సున్నితం సంస్కారం?

“”స్కైబాబ రాసిన వ్యాసం ముస్లిం సమాజంలో కొందరికి ఉత్సాహాన్ని, కొందరికి ఆశ్చర్యాన్నికలిగించడం తో పాటు కొందరికి కోపాన్ని కూడా కలిగించినట్లు ఈ వ్యాసం స్పందన చూస్తే తెలుస్తుంది. అలాగే ఎక్కువమంది ముస్లిమేతరులు ఈ చర్చను ఆహ్వానించడం కూడా గమనించాల్సిన విషయం(రాణి శివశంకర్ మినహాయింపు).”

ఇవి ఖాజా మొదటి పోస్టులో రాసిన మాటలు. తను చాల చక్కగా ఆలోచించి, రాణి కి మినహాయింపు ఇచ్చేంత విజ్ఞతతో ఆలోచించి రాసిన మాట ఇది.

ముస్లిమేతరులలో కొందరికి కలిగిన ఉత్సాహాదులు చూశాకే ఖాజా ఈ పోస్టు రాశారు. సో, ఆయన మాట్లాడింది…. శర్మ మినహా… ముస్లిమేతరులతోనే.

“ఏ మత సమూహం అయినా, పర మతాల్లో తమకు సంబంధంకాని అంశాలను సున్నితంగా చూడటం సంస్కారం.” అని ఖాజా ఏది సంస్కారమో ఏది కాదో బోధించే పని పెట్టుకున్నది కూడా ఆ పోస్టులోనే. ఆ ‘సంస్కారానికి’ అభ్యంతరం చెబుతూ నేను రాసిందానికి జవాబు రాస్తున్నానంటూ… నా వ్యాసాన్ని ఇప్పుడే చదివానని… అంటున్నారు ఖాజా. కామోసు. ‘ఇప్పుడే’ చదివారు కామోసు. నాది సంస్కారం కాదనడం అన్యాయమనే నా అభియోగానికి మాత్రం ఖాజా నుంచి ఎలాంటి సమాధానం లేదు. సమాధానం చాల డిటేయిల్ద్ గా తరువాత రాస్తారు కాబోలు.

“ఈ దేశంలో బలమైన మతస్థులు వారి మతం బయటికొచ్చి ఏమైనా మాట్లాడొచ్చు.. “ అంటారు ఖాజా. అంటే… సో కాల్డ్ బలమైన మతంలో పుట్టి పెరిగిన వాళ్ళు…. దాని నుంచి బయటికి వచ్చి మాట్లాడినా ఏమీ కాదా… వాళ్ళకు ఏం కష్టాలు రావా? ఖాజా అలాగే అంటున్నారు. మరి గతంలో… బాగా ఇటీవల కూడా… సో కాల్డ్ బలమైన మతంలో పుట్టి పెరిగిన వారు బయటికి వచ్చి మాట్లాడినందుకు ప్రాణాలు ఇచ్చారే, ఇస్తున్నారే. మరి ‘మాట్లాడొచ్చు’ అని ఖాజా అంత తేలిగ్గా అనేశారేమిటి? వాళ్లిచ్చింది వాళ్ళ సొంత ప్రాణాలే కదా, అదేం గొప్ప, మేమైతేనా ఇతర్ల ప్రాణాలు… ముఖ్యంగా మాలోని పేదల ప్రాణాలు…. ఇచ్చేస్తాం అంటారా? ఈ మాట పరుషంగా వుండొచ్చు గాని, జరిగింది అదే. ఎక్కడో జన్నత్ వుందనుకుని ప్రాణాలిచ్చిన వారే గాని, ఇస్లాం మత మౌఢ్యాన్నెదిరించి ప్రాణాలిచ్చిన ఆ మతం వ్బాళ్ళు నాకు ఇంత వరకు తెలీదు.

ప్రగతి శీలుడైన వ్యక్తి ఒక సమూహంలో వుండడం వేరు, ఒక మతంలో వుండడం వేరు. మతం, సమూహం ఒకటి కావు. సమూహాన్ని ఒంటరిగా వదిలేయాలని ఎవ్వరూ అనరు. నిజానికి, ఇస్లామే కాదు, ఏ మతస్టులూ ఆ మతాలలోని పేదల కోసం చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడు కాస్త బిచ్చం వేసి పుణ్యం కొనుక్కోడం తప్ప.

