నేనొక ద్విజుడను అది ఎట్లన్నన్?

స్మృతి 21

నేనొక ద్విజుడను. రెండో జన్మకు సంకేతంగా నాకు జంధ్యం లేదు. రెక్కలైనా లేవు. 🙂

విశాఖపట్నంలో నాకు రెండో జన్మ దొరికింది. ఈ మాట ఆలంకారికం కాదు. నాకది నిజంగా రెండో జన్మ.

లోకం నాకు అర్థమయినంత వరకు, ప్రతి ఒక్కరికీ రెండు జన్మలుంటాయి. నేనే కాదు, ఎవ్వరూ పుట్టినప్పుడు వున్నట్టుండరు. ఒక కీలక సమయంలో మరు జన్మ పొందుతారు. స్వయంగా లోకంలో పడడంతో, మరో మారు పుడతారు. ఒక పద్మ వ్యూహంలోప్రవేశిస్తారు, ప్రవేశం మేరకు సుశిక్షితులై.

మనిషికి ఈ స్పృహ ఇవ్వడానికే, దానికి అవసరమైన ఆత్మ జ్ఞానాన్ని (సెల్ఫ్ కాన్షియస్నెస్ ని) ఇవ్వడానికే ఒక్కో సంస్కృతిలో కొన్ని కొన్ని సంప్రదాయాలు (ప్రాక్టీసెస్) వుంటాయి. మగవాళ్ళకు సంబంధించినంత వరకు ఈ సంప్రదాయాల మీద ఒక చదవదగ్గ చక్కని పుస్తకం కవి రాబర్ట్ భ్లై వచనంలో రాసిన పుస్తకం ‘ఐరన్ జాన్’. వీలయితే మీరూ చదవండి.

అలా మగపిల్లలకు సెల్ఫ్ కాన్షియస్నెస్ ని ఇచ్చే క్రతువే మన దేశంలో బ్రాహ్మలలో వుండే వుపనయనం. మానవ జీవితం లో అలాంటి రిచువల్స్ కి అర్థం వుంది. ఇండియాలోనే కాదు, ఆఫ్రికన్ తెగల్లో, మరి చాల సంస్కృతులలో ఇలా మగ పిల్ల వాడిని మగ మనిషిగా, ఆడపిల్లను ఆడ మనిషిగా సెల్ఫ్ కాన్షియస్ చేసే క్రతువులు వున్నాయి. మూఢ నమ్మకాలుగా కాకుండా, అవి ఎందుకున్నాయో స్పష్టంగా అర్థం చేసుకుని, ఆచరించడం సరైన పని.

మిగతా ఏ సంస్కృతులలో లేకుండా, హిందూ సంస్కృతిలో వున్న ఒక దుర్మార్గాన్ని ఎండగట్టిన తరువాతే అలాంటి ఆచారాల గురించి ఆలోచించాలి. ఉపనయనం వంటి వుపయోగకర ఆచారాల్ని, తద్వారా చేకూరే మానవ వ్యక్తిత్వాల్ని కేవలం బ్రాహ్మణులకే ఎందుకు పరిమితం చేశారు? ఆ వ్యక్తిత్వాన్ని అట్టెయిన్ చేయడానికి అవసరమైన బ్రహ్మచర్యం (విద్యార్జన) వంటి జీవన క్రమాల నుంచి శూద్రులను, చేతి వృత్తుల వారిని ఎందుకు నిబంధనాత్మకంగా దూరం చేశారు.
ఈ ‘కుట్ర’ గ్రహించిన కొందరు మంచి వాళ్ళు గతంలో తాముగా కొన్ని కల్ట్స్ మొదలెట్టి వాటిని ముందుకు తీసుకెళ్ళారు. వృత్తి పనిలో ప్రవేశానికి వాటిని ఆవశ్యకం చేశారు. వాటి మిగుళ్ళు కొన్ని ఇవాళ… కొన్ని కులాలుగా గడ్డకట్టాయి. జంగాలు, విశ్వ బ్రాహ్మలు మొదలైన కులాలను, వారి ఆచారాలను…. వూళ్లలో ఇప్పటికీ గమనించవచ్చు.

