నా కథానాయిక 

స్మృతి 28

ఈ వారం ఒక ప్రేమ కథ. మా కథే.

జయ, నేను… కావడానికి బావ మరదళ్లమే. కాని, రెండు వేర్వేరు పాయలం. ఇద్దరం మరొక పెద్ద నదిలో కలిశాం. ఆ నది పేరు ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల కమిటీ. ఈ రెండు పాయలు ఒక నదిలో కలవకపోతే, అసలు ఒకటయ్యేవో లేదో. అది తల్చుకుంటే భయమేస్తుంది. రెండు పాయల మధ్య ఒక గల గల సంభాషణ మాత్రం ఎప్పటి నుంచో వుంది. పుట్టినప్పటి నుంచి కాకపోయినా, బుద్ది తెలిసినప్పటి నుంచీ.

ఆ సంభాషణలో భాగాంగా నా కాలేజీ దినాల నుంచీ మా మధ్య ‘ప్రేమ’ లేఖలు నడిచాయి. ఆ కోట్, అన్ కోట్ ఎందుకంటే, మా వుత్తరాల్లో అలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఏమీ వుండేవి కావు. చాల పెద్ద వాళ్ళ లాగ ఏ రవీంద్రుని ‘గీతాంజలి’ చదివాననో, అందులో ఇలా వుందనో రాసుకునే వాళ్ళం. చెలం గారి ‘అమీనా’ చదివి నాకేం నచ్చలేదు అదేమిటో అని రాసుకునే వాళ్ళం. రంగనాయకమ్మ ‘ఇదే నా న్యాయం’ చదివి, ఔను అదే న్యాయం అని ఏదో కనిపెట్టిన ఉత్సాహంతో చెప్పుకునే వాళ్ళం. బాపు బొమ్మల దాశరథి అనువాదాల గాలిబ్ గీతాలు చదివి, నిజంగా ‘నరుడు నరుడవుట దుష్కరము’ కదా అని యుగళ దిగులు పడే వాళ్ళం, వుత్తరాల్లో.

అప్పుడు సత్యనారాయణ అనే పేరుతో తిరుగుతూ వుండిన ఉల్లిగడ్దల వీరన్న అంటే మా ఇద్దరికీ చాల ఇష్టం. ఆయనది ఆదోని. జౌళి మిల్లు కార్మికుల నాయకుడుగా మొదలై సీపీ గ్రూపులో ముఖ్య నేతగా ఎదిగిన విప్లవకారుడు. పార్టీ కర్నూలు జిల్లా సెక్రెటరీ. ఆయన తరచు జయ వాళ్ళ వూరు మండ్లెం వెళ్ళే వాడు. ఆ చుట్టుపక్కల తంగెడంచ, కిష్టరావు పేట తదితర గ్రామాల్లో బలమైన ప్రజా వుద్యమం వుండేది.

ఆయన ఎక్కువగా, ఊరికి దూరంగా వున్న జయ వాళ్ళ తోటలో విశ్రాంతి తీసుకునే వాడు. అక్కడి తోట బావి లోనే స్నానాలు, ఈతలు, జయ వాళ్లు తెచ్చే భోజనాలు. చాల మంచి వ్యక్తి. పెద్ద చదువరి కాదు. నిలువెల్ల కార్మిక చైతన్యం. ఆయన మాటలు పెద్దవారిని, యువజనులను అందరినీ ఆకట్టుకునేవి. ఆయన మా జయకు చాల ముందు నుంచే పరిచయం.

మేము రెండు వేర్వేరు పాయలం అన్నది అందుకే.

అయితే, రెండు పాయల మధ్య అన్ని విధాల సంభాషణ వుండేది. రాజకీయ విషయాలు సైతం చర్చించి కలిసి నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. చిట్ట చివరి వరకు అదే చేశాం. మాదొక కమిటీ కాని కమిటీ.

జయ ఇంటర్మీడియట్ తరువాత కర్నూలు కె వి ఆర్ ఉమెన్స్ కాలేజీలో బి ఏ లో చేరింది. చదువు సరే. తను రాజకీయంగా ఏం చేయాలి? నాలాగే సీపీ గ్రూపుతోనే వుందామె మనస్సు. అది ఇద్దరికీ తెలుసు. కర్నూలులో అప్పటికి పిడిఎస్ యూ లేదు, ఇద్దరు కామ్రేడ్లు తప్ప.

