ఒక జవాబు, ఒకే జవాబు

స్మృతి 26

అదొక అద్భుతం. మిరకిల్. అంత గాఢమైన అనుభవం అంతకు ముందెప్పుడూ నాకు కలగ లేదు.

ఆ అనుభవం ఇచ్చిన అనుభూతి మరి డజను వత్సరాలు… ఆ తరువాత కూడా… నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్ను నడిపించింది… నడిపిస్తోంది. అది కాసేపు తాయిలమైంది. కాసేపు బెత్తమైంది. ముందుకు లాగే ముకు తాడైంది. వెనుక నుంచి అదిలించే ముల్లు గర్రయింది.

గంగిరెడ్డి వెంకట కొండారెడ్ది వెంట బయల్దేరానని చెప్పాను కదూ! రెండు మూడు రోజుల్లో వస్తానని అమ్మకు మాత్రం చెప్పి వచ్చాను. తిరిగి మా వూరికి వెళ్లడానికి చాల రోజులు పట్టింది. వెళ్లినా, పార్టీ పనుల మధ్య వెళ్లి ఒకటి రెండు రోజులు వుండే వాడిని.

నా రాజకీయ ఆరంగేట్రంలో మొదటి రోజు వెళ్లింది ఉప్పలపాడు గ్రామం. మా ఊరు లాగే అది కూడా బస్సు రోడ్డుకు ఎడంగా వుండిన వూరు. కాస్త నడవాల్సి వుండింది. ఇప్పుడెలా వుందో మరి.

మేము వెళ్లిన ఇల్లు ఒక సారాయి అంగడి. ఇల్లంతా ఒక అరుగు లాంటి ఎత్తైన వేదిక మీద వుంటుంది. దళితుల ఇళ్లు వూరికి దిగువన వుండటం వల్ల, వాన నీరు బజారు లోంచి ఇళ్ళలోకి రాకుండా అలా ఎత్తు మీద కడతారు. ఆ ఇల్లు మెట్లెక్కి వెళితే, ఒక పెద్ద గది. కింద బండ చట్టం (ఫ్లోరింగ్) లేదు. నేల శుభ్రంగా అలికి వుంది. ఒక పక్కన పీపాలు. సారాయి అనుకుంటా. పేడతో అలికిన నేల మీద పగుళ్లు వున్న చోట్ల చీమల బార్లు. అవి ఇంట్రూడర్లలా కాకుండా మా వంటి అతిధులే అనిపించాయి. మాకు విస్తర్లతో అన్నం పెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికో పయనమైన పోతున్న చీమల్ని చూస్తూ మామూలు పప్పు అన్నమే పరమాన్నంలా, పలావులా గొప్ప ఇష్టంతో తిన్నాను ఆ పూట.

బాగా జ్ఞాపకం వుంది, అన్నం తింటూ నేనేం అనుకున్నానో.

“ఇప్పుడు నేను దిగులు పడాల్సిందేమీ లేదు. నేనుగా నిర్ణయం తీసుకుని, చేయాల్సిన పనులేమీ లేవు. పనులు జరగడం లేదే అని అతి ఆరాటం అక్కర్లేదు. శివాయిజమా భూములు దున్నుకుని సేద్యం చేసుకుంటున్న పేదలను భూస్వాములు, పోలీసులు తొలగించకుండా ఎలా చూసుకోవాలన్నదే ఇక్కడ నా ముందున్న సమస్య. ఓహ్, ‘నా’ కాదు, ‘మా’ ముందున్న సమస్య. అది నేనొక్కడినే చూడక్కర్లేదు. మిగతా కామ్రేడ్సు, సానుభూతిపరులైన లాయర్లు, నాయకులు నిర్ణయిస్తారు. నేను వాళ్ళతో కలిసి నడవాలి… రద్దీలో బస్సెక్కుతున్నప్పుడు వెనక, పక్కల మనుషులు తోయడం వల్ల ముందుకు పోయినట్టు”

ఆ ఆలోచనలు ఇచ్చిన మనశ్శాంతిని మీకు మాటల్లో పెట్టి చెప్పలేను. ‘బండ రాయి ఆత్మ కథ’ అని, ఆ ఫీలింగ్ నే ఒక కథగా రాశానెప్పుడో తరువాత.

