సాయంత్రపు మిత్రుడికి అర్ధరాత్రి ఒక నిర్నిద్ర లేఖ

సాయంత్రం భలే వుండింది. మిత్రుడు అప్పల్నాయుడు కుమార్తె వరీనియా కు, వాళ్ళాయన భాను ప్రకాశ్ కు చాల చాల థాంక్స్.

(వరీనియా స్పార్టకస్ నవలలో స్పార్టకస్ భార్య పేరు. నవల చదివాను గాని నాకు గుర్తు లేకుండె 🙂 )

అంత ఆనందకర సమయంలో ఒక అపశృతి దొర్లింది. ఒకానొక సమయంలో నేను ఉద్రేకపడిపోయాను. అప్పుడు నా నుంచి దొర్లిన ‘బే’ అనే ఒక పరుష వాక్కుకు అప్పుడే ఒకటికి రెండు సార్లు సారీ చెప్పుకున్నాను. జరిగిందేమిటో ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను. పంచుకోడం అక్కడి వివాదంలో భాగమేనని మీకు తొందర్లోనే తెలుస్తుంది.

రంగనాయకమ్మ విప్లవానికి ద్రోహం చేసిందని, కొడవంటి కుటుంబరావు చాల గొప్పవాడని నారాయణ స్వామి వెంకటయోగి ఉవాచించారు. ఒకరిద్దరు ఆయనకు వంత పాడారు. ఇది నాకు కష్టం కలిగించింది. రంగనాయకమ్మ కాదు విరసంనే విప్లవ ద్రోహి అనాల్సి వుంటుందని నేను అన్నాను. తన రెండు స్టేట్మెంట్లను వాళ్ళ రచనలు ఆధారంగా నిరూపించాలని నేను స్వామిని ఆడిగాను.

నారాయణ స్వామి ఏదో కోట్ లాంటిది మాట్లాడాడు. అది ఏమాత్రం ఆధారం లేనిదని నాకు అనిపించింది. అది ఆమె పుస్తకాల్లో ఎక్కడుందో ఇప్పుడు నువ్వు చూపించలేవు కాబట్టి, పుస్తకం చూసి, రేపు ఫేస్ బుక్ లో ఆ కోట్ ఇవ్వు అని నారాయణ స్వామిని అడిగాను. ఇప్పటికైనా ఆయన నా కోరిక మన్నించాలి. చదువుకున్న, రాస్తున్న వాళ్ళ మధ్య నిరాధార ఆరోపణలతో పోసికోలు కబుర్లు ఇండియాలోనైనా, అమెరికాలోనైనా హానికరం.

‘కుటుంబరావు దయ్యాలున్నాయని ప్రచారం చేశాడు, అలాంటి వాడిని తన నాయకుడిగా వుంచుకోడం ద్వారా విప్లవానికి ద్రోహం చేసింది విరసమే, నువ్వన్నట్లు రంగనాయకమ్మ కాదు’ అని నేను అన్నాను. కొకు దయ్యాల గురించి మాట్లాడింది ఏదో చివరి రోజులలోనే అని నారాయణ స్వామి అన్నాడు. కాదు, దయ్యాలున్నాయనే మాట, ఆయన తన జీవితంలో బాగా ముందు నుంచే అన్నాడని నేను స్పష్టం చేశాను. ‘నన్ను నా మాటలకు పుస్తకంలో ఆధారం చూపించమన్నావుగా, మరి, దీనికి నువ్వు చూపించు’ అన్నాడు స్వామి.

ఇదిగో చూపిస్తున్నా. దీన్ని ఆయన గాని ఆయన వంటి మరెవరైనా గాని తప్పు పట్టవచ్చు, ఇందులో తప్పు వుంటే.

నా దగ్గర కొకు పుస్తకాల్లేవు కాబట్టి, రంగనాయమ్మ పుస్తకాలున్నాయి కాబట్టి, ఆమె పుస్తకంలో కొకు నుంచి వున్న కోట్స్ నే ఇస్తున్నాను. ఈ పోస్టును ఇండియాలో అమెరికాలో మన వాళ్ళందరూ చూసే అవకాశముంది. అక్కడ ఆ రిలవెంట్ పుస్తకాలు తమ దగ్గరున్న మిత్రులూ వుంటారు. రంగనాయకమ్మ తప్పుగా కోట్ చేసి వుంటే ఆ సంగతి నిరూపించినా, నారాయణ స్వామి వాదం సరైందని భావించవచ్చు.

ఈ కింద నేను కాపీ చేస్తున్న లైన్లు అన్నీ ‘అభ్యుదయ ప్రేమలు!’ అనే రంగనాయకమ్మ పుస్తకం (పేజీలు 51, 52) నుంచి.

