జేమ్స్ బాండు మనోడేనోచ్(2)

‘ఓ మహాత్మా ఓ మహర్షీ!’ పేరుతో చినుకు మాస పత్రికలో  రాస్తున్న కాలమ్ లలో ఇది రెంఢోది. 2016 జులై నెలలో వెలువ‍ఢింది. (జూన‍ స‍ంచిక‍లో కాల‍మ్‍ రాలేదు)..

విన్నారా, పురాణ కథల్ని మార్చి రాయడం తప్పట. పెద్దవాళ్లు అలా చేశారు గాని, ఇప్పటోళ్లం చేయగూడద‍ట‍. పెద్దోళ్ళు ధ్యానించి రాశారు. మనం వూహించి రాస్తామ‍ట. వాళ్లు రామ కథను మార్చినా ‘పలికించెడి వాడు రామభద్రుండట’ అని ధ్యానిస్తారు. ఆయన పలికించెడి కథ ఆయనకు అనుకూలంగా వుంటుంది. కనుక తప్పు కాద‍ట‍. పాత కథలను అలా మాత్రమే చెప్పాల‍ట‍. వాటిలో మనకు బాగు అనిపించిన మార్పులు చేసి చెప్పడం తప్పట‍. ఎందుకిన్ని త’ప్పె’టలు. ఎందుకిన్ని డొంక తిరుగుడు తర్కాలు? వాల్మీకి, వ్యాసుడు ఏది ధర్మమని చెప్పడానికి పురాణాలు రాశారో ఆ ధర్మం కోసమే అయితే వాటిలో ఎన్ని మార్పులైనా చేసుకో. అది ధ్యానం. అందులో ఏ ఒక్కటైనా అధర్మమని చెప్పడానికైతే… రాముడిది కాదు, సీతదో రావణుడిదో ధర్మమని చెప్పడానికైతే… అది వూహ… తప్పు.

అన్ని రాతల వెనుక పర్పస్ వుంటుంది. మహర్షులారా! మహాత్ములారా!! ఒక పర్పస్ హానికరమైతే ఏం చేయాలి? నోర్మూసుకుని వినాల్సిందేనా?

మీరు జేమ్స్ బాండ్ నవల్లు చదువుతారా? ఇయాన్ ఫ్లెమింగ్ భలే రాస్తాడబ్బా. సినిమాలు ఇంకా భలే వుంటాయి. సీన్ కానరీ, రోగర్ మూర్… ఇంకా మరెందరో అందగాళ్లు జేమ్స్ బాండ్లుగా నటించారు. బాండ్ చేయలేని పని వుండదు. ఎగిరే విమానం లోంచి తోసేసినా చావడు. గాల్లో చేతులు చాచి, నీళ్లలో ఈదినట్లు ఈదుతాడు. వీపున అదృశ్య ప్యారచ్యూట్ ఫట్మని విచ్చుకుంటుంది. తాను కిందికి దిగడమే కాదు, ఒక అందగత్తెను పట్టుకుని, హత్తుకుని తీసుకొస్తాడు సేఫ్ గా. ఒక్కో సారి మరీ ఆశ్చర్యం. గాల్లోనే విలన్ గాడి పారాచూట్ లాగేసుకుని, వాడిని ఆకాశంలో వదిలేసి తను ఎంచక్కా దిగొస్తాడు. భళిరా బాండూ అనిపించుకుంటాడు. అంతటి ‘మహిమలు’ వుంటాయి బాండుకి.

