్లు కోసుకుపోయినా
చెదరని, చెరగని, పక్క వదలని నిద్ర

లేపొద్దెవరూ మాయూరిని
లేపొద్దెవరూ సుంకులమ్మను చౌడేశ్వరిని
రంగస్వామిని బలి కోరే బొడ్రాయిని
లేపబోయారా రక్త పింజరి కోర చాస్తుంది
పులి పంజా విసురుతుంది
లోయ లోంచి చనిపోని రుషులు శపిస్తారు
సాక్ష్యం నేనే
పారిపోయి వచ్చిన వాణ్ని
పరారీలో వున్న పాటని

(‘నకులుని ఆత్మకత’ 1996-2004, పేజీలు 4-6)

17-08-2016

(వచ్చేవారం మళ్లీ కలుద్దాం)

Advertisements
Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

లెల్లె సురేష్ కు అభిన‍ంద‍న‍లు

రెండో సారి నేనీ డాక్యుమెంటరీ చూడ్డం.

అద్భుతం.

లెల్లె సురేష్ కు కౌగిలింతలు.

సురేష్ నువ్వు ఇలాంటివి ఇంకా చాల చాల తీయాలి. ఈ మహా గతాన్ని ప్రిజర్వ్ చేయాలి.

సొంత డబ్బాల కోసం జనం డబ్బు పారబోసే యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇలాంటి పనులకు ఊతమిచ్చి కాస్త జనానికి వుపయోగ పడడం కూడా చేయొచ్చు కదా?!

కొందరు మిత్రులు చెబుతున్న మాట నిజమే, మాదిగలు అదే వృత్తులకు కట్టుబడకూడదు. అలా కట్టుబడాలని సురేష్ చెప్పడం లేదు. తను చేసిన పని అది కాదు. ఆ వృత్తికి కట్టుబడరాదు గాని, ఆ వృత్తి కూడా గొప్పదే, మాదిగ కులస్థులకు గొప్ప సంప్రదాయాలు, సంస్కృతి వున్నాయని గుర్తించి ఆత్మగౌరవం పెంచుకోవలసిందే. ఈ మాట సురేష్ గొప్పగా చెప్పాడు. ఇది చెప్పడం అవసరం.

ఏం, బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, వెలమలు…ఇవాళ తమ వృత్తులకు కట్టు బడుతున్నారా? అయినా ఆ వృత్తులు గొప్పవని వారి భావించడం లేదా? చెప్పుకోడం లేదా? కథలూ కాకరకాయలు రాసుకోడం లేదా?

నిజానికి కాపు (రైతు) పని మిగతా పనుల కన్న ఏమీ గొప్ప కాదు. అది చాల గొప్ప అని, అన్నదాతలమని వారు అనుకోడం లేదా? మనుషులు కేవలం అన్నంతోనే బతకరు. బట్టలు వేసుకుంటారు. చెప్పులు వేసుకుంటారు. గొర్రె మాంసం తింటారు. ఇవన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఏ ‘కాపు’ పండించాడు. ఇక బ్రాహ్మల వృత్తి ఏమిటో వారే చెప్పాలి, తమ కాళ్లకు మొక్కించుకోడం కూడా ఒక వృత్తి అని తిరిగి తిరిగి ప్రగల్భించకపోతే.

ఈ డాక్యుమెంటరీలో సురేష్ రికార్డు చేసిన డప్పు, దాని ప్రాశస్త్యం చూడండి, వినండి. ఆ ప్రాశస్త్యం నిజం కాదా? ఆ పెద్దాయన డప్పు మీద ఎన్నెన్ని గమకాలు పలికించొచ్చో చెప్పి, వాయించి చూపారు. వినండి చూడండి. మనసు ఉర్రూతలూగ లేదా? ఈ విద్యను ప్రిజర్వ చేసుకోవాలి కదా?!

బ్రాహ్మణవాద అహంకారాన్ని సంతృప్తి పరిచే బారతాలేనా, మిగిలిన జనాలకు ‘అహం’ వుండొద్దా? ఇంకొకరిని అవమానించకుండా వారు తమను తాము, తమ తాత తండ్రులను తాము గుర్తు చేసుకుని ఆనందించ వద్దా?

ఇలాంటివి ఇంకా ఇంకా రావాలి. పనికి మాలిన వాటికి జనం డబ్బు తగలేసే యూనివర్సిటీలు, ప్రభుత్వాలు సురేష్ తరహా ప్రయత్నాలకు ఫెలోషిప్ లూ అవీ ఇచ్చి ఈ సంప్రదాయాల్ని, సంస్కృతిని ప్రిజర్వ్ చేయడమే గాక, వాటిలో ఇప్పటికీ పనికొచ్చే వాటిని… ఉదాహరణకు డాప్పు వాద్యాన్ని…. మరింత ముందుకు తీసుకు పోవాలి.

అంతే గాని, మాదిగలుగా పుట్టిన వారు చెప్పులు కుడుతూనే బ్రతకాలని కాదు. నాకు తెలిసినంత వరకు సురేష్ ఒక సివిల్ ఇంజనీరు. ఇటీవల కలవలేదు. ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటూ వుంటాడని ఆశిస్తాను. తను చేసిన ఈ ప్రయత్నం…. టెక్నికల్ వాల్యూస్, కళ, మానవ ప్రేమ.. ఏ కోణంలో చూసినా అద్భుతం.

Posted in Uncategorized | Leave a comment

బాబూ! గుడ్ బై టు యూ!

 

(సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు,  గొప్ప  వక్త, విర‌సం వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు యాధాటి కాశీప‌తి  హైద‌రాబాద్‌లో కన్నుమూశారు. కాశీపతి స్మృతిలో   ఆయన  సన్నిహిత  మిత్రుడు  హెచ్చార్కె   నాలుగు  మాటలు…)

 

క కంచం ఒక మంచం అంటారు స్నేహానికి పరమావధిగా. ఆ అవధిని చవి జూచిన స్నేహం మాది. ముషీరా బాదు డిస్త్రిక్ట్ జైలులో ఆ రెండు పనులూ చేశాం. ఒకే కంచం లోంచి తిన్న సందర్భాలు, ఒకే సిగరెట్ పంచుకున్న సందర్భాలు సరే…. అవి కొల్లలు.

అది కాదు. ‘మీసా’ (‘మెయింటెనెన్స్ అఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్’) డిటెన్యూలకు జైలు బ్యారక్ లో  పొడుగ్గా రెండు వరుసలుగా మంచాలు వేసి వుండేవి. రాత్రులు పక్క పక్క మంచాల మీద దోమ తెరలు కల్పించే హేజీ వెలుతురులో కబుర్లు చెప్పుకుంటూ కబుర్లలోంచి నిద్దట్లోకి జారిపోయేది మేమిద్దరం.  వేర్వేరు మంచాలు వీలుగా లేవని, మా మంచాల్ని దగ్గరగా జరుపుకుని, ఒకే మంచంగా చేసుకుని, దోమ తెరల్ని కలుపుకుని మాట్లాడుకుంటూ నిద్రపోయే వాళ్ళం కూడా. ఇది చూసి ఒక అనంతపురం వీరుడు మేము ‘స్వలింగ సంపర్కుల’మని జైలు గోడల మీద రాశాడు. మేము ఆ దుష్ప్రచార వ్రాతను గుర్తు చేసుకుని, చాల సార్లు నవ్వుకున్నాం. మా స్నేహాన్ని నిలబెట్టుకున్నాం.  ఇప్పుడెలా వుంటుందో ఏమో గాని, అప్పుడు… 70లలో… ‘గే’ అనే ప్రచారం ఎవరి గురించి చేసినా, అది హీనమూ, దుర్మార్గమే.

ఎవ్వడికీ, దేనికీ భయపడగూడదు, ఇతర్లు మన గురించి ఏమనుకుంటారనే దానికి ఆసలే భయపడకూడదు, మనకు నిజ్జంగా ఎలా ఇష్టమో అలా జీవించాలి. ఏదైనా మనం బలంగా అనుకుంటున్నామంటే, అది నూటికి తొంభై వంతులు తప్పై వుండదు అనేది ఆనాడు మా ‘బాబు అండ్ బాబు’ లెజెండ్. బాబు అంటే నేను లేదా తను. అది మేము ఒకరినొకరం పిలుచుకున్న పిలుపు.

మేము పరస్పరం విభేదించలేదా? ఎందుకు లేదూ?! ఇద్దరం సిపిఐ ఎం ఎల్ చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో క్రియాశీలురం. తను బాగా సీనియర్. ఎమర్జెన్సీ తరువాత పార్టీలో నేను ఏం చేయాలనే విషయంలో, పార్టీలో చీలిక ఏర్పడుతున్నప్పుడు మేము ప్రవర్తించిన పద్ధతుల్లో విభేదాలు వచ్చాయి. విభేదాలు మా వంటి వాళ్ళ మధ్య ఎలా రావాలో అలాగే వచ్చి, అలాగే కరిగిపోయాయి.

నేను హోల్ టైమర్ గా వొద్దని, భార్యాబిడ్డలను చూసుకుంటూ జీవించాలని తను కోరుకోడమే కాదు. ‘ఈ రాజకీయాలు వాడికి చాత కావు, వాడు సంసారం చూసుకుంటూ, వుద్యమం పనులు చేయనీ’ అని పార్టీతో వాదించాడు. నేనూ వినలేదు, పార్టీ వినలేదు.

పార్టీ చీలిక రోజుల గురించి చిన్న సరదా వుదాహరణ. ఒక ముఖ్య కార్యకర్త కమ్ రచయిత్రి విషయమై పార్టీ రాష్ట్ర నాయకులున్న సమావేశంలో చర్చ  వచ్చింది. ఆమె ‘అటు’వైపు వున్నారంటూ నేను అన్నానని… కాశీపతి చెప్పాడు. కాశీపతి అక్కడ అలా అనగూడదు. అలా అనడం నష్టకరం. ఎందుకంటే ఆ సమావేశంలో నా మాటల్ని ఇష్టపడని ‘అటు’వైపు వాళ్లు కూడా వున్నారు. అదింకా చీలికలో శ్రేణీకరణ పూర్తి కాని కీలక దశ. నేను ఆమె గురించి అలా అనలేదని, కాశీపతి చెబుతున్నది నిజం కాదని  వెహిమెంట్ గా ఖండించాను. అక్కడున్న వారంతా నా మాటలనే సీరియస్ గా తీసుకున్నారు. కాశీపతి అబద్ధం చెప్పినట్టయింది.

బయటికి వచ్చాక, టీ కొట్టులో పూర్తిగా మా ‘వైపు’ వాళ్లే వుండగా కాశీపతి ఆ విషయం ప్రస్తావించాడు. “ఏమిరా, నువ్వు నాతో అలా అనలేదా?” అని అడిగాడు. “అన్నాను. ఆ మాట నీతో అన్నాను. అది నీ వరకే వుండాలి. దాన్ని నువ్వు అతిక్రమించావు. నేను అబద్ధం చెప్పను. ఇంత రేర్ గా అబద్ధం చెప్పినా, సమావేశంలో నా మాటకు వుండే విలువ నీ మాటకు వుండదు, నువ్వు చెప్పేది నిజం అయినప్పటికీ. నాకున్న ఆ కాస్త లివరేజ్ ని నేను అక్కడ వుపయోగించుకున్నాను. అలా వుపయోగించుకోడం రైటే” అనే సరికి, “ఉరేయ్, నువ్వు దేవాంతకుడివి” అని నవ్వేశాడు కాశీపతి.

(‘దేవాం’తకుడిని కావడానికి బాగా ప్రయత్నిస్తున్నాను బాబూ! కుదరడం లేదు. )

ఇటీవల కొంతకాలం, నాకు నేను మానసిక ఆరోగ్యం కోల్పోవడం వల్ల, తనను ఆ తీవ్ర అనారోగ్యంలో చూడడం చాతగాక…  విషయాలు తెలుసుకుంటున్నా…. ఎక్కువగా కలుసుకోలేకపోయాను. శ్రీ శ్రీ మీద తను సరదా భాషలో రాసిన సీరియస్ పుస్తకం ‘మందు’ హాసం ఆవిష్కరణలో చూశాను. అనారోగ్యం శరీరానికే గాని, బుద్ధికి కాదని ఆ గంట తన వుపన్యాసం నిరూపించింది.

రాజకీయ ఆర్థిక అధ్యయనంలో, ప్రజా సమస్యలను భౌగోళిక (గ్లోబల్) దృక్పథంతో వివరించడంలో తరిమెల నాగిరెడ్డి తరువాత అంతటి వాడనిపించే అద్భుత మేధావి యాధాటి కాశీపతి. నాగి రెడ్ది లాగే కాశీపతి కూడా పెదిమల మధ్య సిగరెట్ వుంచుకుని, గంటల తరబడి మాట్లాడే వాడు. బహుశా ఈ సిగరెట్ కూడా తనకు తరిమెల నాగిరెడ్డి నుంచి అబ్బిన విద్యే అయ్యుంటుంది.

