అనుభవానికి వచ్చిన కామ్రేడరీ

స్మృతి 29

ఇల్లు వదిలి వూళ్లు తిరిగే పనులు దాదాపు ఎప్పుడూ చేయలేదు నేను. ఎస్సెస్సెల్సీ లోగా నాకు తెలిసినవి నాలుగే నాలుగు వూళ్లు. మా వూరు గని, ‍అమ్మ వాళ్ల వూరు కొండమీది బొల్లవరం. మొదటి హైస్కూలు గడివేముల, రెండో హైస్కూలు తలముడిపి.

ఎమ్మే తరువాత చాల రోజులు ఎటూ వెళ్లకుండా వూళ్లోనే వున్నాను. పార్టీ పని మొదలెట్టాక, ఒక చోటు అని లేకుండా, జిల్లా అంతా దున్నేశాను. తెలియని వూళ్లెన్నో తెలిసి వచ్చాయి.

సాధారణంగా ఇల్లు కదలని వాడికి, కాలేజీలో వున్నప్పుడు రూము కదలని వాడికి…. ఒక్క సారిగా కాళ్లకు చక్రాలు మొలిచినట్టయ్యింది.

అది కొద్ది ఆ రోజులే. ఆ తరువాత చేసినవన్నీ మళ్లీ పరమ స్టేషనరీ పనులే. హైదరాబాదులో వుండి పార్టీ పత్రిక, సాహిత్య రంగం పనులు చూస్తున్నప్పుడు… మాగ్జిమమ్ జిల్లా కేంద్ర పట్టణాలకు వెళ్లే వాడినేమో.

వర్కింగ్ జర్నలిస్టుగానయితే ఆ పదారేండ్లు మరీ ‘సుస్థిరో’ద్యోగం. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లకు కూడా రానని చెడ్డ పేరు తెచ్చుకున్నాను. వరుసగా రెండు రోజులు సెలవు పెట్టి, వెళ్లడం కుదిరేది కాదు.

జర్నలిజం అంటే రిపోర్టింగ్. ఊరు తిరిగి వార్తలు సేకరించాలి. మనుషులతో మాట్లాడి సంఘటనల నిగ్గు తేల్చాలి. కొట్లాటల్లో ఫ్రంట్ లైన్లోకి వెళ్లి చూసి రాయాలి. నేనేమిటి ఇలా ఈ మూల సౌధంబులో, నలు చదరపు చెక్క క్యాబిన్లో, ఎండకన్నెరుగని అంతఃపురంబులో… అని తెగ గింజుకునే వాడిని. మిత్రుడు, కార్టూనిస్టు శ్రీధర్ తో “పెద్దన్నా, నా కెందుకింత జీతం ఇస్తున్నారు వీళ్లు, ఏం చేస్తున్నాన్నేను, కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నాన’ని నా మీద నేను విసుక్కునే వాడిని.

‘ఈనాడు’ వదిలేశాక కూడా ఆశ వుండేది నాకు. తిరుగుబోతు పని చేయాలనే ఆశ. ఎవరేనా నన్నొక కబ్ రిపోర్టర్ గా తీసుకుంటారా అని తెగ ప్రయత్నించాను. ‘టైమ్స్ అఫ్ ఇండియా’, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’, ‘ఇండియా టు డే’ ఆఫీసులకు వెళ్లి నా కేసు చాల ఆర్డెంట్ గా వివరించేను కూడా. అప్పుడేమో వయసు అడ్డొచ్చింది. ‘నువ్వు యాభై దాటావు, ఈ కాలానికి పనికి రావు’ అనేశారు. వామపక్షులని పేర్వడసిన వారిదీ అదే మాట. అవేం పక్షులో ఏమో. రిపోర్టింగ్ అంటే, అదేమన్నా గుమ్మడి కొండ ఎత్తడమా, దానికి వయసుతో ఏం పని అని విసుక్కునే వాడిని లోలో.

ఊళ్లు తిరిగి పని చేయాలని చేసిన ఎన్‍ జీ వో ఎక్స్పెరిమెంట్ల సంగతి తరువాతెప్పుడో చెబుతా.