మరి నెక్స్ట్ బెస్ట్ ఏమిటి? ఎస్ ఎఫ్ ఐ.! జయ ఎస్ ఎఫ్ ఐ లో చేరడమే గాక క్రియాశీలంగా పని చేసింది. డాక్టర్ బ్రహ్మా రెడ్డి, సరస్వతి వంటి వారితో తనకు స్నేహ సంబంధాలు వుండేవి. వాళ్లు నాకు పరిచయమయ్యింది కూడా జయ వల్లనే. జయ ఎస్ ఎఫ్ ఐ లో పని చేయడం… మా ఇద్దరి వుమ్మడి నిర్ణయమేనని తరువాతెప్పుడో బ్రహ్మా రెడ్దికి చెప్పాం.

చాల రోజుల తరువాత, కర్నూలులో పిడి ఎస్ యూ కొంచెం ఫుట్ హోల్డ్ సంపాదించాక, ఎస్ ఎఫ్ ఐ వాళ్లకు అసలు సంగతి తెలిసి వుంటుంది. ఎందుకంటే నాకు వీలు దొరికినప్పుడల్లా లేడిస్ హాస్టల్ కు వెళ్లి జయతో కబుర్లు చెప్పి వచ్చే వాడిని. జయ కూడా కర్నూలులో మా పార్టీ ఆఫీసుకు వచ్చి, గంగిరెడ్డన్న తో మాట్లాడేది.

గంగి రెడ్డన్న మా ఇద్దరిని, మరి ఇద్దరిని కూర్చో బెట్టి గతి తార్కిక భౌతిక వాదం పాఠం చెప్పారొక రోజు. పరిమాణాత్మక మార్పులు జరిగి జరిగి, ఒక్కసారిగా గుణాత్మక మార్పు జరగడం గురించి చెబుతూ గంగి రెడ్డన్న ‘లంఘనం’ అనే పదాన్ని విచిత్రంగా పలకడం, దానికి తగినట్టు భుజాలెగరేయడం… ఇప్పటికీ ఒక ప్లజెంట్ జ్ఞాపకం నాకు.

అప్పుడు జయకు సెలవులు. ఆ క్లాసు తరువాత, తను వెళితే వాళ్ల వూరు వెళ్ళాలి. వెళ్ళొచ్చు. భయమేం లేదు. ఛెళ్ మా వూరు వెళ్దాం అన్నాన్నేను. ఓకే అంది జయమ్మ. ఇంకేం ఇద్దరం మా వూరు వెళ్ళాం. అలా వెళితే ఏమి అర్థం వస్తుంది అనే ఆలోచనే రాలేదు మాకు. జయమ్మ అంతకు ముందు వాళ్లమ్మతో, చెల్లితో కలిసి మా ఇంటికి వచ్చేది కదా, అందరం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. రాత్రి బయటరుగు మీద నేను, తమ్ముడు, జయ గడ్ది ఒల్లె పరుచుకుని పడుకుని, నిద్దర వచ్చే వరకు చుక్కలు ఎంచే వాళ్ళం కదా… ఇదే అంతే… మా ఇద్దరి దృష్టిలో.

మా ఇంట్లో ఎవరూ ఏమీ అనలేదు. ఏమని అంటారు. నాతో కలిసి వచ్చిందనే మాటే గాని, జయకు అది అమ్మమ్మ ఇల్లు. అప్పటికి అమ్మమ్మ లేకున్నా, మేనమామ ఇల్లు. రెండో రోజు అనుకుంటా, మా అమ్మ… మా కళ్ళంలో గడ్డి కోయడానికి వెళ్తూ జయమ్మను కూడా తీసుకెళ్లింది, తనకూ ఒక కొడవలి ఇచ్చి, గడ్డి కోయడానికి.

దటీజ్ టూ మచ్, కదూ?!

అప్పుడర్థమయ్యింది మాకు.

మేము పెళ్లి చేసుకుని భార్యా భర్తలుగా వచ్చామని అనుకుంటున్నారని. అయినా మాకు ‘దిమ్మ తిరిగినట్టు కావడం’ వంటిదేమీ జరగలేదు. నేను మా అమ్మను కుంచెం కోప్పడ్డానంతే, మమ్మల్ని అలా అనుకున్నందుకు. అమ్మ తిరిగి కోప్పడింది… ఎదిగి వచ్చిన పిల్లను, పెండ్లి కాని పిల్లను… అలా వెంట తీసుకువస్తావా, అది తప్పు కాదా అని.

