మాతృ గర్భంలో నేర్చిన మరణ వ్యూహం

స్పృహ

మాతృ గర్భంలో
మరణ వ్యూహం రాసుకున్న వాడు
వీడు ఏమీ లేని వాడు
ఎప్పుడూ ఏదో వెదుక్కుంటూ నడుస్తుంటాడు
పేవ్ మెంటు మీంచీ పక్క సందు లోంచీ
పదాలు ఎగిరొచ్చి కాళ్ళకు చుట్టుకుంటాయి
అనాధ పదజాలానికి ఆశ్రయాల అడ్రసు చెప్పి
తన లోంచి పుట్టే మాట కోసం గింజుకుంటాడు

ప్రవేశ ద్వారం వద్ద
సైంధవుణ్ని కాపలా పెట్టింది వీడే
సైంధవుడికి ఆ వరం ఇచ్చింది వీడే
నిస్సహాయత కేవలం వీడి సమయ స్ఫూర్తి

ఉన్నట్టుండి సామాజిక స్పృహ కోల్పోయి
పబ్లిగ్గా రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకుంటాడు
దయలేనిది లోకం, పైగా మెహర్బానీ
తుప్పు పట్టిన తాళం చెవులు చేతిలో పెట్టి
ఆశ కల్పిస్తుంది, కసిగా బతికిస్తుంది
మెడలో రోగాల జాబితా కట్టి
తృప్తిగా బస్సెక్కి వెళ్లిపోతుంది

బాధ శాశ్వతం
శాశ్వతత్వం బాధ

ఉరి వుచ్చులో మెడ ఎముక విరిగినప్పుడు
ప్రాణం హాయిగా జారిపోతుందట; దైహిక
డ్రైనేజీ గొట్టంలో వేణు నాదం పలుకుతుందట
సిఫిలిజేషన్ అలల కింద పెను సెన్సేషన్
లోలోపలికి వెళ్లిపోవడమంటే
ఊపిరి ఖర్చు పెట్టుకోవడమే గనుక
తలుపులు మూసుకుంటూ లోనికి వెళ్లిపో
గలిగిన మొనగాడి కోసమే పద్మవ్యూహం

(7-1-1994)
(‘ఒక్కొక్క రాత్రి’, పేజీ 11)

 

స్మృతి 22

ఒక నిరామయ, మసక మసక వుదయం.
విశాఖను చాల దిగులుగా చూశాను, దూరమవుతున్న రైలు కిటికీ లోంచి.
ఒక్కడినే. అప్పటికి, నా క్లాస్ మేట్స్ ఎవరూ విశాఖపట్నంలో లేరు.
అందరూ ఎమ్మే రెండో ఏడాది పరీక్షలు రాసి ఇళ్ళకు వెళ్లి పోయారు. అక్కడున్న ఒకరిద్దరు ఐడియొలాజికల్ నేస్తాలు, మనసుకు చేరువ అయిన వాళ్లు కాదు. నెల రోజుల పాటు నేనొక్కడిని. ఒక్కడినే బీచిలో… మధ్యాహ్నాలు కూడా… తిరిగే వాడిని. ఇసుక తిన్నెలు ఎండలో మెరిసేవి. మేమూ నీలాగే ఒంటరి అని చెబుతున్నట్లుండేవి. అదనంగా నెల రోజులుండి ఎమ్మే మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రాసి రైలెక్కాను, చివరి సారి విశాఖ నుంచి. (రెండో సారి ఏ పి ఎస్ ఎస్ ఎస్ అనే సంస్ఠ ఉద్యోగిగా వెళ్లినప్పుడు వాళ్ళ బొలెరోలో వెళ్లొచ్చామనుకుంటాను. రైలెక్కిన గుర్తు లేదు).
తిరిగి జన్మనిచ్చిన అమ్మ ఒడికి చేరాను. మా వూరికి.