గతకాలపు సంగతులు ఇప్పుడు చెప్పడం రాత్రి వచ్చిన కలను పొద్దున చెప్పడం వంటిదని, కలలో కాలం మెలికలు, డిటౌర్లు తిరగడం మామూలని… ఈ కాలమ్స్ మొదట్లోనే రాసి, ఒక ‘సందు’ పెట్టుకున్నాను గనుక, ఇప్పుడు చెప్పినా అనాక్రానిజమని మీరు అనరు గాని, ఎన్‍ జీ వో ల సంగతి బాగా తరువాత చెప్పుకుందాం, ఓఖే?!

కర్నూలు టౌన్హాల్ లో పెళ్లి చేసుకోడానికి ముందు, ఆ తరువాత… ఆ కొద్ది రోజుల్లో… మునుపు చూడని వూళ్లెన్నో చూశాను. అప్పటికి పేరు మాత్రమే విన్న… ఆ ‘చిందుకూరు’, ఆ ‘జూటూరు’… అవెట్టా వుంటాయో అనుకుంటూ వుండిన వూళ్లెన్నో చూశాను.

తమాషా ఏమిటంటే, మా వూరి పక్కనే వున్న జలకనూరు కూడా అప్పటికి చూసి వుండలేదు నేను, పార్టీ పని కోసం మొదటి సారి ఆ వూరు వెళ్లి, ఒక ఎత్తైన చోటి నుంచి మా వూరిని చూసి, “ఓర్నీ, మావి ఇంత దగ్గరి వూళ్లా?” అని ఆశ్చర్యపోయాను.

చాల ఎక్కువగా నన్నూరు రామస్వామన్నతో, కొన్ని సార్లు వీరన్న తాతతో కొత్త కొత్త వూళ్లు వెళ్లడం,.. అప్పుడే పరిచయమైన కొత్త కొత్త మనుషులతో… ఆజన్మబంధమేదో వున్నట్టు వ్యవహరించఢం… మొదట కాస్త విచిత్రంగా వుండినా, రాను రాను గొప్పగా వుండేది.

చెప్పొద్దూ, చాల పని చేశాం కాని, ‍అది పని చేయడమని అనిపించలేదు. బాల్యంలోని ఏదో ఆటని మరి మరి ఆడినట్టుగా, అప్పట్లాగే ఆటలో మునిగిపోయి అన్నం తినడం మరిచి పోయి అమ్మతో తిట్టించుకోబోతున్నట్టుగా వుండేది.

మేము వెళ్లే వాటిలో వేంపెంట, ప్రాతకోట, దుర్వేసి వంటి… సేద్యపు నీరున్న… సంపన్న గ్రామాలు కూడా వుండేవి. ఆ గ్రామాల్లోని సంపన్న రైతులలో ‘మా’ వాళ్లుండే వారు. అక్కడ ఎంచక్కా వరి బువ్వ దొరికేది. ఉప్పలపాడు, లొద్దిపల్లె, వండుట్ల, పైబాగల, బైరాపురం వంటి మారు మూల, పేద గ్రామాలు కూడా వుండేవి. అక్కడ జొన్న రొట్టె, కొర్ర బువ్వ ఇంకా బాగుండేవి. అన్నిటికీ మించి.. ఆహారంలో, వ్యవహారాల్లో మా జీవితం ఒక్కో రోజు ఒకలా… చాల వివిధంగా వుండేది. ఇక ‘నా’ గురించి ‘నేను’ ఆలోచించుకోడానికి, దిగులు పడ్డానికి… టైమెక్కడ?

దిగులుకు టైము లేకపోవడమే నిజమైన శాంతి అనుకుంటాను. అలా కానిది శవ-శాంతి ఎందుకు కాదో విజ్జ్ఞులు చెప్పాలి

మేము వెళ్లిన ఇళ్లలో సుబ్బరమైన తెల్లని గ్లాస్గో ధోవతుల వాళ్లు, మాసిపోయిన నీర్కావి పంచెల వాళ్లు వుండే వారు, మొగమంత కళ్లై పలకరించే అమ్మలు, అక్కలు, ‘ఆ, వచ్చారా ఇగ మా ఆయన్ని యాడికో తోల్క పోతారు, ఈన ఇంటికి మల్లెప్పుడొచ్చాడో ఏందో, ఏం ముదనష్టపు సంత మాకు’ అని మమ్మల్ని చూసి మూతులు ముడిచే ఇల్లాళ్లు… ఓహ్…. వాళ్లంతా నా వాళ్లు అనుకోడంలో ఒక అద్భుత ఆనందం.

