అయితే తిరుపతి లేకుంటే శ్రీశైలం?

రాణి శివశంకర శర్మ ఫే.జీ. (ఫేస్బుక్ పేజీ)లో ఒక ఆసక్తికరమైన పోస్టు చూశాను. కల్బుర్గి అనే శివ భక్తుడిని హిందూ ఫాసిస్టులు చంపారని, ఆ దుశ్చర్యకు గాను ఆ రాక్షసులను శిక్షైంచాలని శర్మ శివుడిని ప్రార్తించారు, అదీ శివరాత్రి పండుగ సందర్భంగా. ఓహ్, కల్బుర్గి శివభక్తుడా… అంటే, మతం పరిధి లోని వాడా అని ఒక మిత్రుడు ఆశ్చర్య పోయాడు కూడా.

1. ‘హిందూ ఫాసిస్టు’లను అంతకంటే తీవ్రంగా ఖండించాలి. కాని ‘ఫాసిస్టుల’ను రాక్షసులనడం అన్యాయం. స్మృతి ఇరానీ పుణ్యమా అని మహిషారుడి కథ అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాక… అసురులు లేక రాక్షసులు ఒక మానవ తెగ లేక కొన్ని మానవ తెగలు అని అర్థమయ్యాక… శర్మ ఆ మాటను ‘ఈవిల్’ అనే అర్థంలో వుపయోగించడం దురన్యాయం. మిగతా సంగతులేమో గాని, ముందుగా ఈ అంశం సవరించుకోవాలని విన్నపం. ఈ విన్నపంలో నాతో ‘అసుర’ కలుస్తాడని ఆశ. నిజానికి రాక్షసులకు వున్న ఆసలు అర్థాన్ని మరింత పాపులర్ చేయడం అవసరం అనుకుంటాను, ‘ఛండాల’ అనేది ఒక కులం రా నాయ్నా, నీ నాలుక జాగర్త అని ఇప్పుడు చెబుతున్నాం కదా, అలాగే. గతంలో అందరం ఆ మాటను ‘ఈవిల్’ అనే అర్థంలో వాడాం. ఇటీవల పార్లమెంటరీ వార్తల తరువాతనైనా తెలివి తెచ్చుకోవాలి మనం.

2. శర్మ పోస్ట్ చదవగానే ఎవరికైనా ఒక నిరాశ కలిగే అవకాశం వుంది. అంటే ఇప్పుడు విష్ణువును (రామచంద్ర పూజారులను) వదిలించుకుంటే, ఆ వెంటనే శివుడికి (శివ సైనికులకు) తల వంచాలా? అయితే తిరుపతి లేకుంటే శ్రీశైలమేనా మన బతుకులు? వైష్ణవమైనా, శైవమైనా, శాక్తేయమైనా, ఇస్లామైనా, క్రైస్తవమైనా… మతం వద్దురా నాయ్నా అంటే కుదరదా? అలాంటి వారికోసం… కొత్త వధ్య శిలల మీద కొత్త గొడ్డళ్లు నూరడం లేదా శర్మ? ఇది తిరిగి బ్రాహ్మణ మతాన్ని ప్రవేశపెట్టే దుస్వార్ఠం కాదా?

3. ఔను నాస్తికత్వం మరో మతమయింది. దానికీ బాబాలు తయారయ్యారు. దేశ దేశాలు తిరిగి ఫోటో సెషన్లలో నవ్వుతున్నారు. (ఆ నవ్వులు చూస్తే ఓరి పిచ్చినాగన్నలారా, మేమెక్కడికి పోతాం, వేషం మార్చామంతే అని వెక్కిరించినట్ట్లుంది). వాళ్లతో …. గోరాతో, లవణంతో… ఇటీవలి తెల్ల షర్టు గోగినేనితో మాకు అక్రమ సంబంధం కట్టొద్దు మొర్రో అంటున్నా శర్మ వంటి వారు వినకపోవడంలో ఏదో చిన్ని కుట్ర వుందని నా డౌటనుమానం. 🙂

3. మతవాదాన్ని, అన్ని మతాల్ని త్రోసి రాజని, మనుషులు మనుషులుగా బ్రతకాలని కోరుకునే నా బోటి వాళ్ళం కల్బుర్గి హత్యను ఖండించేది ఆయన హేతు వాది అయినందుకో, ఆస్తిక హేతు వాది అయినందుకో కాదు. ఆయనను హత్య చేసింది మతవాదం. కనుక అది మతవాద హత్య. హత్యకు గురైన వారు ఇంకే మతం వారైనా అది మతవాద హత్యే. హంతకుల మతం వారే అయినా సరే. హత్య చేసిందెవరు, వారి మోటివ్ ఏమిటి అనేదే ముఖ్యం. మతవాదం చేసే ప్రతి దుర్మార్గాన్ని మతవాద దుర్మార్గంగా పేర్కొని మరీ ఎదిరిస్తాం. హత్యకు గురైన వారు బసవని తరహా శైవులు కావొచ్చు. ఇస్లామిక్ లేదా సూఫీ ఉద్యమకారులు కావొచ్చు, క్రైస్తవ ఫాదరీలు కావొచ్చు. హంతకులను సమాజం ఎప్పటికైనా శిక్షించ వలసిందే.