మా ఇంటి ముందు, వారపాకు కింద, నులక మంచం మీద పడుకుని, అప్పటి వరకు ఏం జరిగిందో నెమరేసుకోడానికి ప్రయత్నించే వాడిని. ఎండలో మెరిసిన విశాఖ ఇసుక తిన్నెల మాదిరి వెలిగేది శూన్యం. ‘హాలో ఇల్యూమినేషన్’. అప్పటివరకు ఏం జరిగిందో ఏమీ తెలిసేది కాదు. రిట్రోగ్రెసివ్ గా చూస్తే ఏమీ అర్థమయ్యేది కాదు.
ఏదీ అనుకుని చేయలేదు. బడికి అనుకుని పోలేదు. బడికి పోనని ఏడుస్తుంటే, పిల్లలు కాళ్ళు చేతులు పట్టుకుని ఆవు దూడను ఎత్తుకుపోయినట్టు ఎత్తుకు పోయే వారు. ఇక వదలరు, బడికి వెళ్ళక తప్పదు అనిపించే వరకు అదే మోత. అదే ఏడుపు. రామయ్య బడిలో పలక మీద ఇరవై ఎక్కాలు రాస్తే అరవై తప్పులు. అయ్య చెయ్యి తిప్పించి చేతి ముణుకుల మీద కొడితే చాల నొప్పయ్యేది. అయినా బడికి పోవడం అలవాటయిపోయింది.
ఆరో తరగతి కోసం కొండ మీది బొల్లవరంలో వదిలేస్తే, ‘నేనుండను అమ్మ కావాలి’ అని ఏడవ లేదు. కిక్కురుమనకుండ అక్కడ వుండి పోయాను. బడి వదిలేశాక రాత్రులు చదువుకున్న జ్ఞాపకం అస్సలు లేదు. పరీక్షలు పాస్ కావాలని వుండేది. (అప్పుడు అన్ని సంవత్సరాలూ ఏడాది చివర పరీక్షలుండేవి, పాస్, ఫెయిల్ కూడా వుండేవి). పాసయ్యే వాడిని. పాసవుతున్నాడు కదా, మాన్పించడం ఎందుకని, బడి కొనసాగించే వారు. చదువుకుంటే వుద్యోగాలొస్తాయని వాళ్ళ ఆశ. అసలు విషయం అదే. నాకు అలాంటి ఆలోచనలు కూడా వుండేవి కావు చాన్నాళ్ళ వరకు.
డిగ్రీ కాలంలో అనుకుంటా, ఒక చిన్న అనుమానం పీడించేది. చదువుకోకపోతే మా జయమ్మను నాకిచ్చి పెళ్లి చేయరు కదా అని. అది కూడా చోదక శక్తి కాలేదు. చోదక శక్తి ఏదీ లేదు. బహుశా, ఇంకొకరికి తల వంచనివ్వని అహంకారమేదో లోలోన వుండేదేమో. తల వంచాల్సి వస్తుందనే భయం వుండేది. భయాన్ని మాత్రం…. ‘ఏమో, వుండిందేమో’ అనలేను. భయం నాకు ఎంచక్కా తెలిసేది. అది నా నిత్య సహచరి. సందేహం లేదు. అహంకార, భయాలే నేను అనే బండికి చక్రాలు.
చాల ఎక్కువ సార్లు భయం అనే చక్రం అనవసరంగా ఎక్స్ పాండ్ అయ్యేది. బండి నడక పట్టు తప్పేది. బండి వాటు పడుతుందని అనిపించేది. సర్దుకునేది. నా ప్రమేయం లేకుండా, బండి దిశ మారిపోయేది. మరోసారి, అహంకారం అనే చక్రం ఎక్స్ పాండ్ అయ్యేది. ఫలితం సేమ్. నడక పట్టు తప్పేది. దిశ మారిపోయేది. ఎస్, సర్, నా ప్రమేయం లేదని అనను గాని, అది నిర్ణయాత్మక ప్రమేయం కాదు. అందుకే ‘జయా పజాల’ కారణాల్ని చాల సార్లు పరిసరాలకు, పరిసరాలలోని మనుషులకు ఆపాదిస్తుంటాను. పాపం వాళ్లూ నిమిత్త మాత్రులే. ఎవరు చెబుతారు ఎవరికైనా గెలుపు వీలు లేని పోరాటాలు చెయ్యమని? వాళ్ళకూ తెలీదు. వాటు పడే వరకు బండి నడుస్తుంది. ఈలోగా ఎంత దూరాన్ని తరించి వుంటే అంత ‘గెలుపు’ మనకు.
