ఉండటమా వుండకపోవడమా? అదీ ప్రశ్న!(4)

 

ఒక హాస్య కథ రాద్దామనుకుంటున్నా. మామూలు హాస్యం కాదు. కథ అయిపోయే సరికి నేల పాలయిన చెక్కలన్నీ ఏరుకుని, మీ పొట్టను మీరు మళ్లీ కుట్టుకోవాల్సి రావొచ్చు.

అసలు నవ్వొద్దని నొసలు ముడుచుకుని చదవడం మీ పొట్టలకు మంచిది.

నాకు మంచి కథ రాయడం రాదని ఎడిటర్ రంగా చెప్పారు. ఆ సంగతి నాక్కూడా తెలుసు అన్నాను. మరి రాస్తున్నావెందుకు అని ఎదురు ప్రశ్న వేశారు. ఏది మంచి కథో తెలియక, తెలుసుకుందామని రాస్తున్నానన్నాను.

ఈసారి ఆయన మాటలతో ఆపలేదు. ‘ఏది మంచి కథో తెలుసుకోడానికి చెత్త పోగేస్తావా, చంపేస్తా’నని చెయ్యెత్తారు. చేతిలో కోసుగా‍ పేపర్ కట్టర్ ఉంది. ఇది డిజిటల్ యుగం. మునుపు అంతా కత్తెర్లే. ఏ రోజు వచ్చిన పేపర్ల లోంచి ఆ రోజు కట్టింగ్స్ తీసి ఫైల్ చేయాలి. ఇక ఏ టాపిక్ మీద రాయాలంటే ఆ ఫైలు ముందేసుకుని చూసి రాయడమే. పత్రిక పని పెన్నులతో కాకుండా పేపర్ కట్టర్లతో మొదలయ్యేది.

ఎడిటర్ రంగా ఎడిటోరియల్ డిపార్ట్మెంటులో కాలు పెట్టింది ‘పేపర్ కటింగ్స్’ పనితోనే. ఆయనకు పెన్ను కన్న కట్టర్ వాడడమే బాగా తెలుసు. అది గుర్తొచ్చి, నేను కట్ చేయడానికి మార్క్ చేయబడిన న్యూస్ పేపర్ లా వణికిపోయాను.

నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఎట్టాగో కింది ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బయట పడ్డాను. ఆయనకూ, ఎవరికీ, ఆ మాటకొస్తే నాక్కూడా అడ్రసు తెలియని నా గదికి చేరుకున్నాగ్గాని, వూపిరి తీసుకోలేక పోయాను.

అప్పటికి వూపిరి తీసుకున్నాను గాని, ప్రాణాలు కుదుట పడ లేదు. అవి ఇంకా నా అర చేతిలోనే ఉన్నాయి. నేనొక మాలోకం. చేతి లోంచి వాటిని ఎక్కడ పారేస్తానో అని భయం. భయాన్ని తప్ప దేన్నైనా పారేసుకుంటాను నేను.

ఎడిటర్ రంగా వుద్దేశమేంటసలు? మంచి కథలు వచ్చేట్టు చూడాలనా? కాదనుకుంటా. ఆ పని పెద్ద ఎగ్జైటింగ్ గా ఉండదు. పోనీ, చెత్త కథలను, అవి తయారయ్యే చోటనే నరికెయ్యాలనా? అంతే అయ్యుంటుంది.

చెత్త కథకుల్ని చంపేస్తే చెత్త కథలు ఆగిపోతాయి. సింపుల్. గొప్ప విప్లవాత్మక భావన. ఒక చెత్త కథకున్ని ఖతం చేస్తే వూళ్లో ఉండే చెత్త కథకులందరూ వూరొదిలి పారిపోతారని థీరీ.

చెత్త కథకులు వూరొదిలి ఎక్కడికీ పోరు. కథల్ని కవితల్లోకి, వ్యాసాల్లోకి స్మగుల్ చేస్తారు. కనుక భూమ్మీద చెత్త కథల పునాదులనే పెకలించేయాలని ఇంకో థీరీ. ఒక చెత్త కథకు వ్యతిరేకంగా కాస్త-తక్కువ-చెత్త కథతో ఐక్యసంఘటన కట్టాలనేది వీళ్ల ముఖ్యమైన ఎత్తుగడ. చెత్త కథకులను కాదు చెత్త కథను నిర్మూలించాలి అని వీళ్ల స్లో-గన్. ఇది నాక్కొంచెం నచ్చేసింది. కథల్సంగతేమైనా, దీని ప్రకారం కథకుడు… అంటే నేను… సేఫ్ కదా.

