ఓ మహాత్మా ఓ మహర్షీ (1)

‘ఓ మహాత్మా ఓ మహర్షీ’ పేరుతో ‘చినుకు’మాస పత్రికలో 2016 జూన్ నెలతో మొదలెట్టి ఒక కాలమ్ రాస్తున్నాను. అంచులో ఇది మొదటిది:

ఏది నెగటివ్ ఏది పాజిటివ్?

‘నిన్ను నీవుగా ప్రేమించుటకై నీ కొరకు కన్నీరు నించుటకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము’

ఊరికే అనుకోవడమే గాని, ఇది ప్రేమ గీతం కాదు. స్నేహ గీతం. జీవన గీతం.

అమ్మ పక్కన గుక్క పట్టిన తొలి ఏడుపు నుంచి చివరాఖర్న పెగలని గొంతుకతో గుడ్ బై చెప్పే వరకు అదే యావ.

నీ మనస్సును అడిగి చూడు. నీవు అమ్మాయి కావొచ్చు అబ్బాయి కావొచ్చు. పిల్లాడు కావొచ్చు పెద్దాడు కావొచ్చు. ఎప్పుడూ అదే యావ కాదూ? నీ చుట్టూ జనం నిన్ను నీవుగా ప్రేమించాలని కాదూ, నిన్ను నీవుగా ప్రేమించాలని కాదూ, నీ దుఃఖమంతా?!

నీ ముక్కు కొంచెం లావు. అదే అందం అనుకోవూ అద్దం చూసుకుంటూ. అందరం అట్టా అనుకోవాలని అనుకోవూ?

నీ నోట్లో ఎడం పక్కన పంటి మీద పన్ను. నువ్వు జమున లాగ వున్నావని అనుకోవూ? అందరూ అలా అనుకోవాలని అనుకోవూ?

నువ్వు నడిస్తే కాస్త ఆడ నడక పడుతుంది. నువ్వు నాగేశ్పర్రావులా నడుస్తావని అనుకోవూ, అందరూ అలా అనుకోవాలని అనుకోవూ?!

మేము నిన్ను నీవుగా ప్రేమించాలంటే ఎట్టా కుదురుతుంది? మా స్టాంటర్డులు మాకు వుంటాయి. ఆ స్టాండర్డులు మా ముక్కుల మీద, మా దంత సౌందర్యం మీద, మా నడకల హొయలుల మీద ఆధారపడి వుంటాయి, అవునా, కాదా?

అబద్దాలు కాసేపు బాగుంటాయి. అద్దాలు ప్రతిసారీ అబద్ధాలే చెప్పవు. అద్దం నుంచి పక్కకు వెళ్లినా మన ఇమేజులు మన వెంట పడతాయి. ఏదో ఒక స్టాంటర్డు… జమున స్టాండర్డో సావిత్రి స్టాండర్డో గెలిచిన స్టాండర్డ్స్ అవుతాయి. ఇంటి పటాలవుతాయి.

అయినా మన ఒరిజినల్స్ వర్ధిల్లుతూనే వుంటాయి. ఉండాలి. వ్యక్తులు సరే. అదే సమూహాలైతే?!

కొన్ని సంగతులుంటాయి. అందులో ఎవరి కథ వాళ్లదిగా వుంటుంది, ఇరు వివాదుల్లో ఒకరు తమ కథతో పాటు పూర్తిగా దుంపనాశనమైపోతే తప్ప.

ఎవరికిష్టం వుంటుంది దుంపనాశనమైపోవడం? ఓడినా చిట్టచివరి వరకు పోరాడుతారు. చివరి మనిషి వరకు, చివరి మనిషి లోని చివరి కణం వరకు పోరాడుతారు? వాళ్లు పదే పదే తమ కథ చెప్పుకుంటారు. కథ చెప్పుకోడం కూడా పోరాటంలో భాగమే. ఆ కథ నీ కథకు విరుద్ధంగా వుంటుంది. నెగటివ్ గా వుంటుంది. ఒక్కోసారి ఈ కథ గెలుస్తుంది. బండ్లు ఓడలవుతాయి.

ఎవరి కథ వాళ్లకుంటే ఎలా? అది నీకిష్టం వుండదు. అలాగయితే, వాళ్లు నీ పూజలోకి రాని రోజు… బండ్లు ఓడలయ్యే రోజు వచ్చేసే అవకాశం ఎప్పుడూ వుంటుంది. అది నీకు సుతరామూ ఇష్టం వుండదు. .

అందుకే, నిన్ను…. నిన్ను మాత్రమే…. నీ కథను మాత్రమే సహించడం నీ దృష్టిలో గొప్ప సహనం, అవాల్ రైట్!

నాణెం తిప్పి చూడు. నిన్ను…. నిన్ను సహించకపోవడమే నీ దృష్టిలో అసహనం. ఇది కూడా అవాల్ రైటేనా?

ఇలాంటప్పుడు, సోదరా, నిన్ను సహించడమంటే నన్ను కాదనుకోడమే. అపుడేం చేస్తాన్నేను? అప్పుడు నేను ‘అసహన’మవుతాను. బజారులో, రచ్చ బండ మీద, అసెంబ్లీలో, పార్లమెంటులో గగ్గోలు. నువ్వు నీ నేర్చిన నాటకీయతనంతా వేదిక మీదికి తెస్తావు.