ఊళ్లో నులకమంచం మీద కూర్చుని మా వారపాకు లోంచి కిచకిచలాడే పిచికల అరుపులు వింటూ, ఇదిగో ఇక్కడే కదూ, ఈ బండల మీదే కదూ మా జేజిని చివరి సారి పడుకోబెట్టింది అని వంకరగా విచ్చుకునే నా పెదాల్ని నేనే…. లోకంటితో చూస్తూ… అలా ఎన్ని నెలలు గడిచిందో ఏమో. నెలలు కూడా కాదేమో గాని, మరోసారి నేను వుమ్మనీటిలో యీదుతున్న ఫీలింగ్ కలిగేది. ఆ ఫీలింగ్ ఇప్పటికీ మనస్సులో తాజాగా వుంది. మాతృ గర్భానికి బయట ఏముందో అని జిజ్ఞాసగా వుండేది. చాల భయమేసేది. తెగింపు కలిగేది. ఇంతా చేసి, నేను చదువుకున్న ఎమ్మే చదువుతో ఏం చేసుకోవాలో తెలీదు. దాని వల్ల నాకొక ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఏమాత్రం లేకుండేది.
అపనమ్మకం నా మరో తల్లి కామోసు.
అంతకు ముందు ఒకసారి నేనూ, చిన్నాన్న హైదరాబాదు వెళ్ళాం. హైదరాబాదులో వున్న ఒక్క రోజులో ఆటోలో ఎక్కువగా తిరిగాం. ఒక డ్రైవర్ను చూపిస్తూ, “ఎందుకు ఉద్యోగాలు అని ఇంత ఆరాటం? కాస్త ప్రయత్నిస్తే అలా ఆటో తోలడం నేర్చుకోవచ్చు. మనకు అవసరమైనంత మనం సంపాదించుకోవచ్చు కదా చిన్నాన్నా” అని అన్నాను. ఆ మాట అనేసి నేను మర్చిపోయాను గాని చిన్నాన్న మరిచిపోలేదు. ‘వీడికే బయం లేదురా, ఆటో తోలుకుని బతికొచ్చు కదా, ఇంత ఆరాటాలు ఎందుకని అన్నాడు’ అని గుర్తు చేసే వాడు. ఆయన అబ్జర్వేషన్ నిజమే. అలా బతకడానికి నాకు ఎప్పుడూ ఏ అభ్యంతరం లేదు. జీవితం పట్ల దానికి తగినంత నిర్లిప్తత వుంది నాలో. ఎస్ భయం, అపనమ్మకాల పక్కనే నిర్లిప్తత. లేక అది కేవలం ఒక పేదవాని తెగింపా? ఏమో గాని, మరీ నిరాశావహ స్టితిలో కూడా పలుమార్లు నన్ను సస్టెయిన్ చేసింది ఆ నిర్లిప్తతే, తెగింపే.