అంతే కాదట. మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బాగున్నా లేకున్నా, మేము ఏ క్షణం నుంచి అనుకుంటే ఆ క్షణం నుంచి ఆలుమగలమే నంట. బావా మరదలంటే అంతే నంట. ఈ సంగతి చాన్నాళ్ళ తరువాత జయ చెల్లి రాధమ్మ పెళ్లిలో తెల్సింది మాకు, రాధమ్మను పెండ్లి కూతురును చేస్తూ నలుగు పెడుతున్నారు. తన రెండో అక్క మహేశ్వరి నలుగు పెట్టలేదు. ఎందుకంటే ఆమెను ‘ఇత్తనపింటి’ వాళ్ళ ఇంటికిచ్చి పెండ్లి చేశారు కాబట్టి… అని చెప్పారు. (నెరవాటి, ఇత్తనపింటి అనేవి వేర్వేరు ‘శాఖ’లు రెడ్లలో). ఓహో, సరేలే, వీళ్ల ఆచారాలూ వీళ్ళు… అనుకున్నాం మేము. ఆ తరువాత జయను పిలిచారు నలుగు పెట్టడానికి. ఈ పద్దతులు తనకు నచ్చవు అని చెప్పేసింది జయ. నేను వుండబట్ట లేక ఆ ఆడవాళ్లను అడిగాను. మహీని వేరే శాఖ అబ్బాయితో పెండ్లి చేసింది మీరు, అలా చేశామని ఇప్పుడు నలుగు పెట్టనివ్వంది మీరు. జయకు అసలు పెండ్లే కాలేదు కదా? మీరు చెప్పే అర్థంలో మేము పెండ్లే చేసుకోలేదు కదా? అని నిలదీశాను.

నేను తీశాను గాని, వాళ్ళేం నిలబడి పోలేదు. ఫట్ మని జవాబు చెప్పారు. మీరు పుట్టినప్పుడే మీకు పెండ్లయిపోయింది. మేనరికం బావామరదళ్ళు… పెండ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పెండ్లి చేసుకున్నట్టే లెక్క, అందుకని జయమ్మ నలుగు పెట్టొచ్చు అన్నారు.

అదన్న మాట, ఇద్దరం కలిసి వూరికి వెళితే మా వైవాహిక సంబంధాన్ని అమ్మ నాన్న గ్రాంటెడ్ గా తీసుకోడానికి కారణం. ఆ తరువాత జయ వాళ్ల వూరికీ వెళ్లినా తను అలా మా ఇంటికి రావడాన్ని వాళ్ళ అమ్మ నాన్న తప్పు పట్టకపోవడానికి కూడా అదే కారణం.

మరి అంత ‘చక్కని’ కారణం వుంది కదా, మా మానాన మమ్మల్ని వదిలెయ్యొచ్చుగా. వదిలెయ్యకుండా అతిగా కల్పించుకోవాలని చూడడంతో మేము కొన్ని తీవ్రవాద చర్యలు తీసుకోకతప్పలేదు.

నేను విశాఖలో ఎమ్మే చదువుతున్నప్పుడే జయమ్మ తలిదండ్రులు ఎడ్లబండి కట్టుకుని మా వూరు వెళ్ళారు, అనవసరపు ‘పిల్ల పెత్తనా’నికి. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం చేసుకుంటారా అని అడగడానికి వెళ్ళడాన్నే (లేదా వైస్ వెర్సా) పిల్ల పెత్తనం అంటారు. జయ వాళ్ళమ్మ నాన్న పదివేల రూపాయలు వరకట్నమిస్తామని మా నాన్నతో ఒప్పందం చేసుకున్నారు.

అదంతా చాల అనవసరమైన యవ్వారం. ఈ వార్త తెలియగానే నేను మా అమ్మ నాన్నల్ని కోప్పడ్డాను. ఈ కట్నం కబుర్లేమిటి అని. పాపం నాన్న నాతో ఏమీ అనలేదు. ఆ తరువాత, వుమ్మడి మిత్రుల ద్వారా రెండు కుటుంబాల మధ్య గరం గరం సంభాషణలు నడిచాయి. చెల్లెలికి కట్నం నిజంగా ఇద్దామని ఏమీ లేదు. అన్నకు దాన్ని వదులుకునే ఉద్దేశమూ లేదు. మా ఇద్దరితో సంబంధం లేకుండా, మాకు తెలీకుండా, ఇండైరెక్టుగా ఆ లావాదేవీ జరిగిపోవాలని నాన్న కోరిక. కట్నం ఖర్చు లేకుండా, ఆలాగని ఇవ్వం అని చెప్పే పని లేకుండా… పెండ్లి జరిగిపోవాలని చెల్లెలి కోరిక.