ఆ కల్ట్ లు కులాలుగా పరిణమించి, వాటి మొదటి అర్థాన్ని కోల్పోయి, ప్రతీప శక్తులకు అనుకూలమైన రూపం ధరించాయని గుర్తించాక కూడా ఇంకా అప్పటి వచనాలు, సూఫీ తత్వాలు అంటూ… సన్నాయి నొక్కులు నొక్కడం, నష్టకరం. వద్దు. మత స్పర్శ వున్నదేదీ వద్దని, శ్రమకు కాకుండా సో కాల్డ్ ‘బుద్ధి’కి ఆధిక్యత కట్టబెట్టడం అన్యాయమని అన్నందుకే ఇవాళ సకల దివ్య వాదులు, అర్థ దివ్య వాదులు తోక తొక్కిన నాగులవుతున్నారు.

జంగాలు, విశ్వబ్రాహ్మలు, కమ్మరం వంటి వృత్తుల వాళ్లు… ఉపనయనం తరహాలో ఇనీషియేషన్ కు సంబంధించి కొన్ని క్రతువులు పాటిస్తారు. జంధ్యం ధరిస్తారు. (మా నాన్న స్నేహితుడు, మా కమ్మరి రామయ్య మామ వీపున జంధ్యం చూశాన్నేను). తమ పనులలో… వ్యవసాయదారులతో రోజువారీ సంబంధం వున్నందువల్లనేమో ఈ వృత్తుల వాళ్లు… శూద్రుల నుంచి భోజన, వివాహాది సంబంధాలు వుంచుకోరు గాని, మాంసం తినరు గాని… శూద్రుల మీద పెత్తందార్ల భాషలో మాట్లాడరు. సమానికులుగానే వ్యవహరిస్తారు.

ఆధునిక యుగంలో, కమ్మ వారిలో అలాంటి కల్ట్స్ ని ప్రవేశ పెట్టడానికి కవి త్రిపిర్నేని రామస్వామి చౌదరి ప్రయత్నించారు. రెడ్లలో అలాంటి మేధావి వున్నట్టు నాకు తెలీదు. వేమనలో ఈ స్పష్టత లేదు. అన్ని కుల దురభిమానాలతో పాటు కమ్మ, రెడ్డి కుల దురభిమానాల్ని తప్పక ఖండించవలసిందే. చుండూరు, కారంచేడు వంటి దుర్మార్గాల్ని ఖండించవలసిందే.

కాని, ఆ నాటికి రామస్వామి చౌదరిది తప్పనిసరిగా మంచి తిరుగుబాటు. దాన్ని శూద్రకులాలన్నిటికీ వర్తించేలా చేయాలని రామస్వామి చౌదరికి వుండేదని, తరువాతి కాలంలో బ్రాహ్మణ వాద కౌటిల్యం వల్ల అది సంకుచిత రూపం ధరించిందని నేను అనుకుంటున్నాను. ఆ సంకుచిత యవ్వారం ఇప్పుడు మూడు అమరావతులు ఆరు హాస్తినాపురాలుగా వర్ధిల్లుతోందని కూడా అనుకుంటున్నాను.

దాన్ని ఇకనైనా సరిదిద్దుకోలేమా? ఆ కౌటిల్యాన్ని వదిలించుకోలేమా? లేమేమో? అది నా దేశాన్ని వదలని పెను శాపమేమో.

సంప్రదాయంలో చాల చెడుగు వుంది. నిర్దాక్షిణ్యంగా రుద్ది, కడిగి మకిలిని వదిలించుకోవలసిందే. కాని దానిలో పలు మంచి విషయాలున్నాయి. అందులో ఒకటి కౌమారం దాటి యవ్వనంలో ప్రవేశించిన యవకుడిని, యువతిని ప్రాపర్ గా… ‘అత్మ జ్ఞాని’ ని చేసి ‘యుద్ధ’రంగానికి పంపించడం. అలాంటిది అయాచితంగానే నాకు ఎమ్మే రెండేళ్ళలో దొరికింది. దానికి దోహదం చేసిన పెద్దలకు నమస్కరిస్తాను.

