మతమా మనిషిని వదలవా?

కనీస తర్కం, వాదం లేకుండా సంభాషణ వుండదు. ఈ పోస్టు వాదం కోసం చేస్తున్న వాదం కాదు. ఇది నాకు జవాబు దొరక్కుండా వున్న ఒక ప్రశ్న. ఈ చర్చ మనల్ని మనం సరిదిద్దుకోడానికి, నా అవగాహన తప్పైతే తెలుసుకోడానికి పనికొస్తుందని ఆశ. మీకు తెలిస్తే చెప్పండి.

దీపావళి, సంక్రాంతి, ఉగాది వంటి చాల హిందూ పండుగలు రుతువుల మార్పులకు సంబంధించినవే. అవే కాదు. లోకంలో వున్న పండుగలన్నీ రుతు సంబంధాలే. వాటి చుట్టూరా తయారైన మత, విశ్వాసాల కథలు మాత్రం అత్యధికం మంచివి కావు. ఆ కథలు మనుషుల్లో కొందరి విజయాలకు, మరి కొందరి అపజయాలకు సంకేతాలు. కొందరికి గర్వ కారణాలు కొందరికి బాధా కారణాలుగా కూడా వుంటాయవి. వాటి తయ్యారీ లోనే విజేతల స్వార్థం వుంది. ఉదాహరణకు నేను నరకాసుర వధను సెలబ్రేట్ చేసుకోడమంటే నన్ను నేను అవమానించుకోడం. నాకు పండుగ కావాలి. పండుగ చేసుకోవాలంటే నన్ను నేను అవమానించుకోవాలి.

దీనికొక తరణోపాయం వుంది గాని, అదొక ప్రాసెస్. పండుగల వెనుక కథల్ని ప్రజలు తిరుగ రాసుకోవాలి. అంటే వాటి వెనుక వున్న మత భావజాలాన్ని తీసేయాలి. కొత్త కథలు రాసుకోవాలి. ఇప్పటికే, భావజాలం చాల వరకు మారిపోయి వుంది. కొత్త భావజాలం పునాదిపై విరివిగా కొత్త కథలు రాసుకోవాలి. మారిన (ఆధునిక) భావజాలాన్ని కన్సాలిడేట్ చేయాలి. దీపావళి తదితర పండుగలను, పండుగలుగా, వదులుకోనక్కర్లేదు. అవి ఎవరి అబ్బ సొమ్ము కాదు. సరిగ్గా ఇందుకే పురాణాల్ని తిరుగ రాయడం, పాత కథలను మార్చి రాయడం ఏమాత్రం తప్పు కాదని నా వాదం. ఆ పని మరింత విస్త్రుతంగా జరగాలి.

ఇన్నాళ్ళు నా వాళ్ళు, నేను మోసపోయాం. నిజమే, అయినా, ఈ సంస్కృతి లోని నా (వారి) వాటాను నేనెందుకు వదులుకోవాలి? వదులుకోవద్దు. ఇందులోని జన జీవనాంశాల్ని, మంచి విషయాల్ని నేనెందుకు వదులుకోవాలి. వ్యవసాయం, పశువుల పెంపకం, చేతి పనులు, వస్తువుల తయారీ … అన్నిటిలో నా పూర్వీకుల వాటా వుంది. దాన్ని సొంతం చేసుకుంటూ పండుగ చేసుకోవాలి. జరగాల్సిన ప్రాసెస్ అదే.

అయితే, ఈలోగా, పండుగల నాణానికి వున్న మరో ముఖాన్నీ చూడాలి. ఈ ముఖం అమాయికంగా, విశాల దృక్కుగా కనిపిస్తుంది గాని, ఇది మరింత ప్రమాదకరమైనది. మనం ఏ మతవాదాన్ని వద్దనుకుంటున్నామో దాని వునికికి ఒక సమర్ఠనను సమకూర్చి పెడుతుంది. మత వాదం మీద మనం సాధించే బౌద్ధిక ప్రగతిని ఎప్పటి ప్రగతిని అప్పుడే, తుడిచి పెట్టేస్తుంది.