తన సంగతేమో గాని, నా పొగ మాత్రమే కాశీపతి పెట్టిన నిప్పుదే. జైలుకు వెళ్ళక ముందు నాకు సిగరెట్ల అలవాటు లేదు. జైలుకు వెళ్ళాక పక్కన కాశీపతి రోజుకు పది పాకెట్ల చార్మినార్లను తగలేసే వాడు. నేను ముందే డిప్రెస్డ్ గా వున్నానేమో కాశీపతి సిగరెట్ డబ్బాలు నా వల్ల కూడా ఖాళీ కావడం, నా ‘పాకెట్ మనీ’ నుంచి కూడా సిగరెట్లు కొనడం మాకు తెలీకుండానే మొదలయిపోయింది. నన్నూరు వెంకట్రెడ్డన్న వంటి వారు ‘పిల్లోన్ని చెడగొడుతున్నాడ’ని కాశీపతిని కోప్పడే వారు. ఇద్దరం సిగరెట్ మానలేదు. మొన్న మొన్నటి వరకు.

మా స్మోకింగ్ అలవాటు గురించి ఇద్దరం తరచు అనుకునే వాళ్ళం. స్మోకింగ్ వల్ల మనిషి ఆయుష్షు పదేండ్లు తగ్గుతుందట కదా?!.ఓకే, లెటజ్, ఎంజాయ్. క్రిష్టొఫర్ మార్లోవ్ నాటకంలో డాక్టర్ ఫాస్టస్ తన ఆత్మను దయ్యానికి ఇచ్చి ఏవేవో ఆనందాల్ని తీసుకుంటాడు. మేము మరీ అంత కాదు. మా జీవితాలు వందేళ్ళ లోంచి ఒక పదేళ్లు సిగరెట్లకు ఇచ్చేస్తాం అని హాస్యమాడుకునేది. ఆ లెక్కన ఇప్పుడు కాశిపతికి ఎన్నేళ్లు? తను సిగరెస్టస్ కు ఇచ్చినవి కూడ కలుపుకుంటే, దరిదాపు ఎనభయ్యయిదు అవుతాయి.

బాబూ, మరేం ఫరవాలేదు! ఎవడు  బతికేడు మూడు యాభైలు. మనం అనుకున్నదే కదా, మనకు నిజంగా ఇష్టమయినట్టు జీవించాం. ఇలా జీవించేట్లయితే, ఇక, ఎవరం ఎప్పుడు మరణిస్తేనేం?

‘ఎనీ టైమ్ ఎనీ సెంటర్’ అని సవాలు చేసి బతికే వాళ్ళం మనం. ఎప్పుడయితేనేం, ఎక్కడయితేనేం?

ఇట్స్ ఓకే బాబూ!

ఈ ‘బాబు అండ్ బాబు’ ఏంటి అనుకుంటారు ఇది చదివే వాళ్లు.

కాశీపతికి ఒక జబ్బుంది. తన కన్న చిన్న వాళ్లైతే చాలు పరిచయం కాగానే ‘ఒరే’ అనేస్తాడు. నన్నూ అలా అనే సరికి ఖోపమొచ్చింది. ఇది తన బ్రాహ్మణ్యాహంకారపు మిగులు అని విమర్శించాను కూడా.  ఒకటి రెండు సార్లు తిరిగి తనను నేనూ ఒరే అని చూశా. అది నాకు బాగుండ్లేదు. నా కన్న కనీసం పదేళ్లు పెద్దాడు . అది మానేసి పేరుతో పిలిచి చూశా. మేము సన్నిహితమయ్యే కొద్దీ పేరు మానేసి ‘అది కాదు బాబూ’ తరహాలో బాబూ అనడం మొదలెట్టా. ఆ మాట తనకు నచ్చింది. తను కూడా బాబూ అనడం మొదలెట్టాడు. ఇద్దరం ఒకరికొకరం ‘ఒరే’లం కాలేదు గాని, ఒకరికొకరం బాబూ అయ్యాం. ‘బాబూ అండ్ బాబూ’…. అనేది ఆ ‘మూవీస్’ వాళ్ళకేమో గాని, మా స్నేహానికీ మంచి బ్యానర్ అయిపోయింది.

బాబూ రావు (మాచవరం ), చలపతి (అరుణోదయ), బూర్గుల ప్రదీప్, శ్యామ్(మధుసూదనరాజు తమ్ముడు), ఇంద్రారెడ్డి (మాజీ మంత్రి), కృష్ణారెడ్డి (తరువాత, విమలక్క భర్త) …  అందరికీ మా ‘బాబూ- బాబూ’ వ్యవహారం కుంచెం అసూయగా వుండేది.

కాశీపతి బయటి నుంచి తెప్పించిన స్టౌ తో ఏవేవో వంటలు చేసి మా మీద ప్రయోగాలు చేసే వాడు. తన వంట పూర్తి కాగానే, దానికి ఫ్రెంచి పుడ్డింగ్ అనో పోర్చుగీస్ పుడ్డింగ్ అనో నామకరణం కూడా చేశాక స్టౌ దగ్గర మా పిల్లల క్యూ. “వాడేడీ? బాబు.. బాబూ.. ఏడీ వాడు?’ అని లైనులో వెనుక వున్న నేను ముందుకొచ్చి, ప్లేటు చాచే వరకు వడ్డన మొదలెయ్యేది కాదు. మరి వాళ్ళకు అసూయ వుండదూ.

వాళ్ళకు చాటుగా చెప్పేవాడు. ‘వాడు, పాపం, పెండ్లైన ఇరవై రోజులకే జైలుకు వచ్చాడు రా. పెద్దోళ్ళం మాకైనా ఒకటి రెండు పెరోల్స్ వచ్చాయి. అదేంటో, వాడికి ఒక్క పెరోలు కూడా రాలేదు. పాప పుట్టినప్పుడు కూడ రాలేదు. పాపం, వాన్ని మనం బాగా చూసుకోవాలి’ అనే వాడు.

ఇప్పుడు అదేం అవసరం లేదులే బాబూ. ఆ ‘ఇరవై రోజుల’ జయకు, అప్పుడు నేను చూడలేదే అని నువ్వు అంగలార్చిన చిన్నారి మమతకు.. ఇప్పుడు నిరంతరం దగ్గరగా వుంటున్నాను. సంతోషంగా వుంటున్నాను. నీ ఫ్రెంచ్, పోర్చుగీస్ పుడ్డింగ్ లను మిస్ అవుతూనే వుంటా.

అయినా జీవితం ప్రహిస్తూనే వుంది. నీ బిడ్డలు ప్రగతి, వెన్నెల…. నువ్వు ఏం చెప్పావో అలాగే…. తమకు నిజ్జంగా ఇష్టమైన విధంగా, అదే సమయంలో ప్రగతి శీల రీతులలో జీవిస్తున్నారు. డోంట్ వర్రీ. వాళ్ళ సంగతి, పుష్ప సంగతి కూడా వాళ్ళు చూసుకుంటారు.

నువ్వొప్పుకుంటావో లేదో గాని, మిగిలిన ప్రపంచం కూడా బాగుంది. తన సంగతి తాను చూసుకోగలనని ప్రతీప శక్తుల తీవ్ర ముట్టడి మధ్య కూడా ప్రపంచం నిరూపిస్తున్నది. మనిషి తనకిష్టమైన విధంగానే జీవిస్తాడు. సందేహం లేదు. ఎవరు ఎలా నియంత్రించినా, ఎవరు ఎలా బుజ్జగించినా… కాసేపు కాలక్షేపానికి అవీ ఇవీ బొమ్మలతో ఆడుకుంటాడేమో గాని…. మనిషి తనకు ఇష్టమైన విధంగానే జీవిస్తాడు. అన్ని నిరంకుశాల్ని, బుజ్జగింపులను, అబద్ధాల్ని కాదని… కాలిలో విరిగిన తుమ్మ ముళ్ళను పిన్నీసు పెట్టి తీసుకున్నంత సహజంగా, సునాయాసంగా తీసేసుకుని…  నడుస్తాడు. నడవడం చాల ఇష్టం మనిషికి, కలలు కంటూ నడవడం మరీ ఇష్టం.

కాశీపతీ! మనం కలిసి పంచిన కలల్ని ఇక్కడ మిగిలి వున్న వాళ్ళం పంచుతూనే వుంటాం. ఎక్కడికక్కడ కలల్ని పంచడానికి, అబద్ధాల్ని తుంచడానికి ఇక్కడ ఎవరమో ఒకరం మిగులుతూనే వుంటాంలే. అబద్ధాల కలుపు తీయడం కూడా కలల సేద్యంలో భాగామే.

“హెచ్చార్కె! ఎవరో అఫ్సర్, జీఎస్ రామ్మోహన్ అట. నీకు మెసేజ్ లు పెట్టారట. చూడు. నీ క్లోజ్ ఫ్రెండు ఎవరో చనిపోయారట. మమత వాళ్ల మేసేజ్ చూసి ఆఫీసు నుంచి ఫోన్ చేసింది.”….  అని పొద్దున్నే మొద్దు నిద్ర పోతున్న నన్ను లేపి కూర్చోబెట్టి, ఆ తరువాత, నేనిది రాస్తుంటే పక్కనే తన ల్యాప్ టాప్ లో తానేదో చేసుకుంటున్న అన్య పాపకు, బహుశా, నువ్వు నేను గుర్తుంటాములే బాబూ! మమత, అన్య వాళ్లకు, ప్రగతి, వెన్నెల వాళ్ళకు మన పనుల్లో మిగుళ్ళు గుర్తుంటాయిలే.

kasi

గుడ్ బై, బాబూ! ఐ విల్ మిస్ యూ!.

సారంగ ఆగస్ట్ 11, 2016

Posted in బహిరంగ లేఖలు/విజ్జ్ఞప్తులు | Leave a comment

ప్రమాదకర అబద్ధం (3)

 

నిజమైన క్యూరియాసిటీతోనే అడుగుతున్నా.

గుచ్చి ఎవరినో నొప్పిద్దామని కాదు.

శిలువ మీద గుచ్చి ఎత్తబడిన మనిషి నొప్పి ఇది. ఈ నొప్పిని కాస్త తగ్గించుకుందామని కూడా అడుగుతున్నా. ఆకాశం బ్యాగ్రౌండ్ కలిగిన ఒక శిలువ మీద అంతెత్తు మీంచి అడుగుతున్నాను గాని, ఇదెవరినీ లుక్ డౌన్ చేయడం కాదు. క్రీ చూపు చూడడం కాదు.

ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా… నా వల్ల కాకపోతే మరెవరి వల్లనైనా… ఈ చర్చ జరగక తప్పదు. నా బోటి మృదు స్వభావితో మాట్లాడితే నా ప్రతివాదులకు మంచి శిక్షణ. తరువాత్తరువాత పరుష స్వరాల్ని ఎదుర్కొనడానికి మీకిది పనికొస్తుంది. లేదా, ఈలోగా మీరు మారు మనసు పొంది స్వస్థులు కావడానికైనా వుపయోగపడుతుంది.

హిందువులుగా పుట్టి పెరిగిన వారి నుంచి, ఇతర్ల నుంచి…. హిందు మత వాదం మీద విమర్శ వుంది. పదునైన విమర్శే వుంది. క్రైస్తవులుగా పుట్టి పెరిగిన వారి నుంచి, ఇతర్ల నుంచి… క్రైస్తవం మీద విమర్శ వుంది. పదునైనదే గాక చాల వుత్కంఠతో చదివించే విమర్శ వుంది. అలాంటి క్రైస్తవుల మీద ఏ వాటికన్ పీఠమూ, ఏ క్రైస్తవ దేశమూ (?) హత్యా ఆదేశాలు జారీ చేయలేదు. హిందూ మత ఛాందసాన్ని ఎదిరించినందుకు కొందరు హిందువులు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. వీరు మత ఛాందసాన్న్ని ఎదిరించారా లేక హిందువులలోనే ఇంకో మతం పక్షాన పాలక పక్షాన్ని ధిక్కరించారా అనేది అంత ముఖ్యం కాదు. పౌర సమాజం లోని కొందరు హిందూ ఛాందసులు తమ మాట వినని హిందువుల మీద స్వదేశీ ఫత్వాలు మొదలెట్టారు. ఇది ప్రభుత్వం పని కాకపోవచ్చు. ప్రభుత్వం అందదండలున్న పని. అయినా హిందువుల నుంచి హిందూ మతవాదం మీద విమర్శ బాగానే వచ్చింది. ఇప్పటికీ వస్తున్నది. ఇది ఆగదు. ఆగదు అనడానికి మీరు చదువుతున్న ఈ కాలమ్ కూడా ఒక వుదాహరణ.

ఇండియాలో ముస్లిములుగా పుట్టి పెరిగిన వారి నుంచి ముస్లిం మత వాదం మీద విమర్శ వున్నదా? మాటల గారడీ వద్దు. ముస్లిం మత వాదం, ఇస్లాం మత వాదం అనే పదాలు ఇక్కడ సమానార్థకాలు. ఆలాంటి విమర్శ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు లేదు అని ప్రశ్న. అందులో విమర్శించడానికి ఏమీ లేకనా? ఏమీ లేకపోతే ఆఫ్ఘనిస్టాన్ నుంచి హైదారాబాదు వచ్చిన ఆ అమ్మాయి అలా తాలిబన్ భయంతో ఎందుకు అన్ని జాగర్తలు తీసుకుంది? ఏమీ లేకపోతే అడల్టరీకి శిక్షగా ఆడపిల్లలను రాళ్ళతో కొట్టి చంపడం ఎందుకు జరుగుతుంది? ఇతర్లలో మాదిరిగానే ముస్లిములలోనూ … బాగా వున్న వారు, అసలేమీ లేక రోడ్ల మీద అడుక్కుతినే వాళ్ళు ఎందుకు వున్నారు? మొత్తమ్మీద అందులో (కూడా) విమర్శించాల్సిన సంగతులేవో వున్నాయి. వివరణ ఇవ్వాల్సిన సంగతులేవో వున్నాయి. ఆ పని ముస్లిములుగా పుట్టి పెరిగిన ప్రగతి శీలురే సక్రమంగా చేయగల్గుతారు. ముస్లిముల నుంచి అలాంటి విమర్శ లేదు, చర్యలు లేవు. ఎక్కడయినా విమర్శ స్ఫురణ కనిపిస్తే చాలు క్రోథాక్షులు తెరుచుకుంటున్నాయి.