విశాఖ పట్నం నా రెండో సొంతూరు. అక్కడ ఇప్పుడు నాకెవ్వరూ తెలియకపోవచ్చు. ఆప్పుడు నాకు పరిచయమైన వారికి ఇప్పుడు నేను ఏమీ కాకపోవచ్చు. నాకు మాత్రం వాళ్ళు అన్నీ అయ్యారు. నా మనో ప్రపంచంలో వున్న నా రెండో కుటుంబంలో చాల మంది విశాఖ వాళ్లే. ఒక రచయితగా కూడా నేను అక్కడే పుట్టాను. అప్పుడు బారసాల జరగలేదంతే. రచయితగా బారసాల కోసం నేను మరి కొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. రాజకీయ కార్యకలాపాల విషయంలోనూ మరి కొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. సీపీ, డివికే, వీవీ వంటి మనుషుల ప్రేమతో అది దొరికింది. వాయిదా పడడం ఎలా జరిగిందో చెబుతాను.

ఆ రెండేళ్ళు నేను చాల ఎక్కువగా రాశాను. కథలు, కవిత్వం. వాటిని ఎవరికైనా చదివి వినిపించి సలహా, ప్రోత్సాహం తీసుకోడం మాత్రం కుదరలేదు. అలాంటి అండ దొరకలేదు. సముద్రంలో నావికుడు ‘వాటర్ వాటర్ ఎవెరీ వేర్, నాట్ ఎనీ డ్రాప్ టు డ్రింక్’ అని వాపోయిన పాట నా విశాఖ సాహిత్య/రాజకీయ జీవితానికి వర్తిస్తుంది. అక్కడ అందరూ చాల పెద్ద వారు. నాకు అందుబాటులో లేరు. కథలు కవిత్వానికి సలహా కోసం ఎవరిని కలవాలో నాకు తెలిసింది కాదు.

రావి శాస్త్రి చాల గొప్ప రచయిత కదా?! కాని, నా బోటి వారికి మోస్ట్ అనప్రోచబుల్. వాళ్లింటికి వెళ్లింది, బహుశా, ఒకే ఒక్క సారి. వాళ్లమ్మాయిదో అబ్బాయిదో పెళ్లి. సుబ్బారావు తీసుకెళితే వెళ్ళాను. పీటల పెళ్లి. రావి శాస్త్రి పీటల మీద కూర్చుని చేయించిన పెళ్లి. ఆ యవ్వారమే నాకు నచ్చలేదు. రచయిత రావి శాస్త్రికి ప్రేరణ, మోడల్ అని చెప్పబడే సంకు పాపారావును అక్కడే చూశాను. రావి శాస్త్రి కథలు పాపారావు అనే మనిషి రూపం ధరించినట్లనిపించింది. ఆయన ఆ రాత్రి గంటల తరబడి అలా మాట్లాడుతూనే వున్నాడు. నాన్ స్టాప్. కుంచెం కూడా బోర్ కొట్ట లేదు. జన్మతః అబ్బిన కళ.

ఎమ్మే రెండో సంవత్సరం మొదట్లో నేనొక కథ రాశాను. పేరు ‘దొంగలు’. దాన్ని కాపీ చేసి కారా మాస్టారుకు ఇచ్చాను. చదివి చెప్పమని. ఆ తరువాత ఆయన నుంచి దాని వూసే లేదు. దాని ఒరిజినల్ నా నోట్ బుక్ లో వుండింది కాబట్టి ఆ కాపీ కోసం ఆయన్ని అడగలేదు. ఒకటి రెండు సార్లు చదివారా అని మాత్రం అడిగాను. ఏదో దాటవేత జవాబు చెప్పినట్టున్నారు.