హిందువులలోని ప్రగతి శీల భావుకులు ఉగాది/దీపావళి శుభాకాంక్షలు చెప్పుకోడానికి కాస్త ఎబ్బెట్టుగా ఫీలవుతారు. చెప్పరు. చెప్పినా, చెప్పడానికి చాల సందేహ పడతారు. కాస్త సిగ్గు పడతారు. పండుగల వెనుక ఇప్పటికి ప్రచారంలో వున్న కథలే దానికి కారణం. వాటి వెనుక వున్న మత భావజాలమే దానికి కారణం. కనుక ఈ ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు. పండగ లేకపోతే మానె, దానికి అతుక్కుని వుండే బూజును వదిలించుకోవడం మేలే. బూజును వదిలించుకున్న తరువాత, మన పండుగలను మనం పునర్నిర్మించుకోవచ్చు. కనుక ఓకే. మరి, అదే రకం ప్రవర్తన ఇతర మతాల విషయంలో, ఇతర మతాల పండుగల్లో ఎందుకు వుండదు. అక్కడ మనం మరో రకంగా ప్రవర్తిస్తామెందుకు అనేది నా ప్రశ్న.

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే; ఉగాది శుభాకాంక్షలు చెప్పడాన్ని సహేతుకంగానే మానేస్తున్న లెఫ్టిస్టులు, పండగ రోజు కవిత్వం చదివి దుశ్శాలువాలు కప్పించుకోడానికి సహేతుకంగానే నిరాకరిస్తున్న లెఫ్టిస్టు భావుకులు…
రమాదన్ రోజు ‘ఈద్ ముబారక్’ చెప్పడానికి ఇంత వుత్సాహం చూపుతున్నారెందుకు? ఈ రోజు చూడండి. ఫేస్ బుక్ నిండా ఆ నినాదాలే కదా?! ఈ ‘పోస్టర్’లలో ముస్లిములుగా పుట్టి పెరిగిన వారు, హిందువులుగా పుట్టి పెరిగిన వారు… రెండు రకాల వారూ బాగానే వున్నారు. ఈద్ ముబారక్ చెప్పడానికి, ఆ గ్రీటింగ్స్ కు జవాబిచ్చే రూపంలో తిరిగి ముబారక్ లు చెప్పడానికి ఇంతగా వుత్సాహపడుతున్నారెందుకు? దీనిలో నాకు అర్థం కాని మతలబు ఏదో వుంది. ఏమిటది? ఏమిటా మార్మిక రహస్యం? కాస్త చెప్పరా?!

నిన్న మొన్న ఇండియాను పాలించి వెళ్లిన బ్రిటిష్ పాలకుల పాలక భావజాలంలో భాగంగా క్రిస్మస్, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోడం మనకు అలవాటయిపోయి, అది (లెఫ్టిస్టులకు కూడా) చాల సహజంగా వుంటోంది. అమెరికాలో హిందువులు కూడా… లెఫ్టిస్టులు కూడా… ఈస్టర్ గుడ్లు వెదకడం, హిందూ పిల్లలు హాలోవీన్ వేషాలతో ట్రీట్ చేస్తవా ట్రిక్ చెయ్యమంటావా అని ముద్దు ముద్దుగా ఇల్లిళ్ళు తిరగడం చూశాను. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ వరకు ఓకే, అది అందరం పాటిస్తున్న కేలండర్ కాబట్టి. క్రిస్మస్ కు, ఈస్టర్ కు ఎందుకు? క్రిస్మస్ కు ఓకే అయితే దీపావళి కి సందేహమెందుకు? రుతువుల మార్పును పక్కన పెడితే అన్నీ మతం పండుగలే కదా?

‘ఈద్ ముబారక్’ కూడా ఒక నాడు ఇండియాను పాలించిన ముస్లిం రాజుల నుంచి సంక్రమించిన పాలక వర్గ భావజాలంలో భాగమే. అంతే కాదు. ఈ పండగలో లేకపోవచ్చు గాని, హిందూ పండుగల మాదిరిగానే పలు ముస్లిముల పండుగల్లోనూ ఎవరో చివరికి-గెలవడం లేదా ‘అమరత్వం’పొందడం మరెవరో చివరికి-ఓడిపోవడం లేదా హత్యలు చేయడం వంటి కథలు వుంటాయి. ఆ కథలు కొందరికి అనుకూలంగా కొందరికి వ్యతిరేకంగా వుంటాయి. దీన్ని మన్నించడం ఎందుకు? అదీ ఏ సందేహం లేకుండా. ఇంత ఉత్సాహంగా మన్నించడమెందుకు? భారత రైటిస్టులకు అనవసరంగా ఒక తర్క సంబంధ ఆయుధం సమకూర్చిపెట్టడం ఎందుకు? సూఫీ పేరిట, మత సామరస్యం పేరిట మనం చేస్తున్న ఘనకార్యం కూడా ఇదే. ఇది ముస్లింల లోని స్త్రీలు, పేదలకు గాని, హిందువుల లోని స్త్రీలు, పేదలకు గాని మేలు చేసేది కాదు. మతవాదం మీద పోరుకు ఏమాత్రం వుపయోగపడేది కాదు. మతాన్ని పట్టించుకోకపోవడమే… రాజ్యం, నువ్వు, నేను… మనం ఏ మతాన్నీ పట్టించుకోకపోవడమే సెక్యులరిజం.