పేదలకు ఏమైనా జరిగితే మతాలు వద్దనే వర్గపోరాట వాదుల వల్లనే జరిగింది.

సమూహం, మతం అనే విషయమై …. ఇస్లాం, ముస్లిం పదాల మధ్య తేడా వివరిస్తూ…. గతం నుంచీ వున్న ఒక మంచి అగాహనను… మిత్రుడు గడియారం శ్రీవత్స నా పోస్టుకు స్పందనల్లో గుర్తు చేశారు. ఒక సారి చూడండి, ఖాజా సాబ్! ముస్లిం అనేది సాంస్కృతిక విషయం. మీరు ముస్లిం కావడం ద్వారా ముస్లిం సమూహంతో వుంటారు. వారికి మీ అండదండలుంటాయి, వైస్ వెర్సా. అందు కోసం మీరు ఇస్లాం మత మౌఢ్యాన్ని సమర్థించనవసరం లేదు. సమర్థిస్తున్నారంటే, అది మీ అవసరాల కోసం మీరు చేసుకున్న నిర్ణయం. ఎవరో పేదల కోసం అలా వున్నానని అనొద్దు. అది అబద్ధం. అలా అనడం పేదలను మీ అవసరాలకు డాలుగా వుపయోగించుకోడం అవుతుంది.

ఏం నేను హిందువును కానా? హిందువునే. ఐలయ్య పుస్తకం శీర్షిక కేవలం వ్యంగ్యం. ఆయనా హిందువే. హిందూ అనేది ఒక సంస్కృతి. హిందూ అంటూ ఒక మతం లేదు. ఉన్నది బ్రాహ్మణ మతం మాత్రమే. దాని విస్త్రుత రూపం వర్ణాశ్రమం. మీరు చాల వుదారంగా మినహాయింపు ఇచ్చిన రాణి శర్మ ఆ బ్రాహ్మణ మతావలంబి. బ్రాహ్మణ మత పునరుద్ధరణ కోసమే. అందుకోసం మాత్రమే… ఆయన హిందూ అనే ఆధునిక పరిణామం మీద దాడి చేస్తున్నారు. హిందూ ఫాసిస్టుల అసలు ద్యేయమైన వర్ణాశ్రమ ధర్మం మీద కాదు.

హిందూ అని ఒక మతం వున్నట్టయితే ఐలయ్య, నేను హిందూ మతస్తులం కాము. బ్రాహ్మణులుగా పుట్టలేదు కాబట్టి బ్రాహ్మణ మతస్టులం ఎలాగూ కాము. మేము మను ధర్మాన్ని వ్యతిరేకించే హిందువులం. వర్ణాశ్రమ ధర్మాన్ని వ్యతిరేకించే హిందువులం. మీరు కావాలంటే, ఇస్లాం మౌఢ్యాన్ని వ్యతిరేకించే ముస్లిం కావొచ్చు. మీ ఇష్టం. అలా వద్దనుకుంటే, అది కూడా మీ ఇష్టం. మిమ్మల్ని విమర్శించే మా హక్కును… సంస్కారం పేరిట… మీరు లాక్కో లేరు.

మతం ఒక కుటుంబం కాదు. అది ఒక కుటుంబమైనా సరే. నా పెళ్ళాం, నా పిల్లలు నేనేమైనా చేసుకుంటానంటే కుదరదు. మీ హక్కును త్రొసి రాజని, మీ పెళ్ళాం బిడ్డల గురించి మాట్లాడే సంస్కారం ఒక సామాజికుకుడిగా నాకు సహజం. దాన్ని సంస్కారం కాదనడం… ‘నా పెళ్ళాం నా ఇష్టం’ అనడం వంటిదే.

ఏం? ముస్లిములలో పుట్టి పెరిగిన ప్రగతి శీలురకు… సామాజికంగా… ఎందుకు మినహాయింపు వుండాలి?

ఇస్లాం మీద వాళ్ళకు విమర్శ లేకపోవడానికి కారణమేమిటి అని నేను తప్పక అడగవచ్చు. వాళ్లు ఇస్లాం ను తద్వారా షరియాను సమర్థించడం వాళ్ళ మగ దురహంకారానికి సమర్థనే. మిగిలిందంతా హంబక్. ఇంస్లాంలోకూడా హిందూయిజం లాగే మూడత్వాలున్నాయి. సమర్థనలు, పేట్రనైజేషన్లు హంబక్.