ఆ సెల్ఫ్ అస్యూరెన్సు, బేఫికర్ తనం కేవలం నాలోనిది కాదు. ఉద్యమం లోనిది. నా చుట్టూరా వుద్యమకారుల ముఖాల్లోనిది. ఆ కాంతి నా లోనికి ప్రవహించింది, అంతే. ఆ అంతశ్శాంతిని వదులుకోడం ఎవరికీ సులభం కాదు.

ఉప్పల పాడులో భూస్వామి పేరు స్వామి రెడ్డి. తను మా వూరిలో నా బాల్య స్నేహితుడు బాగ్గెమ్మ కొడుకు పుల్లా రెడ్డికి పిల్లనిచ్చిన మామ. స్వామి రెడ్డికి సాయంగా పుల్లా రెడ్డి మా వూర్నించి ఒక లారీలో మనుషుల్మి పంపించాడు కూడా నట. నాకు ఆలస్యంగా, అప్పుడే తెలిసింది. పుల్లా రెడ్డి నా యీడు వాడే. వంద ఎకరాల ఆస్తికి, ఒక్కడే… తండ్రి లేని… వారసుడు. స్కూలు కాలంలో తన స్నేహితులతో కలిసి నన్ను కొట్టి ఏడిపించే వాడు. అతడిని ఎదుర్కొనే పోరాటం, ‘భలె భల్లే’ అనుకున్నాను. మేము ఎదురెదురు పడేంత దూరం రాలేదు. ఉప్పలపాడు పేద వాళ్ళ నుంచి వచ్చిన మూడు నాలుగు ప్రతిఘటనలకే స్వామి రెడ్ది రాజీకి వచ్చాడు. తొంభై ఎకరాల ప్రభుత్వ భూమి పేదల వశమయ్యింది.

నేను పార్టీ పనుల్లో భాగంగా హైదరాబాదులో వున్నప్పుడు, ఒక సారి కర్నూలు బస్ స్టాండులో పుల్లా రెడ్డిని కలిశాను. స్నేహంగా పలకరించాదు. చాల దిగులుగా కనిపించాడు. అది అతిగా తాగడం వల్ల వచ్చే ‘దిగులు’ కూడా. మానసికం కాదు. శారీరకం. కొద్ది రోజులకే తన మరణ వార్త కూడా విన్నాను. తను గుర్తొచ్చినప్పుడంతా చాల బాధేస్తుంది. తన వంటి వుదాహరణలు మా వూళ్ల నుంచి ఇంకా రెండు మూడు వున్నాయి,. జీవించడానికి సరైన శిక్షణ వుండి వుంటే, తగిన మార్గదర్శకత్వం దొరికి వుంటే, వాళ్ళు చాల సుఖంగా సంతోషంగా జీవించాల్సింది. ఆ శిక్షణ, దర్శనం లేకపోవడంతో వాళ్ళ ఆస్తి పాస్తులే వాళ్లకు వురి తాళ్లయ్యాయి.

నేనూ, జయ ఇప్పటికీ అనుకుంటాం. మనకు ఎంత తెలిసిందో ఎంత తెలియలేదో ఏమో గాని… ఆ కాస్త మార్క్సిస్టు దర్శనం, ఉద్యమ స్పర్శ వుండడం వల్లనే కదా, బతుకు ప్రతి మలుపులో… వున్నంతలో సరైన దారిని ఎంపిక చేసుకోగలిగాం.. బతుకులో ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని డిటౌర్లు, మెలికల మలుపులు తిరిగినా…. మనకు మనం మిగల గలిగాం. మంది కోసం ఏం చాతనయితే అది చేస్తున్నామనే సంతోషాన్ని కాపాడుకోగలిగాం.

మార్క్సిస్టు దృక్పథం. శ్రామిక ప్రజలతో వీలయినంత సాన్నిహిత్యం… ఈ రెండూ అత్యవసరం… మనుషులు నిర్భయంగా బతకడానికీ, నిర్భయంగా మరణించడానికి.

