పలు ప్రశ్నలు, ఒక జవాబు….?

స్మృతి 25

 

డివి గ్రూపు నాయకుడు మండ్ల సుబ్బారెడ్డి మా వూరు రావడం మా పోస్టల్ వుత్తరం చూసి మాత్రమే కాదు

ఆయనకు మా వూరు అంతకు ముందే పరిచయం.

మండ్ల సుబ్బా రెడ్డి వాళ్ళ వూరి పేరు వెల్గోడు. చండ్ర పుల్లా రెడ్డి వూరు కూడా అదే. ఇద్దరూ మొదటి నుంచీ కమ్యూనిస్టులు. కలిసి పని చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచి సహచరులు.

నేను పుట్టిన సంవత్సరం, 1951 లో, మా అమ్మ, వాళ్ళ వూరికి దగ్గరగా వున్న గడివేములలో బంధువుల ఇంట్లో వుందట. అప్పుడు కమ్యూనిస్టుల దాడులు జరుగుతున్నాయని, వాళ్లు దుర్మార్గులని, రైతుల ఇండ్ల మీద పడుతున్నారని బాగా ప్రచారంలో వుండడం వల్ల నిండు గర్భుణిగా వున్న మా అమ్మ, గడివేములలో బంధువుల ఇంట్లో తలదాచుకుందట. తను ఆ వూళ్లో వున్నప్పుడే, ఒక రాత్రి కమ్యూనిస్టులు గడివేముల పోలీసు స్టేషన్ మీద దాడి చేసి, తుపాకులు ఎత్తుకుపోయారని అమ్మ చెప్పేది.

ఆ సంఘటన నిజమే. అందులో ప్రాణ నష్టం కూడా జరిగింది. క్రాస్ ఫైర్ లో తెలియక చీకట్లో ఇంటి బయటికి వచ్చిన ఒక పెద్దావిడ చనిపోయిందట. దాని వల్ల కమ్యూనిస్టులు దుర్మార్గులనే ప్రచారం మరింత ఎక్కువయ్యుంటుంది.

తెలంగాణ సాయుధ పోరాటం చివర్లో, నిర్బంధం రీత్యా, పోరాటాన్ని నల్లమల ఆడవులకు విస్తరించే క్రమంలో జరిగిన దాడి అది. ఆ దాడికి నాయకత్వం వహించింది చండ్ర పుల్లా రెడ్డి. దానిలో మండ్ల సుబ్బా రెడ్డి కూడ వున్నారని చెప్పగా విన్నాను. ఆ తరువాత కూడా పుల్లా రెడ్డి, ఈయన మంచి సహచరులే. ఇద్దరూ కాస్త బంధువులు కూడా. సిపిఎం ‘శాంతి’ దినాలలో వెల్గోడు గ్రామ రాజకీయాలలో కలిసి పని చేశారు. బహుశా, నేను మొదటి సారి ఎర్ర జెండా పట్టుకుని కమ్యూనిస్టు పార్టికి ఓటు వేయాలంటూ పాల్గొన్న మా వూరి వూరేగింపులో సుబ్బా రెడ్డి వుండి వుంటారు. అప్పటికి నేను ఎలిమెంటరీ స్కూలు. లీలా మాత్ర జ్ఞాపకం.

అంత పాత స్నేహితులు తానూ, సీపీ. తరువాత వేరు గ్రూపులుగా చీలిపోయారు.
మండ్ల సుబ్బా రెడ్డి మా వూరికి వచ్చి మూడు రోజులున్నారు. మూడు రోజులూ ఏక బిగిన క్లాసులు. మేము సుమారు పదిహేను మందిమి చాల శ్రద్ధగా ఆయన మాటలు విన్నాం. అప్పటికి ఒకటి రెండేండ్ల ముందే డివి, టిఎన్, సిపి ల నాయకత్వంలోని ఎపిసిసిఆర్ (ఆంధ్ర ప్రదేశ్ కమిటీ అఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీస్) రెండుగా విడిపోయింది. (నేను కమిటీ పేరును కాస్త అటు ఇటుగా రాసి వుండొచ్చు). మండ్ల సుబ్బారెడ్డి మూడు రోజుల క్లాసులో అధిక భాగం ఆ కమిటీ చీలిక ఎలా జరిగింది, అందులో సిపి పాత్ర ఏమిటి అనే దాని మీదనే నడిచింది.

