ఒక ధిక్కార స్వరానికి మద్దతుగా

ఏం జరగాలో అదే జరుగుతోంది.

హిందూ మతోన్మాదులు, తాము న్యూమరస్ గా వున్న ఒకే ఒక్క దేశంలో (ఇండియాలో) తమ ప్రతాపం చూపిస్తున్నారు. అదే దేశంలో హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకించే వారు ప్రాణాలకు తెగించి గళం విప్పుతున్నారు.

మరి ముస్లిం మతోన్మాదులు వాళ్ళు న్యూమరస్ గా వున్న దేశాల్లో… ఒకటి కాదు చాల దేశాల్లో… ప్రతాపం చూపిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా గళాలు వినిపించకపోగా, ఎడనెడ, ఆ మతవాదానికి సమర్థనలు వినిపిస్తున్నాయి.

ముస్లిం మతవాదులు తాము న్యూమరస్ గా లేని దేశాల్లో కూడా మతవాదులుగానే వుంటున్నారు. తాము మతవాదులుగా వుండడం చాల సహజం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తమ మీద విమర్శలను ముస్లిం పేదల మీద విమర్శలుగా చిత్రిస్తున్నారు. తమ మతం వాళ్లు న్యూమరస్ గా వున్న దేశాల్లోని గోరాల గురించి వీళ్లు ఏమీ మాట్లాడరు. తాము న్యూమరస్ గా లేని ఇండియా లో హిందూ మతోన్మాదుల దాడులకు బలి అవుతున్న ముస్లిం పేదల కోసం వీళ్లు చేస్తున్నది ఏమీ లేదు. అలాగని వూరుకోడమూ లేదు. ముస్లిం పేదల పేరుతో, వారి బాధల పేరుతో అప్పీల్ చేసి, తమ మతం గొప్ప మీద ప్రచారం మమ్మరం చేస్తున్నారు. ముస్లిం పేదల్లో మరింత మత మౌఢ్యం నూరిపోయడం ద్వారా, వారిని పాత చీకటి లోకి నెట్టడం ద్వారా… తమ మాస్ బేస్ ని కాపాడుకుంటున్నారు.

విచిత్రం ఏమిటంటే, కొందరు కమ్యూనిస్టు నామధేయులు, ప్రగతి శీల నామ ధారులు.. చాల స్వాల్పికమైన, తాత్కాలికమైన… బహుశా వ్యక్తిగతం కూడా అయిన ప్రయోజనాల కోసం… హిందువేతర మతవాదులతో వేదికలు పంచుకుంటూ వీరికి లేని పోని లెజిటమసీ కల్పించడం. ఇది బహుశా ఈ సో కాల్డ్ ప్రగతి శీలుర సొంత అవకాశ వాద రాజకీయాలకు అనువైనది కావొచ్చు. ‘మైనారిటీ’ పేరిట వీరొక మతవాదాన్ని సమర్థిస్తున్నారు. వీరి పరోక్ష సమర్థన ఆ మతవాదం విజృంభణకు దారి తీస్తున్నది. అది తిరిగి తమకు ఇష్టం లేని హిందు మత వాదం వునికికి జస్టిఫికేషన్ కల్పిస్తున్నది. ఈ మాత్రం స్పృహ…. అంటే, ముస్లిం మతవాద విజృంభణ హిందూ మత వాదం విజృంభణకు ఊతమిస్తుందనే స్పృహ ఈ కమ్యూ-ప్రగతి శీలురకు లేదా? లేక ఎవరెటు పోతేనేం ‘మనకు, మన ‘పార్టీల’కు ఈ తాత్కాలిక మాస్ బేస్ పనికొస్తుంది చాలు’ అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నారనడానికే ఎక్కువ ఆస్కారముంది.

ఇటీవలనే, ముస్లిం మత వాదం మీద ముస్లింలుగా పుట్టి పెరిగిన మిత్రుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది కొద్దిగా పుంజకుంటున్నాయి. ఇది మంచి పరిణామం. దీన్ని అభినందించాల్సింది పోయి, దీని పై దాడి చేసే లోడొల్ల హుంకరింపులకు ‘లైకులు’ కొట్టే ప్రగతి శీలురు చాల ఆశ్చర్యం కలిగిస్తున్నారు.

ముస్లిం మిత్రులలో కొందరు తమ పాత మత వాదం పక్షాన చేసే శాఖా చంక్రమణాలు చాలక, దానికి సమర్థనగా బెదిరింపు వాదాలు చేస్తున్నారు. కొత్త ధిక్కార స్వరాల్ని అదిలించి, అణగదొక్కాలని చూస్తున్నారు. ఇవి దాదాపు త్రెట్ కాల్స్ మాదిరిగానే వున్నందు వల్లనే, వీటిని పట్టించుకోవలసి వస్తోంది.

కొందరు మరీ ఆవేశ పడిపోయారో, కావాలనే చేస్తున్నారో గాని, చివరికి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే కామెంట్లు సైతం చేస్తున్నారు. ఉదాహరణకు కవయిత్రి షాజహానా ముస్లిముల లోని ‘కుల’ సదృశ హెయిరార్కీని, మేల్ సువనిజాన్ని ప్రశ్నిస్తూ రాసిన చక్కని కవితను ఆమె పర్సనల్ గా తన భర్త, స్కై బాబా మీద చేసిన విమర్శగా ప్రదర్శించే ప్రయత్నం చేశారు.

ఎస్. జయ (మా ఆవిడ) రాసిన చాల కవితలు పర్సనల్ గా నా మీద విమర్శలని చాల వీజీగా చూపించవచ్చు. అది నిజం కాదని, అదే సమయంలో నేను పాఠాలు తీసికోవలసినవి అందులో చాల వుంటాయని నాకు తెలుసు. ఇది షాజహానా కవితకు, స్కై బాబాకు వర్తిస్తుందని ఆ ముస్లిం మిత్రుడికి గుర్తు చేస్తున్నాను. కొందరు మిత్రుల భార్యలు, బిడ్డలు కవిత్వం వంటి పబ్లిక్ పనులేమీ పెట్టుకోకుండా కుటుంబాలకు, కుటుంబ మర్యాదలకు పరిమితం కావడం దానికది తప్పు కాదు గాని, అది గొప్ప కూడా కాదని ఈ విమర్శక మిత్రులు గ్రహించాలి.

ఎట్టాగూ ఇంత దూరం వచ్చాం. ఇంకో విషయం కూడా చెప్పుకుందాం. స్కై ‘సాక్షి’లో రాసిన వ్యాసం… ఏ మేరకు అచ్చయిందో ఆ మేరకు కూడా.. చాల బాగుంది. అందులో నాకు నచ్చనిదేమైనా వుంటే, సూఫీ దర్గాలకు అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వడమే. హిందువులలో బసవని శైవుల మీద హిందు మతోన్మాదుల దాడులు తెలిసిందే. వాటిని ఖండించాలి. అదే సమయంలో వీర శైవం కూడా కులాలుగా, మతంగా గడ్ద కట్టిందని గుర్తు చేసుకోక తప్పదు. ఇది సూఫీ సహా ఏ మతానికైనా వర్తిస్తుందని స్కై బాబా వంటి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

మత వాదాన్ని, దాని అన్ని రూపాల్లో వ్యతిరేకిద్దాం.
కుల వాదాన్ని దాని అన్ని రూపాల్లో వ్యతిరేకిద్దాం.
తాత్కాలిక వునికి కోసమైనా సరే, రాజీ బేరాలు హానికరం.

20-07-2061

 
 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s