ఉప్పల పాడు గ్రామం పార్టీకి కొత్తగా సంబంధాలు వచ్చిన వూరు. అచ్చంగా ఆ భూమి పోరాటంలో వున్న వాళ్లు మాత్రమే తెలుసు. అందుకని మిగతా వూరి గురించి నాకు తెలియదు. మేము వెళ్లిన రెండో వూరు పుసులూరు బొల్లవరం. అది ‘ఎన్నార్’ వాళ్ళ వూరు. ఆ వూరు హంద్రీ నది తీరంలో వుంటుంది. ఏరు ఇప్పుడెలా వుందో ఏమో. మేటలు మేటలుగా ఇసుక. ఏటిలో నీరు ఎక్కువగా లేనప్పుడు ఇసుకలో కలింగిరి, కరబూజ పండ్లు పండించే వారు. తీరం మీద గంగ రేగు చెట్లు, కొబ్బరి చెట్లు కూడా వుండేవి. ఏరు దాటగానే… (లేక ఏటి కన్న ముందేనా?) పొలాలు.

వేరుశనగ పొలాల్లోంచి ఎవరో పిలిచారు మమ్మల్ని.

చెన్నయ్య. చాల కలుపుగోలు మనిషి. తను ఏం మాట్లాడాడో ఏమో, తన మొదటి మాటతోనే అందరం హాయిగా నవ్వుకున్నాం. తరువాత తన సరదా మాటల్లో ఒకటి “కొత్త పిట్ట దొరికినట్టుంది”. కొత్త పిట్ట నేనే. వలేసి పట్టుకొచ్చింది గంగిరెడ్డన్న. ఎందుకో ఆ సాదృశ్యం ఏమీ తప్పు కాదనిపిస్తుంది, ఇప్పటికీ.

అందరం అంతే. ఎవరి వలలోనికి వాళ్ళం. వలలం కూడా మనమే. ఎవరి ‘స్లాట్’ లోనికి వాళ్ళం. వెదికి వెదికి స్లాట్ దొరికించుకుని మరీ చేరిపోతాం మన స్లాట్స్ లో మనం.

ఊళ్లోకి వెళ్ళాక మొదటి పరిచయం సుంకులు. తనను నేను లాస్ట్ టైమ్ చూసే సరికి ఎంపీటీసీ గా వుండినాడు. మొదటి సారి కనిపించినప్పుడు… అరుణోదయ రామారావు, కానూరి తో పాటు బుర్రకథ దళంలో తానొక వంత పాట సభ్యుడు. తనూ, వాళ్ల అబ్బాయి (దత్తత కుమారుడు) సామన్న నాంది నాటకంలో పాత్రధారులు కూడా, రామారావు తో పాటు.

పుసులూరు బొల్లవరం ఒక ప్రత్యేకమైన వూరు. అది నీలం రామచంద్రయ్య (ఎన్నార్) సొంత వూరు. ఆ వూరు వున్నంత వరకు రామచంద్రయ్య వుంటారు. అంతగా ఆయన్ని ప్రేమించే వూరది. ఊరి వాళ్ళలో రాజకీయ సిద్ధాంతాల లోతు పాతులు తెలిసిన వాళ్ళు తక్కువ. ప్రేమ. కల్తీ లేని ప్రేమ. రామచంద్రయ్యకు చెడ్డ పేరు తెచ్చే పని ఏదీ మనం చేయగూడదు అనేంత ప్రేమ, 1976 లో ఆయన పోలీసు హీనత్వానికి బలైపోయినా.

మా కుటుంబంలో నేనే పెద్ద కొడుకును కావడం వల్ల… దాయాదులో కూడా నా కన్న పెద్ద పిల్లలు లేకపోవడం వల్ల…. నాకు అన్న వరుస అయ్యే వాళ్ళంటే చాల ఇష్టం. అలా అన్న వరుసయ్యే మనిషి ఒకరు పుసులూరి బొల్లవరంలో వుండే వారు. జయమ్మ కుటుంబం వైపు నుంచి బంధువు. తన పేరు సత్యనారాయణ రెడ్డి. తరువాతెప్పుడో ఏదో రైల్వే ప్రమాదంలో మరణించాడు. నేనా వూరు వెళ్ళే నాటికి తను పార్టీలో క్రియాశీలుడు. కొత్తగా కామ్రేడ్ ఇన్ ఆర్మ్స్ అయ్యాడు. అన్న అని పిలిచే వాడిని కాదు గాని, అలా పీలయ్యే వాడిని.