కమిటీ రెండుగా విడిపోవడంలో చండ్ర పుల్లా రెడ్డి పాత్ర కుట్ర పూరితమైనదని, కామ్రేడ్ రాధమ్మ తో ఆయన సంబంధాన్ని ప్రశ్నించినందుకే, దానికి జవాబు చెప్పలేక సీపీ పార్టీని చీల్చాడని సుబ్బారెడ్డి అన్నారు. ఇలాంటి నీతి సంబంధ వ్యవహారాలలో సీపీ నాయకత్వంలోని కామ్రేడ్లు చాల మంది ఆ బాటలోనే వున్నారని విమర్శగా చెప్పారు. దానికి ఇచ్చిన ఉదాహరణలతో… నా మానసిక మైదానానికి సంబంధించినంత వరకు… మండ్ల సుబ్బా రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.

ఆయన ఇచ్చిన ఉదాహరణల్లో ఒకటి వేంపెంట నెమలి చంద్ర శేఖర రెడ్డి అనే యువ కామ్రేడుకు సంబంధించినది. తను నా వయసు వాడు. గన్నవరంలో చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి వేశ్యా గృహానికి వెళ్ళాడు. అక్కడ తనతో వున్న అమ్మాయి ఆ వృత్తిలో ఎందుకు వున్నదని ఆమెతో చర్చ మొదలెట్టాడు. నిస్సహాయత కారణంగానే ఆమె అందులో వున్నట్లు గుర్తించి, తాను పెళ్లి చేసుకుంటానని, బయటికి వచ్చేస్తావా అని అడిగాడు. ఆమె సరేనంది. ఆమెను పెళ్లి చేసుకుని, వూరికి, తన ఇంటికి తెచ్చాడు. ఆ అమ్మాయి ఏ ఆర్నెళ్లో. ఏడాదో వుండి, ఈ జీవితం నచ్చక వెనక్కి వెళ్లిపోయింది.

అది నెమలి చంద్ర శేఖర రెడ్డి లాంటి వాళ్లు వున్న పార్టీ, స్త్రీ పురుష సంబంధాల విషయంలో వాళ్లు లూజు అన్నట్లు మండ్ల సుబ్బా రెడ్డి క్లాసులో మాట్లాడారు. నాకిది ఏమాత్రం కొరుకుడు పడలేదు.

సొంత ఇళ్లు, వూళ్లు వదిలిపెట్టి అడవులు పట్టిన ఇద్దరు స్త్రీ పురుషులు… సీ పీ రాధమ్మ… ఒకరంటే ఒకరికి ఇష్టమై… కలిసి బతకాలని నిర్ణయించుకుంటే అదేం తప్పో నాకు తోచ లేదు. వాళ్ళకు అప్పటికే పెళ్లిళ్లు అయ్యుండొచ్చు గాక. ఆ పెళ్లి-ఇళ్లలో ఇప్పుడు వాళ్ళు లేరు. చిరకాలంగా లేరు. వాళ్లు ఎంచుకున్న అడివి జీవితం ప్రకారం, ఇక వాళ్ళు ఆ పెళ్లిళ్లలో వుండే అవకాశం లేదు. అలాంటప్పుడు ఇద్దరు కలిసి బతికితే, పెళ్లి లేదా పెళ్లి లాంటిది చేసుకుంటే ఏం తప్పు? అలాంటి ఇస్యూ మీద పట్టు పట్టి ఒక ప్రజల పార్టీని చీల్చే దాక వెళ్తారా… అనేది నన్ను సుబ్బారెడ్ది పట్ల రెపెల్ చేసిన ఆలోచన. (ఆ ఒక్క పాయింటు మీదే పార్టీ చీల లేదనేది నిజమే. రాజకీయాంశాలు ముఖ్యం. అవి తరువాత మాట్లాడుకుందాం.)

చంద్ర శేఖర రెడ్డి వేశ్యా వృత్తిలో వున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆమెను ఎక్కడో దాపున వుంచకుండా తన ఇంటికి భార్యగా తీసుకు రావడం… అది అసలు తప్పు కాకపోగా, గొప్ప కూడా. మరి ఈయనేమిటి అది మహా నేరమైనట్టు మాట్లాడతారు అని కూడా నేను ప్రశ్నించాను. అది మా మొదటి పరిచయం కనుక మరీ గట్టిగా ప్రశ్నించినట్టు లేను. జవాబుగా ఆయన ఏం చెప్పారో గుర్తు లేదు. అది కాకుండా చంద్రశేఖర రెడ్డి గురించి తెలిసిన మరి కొన్ని విషయాలు కూడా నన్ను తనకూ, ఆ పార్టీకి చేరువ చేశాయి.