ఈ ఉత్సాహం ఒక మతావేశాన్ని ఖండించి మరొక మతావేశాన్ని నెత్తికి ఎత్తుకునే పిచ్చి పని మాత్రమే. ఇలాగైనా మత భావనల్ని నిలబెడదామని, మతం కుదురులో కులం తదితర హెయిరార్కీలను నిలబెడదామని చేస్తున్న ప్రయత్నమే. ఇది అబుస్కురాంటిజం తన సర్వైవల్ కోసం చేస్తున్నా చివరి ప్రయత్నమే. పేదలకు, స్త్రీలకు, శ్రామిక జనావళికి నష్టకరమే.

ఇదే ప్రశ్న… కంచె ఐలయ్య ‘నేను హిందువునెట్లయిత’ అని పెద్ద ప్రకటన చేసేసి, ఇటీవల తన పేరు చివర ‘షెఫర్డ్’ అని తగిలించుకోడం మీద కూడా వుంది నాకు. తన కులాన్ని, వృత్తిని స్ఫురింప జేయదల్చుకుంటే ఐలయ్య గొల్ల లేదా ఐలయ్య కురుమ లేదా చాల మంది చేస్తున్నట్టు ఐలయ్య యాదవ్ అని పెట్టుకోవచ్చు. అలా కాకుండా తన కులం పనిని ఆంగ్లంలోనికి అనువదించి, ఆ పదాన్ని పేరు చివర తగిలించుకోడం ఎందుకు? ఆ పదానికి కుల వృత్తి కాకుండా వేరే అర్థాలు లేకపోతే ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. ‘షెఫర్డ్ అనే పదం ‘కాపరి’ అయిన ఏసు క్రీస్తును సూచిస్తోందనే స్పృహ ఐలయ్యకు వుంది. హిందువు కాకపోవడం అనేది క్రైస్తవుడు కావడం కోసమైతే, ఇక ఆయన ‘నేను హిందువునెట్లైత’ అనే వ్యక్తీకరణలో స్వారస్యం ఏమీ లేదు కదా?

ఐలయ్య వ్యవహారం కూడా… హిందువులుగా పుట్టి పెరిగిన లెఫ్తిస్టులు పని గట్టుకుని ఈద్ ముబారక్ క్యాంపెయిన్లో గొంతులెత్తడం వంటిదే. ఇవన్నీ ఇండియాలో హిందూ రైటిస్టులకు బలం చేకూర్చే అనవసర ప్యాట్రనైజేషన్లే.

దీన్ని సరిదిద్ది, ఎదిరించి వదిలించుకోవాలని నా విజ్ఞప్తి.

మీరేమంటారు?

ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న ఒక వైఖరిని ఏకపక్షంగా తప్పు పట్టానని కోప్పడకండి.

నా ఆలోచనలో తప్పు వుంటే, నిర్మొహమాటంగా చెప్పండి.

ఇక్కడి దాకా చదివిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, మతం ఎంత బలమైనదో నాకు తెలుసు కాబట్టి.