మాటలు మా దాకా లీకయ్యేవి. కొన్ని మాటలు మరీ కంపు కొట్టేవి.

ఇద్దరం కెవిఆర్ కాలేజీ చిగురాకు జొంపాల మధ్య కూర్చుని అలోచించేశాం. ఇది కుదరదు. వీళ్ళు మన పెండ్లి చేసుడేంది. మనమే చేసుకుందాం అనేసుకున్నాం. రెండు కుటుంబాల మధ్య మాటల మంటల్ని ఆర్పడానికి అదొక్కటే మార్గం అని అర్థమైపోయింది. అదీగాక, కుటుంబాల పట్ల మా లాయల్టీలు కూడా మమ్మల్ని కాస్త బాధించేవి. వాటి వల్ల మేమెక్కడ దూరమయిపోతామో అని భయమేసేది. అయిన కాడికి అయ్యింది, తరువాత సంగతి తరువాత, ముందు పెండ్లి చేసేసుకుందాం. తరువాత పెద్దోళ్ళు వాళ్లకు వాళ్ళే దగ్గరవుతారని అనేసుకున్నాం.

మా అలోచన చెప్పగానే గంగిరెడ్డన్న ఓకే అనేసి, అటు ఇటు మాట్లాడ్డానికి ఓ వారం రోజూ సమయం తీసుకున్నాడు. ‘మీరు అవునన్నా కాదన్నా వాళ్లు పెండ్లి చేసుకుంటారు. వచ్చి, శుభాకాంక్షలు చెప్పండి’ అని వాళ్లకు చెప్పేశాడు.

మా పెళ్లి వొద్దని ఎవరంటారు? జయమ్మంటే మా నాన్నకు చాల ఇష్టం. తన చెల్లెలి లాగే జయమ్మ జొన్న రొట్టెలు చాల బాగా చేస్తుందని ఆయన మురిపెం. మరదిని (మా తమ్ముడిని) ఒరే తరే అనకుండా ఎంచక్కా పేరు పెట్టి పిలుస్తుందని, అన్నిటికి మించి చదువుకుందని… చివరికి…. నేను సిగ్గు పడకుండా చెప్పాలంటే… ఎత్తులో లావులో కూడా మా ఈడు జోడు బాగుంటుందని ఆయన అనుకునే వాడు. ఎటొచ్చీ, తనకు రావలసిన పదివేలు పోతున్నాయని, తన మాట నెగ్గకపోయెనే అని ఆయన బాధ. ఆ రోజుల్లో ఆది చాల పెద్ద మొత్తమే. ఆయనకు వున్న అప్పులు చాల వరకు తీరిపోయేవి ఆ డబ్బుతో. ఆ ‘ఎకనమిక్ ఫ్రంట్’ లో మేము చేయగలిగిందేమీ లేదు. పోనీ, నేను ఉద్యోగం చేసి ఆ ‘గండి’ పూడుస్తానా అంటే, ఆ ఆశలూ లేవు. ఆయన దుఃఖం పూర్తిగా సమంజసం.

మేము మరి చాల కాలం ఆగగలం. నాకు తలమునకలుగా పని వుండింది. తాలూకా పట్టణాల్లో అప్పుడప్పుడే పిడిఎస్ యు సంబంధాలు పెరుగుతున్నాయి. జయ అప్పటికింకా బియే రెండో సంవత్సరమే. ఆగడమే సరైనది. కాని, ఆగడం వల్ల మాటల యుద్ధాలు ఇంకా పెరుగుతాయి. వాటికి తట్టుకోలేక, మేము దూరమయ్యే ప్రమాదం కూడా వుంది. అది జరగ్గూడదు.

మా పెండ్లి పనులు మేమే చక చక మొదలెట్టేశాం. జూన్ 10న కర్నూలు టౌన్ హాలులో మేమిద్దరం పెండ్లి చేసుకుంటున్నామని ఒక తెల్లని కార్డు ముద్రించాం. దానిలో ‘ఎవరూ కానుకలు తీసుకు రావొద్ద’ని ఒక గమనిక రాశాం. దానితో పాటు ‘ భోజనాలూ అవీ వుండవు’ అని మరో గమనిక కూడా చేర్చాం.