కథలో ఒక పేదవాడు రైతు కూలీ సంఘంలో సభ్యుడైనందుకు గాను కోపించి, వూరి భూస్వామి, తనకు కట్టాల్సి;న బాకీ కట్టమని వత్తిడి తెస్తాడు. రైతుకూలి సంఘంతో సంబంధం వదులుకుంటే ఆగుతానని సూచన ఇస్తాడు. సంఘంలో వున్న ‘నేను’ మరి కొందరు ఆ పేద సహచరుని సమస్యను ఎలా ఎదుర్కొనాలా అని ఆలోచిస్తారు. ఒక రాత్రి వాళ్ళు వూరికి దూరంగా వున్న అదే భూస్వామి పత్తి చేనిలో పడి, పత్తి తీసి దాన్ని పక్క వూరిలో అమ్మి, భూస్వామి బాకీ కట్టి తమ సహచరుడిని విముక్తుడిని చేస్తారు.

వీళ్లు రాత్రి దొంగ తనం చేసి వచ్చే సంఘటనను వర్ణిస్తూ, ఆ క్రమంలో ముందు వెనుకలుగా ‘నేను’ కథ చెబుతున్నట్టు రాశాను. మిగతా అముద్రిత కథలతో పాటు ఈ కథ వున్న నోట్ బుక్ నిన్న మొన్నటి వరకు నాతో వుండింది. హైదరాబాదులో ఇళ్లిళ్ళు తిరుగుతూ ఎక్కడో పోగొట్టుకున్నాను. 😦 . అదీ, మరో డిటెక్టివ్ కథ పోయినందుకు బాధేస్తుంది. పోన్లెద్దూ, మళ్లీ రాస్తా మూడొచ్చినప్పుడు.

చెప్పొచ్చిందేమిటంటే, ఇలా కారా మాస్టారు వల్ల నాకు ‘కుంచెం’ అన్యాయం జరిగిందని నా పెయిన్. ఆయనలో కాస్త ప్రాంతీయ దురభిమానం వుందని, అదే ఆనాడు నాకు నష్టం చేసిందని ఒక అభిప్రాయం కూడా నాకు ఏర్పడింది. అంతే, అంతకు మించి ఆయన గురించి మంచి జ్ఞాపకాలేం నాకు లేవు. ఆయన ‘యజ్ఞం’ కథ ముగింపు సరైంది కాదనే భావన, అది అవాంఛనీయం, సెన్సేషనలిజం ఎందుకు కాదు అనే ప్రశ్న కూడా నాకు వుండడం వల్ల అయన గురించి వేరే సాహిత్య జ్ఞాపకాలు లేవు. (ప్రాంతీయ అభిమానం ఓకే, అది దురభిమానమయ్యిందని నా అనుమానం).

ఇక్కడ మరొక మాట కూడా చెప్పాలని వుంది. నేను అక్కడ వున్న రోజుల్లోనే ప్రసాదు (జంపాల చంద్రశేఖర ప్రసాదు) విశాఖ వచ్చి వెళ్ళాడని తరువాతెప్పుడో తెలిసింది. విప్లవోద్యమం పట్ల నా ఆసక్తి బాగా తెలిసిన సుబ్బారావు తదితరులు ఆ సంగతి నాకు చెప్పాల్సింది. చెప్పి వుంటే, అప్పుడు నేను ప్రసాదును కలిసి వుంటే, నా జీవిత కథ మరో విధంగా వుండేది. పూర్తికాలం విప్లవకారుడిగా నా జీవితం అప్పుడే మొదలయ్యేది. చాల చిన్న పట్టణం ఆత్మకూరులో, కర్నూలు ఉస్మానియా హాస్టల్ లో, నంద్యాలలో మొదలెట్టిన పిడిఎస్యూ నిర్మాణం పని విశాఖలో, ఆంధ్ర యూనివర్సిటీలోనే మొదలయ్యేది.

అప్పుడు నా పని అత్తలూరి నర్సింహా రావు, ప్రేమసాగర్ అనే నా క్లాసు మేట్లు, సుబ్బారావు అనే నా (ఒక సంవత్సరం) జూనియర్ మొహాల్లోకి చూస్తూ కూర్చోవడమే. వాళ్ళే నా మార్గదర్శులు. వాళ్ళు తమ ఎమ్మేల తరువాత ఉద్యోగాలు, ఉపాధుల మీద దృష్టితోనే వుండినారని అప్పుడు నాకు తెలీదు. తెలిసినా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఛాయిస్ లేదు.