ముస్లిములలో కొందరు అజ్జ్ఞేయవాదులు, నాస్తికులు వున్నారు. వారి నుంచయినా ముస్లిం మత వాదం మీద తగినంత విమర్శ వచ్చిందా అని నా క్యూరియాసిటీ.
ఏవో కొన్ని పొయెమ్స్ వున్నాయి. కొన్ని కథలున్నాయి. తెలుగులో ఖాజా, స్కై బాబ, షాజహానా వంటి వారు ఒక మేరకు అలాంటి సాహిత్యం రాశారు. ఆ కవిత్వమయినా…. ఆ సబ్జెక్టు మీద… ముస్లిం మత ఛాందసం మీద … ఒక ప్రత్యేక పుస్తకంగా…. రాలేదు. గుర్తించి బుక్ మార్క్ చేసుకోదగిన కృషి జరగ లేదు. అప్రెషన్ కు, సప్రెషన్ కు సంబంధించి వచనంలో వివరమైన పుస్తకమైతే రాలేదు. కాంక్రీట్ గా చిన్న బుక్ లెట్ కూడా రాలేదు. ఏమైనా వచ్చి వుంటే, తెలుసుకోవాలని వుంది. ఆ పుస్తకం చదువుకోవాలని వుంది. అలాంటి పుస్తకమేదీ రాకపోయి వుంటే, రాలేదనే నేను అనుకుంటున్నాను, అది ఎందుకు రాలేదనేది తప్పక ఆసక్తి కరం.

చాల కాలం క్రితం ఒక ముస్లిం మిత్రుడు మెజారీటీ హిందువుల నుంచి మైనారిటీ ముస్లిముల లోని పేదలు… గొడుగులు బాగు చేసే వాళ్ళు, బట్టలు కుట్టే వాళ్ళు… పడే బాధలతో ఒక కావ్యం రాశాడు. ‘కావ్యం బాగుంది, ఆ కమ్యూనిటీ నుంచి బయటికి చూస్తూ రాశావు ఈ కావ్యం. మరి లోపలికి చూస్తూ, ఆ మతంలోని స్త్రీలు పడే బాధలు, ధనిక పెత్తందార్ల దోపిడీ సంగతి కూడా నువ్వే రాయాలి, అలాగయితేనే ఈ విమర్శ సమగ్రమవుతుంద’ని అన్నాను. ఆయన తల వూపారు. తలే. కలం కాదు.

బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అలాంటి సబ్జెక్టుతో ‘లజ్జ’ అనే ఒక నవల రాశారు. అందుకామె తన దేశమే వదలాల్సి వచ్చింది. హైదరాబాదులో ఆమె మాట్లాడబోతే, ప్రెస్ క్లబ్ వద్ద దాడి జరిగింది. మాట్లాడనివ్వ లేదు. బ్రిటిష్ పౌరుడు, చెయి దిరిగిన రచయిత సాల్మన్ రష్దీ ఒక నవలలో… ఎస్, సైద్ధాంతిక గ్రంధంలో కాదు… ‘శటానిక్ వర్సెస్’ అనే ఒక నవలలో… అలాంటిదేదో రాస్తే… అతడి మీద వెలువడిన ఫత్వా ఇప్పటికీ తొలగిందో లేదో?!

ఏ మతాన్ని అనుసరించని అజ్జ్ఞేయ వాదులు నేటి పౌర సమాజంలో వాళ్లకు వాళ్ళు ఒక మైనారిటీ. కాన్స్తిట్యూషనల్ మైనారిటీ కాదు. భాషలో మైనారిటీ అనే పదానికి వున్న ఒరిజినల్ అర్ఠంలో మైనారిటీ. బంధు మిత్రుల ఇళ్లలో జననాలు, పెళ్లిళ్లు, మరణాలు… ఎక్కడికి వెళ్లినా అక్కడ వాళ్లు ‘ఆడ్ మెన్/విమెన్ ఔట్’. అదర్వైజ్ పరమ దుర్మార్గులయినా, ఆస్తిక బుద్ధితో అయ్య గారికి మొక్కే వాళ్ళు అక్కడ ఆమోద యోగ్యులు. ఇలాంటప్పుడు ఎంత బాధగా వుంటుందంటే, పోనీ మనం కూడా మందలో కలుద్దాం, అయ్య గారి కాళ్ళకు మొక్కి, రెండ్రూయలు దక్షిణ ఇచ్చేద్దాం మనకెందుకీ యాతన అని విరక్తి పుడుతుంది. అంధ్ర ఆస్ఠాన పురోహితుడు చెప్పినట్టు స్నానానంతరం అండర్ వేర్లు వుతికే సౌభాగ్యం అవిడకే ఇచ్చి మనం కూడా తరిద్దామని అనిపిస్తుంది. అంత కష్టం అజ్ఞేయవాదిగా వుండడం, మతంతో కాంప్రొమైజ్ కాకుండా వుండడం, మంది కోసం కాకుండా నా కోసం నేను వుండడం. ఇలా ‘నా’ కష్టాలు ‘నేను’ చెప్పుకున్నా… నాకొక మానసిక వెలివాడ సిద్డంగా వుంటుంది. (ఇక్కడ వెలివాడ అనే మాట వచ్చింది. ఇప్పుడు కవి మద్దూరు నగేష్ బాబు లేడు, వున్నా నన్ను కోప్పడడని నమ్మకముంది).

ఇలాంటి అనుభవాలతో, మొత్తంగా మతవాదం మీద… ఒక అజ్ఞేయవాదిగా ఫిర్యాదీ విమర్శ పెడుతూ.. మైనారిటీ అనే మాటను వుపయోగించానొక సారి. అందుకు …. నా పొత్తిలి సహచరులైన హిందువులెవరూ… మతవాదులు కూడా… నన్నేమీ అన లేదు గాని, ఒక ముస్లిం మిత్రునికి… కాదు కాదు… ఇద్దరో ముగ్గురో ముస్లిం మిత్రులకు నా మీద ఆర్జెంటుగా కోపమొచ్చింది. నేను ఒక అగ్రవర్ణంలో పుట్టానని వాళ్ళకు హఠాత్తుగా గుర్తొచ్చింది. మైనారిటీ అనే పదం ఎవరి సొంత ఆస్తి కాదు గదా అని వాళ్ళకు తట్టలేదా లేక వాళ్ళ కీర్తి సమస్తం ఆ ఒక్క పదం మొన మీదే బ్యాలెన్సింగ్ డాన్స్ చేస్తున్నదా అని అప్పుడు హాశ్చర్యంతో తెరుచుకున్న నా నోరు… ఇదిగో ఇలా… ఇంకా మూత పడలేదు.

ఆ మతంలో పుట్టి పెరిగిన వారి నుంచి… ఆ మత వాదం మీద విమర్శ లేకపోవడం మాత్రమే కాదు. వారి నుంచి దానికి పరోక్ష ప్రశంసలు వుంటున్నాయి. ఇస్లాం అధ్యయనాలు… అదీ ఆ మతానికి పాజిటివ్ గా, ఆ మత శాఖయే అయిన సూఫీ సంస్కృతికి మద్దతుగా చర్చలు, రచనలు… ఇవి మనకెందుకు బాగుంటున్నాయి అనేది నా ఉత్కంఠాత్మక ప్రశ్న. శ్రమైక జీవనాన్ని తగ్గించి చూపేది.. కేవలం నమ్మకాల కోసం బతకమని పేదలకు ఉద్బోధించే సరుకు ఏదైనా మనాళ్లకు విమర్శనీయం కావాలి కదా, కాలేదెందుకు? ఏ వెల్గులకీ మార్మికత?

ఏ విషయాన్నయినా ఒక విషయంగా అధ్యయనం చేయడం ఎప్పుడూ మంచిదే. అవసరం. అది ఏ విషయమైనా సరే. హిట్లర్ నాజీయిజాన్ని, ముస్సోలినీ ఫాసిజాన్ని ఇప్పటి కన్న లోతుగా, వివరంగా అధ్యయనం చేయాలి. కేవలం హోలొకాస్టుల మీద సెంటిమెంటల్ చర్చలు కాదు. యూదుల మీద ఆ పెర్సెక్యూషన్ కు జర్మన్ జాతి ఎందుకు అంగీకరించిందో, ఆ హీన చర్య ఆనాడు నేషనల్ సోషలిస్టుల పాలనలో ఒక పాపులర్ మెజర్ ఎందుకయ్యిందో… స్టడీ చేయవలసిందే. ఆ అధ్యయన ఫలితాలలో యూదులకు వ్యతిరేకమైనవి, జర్మన్ ప్రజలకు అనుకూలమైనవి కొన్ని పాయింట్లు వుంటాయనడంలో సందేహం లేదు. లేకుంటే ఎజ్రా పౌండ్ వంటి మేధా భావుకులు ఫాసిజం గురించి పాజిటివ్ గా ఆలోచించి వుండరు. ఆ వూబిలో మళ్లీ పడకుండా వుండడానికి కూడా ఇది అవసరం.

ముస్లిం సంస్కృతిని, ఇస్లాం స్ప్రెడ్ ని లోతుగా అర్థం చేసుకోడానికి, ఇన్నేళ్లుగా ఇంత అప్రెసివ్ కుల వ్యవస్థతో హిందూత్వం ఎలా బతికి బట్ట కట్టగలుగుతున్నదో తెలుసుకోడానికి అధ్యయనాలు జరగవలసిందే. కాని, అదేదో కొత్త శాల్వేషన్ అయినట్టు, ఆ పని ఒక పవిత్ర కార్యమైనట్టు ప్రచారాత్మక అధ్యయనాలు కాదు. ఇప్పుడు అలాంటివి జరుగుతున్నాయి. హిందూ ఛాందసం గురించి ప్యారలల్ గా విమర్శ అయినా వున్నది. ముస్లిం ఛాందసం మీద లేదు.

ఇందులో ఒక ప్రమాదకర అబద్డం ఇమిడి వుంది. ఆ ప్రమాదకర అబద్ధాన్ని కొందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు?

మహాత్ములారా, మహర్షులారా!

అదెలాంటి అబద్దమో మీరే చూడండి.

ఇటీవల ఒకాయన (ముస్లిం కాదు) బాగా ముందుకు వెళ్లిపోయాడు. ‘ముస్లిముల గురించి ఏమైనా మాట్లాడేప్పుడు… ప్రపంచంలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి పోరాడుతున్నది కేవలం ముస్లిములే అనే ‘ఫ్యాక్ట్’ ని గుర్తెరిగి, ఆ తరువాత మాట్లాడాల’ని ఒక చౌక బారు బౌద్ధిక ఫత్వా జారీ చేశాడు. ఆయన చెప్పిన ‘ఫ్యాక్ట్’ నిజానికి ఫ్యాక్ట్ కాదు. అదొక అబద్ధం. ‘ప్రపంచంలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి పోరాడుతున్నది ముస్లిములు మాత్రమే అనడం’ అబద్ధం. సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి పోరాడుతున్న వారిలో చాల మంది ముస్లిములున్నారు. చాల మంది హిందువులున్నారు, క్రైస్తవులున్నారు. అది ముస్లిముల ప్రత్యేకత అనడం అబద్దం.

సామ్రాజ్య వాదాన్నెదిరించి పోరాడుతున్న పాలస్తీనియన్లు, ఇరాకీలు, ఆఫ్ఘన్లు ఆ పోరాటాలు చేస్తున్నది ముస్లిములుగా కాదు. పాలస్తీనియన్లుగా, ఇరాకీలుగా, ఆఫ్ఘన్లుగానే. నేను పైన పేర్కొన్న ఆఫ్ఘన్ అమ్మాయి ఆ రోజు ఆ జాగర్తలు తీసుకున్నది సామ్రాజ్య వాదం నుంచి ప్రమాదం వల్ల కాదు, సామ్రాజ్య వాద సేవకులైన స్థానిక ముస్లిం పెత్తందార్ల నుంచి వున్న ప్రమాదం వల్లనేనని మీరు ఇప్పటికే గుర్తించి వుంటారు. వాళ్లు ముస్లిములే గాబి, సామ్రాజ్యవాదాన్ని ఎదిరిస్తున్న వారు కాదు.

ఏదోలే ఆయనేదో సరదాగా ఒక అబద్ధం చెప్పాడనుకో, దాన్ని అంతగా పట్టించుకోవాలా అని అనకండి. బడికి పోవడం ఇష్టం లేక పిల్లలు కడుపు నొప్పి అని అబద్డం చెబుతారు. ఇది అలాంటిది కాదు. అలా అమాయకమైన అబద్ధం కాదు. ప్రమాదకరమైన అబద్ధం. ఇది ఇంపీరియలిస్టులకు, హిందూ మతవాదులకు, ఇతర మత వాదులకు వుపయోగపడే అబద్ధం.