అంతటి అద్భుత బాండుని అనాగరికులు బంధించి చాల ఇన్నొవేటివ్ చిత్ర హింసలకు గురి చేస్తారు. హింసల్లో చిత్రమేంట్రా నాయ్నా అనుకుంటాం మనం. ఆ చిత్రమేంటో బాండ్ సినిమాలు చూస్తే తెలుస్తుంది. బాండ్ ని టేబుల్ మీద వెల్లకిలా కాళ్ళు పంగ చాపి పడుకోబెట్టేస్తారు. ప్యాంటు క్రీజులు చెరగని అందమైన బాండు కాళ్ళ మధ్య ఒక లేజర్ కిరణం సర్రున దూసుకొస్తుంది పైఫైకి. మన మనస్సు ‘బాండ్ బాండ్’ అని కాతర స్వరంతో అరుస్తుంది. ఇంకో సీన్లో సుందరంగా కండలు తిరిగిన బాండ్ ని బట్టలు లేకుండా…. అదంతా ప్రొఫైల్ చూపిస్తార్లెండి… ‘ఫ్రంటల్’ గా కాదు… అడుగున సీటు లేని కుర్చీలో కూర్చో బెట్టి… గొలుసుకు వేలాడే ఓ పెద్ద ఇనుప గుండుతో విసురుగా బాండ్ నగ్న ముడ్డి మీద కొట్ట(బోవ)డం వంటి ‘చిత్ర’ హింసలు కూడా వుంటాయి. ఏదో తెలుగు తిట్టు గుర్తొస్తుంది మనకు. ఇంతలో బాండ్ శత్రువుల నుంచి తప్పించుకుంటాడు. అతడి దగ్గరున్న సైన్సు మహిమలు హెల్ప్ చేస్తాయి.

బాండ్ మహిమాన్వితుడు. సైంటిఫిక్ మహిమాన్వితుడు. బాండ్ అంటే ఆడపిల్లలు పడి చస్తారు. బాండ్ పక్షం వాళ్లు నాగరికులు. తమ వ్యతిరేకుల మీద చాల ‘ఫెయిర్’ గా యుద్ఢాలు చేస్తారు. చాల న్యాయస్ఠులు. బాండ్ ది అంతా ఫెయిర్ ప్లే. బాండ్ శత్రువులు ఇంతకు ముందు (సోవియెట్) కమ్యూనిస్టులు. ఇప్పుడు ఏ ఆఫ్ఘన్లో లేదా ఇరాకీలో. వాళ్ళది అస్సలు ఫెయిర్ ప్లే కాదు. వాళ్ళు అనాగరికులు. బాండ్ మీద వాళ్ల హింసా పద్డతులు చూశాం కదా. అవి ఆమానుషం, అనాగరికం. దుర్మార్గం. ఔనా కాదా?!

మీరు అమెరికా కౌబాయ్ సినిమాలు కూడా బాగానే చూసుంటారు. గ్రెగరీ పెక్, మార్లిన్ బ్రాండో, క్లింట్ ఈస్ట్ వుడ్, టెరెన్స్ హిల్ మొదలైన అందగాళ్లెందరో ఈ సినిమాల్లో నటించి లోకాల్ని మెప్పించారు. కౌబాయ్ సినిమాలు కూడా భలే వుంటాయి. ఆ మ్యూజిక్ చాలు. యునీక్. ఇంజన్లు అనగా రెడ్ ఇండియన్లు అనగా నేటివ్ అమెరికన్ తెగల వాళ్లు… లేదా ఇంకెవరో శ్వేత జాతి వ్యతిరేకులు… మన ప్రియతమ కౌబాయిల కుటుంబాల మీద దాడులు చేస్తారు. అదే వాళ్ళ పని. తమకు దొరికిన వాళ్లను రకరకాలుగా హింసిస్తారు. మనిషిని తీగెలతో పైకి కట్టి, కండరాల మీద కత్తితో కోసి, కోసిన చోట కారం పూసి, విక్టిమ్స్ బాధ పడడం చూసి ఆనందిస్తారు. గుర్రాల మీద వంద మంది రెడ్ ఇండియన్లు ఒక గుర్రం మీంచి పడిపోయిన తెల్ల ముసలాయన్ని చుట్టి ముట్టి, తీరిగ్గా ఆయన కళ్ళద్దాలు పీక్కుని, ముసిలాడు ప్రాణ భయంతో వెర్రి చూపులు చూస్తుంటే గాట్ఠిగా నవ్వుతూ గుండెల్లోకి బాణం కొట్టి వెళ్లి పోతారు.