ఎడిటర్ రంగాకి మాత్రం మొదటి థీరీనే నచ్చింది. ఐక్య అయినా ఇంకోటైనా కట్టడం కష్టం, cutటడం సులువు అంటాడాయన.

థీరీలదేముంది? ఎవరి థీరీ వాళ్లది. భగవంతుడి లాగ.

ఎడిటర్ రంగా కథక-శత్రు- నిర్మూలన సిద్ధాంతాన్ని ఇష్టపడితే, అది ఆయన ఇష్టం. దాన్ని నాతో మొదలెట్టాలనుకోడమే నా దురదదృష్టం.

దురదృష్టం కూడా అదృష్టమే. కనిపించదు. నేను దేన్నీ అదృష్టానికి వదిలేసే రకం కాదు.

జోతిష్యం మీద నమ్మకం లేక కాదు. జోతిష్యమంటే భయం.

నేను ఫలానా తేదీకి చచ్చిపోతానని ఎడిటర్ రంగానే ఇంతకుముందెప్పుడో చెప్పారు నాకు. ఆ మాట చెప్పినప్పుడు ఆయనొక సుప్రసిద్ధ దిన పత్రికలో భూత-సంపాదకీయాలు… అంటే ఘోస్ట్ ఎడిటోరియల్స్… రాస్తుండే వారు. భూతాలతో ఆయనకు అప్పుడే స్నేహం. జ్యోతిష్యం ఆయన హాబీ. వృత్తి, ప్రవృత్తి ఒకటయిపోయిన అద్భుత సందర్భం ఎడిటర్ రంగా.

ఆయన చెప్పిన, నా చావు తేదీ అయిపోయి ఐదేళ్లవుతోంది. ఇంగ్లీషు క్యాలెండరుతో, ప్రభవ విభవలతో, రంజాన్ నెలలతో… అన్ని విధాలుగా లెక్కలు వేసుకున్నాను. పాండవుల అజ్ఙాతవాసం అయిపోలేదని పొరపడిన దుర్యోధనుడి తప్పు నా నుంచి జరక్కుండా చూసుకున్నాను. ఓడిపోవడం మీద అంత షోకు ఉంటే, తరువాత్తరువాత యుద్ధంలో ఓడిపోవచ్చు. లెక్కలేసుకోడంలోనే ఓడిపోతే ఎలా?

అబ్బే, ఆ గండం గడిచి పోయింది. నేను వున్నాను. చనిపోకుండా వున్నాను. కొంచం కూడా చనిపోకుండా వున్నాను. తప్పిపోయిన నా మృత్యు ఘడియలకు, రంగాకు, ఆయన శిష్య కింకరులకు కనిపించకుండా జాగర్త పడుతున్నాను. కనిపిస్తే ఇంకా వున్నావెందుకని తిట్టి, ‘ఆల్మైటీ’ నవల్లో లాగ, వార్తను నిజం చేయడానికి, నన్ను చంపేస్తారని.

నాకేం, నా గది వుంది కదా, నాక్కూడా అడ్రసు తెలియనిది.

ముందుగా ముగింపు రాసేసి, ఆ తరువాత కథ రాయడం వంటిది జోతిష్యం. లేక జ్యోతిష్యం వంటిది కథ.

కథ చదివిన వాళ్లకు చివరికి మిగిలేది ముగింపే. పాఠకుడు చివరికంటా చదవకుండా మధ్యలోనే వదిలేస్తే ఏం మిగులుతుందని అడక్కూడదు. చదవాలంతే. మంచి పాఠకులకు ఇలాంటి షరతులు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చెబుతా, దీన్ని మీరు చివరికంటా చదివితే.