సౌదీ అరేబియా, టర్కీ మొదలైన దేశాలలో పాలక ముస్లిములు ఇలాంటి ప్రచారాత్మక యోగ్యతా పత్రాలతో మరింత పెట్రేగుతారు. మరింతగా సామ్రాజ్య వాద సేవలో తలమునకలవుతారు. ఇండియాతో సహా పలు దేశాల సివిల్ సోసైటీలలో పెత్తందారీ ముస్లిములు సామ్రాజ్యవాద అనుకూలతలో తరించడానికి దీని వల్ల మరింత వూతం దొరుకుతుంది. కనుక, ఇది సామ్రాజ్యవాదానికి వుపయోగపడే అబద్ధం.

ఇండియాలో ముస్లిం మత వాదం మీద ముస్లిం మేధావుల నుంచి ఎలాంటి విమర్శ లేక పోతే…. విమర్శ లేకపోగా ఇలాంటి ప్రశంసల్ని వాళ్ళు ఎంజాయ్ చెయ్యడం మొదలెడితే… దాన్ని చూపించి… హిందూ మత వాదులు… మిగతా (సెక్యులర్) హిందువులను తమ వైపు గెల్చుకోడానికి అదొక చక్కని ప్రచారాంశం అవుతుంది. కనుక, ఈ అబద్ధం స్థానికంగా హిందూ మత వాదానికీ వుపయోగపడుతుంది. ఇదీ ఆ సారుకు చెప్పడానికి నేను విఫల యత్నించినది.

చివరికాయన, ‘నేనుముస్లిములను సపోర్టు చేస్తాను, వాళ్లు ఎలాంటి వారైనప్పటికీ’ అని అనేశారు. ‘నేనూ ముస్లిములను సపోర్టు చేస్తాను, మంచి వాళ్లను మాత్రమే, అడల్టరీ నేరానికి ఆడపిల్లల్ని రేప్ చేసి, రాళ్లతో కొట్టి చంపాలనే ఛాందసులను కాదు’ అని చెప్పబోయి, నోట మాట పెగలక ఆగిపోయాను. మాట్లాడకుండా వుండొచ్చు గాని, ఆలోచించకుండా వుండడం ఎలా? కుదరదు! నాలో నేను గుణ్ గుణాయించుకుంటూ పిచ్చోన్నయిపోవడం కన్న, మహర్శులారా, మహాత్ములారా! మీతో చెప్పుకోడం బాగుంటుందని అనుకున్నాను….. హెచ్చార్కె బాధ మాత్రం ప్రపంచం బాధ ఎందుకు కాదో చూద్దాం….

ఔనూ,

నా ‘మహర్షి, మాహాత్ముడు’ ఎవరో ఇప్పుడు మీకు తెలిసింది కదూ. మరెవరో కాదు, మీరేనని గమనించారు కదూ?! 🙂

కలుద్దాం, మళ్లీ నెలకు.

(రచన తేదీ: 14-06-2016)

(‘చినుకు’ మాస పత్రిక, ఆగస్టు, 2016)
Posted in ఓ మ‍హాత్మా ఓ మ‍హ‍ర్షీ | Leave a comment

పాటలు, పదాలే పదునైన ఆయుధాలు….

స్మృతి 23

రంగస్వామి దేవాలయం పల్లకీలను ఎవరో ఉప్పునీటి బావిలో పడేసి, మామీద నేరం మోపడం వంటి ఘటనలు… మా చిన్ని రైతు కూలీ సంఘానికి ఏమీ అడ్దంకి కాలేదు. విరివింటి వెంకటేశ్వర్లయ్య అనే వైదిక బ్రాహ్మణుడు వేరే వూరికి మకాం మార్చేస్తే, ఆయన మా వల్ల వూరు విడిచారని చేసిన దుష్ప్రచారంతో కూడా పెద్ద ఇబ్బంది కలగలేదు. నిజానికి అవి కాస్త అమ్యూజింగ్ గానే వుండినయ్. మేము ఐడిల్ గా వుండకుండా ఇంకా ఏం చేయాలా అని అలోచనల్లో పడడానికి వుపయోగపడ్డాయి.

బై ది బై; వెంకటేశ్వర్లయ్య కవి కూడా. ‘శర్మిష్ట’ పేరుతో ఆయన రాసిన పద్య కావ్యాన్ని నేను చూశాను. విజయాత్రేయ పనుపున ఆయన దగ్గరికి వెళ్లి ఛందస్సులు నేర్చుకుందామని నేను కూడా ప్రయత్నించాను. నేనంటే వెంకటేశ్వర్లయ్యకు కాస్త ప్రేమ కూడా. ఆయన మా వూరి బయట నీలకంఠేశ్వరాలయం పూజారి. “అయ్యా, ఈ కల్కి అవతారం అదీ అంటారే, అది మీరు నమ్ముతారా?” అని ఆయనను ఆడిగానొకసారి, నీలకంఠేశ్వరాలయం ప్రాకారానికి ఆనుకుని నిలబడి. “నువ్వు చెప్పే ఆ చండ్ర పుల్లారెడ్డినే కల్కి కావొచ్చు కదా, వాటినలాగే అర్థం చేసుకోవాలి” అన్నారాయన. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం. అలాంటాయన మా వల్ల వూరిడిసి పోయాడంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారు?

నేను రెండో సంవత్సరం ఎమ్మేలో వుండగా… చివర్లో… అనుకుంటాను కర్నూలులో విరసం మహా సభలు జరిగాయి. నేరుగా విశాఖ నుంచి కర్నూలు వెళ్ళాను. ( సెలవులు). మా తమ్ముడు శివా రెడ్డి, తన క్లాస్ మేటూ, నాకు స్నేహితుడు వండుట్ల నాగన్న, మా శివారెడ్డి చిన్నాన్న, ఆయనతో పాటు రాముడు, కిట్టన్న, రామకృష్ణా రెడ్డి, రంగయ్య వాళ్ళు…. అందరూ వచ్చారు. అప్పుడు మా జయమ్మ కర్నూలు కెవిఆర్ కాలేజీలో బియ్యే చదువుతోంది. తను మా కన్నా ముందే వచ్చి వుంది ఆ సభలకు.

వావ్, చుట్టూరా నా వాళ్ళు, నా కిష్టమైన పాటలు, పదాలు. సభ.

ముందుగా కొండా రెడ్డి బురుజుకు దగ్గరగా వున్న ఏదో హోటల్లో శ్రీశ్రీ, జ్వాలాముఖి వాళ్ళంతా వున్నారంటే వెళ్ళాం. నేను అక్కడ ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరికీ నేను తెలీదు. వాళ్లు నాకు తెలుసు. జ్వాలాముఖి తెల్లని ముతక శ్లాక్. మెడ మీద కాలర్ కాస్త చిరుగుగా వుండింది. జ్వాలా, నిఖిలేశ్వర్, చెర బాగా గుర్తున్నారు ఆ గుంపులో. వాళ్ల ఆత్మ విశ్వాసం నాకు చాల కంటేజియస్ గా వుండింది. శ్రీశ్రీ నడుముకు తువ్వాలు కట్టుకుని ‘మందు’ మధ్యలో గది తలుపు తెరిచి ‘మీట్ బాల్స్’ దొరుకుతాయా అని ఎవరినో ఆడగడం గుర్తుంది.

ఆ రాత్రి… జ్వాలా ముఖి చదివిన దీర్ఘ కవితలోంచి….. జనం చేతి కాగడాలు నక్షత్రాలయిపోయి పోరు బాటలో వూరేగింపు తీసే ఒక పద చిత్రం…. మనస్సులో వుండిపోయింది. యాధాటి కాశీపతి ఉపన్యాసం… వావ్…. ‘మా చండ్ర పుల్లా రెడ్డి తలకు లక్ష రూపాయలు వెల కట్టింది ఇందిరమ్మ. ఆమె తలకు ఏ విలువ లేదు, ఏదో కొంచెం వెల కడదామనుకుంటే కనీసం జుత్తూ కూడా లేదు’ అనే జోకు భలే పేలింది. నేను ‘హియర్ హియర్’ అని అరవడం విని పక్కన చిన్నాన్న ఆశ్చర్యంగా చూశాడు, వీడిలో ఈ కేకల చిన్నెలు కూడా వున్నాయా అన్నట్టు.

ఆ రాత్రి… శ్రీశ్రీ వేదిక ఎక్కుతున్నప్పుడే తెలిసిపోయింది, అయ్య గారు ఫుల్ లోడ్ అని. మైకు ముందు నుంచుని “ఊగరా ఊగరా….’ అని పొయెం చదువుతుంటే, ‘ఆ మాట ప్రత్యేకించి చెప్పాలా’ అని అప్పుడయితే అనిపించలేదు. మందు కొట్టనవసరం లేని అద్భుతమైన మత్తు మాలో. లోలోపల వూగుతూ ఏవేవో లోలక లోకాలు.

ఆ రాత్రి తమ్ముడు శివుడు, జయ, నాగన్న, నేను…. ఏదో హోటల్ కు వెళ్లి పరుపులు మాత్రమే అద్దెకు తీసుకుని ఆరు బయట పరుపులు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్దట్టోకి జారిపోయాం. ముగ్గురు అబ్బాయిలతో తను ఏ మాత్రం బెరుకు లేకుండా, జయ మా మీద గొప్ప నమ్మకంతో వుండడం నాకు చాల గొప్ప అనిపించింది. మా నలుగురిలో ఇప్పుడు ఒకరు లేరు. మా తమ్ముడు. మిగిలిన ముగ్గురి మధ్య ఆ అనుబంధం అలాగే వుంది, ఇప్పటికీ.

నేను, జయ విరసం సభల్లోకి వెళ్ళాక జయకు పరిచయమైన మొదటి వ్యక్తి చూడామణి. చూడామణి, జీవన్ (ఖమ్మం) అపుడు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరివీ వేర్వేరు కులాలు. పెద్దలు అంగీకరించిన పెళ్లి కాదు. అందువల్ల వాళ్లు పెద్ద వాళ్లను కాదని, తమ పెళ్లి తామే చేసుకున్నారు. చూడామణి కథ తెలుసుకున్నది మొదట జయనే. తను నాకు ఆ విషయం చెప్పినప్పట్నుంచీ, నాకు వాళ్ల మీద చాల గ్లామర్ ఏర్పడింది. విరసం సభల్లో వున్నంత సేపు వాళ్ళను చాల అభిమానంగా గమనించాను.

కర్నూలు విరసం సభల్లో ఉపన్యాసాల కన్న చాల ఎక్కువగా ఆకర్షించింది గద్దర్ ఖవాళీ. అసలు ఖవాళీ అనే కళారూపం పరిచయం కావడమే మాకది మొదటి సారి. వేదిక మీద గద్దర్ బృందం కూర్చుని, శ్రీకాకుళ జాతర పాట పాడుతూ, జనం బండికి ఎదురొచ్చే దొరలను హతమార్చి మరీ ముందుకు పోవాలని, వీర రసం వుట్టి పడేలా పాడుతుంటే, మా లోపల వుండి బయటికి పలకడానికి మేము భయపడుతున్న మాటలన్నీ వాళ్లు మాకు బదులుగా బయటికి చెబుతున్నట్టు అనిపించింది. అలా బయటికీ చెప్పగలిగిన వాళ్ళ ధైర్యానికి జేజేలు చెప్పాలనిపించింది. చెవులు వినజాలని డెసిబుల్స్ లో మా మనస్సులు పాడుతున్నట్లనిపించింది.

ఆ రోజు మమ్మల్ని ఆకట్టుకున్న మరో కళా రూపం… ‘భూమి బాగోతం’. దానిలో ‘మల్లీ గాన్ని నేను దొర జీతగాన్ని నేను’ అని పాడే మల్లిగాని పాత్ర, వెంగళ రావు పాత్ర…. మా బృందం పిల్లల మనస్సుల్లో ముద్ర పడిపోయాయి.
సభల తరువాత, అప్పటికి, ఆ అనుభవాలు మోసుకుంటూ ఎవరి పనుల్లోకి వాళ్ళం వెళ్లిపోయాం. సెలవుల తరువాత నేను తిరిగి విశాఖ వెళ్లి నా ఎమ్మే బాగోతం పూర్తి చేయాల్సి వుండింది.

ఎందుకా ఎమ్మే? ఎగ్గొట్టొచ్చుగా? ఏమో, ఆ వూహ నాకెప్పుడూ రాలేదు. ఒక పని మొదలెట్టి ఎగ్గొట్టడం ఎందువల్లనో ఇప్పటికీ నాకు అనూహ్య విషయమే. ఇది పాజిటివ్ గుణమా, నెగటివా? ఏమో. అంతే కాదు వుద్యమానికి అత్యవసరమైతే తప్ప, విద్యార్థులు చదువులు మానేయడం తప్పని అనుకుంటాన్నేను. ఎంత చదివితే అంత మంచిది. సైన్సు పుస్తకాలు, సాహిత్యం, కథలూ నవలలు ఏవైనా సరే. ఎంత నేర్చుకుంటే అంత మంచిది. సాహిత్యం, సంగీతం, సైన్సు ఏదయినా సరే. బాగా చదివిన వాళ్లు, బాగా నేర్చిన వాళ్లు ప్రజలకు, వుద్యమానికి మరింత బాగా వుపయోగపడతారు. ఉద్యమాలలో తప్పులు జరక్కుండా. ప్రజలకు నష్టాలు జరక్కుండా వుపయోగపడతారు.