మా ఇంటి పెద్దరుగు మీది గోడకు అమర్చి, రెండు ఫోటోలు వుండేవి. ఇంకేమీ వుండేవి కావు. ఆ రెండు ఫోటోలే. ఒకటి పీయూసీలో హాల్ టికెట్ కోసం తీసుకున్నదో మరేదో, చిన్న ఫోటో, నాది. దాన్ని ఒక ఫ్రేమ్ లో పెట్టి గోడ మీద వుంచాం. ఆ ఫోటో గోడ మీద పెట్టాక, నేను కాలేజీకి వెళ్లి, తిరిగి శలవులకు వూరికి వెళ్లి చూస్తే, పుస్తకాల్లో వుండిన, నా అభిమాన నటి జమున ఫోటో ఆ ఫ్రేములో నా పక్కన చేరింది. ఇదేంటబ్బా అని ఆరా తీస్తే అది మా నాన్న చేసిన పని అట. పోనీ అదేదో కోపంతో చేసింది కూడా కాదు. ‘అట్టా బాగుంది అందుకని అది అక్కడ పెట్టాన’ని అంటాడు నాన్న. ఆయన మంచి తనానికి, అమాయకత్వానికి పరాకాష్టగా. నేను ఫ్రేము విప్పి జమున ఫోటో తీసేసి ఆ ఫ్రేమ్ అలాగే వుంచాను. నాన్న చేసిన పని వల్ల ఆ ఫోటో అంటే నాకు భలే ఇష్టం.
నాన్నకు అర్థమయ్యిందో లేదో గాని, జమున నా అభిమాన నటి కావడానికి ఆమె సౌందర్యమే కాకుండా, మరో కారణం వుంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో మేరకు మా జయమ్మ జమునలాగే వుంటుంది. అంతే కాదు, జమున ముఖాన్ని పట్టిచ్చే ఒక ఫీచర్… మీకూ తెలుసు… పంటి మీద పన్ను ఎక్కినట్టుండి, నవ్వినప్పుడు మెరవడం…. ఆ ఫీచర్ కూడా మా జయమ్మకు వుంది. అదీ సంగతి. ఆ సంగతి నాన్నకు తెలుసనీ, ఆయన నా మనస్సు తెలిసే గోడమీద ఫ్రేములో జమునను చేర్చాడని అనుకుంటాను. ఎప్పుడూ తనను అడగలేదు గాని ఆ తీపి భావన నాలో వుండిపోయింది. తీరా నేను జయమ్మనే అక్కడ చేర్చుకునే సమయానికి అంతా తలకిందులయ్యింది. మా పెళ్లి రోజు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అది వేరే సంగతి.
గోడ మీద రెండో ఫోటో మా ఎస్సెస్సెల్సీ బ్యాచ్ గ్రూప్ ఫోటో. నల్ల ప్యాంటులో గళ్ళ షర్టు టక్ చేసి పెదిమల మీద మీసాల నీడతో నాకు నేను ముద్దొచ్చే వాడిని. ఎమ్మే అయిపోయి ఇల్లు చేరాక ఆ ఫోటోను చూస్తుంటే, అదొక విల్లు అయినట్టు, నేను అందులోంచి వెలువడిన ఒక బాణం అయినట్టు వూహ. విల్లు నుంచి బాణం వదిలిన వారెవరో గాని, వదిలే ముందు బాణాన్ని సరిగ్గా గురి చూసినట్టు లేరు. గురి లేదు గాని, బాణంలో చాల కైనెటిక్ శక్తి వుంది. దాని లక్ష్యమేమిటో దానికి తెలీదు. వదిలాక గైడ్ చేసే మెకానిజం కూడా ఏమీ లేదు.
విశాఖ నుంచి మా సొంతూరు ‘గని’కి చేరిన తరువాత అనుభవించిన ఒంటరి తనం చాల లోతైనది. ఆ తరువాతేం చేయాలో చెప్పేవారు లేరు. నాకు నేను కనుక్కోవలసిందే. నేను వున్న స్థలం ఒక మారుమూల పల్లెటూరు. టెలిఫోన్ సౌకర్యం లాంటివేమీ లేవు. చిన్న పోస్టాఫీసు వుండేది. వార్తా పత్రికలు… పొద్దుటి పత్రిక బస్సులో సాయంత్రానికి వస్తే గొప్ప. అది కూడా ముందుగా చెప్పి, సాయంత్రం ఇంటి నుంచి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి, బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చుని, తెచ్చుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్నూలు వెళ్ళడం కుదరదు. ప్రత్రి సారీ ఛార్జీలకు డబ్బేదీ? పగటి వెలుగులో వుంటూనే ఒక చీకటి సొరంగంలో వున్న అనుభూతి. ఉద్యోగం దానికది నా కోసం వెదుక్కుంటూ రాదు కదా? పోనీ, ఒక సారి కర్నూలు వెళ్తాననుకో, అక్కడ నాకెవ్వరూ తెలీదు. తెలిసినా, ఏమని అడగడం? ఔను, ఏమి ఆడగాలో కూడా తెలీని తనం.