అది నటన కాదు. నా నుంచి నటన కాదు. వాళ్ల నుంచీ కాదు. అక్కడ నటన అవసరం లేదు. మేము ఏదో ఇచ్చి పోదామని వచ్చిన గవర్మెంటోల్ల కాదు. ఏదో ఇచ్చిపోతామని వాళ్లకు చెప్పడం లేదు. రానున్న ఎన్నికల్లో వాళ్ల వోట్లు మాకు వేయాలని మేము అడగడం లేదు. అయినా ఒక కానరాని, మెటీరియల్ కాని అనుబంధం మా మద్య. ఆ అనుబంధం నిజం.

కమ్యూనిస్టులకు చాల ఇష్టమైన పదం ‘కామ్రేడరీ’. కామ్రేడ్ అని ఒకరినొకరు పిలుచుకోడం. కమ్యూనిస్టు ‘కామ్రేడరీ’ని నేను మనసారా అనుభవించిన రోజులవి.

ఒక రోజు నేను, గార్గేయపురం కాంతన్న కలిసి నడుస్తున్నాం. కాంతన్న గార్గేయపురం ప్రముఖుడు, ఎన్నార్ బంధువు కృష్ణమూర్తికి తమ్ముడు.

ఎందుకో ఏమో, గార్గేయపురం నుంచి… బస్సు ఎక్కకుండా… నడిచి వెళ్తున్నాం, కర్నూలు వైపు. మధ్యలో ‘మిలిటరి మిద్దెలు’ అని ఒక వూరు. ఎప్పుడో ప్రభుత్వం కొందరు సైనికులకు ఇచ్చిన స్థలాల్లో వాళ్ల వారసులో, స్థలాలు కొన్న వాళ్లో ఇళ్లు కట్టుకోడం వల్ల ఆ వూరికా పేరు వచ్చింది.

“మరే, మనకు ఈ వూర్లో ఎవరూ తెలదు కదా, మనం పొయి విప్లవం గురించి చెబితే వింటారాంటావా?” అన్నాఢు కాంతన్న.

కాంతన్న ప్రశ్న నాక్కూడా విచికిత్స కలిగించింది. ఔను, వీళ్ల కోసమే కదా విప్లవం, అది వీళ్లకు కొంచెమైనా తెలుస్తుందా, వెళ్లి చూడాలనిపించింది. వెళ్లి అక్కడ చర్చి ముందు చెట్టు కింద నిలబడ్డాం. ఇద్దరు పెద్ద వాళ్లు వచ్చి పలకరించారు. మేము వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నామని చెప్పాం. వాళ్లతో కూర్చుని, మేము ఎవరమో ఏం చేస్తున్నామో, పేద వాళ్లందరూ ఏ విధంగా మాకు బంధువులో చెప్పే కొద్దీ, కాసేపట్లో అక్కడ ఇరవై మంది పోగయ్యారు. మా మాటలు శ్రద్ధగా విన్నారు. ఎవరో మంచి నీళ్లు తెచ్చి ఇచ్చారు. ఏమైనా తిని వెళ్లమని అడిగారు.

ఆ రోజు మేము మాట్లాడిన వాటిలో వాళ్లను ఆకర్షించినదేమిటి? ఆ విషయంలో నాకెలాంటి సందేహం లేదు. ‘మేము ఎన్నికల్లో పాల్గొనం’. కనుక వాళ్లను ఓట్లు అడగబోవడం లేదు. ‘మేము ఏ మత పూజారులం కాము’. చందాలూ అవీ అడగడబోవడం లేదు. ‘మేము ఏమీ ఇవ్వడానికి రాలేద’ని ముందే చెప్పాం, ఆ పంపకాల పేచీలూ ఏమీ వుండవు.