07-06-2016

comments:
Vali Shaik: చిన్న సవరణ: రంజాన్ ఎవరో ఒకరి గెలుపు కాదు, ముస్లిముల పవిత్ర గ్రంధం ఖుర్’ఆన్ అవతరించినది ఈ నెలలోనే. దానిని పురష్కరించుకుని పండుగ జరుపుకుంటాం. మరో విషయం ఏంటంటే, ఈ పండుగ ప్రత్యేకించి పేదలకు ఉపయోగపడేదే. ఈ పండుగ పేరే అది. “ఈద్ ఉల్ ఫిత్ర్”. ఫిత్రా అనగా దానం. ప్రతి ముస్లిం ఈ నెలలో వీలైనంత ఎక్కువగా పేదలకు దానాలు చేస్తారు. జకాత్ కూడా ఈ నెలలోనే ఎక్కువగా ఇస్తారు. 
My reply:But sir, To have so many have nots to wait for and to receive ‘charity’ from the haves is itself an indication that there is exploitation and the exploitation is exonerated by religion. Ramadan may not have such connotation as somebody’s defeat and somebody’s victory. Other festivals have those connotations. This festival is directly religious and so harmful as obscurantism, I believe. 🙂
Vali shaik: How charity is harmful? I didn’t get u. can you simplify this, “‘charity’ is itself an indication that there is exploitation and the exploitation is exonerated by religion.
My reply: Why is charity there at all? Because there are too many have nots. Why are so may have nots? Why creating conditions of poverty and dependence and then to give in charity? You must be having lots before you go to give some thing in charity. How did you get so much in excess? Just by working hard? Don’t keep kidding. Rich get riches mostly by exploitation of the working men and women. If you agree with this fact, then you won’t consider charity as some magnanimous act of the rich but only as inevitable for them. If they don’t do charity there will be forceful taking overs. Only to avoid forceful taking overs, ‘they’ advocate charity as some thing holy. There is nothing holy about it, Sir. 
Yousuf Baba Shaik: HRK ji, మీ పోస్ట్ బావుంది.. మజీద్ ల, దువా చేస్తున్న బొమ్మలు పెట్టి ఎంతో మంది tag చేస్తుంటే ఎం చేయాలో తెలియని పరిస్థితి. అది సరే కాని మీ పోస్ట్ లో కొన్ని అంశాలతో నేను ఏకీభవించలేను. ఈ దేశపు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ దాదాపు 90% sc, st, bc లే.. వారికి బ్రాహ్మణ, అగ్రకుల ఆధిపఠ్యపు పీడ విరగడ అయింది ఈ మతాల స్వీకరణ వల్లే.. మీరు చెప్పిన జ్ఞానం ఆ సాధారణ ముస్లిం లకు ఉండే అవకాశం లేదు. వాళ్ళు ఈ రకం గా హ్యాపీ గా ఉన్నారు.. ఉండనివ్వండి.. హిందూ పండుగల విషయంలో ఈ దేశ మూలవాసులకు జరిగిన అన్యాయం, వారి నాయకుల హత్యలను పండుగలుగా మలచడం లో బ్రాహ్మణవాదం సఫలీకృతమయింది.
ఇవాళ బహుజనుల గ్రామా దేవతల పండుగలను ఆత్మన్యూనతలో పడవేసి ‘హిందూ’ పండుగలను హై లైట్ చేసి వాటిని మిగతా వారి పై రుద్దడం లో వారు సక్సెస్ అయ్యారు.. ఈ కోణాలన్నీ మనం గమనంలో ఉంచుకోవాలి.
మన చైతన్యం లోంచి మీలా ఆలోచిస్తే అన్నీ చిక్కులే. మన భావజాలం లోంచి మనుషులు హ్యాపీ గా ఉండాలంటే ఆల్ట్ ర్నేటివ్ పండుగలేవి? ప్రభుత్వాలే హిందూ సెట్ అప్ లో అన్నీ చేస్తుంటే అడిగే వారేరి?
ముందు మనం మరింత మారి, ఆచరణలో చూపితే తప్ప మార్పు రాదు..