ఆ తరువాత తెలిసింది నా క్లాస్ మేట్స్ అందరూ తమ ఎమ్మే యోగ్యతతోనే లెక్చరర్ ఉద్యోగాల్లో చేరిపోయారు. ఆ రోజుల్లో తెలుగెమ్మే అనేది నేను అనుకున్నంత బీడు భూమి ఏమీ కాదు. దాన్నుంచి ఏం పండించుకోవచ్చో నాకు తెలీలేదంతే.
ఏ మహబూబ్ నగర్ జిల్లా మారుమూలనో తన చిన్న చెలకను ఏం చేసుకోవాలో తెలీని పేద రైతు వంటి వాడిని నేను. వలస వచ్చిన మనిషి దానిలో రసాయనికాలు అవీ వేసి లక్షలు సంపాదిస్తాడు. అది చూపి అవన్నీ అతడి తెలివి తేటలని, రైతుది తెలివి లేని తనమని అనే వారుంటారు. అలా అనే వారిని ఏమనగలం?
తన బీడు భూమి నుంచి బంగారం సంపాదించిన వలసదారున్ని చూసి రైతు కూడా బాధగా ఆశ్చర్యపోయి వుంటాడు. నా ఎమ్మేతో నేనూ అంతే. బతకడానికి, డబ్బు సంపాదించడానికి దాన్ని వాడుకోవచ్చని నాకు తెలీ లేదు. అందుకే వెళ్లి మార్కుల లిస్టులు, డిగ్రీ సర్టిఫికెట్ అవీ తెచ్చుకోవాలని అనిపించలేదు. అవి తెచ్చుకోకపోవడం తెగింపు, విప్లవ చేతన ఏమీ కాదు. తెలీదు.
అప్పుడు మాకు వుండిన చేలలో ఒక దాని పేరు కాశిపేట చేను. మా ఇంటి నుంచి నాలుగు కిలో మీటర్ల దూరం వుండొచ్చు. పొద్దునా, సాయంత్రం రెండు సార్లు ఆ చేనికి వెళ్లి వచ్చే వాడిని. ఆ చేనిలో ఏమైనా పంట వున్నదీ లేనిదీ నాకు అనవసరం. మా ఇంటి నుంచి చేను బాగా దూరం. నాలో నేను ఏవేవో కలలు కంటూ నడిచే వాడిని. అందులో సెక్సు కలలు కూడా వుండేవి. నేను చూడని ఏవేవో లోకాల్ని చూసినట్టుండేది. చాల బాగుండేది. ఆ అలవాటు నాకు ఇప్పటికీ వుంది గాని, అప్పుడు మాత్రం కలలే మానసిక ఆహారం. (నా కలల అలవాటు మీద రాసిన కథ ‘దయ్యం’ తెలుగు ఇండియా టు డే లో అచ్చయ్యింది. కలలుగనే వేళ కాదు సోదరా అనే నా పాటను మా అంబిక (అరుణోదయ) అద్భుతంగా పాడుతుంది. 🙂 )
అలా నడక కలలు, నులక మంచం కలలు కాకుండా, మిగిలిన సమయాల్లో… శివారెడ్డి చిన్నాన్న ఇంటి ముందు అరుగు మీద కూర్చుని అక్కడికి వచ్చే వాళ్ళ మాటలు వినే వాడిని. అలా పరిచయమైన వారే నా అప్త మిత్రులు రామకృష్ణా రెడ్డి, బోయ రాముడు, కిట్టన్న, చాకలి తిరుపాలు, , సామన్న, నాగన్న మరి కొందరు పేద యువకులు. వాళ్లు డబ్బుకు మాత్రమే పేదవాళ్లు. ఆత్మగౌరవానికి, జనం మీద ప్రేమకు అత్యున్నత మనస్కులు. మేము కలిసి కొన్ని పాటలు నేర్చుకోడం మొదలెట్టాం.