అయినా, మేము వాళ్ల జీవితాల గురించి మాట్లాడుతున్నాం. మాకు ఏ స్వార్థం లేకుండా మాట్లాడుతున్నాం. వాళ్ల ఓటు సాయం, కర్ర సాయం… ఏమీ మాకు అక్కర్లేకుండానే వాళ్లతో మాట్లాడుతున్నాం. వాళ్లకు అవసరమైతే మేము అండగా వుంటామంటున్నాం. దాదాపు అన్ని నక్సలైట్ పార్టీలలో, బృందాలలో వుండిన ఈ విస్పష్ట ప్రకటిత నిస్వార్థమే వాళ్లకు ప్రజల్లో అంత బలం ఇచ్చిందని నా అభప్రాయం.

ఈ అభిప్రాయం, ఈ అవగాహనే నన్ను చిరకాలం ముందుకు నడిపించింది.

మరి ఆ తరువాతేమయ్యింది హెచ్చార్కే!, … … ఎందుకలా మరి…? … అని అడగాలనిపిస్తోంది మీకు.

అడగాలని నాకూ అనిపిస్తోంది.

జవాబు దిశగా నన్ను నేను తవ్వుకోవడమే ఈ కాలమ్స్ లో ప్రయత్నం. ఇక్కడ నేనొక తవ్వుకోలను మాత్రమే. తవ్వుకోలంత నిరపేక్షిక దృష్టితో వుండాలని సంకల్పం. దారి తప్పితే చెప్పండి.

పెళ్లైన తరువాత సుమారు ఇరవై రోజులు ఇద్దరం మండ్లెంలో జయ వాళ్ల ఇంట్లోనే వున్నాం. టౌన్ హాల్ లో పెళ్లి తరువాత ఇంటికి పోదాం రండి అని మా అమ్మ పిలిచింది. అప్పుఢు గనికి వెళ్లడం కన్న మండ్లెం వెళ్లడమే బాగుంటుందనిపించింది నాకు. వారం, పది రోజులు మండ్లెంలో వుండి వస్తామని అమ్మకు చెప్పాను.

మండ్లెంలో వుంటూనే చుట్టు పక్కల గ్రామాలు వెళ్లే వాడిని, ఎక్కువగా రామస్వామన్నతో.

ఒక సాయంత్రం ప్రాతకోట. లక్ష్మాపురం గ్రామాలకు వెళ్లి తిరిగి మండ్లెం రాగానే, ఇంట్లో చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ ప్రకటించారని.

నేను వెంటనే అజ్ఞాతం లోనికి వెళ్లాలి. అప్పటికే గనిలో మా ఇంటికి పోలీసులు వెళ్లారని తెలిసింది. సుబ్బారెడ్డి మామ, జయ వాళ్ల నాన్న… నన్ను వెళ్లి ‘తోటలో వుండుపో’ అని చెప్పాడు.

నాకు వినబుద్ధి కాలేదు. పగళ్లు సరే, పార్టీ పని మీద వూళ్లకు వెళ్లే వాడిని. రాత్రులు ఇంటికి దూరంగా వెళ్లడమా? జయను వదిలిపెట్టి పోవాలనపించడం లేదు.

ఆఁ, గని అంటే… అది మా సొంత వూరు కాబట్టి ఇంటికి వెళ్లారు పోలీసులు…. నేనేం పెద్ద విప్లవకారుడినని…. మొన్న మొన్ననే కదా పార్టీలో చేరింది…. నన్ను మరీ అంతగా పట్టించుకోరులెద్దూ…. నాకు పెళ్లైందని తెలుసుకుని, అత్త గారి వూరు ఏదో తెలుసుకుని ఏమొస్తారు…. రారులే అంటో ఇంట్లో వుండిపోయాను.

తెలుసు. అవన్నీ వుత్తి సమర్థనలు. నేను తక్షణం అజ్జ్ఞాతం లోకి వెళ్లాలి. అది ఎలా వెళ్లాలో తెలీదు. తెలీకపోయినా ఫరవాలేదు. మామయ్య చెప్పినట్టు తోటకు వెళ్లి వుండొచ్చు. తరువాతేం చేయాలో ఆలోచించుకోవచ్చు.