” ఆయన (కొకు) 1980 లో మరణించారని మీరు (వరూధిని) చెప్పారు. ఆ 1980 లోనే మంత్రాల్ని నమ్ముతూ రాసినవీ, ఇంకా ఆ రకాలవీ వున్నాయి. …………………….. ఆయన అభిప్రాయాలు ఎప్పుడూ అతీత శక్తుల మీదే వుంటే, చిన్నప్పుడూ, పెద్దప్పుడూ – అనే తేడాలు వుండవు…..

వరూధిని గారూ! ఈ (కొకు) కొటేషన్లు చూడండి!

“దెయ్యాలు లేవని భావించడం ఈ కాలపు మూఢ నమ్మకాలలో ఒకటి” (‘తాత్విక వ్యాసాలు’ పుస్తకంలో పేజీ 3, ఇది రాసింది 1934లో)
………………………………………………..

* “ఆధ్యాత్మిక పరిశోధకులు, ఆత్మ జీవులున్నారని, వారి మనస్సులు తమ ప్రభావాన్ని బతికి వున్న వారి మనస్సులపై ఏదో విధంగా వేయగలవనీ నిర్ధారణ చేశారు” (పేజీ 32, ఇది రాసింది 1958 నాటి వ్యాసంలో)

*” ఒక ప్రకాశవంతమైన చెయ్యి గది పైభాగం నుంచి దిగి వచ్చి, పెన్సిలు తీసుకుని కాయితం మీద గబ గబ రాసి, పెన్సిలు అవతల పడేసి, పైకి వెళ్లిపోతూ అంతర్థానమయింది” (పేజీ 45. రాసింది 1958లో. తను చదివిన పుస్తకాల్లోంచి ఇలాంటివి వాటిని తీసి, వాటిని అతీత శక్తులకు రుజువులుగా, ఆత్మలు దెయ్యాలూ భూమి మీద వాళ్ళకి సహాయాలు చేస్తాయని చెపుతున్నాడు) “

ఈ మాత్రం చాలు. వీటిని రంగనాయకమ్మ కొకు నోటిలో కుక్కడం లేదు. ఆమె ఈ కొకు మాటలని అయన పుస్తకం లోంచే తీసి ఇచ్చారు.

(కొకు యొక్క దయ్యాల నమ్మకాలు ఏవో చిన్నతనం నాటివని, పెద్దవాడుగా ఆయనకలాంటివేం లేవని వరూధిని రంగనాయకమ్మను కోప్పడితే, అవి ఏదో వయసు ముదిరాక సంక్రమించినవే, అంతకు ముందు లేవని నన్ను నారాయణ స్వామి ఖోప్పడ్డాడు. చిన్నపుడు, పెద్దప్పుడు… రెండు సార్లూ కొకు ఆ మాటలు మాట్లాడి, తనకు విరసం నుంచి ఏ ‘డిఫెన్సు’ లేకుండా జాగర్త పడ్డాడు.

ఏదేమమయిన నారాయణ స్వామి వెంకటయోగి! ఇప్పుడు బంతి నీ కోర్టులో వుంది. 🙂 )

5.47 ఎ ఎం, 09-06-2016

comments: 

Padma Priya Karumanchi: రంగనాయకమ్మ గారు విప్లవానికి చేసిందేవిటో నాకు తెలియదు కానీ , నాలాంటి ఎంతోమంది స్త్రీలకు అసలు ఆలోచించటానికి ఒక మెదడుందని,.దానికి తర్కించే శక్తీ ఉందని ,ఏ రకమైన ఆదిపత్యాన్నైనా ధిక్కరించగలిగిన తిరుగుబాటు శక్తిగా మార్చింది మాత్రం ఖచ్చితంగా ఆమె రచనలే ..విమర్శించటానికి ఏముంది లెండి , మహిళ కదా మరి అంత ధైర్యంగా నమ్మకాలని, నాటకాలని చీల్చి చండాడేస్తుంటే,రాసేస్తుంటే ఈ మర్యాదస్తపు లోకం చూస్తూ ఊరుకుంటుందా , ధిక్కారానికి కూడా నయగారంగా మర్యాద సొబగులు అద్దాలని కోరుకునే జనం కదా ….విప్లవానికి ద్రోహం చేసింది అనటం ఒక కుట్ర ..దానివెనుక అసలు కధ వేరే ఉండి ఉంటుంది .