ఆ వూళ్లో ‘అప్పొజిషన్’ అనేది లేకుండె. అందరూ ఎన్నార్ పార్టీ యే. అంటే సీపీ గ్రూపు విప్లవ పార్టీయే. తరువాత పీపిల్స్ వార్ లో ఒకరిద్దరు అక్కడి నుంచి పని చేశారు. ఎటువంటి ఘర్షణలు లేవు. ఊళ్లో అందరూ ఐక్యంగానే కాకుండా, అప్పుడెందువల్లనో కాస్త ‘బేఫికరు’గా కూడా వుండే వారు. బొల్లవరం వెళ్తే, జీవితం ఏమంత కష్టభరితం కాదు అనిపించేది. నిజానికి, చాల సార్లు నాకు అలాంటి ‘ఫీలింగ్ అఫ్ వెల్ బీయింగ్’ ఇచ్చిన మరొక వూరు వేంపెంట. ఆ రెండు వూళ్ళలో ఒక్కడినే బజార్లలో తిరుగుతుంటే ‘కమ్యూనిజం’లో తిరుగుతున్నట్టనిపించేది. బజారులో నడుస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఆప్యాయంగా పలకరించే వారు. వెళ్ళేది ఒక ఇంటికి, తినేది ఇంకో ఇంట్లో. ఊరంతా మన ఇల్లే ఆన్నట్లుండేది.

నిజంగానే అప్పటికి. మరీ అంత గుంట చిక్కులు లేవేమో వూళ్ళలో.

బొల్లవరంలో ఏవో కొన్ని ఘర్షణలు జరిగినట్టున్నాయి. కాని అవి నిజంగా చెడ్డ వారైన ఒకరిద్దరితో వచ్చిన ఘర్షణలే. కుల సమస్య లు కావు. పేచీ విషయాలు నేరుగా, సూటిగా వుండేవి.

రెండు వూళ్లలో కాస్త నెమ్మది వాతావరణం వుంటానికి వేరే కారణం కూడా వుంది. రెండు వూళ్లూ కాస్త కలిగిన వూళ్ల కిందే లెక్క. బొల్లవరం హంద్రి నదీ తీరంలో వుండడం వల్ల కొంత తరి భూమి కూడా వుండేది. వేంపెంట కెసి కెనాల్ గ్రామం. దాని వల్లనే కొందరు కోస్తా రైతులు వేంపెంట వచ్చి తమ సొంత సెటిల్మెంటుకు ‘శాంతినగర్’ అని పేరు పెట్టుకున్నారు. వేంపెంట ‘శాంతి నగర్’ లోని రైతులు కూడా కొందరు కమ్యూనిస్టులుగా, వూరి రాజకీయాలలో పాల్గొనడం నేను చూశాను.

ఆ నాడు రాయలసీమలో ఏ వూరికైనా ఏ మాత్రమైనా సేద్యపు నీటి వసతి వున్నట్టయితే ఆ వూరొక మినీ ‘స్వర్గమే’. జనం పచ్చగా కనిపించే వారు. మా వూరు, గనిలో, కాల్వలు చెరువుల సౌకర్యం లేదు. మొన్న మొన్నటి వరకు ఎక్కడ బావి తవ్వినా సేద్యానికి తగిన నీరు దొరికేది కాదు. ఇటీవల బోరు బావుల కల్చర్ వచ్చాక చాల మంది రైతులు బోర్లు వేసి, ఆ నీటితో వరి పండిస్తున్నారు. ఇప్పుడు మా వూరి వాళ్ళు వూళ్లో పండిన వరి అన్నం తినగలరు. బోరు బావులకు ముందు ఆ మాట కలల్లోనే సాద్యం.

మా నాన్న కోశంబాయి చేను అనే చోట ‘జోము’ నీరు పారడం చూసి, దాన్ని ఆపి వరి పండిద్దామని కతువలెన్ని కట్టాడో చెప్పలేం. ‘కతువ గట్టి కతువ గట్టి జిమ్మె వాయెనా’ అని గద్దర్ పాట పాడుకోవాలనిపిస్తుంది ఆయన భాగీరథం తల్చుకుంటే. బోరు బావులు వచ్చాక అది మా వూరికి బాగా అచ్చొచ్చింది. వేరే చాల చోట్ల వాటి వల్లనే రైతులు దివాళా తీశారు. (‘జోము’ అంటే, నేల నుంచి నిరంతరం వూటగా నీరు వుబుకుతుంటుంది. ఊట బాగా ఎక్కువగా వుంటే పంటలకు వుపయోగపడుతుంది. బాగా తక్కువగా వుంటే, వూరికే వూరించి, మా నాన్న వంటి పేద రైతుల ఉసురు పోసుకుంటుంది.)