చంద్ర శేఖర రెడ్డి వాళ్ళ నాన్న పేరు నెమలి వెంకట రెడ్డి. వెంకట రెడ్డి యవ్వన కాలం నుంచీ వేంపెంట కమ్యూనిస్టు గ్రామం. వెంకట రెడ్డి, ఆ వూళ్లో ఇంకా చాల మంది సిపిఎం పార్టీతో వుండేవారు. ఆ వూళ్లో ప్రజలకు సంబంధించి ఏదో సమస్య వచ్చింది. అందులో వెంకట్రెడ్డి మరి కొందరు రైతులు ఒక పక్షం అయ్యారు. సిపిఎం పార్టీ నాయకత్వం పెద్దవారితోనే వుంది. కొందరు ఎపి సి సిఆర్… అంటే సిపి గ్రూపు విప్లవ రాజకీయాలతో ప్రభావితులై ఇంకో పక్షం వహించారు.

చంద్ర శేఖర రెడ్డి తదితర యువకులు విప్లవ రాజకీయాల వైపు నిలబడ్డారు. పోరాటం మిలిటెంటు రూపం ధరించే దాక వెళ్లింది. చంద్రశేఖర రెడ్డి వాళ్లు… ‘శివ’ సినిమా రావడానికి బాగా ముందే ఆ సినిమా సీన్లను కాపీ కొట్టి… సైకిల్ ఛైన్లు అవీ సేకరించి ఇళ్లలో వుంచడం మొదలెట్టారు. సైకిల్ ఛైన్లు నాన్న లకు తెలిసేలా ఇళ్ళలో వుంచడమంటే… కౌటుంబికంగా.. ఓపెన్ రెబెల్లియన్ ప్రకటించడమే. తాము ధర్మం అనుకునే వాటి కోసం తండ్రుల మీద యుద్ధానికి సిద్ధమని ప్రకటించడమే.

ఇవన్నీ నన్ను చంద్ర శేఖర రెడ్డి వైపు, సీపీ వైపు, సీపీ గ్రూపు రాజకీయాల వైపు ఆలోచింప జేశాయి. పార్టీలో క్రియా శీలుడిని అయిన తరువాత చంద్రశేఖర రెడ్డి, నేను మరింత దగ్గర అయ్యాం. సహచరులు మమ్మల్ని కృష్ణార్జునులు అని అనే వారు. మా మధ్య అలాంటి స్నేహ సంబంధం ఏర్పడింది. శేఖర్ గురించి మరి చాల విషయాలు చెప్పాలి మీకు.

నా పెళ్లి రోజు నా జేబులో 40 రూపాయలు వుండినయ్. పొద్దున్నే అవి కాస్తా పోయినయ్. కామ్రేడ్స్ కు అది చెప్పాను, నవ్వుతూ. చంద్రశేఖర రెడ్డి. “హేయ్, పెండ్లి కొడుకు అలా వట్టి జేబుతో వుండ గూడదు. జయమ్మ వాళ్ళ నాన్న నీకు కట్నమియ్యలేదు గదా. ఇదిగో నేనిస్తున్నా” అని వంద రూపాయలు కాగితం నా షర్టు జేబులో కుక్కాడు. “అయితే ఇక నువ్వు నాకు మామవు” అనేశాన్నేను. ఆ మరుసటి రోజు నుంచి జయ తనను చిన్నాన్న అని పిలవడం మొదలెట్టింది. తను నా కన్న ఒక ఏడాది చిన్న. ఇప్పటికీ తనను నేను మామ అనే పిలుస్తాను. జయ చిన్నాన్న అనే పిలుస్తుంది.

రెండు తరాల కమ్యూనిస్టు గ్రామం, వేంపెంట… తరువాత కాలంలో మరో విధంగా నొటోరియస్ కావడం పెను విషాదం. ఆ వూరి మీద పట్టు కోసం రెండు విప్లవ గ్రూపుల మధ్య సాగిన వైరం దానికి ప్రధాన కారణమనిపిస్తుంది. మన దేశంలో కులాల ప్రమేయం లేకుండా దేన్నీ సరిగ్గా వివరించలేం. వేంపెంటలో రెండు పార్టీల మధ్య పోటీని కేవలం కుల వివాదంగా చిత్రించారు. ప్రజల మధ్య వచ్చిన తగాదాలను శత్రు వైరుధ్యంగా పరిగణించి చేపట్టిన చర్యలు వేంపెంటను మరెప్పటికీ కోలుకోలేని స్ఠితికి తీసుకెళ్ళాయి.