దేర్ఫోర్, మంచి లక్షణాలలో మొట్ట మొదటిది: ముందుగా రాసిన ముగింపు కోసం కథ నడవడం. కథ వంటి మహత్తర జీవికే అట్టాంటి షరతు వుంటే, నా వంటి అల్ప జీవి సంగతేంది? నేను చచ్చిపోవాల్సి వుండి చచ్చిపోకుండా వుండడం తప్పక నేరమే. జోతిష్య ప్రపంచం నన్నెలా క్షమిస్తుంది? ఈ అసంగతం ఎలా జరిగుంటుంది?

చిత్రగుప్తుని చిట్టాలో ఏదో గోల్‍మాల్ జరిగింది.

నా బదులు ఎవరు చచ్చిపోయారో ఏమో. నా వంటి ‘ఎనీ టైమ్ ఎనీ సెంటర్, రెడీ టు డై’ గాడు చావడం, ఓకే. కింకరుల తప్పిదం వల్ల నాకు బదులు యమపురి చేరిన అమాయకుడెవరో? చావంటే చచ్చేంత భయం వున్న వాడైతే, ఆ భయంతో చచ్చుంటే, ఆ హత్యా నేరం ఒకటా నా నెత్తిన?

తను చెప్పినట్టు కథలూ ఆపక, చావనూ చావక ఎడిటర్ రంగా మాట ఏదీ వినక ‘పాపం’ చేసింది నేను. నా పాపం తన పద్దులో పడి ఆ అమాయకుడు ఏ ఇనుప గోలెంలో సలసల కాగే నూనెలో వేగుతున్నాడో, పాపం.

‘కథంటే ఏమిట్రా నాయ్నా, అదేమైనా తినేదా ముడ్డి తుడుచుకునేదా, మీరైనా నన్ను తినే వుద్దేశమో తుడుచుకునే వుద్దేశమో లేకుండా ఇట్టా వేయించడమెందుకురా’ అని ఆ అమాయకుడు అరుస్తుంటాడు. ‘పశ్చాత్తాపం లేని పాపి’ అని యమ కింకరులకు మండిపోయి గోలెం కింద బర్నర్లు మరింత పెంచుతుంటారు. తను కథలు రాసేంత పాపిని కాదని చెప్పడానికి అతడు తల బయటికి పెడితే శూలాలతో పొడిచి గోలెం నూనేలోకి తోసేస్తూ వుంటారు.

చచ్చిపోవాల్సి వుండి కూడా, చచ్చిపోకుండా ఎందుకు వున్నాన్నేను? అది ఎందుకో తెలీదు గాని, సరిగ్గా అందుకే రాయకుండా వుండాల్సి వుండి రాస్తున్నానంటే ఎడిటర్ రంగా ఒప్పుకోడు.

ఎడిటర్ రంగా మీకు బాగా తెలుసో లేదో. మీకూ మరొకరికి తెలియకపోతేనేం. ఆయనొక జగమెరిగిన జర్నలిస్టు. తన ‘భూత’ కాలం తరువాత, కొన్ని శిష్య భూతాల్ని సంపాదించి, తను కూడా సంపాదకీయాలు రాయని సంపాదకుడయ్యాడు. చాల బిజీ. ‘ఇప్పుడు నిన్ను చంపే తీరిక లేదు నాకు. ఇంకొన్నాళ్లు వుండాలనుకుంటే వుండి చావు. అందాక రాయకుండా వుండి చావు’ అంటారాయన. ఉండకపోవడం, రాయకపోవడం రచయితకు ఒకటే కదా అని ఇంత చావు బతుకుల మధ్య నాకు తోచే మడత ప్రశ్న.

ఇట్టాంటి ప్రశ్నలు నాకు భలే తోస్తుంటా‍యి. అవి అలా తోస్తుండబట్టి నా బండి ముందుకు నడుస్తోంది. ఈ తోపుడు సంగతి మాత్రం ఆయనకు చెప్పలేదు.

మన లోకం లోనే కాదు, ముక్కోటి లోకాల్లో పలుకుబడి గల పాత్రికేయుడాయన. నేరుగా యమలోకం వెళ్లి, అక్కడ ఇంకేదో ప్రెస్ కాన్ఫరెన్సు జరుగుతుండగా మధ్యలో లేచి, చిత్ర గుప్తుని మీద అవినీతి ఆరోపణలు చేసి, దానికి తన వద్ద చాల రుజువులున్నాయని ఉద్ఘాటించి, తిరిగొచ్చి తన పనులు తాను చూసుకుంటూ కూర్చుంటే చాలు. వాటికి రుజువులు ‘చూపమని’ ఎవరూ అడగరు. రుజువులు వున్నాయని గట్టిగా అంటే చాలు.