ఒక తెల్ల వాడిని పట్టుకుని రకరకాలుగా హింసించి, అతడు తనను చంపమని బతిమాలుతుంటే ఆనందంగా పగలబడి నవ్వి నవ్వి అలసిపోయి, చివరి వినోదంగా చంపుతారు. చిత్ర హింసల్లో ఎన్ని క్రూర ఘోరాలు వుంటానికి వీలుందో అవన్నీ ఈ సినిమాల వల్ల మనకు తెలుస్తాయి. జేమ్స్ బాండ్ సినిమాల్లో మాదిరిగానే ఈ ‘ఇంజన్లు’ కూడా నాగరికతకు శత్రువులు. తెల్ల వాళ్ల వ్యతిరేకులు. ఈ ‘వెస్టర్న్’ సినిమాల్లో కూడా కౌబాయిలే గెలుస్తారు. మనం చాల చాల చాలం జాల ఆనందిస్తాం. నేటివ్ అమెరికన్ తెగల వాళ్లు మన కౌబాయిల శత్రువులు, సో, వాళ్ళు మన శత్రువులు. కౌబాయిలు పడిన హింసలకు మనం చాల బాధ పడతాం. అవి మనం పడే హింసలే అనిపిస్తాయి. ఎందుకంటే కౌబాయిలు ‘మన’లాగే నాగరికులు. రెడ్ ఇండియన్లు అనాగరికులు. చచ్చిపోవలసిన చెడ్డ వాళ్లు.

నాగరిక జీవితాన్ని ఎవరు ఇష్టపడరు? న్యాయాన్ని, ఫెయిర్ ప్లేని, మంచితనాన్ని, వాటితో పాటు కాస్త శృంగారాన్ని, ఇంకాస్త అందాన్ని, క్రీజులు నలగని ప్యాంట్లని, విలన్ గాడు హీరో నుంచి లాక్కుని హీరో మీద పేల్చిన పిస్తోలు వెనక్కి పేలి విలన్ గాడే చావడాన్ని, ఎక్కడో ఇంటి దెంతెల మీద దాక్కున్న విలన్ ని వెనక్కి కాల్చి పడగొట్టే గురి కాడు హీరోని, అదే సమయంలో మరో చేతిలోని ఇంకో పిస్తోలుతో ఇంకో ‘వెధవ’ కాల్చేసే సవ్యసాచి హీరోని, రెడ్ ఇండియన్ ముసలి ఛీఫ్ అతి తెలివికి పోయి తుపాకి పేలిస్తే, ఇంకో వైపు నుంచి ఏమార్చి కాల్చేసి, తీరిగ్గా వెళ్లి, ‘ఓల్ మ్యాన్’ అంటో సపర్యలు చేసే మా మంచి ‘వీ’రోని ఇష్టపడకుండా ఎలా వుంటాం? ఇష్టపడతాం. చాల చాల చాలం జాల ఇష్టపడతాం. కవి/దర్శకుడి ప్రతిభ ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా ఇష్టపడతాం.

బాండ్ ఎవర్ని ఓడించాడో ఆ కమ్యూనిస్టులతో, ఆ ఆఫ్ఘన్లతో, ఆ ఇరాకీలతో మనకు శత్రుత్వం వుండదు. ఉంటే గింటే సానుభూతి వుంటుంది. రెడ్ ఇండియన్లు తదితర శ్వేతజాత్యేతరుల మీద మనకు కోపం వుండదు. వాళ్లకు తెల్లవాళ్ళకు మధ్య జరిగిన ఘర్షణల్లో మనమే కాదు మనసున్న శ్వేతజాతీయులు చాల మంది కూడా రెడ్ ఇండియన్లదే న్యాయమంటారు.

అయినా సరే, ‘మనం’ ఈ సినిమాలని ఇష్టపడతాం. ఈ సినిమాలు మప్పే విలువల్ని మన రక్తంలో కలిపేసుకుంటాం. అవి తప్పుడు విలువలని ఎవరేనా చెబితే వినబుద్డి కాదు. ఎవరు బాండు సారుకు ఎదిరి పక్షమో, ఎవరు ‘మెకన్నా’లకు గిట్టని వారో వారికి… ఆ విలువల వల్ల చాల నష్టం. వాళ్ళకు జరుగుతున్న ఆ అన్యాయం, ఆ విదేశీయం, ఆ ఆధునికం, ఆ సైన్సు మహిమలు… అవన్నీ మనకెందుకంటారా?