చాల త్వరలోనే మమ్మల్ని మేము ‘రైతు కూలీ సంఘం’ అని పిల్చుకోడం మొదలెట్టాం.
ఇంటికి మా కళ్ళం చాల దగ్గర. చాల ఎక్కువగా మేము మా కళ్ళంలోనే కలిసే వాళ్ళం. ఇవి అవి అని కాదు, విప్లవ గీతాలేవైనా సరే పాడుకునే వాళ్ళం. వాళ్ళందరిలో నేనే పెద్దవాడిని. అప్పటికి నాకు ఇరవయ్ మూడేళ్ళు. డబ్బుతో ఆడుకోబోయి, చేతులే కాదు జీవితమే కాల్చుకుని శాశ్వత అజ్ఞాత వాసంలో, ప్రస్తుతం తానెక్కడున్నాడో తనకే తెలీని మితృడు మద్దులేటి, నేనూ ఇద్దరం మా వూరి నుంచి మొదటి గ్రాడ్యుయేట్స్ మి. ఆ పైన పోస్ట్ గ్రాడ్యుయేట్… మా వూరి నుంచి నేను ఒక్కడినే. దానికి తోడు చాల ఎక్కువ మార్కులతో ఎస్సెస్సెల్సీ పాసయిన ‘మేధావి’ని కదా! అందుకని ఆ యువకులు నాతో కలిసి ఆడి పాడడానికి వారి తలిదండ్రులు అభ్యంతరం చెప్పేవారు కాదు.
మా అభిప్రాయాలకు వూళ్లో వ్యతిరేకత కూడా మొదట్లో లేదు. రెండు మూడు నెలల తరువాత కాస్త వ్యతిరేకత మొదలయ్యింది. ఆ వ్యతిరేకత రాజకీయమైనది కాదు. ఆర్థికమైనదీ కాదు. ఎట్టాగూ మేము ఎన్నికలు వద్దంటున్నాం. మేము ఎన్నికల్లో పాల్గొనం. సో, ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి మమ్మల్ని కోప్పడాల్సిన అవసరం లేదు. ఇక మా వూళ్లో కూలి రేట్ల వంటి ఏ ఆర్థిక పోరాటం మేము తీసుకోలేదు. మా పని అంత దూరం రాలేదు. రైతులు మమ్మల్ని ఆ రూపంలో సీరియస్ గా తీసుకోలేదు.
చాల ప్రారంభం నుంచి కొన్ని విషయాల్లో మా అభిప్రాయాలు అందరికీ తెలిసేలా ప్రవర్తించాం. కులం, మతం హంబక్, వాటిని పాటించగూడదు అనేది అందులో ఒకటి. అప్పుడే మేము బజార్లలో జల్ల (పొడుగు గంప) మీద పెట్రొమాక్స్ లైటు పెట్టి, ఉపన్యాసాలిచ్చి పాటలు పాడే ప్రచార కార్యక్రమం మొదలెట్టాం. అందులో కుల మతాలు వద్దనే మాట కొంచెం గట్టిగానే చెప్పేవాళ్ళం.
అప్పుడు మా వూరి మాదిగ పేట వూరికి దిగువన కిలోమీటరు దూరంలో వుండేది. (ఇప్పుడూ వేరుగానే వుంది గాని, ఎగువన, వూరికి బాగా ఆనుకుని వుంది). మేము మాదిగ పేటలో ప్రోగ్రాం పెట్టి, పాటలు అవీ పాడి ఆ ఇళ్ళలో అడిగి నీళ్లు తాగి వచ్చేవాళ్ళం. దప్పిక వేయక పోయినా సరే వాళ్లను అడిగి నీళ్లు ఇప్పించుకుని తాగి వచ్చే వాళ్ళం.