అప్పటికి ఎవరి పనుల్లోకి వాళ్ళం వెళ్లిపోయినా; కర్నూలు విరసం సభలు మా అందరి మనస్సులలో వుండిపోయాయి. కేవలం తీపి గుర్తులుగా కాదు. తెగింపు గుర్తులుగా కూడా. ఎమ్మే అయిపోయి, నేను తిరిగి నా ఒరిజినల్ అమ్మ వొడి చేరాక, ఆ పాత గుర్తుల రేఖల మీద మా బొమ్మను మేము ట్రేస్ తీస్తూ, అందరం ఒక వుమ్మడి బొమ్మ గీస్తూ వుండినామని కూడా మాకు అర్థమయ్యింది. ఆ బొమ్మే మా చిన్ని రైతు కూలీ సంఘం.

ఔను. అదే మా చిన్ని రైతు కూలీ సంఘం.

ఇద్దరూ వర్జిన్స్ అయిన ప్రేమికులకు…. ‘ప్రేమించుకోడం’ (లవ్ మేకింగ్) గురించి వుండే ముందస్తు వూహల వంటివి…. విప్లవం పనుల గురించి అప్పుడు మా ఆలోచనలు. ఆ ప్రేమ చాల బాగుంటుందని మాకు తెలుసు. చాల గొప్పగా వుంటుందని తెలుసు. ప్రేమను రుచి చూసిన వారి ముఖాలు చూళ్ళేదూ?! ఎలా వెలుగుతుంటాయి?! ఆ ప్రాణాపాయకర జీవితాల్లోకి నిజంగా వెళ్లి చూడవలసిందే విప్లవమెలా వుంటుందో. అంతవరకు అది కేవలం ఒక వూహ.

రైతుకూలీ సంఘం అని పేరే గాని, మాది కేవలం ఒక సాంస్కృతిక సంఘం. ఒక సారి మాత్రం వూరిలోని ఓ పది మంది జీతగాళ్ళతో సమావేశం వేసుకున్నాం. సమస్యల్ని వెలికి తీయలేకపోయాం. మరీ బాధ పెట్టే సమస్యలు అప్పుడు మా వూళ్లో లేవేమో.

ఆ రోజుల్లో మా వూళ్లలో వేరుశనక్కాయలు తీయడం ఒక ముఖ్యమైన పోస్ట్ హార్వెస్టింగ్ పని. భూమిలో వేర్లు పరుచుకునే ఒక రకం వేరుశనగ. గుంటకతో చేను పాసి, వేరుశనగ చెట్లను వేర్లతో పాటు పెకలించి, ఎడ్ల బండి మీద ఇంటికి తెచ్చే వారు. లేదా చేని లోనే గుట్టలుగా వుంచే వారు. తరువాత ఆ చెట్ల నుంచి వేరుశనక్కాయలు తీయడం ఒక పని. ఈ పని కూలీల్ని పెట్టి చేయాల్సిందే. శనక్కాయ తీసే కూలీ తక్కువగా వుందని మా చిన్ని సంఘంలో ఎవరో అన్నారు. ఇంకేం ఈ సమస్య తీసుకుందాం అని అయిడియా వచ్చింది. లేడికి లేచిందే పరుగు. అందరం కట్ట గట్టుకుని బయల్దేరాం. ఇళ్ళ ముందు కూర్చుని శనక్కాయ తీస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి రైతులు కూలీ పెంచే వరకు ఈ పని చేయకుండా వుందామని చెప్పడం మొదలెట్టాం.

మా పని ఎంత ఫార్సుగా తయారయ్యిందంటే, ‘అవ్ రెడ్డీ, నువ్ బలె జెప్తొండావు. ఇంగ జెప్పు” అనుకుంటా అమ్మలక్కలు తమ పని తాము చేస్తునే వున్నారు. ఒక్కరు కూడా పని మానేయలేదు. బాలనాగి రెడ్ది మామ లాంటి రైతులు మంచాల మీద కూర్చుని… దసరా పండుగ నాడు, వెదురు బద్దల బొమ్మ విల్లమ్ములు పట్టుకుని ఇళ్ళ ముందు నిలబడి, “అయ్య వారికి చాలు ఐదు వరహాలు/ పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు” అని పాడే బడి పిల్లల్ని చూసినట్టు చూశారు మమ్మల్ని.

రైతుకూలీలు మమ్మల్ని సమ్మె చేసేంత సీరియస్ గా తీసుకోలేదు గాని మేము ఏవో మంచి మాటలు చెబుతున్నామని అనుకునే వారు. ప్రేమించే వారు. విప్లవోద్యమ ప్రచారానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాం. కర్నూలు విరసం సభల్లో విన్న పాటలు, పదాలు గుర్తు చేసుకున్నాం. పాటల టెక్స్ట్ సంపాదించి, నేర్చుకున్నాం. రెండు డక్కీలు (గుమ్మెటలు) కొన్నాం. కేవలం పాటలు చాల వనిపించింది. కర్నూలులో విన్న ‘భూమి భాగోతం’ నేర్చుకున్నాం. మా రాముడు దొర వేషం వేసే వాడు. కిట్టన్న (కృష్ణుడు) వెంగళరావు వేషం వేసే వాడు. సామన్న జీత గాని వేషం… ఇలా పిల్లలందరూ తలా ఒక వేషం.

బజారులో ఏవైనా నాలుగు దార్లు కలిసే చోట, ఒక ‘పొట్టు జల్ల’ (పొడుగ్గా వుండే వెదురు గంప) బోర్లించి పెట్టే వాళ్ళం. దాని మీద వీలయితే పెట్రొమాక్స్ లైటు లేకుంటే జస్ట్ లాంతరు పెట్టే వాళ్ళం. మొదట కొన్ని పాటలు. పాటకు పాటకు మధ్య నా వుపన్యాసం, ప్రతి సారీ “కామ్రేడ్స్” అంటూ మొదలెట్టి. చివరికి ‘భూమి భాగోతం’ ప్రదర్శించే వాళ్ళం. రాముడు, కృష్ణా రెడ్డి వాళ్ళు ఎంత చక్కగా పాడే వారంటే, మా వూళ్లో ఒక బజారు తరువాత మరో బజారు వాళ్ళు మమ్మల్ని అడిగి మరీ రాత్రి ప్రోగ్రాంలు పెట్టించే వాళ్ళు. మా వూరి బజార్లలో ఒకటికి రెండు సార్లు అయ్యాక పక్క వూళ్లకు కూడా వెళ్ళాం. వండుట్ల అనే లోతట్టు గ్రామం, మా అమ్మ వాళ్ళ వూరు కొండమీది బొల్లవరం, దగ్గర్లోని సుగాలి తండా, జలకనూరు…. ఇలా చుట్టు పట్ల వూళ్లన్నీ చుట్టేశాం.

అప్పటి వరకు నేను పాటలేవీ రాయలేదు. మా చిన్ని రైతు కూలీ సంఘం అవసరాల కోసం పాటలు రాయడం మొదలెట్టాను.

‘కష్టజీవులు కదిలి రండోయ్
ఆయుధాలను అందుకొండోయ్
కష్టజీవులు కదిలినపుడే
దారిద్ర్యానికి పరిష్కారం’

అని…. చెప్పదలచుకున్నది నేరుగా సూటిగా సుత్తి లేకుండా చెప్పడమే అప్పుడు పాట. చిత్తుగా కాస్త కవిత్వం, కొన్ని కథలు తప్ప… సీరియస్ గా తపించి, ఎట్టాగయినా రాయాలి, రచయితనైపోవాలి… అని రాసిందేమీ లేదు. ‘మినీ జ్వాల’లో ఒక కవిత, ‘జ్యోతి’ మాస పత్రికలో మరొకటి అచ్చు కావడం తప్ప వెలుగు చూసినవి కూడా లేవు. అయినా ఏదో ఆత్మ విశ్వాసం… నేను రాయగలనని, నేర్పించే వారెవరూ లేకపోయినా రాయడం నేర్చుకోగలనని.
అప్పుడు రాసిందే ఒక మంచి పాట. పార్వతి గారు, మరి కొందరు ఆ తరువాత పాడే వారు.

తూర్పు సేని గట్టు కాడ
చెట్టు పుట్ట గొట్టెటోడ
అంబట్యాల మించి పాయెరా
సద్దిబువ్వ సంగతేమిరా

బొగ్గుల బాయి కనుమ కాడ
చెట్టు గొట్టి చేసు జేస్తె
కేసు మీద కేసులాయెరా
ఉన్న చేను అమ్ముడాయెరా

(అంబట్యాల= అంబలి వేళ, మధ్యాహ్నం)

పాటలయితే రాశాను గాని, నాకు పాడడం రాదనే బాధ ఎప్పుడూ వుండేది. ఇప్పుడూ వుంది. పాడడం రాదని, వాద్యాలు వాయించడం రాదని బాధ.

మా మమ్మి తల్లికి, తన కాలేజీ రోజుల్లో చాల సార్లు చెప్పే వాడిని. పాడడం నేర్చుకోరా, కనీసం ఒక వాయిద్యమయినా వాయించడం నేర్చుకోరా అని. తనకూ కుదరలేదు ఇంతవరకు.

చెప్పొద్దూ, అవీ ఇవీ నేర్చుకునే కౌటుంబిక వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్లను చూస్తే బాగా అసూయ.

అలాటి వారు ధనికుల్లో వుంటారు. పేదల్లో కూడా వుంటారు.

పేదల్లో వృత్తి కళాకారులే వుంటారు. అధికారికంగా చెప్పలేను గాని; గద్దర్, గోరటెంకన్న, వంగపండు వంటి గాయకులు అలాంటి గాయక కుటుంబాల లోంచి వచ్చిన వారే. విమలకు ఆ వాతావరణం వుండింది, ఉద్యమం వల్ల.

నాకు తెలిసిన వారిలో అంబిక వంటి ‘అగ్ర’వర్ణజులు పాడడం, ఆడడం… నిర్దిష్ట శిక్షణగానే నేర్చుకున్నారు.

ఎటు తిరిగీ మధ్య తరగతి వారికే ఈ అవకాశాలు ఆరుదు.

ఎంతో కొంత సంగీత జ్ఞానం లేకుంటే, కష్టపడి ఒకట్రెండు పాటలు రాయొచ్చు గాని, ఆ పని బాగా చేయలేం. సినిమా పాటలు రాసే వారికి కూడా ఇది వర్తిస్తుందేమో. శ్రీశ్రీ, అరుద్ర, ఆత్రేయ పాడలేకపోయినా (?), వారికి ఎంతో కొంత సంగీత జ్ఞానం వుండి వుండాలి. లేదా వారు ఛందస్సులను ఆశ్రయించి వుండాలి. సినారె బాగా పాడుతారు, సీతారామ శాస్త్రి కూడా.

ఒకటి రెండు సార్లు ఇన్ఫార్మల్ గా కనీసం డక్కి అయినా కొడదామని, దూల వంటి సమయాల్లో రెండు అడుగులయినా చక్కగా వేద్దామని ప్రయత్నించి అరుణోదయ రామారావు వంటి మిత్రులతో తిట్టించుకోడమే గాని ఆ విద్య అస్సలు అలవడలేదు.

అలవడలేదనే బాధా తీరలేదు. నా బాధకు సంకేతంగా హైదరాబాదులో వున్నంతవరకు ఓ పని చేసే వాడిని. ఎక్కడయినా వేణువులు అమ్మే బండి కనిపిస్తే చాలు, వెళ్లి ఒకటి రెండు వేణువులు కొని తెచ్చుకునే వాడిని. మా ఇంటికి వచ్చిన పిల్లలకు అవి ఇచ్చి, మా వేణువుల పొదిని మళ్లీ పూరించే వాడిని. ఔను, హబ్సిగూడాలో మా గోడకు ఒక ‘పొది’ వేలాడుతుంటుంది. దానిలో అమ్ములకు బదులు వేణువులుంటాయి. ఆ వేణువుల పొది బొమ్మనే నా వ్యాసాల సంపుటి ‘సంబరం’ కవరు పేజీగా వుపయోగించాను.

అప్పుడెప్పుడో మిత్రుడు, గాయకుడు మల్లేపల్లి లక్ష్మయ్యకు నామీద కోపం వచ్చింది. ‘సుంకరి పోశన్న’ అనే మారు పేరుతో వ్యాసం రాశాడు. నాకు గుర్తున్నంత వరకు, వచన కవిగా నేను చేస్తున్నదేమిటనే విమర్శ అందులో వుంది. నేను వాదంలో ఓటమిని ఆంగీకరిస్తానని, పాడడం చాత కాకనే వచన కవిత రాస్తున్నానని, అది గొప్ప అనుకోడం లేదనీ రాసిన పద్యం ఇదిగో ఇది:

//ఓటమి గర్వం//

నిజంగా నేనోడిపోయిన క్షణమిది
ఓడిపోయినందుకు గర్వించే క్షణం
ఇంతకూ ఇలా పాటలు రాయడమెందుకు
తుప్పు పట్టిన స్వరపేటికను విప్పలేకనే కదా
నువ్వు పాడు సుంకరి పోశన్నా
నువ్వు ఆడు భూగోళం నీ మొల మువ్వయ్ మోగగా
చేతుల్లేని పిల్ల
కాళ్ళతో వంట చేసుకున్నట్టు
నన్నిలా
కలంతో పాడనివ్వు

నా బల్ల మీద రెండు మూగ వేణువులు
గాయపడిన వారంతా పాడాలని లేదు
ఆ బల్ల మీదే ఒక చిట్టి మట్టి కుందేలు
దూక గలిగితే మాత్రం యేదీ అడివి
ఆ బల్ల మీదే మట్టిదే మరొకటి
గట్టిగా రెక్కలు ముడుచుకున్న చిలుక
సుదీర్ఘ నిద్ర కోసం రెప్పల ఆరాటం
మెలకువగా వుండి చేసేదేమైనా వుంటే
చిలుక రెక్కల కింద కాస్త గాలి వూదు పోశన్నా
భయంకరమయిన భయం అనే బోను లోంచి
ఈ అశాంతిని విడుదల చెయ్యి, ఇది
వేణువుకు ప్రాణమిచ్చే వూపిరవుతుంది

నిజమే ఇది నే నోడిపోయిన క్షణమే గాని
బతుకు వేసే పొడుపు కథలను
కంఠనాళం చిక్కు ముడులను
సుంకరి పోశన్నా
విప్పగలవా నువ్వయినా

(‘నకులుని ఆత్మకత’ పేజ్: 37)

కేవలం పాటలు, పదాలతోనే కుదరదు. అప్పుడు మేము ఎంచుకున్న పనికి అవి చాలవు. ఇంకేమేమో చేయాల్సి వుంది. ఏం చేయడం, ఎలా చేయడం అనేది ఆ మారుమూల పల్లెటూరిలో మా చిన్ని సంఘం ఎదుర్కొన్న కీలక ప్రశ్న.

nakuluni atmakatha.JPG

(వచ్చే వారం ‘ఒక ప్రశ్న పలు జవాబులు’)

Posted in Uncategorized | Leave a comment

ఏ వాదం లేని వారెవరు?