వేంపెంట పక్కన ఒక పెద్ద వాగు ప్రవహిస్తుంది. దాని మీద కట్టిన బ్రిడ్జి మీదుగానే గ్రామంలోనికి వెళ్ళాల్సి వుంటుంది. ఆ వాగు పేరు నిప్పుల వాగు. విరసం సభ్యుడు పినాక పాణి… వేంపెంట ఘటనలపై… ‘నిప్పుల వాగు’ పేరుతో… ఒక నవల రాశారు. దానిలో మంచివి కాని పాత్రలకు రెడ్డి పేరు పెట్టడం ద్వారా… పాణి ఆ వూరి సమస్యను రెడ్లు- దళితుల సమస్యగా స్ఫురింపించారు. ఆ రెడ్ల నాయకుడిగానో, రెడ్డి నాయకులలో ఒకరుగానో (మరో పేరుతో) చంద్ర శేఖర రెడ్డి పాత్ర వుంటుంది.

ఈ ఘటనల తరువాత చాన్నాళ్ళకు నేను వేంపెంట వెళ్ళాను. చంద్ర శేఖర రెడ్ది ఇప్పటికి నాకు ప్రాణ స్నేహితుడే. తానేమైనా తప్పు చేసి వుంటే, అవి క్షంతవ్యాలే గాని, తల గొట్టి మొలేయాల్సినవి కావు. తన అతిధిగానే నేను వేంపెంట వెళ్ళాను. ఉళ్లో వుండగా ఒకరిద్దరు పాత మిత్రులను కలిసి అసలేం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నించాను. ఎవరితో మాట్లాడినా వారి మాటల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఉళ్లో మునుపటి కలివిడి తనం, భేఫికర్ తనం లేదు.

నేను మాట్లాడిన వారిలో ఒకరు చంద్ర శేఖర రెడ్డి కి చిన్నాన్న. పేరు శివా రెడ్డి. ఆయన ఒక కాలు బాగా కుంటుతూ, ఊతంగా కర్ర పట్టుకుని వచ్చారు, మేము వున్న చోటికి. ముసలి వాడు కాదాయన. మధ్య వయస్కుడు. గతంలో, ఎమర్జెన్సీకి ముందు… పూర్తి ఆరోగ్యంగా చూసి వుండడం వల్ల ఏమైంది అని ఆందోళనగా అడిగాను ఆయన్ని. ఆయన నవ్వి వూరుకున్నారు. తరువాత చెప్పారు.

ఒక విప్లవ గ్రూపు సాయుధ దళం… వేంపెంట ఘటనలపై… దగ్గరి అడివిలో పంచాయతీ నిర్వహించింది. తగాదాలో వున్న ఇరువాగుల వారినీ సామరస్య సాధనకని పిలిపించింది. దళ సభ్యులు సాయుధులుగానే వచ్చి కూర్చున్నారు. ఇరు వాగుల వారు…అంటే, దళ సభ్యులు ఎవరిని ఆర్గనైజ్ చేస్తూ వుండినారో వాళ్లు, వాళ్ళకు ఎవరి మీద ఫిర్యాదులున్నాయో వారు… తమ వాదాలు వినిపించారు. దళ సభ్యులు తీర్పు చెప్పారు. దళం వాళ్లు అవతలి పక్షం వారిది తప్పు అని తేల్చారు. అవతలి వాళ్లు దానికి సరే నన్నారు.