మా మిగతా విప్లవ భావాలన్నిటి కన్న కుల మతాల వ్యతిరేకత వూళ్లో చర్చనీయాంశమయింది. ఊరంతా ఆ సంగతులే మాట్లాడుకునే వారు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనతో.. మా కుల, మత వ్యతిరేకత ఎలాంటి రిపిల్స్ సృష్టిస్తున్నదో అర్థమయ్యింది.
ఊరి మధ్యలో రంగస్వామి దేవాలయం అని ఒక దేవాలయం వుంది. మా రామయ్య సారు అక్కడే మాకు వీధి బడి నడిపే వారు. దసరా పండుగ నాడు ఆ దేవాలయం నుంచి రంగస్వామి విగ్రహాల్ని పెద్ద కర్ర పల్లకీలలో వుంచుకుని వూరంతా వూరేగించి, ప్రతి ఇంటి వద్ద పూజలు అందుకునే వారు. రాత్రులు మసక మసక చీకటిలో లాంపులు, పెట్రొమాక్స్ లైట్ల వెలుగులో ఆ వూరేగింపు దృశ్యం భలేవుండేది.
రైతు కూలీ సంఘం మొదలై, మేము రాత్రులు బజార్లలో విప్లవ గీతాలు పాడడం మొదలెట్టాక. మమ్మల్ని ఆపడానికి ఎవరికో బ్రహ్మాండమయిన సాంస్కృతిక యుక్తి తట్టింది. వాళ్ళకు ఎప్పుడూ ఇలాంటి యుక్తులే తడుతుంటాయి. గట్టిగా ఎదిరించకపోతే ఆ యుక్తులు పని చేస్తాయి కూడా. మా వూరి దివ్య మానవులెవరో గాని వారికి తట్టిన యుక్తిని మా మీద ప్రయోగించారు. రాత్రికి రాత్రి రంగస్వామి దేవాలయంలో పల్లకీలు తీసుకెళ్లి దగ్గర్లో వున్న ఉప్పునీటి బావిలో పడేశారు.
పొద్దున వూరంతా గగ్గోలు. మేము… దేవుడు లేని వాళ్లం… ఆ పని చేశామని.
ఎందుకో ఆ సంఘటన మాకు బాధ కలిగించ లేదు. దేవుడి పేరిట బతక జూసే వారు ఇలాంటి పనులు కూడా చేస్తారు చూశారా అని వూళ్ళో మా ప్రచారం మేము చేశాం. ఊరిలో జనం మమ్మల్ని ఏ మాత్రం అపార్థం చేసుకోలేదు. అంతే కాదు. విరివింటి వేంకట రమణ మూర్తి అనే పురోహిత బ్రాహ్మణుడు సరిగ్గా ఆ సమయంలోనే తన అవసరాల రీత్యా ఇంకో వూరు చేరారు. బ్రాహ్మణుడు వూరు విడువడానికి మేము కారణమనే ప్రచారం కూడా జరిగింది. దాన్ని కూడా వూరు పట్టించుకోలేదు.
ఇన్నేళ్ళ తరువాత, ఫేస్ బుక్ వంటి అత్యాధునిక స్టలంలో కూడా నేనూ నా మిత్రులం అదే పోరాటం చేస్తున్నామా? ఒక మతంతో కాకుండా రెండు మూడు మతాలతో?
ఓర్నాయినా? తప్పదు. మా రాముడు, రామకృష్ణా రెడ్డి చివరి వరకు దాని కొరకు నిలబడ్డారు. నేను పార్టీ పనుల వల్ల వాళ్ళకు దూరమయినా, దాని వల్ల తాము ఏవేవో ఇబ్బందుల పాలయినా, తమ కోసం తాము నిలబడ్డానికి వాళ్ళు ప్రయత్నించారు. చాల నష్టపోయారు. నా మిత్రుల పేరిట కూడా నా స్ట్రగుల్ నేను కొనసాగించక తప్పదు.
(వచ్చేవారం మళ్లీ కలుద్దాం, మా వూళ్ళోనే)
27-7-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s