అయ్యో, సారూ! అవేవీ పాశ్చాత్యుల తెలివి తేటలు కాదు. ఎంచక్కా మన దగ్గర్నించి కొట్టేశారని నా అభియోగం. భారత పురాణాల్లో లేనిదేదీ బాండు దగ్గర లేదు, ‘గో బాలుర’ దగ్గరా లేదు. ఈస్ట్ వుడ్ రెండు చేతులతో పిస్తోలు కాలుస్తాడు. సర్సరే లెండి. మన పురాణార్జునుడు ఆ పని చేస్తాడనే కదా, సవ్య సాచి అంటాం. టెరెన్స్ హిల్ ఎక్కడో దెంతెల మీది వాడిని వెనక్కి చేసాచి కాల్చేస్తాడు. పోదురూ. మన మత్స్య యంత్రం కథ ఏమిటి? ఏడు తాటి చెట్ల చాటు నుంచి వాలిని బాణం కొట్టి చంపిన రామచంద్రుడి గురి ఎట్టిది? బాండ్ అంటే అందగత్తెలకు భలే యావ. ఆహ, మాకా చెబుతారు? అర్జునుడు, కృష్ణుడు కంటె రొమాంటిక్ హీరోలా ఈస్ట్ వుడ్డూ, బాండూ?

అంతే కాదు. పాండవులు, రాముడు, కృష్ణుడు…. న్యాయస్తులు. వీళ్లది ఫెయిర్ ప్లే. తాము న్యాయంగా ధర్మంగా వుండడమే కాదు. బండ్ల కొద్ది, రథాల కొద్దీ ధర్మాలు చెబుతారు. వీళ్లు నాగరికులు. వీళ్ల వ్యతిరేకులు రాక్షసులు. అనాగరికులు, దుర్మార్గులు. వాళ్ల దుర్మార్గాలు ఏమిటి? వీళ్ల సన్మార్గాలు ఏమిటి? అసలు, వీళ్లు మనోళ్లు ఎట్టా అయ్యారు? మీరు మరీ నాస్తీకం మనిషిలా వున్నారే, ఆమాత్రం తెలీదా? పురాణ కవి చెప్పాడు కదా? పురాణం చెప్పిందంటే అంతే, కాదనడనికి లేదు. మార్చడానికి లేదు. రాక్షసులు దుర్మార్గులు, దేవతలు సన్మార్గులు. అంతే. బలి చక్రవర్తి, రావణుడు మంచి వాళ్లు కావొచ్చేమో అనగూడదు. ఎందుకు అనగూడదు? కవి అలా అన్లేదు. ఆ కథల్ని మార్చడం నేరం.

అయ్యో అదెలా? గతంలో మార్చారు కదా? మహా భారతంలో దుష్యంతుడు శకుంతలను మరిచిపోవడం చాల క్యాజువల్, ప్రత్యేకించి కారణం లేదు. కాని, అదేదో శాపం వల్ల అలా జరిగింది, నిజానికి దుష్యంతుడు చాల మంచోడు అని కాళిదాసు రాశాడుగా? కాళిదాసు మార్చొచ్చు! ఎందుకంటే ఆ మార్పును ఆయన ‘వూహించి’ చెయ్యలేదు, ‘ధ్యానించి’ చేశాడు. నువ్వూ నేనయితే… మనకు ధ్యానం రాదు కదా, వూహించి చేస్తాం. సో, మనం చేస్తే తప్పు. సీత రాముడికి చెల్లెలని ఒక కథ, ఆమె రావణాసురుడి కూతురని ఇంకో కథ వాల్మీకి కాలానికే వున్నాయిటగా, ఆ కథల ప్రకారమైతే రావణుడు దుర్మార్గుడు కాడు… మరి, రావణుడికి అన్యాయం జరిగిందనో, సీతకు అన్యాయం జరిగిందనో…. సో కాల్డ్ నిమ్న కులస్తుల పక్షాన్నో, పవిత్రతా నిరూపణకై నిప్పుల్లో దూకడం ఇష్టం లేని ఆడవాళ్ల పక్షాన్నో రాముని కథను రాయకూడదా?

రాయకూడదన్నదే అత్యాధునిక దీర గంభీర పౌరాణిక వాక్కు. ఔదల దాల్చక తప్పదు.

ఠాట్, ప్రభుత్వం వారిది.