(గుర్తున్న మేరకు, గుర్తున్న రూపంలో…   2016 జులై 3ఆటా’ (ATA – American Telugu Association) సదస్సులో నా మాటలు ఇవి. శీర్షిక ఇప్పటికిప్పుడు పెట్టినది. ఆ సాయంత్రం నా ప్రసంగం శీర్షిక తెలుగు సాహిత్యంలో వాదాలు’.)

hrk-ATA

వివాదంలో ఇద్దరుంటారు. దాన్ని పేచీ అనీ కొట్లాట అనీ అంటారు.

వాదంలో… అది జరిగే చోట… కేవలం ఒక్కరే వుండొచ్చు.

ఇప్పుడు నేనొక వాదం చేస్తున్నాను. మీరు వింటున్నారు. నేను మీతో వాదించడం లేదు. నా వాదాన్ని మీకు వినిపిస్తున్నాను. దీన్ని నేను రాస్తున్నట్టు వూహించుకోండి. రాసేప్పుడు నేను ఒక్కడినే కదా.

లేదు. అప్పుడు కూడా ఒక్కడినికాదు. నేను వాదం చేస్తున్నట్టయితే… నా ముందు మరొకరు వుంటారు. నా వూహల్లో. ఊహల్లోని మనిషి తిరిగి మాట్లాడడు. ఇప్పుడు మీలాగే. అయినా ఆ మనిషికీ, మీకూ జవాబుదారీగా వుండక తప్పదు నేను.

ఇంకొకరు వున్నట్ట్లు మస్తిష్కంలో వూహ లేకపోతే, చేతి వేళ్లు టైపు చెయ్యవు. సో, వాదంలో కూడా ఇద్దరు వుండక తప్పదు.

ఈ రెండు… ఈ ద్వైతం…  చాల ముఖ్యం, బండి నడవడానికి.

వాదం అనేది ఒక డయలెక్టికల్ చర్య. సత్య శోధనలో మంచి – చెడు, ప్రగతి – తిరోగతి … ఎక్కడికక్కడ మన నిర్ణయాలు మనం చేసుకోడానికి… అలోచించడానికి…. మనం ఆనుసరించే మార్గం వాదం. మనల్ని మనం ఇతర్లకు ప్రెజెంట్ చేసుకోడానికి వుపయోగపడే భూమిక వాదం. సో, వాదం లేని చోటు లేదు. తమ దైన వాదం లేకుండా ఎవరూ లేరు.

మరయితే, వాదాలు వద్దు, కవిత్వంలో వాదాలు వుండొద్దు అని కొందరు  ‘వాది’స్తారెందుకు? అదే నాకూ ప్రశ్న. ఔను, ఎందుకు వాదిస్తారు? ఈ ప్రశ్నే ఈ రోజు నా ప్రసంగానికి ఇరుసు.

ముందుగా ఒక విజ్ఞప్తి. ఇది నా వాదం. కొందరికిది నచ్చకపోవచ్చు. వారి వాదం వారు చెప్పవచ్చు. నిజానికి వారు చెబుతూనే వున్నారు. అది బాగా విని వుండడం వల్లనే, ఇప్పుడు, నేనీ టాపిక్ ఎంచుకున్నాను. ఏ నేపధ్యంలో ఈ టాపిక్ ఎంచుకున్నానో ఎందుకు చెబుతున్నానంటే, ఆ నేపధ్యపు నీడలు నా మాటల మీద వుంటయి. ఇవి వ్యక్తులుగా ఎవర్నో నొప్పించడానికి కాదు. నన్ను కోప్పడండి గాని, నొచ్చుకోకండి.

‘నేతి నేతి వాదం’ అనే మాట మీరు విన్నారా?

ఇది పాత అలంకార శాస్త్రం గురించి సరదాగా అనే మాట. సరదా అని ఏమిట్లెండి?! దాన్ని సీరియస్ గానే తీసుకోవచ్చు. అలంకార శాస్త్ర చర్చ అలాగే సాగుతుంది. ఒకాయన ‘ఔచిత్యం’ కావ్యానికి ప్రాణం అంటాడు. మనం ఓహో అనుకుంటాం. మరొకాయన వస్తాడు అది ‘కాదు’ అంటాడు. కాదు అనేసి వూరుకోడు. తాను ఏది ఔననుకుంటున్నాడో అది చెబుతాడు. ఆయన ధ్వనిరాత్మా కావ్యస్య అంటాడు. కావ్యానికి ఆత్మ ధ్వని అంటాడు. ఇదీ బాగుంది కదా? ఇంకొకాయన ఇది కూడా కాదంటాడు. వక్రోక్తి కావ్య జీవితం అంటాడు. (ఇక్కడ వరుస క్రమాలు గాని, ఆ మాటల సంస్కత రూపాలు గాని ఎగ్జాక్ట్ కావు).

ఆలంకారికుడు తన కాలానికి వున్నదాన్ని ‘న ఇతి’ ‘న ఇతి’ (ఇది కాదు, ఇది కాదు) అని  ‘తిరస్కరించి’  కొత్తగా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వల్ల….  అలంకార శాస్త్రం మీద ‘నేతి నేతి వాదమ’ని ఒక రుచికరమైన చమత్కారం ప్రచారమయ్యింది.

కావ్యాత్మ  ధ్వని అనే ఆనంద వర్ధనుని మాటను అందరూ అంగీకరించడంతోనో, లేదా రమణీయార్ఠమిచ్చే వాక్యమే కావ్యమని జగన్నాధుడు చెప్పిన మాటతోనో ఆ చర్చ అగిపోయిందని అంటారు. ఏమీ ఆగిపోలేదు. ఆ నేతి నేతి వాదం ఇంకా కొనసాగుతూనే వుంది. కవిత్వం అంటే ఏమిటి అనే చర్చ ఆగిపోలేదు. కవిత్వం లాగే దాని చర్చ కూడా ఆగదు.

కాకపోతే, ఆ చర్చను జాగర్తగా గమనిస్తే, మొదటి నుంచి అలంకారికులలో ఒకరి కన్న మరొకరు ‘ఎక్కువ’ ‘సత్యం’ చెప్పారని అనిపిస్తుంది. మునుపటి ‘నిర్వచనం’ కన్న కొత్త నిర్వచనం మనకు ఎక్కువగా నచ్చుతుంది. అంటే వాదం వల్ల ఆలోచన ఒక రకం ‘వృద్ధి’కి లోనవుతుంది. ఈ వృద్ధి నిటారుగా కాకుండా స్పైరల్ గా వుంటుంది. పునరావృతమవుతున్నట్టు అనిపిస్తూనే, పై పొరకు వెళ్తుంది. పాత దాన్ని పూర్తిగా తీసేయకుండా, దాన్ని తనలో ఇముడ్చుకుని, పై పొరకు వెళ్తుంది.

వాదం అనే మాటను ‘ఇజం’ అనే అర్థంలోనే వాడుతున్నాం. ఈ అర్థం సరైనదని నేను అనుకుంటాను.

విషయాన్ని అర్థం చేసుకోడానికి, మన మెడ చుట్టు మనం చిక్కు ముడులు వేసుకుని వుమ్మ నీటిలోనే గుటుక్కుమనకుండా వుంటానికి, విషయాన్ని సులభంగా అధ్యయనం చేయడానికీ… అనుసరిస్తున్న మార్గాలనే వాదాలు అంటున్నాం.

సాహిత్యంలోనైనా వాదాలు ప్రధానంగా రెండు రకాలేనని నా అభిప్రాయం. ఔను ఇది నా అభిప్రాయమే. ఇంకొకరు చెప్పినది కాదు. దీనికి అలాంటి ప్రమాణాలేవీ లేవు. ఇది నా ప్రతి పాదన.

రెండు రకాలల్లో మొదటిది భావ వాదం, రెండవది భౌతిక వాదం.

కళ్ల ముందు వున్న జీవితం, అనుభవించిన జీవితం…ఇవి కాదు, భావాలే కవిత్వం అని భావ వాదుల వాదం సారాంశం. అందే నేల కాదు, అందని చుక్కలూ, చుక్కల మీద వూహలే వీరికి కవిత్వం.

అందుకే వీరు తరచు ఏ వాదం వద్దు అని అంటూ వుంటారు.

ఏ వాదం వద్దు అని పనిగట్టుకుని అనడం దానికదే ఒక వాదం.

కొమ్మూరి వేణూగోపాల రావు నవల ఒకటుంది. ‘వ్యక్తిత్వం లేని మనిషి’ అని. దానిలో ప్రధాన పాత్ర మృత్యుంజయ రావు (?). రావు నవల అంతా ఏ వ్యక్తిత్వం లేకుండా ప్రవర్తిస్తాడు. వ్యక్తిత్వం లేకపోవడం అతడి వ్యక్తిత్వం. ఇది కృత్రిమంగా వుంటుంది. అలాంటి పాత్రల్ని రచయిత కష్టపడి నడిపించాల్సి వుంటుంది. ఎందుకంటే, ఏ వ్యక్తిత్వం లేకుండా ఏ వ్యక్తి వుండడు.

ఏ వాదం లేకుండా ఎవరి ఆలోచనలూ వుండవు.

కవిత్వానికి ఏ వాదం వుండరాదనే వారు… తిరిగి…  రెండు రకాలు ఆని నా అబిప్రాయం. మొదటి రకం తాము ఏ వాదాన్ని అనుసరిస్తున్నారో అది తమకే తెలీని వారు. రెండో రకం…  తమ వాదాన్ని తాము దాచి పెట్టుకుంటున్న వారు.

అలా దాచి పెట్టుకోవలసిన అవసరం ఏం వుంటుంది కవికి?

ఉంటుంది. అదెలా అంటారా?

ఉదాహరణకి… దళిత వాదం, స్త్రీవాదం అనేవి వున్నాయి. దళిత వాదులు, స్త్రీ వాదులు తాము దళితవాదులం, స్త్రీవాదులమని చెప్పుకోడానికి సిగ్గు పడరు. కాని, వారి వ్యతిరేకులైన బ్రాహ్మణ వాదులు, మగదురహంకార వాదులు మాత్రం తమను బ్రాహ్మణ వాదులని, మగదురహంకార వాదులని ఎవరైనా అంటే కోప్పడతారు. అలాంటి వాదమేదీ లేదని, అసలు ఏ వాదమూ లేదని, ఏ వాదమూ వుండొద్దని.. ఇలా ఒక్కొక్క మెట్టుగా రెట్టిస్తూ వాదిస్తారు.

ఎందుకు కోపం? వర్ణాశ్రమ ధర్మం గొప్పదని, అందులో బ్రాహ్మణులు గొప్ప అనీ, వారికి మరియూ గోవులకు పూజలు చేయాలనే ధర్మాలను సమర్థించే వారు బ్రాహ్మణ వాదులు. ఆ మాటలున్న పుస్తకాలను  విమర్శించకుండా యధాతధంగా అనుసరించాలనే వారు బ్రాహ్మణ వాదులు. మరో మాటలో చెప్పాలంటే,  సమాజ సంక్షేమానికి బ్రాహ్మణ ఆరాధనను కేంద్రం చేసే వారు బ్రాహ్మణ వాదులు. మగవాడు ఎక్కువనీ, ‘అతడు’ ‘ఆమె’కు ప్రతినిధి అనీ ‘అతడి’ కోసమే ‘ఆమె’ బతుకు అనీ వాదించే వారు మగ దురహంకార వాదులు. రక రకాల రూపాల్లో ఆ వాదం చేసే వారు… అనువు గాని చోట కాసేపు నోరు మూసుకున్నప్పటికీ…  ఆ వాదానికి అనుగుణంగా జీవించే/రాసే/చదివే వారు…. మగ దురహంకార వాదులు. కాని ఈ రెండు వాదాల వాళ్ళు తాము ఆ ఫలానా వాదులమని చెప్పుకోరు, ఒప్పుకోరు.