బొల్లవరం, వేంపెంట, మద్దూరు మొదలైన గ్రామాల విషయం వేరు. వాళ్ళకు చాల కాలంగా నీటి వసతి వుంది. ఆయా గ్రామాల్లో వచ్చిన సామాజిక ఘర్షణలకు… ఈ కంపేరిటివ్ సంపన్నత కారణమా? ఆ సంపన్నతను సక్రమంగా పంపిణీ చేసుకోలేని వ్యవస్ఠ కారణమా? ఈ కార్య కారణాల్ని వూళ్లలో కొందరు గ్రహించినా, తదనుగుణంగా వూరిని మార్చుకోడానికి వాళ్లు ప్రయత్నించకపోవడం, మార్చుకోలేక పోవడం కారణమా?

లేక మనిషి స్వాభావికంగా మరీ అంత స్వార్టపరుడా? తనకు వుండడం కాదు, మరొకరికి వుండకపోవడం ముఖ్యం అయిపోయే దుస్వార్థ పరుడా? ఇది నిజమైతే, అతడి స్వభావం… ఒనిడా టీవి ప్రకటన తరహా మైండ్ సెట్ మారడానికి మనం ఇంకా చాల దూరం పయనించాలా? ఇంకా చాల ఘోరాల గుండా పయనించాలా?

అదేమో గాని, అప్పటికి నాకొక దారి దొరికినట్టే అయ్యింది. దారి దొరికిందని నేను అంతగా కన్విన్స్ కావడానికి ఒక కారణం పుసులూరు బొల్లవరం, వేంపెంట వంటి గ్రామాల్లోని.. పార్టీ నాయకత్వం లోని సుహృద్ వాతావరణం, ఉప్పలపాడు వంటి గ్రామాలలో ప్రజా ప్రతిఘటన సాధిస్తున్న విజయాలు.

ఉన్నంతలో ఒక మార్గం ఎన్నుకోడానికి అప్పుడు నాలో పని చేసిన రాజకీయ విశ్లేషణను కొద్ది మాటల్లో మీకు చెప్పక తప్పదు.

నేను యూనివర్సిటీలో వున్నప్పటికే… ఆనాడు ఇండియాలో అమలవుతున్న విప్లవ మార్గాల గురించి తెలుసు.

మొదటిది: ‘ఉన్నదొకే దారి; చారు మజుందారి’. ప్రజా సమస్యల మీద చిన్న పెద్ద పోరాటాలు ఏమీ అవసరం లేదు. సాయుధ పోరాటం ఒక్కటే మార్గం. సాయుధ పోరాటం ఒక్కటే మన పని. ప్రజా సంఘాలు పెట్టడం, వాటి ద్వారా పని చేయడం ఏమీ అవసరం లేదు. సాయుధ పోరాటానికి పిలుపునిస్తే చాలు ప్రజలు వచ్చేస్తారు. ఆ పిలుపును విష్పరింగ్ క్యాంపెయిన్స్ (గుస గుసల) ద్వారా కూడా చెయ్యొచ్చు. వాళ్ళకు పిలుపు చేరితే చాలు. ఎలా చేరినా ఫరవాలేదు. వర్గ శత్రువులను… అంటే వూళ్ళలోని భూస్వాములను ఒక్కొక్కరిని ఏరేస్తూ పోవడమే ఇక. ఒక వూళ్లో ఒకరిద్దరు భూస్వాముల్ని తొలగిస్తే చాలు. మిగతా భూస్వాములందరూ పారిపోతారు. ఊరు మనదవుతుంది. అలా చాల వూళ్లు మనవి అయ్యే కొద్దీ, ఆ వూళ్ళ మధ్యలో వుండే పట్టాణాలు, నగరాలు… గ్రామాల ముట్టడి మధ్య లోకి వచ్చేస్తాయి. వాటిని ప్రజలు అక్రమిస్తారు. నగరాలు చేజిక్కడమంటే రాజ్యాంగ యంత్రం చేజిక్కడమే. ఇది స్థూలంగా చారు మజుందారి.