4. మతవాదులు మరొక మతం వారిని మతం కారణాలతో హతమార్చడాన్ని ఎట్టి పరిస్టితులలోనూ కండోన్ చేయొద్దు గాని, హత్యకు గురైన వాళ్ల మతం గొప్పది ఆ మతంతో ముడివడిన ‘వాదం’ గొప్పది అని డప్పులు కొట్టక్కర్లేదు. అది వాస్తవం కాదు. వీర శైవం కావొచ్చు, ఇస్లాం కావొచ్చు. ఏ మతం వర్గ దోపిడీని వ్యతిరేకించదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహిస్తుంది. ఏ మతం స్త్రీల మీద హింసను వ్యతిరేకించదు. శ్రమ చేసే వాళ్ళను శ్రమ చేయని వాళ్ళు దోచుకోడాన్ని అస్సలు వ్యతిరేకించదు.

5. ఒక మతం వాళ్ళు మరొక మతం వాళ్ళ మీద చేసే ధాష్టీకాన్ని నిలదీయక తప్పదు. వారిలో ఎవరెవరు మైనారిటీలో వారి మైనారిటీ హక్కులను గౌరవించాలి కూడ. మైనారిటీ కాబట్టి ఒక మతం గొప్ప అన్నట్టు మాట్లాడడం మతవాదాన్ని ప్రొత్సహించడమే. ఆ పని శర్మ సారు చేస్తున్నారు.

6. మతమే వద్దని అనుకోక పోతే శ్రామిక జీవన వైఖరికి పట్టం కట్టడం ఎప్పటికీ జరగదు. ఏదో ఒక రూపంలో ‘బ్రాహ్మణ వాదం’ వుంటూనే వుంటుంది. శ్రమను శారీరకమని, బౌద్ధికమని కృత్రిమంగా విడదీసి, శారీరక శ్రమను సో కాల్డ్ బౌద్ధిక శ్రమ ముందు హీన పరిచే ప్రతి ప్రాక్టీస్ బ్రాహ్మణ వాదమే. మన సమస్య కేవలం హిందూత్వం తో కాదు. దానికి మూలకందమైన ‘బ్రాహ్మణ మతం’తోనే. అన్ని మతాల్లోని బ్రాహ్మణ వాదంతోనే. అంటే శర్మ ఇంతగా ఎలుగెత్తి చాటుతున్న ఆయన మతంతోనే.

11-5-2016

Venu Gopala Reddy: ఈ రాణీ శివశంకర శర్మ తనకు తాను ఏనాడో మార్చుకుని చాలాకాలమైంది, పోస్ట్ మోడరన్ పేరుతో కొంతమంది తలపండిన(?) మార్క్సిస్టులు, బాల గోపాల్ తో సహా పిల్లి మొగ్గలేసి బొక్క బోర్లా పడ్డారు ఇక ఈశర్మ గారికి మినహాయింపు ఏమీలేదు, ది లాస్ట్ బ్రాహ్మిన్ అనే ఇంగ్లీష్ పేరు పెట్టి తెలుగు పుస్తకమొకటి రాసాడట, (నేను చదవలేదు) అందులో తన కులం దాని ప్రాశస్త్యం గురించి వివరించాడని విన్నాను. కాబట్టి ఈయన మతవాది అయిన తర్వాత ఆయన చేసే కామెంటులో ఆసక్తి ఏముంటుంది సార్ ?

My reply: Venu Gopal Reddy thank you. మిషెల్ ఫుకో (పవర్/నాలెడ్జ్), జాక్విస్ డెరీడా (ఐడియా అఫ్ డిఫరెన్స్, ఆఫ్ గ్రమటాలజీ), ఎడువర్డ్ సయీద్ (ఓరియెంటలిజం) వంటి పోస్ట్ మోడర్నిస్టు భావుకులకు శర్మకు ఎలాంటి సంబంధం లేదు. నేను బాగా విభేదిస్తాను గాని, బాల గోపాల్ ఒక నిజాయితీపరుడైన మేధావి. బాలగోపాల్ ఆలోచనలతో ఈయనకు సంబంధం లేదు. శర్మను శర్మగా ప్రశ్నించడమే సరైంది. కాకపోతే చలం ‘బ్రాహ్మణీకం’ కథ చివర ‘కడపటి బ్రాహ్మణ మహత్మ్యం’ అనే డైలాగు లేకుండా ఈయన పుస్తకం టైటిల్ ‘ది లాస్ట్ బ్రాహ్మిన్’ లేదేమో అని నా మరో డౌటనుమానం.