హెచ్చార్కె
19-05-2016

ఫేస్ బుక్‍ కామెంట్స్‍ నుంచి:
క‍ల్యాణి ఎస్‍జె:
మీరు చెప్పిందంతా …(బాండ్ లూ, కౌ బాయిలూ – వాళ్ళ శత్రువులూ: వారి పట్ల మన మోజూ, వీరి పట్ల మన నిర్లిప్త వైఖరీ… వగైరా అన్నీ …) పరమ సత్యమని నమ్ముతాను. చాలా సూటిగా మనసుకు తాకేటట్టూ చెప్పేరు, అభినందనలు sir, Hecchar Ke గారూ.
కాకపొతే మీరు ఉటంకించిన వ్యాసం వివిధలో నేనూ చదివేను, ధ్యానించడం, ఊహించడం మధ్య భేదాన్ని చెప్తున్నారని, ‘ఏదో కొత్తగా ఉంది, అర్ధం చేసుకోవాల’నుకున్నాను. మీ రైటప్ చదివేక మళ్ళీ దాని గురించి ఆలోచించాను.
నిజమే, ఒరిజినల్ పీస్ లోని మౌలిక భావనకు విరుద్ధమైన భావనని ప్రతిపాదించాలంటే – ఒక వ్యాస రూపం లో చెయ్యొచ్చేమో కానీ, అవే పాత్రలతో కొత్త కల్పనను సృష్టించడం సరైనది కాదేమో అనిపిస్తోంది.
మనందరం అభిమానించే రంగాజీ కూడా (విషవృక్షం) ఒరిజినల్ కథనే చెప్తూ, తన కామెంట్ లను మాత్రం జోడించి, అసలు కథ లోని గుట్టును రట్టు చేసేరు కదా, అదే సరైన పద్ధతేమో అని నాకనిపిస్తోంది.

 నా జ‍వాబు:
క‍ల్యాణి ఎస్‍జె! పాత కథలను మార్చి రాయొద్దంటే ఏ పాత కథలను? ఉదాహరణకు ‘రామాయణం’ పేరుతో వున్న కథ ఒక్కటే పాత కథా? అదే సమయంలో అదే కథకు మరెన్నో వర్షన్స్ వున్నాయి. ఒక దానిలో సీత రాముడి చెల్లెలు, ఇంకో దానిలో సీత రావణుడి కూతురు. (చూడు: రాముడికి సీత ఏమవుతుంది బై ఆరుద్ర). ఆ కాలంలోనే జనంలో వున్న కథలను మార్చి రాయడం వుంది అనడానికి ఈ పాత రామాయణ కథలు ప్రబల వుదాహరణలు. అప్పుడు మార్చి రాయొచ్చు గాని ఇప్పుడు రాయొద్దు అనడం వెస్టెడ్ ఇంటరెస్ట్ అని నా అభిప్రాయం. పాత కథలను విపరీతంగా తిరుగ రాసి, అలా రాయడం ద్వారా చర్చకు గురి చేయాలని, ఎప్పటికప్పుడు చర్చలో నిగ్గు తేలినదే బతకాలని నా ప్రతి పాదన. భారత కథ కూడా మొదటి నుంచీ అలాగే లేదు. అభిమన్యు మరణంతో అయిపోయే ‘జయ’ అనే ఒక భారతం వర్షన్ ఉందంటారు. అప్పుడు మిగిలిన భారతమంతా ‘చేర్పిక’, లేదా మార్పిక అవుతుంది. భగవద్గీత భాగం సాంతం గుప్తుల కాలంలో చేరిన ప్రక్షిప్తమని కోశాంబీ గట్టిగానే వాదించారు.
నా వ్యాసానికి రెఫరెన్సు వ్యాసాన్ని మీరు సరిగ్గా గుర్తించారు. దాన్ని మిగిలిన మిత్రులకు గుర్తు చేసినందుకు చాల కృతజ్ఞతలు. పాత కథలను మార్చొద్దనే ‘వాదం’ వెనుక వున్న స్వార్థం ఏమిటో ఆ వ్యాసం వల్ల స్పష్టం అయ్యింది. ఆయన/ఆమె మార్చొద్దని అన్నది పాత కథలను కాదు, పాత థర్మాలను. థర్మాలను మార్చకుండా కథలు మార్చొచ్చు అని చెప్పడానికే… ఊహలతో మార్పులు చేయడం తప్పు, ధ్యానంతో మార్పులు ఓకే అని ఆ వ్యాస కర్త అన్నారు.
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s