నాకు ఈ దారి మొదట్నించీ నచ్చలేదు. ఊళ్ళు ప్రజల చేతికి వస్తే వాటి మధ్య నున్న నగరాలు ఎక్కడికి పోతాయి, అవి, వాటి లోని రాజ్యాధికారం ఇక ప్రజలవే అనేది మాట మాత్రం చాల కన్విన్సింగ్ గా వుండింది. అది సాధ్యం అని కూడా ఆనాటి పరిస్టితులలో నాకు గట్టిగా అనిపించింది. కాని. ఒకటి రెండు చర్యలతో భూస్వామ్యాన్ని వదిలించుకోడం… ఆ చర్యల కోసం, పిలుపు ఇస్తే చాలు జనం వచ్చేస్తారనడం ‘పాజిబిలిటీ’కి, ‘ప్రాబబిలిటీ’కి అవతలిదిగానే నాకు కన్పించింది.

ఇక మిగిలినవి రెండు మార్గాలు… ఆనాటికి ప్రచారంలో వున్న మేరకు.

ఎక్కడికక్కడ ప్రజా సంఘాలను నిర్మించాలి. ప్రజలను ప్రజా సమస్యలపై కదిలించాలి. ఇండియా ప్రాధమికంగా భూస్వామ్య దేశం (అర్థ భూస్వామ్య దేశం). కనుక, ప్రజలు భూస్వాముల భూములను ఆక్రమించుకోడం ద్వారా, భూస్వాముల ఆర్థిక బలాన్ని దెబ్బతీసి, వారిని లొంగదీయాలి. ఆవిధంగా గ్రామాల్ని ప్రజాధీనం చేసుకోవాలి. భూములను ఆక్రమించుకోడానికి జనం అప్పటికే సాయుధులై వుంటారు గనుక, నగరాల్ని… నగరాల్లోని రాజ్యాధికారాన్ని… సాయుధ పోరాటం ద్వారా ప్రజలు చేజిక్కీంచికోవాలి అనేది మిగిలిన రెండు మార్గాల ఉమ్మడి సారాంశం.

డివి, టిఎన్, సిపీ ల నాయకత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవ కారుల కమిటీలో దీని గురించి చర్చలు జరిగాయి. డివి, టిఎన్ ఇద్దరూ భూమి పోరాటం లేకుండా సాయుధ పోరాటం కుదరనే కుదరదన్నారు. సీపీ అలా కాదు. ప్రజలు భూమి కోసం మాత్రమే కాకుండా… కూలీ రేట్లు, గ్రామాల్లోని అన్యాయాల వంటి పాక్షిక సమస్యల మీద కూడా కదిలి వస్తారు. అప్పుడే వారి మీద భూస్వాములు, పోలీసుల నిర్బంధం వస్తుంది. ప్రజలు తాము సాధించిన చిన్న చిన్న విజయాలను కాపాడుకోడానికి, నిర్బంధాన్ని ప్రతిఘటించడానికి ఆత్మ రక్షణ దళాలుగా సాయుధులు కావాలి. ఈ సాయుధ ప్రజలు భూస్వాముల భూములను ఆక్రమించుకుని, వారి అధికారాన్ని కూలదొయ్యాలి. తాము భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూములనూ, అధికారాన్నీ కాపాడుకోడానికి ప్రజలు ఆ ఆయుధాలను వుపయోగిస్తారు. భూస్వాముల భూములు ఆక్రమించకుండా సాయుధ పోరాటం నిలదొక్కుకోలేదు అని సిపీ వర్గీయులు వాదించారు.

ఈ రెండు మార్గాల మధ్య తేడా… పాక్షిక సమస్యలపై సంఘటతమైన ప్రజలు సాయుధులు కావాలని సీపీ; భూస్వాముల భూములు ఆక్రమించాకనే వారు సాయుధులు కావాలని డీవి రావు.

ఇప్పడు మీకు అర్థమై వుంటుంది డివి గ్రూపు నాయకుడు సుబ్బారెడ్డి సాయుధ పోరాటానికి సంబంధించి వెంటనే కార్యక్రమం చెప్పలేకపోవడానికి కారణం. అది ఇంకా పాక్షిక సమస్యల పోరాట దశ. సుబ్బారెడ్డి ప్రకారం అప్పుడు జనం సాయుధులు కాగూడదు. సిపీ గ్రూపు ప్రకారం పాక్షిక సమస్యల మీద కదిలిన జనం లోంచి ‘ఆత్మ రక్షణ’ సాయుధ దళాలు తయారు కావాలి. దేర్ఫోర్, సాయుధ పోరాటం అప్పుడే మొదలయింది. చూడరాదూ… గోదావరి లోయలో మన సాయుధ దళాలు!