Venu Gopala Reddy: “భావుకులు” అంటున్నారుగా ఇక నేను కూడా విభేదించను, పోతే బాలగోపాల్ నిజాయితి పరత్వానికి, ఆయన ప్రవచించిన తర్వాతి తాత్వికతకు సంబధంలేదు, బాలగోపాల్ నిజాయితీని నేనూఅభిమానిస్తాను. నాకు తెలిసి గుంటూరు కు చెందిన అడ్వొకేట్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఇలాంటి భావుక తాత్వికతలో పడి మునిగిపోయారని ప్రతీతి.

My reply:  Venu Gopala Reddy! మీరనేది నిజమే అనిపిస్తున్నది. చంద్రశేఖర్ ఫినామినన్ ని అలాగే అర్థం చేసుకోగలమేమో.

Vriddhula Kalyana Rama RAo: పోస్ట్ మోడరన్ వాళ్లు ఏ తత్వమూ పూర్తిగా అంగీకరించరు. నిజానికి గొప్ప మార్క్సిస్ట్ లు అని ప్రకటించుకున్న ఏ ఇద్దరూ కూడా అన్ని విషయాలలో ఏకీభవించరు. బాల గోపాల్ మార్క్సిజం లో ఖాళీలు చూపించేడు. అవి నిజం. ఖుర్ ఆన్ లో దోషాలు అని వ్యాసం రాస్తే సాంప్రదాయ ముస్లింలకు ఎంత కోపం వస్తుందో , అంత కోపం కరుడుకట్టిన Marxists కి వచ్చింది. కాని బాలగోపాల్ పోస్ట్ modern కాదు. శర్మ గారికి labels వెయ్యడం కష్టం. ఆయన శివశంకరశర్మాయిజం కి చెందిన వ్యక్తి.

VEnu Gopala Reddy’s reply: మీతో ఏకీభవించట్లేదు! marxist లపై మీ విమర్శ బాగా లేదు. అసలు అంతలా కోపం వస్తుందంటే వాడు మార్క్సిస్ట్ కాడు. బాల గోపాల్ పోస్ట్ మోడరన్ కాదు కానీ మార్క్సిజం లో ఖాళీలు చూపించాడు అంటున్నారు. దానిపై రంగనాయకమ్మ గారు ఘాటుగానే స్పందించారు . మీకు ఇంకా ఈవిషయం పై సమాచారం కావాలంటే ” బాలగోపాల్ తాత్విక గందరగోళం” పుస్తకం చదవండి. ఇక్కడ ఈవాల్ మీద అన్నీ చర్చించలేము. సమయాభావము స్థలాభావము వుంటాయి గమనించ గలరు.

Vriddhula Kalyana Rama RAo బాలగోపాల్ తిరిగి బాగా సమాధానం చెప్పగలడు. కాని బాలగోపాల్ సమాధానం చెప్పడు. Time waste తప్పిస్తే ప్రయోజనం లేదని తెలుసు.

My reply: Vriddhula Kalyana Rama RAo garu, ‘బాలగోపాల్ సమాధానం చెప్పడు. Time waste తప్పిస్తే ప్రయోజనం లేదని తెలుసు’.
ఈ వైఖరి సరైనది కాదు సర్. నేను మాట్లాడుతూ పోతా మీరు వింటూ పొండి అనడం, డైలాగును హీనపర్చడం డెమొక్రాటిక్ యాటిట్యూడ్ కాదు. అవకాశమిస్తే అలాంటి వాళ్ళు మొదటి రకం నియంతలవుతారు.
ఇంతకూ బాలగోపాల్ మార్క్సిజంలో ఏ ఖాళీల్ని పూరించాడు? చూపించడం కాదు. చూపించి చర్చకు నిలబడకుండా ‘పారి’పోవడం కాదు. చూపించిన ఏ ఒక్క ఖాళీనయినా పూరించాడా? అయితే అవి ఏవి?
ఒక రచయితను, థింకర్ ను పేరు పెట్టి ప్రశ్నించినప్పుడు, విమర్శించినప్పుడు అందులో మేటర్ వున్నప్పుడు మౌనం వహించడం ‘పారిపోవడమే’. దానికి ఇంకే పెద్దమనిషి తరహా పేరూ నప్పదు.

My reply: ‘ఖాళీలు నిజం.’ అందులో సందేహం లేదు. మనం దాన్ని గుర్తించడానికి బాలగోపాల్ కు సంబంధం లేదు. మార్క్సిజమే కాదు, ఖాళీలు లేనిది ఏదీ లేదు. ఉండదు. ఉండదనే ‘జ్గానం’ గతి తర్కం’లో అంతర్లీనం, అతి ముఖ్యం కదా రామా రావు గారు! కాకపోతే ‘మనిషీ మార్క్సిజం’ వ్యాసం మొదలైన వాటిలో.. అలా ఖాళీలు పూరించే ప్రయత్నం బాలగోపాల్ చేశాడు. బాగా తప్పుగా చేశాడు. మీరన్నడి నిజం. ఇక్కడ అన్నిటి లోతుల్లోకి వెళ్ళలేం. ఆ మాటలు వచ్చేసరికి వుండబట్టలేక రాశాను.🙂

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s