ఇంకేం. అన్ని లోకాల్లో అన్ని ఛానల్లు, అంతటి ఆసక్తి కర కర కర కబురు మరొకటి దొరికే వరకు, దాన్నే చెబుతుంటాయి, వత్తులు పలక్కూడదని యాంకర్లకు జాగ్రత్తలు జారీ చేసి.

వార్తను పదే పదే చెప్పడం వాళ్లకు విసుగనిపిస్తే (శ్రోతలకు కాదు, ఛానెళ్లకు) ప్యానెల్‍ చర్చలు పెట్టి ‘యమలోకంలో అవినీతి’ అంటూ ఒకరు చెప్పేది మరొకరు వినకుండా, మరెవర్నీ విననీయకుండా చర్చలు అరిపిస్తారు. ఆ మద్యలో, ఏలిన వారు నా సంగతి చూడక పోవడంలో అవినీతి వుండొచ్చని ఎవరో అనుకుంటున్నట్టు ఎడిటర్ రంగా తన పత్రికలో చిన్న సింగిల్ కాలమ్ వార్త వేసేస్తే చాలు. మన పని మటాష్.

కథా సాహిత్యం పాడైపోకుండా చూడాలని ఆయనకు అంత పట్టుదల. చాల సామాజిక స్పృహ కల్గిన నిబద్దుడాయన. నిబద్ధత, సామాజిక స్పృహల మీద అయన ప్రసంగాలు విని చాల సార్లు కోల్పోయిన స్పృహ వుంది నాకు. ఆ సంగతి ఆయనకు ఎప్పుడూ చెప్పలేదు, నా స్పృహలో నేను వుండటం వల్ల.

ఆయనకు మరొక విషయం కూడా చెప్పలేదు. కథా సాహిత్యం మీద ఆయన రాసిన విమర్శ వ్యాసాలు, సమీక్షల పుస్తకాలు చదివాన్నేను. ఆయన మెచ్చుకున్న కథలు కథా సాహిత్య నికషోపలా‍లు అనే సంగతి ఆయన చెప్పడం వల్లనే నాకు తెలిసింది. మళ్లీ ఆ కథలను చదివితే తెలీ లేదు, అదేంటో.

ఆయన మెచ్చిన కథల కోసం వెదుకుతూ ఇంకేవో కథలు చదివాను. అందులో బాగున్నవన్నీ ఎడిటర్ రంగా మెచ్చికోల్ దెబ్బల నుంచి తప్పించుకోవడం గొప్ప ఫీటు. ఎడిటర్ రంగా పత్రిక(ల)లో గాని, ఆయన మెచ్చుకోలు జాబితాల్లో గాని ఎక్కడా ఆ కథలు చిక్కవు, దొరకవు.

పాపం ఈ ప్రివిలేజ్ కోసం ఆ కథలు పడే పాట్లు చూస్తే జాలేస్తుంది.ఆలాంటి ఒక కథ మధ్యలో ఒక పాత్ర ఒళ్లు మరిచి నేను పేద వాడిని, కాని మంచి వాడిని కాను అంటుంది. మంచి వా‍డిని కాకపోవడం వల్లనే ఇంకా బతికున్నానని కూడా అంటుంది. రంగా స్పృహలో వున్న వాళ్ళకు వళ్లు మండుతుంది. రూలు ప్రకారం పేదవాళ్లు ఆటొమాటిక్‍గా మంచి వాళ్లై వుండాలి. అది కథా నీతి. ఆ నీతి తప్పిన పాత్రను రచయిత అదేదో తన సొంత బిడ్డ అయినట్లు సానుభూతితో రాస్తాడు.

ఇంకో పాత్ర తానొక మహోద్యమం మధ్యలో ఒకమ్మాయిని చూసి మోహపడిన సంగతిని వైన వైనాలుగా వర్ణిస్తుంది. ఒకసారి ఆమెను ముట్టుకున్నానని, ఆ స్పర్శ కోసం చచ్చినా ఫర్లేదనిపించిందని తెగ మురిసిపోతుంది.