అప్పటి నా ఆశలు, అంచనాల మేరకు…. నా రాజకీయ వేదిక సీపీ నాయకత్వం లోని విప్లవకారుల కమిటీయే. ఆ అవగాహనకు తోడు… ఆనాడు కర్నూలు జిల్లాలో ఈ పార్టీయే ఒక పెద్ద శక్తి.

బహుశా, పుసులూరు బొల్లవరం నుంచి మేము నేరుగా కర్నూలు లోని పార్టీ ఆఫీసుకు వెళ్ళాం. అప్పుడు పార్టీ ఆఫీసు కొండారెడ్డి బురుజుకు దగ్గరగా వుండేది. పార్టీ ఆఫీసుకు వెళ్లిన వెంటనే కలిసిన వారు…. నన్నూరు నుంచి రామస్వామన్న, దైవందిన్నె నుంచి రామన్న గౌడ్, కర్నూలు బుధవారప్పేట నుంచి గోకారి, ఆఫీసులోనే వుండిన పర్ల గ్రామ యువకుడు… శత్రువుల దాడిలో కాలు పోగొట్టుకున్న శివా రెడ్డి… వీరందరి కన్న… నన్ను ఆకర్షించిన మనిషి మొలగవెల్లి సత్తెన్న…. అనగా ఇప్పుడు జగమెరిగిన అరుణోదయ రామా రావు.

తను అప్పటికి రామారావు అని కాకుండా సత్తెన్న అనే సొంత (?) పేరుతోనే వుండే వాడు.

సత్తెన్న అనే పేరే బాగుంది కదా, రాముడు దాన్ని ఎందుకు మార్చుకున్నట్టు అనిపిస్తుంటుంది నాకు.

రాముడిని మొట్ట మొదట కర్నూల్లో పార్టీ ఆఫీసులోనే కలిశాను. బహుశా నా పార్టీ జీవితంలో మొదటి వారంలోనే. తన పాటలు పద్యాలు విన్నాను. ఒక వ్యక్తికి దగ్గరగా కూర్చుని, ఆతడు అంత గొప్పగా పాడుతుంటే వినడం అదే మొదటి సారి. అంత అద్భుతమైన నాదం… గ్రామ ఫోను, స్ఫీకర్ల వంటి యంత్రాల నుంచి కాకుండా… ఒక సజీవ స్వరం నుంచి ప్రత్యక్షంగా వినడం నాకదే మొదటి సారి. రాముడు అందగాడు కూడా. నాంది నాటకంలో తెల్ల ప్యాంటు షర్టు వేసుకుని… ఇతడి ముందు నాగేశ్వర్రావు దిగదుడుపు… అనిపించే వాడు.

నిజానికి నాంది నాటకం గ్రామీణ ప్రజల మీద చూపించిన ప్రభావం చాల పెద్దది. అధ్యయన యోగ్యమైనది. డైలాగు నాటకానికి కాలం చెల్లిందనే మాట తప్పు అని ఈ నాటకం నిరూపించింది. అసలు సంగతి… రచయితలు… జనం సమస్యలను పక్కన పెట్టి… తమ ఎగువ మధ్య తరగతి, శిష్టవర్గ సమస్యలను… అందులోనూ… తమకే సరిగ్గా అర్థం కాని మానసిక సమస్యలను ప్రదర్శిస్తే… ఇంకా ‘వూరి’ సంస్కారం వదులుకోని ప్రజలకు ఎందుకు పడుతుందది? భౌగోళీకరణ వంటి అనిర్దిష్ట. సైద్ధాంతిక విషయాల చుట్టూ తిరిగే నాటకలతో జనానికేం పని.

ఇది కూడా సత్తెన్న రామారావు అయిపోవడం వంటిదేనంటే, రాముడు నన్ను కొట్టడానికి రాడనుకుంటాను. 🙂

31-08-2016

(వచ్చే వారం మళ్లీ కలుద్దాం)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s