అసలు విషయం ఆ ఇరవై రోజులుగా తెలిసి వచ్చిన దాంపత్య జీవితాన్ని వదులుకుని వెళ్లలేని అచ్చపు బలహీనత నాది.

(తవ్వుకోల బాగానే పని చేస్తోంది కదూ?!. తవ్వే కొద్దీ ఉక్కు ఏదో తుక్కు ఏదో బయట పడుతోంది కదూ?!) 🙂

ఆ రాత్రి గడిచి పొద్దు పొడిచింది. నేను పడ్సాలలో. కింద పీట మీద, స్తంభానికి వీపు ఆన్చి కూర్చుని, పాలకూరతో జొన్నరొట్టె తింటున్నాను. జయ నడుముకు కొంగు చుట్టి నిలబడి ఏదో మాట్లాడుతోంది.

మండ్లెం సర్పంచ్, పేరు చిన్న రామి రెడ్డి అనుకుంటా… ఆయన్ని వెంట బెట్టుకుని వచ్చారు నందికొట్కూరు సబిన్స్పెక్టర్ రెడ్డప్ప, మరి ఇద్దరు కానిస్టేబుల్స్.

(ఆది ఆ సర్పంచ్ తప్పించుకోలేని పని, పాపం. వూరి వాళ్లు ఆయన్ని బాగా తిట్టుకున్నారు, కొత్తగా పెళ్లైన వాళ్లని విడదీసినందుకు).

అది నా మొదటి, చివరి అరెస్టు.

రొట్టె తినడం పూర్తి చేసి, అక్కడే గుంజకు తగిలించి వున్న నా బ్రౌన్ ప్యాంటు వేసుకున్నాను.

ప్యాంటు వేసుకుని జయ వైపు చూశాను. తను నఢుం దగ్గర చెక్కిన చీర చెంగు అలాగే వుంది.

అంత వరకు అన్నీ మా చేతుల్లోనే వున్నాయనుకున్నాన్నేను. నేను ఏం చేయదల్చుకున్నానో అది చేశాను. ఎవరి అనుమతి, అంగీకారాల కోసం ఎదురు చూడలేదు. అన్ని సమస్యలు నేను చూసుకుంటాననే భరోసా జయకు ఇచ్చి వుంటాను. మా జీవిత సమస్య దేన్నైనా మాకు ‍అనుకూలంగా ట్యాకిల్ చేయగలనని నేను అనుకున్నాను. నా అవగాహన మేరకు, జయమ్మకు కూడా అలాంటి ఇంప్రెషన్ ఇచ్చి వుంటాను. తనని చూసి దైర్యం చెప్పడం వంటిదేమీ చేయలేకపోయాను. నాకే చాల కన్ఫ్యూజింగ్ గా, క్లమ్జీగా వుండింది.

మొదటి సారి పరమ నిస్సహాయంగా, పోలీసు ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ మధ్యన, మహా నేరమేదో చేసిన వాడి వలె నడిచాను. ఇప్పటికీ గుర్తు ‘ఇప్పుడు బజారులో నేనెలా నడవాలి’ అని కాస్త ఆలోచించాను. బుర్రంతా క్లమ్జీగా, కలగాపులగంగా వుండింది.

ఏదో గిల్టీ ఫీలింగ్ కూడా వుండింది. జయ గురించి. ఈ గిల్టీ పీలింగ్ వెనుక నున్నది మగదురహంకారం కాదని ఎలా అనగలను? నిజానికి, ఆ తరువాత పరిణామాల్లో జయ నా కన్న చాల మెరుగ్గా వ్యవహరించింది. అత్యవసర సమయంలో సహచరుడు దగ్గర లేకుండా పోయాడని భయపడలేదు. మా పాపను నవమాసాలు మోసి, కని, పెంచింది. తన బియ్యే చదువును పూర్తి చేసుకుంది. రెండేళ్ల తరువాత నేను జైలు నుంచి తిరిగి వచ్చే సరికి పచ్చని సంసారం ఒకటి నా కోసం ఎదురు చూస్తోంది.

