డొంకతిరుగుడు మతవాదం

నవతెలంగాణా’లో నా వ్యాసం మొదటి భాగాన్ని… దేనికదిగా రాసిన వాటిలో మొదటి వ్యాసాన్ని… ఇప్పటికే మీతో పంచుకున్నాను. ఇదిగో ఇది రెండో వ్యాసం. ఇది గురు వారం వేదిక పేజీలో అచ్చయ్యింది.

donkathirugudu mathavaadam

కులానికి మూలం మతం. కుల వాదులకు మతం అవసరం ఎప్పుడూ వుంటుంది. మతంతో కులానికి వున్న అవసరం రీత్యా కుల వాదులు ‘మతా’న్ని సమర్థిస్తారు. మత రాహిత్యం కాదు, మత సామరస్యం కావాలంటారు. మతం ఎలా హానికరమో రుజువులతో సహా చూపిస్తే, అబ్బే ఏ చైతన్యుని భక్తి ఉద్యమమో, బసవని శైవమో, సూఫీ మతమో, కనీసం బౌద్డమో బాగుంటుందంటారు.

మనకు రిజర్వేషన్లను, ప్రజాతంత్ర హక్కులను ఇచ్చేది రాజ్యంగం. మతం రిజర్వేషన్లు ఇవ్వదు. మతం ఇచ్చే పూజరిత్వం వంటి రిజర్వేషన్లున్నాయి. అవి వుండగూడదు. అవి అక్రమం. అవి వున్నంత వరకు మతం, మతం కుదురులో కులం… అలాగే వుంటాయి.

దళితులు, వెనుకబడిన కులాల వారు, మైనారిటీలు తమకు పుటకతో వచ్చిన లీగల్, కాన్స్టిట్యూషనల్ అవకాశాల్ని వుపయోగించుకుంటూ మిగిలిన అన్ని సందర్భాలలో కులాన్ని వదులుకోవాలి. క్రైస్తవం లోనికి మారిన దళితులు లీగల్ గా, కాన్స్టిట్యూషనల్ గా తమకు పుటకతో వచ్చిన అవకాశాల్ని వుపయోగించుకుంటున్నారు. ఎవరైనా అలాగే చేయవచ్చు. ముస్లిముగా పుట్టిన వ్యక్తి ముస్లిం మైనారిటీకి రాజ్యాంగమిచ్చే సౌకర్యాల్ని తీసుకోడం ప్రజాతంత్రయుతం. ఆ పేరుతో తాను మతాన్ని వుంచుకోడం అదేదో అత్యవసరమైన, నిరాడంబరమైన వ్యవహారమనడం మాత్రం తన లోని మత వాదానికి డొంకతిరుగుడు సమర్థన. ఇది ఆయా మతాలలోని పూజారుల వాదం.

నీ మతం నీకు ‘అవసరం’ అని వాదించినంత కాలం ఇంకో మతాన్ని కోప్పడలేవు. మత వాదాన్ని కోప్పడలేవు. మత వాదాన్ని కోప్పడనంత కాలం మతం కారణంగా చెలరేగే ఏ హింసను కాదనలేవు. నీ మీద నీ వాళ్ల మీద హింసను… నిజాయితీగా ఖండించలేవు. దాన్ని రాజకీయంగా వాడుకుని నీ వ్యక్తిగత పబ్బం గడుపుకుంటావు. నీ మీదికే హింస వచ్చినప్పుడు హేతువుకు అతీతంగా ఈడగిలబడి వేడుకుంటావు. ఎందుకంటే మరొక చోట నీ మతం వాళ్లు ఇట్టాంటి ఘోరాలే చేస్తున్నారు. ఇక్కడ ఎవరో నీ మీద చేస్తున్నారు. నిన్నొక్కడినీ వదిలేయమని అహేతుక దేబెరింపుకి దిగడం వినా నీకు దారి వుండదు.

మతం అంటే శాంతి కానే కాదు. మతం అంటే నాలాగే నువ్వుండాలని కోరడం. అది వినని వాడిని కాఫిర్ అనీ, నాస్తికుడనీ, దైవ దూషకుడనీ నిందించడం. ఎక్కడ ఎవరికి బలముంటే అక్కడ వాళ్లు ఇతర్ల తలలు నరకడం.