భావ వాదులు కూడా అంతే. తమది ఒక వాదమని చెప్పుకోడం వీరికి ఇష్టం వుండదు. అందుకే కవిత్వానికి వాదాలే వొద్దు అని పనిగట్టుకుని మాట్లాడుతుంటారు. ఎంత పనిగట్టుకుని మట్లాడతారంటే, ఒక్కోసారి కొందరు మంచి కవులు కూడా చాల అసందర్భంగా మాట్లాడి మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఆశ్చర్యం ఏమీ లేదు. ‘వాదం లేద’నడం వారి వాదంలో ముఖ్య భాగం. తమకు ఒక వాదం వుందని వారు చెప్పుకోరు, ఒప్పుకోరు.

ఇవాళ కొందరు యువకవులకు, యువకవయిత్రులకు నీడ ఇస్తున్న గొడుగు ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఒక మంచి కవి. తనదైన గొంతు వున్న గొప్ప కవి. ఏది కవిత్వమో ఏది కాదో గుర్తించగల రస హృదయుడు. ఆయన చాల ఇష్టపడి ఎంపిక చేసుకుని అనువదించిన విభాషా కవితల చిరు పుస్తకం ‘రెండో ప్రతిపాదన’. పుస్తకంలోని కవుల్ని ఇష్టపడడంలో ఇస్మాయిల్ అతి పాక్షికత్వానికి (పార్తిజాన్షిప్ కి) లోనవకపోవడం ఆభినందనీయం.

వాస్తవ జీవితానుభవాలతో కవిత్వమయిన పలువురు కవులను ఈ చిన్న పుస్తకంలో పరిచయం చేశాడు ఇస్మాయిల్. పరిచయం చేసే కొద్ది మాటల్లో ఆయన ‘వాదం’ తెలిసిపోతుంది. ఉదాహరణకు; బెర్తోల్ బ్రెహ్ట్ కవిత్వం ‘స్టాలిన్ మీద మూడు పద్యాలు’ అనువదించి ప్రచురించాడు. స్టాలిన్ ని వ్యతిరేకించడంలో బ్రెహ్ట్ లేదా ఇస్మాయిల్ మొదటి వారు కాదు. చివరి వారు కారు. స్టాలిన్ మీద విమర్శ పెట్టినా, బెర్తోల్ బ్రెహ్ట్ కమ్యూనిజాన్ని విమర్శించ లేదు. (విమర్శించరాదని కాదు, విమర్శించ లేదు).  బ్రెహ్ట్ పద్యాల్ని అందిస్తూ “కమ్యూనిస్టు రచయితల్లో కూడా నిజాయితీపరులున్నారని నిరూపించడానికి మాత్రమే ఇవి ప్రచురిస్తున్నాను” అంటారు ఇస్మాయిల్. కమ్యూనిస్టు రచయితల్లో నిజాయితీ పరులున్నారని ఈ పెద్ద మనిషి నిరూపించాలా?

కమ్యూనిస్టు కావడానికి, నిజాయితీ లేకపోవడానికి సహజ సంబంధం ఏదో వుందని ఇక్కడ ఇస్మాయిల్ ధ్వని. ఈ దారుణమైన మాట అనడం… ఇస్మాయిల్  ఒక ‘వాది’ అయితే తప్ప సాధ్యం కాదు. ఇదే పుస్తకంలో పాబ్లో నేరూడా పద్యం ఇస్తూ… ‘కమ్యూనిస్టయినా కమ్మని కవిత్వం రాశాడు’ అని వ్యాఖ్యానించాడాయన. ఇవి అదాటుగా దొర్లిన చమత్కార చాపల్యాలు  కాదు. తన వైఖరిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఇంకా చాల సార్లు ప్రయత్నించారు.

ఇంతకూ ఇస్మాయిల్ ‘వాదం’ ఏమిటి?

అసలు, మనం దేన్నైనా వాదం అని ఎప్పుడు అంటాం?

  1. అది కొన్నిటిని పనిగట్టుకుని ఎక్స్ క్లూడ్ చేస్తున్నప్పుడు.
  2. తను ఎక్స్ క్లూడ్ చేసే వాటితో తన వైరుధ్యాన్ని పదే పదే సమర్థించుకుంటున్నప్పుడు.
  3. కొన్నిటిని ఇంక్లూడ్ చేసుకుని వాటిని సమర్థించుకోడానికి ప్రత్యేకించి ప్రయత్నిస్తున్నప్పుడు
  4. తనలో ఇమడని వాటిని విరిచి, వంచి, క్షమించి…  కృత్రిమంగా ఇంక్లూడ్ చేసుకోజూసినప్పుడు, ఇమడకపోతే శత్రు వైఖరి అవలంబించినప్పుడు.

ఈ ఎక్స్ క్లూజన్, ఇంక్లూజన్ల వల్లనే ఒక వైఖరి ‘వాదం’ రూపం ధరిస్తుందని నేను భావిస్తున్నాను. ఏ సిద్ధాంతమయినా, ఏ వాదమైనా ‘ఇతర’ వాదాలతో ‘భేదం’ (డిఫరెన్సు) లేదా ‘వైరుధ్యం’(కాంట్రడిక్షన్) వల్లనే వునికిలో వుంటుంది. ఇస్మాయిల్ వాదమూ అంతే. వాదం వద్దు అనే మాట ఇస్మాయిల్ కు సంబంధించినంత వరకు ఒక స్వవచన వ్యాఘాతం.

పాదార్థికతకు, వాస్తవికతకు తిలోదకాలిస్తే తప్ప కేవలం భావాలలో ఓలలాడడం ఏ కవికీ (ఏ మనిషికీ) సాధ్యం కాదు. మనం భావ కవిత్వం అంటున్న దానికి కూడా పాదార్థికమైన అర్థం చెప్పుకోగలిగినంత వరకే ఆ కవిత్వం మనకు అర్థవంతమవుతున్నది. మిగిలిందంతా తిని కూర్చున్న వాడి మెట్ట వేదంతమే. ‘తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు’ అంటో అదొక ఆజీర్తి జబ్బు అవుతున్నది. మెట్ట వేదాంతమంటే కాసేపు కబుర్లు చెప్పుకోడానికి శిష్టులకు (తీరిక ఎక్కువైన వారికి) పనికొచ్చే స్పెక్యులేషన్ అని నా వుద్దేశం. అది దేనికీ ఎవరినీ కదిలించదు, తాను కదలదు.

కవిత్వం ఇలా మునుపు రాజుల అనుభవానికీ, ఇప్పుడు శిష్ట వర్గం అనుభవానికీ పరిమితం కావడం సరైనదేనా? ఎవరో ‘పోషించక’పోతే పాపం కవిత్వం ఎలా బతుకుతుంది… అంటారా?

ఈ తరహా కవిత్వం తనకు ఏ వాదం లేదని అనడం కుదరదు. దానికొక వాదం వుంది. దాని పేరు ‘వాదం వద్దనే వాదం’. ‘శుద్ధ ఆనంద వాదమ’ని దీనికి మరొక పేరు కూడా పెట్టుకోవచ్చు. బ్రాహ్మణ వాదం లాగే, మగదురహంకార వాదం లాగే ఇది కూడా తాను ఒక ‘వాదం’ అనే మాట చెప్పుకోదు, ఒప్పుకోదు. కవిత్వానికి ‘వాదం’ వద్దంటుంది. అమాయకంగా కనిపించే ఆ బ్యారికేడు వెనుక నుంచి ప్రజానుకూల వాదాల మీద దాడి చేస్తుంది.

ఉదాహరణకు ఇస్మాయిల్ కవిత్వం నేల వదలని సందర్భాలున్నాయి. అవి పాజిటివ్ గా వున్నాయి నెగటివ్ గా కూడా వున్నాయి. చెట్లు, చిలకలు రాను రాను కనుమరుగవుతున్న సంధి కాలంలో ఆ పెయిన్ ని ‘అందం’గా గుర్తు చేసి దాని కోసం మన ఈర్నింగ్ ని పెంచుతుంది ఇస్మాయిల్ కవిత్వం. పరిసరాల మీద మన ప్రేమను పెంచుతుంది.  ఇది పాజిటివ్.

స్వేచ్చకు వున్న కొన్ని సహజ పరిమితుల్ని మరి మరి గుర్తు చెయ్యడం ద్వారా, ఇది స్వేచ్ఛ లేని తనాన్ని ఆస్వాద యోగ్యం చేస్తుంది. తోలు కాయమిది తూట్లు తొమ్మిది తరహా ఆధ్యాత్మిక నిర్వేదానికీ ప్రోది చేస్తుంది. ఈ నిర్వేదం అన్ని మెట్ట వేదాంతాల లాగే, యథా తధ స్టితికి సాయపడుతుంది. ఇది నెగటివ్.

ప్రకృతి విధించే పరిమితుల సంగతి తరువాత చూద్దాం, ముందుగా మనిషి మనిషికి విధించే పరిమితులను అధిగమిద్దాం అనే సహజ స్పృహను ఈ వాద-రహిత-వాదం మొద్దు బారుస్తుంది.

స్తీవాద, దళిత వాద, శ్రామిక వాదాల రూపంలో స్త్రీలు, దళితులు, శ్రామికులు తమ తమ బంధనాల నుంచి విముక్తి కోసం పోరాడుతున్న కాలంలో ఇస్మాయిల్ జీవించారు. తను ఆ సంగతులేమీ మాట్లాడకపోగా…  స్వేచ్ఛకు వున్న పరిమితులను  రొమాటిసైజ్ చేయడం ద్వారా….  ఇస్మాయిల్ యొక్క ‘శుద్ధ ఆనందవాదం’ శిష్ట వర్గానికి (బ్రాహ్మణ వాద, పిత్రు స్వామిక వాదులతో సహా శిష్ట వర్గానికి) పసందుగా వుంటుంది. వారితో చాల త్వరగా ‘వహ్వా’ అనిపించుకుంటుంది. స్త్రీలు, దళితులు, శ్రామికులు విసురుతున్న సవాళ్లను… అవి పచ్చి బౌతిక వాంఛా (వల్గర్ మెటీరియలిస్టిక్) వాదాలుగా తిరస్కరించడానికి వుపయోగపడుతుంది. కొందరు కవులూ రచయితలు జీవితం విసిరే ప్రశ్నలను తప్పించుకుని తమ సుఖం తాము చూసుకోడానికి వీలు ఇస్తుంది.

వీరు తిరస్కరించేది కమ్యూనిజాన్ని మాత్రమే కాదు. భౌతిక జీవితాన్ని పట్టించుకునే వాదాలన్నిటినీ తిరస్కరిస్తారు. ‘జెన్’ అంటో కొత్త బట్టల కింద పాత ఆస్తిక భావాలను ఎంచక్కా ‘ఇంక్లూడ్’ చేసుకుంటారు.

ఈ తరహా ‘శుద్ధ ఆనంద వాదా’న్ని బహిరంగంగా ఓనప్ చేసుకోలేకనే, వీరు ఏ వాదం వద్దనే వాదం వెనుక దాక్కుంటున్నారని నా అభియోగం.

2

ఒకటి భావ వాదమనుకున్నప్పుడు ఇవాళ వున్న చాల వాదాలు బౌతిక వాదాలు అయ్యుండాలి. ఔను. అదే నా వుద్దేశం.

దైనందిన జీవితం (ఎవెరి డే లైఫ్)లో సుఖ దుఃఖాల్ని వ్యక్తం చేస్తూ, సుఖాల్ని పెంచుకుని, దుఃఖాల్ని తగ్గించుకునే దిశగా.. జరిగే మానవ ప్రయత్నాలకు ప్రోత్సాహమిచ్చే వాదాలేవైనా మంచివేననడానికి ఈ సదస్సులో ఎవరికీ అభ్యంతరం వుండదనుకుంటాను.

ఆధునిక జీవితంలో, అలాంటి వాదాలలో మొదటిది ప్రేమ్ చంద్ తదితరులు ప్రాతినిధ్యం వహించిన ప్రగతి శీల ఉద్యమ వాదం (ప్రోగ్రెసివిజం), దానిలో అవకాశవాదం పెచ్చు మీరే కొద్దీ ముందుకొచ్చినది… రాత్రి కవితా సంపుటి, ఆ తరువాత దిగంబర కవితోద్యమం రూపంలోని విధ్వంస వాదం (నిహిలిజం). అది నిర్దిష్ట రూపం ధరించడమే విప్లవ వాదం.

ఈ ప్రసంగంలో లోతుల్లోకి వెళ్ళడం నాకు కుదరదు గాని; ఎంత ప్రగతి శీలం అయినప్పటికీ, ఎంత నేల విడువని సిద్దాంతాలు ఆయినప్పటికీ ఈ ప్రగతి వాదాలలో భావ వాదం ఛాయలున్నాయి. రచయితలు ‘అంగీకరించిన’ లేదా తమకు తాము ‘ప్రకటించుకున్న’ అభిప్రాయాలే/భావాలే వీటికి ప్రాతిపదిక. వారి వాస్తవ జీవితాలు కాదు. వాస్తవమైన మనుషులు ప్రాతిపదిక కాకుండా పోయారు. వాస్తవిక మానవులు ప్రాతిపదిక అయి వుంటే… రాజకీయాల్లో, సాహిత్యంలో ‘శ్రామికత్వం’ అనే వాస్తవ వునికికి (బీయింగ్ కి) ప్రథమ ప్రాధాన్యం వుండాల్సింది. అలా జరగలేదు.