My reply:  Yousuf Baba Shaik  చంద్రభాను ప్రసాద్ అనే దళిత రచయిత ఆ మధ్య పలు మార్లు రాశారు. ఎందుకో, ఆ తరువాత మూగవోయారు. డిల్లీ మండీ హౌస్ ముస్లిములు మొదలైన వారు పేదలు కాదు అని. ‘ముజఫర్ నగర్ బాకీ హై; అని నకుల్ సాహ్ని తీసిన డాక్యు సినిమాలో అదే ముజఫర్ నగర్ ప్రాంతాల్లో అల్లర్లకు గురి కాని ధనిక రైతు ముస్లిముల గురించి వుంది. ముస్లిములలో 90 % కాదు గాని చాల ఎక్కువ మంది పేదలు ఉన్నారు. హిందువులలో, క్రిష్టియన్లలో కూడా దాదాపు అదే శాతంలో పేదలు వున్నారు. ఒక సారి సినిమా, సాహిత్యాలను చూడండి. రచయితలుగా, నటులుగా అంత మంచి వాళ్లు అంత మంది ముస్లిములు వున్నారు కదా?! అందులో సల్మాన్ వంటి హీనులు కూడా వున్నారు. ఇస్లాంలో వర్గ భేదాలు తీవ్రంగా వున్నాయనడానికి దీన్నొక సూచనగా భావిస్తాన్నేను. రియాలిటీకి కళ్ళు మూసుకునే ప్యాట్రనైజేషన్ వల్ల చాల ఎక్కువగా నష్టాపోయేది పేద ముస్లిములే. సమస్య సున్నితత్వం రీత్యా ఈ విషయమై మరింత శోధన, వ్యక్తీకరణ మీ వంటి, షాజహాన, ఖాజా వంటి నిజాయితీ పరులైన ముస్లిం మిత్రుల నుంచి జరగాలి. ఈ మాటే చెప్పబోయి ఆప్తమిత్రుడనుకున్న ఖాదర్ కు కాని వాడినయ్యాను.
ఎస్, స్కై, ‘ముందు మనం మరింత మారి, ఆచరణలో చూపితే తప్ప మార్పు రాదు..’
Yousuf Baba Shaik: HRK ji, మీకు మరొక విషయం చెప్పాలి- ముస్లిం సమాజం ప్రపంచ వ్యాప్తంగానే కాదు, ఇండియా లొనే కాదు, అంతర్గతం గాను పెను ప్రమాదం లో ఉన్నారు.. కొన్ని జమాత్ (మత సంస్థలు)లు ముస్లింలను మరింత మత మౌడ్యమ్ లోకి ‘తోలు’తున్నాయి. పరలోకం ప్రధానం చేస్తున్నాయి. దీని వల్ల ముస్లిమ్స్ మరింతగా సొసైటీ లో మిగతా సమాజంతో కలవకుండా, జీవనం లో పోటీ పడకుండా తయారవుతున్నారు.. మొత్తం గా ఇండియన్ ఇస్లాం (లోకల్ ఇస్లాం)ని రద్దు చేసి అరబిక్ ఇస్లాం ని రుద్దుతున్నారు. దీని వల్ల నాన్ ముస్లిమ్స్ కు ముస్లిమ్స్ కు మరింత దూరం పెరుగుతోంది..
ఈ నిజాలు విప్పి చెబుతూ, ముస్లిమ్స్ సామాజిక విషయాలు పట్టించుకునేలా ఒక సామాజిక ఉద్యమం రావలసిన అవసరముంది.. ఆ కోణంలో నేను పని చేస్తున్నాను..
ముస్లిం యాక్టివిస్టులు ఆ దిశగా పని చేయాల్సి ఉంది..
ఇందుకు భిన్నం గా ఖాదర్, డాని లాంటి వాళ్ళు- విశ్వాసులు కానివారు ముస్లింవాదులు ఎలా అవుతారని తమకు సంతృప్తికరమైన వాదన చేసి, తాము కొత్తగా ఇస్లాంవాదులై మా లాంటి వారిని ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు.. ఈ వైపరీత్యం ఒక్క ముస్లిం చైతన్య వంతులు, సాహిత్యకారుల్లోనే దాపురించడం దారుణం..
My Reply: స్కై, మీ రెండో వ్యాఖ్య చదివి సంతోషపడ్డాను. అన్ని మతాల్లో పుట్టి పెరిగిన మన బోటి వాళ్ళమే మనం కోరుకునే రేపటి ప్రపంచానికి భరోసా. ఎంత కష్టమైనా మన పని ఆపగూడదు. ఖాదర్ వంటి మిత్రులు కూడా సంగతి అర్ఠం చేసుకుని వస్తారని, మంచికి తోడుగా నిలబడతారని ఆశిద్దాం. లేకుంటే, వారి వల్ల చాల నష్టం జరిగే అవకాశముంది. అయినా ప్రగతి శీల శక్తులు తట్టుకుని నిలబడతాయి.
PdmaPriya Karumanchi: అయ్యా నాకు మతం వద్దూ , అది చేసే అణచివేత వద్దూ , ఈ సహనం వద్దు ఈ పవిత్రత వద్దూ ,అసలు మీరు రచించిన ఈ ఆడతనమే వద్దూ అని మొత్తుకుంటే బలవంతంగా ఇంకొక మతం తెచ్చి అంటగడుతున్నారు , మతమే కాదు అసలు మనిషే వద్దు
Shaikaja Bandari: చాలా మంచి ఆలోచన కల్గించే వివరణ సర్. మన పండుగలు ఆయా రుతువుల ననుసరించి వస్తాయి కనుక తప్పక అందరూ జరుపుకోవాలి.కానీ వాటి వెనుక ఉన్న పురాణకథలు అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా ఉండి , ఆ పండుగలు వైదిక మైనవన్న భావన కలిగిస్తాయి. ఆ కథలను మార్చి పండగకు , ప్రక్ఋతికి ఉన్న సంబంధంపై అవగాహన పెంచితే , అందరూ ఆనందంగా పండగ ప్రయోజనం అందుకోగలం.
*
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s