కుల, మతాల్ని వదులుకోడం ఎవరు చేసినా అది ఆడంబరం కాదు. ప్రదర్శన కాదు. పెద్ద పెద్ద పండాల్సు కట్టి ట్రాఫిక్ జామ్స్ చేయడం, కర్ణ కఠోరంగా చప్పుళ్లు చేయడం, మైకులు పెట్టి అరవడం.. అదీ ప్రదర్శన. కుల మతాలు వద్దనడం ప్రదర్శన కాదు. అదొక మంచి పని అనే భావన ఎంత పెరిగితే సంఘానికి అంత మేలు. కులమతాలు వద్దనడమంటే నువ్వు నాలా ఉండాలని చెప్పడం కాదు. ఒకరు హిందువుగా వున్నందుకు ప్రత్యేకం పన్ను కట్టాలంటే అది బలవంతం. ఒకరిని హిందువు కమ్మని ‘ఘర్ వాపసీ’కి పిలిస్తే, అది బలవంతం.

2.
వైవిధ్యమని, మన్నూ మశానమని కొందరి వాదాలు… రాజ్యాంగేతర, మత సౌకర్యాల్ని వదులుకోలేక చేస్తున్న ఆర్త నాదాలే. జీవన వైవిధ్యం మానవ శ్రమ లోంచి పుడుతుంది. పూజల లోంచి కాదు. శ్రమైక జీవనంలోంచి పుట్టే వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని మిసప్రాప్రియేట్ చేయడమే… ఏ మతానికి చెందిన పూజారులైనా చేసే ఘన కార్యం.

వైవిధ్యం దానికది గొప్పది కూడా కాదు. సాంస్కృతిక వైవిధ్యం పేరిట సతీ సహగమనాన్ని సమర్థించే హీనులున్నారు. చిన్న చిన్న దొంగతనాలకు పేదవాళ్లను, అడల్టరీకి ఆడపిల్లల్ని… చేతులు నరికించడం, రాళ్లతో కొట్టి చంపడం, రేపులు చేయించడం కొందరికి వైవిధ్యంగా కనిపించొచ్చు. దీనికి అంతు లేదు. ఇవి నేను వూహించి ఇస్తున్న ఉదాహరణలు కాదు. అలాంటి హీనులు ఈనాటి లోకంలో మన మధ్యనే వున్నారు. వధూ దహనాల్ని సైతం కుటుంబాల ప్రైవేటు వ్యవహారాలుగా చర్చించే ప్రబుద్ధులున్నారు.

ఊళ్లలో అప్పటికప్పుడు తీర్పులు చెప్పి శిక్షలు అమలు చేసే పంచాయతీలు పోయాయని బాధ పడే పెదరాయుళ్లు, చిన రాయుళ్ల చుట్టూ ఎంత గ్లామర్? దానికి గాంధీ పేరుతో ఎంత పొలిటికల్ మైలేజీ? డెమోక్రటిక్ గా ఎంపికైన న్యాయస్థానాల్లోనే ఇంత అన్యాయం వుంటోంది. ఇక పిడచగట్టిన గ్రామీణ వ్యవస్థను కాపాడే స్వతంత్ర పంచాయతీలలో న్యాయం గురించి చెప్పాలా?

ఏమి వైవిధ్యం, ఏమి సంప్రదాయం. ఆ మఠం కాడ కట్టేసి కొట్టడాలు. కడ్డీలు కాల్చి వాతలు పెట్టడాలు. నా పెండ్లాం నా ఇష్టమని బజాట్లో ఆడవాళ్లను తన్నడాలు…. అవన్నీ వందలేళ్ల నుంచి జరిగే వైవిధ్య భరిత సంప్రదాయం కాదా? దానికి మన మతాలు … ఒకటి కాదు, హిందూ, ముస్లిం, క్రైస్తవాది అన్ని మతాల్లో అన్ని కులాల్లో శాంక్టిటీ వున్న మాట నిజం కాదా?.