దళం వాళ్ళు ఆ వెంటనే శిక్షలు కూడా చెప్పేశారు. చెప్పడమే కాదు. శిక్షలని అమలు చేయడం కూడా మొదలెట్టారు. శిక్షలో భాగంగా కొందరిని అక్కడి నుంచి కాస్త దూరం తీసుకెళ్లి కొట్టారు. మరి కొందరిని… అలాగే దూరం తీసుకెళ్లి… కూర్చోబెట్టి, రెండు వరుస రాళ్ల మీదుగా వారి కాళ్ళను చాపి వుంచి, రెండు రాళ్ల మధ్య కాళ్ల మీద కోసు రాయితో కొట్టి, కాళ్లు విరగ్గొట్టారు. దళం వాళ్ళు అమలు జరిపిన ఈ శిక్షకు గురైన వారిలో చంద్ర శేఖర రెడ్డి చిన్నాన్న శివా రెడ్డి ఒకరు. ఆయన కాలు విరిగింది ఆ విధంగానే. అప్పటి నుంచి ఆయన కుంటి వాడయ్యాడు. శిక్షలు అమలు జరుగుతున్నప్పుడు దూరం నుంచి వినిపించే కేకలను తాము ఎలా విన్నామో కూడా శివా రెడ్డి చెప్పారు.

ఇంతకూ పంచాయతీలో తప్పెవరిదని తాము అనుకుంటున్నారని… నేను ఆరా తీయబోయాను. శివారెడ్డి ఇప్పుడా సంగతులు ఎందుకులే, ఇక మరిచిపోయి కలిసి బతుకున్నాం అని మాత్రమే చెప్పారు. వివరాల్లోకి వెళ్తే అంతా చాల కాంప్లికేటెడ్ గా వుంటుందని కూడా చెప్పారు. తమ తప్పు అసలేమీ లేదని ఆయన అనలేదు. నేను చంద్ర శేఖర రెడ్డితో కలిసి వూళ్లోకి వెళ్లి చాల మంది దళిత మిత్రులతో మాట్లాడాను. రాత్రి చాల సేపటి వరకు దళితుల ఇళ్ళ వద్దనే గడిపాం. తమాషా ఏమిటంటే వూళ్లో వాళ్ళ మధ్య శత్రు వైరుధ్యం లేదు. అందరిలో ఒక రిగ్రెట్ వుంది.

చంద్ర శేఖర రెడ్డి ఇప్పటికీ… నా స్నేహితుడే. పినాక పాణి మంచి మిత్రుడే. ఉళ్లో వున్నది రెడ్ది-దళిత వైరుధ్యం కాదు. సో కాల్డ్ అగ్ర వర్ణ నిమ్న వర్ణ వైరుధ్యం కూడా కాదు. రెండు లేదా కొన్ని రాజకీయ పార్టీల మధ్య ప్రయోజనాల వైరుధ్యమది. నేను తనను తిరిగి కలిసే సమయానికి, చంద్ర శేఖర రెడ్డి సిపి గ్రూపు తో లేడు. బహుశా, కొంత కాలం పాలక వర్గ పార్టీలతో రాసుకు తిరిగినట్టున్నాడు. ఆ పని ఎదిరి పక్షం వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. పినాక పాణి తన నవలలో ఒకరి పనులకు మరొకరి పేరు పెట్టడం ద్వారా… అది రెడ్డి- దళిత వైరుధ్యం ఎఫెక్ట్ తెచ్చారు.

భుజాన తుపాకులున్న ‘పంచాయతీ పెద్దల’ ఇన్ స్టాంట్ తీర్పులతో జనాల కాళ్ళు విరగ్గొట్టే అడివి న్యాయం ఏ విధంగా ప్రజాస్వామిక చర్చకు ప్రోది చేస్తుందో చెప్పాలని… మిత్రులను కోరుతూ.. పినాక పాణి ఎడిట్ చేసినదే… ‘ప్రజాస్వామ్యం కోసం చర్చ’ అనే పత్రిక/బులెటిన్ లో నేనొక వ్యాసం రాశాను. నాకు తెలిసినంత వరకు అందులో మూల ప్రశ్నకు…. అంటే, అలా తీర్పులు ఇచ్చి, అమలు చేయడం న్యాయం కాదనే విమర్శకు…. మాత్రం ఇప్పటి వరకు నన్నెవరూ కోప్పడినట్టు లేదు.

మా వూరిలో మండ్ల సుబ్బా రెడ్డి క్లాసు సమయానికి చంద్ర శేఖర రెడ్డి తన పిత్రు-వ్యతిరేక తిరుగుబాటును కొనసాగిస్తూ సిపి గ్రూపులో వున్నాడు. వాళ్ళ నాన్న వెంకట రెడ్డి సిపిఎం లో వున్నారు. ఆ దృశ్యం దానికది గొప్పగా, సింబాలిక్ గా వుండింది అప్పుడు. మండ్ల సుబ్బా రెడ్డి నుంచి ఆ కథలు వినే సరికి…. నిజం చెప్పాలంటే, సుబ్బా రెడ్డి మా వూరు నుంచి వెళ్లి పోయేప్పటికే… నా బుర్రలో నిర్ణయాలు జరిగిపోయాయి. దానికి అసలు కారణం ఆయన చెప్పిన ‘కథలు’ మాత్రమే కాదు. రెండు గ్రూపుల మధ్య రాజకీయ విభేదాలున్నాయి.