విశాఖలో వుండగా మరో మంచి స్మృతి పార్వతీపురం కుట్ర కేసు కోసం అక్కడ ఏర్పాటయిన ఆరుబయలు కోర్టు సెషన్. శివసాగర్ ని మొదటి సారి అక్కడే చూశాను. గళ్ళ లుంగీ, బనీనుతో బేఫికర్ గా, అదేదో వాళ్లింట్లో డ్రాయింగ్ రూంలో వున్నట్టు బెంచీ మీద కూర్చుని… నాకు భలే అనిపించారు. వావ్, ‘తోటా రాముని తొడకు కాటా తగిలిందాని’ రాసిన మనిషి కదూ అని ఎంత ఆరాధనగా చూశానో. ఆ తరువాత రెండు మూడు సార్లు కలిశాను తనను. ఒక సారి ఆయన ‘యుజి’ లో లేనప్పుడు జరిగిన ఒక విరసం మహాసభ లేదా సాహిత్యపాఠ శాలలో నేనూ అరుణోదయ రామారావు మాట్లాడుకుంటుండగా మా దగ్గరికి వస్తే, ఆయన వేరే పార్టీ కనుక మేము మాటలు ఆపేసే సరికి ఆయన ఓహ్ అన్నట్టు చూసి వెళ్లిపోవడం గుర్తొస్తే చాల సిగ్గేస్తుంది. తను బహుజన రిపబ్లికన్ పార్టి పెట్టాక మా జయతో, యువక (కలేకూరి ప్రసాద్)తో వెళ్లి, మొదటి సారి ఆయనతో పాటు పార్వతి గార్ని కలిసి ఆమె కమ్మని కంఠంలో నా ‘తూర్పు చేని గట్టు కాడ’ పాట విని మురిసిపోయాను. అలా అంత అందంగా మరి రెండు మూడు సార్లయినా కలిశాం.

విశాఖలో, కుట్ర కేసు ఆరుబయలు విచారణ రోజు ఇంతా రమణా రెడ్ది చేసిన ప్రసంగాన్ని మరిచి పోలేను. ఎవరో సముద్రాల (?) అనే అతడు… ఆ కేసులో అప్రూవర్… బోనులో నిలబడి వుండగా. ఇంతా రమణా రెడ్డి చేతిలో నలు చదరంగా మడిచిన ముతక కర్చీఫ్ వూపుతూ, ‘ఇలాంటి ద్రోహులను జనం నడిబజారులో గండ్రగొడ్డళ్ళతో నరుకుతారు’ అని, ఆ నరకడమేదో రోజూ జరిగేదే అన్నట్లు, చాల కంట్రోల్డ్ ఎమోషన్స్ తో అనడం, సెషన్ చివర ఎవరో లావాటి తెల్ల బట్టలాయన నన్ను ప్రొవోక్ చేస్తే నేను విప్లవాన్ని సమర్థిస్తూ ఎక్కువగా మాట్లాడడం, ఇంటికి వెళ్ళే దారిలో ఆ తెల్ల బట్టలోడు గూఢచారి అని తెలీదా అని నరసింహ రావు నన్ను మందలించడం… నిజంగా అదొక ఈవెంట్. ఇప్పుడు కళ్ల ముందు జరుగుతున్నట్లుండే ఈవెంట్. ఆందులోని పాత్రధారులు చాల మంది ఇప్పుడు లేరనుకుంటాను. కొందరిది బలిమి మరణం, మరి కొందరిది సహజ మరణం.