3.
తమ మాటల్లో వాచ్యార్థాలు కాదు ఇంకేవో అర్థాలు చూడమని ఊదరగొడుతున్నారు కొందరు కులాల సమర్థకులు. పొడుపు కథలొద్దు. ఇది వినోదం కాదు. బతుకు. ఆ వ్యంగ్యార్థాలేమిటో చెప్పాలి. ఆ గూఢార్థాలేవో చెప్పాలి. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి మాత్రమే చదువు చెప్పడం మన సంప్రదాయం అని ఆ సంప్రదాయాన్ని సమర్థిస్తూ రాసే ఒక తండ్రి బయోగ్రఫీలో ఏమి గూఢార్థం? (‘ది లాస్ట్ బ్రాహ్మన్’) అలాంటి తండ్రిని అసయ్యించుకోవాలి, ఆయన ఎవరి తండ్రి అయినా సరే. ఆ అసయ్యానికి మద్దతు ఇవ్వడం కుమారుని కనీస ధర్మం. ఇదొక డిమాండు. ఈ డిమాండును ఎందుకు తిరస్కరిస్తున్నారో మేధావులు చెప్పాలి. అది చెప్పకుండా…. ఓటుకు నోటు గురించి ప్రశ్న అడిగితే, అసలా వీడియో ఎట్టా తీస్తారండీ అని వాదించే చంద్రబాబు రాజకీయం… వేల ఏండ్లు సాగింది, చాలు.

బ్రాహ్మణులు నాస్తికులు, దైవ హంతకులు అని ఇటీవలొక కొత్త రకం బ్రాహ్మణ వాద చతురోక్తి. బహుశా ఇలాంటి ‘అద్భుత ప్రకటన’లే వీరు చెప్పే వ్యంగ్యార్థాలో గూఢార్థాలో అయ్యుంటాయి. వాదం కోసం అది ఒప్పుకుందాం. మరి, దేవాలయాల్లో ఈ దైవ హంతకులైన ‘భూసురులు’ పూజారులుగా వుండొద్దని కొత్తాంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వద్ద ప్లాకార్డులు పట్టుకుని మీరు డిమాండ్ చేయండి. మీకు మద్దతుగా మా ప్లకార్డులతో మేమూ వస్తాం. భలే మంచి ఐక్య సంఘటన అవుతుంది. దేవాలయాల్లోంచి బ్రాహ్మలను… అనగా ‘దైవ హంతకుల’ను… తీసేసి, పూజారి ఉద్యోగాలలో వేల ఏండ్లుగా వున్న రిజర్వేషన్ విధానాన్ని తొలగించి వేద్దాం. శూద్రులకు, దళితులకు ఆ ఉద్యో;గాలివ్వాలందాం. వీళ్లు భూసురులమని ఎన్నడూ చెప్పుకోలేదు గనుక, దేవాంతకులు కారు కదా?! దీనికి అయ్యగారు సిద్ధమా?

అయినా ఆ … వ్యంగ్యార్థమో గూఢార్థమో…. ఒక అర్థం వున్న మాట నిజమే. బ్రాహ్మణులు తమను తాము దేవుళ్లుగా ప్రకటించుకోడమంటే అసలు దేవుడిని తీసెయ్యడమే అని వీరి కవిత్వం. కాని కుదరదు. బ్రాహ్మలు ఆకాశ దేవుళ్లమని చెప్పుకోలేదు, భూమ్మీది దేవుళ్లమని చెప్పుకున్నారు.

అయినా అలాంటి అబ్ స్ట్రాక్ట్ దేవుడి సంగతి ఇక్కడ ఎందుకు? మతానికి… ఏ మతానికైనా… నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడైన దేవుడితో పని లేదు. అలాంటి దేవుడిని సైన్సు, హేతు వాదం విమర్శించదు. దాని గురించి మాట్లాడదు. పట్టించుకోదు. ఎందుకంటే, ఆ దేవుడు అగోచరం, అజ్జ్ఞేయం. నీకూ నాకు ఎవరికీ తెలియనిది. దాన్ని దేవుడని అనడం కేవలం భాషా సౌకర్యం. దానికి…. జవాబు లేని ప్రశ్న అనీ మరోటనీ… ఏమాటైనా వుపయోగించొచ్చు. ఆ దేవునికి ఏ మతంతో….. సూఫీయిస్టు తాబేటి చిప్పలతో, నెమలీకలతో, బుద్ధ విగ్రహాలతో, చెన్న బసవని శివునితో సంబంధం లేదు. కుల, మత చర్చల్లో ఆ రకం ఆధ్యాత్మిక అంశాలు తీసుకురావడం ఎవరు చేసినా, అది మత వాదానికి ఒక పనికిమాలిన సమర్థనే.

08-02-2016

Advertisements

About hrk

Publishing mostly in Telugu. Not only poetry but every thing I write.
This entry was posted in సంవాదాలు వివాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s