నా మనస్సులో అప్పటికప్పుడు నిర్ణయాత్మక పాత్ర వహించిన అంశమేమిటో మీరు సులభంగా వూహించొచ్చు. మేము ఇక ముందేం చేయాలి అనే ప్రశ్నకు జవాబు కోసమే మండ్ల సుబ్బా రెడ్డిని మా వూరికి పిలిపించుకున్నాం. మూడు రోజుల పాటు ఆయన చేప్పేదంతా శ్రద్ధగా విని, “ఇవన్నీ సరే కామ్రేడ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఎలా విప్లవం చేద్దాం. నాకు తక్షణం ఏమి కార్యక్రమం ఇస్తారు” అని అడిగాన్నేను. వెంటనే చేయాల్సిన పని ఏమీ ఆయన చెప్పలేదు. మూడు రోజుల క్లాసు అసంతృప్తిగా ముగిసింది.

తరువాత కబురంపి పిలిపించుకున్న వ్యక్తి గంగిరెడ్డి వెంకట కొండా రెడ్డి. తనది కోవెల కుంట్ల దగ్గర కాశి పురం అనే వూరు. ఆయన రాసిన నాటకం ‘నాంది’ రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి వారిచే ఎంపిక చేయబడి, మన్ననలందుకున్న విరసం ప్రచురణ. ఆయన మా వూరికి వచ్చి మాతో మాట్లాడింది ఒకే ఒక్క రోజు. ఆయన మాటల్లో మాకు బాగా నచ్చింది: ఆ తక్షణత్వమే. ఆయన చెప్పిన వాటిలో… ఎప్పుడో కాదు ఇప్పటి నుంచే సాయుధ పోరాటం… అనే మాట నాకు భలే నచ్చింది. చివరికి ఆయన్ని కూడా అడిగాను. “ఇప్పటికిపుడు మనం ఏంచేయాలి? తక్షణం చేయాల్సిన పని ఏమిటి?”

మా వూరికి కాస్త దూరంలో వున్న ఉప్పల పాడు అనే వూరిలో స్వామి రెడ్డి అనే భూస్వామి అక్రమ స్వాధీనంలో వున్న తొంభై ఎకరాల భూమిని ఆ వూరి భూమి లేని దళితులు అక్రమించి దున్నుకున్నారు. వాళ్ళ మీద దాడులు, పోలీసు కేసులు… ఇంకా జరుగుతున్నాయి. “అవి చూద్దాం పద. పార్టీ కార్య కర్తలకు చాల పని వుంది” అన్నారు గంగిరెడ్డి.

నా పలు ప్రశ్నలకు ఒక జవాబు దొరికింది. చాల సూటి జవాబు. నాకు నచ్చిన జవాబు. పలు కోణాలలో నాకు అనువుగా కనిపించిన జవాబు.

ఇంకేం. నేను కాలేజీకి వెళ్లినప్పుడంతా వుపయోగించే చిన్న లెదర్ కేసులో బట్టలు సర్దుకుని, ఆ సాయంత్రం గంగి రెడ్డి వెంట పార్టీ పనికి బయల్దేరాను.

తరువాత్తరువాత మా వూరికి అసలే వెళ్ళలేదని కాదు గాని, ఎప్పుడు వెళ్లినా ఒకటి రెండు రోజులకు మించి వూళ్లో లేను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను మా వూరికి పూర్తిగా దూరమయిపోయాను. రెక్కలొచ్చిన పక్షి గూడు వదిలి వెళ్లి నట్టు, ఆకాశమే వూరైపోయింది. రెక్కలు మంచివేనా? మంచివే. రెక్కలు కావాలంటే వేర్లు వదులు కోవాలేమో! చెట్టూ, పక్షి రెండూ నేనే కావాలంటే, అందరికీ కుదరదు కదా!

(వచ్చేవారం రాజకీయ ఆరంగేట్రం)
24-8-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s