ఇన్ని స్మృతుల పర్సనల్ కావ్యం నాకు విశాఖ. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక ఏమేం చేశానో దానికి తయ్యారీ విశాఖలోనే జరిగింది. ఎమ్మే రెండు సంవత్సరాల పరీక్షలు ఒకే నెలలో రాసి వచ్చేశాను. డిగ్రీ సర్టిఫికెట్, మార్కుల జాబితా తెచ్చుకోడానికి కూడ విశాఖ వెళ్ళ లేదు. చాల కాలం తరువాత, అప్పట్నించి ఏ ఇరవయ్యేళ్ళ తరువాతనో ఏ పి ఎస్ ఎస్ ఎస్ అనే క్యాథలిక్ స్వచ్చంద సంస్టలో ఉద్యోగిగా విశాఖ వెళ్ళాను. కృష్ణక్క ఇంటికి కూడా వెళ్ళాను. అక్కను ఆడిగి మరీ పిపిపించుకుని డాక్టర్ నళినీ వాళ్ళను చూశాను. వాళ్ళకు నేను గుర్తు లేను. నేను ఎవరో వాళ్లకు తెలీదు. రామకృష్ణ బీచిలో ఆ హోటల్, చిన్ని పార్కు, వున్నాయి. అప్పటి నా ‘స్థలం’ అక్కడ లేదు. చీమల్లాగ, ఇసుక రేణువుల్లాగ జనం, జనం, జనం. కాసేపు వుండి, నా విశాఖ నాకు లేదు అనుకుంటూ వెను దిరిగి వచ్చేశాను. ఆ భావన, దానితో పాటు ముసిరిన మరికొన్ని నొప్పి తునకలతో రాసుకున్న ఈ పద్యం, బహుశా, నా ‘చిన్ని చిన్ని ఘటనలు’ సంపుటిలో వుందనుకుంటాను. ఆ పుస్తక ఇప్పుడిక్కడ లేదు. పద్యం, గూగుల్ సెర్చ్ లో దొరికిన ‘కవి సంగమం’ వర్షన్ ఇక్కడ:

//ఏముంది విశాఖలో// •

ఎప్పుడైనా తను జ్ఙాపకం వస్తుంది
జీడిమామిడి చెట్ల మెత్తని నీడల్లో
మొదటి సూర్య స్పర్శ కోసం, తన కోసం
పొంచి వున్న నేను జ్ఙాపకం వస్తాను

ఏముంటాయి క్లాసు రూంలో
అదే నన్నయ అదే భట్టుమూర్తి
తువ్వాలు దుశ్శాలువా సవరించి
మహాప్రస్థానం పద్యాల్లో గర్జించే పదాలకు
నింపాదిగా‍ అర్థాలు చెప్పే మాష్టార్లు, బయట
నల్లగా మెలికలు తిరిగి, పాం పడగల్లా లేచి,
నిట్టనిలువుగా పడిపోయే రోడ్లు… అంతే,
ఏమీ ఉండవు:

చిరాగ్గా తల తిప్పి, అటు వైపు చూస్తే
నునుపు రాతి మీద కదిలే అద్దపు సెల పాటలా
… పగలు కదా, వెన్నెలకు బదులుగా…
ఒక చెంప మీదుగా జారే సూర్యుడు,
పగటి కాంతిని మెత్త బరిచే మత్తు మగత,
వస్తువులు ఉండీ లేకుండే అంతర్మధ్యం

రామకృష్ణా బీచ్లోే కూడా ఏమీ ఉండదు
;జిగురు సాయంత్రపు బొటన వేళ్లతో
ఇసుకను దున్నుతున్న కొన్ని దిగుళ్లు
ఎప్పుడు ఏ తప్పు చేసిందో, రాతి ఒంటిని వంచి,
ముక్కు నీటికి రాస్తున్న ఆకుపచ్చ డాల్ఫిన్,
దూరంగా, ఘీంకార స్వరంతో మూలుగుతూ
కదిలే కొండలా ఇంకొక ఓడ…
ఏమీ వుండవు:

ఇసుకలో ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచేలోగా ఒక చోట
నీరెండ జలతారు పరుచుకుని కూర్చున్న సముద్ర దేవత
ఆ తరువాత చీకటి ముసిరినా, అప్పుడు చీకటి ముసిరిందని
కొన్ని యుగాల తరువాత గాని రెండు బుర్రలకు తట్టనివ్వని
ఒక దినకర చంద్రుడు

ఎంత పని వడినా విశాఖ వెళ్లాలని అనిపించదు

ఏముంది? ఏమీ ఉండదు ఇప్పుడు, విశాఖలో …

3-8-2012

 Iron John
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s