సాహిత్యంలో విప్లవ వాదం సిన్సియర్ గా ప్రయత్నించి విఫలమైన చోటనే నిజమైన భౌతిక వాదాలు మొదలయ్యాయని నేను భావిస్తున్నాను. దళిత వాదం, స్త్రీవాదాలకు ప్రాతిపదిక అయిన దళితులు, స్త్రీలు వాస్తవిక మానవులు. వారి అనుభవాలు కేవలం భావాలు కాదు. అవి వాస్తవికం, పాదార్థికం. అవి దైనందిన జీవితం (ఎవెరి డే లైఫ్)  నుంచి పుట్టిన భావోద్వేగాలూ, ఆలోచనలు. అవి భావాలకు పుట్టిన  భావాలు కావు. (పూలకు పూలు పూయవు, చెట్లకు పూస్తాయి).

‘బీయింగ్ డిటర్మిన్స్ సోషల్ కాన్షియస్ నెస్’ ( ఉనికి/అస్తిత్వమే సామాజిక చైత్న్యాన్ని నిర్ణయిస్తుంది) అనేది మార్క్సు ఆవిష్కరణల్లో అతి ముఖ్యం. అది ఆయన ఆలోచనలకు తల్లి వేరు. ‘బీయింగ్’ అనే మాటకు ఆయన ఏ ఆధ్యాత్మిక అర్థాన్నీ వుద్దేశించ లేదు. భౌతికమైన అర్థాన్నే ఉద్దేశించారు. శ్రామిక వర్గం (ప్రొలిటేరియట్) మాత్రమే దోపిడీ నుంచి విముక్తి సాధిస్తుంది అనడం అందుకే. శ్రామిక వర్గ వునికి నుంచే శ్రామిక వర్గ చైతన్యం వస్తుంది. అందరి కంటె ఎక్కువగా శ్రామికులకే ‘దోపిడి నుంచి విముక్తి’ అవసరం. ఆ వర్గ చైతన్యమే విముక్తికి దారి తీస్తుంది.

శ్రామిక వర్గేతర మనుషులలో సో కాల్డ్ శ్రామిక  వర్గ చేతన వున్న మంచి వాళ్ల వల్ల విముక్తి అని మార్క్స్ అనలేదు. అలా అనడమంటే, అలా అనే మేరకు…  భావ వాదానికి తల వంచడమే.

మరయితే, శ్రామికులు రాజ్యం ఏలడం సరైనది అని భావించే మంచి మనుషులు ఏం చేయాలి. వీళ్లు చేయవలసింది శ్రామికులకు బదులు తాము గద్దెలెక్కి ఏలడం కాదు. శ్రామికులను అధికారంలో కూర్చో బెట్టి, తాము కూడా శ్రామికులుగా మారడానికి ప్రయత్నించడమే వీళ్లు చేయాల్సిన పని. మానవులను ఆ దిశగా ప్రొత్సహించే సాహిత్యం వెలువడాలంటే…. కేవలం ప్రగతిశీల వాదం చాలదని తేలిపోయింది. ఈ తప్పు దిద్దుకోడానికి మానవ సమాజం చేసే భౌతిక వాద ప్రయత్నాలే దళిత వాద, స్త్రీవాద సాహిత్యాలు.

ఈ వాదాల గురించి ఇప్పటికే చాల చర్చ జరిగింది. ఈ వేదిక మీద, ఈ ప్యానల్ లో కూడా ఆలాంటి చర్చ జరిగింది.

ప్రస్తుతం ఈ వాదాలు కొన్ని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రశ్నలను చాప కిందికి తోసి వెళ్లే ఏ ప్రయత్నమైనా మరోసారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. ఈ వాదాలు ప్రగతి శీల శక్తుల ఫ్రాగ్నెంటేషన్ కు, అనైక్యతకు దారితీశాయనేది వీటి మీద వున్న అతి ముఖ్య విమర్శ. అది నిజం కూడా. ఈ అనైక్యతని కొనసాగించి, బలపరచడమంటే…. దోపిడి, అణిచివేత దారులకు సేవ చేయడమే. ఈ   వాదాల లోని వుమ్మడి అంశాల మీద దృష్టి పెట్టాలి. అన్నిటి కన్న పెద్ద వుమ్మడి అంశం… ఎస్, అది తిరిగి శ్రమైక జీవనమే.

ఈ మధ్య ఫెమినిస్టు సాహిత్యం చూస్తుంటే ఈ ఆలోచన మీక్కూడా కలిగి వుంటుంది. ఫెమినిస్టు సాహిత్యం, ఫెమినిస్టు విమర్శ చాల వరకు సెక్సు సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి. స్త్రీ-పురుష సంబంధాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆడవాళ్ళకు సెక్సు/ మాత్రుత్వం తప్ప మరే సమస్యలు లేవా అనిపిస్తున్నది. స్త్రీలు పని చేసే వారు కూడా. హౌస్ వైఫ్ కూడా శ్రామికురాలే. అంటే స్త్రీలు కేవలం ప్రియురాళ్ళు, భార్యలు, తల్లులు మాత్రమే కాదు, శ్రామికులు కూడా.

అలాగే దళితులు. దళితులకు కుల సమస్యలతో పాటు శ్రామిక సంబంధ సమస్యలున్నాయి. స్త్రీలకు, దళితులకు శ్రమ సమస్యలతో పాటు హిందూ, ఇస్లాం వంటి మతాలతో మరిన్ని సమస్యలున్నాయి.  ఇవి శ్రమతో ముడిపడివున్నవే. శ్రామికులుగా దళితులు, స్త్రీలు, మైనారిటీలు, ఫ్యాక్టరీలలోని, ఆఫీసుల్లోని ఉద్యోగులు కలిసి పని చేయడానికి ఇంత అవకాశం వుండి కూడా ఎందుకు కలవలేక పోతున్నామో ఆలోచించాలని ఈ వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.

నేను విలీనం గురించి మాట్లాడడం లేదు. ఫెడరేషన్ గురించి మాట్లాడుతున్నాను. సాలిడారిటీ గురించి మాట్లాడుతున్నాను.

మనం కలవకపోవడం ఎవరికి మేలో ఎవరికి కీడో ఆలోచించాలని మిత్రులకు విజ్ఞప్తి.

సారంగ, ఆగస్ట్ 2016

 

Posted in సంవాదాలు వివాదాలు | Leave a comment

మంచితనం మనిషిది, మతానిది కాదు

 

ఒక మంచి ముస్లిం వ్యక్తి కథ చెబుతూ, మిత్రుడు అబ్ధుల్ రజా హుసేన్ … “మతమంటే మౌఢ్యం అనేవాళ్లు ముఖ్యంగా…..తెలుసుకోవాలి!/బడేసాబ్ ఇస్లాం ను నమ్మాడు.ఆచరించాడు. అనుసరించాడు” అని అన్నారు. ఆ మాటల అడ్రెసీ నేనే కనుక వారికి ఇది నా తిరుగు టపా… అక్కడే రాద్దామని చూసి, ఇక్కడ రాయడానికి కారణం వ్రాత యొక్క నిడివి.

ఒక మతంలో ఒకరు లేక కొందరు మంచి వాళ్లు వున్నంత మాత్రాన, ఆ వాస్తవం… ‘మతమే ఒక మౌఢ్యం’ అనే అవగాహనను ఎలా పరాస్తం చేస్తుంది? ఇస్లాం అయినా, హిందూ అయినా మతాలుగా ‘మూఢత్వం’ మీదనే ఆధారపడతాయి. మూఢత్వమంటే హేతువుకు అతీతమైన విశ్వాసం అని అర్థం. తెలియనిది తెలియదని అనడం హేత్వతీత విశ్వాసం కాదు. తెలియనిది తెలుసు ‘అనుకుని’ దాన్ని నమ్మడం, ఆ నమ్మకం ఆధారంగా జీవించడం… ఇది హేత్వతీత విశ్వాసం. అదే మూఢత్వం.

మరింత సరళంగా చెప్పుకోవాలంటే…. దయ్యాల్ని నమ్మడం ఎంత మూఢత్వమో దేవున్ని నమ్మడం అంతే మూఢత్వం. ఆ అర్థంలో ఇస్లాం, హిందూ, క్రిష్టియన్, జొరాష్ట్రియన్… మతాలన్నీ మూడత్వాలే. కేవలం విశ్వాసాలే. ఒకప్పుడు అలాంటి విశ్వాసాలు మనిషికి అవసరమయ్యాయి. .ఇవాళ ఆ అవసరం లేదు. ఇవాళ మనకు తెలిసిన విషయాలు ఆధారంగా జీవిస్తూ, తెలియనివి తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ వుండవచ్చు. తెలియనివి తెలియవు అని బహిరంగంగా చెప్పుకోవచ్చు. తెలియని వాటిని తెలిసినట్లు చెప్పే పురోహితులు, ముల్లాలను (అందుకోసం) గౌరవించ నవసరం లేదు. వారు…. ఆ బుకాయింపును జీవనోపాధిగా… అంటే తమ దోపిడీ పనిముట్టుగా… వాడుకోడాన్ని ఇక సహించనక్కర్లేదు. పేదవాడికి ఇవాళ అలాంటి ‘ఓదార్పు’ అవసరం లేదు. పేదవాడు తనను తాను పేదవాడుగా గుర్తించి, పేదరికానికి వ్యతిరేకంగా రాజకీయార్థిక పోరాటం చెయ్యొచ్చు. దానికి ఆతడితో కలిసి వచ్చే వారు ఇవాళ వున్నారు. వీరి సంఖ్య రాను రాను పెరుగుతుంది. ఆ సంఖ్య పెరగడానికి సాయపడడమే ఇవాళ ప్రగతి శీలం.

ముస్లిములలో మంచి వాళ్లున్నారు అనే చర్చ పరమ అనవసరం. హిందువులలో, క్రైస్తవులలో అందరిలో మంచి వాళ్లున్నారు. వారిని చూపించి ఆ మతాలు మంచివి అని వాదించడం అర్థరహితం. వాళ్లు ఒక మతంలో వున్నప్పట్టికీ ఆ మతం మూఢమే.

ఆవు మాంసం తినడం తప్పా ఒప్పా అనేది మత వ్యతిరేకితో చర్చించడం కుదరదు. ఆవు మాంసం తప్పు అని ఒక హిందూ మతవాది మాత్రమే అంటాడు. ఏ మతం వద్దు అనే మత వ్యతిరేకులను హిందూ మతవాదులతో కలిపి విమర్శించడం చాల తప్పు. ముస్లిములలో మంచి వాళ్ళు లేరు అని ఏ మత వ్యతిరేకీ అనడు. ముస్లిం అంటే టెర్రరిస్టు అని ఏ మత వ్యతిరేకీ అనడు. ఆ మాటలు హిందూ మతవాదులు మాత్రమే అంటారు.

మీ దృష్టిలో వున్న… నా బోటి… మత వ్యతిరేకుల రచనలను ఒక సారి గుర్తు చేసుకోండి. చాల మంది సో కాల్డ్ ముస్లిం మైనారిటీ వాద రచయితల కన్న…. ముస్లింముల మీద… అలాంటి దుష్ప్రచారాన్ని ఖండించడంలో… మీరు రెఫర్ చేస్తున్న మత వ్యతిరేక రచయితలం ముందున్నాం. ఆ జాబితాలో ముస్లిం వాద రచయితలుగా పూల దండలు వేయించుకునే వారు దాదాపు లేరు. అంతే కాదు. సద్దాం వంటి ముస్లిం పాలకులు సామ్రాజ్య వాదాన్ని ఎదిరించి ప్రాణాలకు తెగించినప్పుడు కూడా మీరు చెప్పే ముస్లిం వాద రచయితలు లేరు. ఎస్, ముస్లిం వాదం వల్ల దొరికే పూల దండలకు తలలు వంచడంలో వారు బిజీగా వున్నారు. సైడు బిజినెస్సుగా ఫ్యాక్షనిస్టుల జీవిత చరిత్రలు రాసి డబ్బు గడిస్తున్నారు. ఈ ఘన కార్యం అయిపోయింది, ఇక దాన్ని పట్టించుకోవద్దు అనుకున్నాను. కాని, ఆ ఘన కార్యాన్ని కొనసాగించ దలచుకున్నామని కొందరు మిత్రులు తమ సన్మాన సభలు, బహుమతి ప్రదానాల ద్వారా నిరూపిస్తున్నారు. కనుక దాన్ని వదిలేయనక్కర్లేదనుకుంటున్నాను. వదిలేయడం ముస్లిం పేదలకు చాల హానికరం. వదిలేయడం వల్ల హిందూ హెయిరార్కీ వద్దు ముస్లిం హెయిరార్కీ ముద్దు అనడం అవుతుంది. రాజకీయ అవకాశ వాదాన్ని గౌరవించడం అవుతుంది.

దయచేసి విషయాన్ని విషయంగా చర్చించండి. ఇస్లాం కూడా ఒక మతం. అందులో హెయిరార్కీ వుంది. అందులో పురుషాహంకార భావాలున్నాయి. వాటి వల్ల ముస్లిం పేదలకు, స్త్రీలకు కష్టాలున్నాయి. హిందూ ధర్మాన్ని కొనసాగించదలచిన వారి లాగే, ఇస్లాం ధర్మాన్ని కొనసాగించదలచిన వారు…. పేదల మీద, స్త్రీల మీద హింస, దోపిడీ కొనసాగడానికి దోహదం చేస్తున్నారు. ఇదీ నా గత పోస్టులలో చెప్పడానికి ప్రయత్నించాను.

మిత్రులు మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి.

Posted in Uncategorized | Leave a comment