మరో కథలో రైతు పాత్ర తన ఆత్మహత్య లేఖలో వ్యవసాయం గురించి ఒక్క ముక్క కూడా లేకుండా జాగర్త పడుతుంది. రైతు ఆత్మహత్యల లెక్కల్లోంచి కొన్ని అంకెలను తగ్గించే దారుణానికి ఒడిగడుతుంది.

మంచి కథలో, రచయిత తనకు తెలిసిన సంగతులు చెప్పకూడదు. చెబితే నోస్టాల్జియా అవుతుంది. తెలియనివి చెప్పాలి. దాన్ని మేజికల్ రియలిజం అంటారు. ముల్లు గుచ్చుకుంటే ఎలా‍ వుంటుందో చెప్పాలంటే రచయితకు ఎప్పుడూ ముల్లు గుచ్చుకోకపొయ్యుండాలి. తను ఎప్పుడూ అడపిల్లగా వుండని వాడే ఆడపిల్లగా కథ రాయాలి. పరకాయ ప్రవేశం అంటారు దాన్ని. అబ్బాయి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమ్మాయికి ఎలా ఉంటుందో మగ రచయిత చెప్పాలి. అబ్బాయికి ఎలా వుంటుందో ఆడ రచయిత చెప్పొచ్చు, కావాలంటే.

తనకు నిజంగా తెలిసింది రచయిత ఎప్పుడూ చెప్ప గూడదు.

ఇలా ఎడిటర్ రంగా విమర్శలు చదివి ఎంత జ్ఙానినయ్యానో ఆయనకు చెప్పాలని అనిపించింది. మొదటికి మోసమని, వూరుకున్నాను. ఆయన మనం చెప్పింది చెప్పినట్లు వినడు. మాటల మధ్య పేపర్ కట్టర్ పెట్టి కెలుకుతాడు.

చెప్పకుండా వూరుకోడం చాల కష్టంగా వుంటుంది. నోట్లో అల్సర్ బాధ పెడుతున్నట్టు పెదిమలు గట్టిగా బిగించుకోవాలి. అది అల్సర్ కాదని అనుమానం రాకుండా, ఆయన చూస్తుండగా నోట్లో వేలు పెట్టుకుని పెదిమల లోపల మసాజ్‍ చేసుకోవాలి. ఆయన చెప్పే హోమియోర్వేదం మందుల పేర్లు శ్రద్ధగా రాసుకోవాలి, ఇంకేవీ రాసి లేని కాగితం మీద, తరువాత చించేయడానికి వీలుగా.

అందుకని నేను నా గదిలోనే వుండిపోయాను, నాక్కూడా అడ్రసు తెలియని గదిలో. మరేం భయం లేదు. ప్రాణాలు అరచేతిలోనే ఉన్నాయి. వాటిని ఇంకా పారేసుకోలేదు. నేను కూడా మొండోన్నే, జ్యోతిష్యాన్ని అంత వీజీగా గెలవనిస్తానా?

మామూలుగానైతే నేను ఏ బ్రాందీ షాపు ముందు రోడ్డు మీద ఎన్నో ప్లాస్టిక్ గ్లాసు ఎన్నో గుటకలో సులభంగా దొరుకుతానో ఎడిటర్ రంగాకు తెలుసు. అక్కడెక్కడా వుండకుండా వుండడం కష్టంగా వుంది. రాయకుండా వుండడం ఇంకో కష్టం. ఎప్పుడో దొరికిపోతాను. ఎడిటర్ రంగా జోతిష్యం నిజం కాక తప్పదు. ఓ పదిరవయ్ ముప్పయ్యేళ్లు అటు ఇటుగా.

అదండీ కత. నవ్వకం కుదరకపోతే కొంచెం తవ్వకమైనా కుదుర్తుందేమో చూడండి. మనం మొదట అనుకున్నట్టు మీరు నవ్వకుండా జాగర్తగా వున్నారు కదా? మీకు ఆ కష్టం కలక్కుండా చూడడా‍నికి నా వంతు పని నేను చేశానని చిన్న తృప్తి చివరాకరికి.
సెప్టెంబర్ 2016, చినుకు

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s