అప్పుడు, ఆ క్లమ్జీ వుదయం మండ్లెం బజారులో నడుస్తున్నప్పుడు… ఆ నిరామయంలోనే… నేను ఒక్క సారిగా పెద్ద వాడినయిపోయిన పీలింగ్. బాల్యమంతా ఒక్కసారిగా కరిగిపోయిన ఫీలింగ్. కొన్ని నిమిషాల ముందు వుండిన బేఫికరు తనం లేదు. నా మీద ఏదో చాల పెద్ద బాధ్యత వుందనే స్పృహ.

అంతకు ముందరి నేను, ఆ తరువాత నేను ఒకటి కాదు అనే స్పృహ.

చాల కాలం తరువాత అదే పెద్దరికపు స్పృహలో, కాకపోతే ఒక పెను నిరాశ నుంచి బయటకు కొత్త దారులు వెదుక్కుంటో రాసుకున్న గీతం…..

//పంజరం//

రేణువు రేణువులో వెదుక్కుంటున్నా
నేను పుట్టక ముందే పోగొట్టుకున్న
ఒక ఒయాసిస్సు కోసం

చౌరస్తాలో నిలబడి అడుక్కుంటున్నా
కార్లనూ బస్సులనూ
కంప్యూటర్లనూ వేడుకుంటున్నా
నా గీతం నాకిచ్చేయండని

నన్ను నేను తవ్వుకుంటున్నా
కలుషిత రక్తం జల్లెడ పట్టుకుంటున్నా
తడిసిందైనా తడవనిదైనా
ఒక్క అగ్గిపుల్ల కోసం

కాసింత జీవితమైనా
దొరక్కపోతుందా అని
వెయ్యి అబద్ధాల్లో ఒక్కటైనా
నిజం కాకపోతుందా అని
ఈ కాంక్రీట్ చెట్ల కింద
కన్నీళ్ల ముళ్ల మీద
నేనింకా తపసిస్తూనే వున్నా

క్షణాలు గడ్డ కట్టి గంటలవుతున్నాయి
గంటలు రాశులు పడి దశాబ్దులవుతున్నాయి
పెనం మీద కాలం మాడిపోయి
పెను నిర్దయగా మారిపోతోంది
అయినా అదేమిటో వెర్రి మోజు
ఈ దేశం గాలి మీద
గాలి వాలు మీద

అలస్యంలో తడిసి నిరీక్షణలో కాగి
చెవి గూబలు డప్పుల్లా బిగిశాయి కాబోలు
రాకుతున్న ఆకుల గలగలలే
రణ నినాదాల్లా ధ్వనిస్తున్నాయి
చివ్వున శిరసెత్తి చూస్తే ఏమున్నది?
కిటికీ రెక్క మీద
అనిర్దిష్ట చిత్రాల వాన తప్ప
రాను రాను తనలోకి తాను
ముడుచుకుపోతున్న
అతి హింసాత్మక నిశ్శబ్దం తప్ప
పంజరం లోపలే
రెక్కల టపటప చప్పుళ్లు తప్ప

ఎన్నికల పరీక్షనాళికలో
అంటుగట్టిన పాపాయి జన్మించనే లేదు
ఎందులకా పుత్రోత్సాహము తండ్రీ!
కురుక్షేత్ర సమరం ప్రారంభం కానే లేదు
ఎందులకీ విచికిత్స ఫల్గుణా!
రెండో ప్రపంచ యుద్ధం నాడు
ఆడిన జూదంలో ఓడిన వాళ్ల మనం
అనుజన్ములనూ అరుణకేతనాన్నీ
పందెంలో ఒడ్డిన వాళ్లం మనం
డెబ్బై ఏళ్ల తరువాతా
అజ్జ్ఞాతంగానే మిగిలిపోయిన వాళ్లం

ఇంకా బృహన్నల వేషాలేనా?
అర్ధరాత్రి కీచక వదలేనా?
ఆగమించే ఆహవానికి
పాశుపతాలు సంపాదించేదెప్పుడు?
చరిత్ర పునరుల్లేఖనానికై
పాళీల్లాంటి కత్తులు
కత్తుల్లాంటి పాళీలు
సానబెట్టేదెప్పుడు?

(‘అబద్ధం’ కవితా సంపుటి (1987-92) 1,2,3 పేజీలు)

(ఫిర్ మిలేంగే)

21-09-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s