పెండ్లి రోజు దూరంగా కూర్చుని మా నాన్న ఏడ్చింది ఇందుకోసమేనేమో. ఎందుకు అనేది ఆయన చెప్పడు కదా?! నేను అడగను కదా?! తన కొడుక్కు పిల్లనిచ్చేటోళ్లు కార్లేసుకుని వస్తారని ఆశ పడే వాడు. అలాంటిది, కొడుకు పెండ్లి… ఆయన భాషలో చెప్పాలంటే, బిచ్చగాళ్ళ పెండ్లిలా… పప్పన్నాలు, పాయసాలు లేకుండా జరగడమే మా పెండ్లి రోజు ఆయన కళ్ళలోని ఉప్పెనలకు కారణమేమో. యామ్ సారీ నాన్నా!

పెండ్లికి ఎవరొస్తారులే అనుకున్నాం. కాని. మా బంధువులంతా వచ్చారు. పురోహితుడు లేని ఈ పెళ్లి ఎలా వుంటుందోనని క్యురియాసిటీ కూడా పని చేసి వుంటుంది. స్నేహితులంతా వచ్చారు. కర్నూలు టౌన్ హాలు క్రిక్కిరిసింది. రెండు అండాల నిండా చల్లని నీళ్లు పోసి, అందులో రస్నా పొడి కలిపాం. అదే ఆ రోజు మా పెండ్లి అతిధులకు మేము ఇచ్చిన విందు.

మేము గమనికలో కోరినట్టే ఎవరూ కానుకలు తీసుకు రాలేదు. మా అమ్మ వాళ్లన్న పెద్ద కొడుకు, మా నారాయణ రెడ్డి బావ, తను మాత్రం ఒక చేతి గడియారం తెచ్చి, తీసుకోవాలని బలవంతం చేశాడు, ‘మీ నాయ్న, నా పెండ్లిలో పెట్టిన సదివింపులు మీకు తిరిగి ఎట్ట ఇయ్యల్రా మల్ల?’ అని ప్రశ్నించాడు. ‘మా నాయ్నకు ఇంకా ముగ్గురు కొడుకులుండారులే, బావా!’ అని గడియారం వెనక్కి ఇచ్చేశాను, పరమ నియమ నిష్ఠా గరిష్టుండనయ్.

నా ప్రాణ స్నేహితుడు పుల్లయ్య తెచ్చిన పోర్టబుల్ రేడియో ఒక్కటే ఆ రోజు మేము తీసుకున్న పెళ్లి కానుక. దాన్ని తన గుర్తుగా చాన్నాళ్లు నాతో వుంచుకున్నాను. మరి మరి బ్యాటరీలు కొనడమంటే డబ్బులు ఖర్చు అని దాన్ని ఎప్పుడూ వుపయోగించలేదు. ఊరికే అలా వుంచుకున్నామంతే. పార్టీలో బాగా పనుల్లో వుండగా పుల్లయ్య పెళ్లి. నేను వెళ్ళడం కుదరలేదు. అలాంటి అలక్ష్యానికి మరి కొందరు మిత్రుల లాగే పుల్లయ్య కూడా నన్ను చాన్నాళ్ళు క్షమించలేదు.

కృష్ణ రాజ్ సింగ్, తానీషా, అజయ్, జయరామి రెడ్డి, చంద్ర శేఖర రెడ్డి, జి ఎన్ కృష్ణ మూర్తి, శ్రీనివాస రెడ్డి, రామ స్వామన్న, బొల్లారం చెన్నయ్య, గార్గేయపురం కృష్ణ మూర్తి, నన్నూరు వెంకటరెడ్డి, గోకారి, రామన్న గౌడ్… అప్పటి పార్టీ వాళ్ళందరూ వచ్చారు.