మూడత్వం అంటే దయ్యాల్ని నమ్మడం మాత్రమే కాదు. హేత్వతీత విశ్వాసమే మూఢత్వం. హేతువును, హేతు విరుద్ధాన్ని… రెండింటినీ గౌరవిస్తామనే వారు దేన్నీ గౌరవించడం లేదని అర్థం. అజ్ఞానాన్ని జ్ఞానాన్ని… రెండిటినీ గౌరవిస్తామనే వారు దేన్నీ గౌరవించడం లేదని అర్థం.

ఇస్లాం, హిందూమతం సహా ఏ మతానికయినా హేత్వతీత విశ్వాసమే పునాది. అయోధ్యలో రాముడు పుట్టాడు, అదీ బాబ్రీ మసీదు ఎక్కడ వుండిందో అక్కడే పుట్టాడు అనే వాదానికి… అంతటి వూచకోతకు… పునాది హేత్వతీత విశ్వాసమే. ఇస్లాం వరకు హేత్వతీత విశ్వాసానికి మినహాయింపు ఇస్తామంటే కుదరదు. అప్పుడు బాబ్రీ స్టలమే రామ జన్మ భూమి అనే హేత్వతీత విశ్వాసానికి మినాహాయింపు ఎందుకు ఇవ్వరో చెబుతారా? దానికీ మినహాయింపు ఇచ్ఛాక ఇక అది ఆగదు.. చాల వున్నాయి స్థలాలు. పరివార్ రెడీ గా వుంది లిస్టుతో. ఆ జాబితా రాసిన కాగితమే హేత్వతీత విశ్వాసం.

చిట్ట చివర ఒక మాట.

ఈ చర్చ స్కై పోస్టుతో, దానికి నా సమర్థనతో మొదలు కాలేదు. చాల కాలం క్రితం అవిశ్వాసులు, అజ్ఞేయవాదులు నేటి హేతు విరుద్ధ ఆస్తిక ప్రపంచంలో ఎలా మైనారిటీయో, మైనారిటీ కావడం వల్ల అజ్ఞేయవాదులు పడే కష్టాలేమిటో చెబుతూ నేను రాసిన పోస్టును, ఇక ఇటీవల ‘మతమా మనిషిని వదలవా’ అని రాసిన పోస్టును… దానికి స్పందనగా మొదటి సారి.. స్కై వంటి ఒక ముస్లిం మిత్రుడి నుంచి వచ్చిన సానుకూల స్పందనను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ను. ఈ చర్చకు కూడా చిన్న క్రమం వుంది.

ముస్లిములు, హిందువులు అని కాకుండా… ఇటీవల కొత్తగా మన యువ శ్రేణుల నుంచి…. ఒక కొత్త అబ్స్కురాంటిస్టు ధోరణి పెరుగుతోంది. ‘ఫైర్ ఫ్లైస్’ వంటి ఆమాయిక రూపాలో మొదలైన ఈ వైఖరి, ‘జీవుని వేదన’ యొక్క కొత్త పూజారుల మీదుగా… తోటంతా విస్తరించి తీగలు చాస్తున్నది. శిష్ట వర్గానికి ఇష్టమైన ‘స్టేటస్కోయిజా’నికి కొత్తగా వూపిరులూదుతున్నది.

మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక మతంలో, ఏదో ఒక కులంలో పుట్టి పెరిగిన వాళ్ళమే. సమర్థించుకో దల్చుకుంటే ప్రతి ఒక్కరం మన పుటక మతాల్ని, కులాల్ని సమర్థించుకుంటూ బతకొచ్చు. సుఖం. ఈ సుఖం తమకు మాత్రమే వుంటుందని కొందరు మిత్రులు భావిస్తున్నారు. ఇది మొదట ఆ మిత్రుల చాప కిందికే నీరు తెస్తుంది. వాళ్ళకు అంటే, వ్యక్తిగతంగా వాళ్ళకు కాదు. ఆ సమూహాలకు, వారి మాస్ బేస్ అయిన అవకాశ-రహితులకు, పేదలకు.

తమ చాప కింద నీరు చేరాక, తమ ఇళ్ళకు కూడా వచ్చిన ఫాసిజాన్ని ఎలా కాదనాలో తెలీని దుస్టితి ఎదురవుతుంది. ఇక మీ ఇష్టం.

22-7-2016

 
 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s