My reply:  Padma Praiya Karumanchi, కుట్ర అనే పెద్ద మాట ఇక్కడ నప్పదేమో గాని, కొందరి రాజకీయ అవకాశ వాదానికి , నిత్య జీవితంలో పాత భావాలను వదులుకోలేని మరి కొందరి మానసిక హీనత్వానికీ సైద్ధాంతిక జస్టిఫికేషన్లు మాత్రం ఇందులో వున్నాయి. మీరన్నది నిజమే. కుటుంబ సంబంధాల విషయంలో, పలు సాంఘిక అంశాలలోనూ మన ఆలోచనల్ని విప్లవీకరించిన రచయిత్రి, ఆలోచనపరు రాలు ఆమె, ఒక రాజీ పడని మార్క్సిస్టు. ఆమె గురించి ఇటీవలి చెత్త ప్రచారాలు, అవాక్కులు… కొన్ని వెనుక బడిన ఆత్మల పనికి రాని పలవరింతలే.

Aranya Krishna: మీతో రంగనాయకమ్మగారి విషయంలో విభేదించే వారందరికీ మీ ఈ శాపనార్ధాలు వర్తిస్తా.న్న మాట. ఒక భిన్నాభిప్రాయం పట్ల మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవటం ఆశ్చర్యంగా వుంది.

vriddhula Kalyana Rama Rao: సుప్రీం కోర్టు judge late కృష్ణ అయ్యర్ గారికి ‘ఆత్మ’ ల మీద నమ్మకం ఉంది. ఆయన గొప్ప మార్క్సిస్ట్. భౌతిక వాది. అదీ materialism లో భాగమే అంటాడు ఆయన. ఆయన వ్యాసాలు నా దగ్గర ఉన్నాయి. దెయ్యాలు గురించి మాట్లాడడు.

నాకు దేవుఁడు ఉన్నాడని నమ్మకం లేదు. దేవాలయాలకు మాత్రం వెళతాను. దెయ్యం ఉందని నమ్మకం లేదు. చచ్చేటంత భయం మాత్రం ఉంది. నేను చెప్పినవి రెండూ నిజంగా నిజాలే.
నేను మార్క్సిస్ట్ నే. నాకొకడి certificate అక్కరలేదు ఈ విషయం లో.

ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ అన్ని విషయాలలోను పూర్తిగా ఏకీభవించరు. మనుషులు ఎంతమంది ఉంటే అన్ని మతాలు ఉంటాయి. మన మతం ఆంటే మన ‘world view’ అని అర్ధం(Scott Peck : “Road less travelled”) .

ఏ ఇద్దరూ ఒక విషయం మీద ఒప్పుకోవడం ఆలావుంచండి. మనలోనే ఒక విషయం మీద అన్ని సార్లు ఏకీభావం ఉండదు. We consist of multiple selves, not a single self. Hence we are not totally consistent, we are somewhat consistent( Rogers, Cattle, Maslow).

రావిశాస్త్రి గారు ఒక దగ్గర చెప్తారు: ఒక మనిషిని assess చేసినప్పుడు ప్రతీ విషయం అక్కరలేదు. ధర్మాధర్మాల మధ్య బ్రాడ్ గా ఎటు పక్క ఉన్నాడో చూస్తే సరిపోతుంది. అలాగే మనం కూడా మార్క్సిస్టు లు అందరినీ బ్రాడ్ గా ఒక category గా చూడాలి. లేకపోతె వివాదాలుని capitalists ఉపయోగించుకుంటారు.

Bhargava Gadiyaram: రంగనాయకమ్మ, కొకు ఇద్దరూ తమ పరిధుల్లో విప్లవానికి దోహదం చేసినవారే. సైధ్ధాంతికంగా ఇద్దరూ తీవ్ర పరిమితులున్న వారే. కొకు బుద్ధి కొలతవాదం విజ్నాన శాస్త్రానికీ, భౌతికవాద జ్నానసిధ్ధాంతానికీ విరుధ్ధమైన పచ్చి భావవాదం. ఇక కులసమస్య పై, LGBTQ పై రంగనాయకమ్మ అభిప్రాయాలు పచ్చి తిరోగమన class reductionist చెత్త.

 Suvarna Kumar: అమెరికాలో అర్థరాత్రి మందుపార్టీ కాకపోయివుంటే ఈ పాత చింతకాయ పచ్చడి మళ్లీ చర్చకు వచ్చేదేనా?! రంద్రాన్వేషణ నిషిద్ధం కాదుగానీ, బొక్కలెతుక్కుంటూ పోతే ఒక్కరూ మిగలరు. కొకు, రంగనాయకమ్మలు ఇద్దరినీ సమానంగా(వాళ్ల పరిమితులతో సహా) గౌరవించే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ ఈ చర్చ పనికిమాలినదిగా తోచే అవకాశం ఉంది. దేవుడూ దెయ్యమూ వంటి విషయాలు మార్క్సిస్టులకు మంచినీళ్ల ప్రాయమేగానీ, వాళ్లలో కొందరు నీళ్లు నములుతారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడంలో వివేకం ఉంది, ఖండఖండాలుగా ఖండించడంలో లేదు.

 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s