గుర్తు చేసుకుంటే కుంచెం బాధేసే విషయం ఒకే ఒకటి. దగ్గర్లో వున్న స్టూడియో నుంచి ఫోటోగ్రాఫర్ ను పిలిపించాం. అతడు ఫోటోలు తీశాడు. అతడితో ప్రింట్స్ వేయించి తీసుకునే లోగా ఎమ్నర్జెన్సీ వచ్చింది. నేను ముషీరాబాద్ డిస్త్రిక్ట్ జైలుకు తరలి పోయాను. రెండేండ్ల తరువాత స్టూడియోకి వెళ్లి ఆ నెగటివ్స్ కోసం ఒక పూటంతా వెదికాం. నో యూజ్. మాకు పెళ్లి ఫోటోలు లేవు. మా తమ్ముడు, శివుడు అప్పటి తన చిన్న కెమెరాతో, అదీ హాలు బయట, సూర్యకాంతిలో తీసిన కొన్ని.. బాగా చిన్ని… ఫోటోలు మాత్రం కొన్నాళ్ళు మాతో వుండేవి. అవి హాలు బయట తీసిన ఇండివిజువల్ ఫోటోలు, మేము ఇద్దరం వున్నవి కాదు.

ఆ రోజు మేము ఇచ్చిన ఉపన్యాసాలు తల్చుకుంటే ‘వామ్మో’ అనిపిస్తుంది. దాని సారాంశమేమిటంటే మేము పెళ్లి చేసుకుంటున్నది సంసారం చేయడానికి కాదు. విప్లవం చేయడానికి అని. 🙂

జయమ్మ ఏమీ భయపడకుండా, మేము ఒక అసాధారణమైన మంచి పని చేస్తున్నామనే ఆత్మ విశ్వాసంతో మాట్లాడింది. బహుశా అది మొదటి సారేమో తనను చీరలో చూడడం. కాలేజీలో చూశానేమో. ఏమో గాని. ముదురాకు పచ్చ చీర, బ్లూ జాకెట్, కాంతి వెదజల్లే మొహం…. భయపడుతుందని అనుకున్నానేమో, తనను అలా చూడడం నాకు చాల గొప్పగా వుండింది.

వాళ్ళ వూరికి వెళ్లినప్పుడు, ఇంటి ముందు బావి గడ్డ తిరుగుతూ చూసే వాడిని. తను బయటరుగుల వద్ద వుంటే, నన్ను చూడగానే కళ్లు, పెదిమలు విచ్చుకుని… అద్భుతం అనిపించేది. వాళ్ల పక్క వూరు తర్తూరులో ఏటా తిరుణాల జరుగుతుంది. అందరం కలిసి వెళ్ళే వాళ్ళం, తిరుణాలకు. ఆ ఎండలో, ఒక్కోసారి చమటల వల్ల కష్టంగా వున్నప్పుడు కూడా జయమ్మ నాకు చల్లని నీడలా, హాయిగా కనిపించేది.

అప్పుడే కాదు, తను ఎప్పుడూ అంతే.

నాకు కొన్ని ‘నిస్సహాయత’లున్నాయి. కొన్ని మీకు తెలుసు. ఇప్పుడు ఈ నిస్సహాయతా మీకు తెలిసిపోయింది.

//ఒక నిస్సహాయత//

సున్నితమైన వాటినే ముట్టుకోవాలనిపిస్తుంది
ముళ్లు గుచ్చుకుంటాయని తెలిసీ గులాబీ పువ్వుని
ముడుచుకుంటాయని తెలిసీ అత్తపత్తి ఆకుని, వేళ్లు
కాలుతాయనీ తెలిసీ మండే పొయ్యిని తాకాలనిపిస్తుంది

ఒకానొక సారి ఒక దుమ్ము రేగే తిరుణాల సందడిలో
గోల గోలగా నడిచిపోయే జన సమూహాల మధ్య
రంగు రంగుల ఎద్దుల బొడ్డార్లు, తాళ్లు, తలుగుల మధ్య
ఎండకు నీడనిచ్చే తన కళ్ళ కాంతిని ముట్టుకున్నాను

స్పర్శ తీరదనిపించే కోరికయ్యింది, విరహమయ్యింది,
సాఫల్యమయింది, ఓదార్పయ్యింది, అహరహమయ్యింది
తను అప్పుడప్పుడు వేళ్ళు కాలే జ్వాల అవుతుంది, తాకితే
ముడుచుకునే అత్తపత్తి మొక్క, ముళ్లున్న గులాబీ రెమ్మ

ఏం చేయను? ఏమీ చేయలేను! నేను తనను ప్రేమిస్తున్నాను

15-3-2010

(‘గొడ్డలి బుజం’, పేజ్: 14)

(వచ్చే వారం కర్నూలు జిల్లా లోనే మరికొన్ని కబుర్లు)

14-09-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s