నీ పాఠం మొదలవుతుంది. అది నీ పాఠం. నా పాఠం కాదు. దాన్ని నా పాఠం కూడా అనుకుని నేను కూడా నీ పండగలో చిందులేయాలంటావు. కనీసం, నా ఇంట్లో నేను తలుపులు బిడాయించుక్కూర్చుని నా వునికిని దాచేసుకోవాలి. మాట్లాడగుడదు. ఇన్ ఎఫెక్ట్ నేను లేకుండా అయిపోవాలి. అది కాకుండా నువ్వు చెప్పే పాజిటివ్ మరేముంటుందో కాస్త చెబుతావా?

సోదరా! పొడుపు కథ అర్థం కాలేదా?

సరే, ఓ కథ చెబుతా. ఆ కథ కూడా పొడుస్తుంది గాని, అర్థమవుతుంది.

ఇటీవలి వార్తే. ఎవరో ఒకరు కరపత్రమో, చిరు పుస్తకమో రాశారట. మహిషాసురుడు అనే ఆయన అందరి లాంటి వాడే. ఒక పట్ట ‘మహిషి’ కి ఎలా కొమ్ములు గట్రా వుండవో అట్టాగే పట్ట మహిషుడికి కూడా కొమ్ములు గట్రా వుండవు. అతడొక రాజు. మీలాగే కొందరికి నాయకుడు. ఆయన ఏలుతున్న భాభాగాన్ని ఎవరో అక్రమించాలనుకున్నారు. వాళ్లకు ఆయన్ని నేరుగా ఎదిరించే దమ్ముల్లేవు. అప్పుడేమో ఒక ఆడమనిషిని ఆ పనికి నియోగించారు. ఆమె మహిషాసురునికి చేరువై, తరువాత మోసం చేసి అతడిని చంపింది. ఇది ఒక కథ. ఇదే నిజం అనుకునే వాళ్లున్నారు. మహిషుడు తమ రాజు, తమ రాజును ఒకామె అన్యాయంగా, మోసం చేసి చంపిందని కథ. అందుకని ఆమెను దుర్గ అని కాళి అనీ పూజ చేయడం వాళ్లకు బాధగా వుంటుంది.

మీ కథలో వాళ్ల కథలో జరిగింది ఒక్కటే. ఆమె అతడిని చంపింది. ఎందుకు, ఎలా చంపింది? అతడు రాక్షసుడు. అసురుడు, సో, చెడ్డ వాడు, ఈవిల్. క్రైస్తవులలో లూసిఫర్ వంటి వాడు. కనుక ఆమె చంపింది. ఎలా చంపింది? ఒక్కతెనే, సింహం మీద వచ్చి చంపింది. అందుకని ఆమె దేవత.

ఇందులో ఆమె అతడిని చంపిందనే మాట తప్ప మరేదీ వాస్తవమయ్యుండే అవకాశం లేదు. ఒకామె సింహం మీద.. స్కూటరు మీద రెండు కాల్లు ఒక వైపు వేసుక్కూర్చున్న అమ్మాయిలా… కూర్చుని రావడం అసంభవం. అది కేవలం బొమ్మ అంటారా? అసలు ఒక్కతె రావడం అసంభవం. అది మహిషుడి స్వస్థలం. ఆమె ది కాదు. కనుక వాళ్లిద్దరి మధ్య కేవలం ద్యంద్వ యుద్ధం జరిగే అవకాశం లేదు. అసలు యుద్దమే జరగలేదని, మోసం జరిగిందని అనుకోడానికి అవకాశం చాల ఎక్కువ. ఒక స్త్రీ ఒక పురుషుడికి చేయగల మోసాల పరిధిలోనే వుంది అవతలి వాళ్ల కథ. అవాస్తవికంగా వున్నది మీ కథే.

అయినా సరే, ఇప్పటికే మా కథ వైపు చాల మందిని లొంగదీసుకున్నాం కనుక, చాల మందితో మా కథనే ఒప్పించాం కనుక దీన్ని కాదన రాదు. కాదనడమంటే అసహనం అంటారు మీరు. నిజమే ఇవాళ మీరు చాల మంది, వంచన వల్లనో, అణిచివేత వల్లనో మీ కథను అనుసరించే వాళ్లు కూడా చాల మంది. మెజారిటీ.

మేము సంఖ్య రీత్యా బాగా తగ్గిపోయాం. మేము మైనారిటీ. అయినా, మహిషుడి పట్ల పాజిటివ్ గా వున్నాం. దుర్గ పట్ల నెగటివ్ గా వున్నాం.

ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం ఎట్టా అవుతుందో కాస్త చెబుతారా, సారూ!

అయ్యా! మహిషుడికి కొమ్ములు అనిజం. దుర్గ అలా స్కూటరు మీద అమ్మాయిలా రెండు కాళ్లు ఒక వైపు పెట్టి సింహం మీద కూర్చుని వచ్చిందనేదీ అనిజమే. మహిషుడూ అసురులు ఈవిల్ అనే మాట అనిజం. దుర్గ పక్షం వాళ్లు మాత్రమే సజ్జనులు అనేది కూడా అనిజమే.

ఇన్నాళ్లు మీరు చెప్పిన అనిజాలనే నిజాలనుకుని, జనాలు చాల మంది మీ పూజలనే తమ పూజలుగా చేస్తున్నారు. ఫూజలు వాళ్లవి కావు. మీవి. అందుకే, ఆ పూజల్లో మిమ్మల్ని పూజారులుగా స్వీకరించి, మీ కాళ్లకు మొక్కడం కూడా పూజలో భాగమయింది. ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి. ఇక దీన్ని కాదనడమంటే…  దుర్గ వ్యతిరేకిని సమర్థించడమంటే… పరమ అనహనమని. నెగటివిజమని మీ వువాచ.

మీ వాక్పటిమ వెంట వెళ్తే నేను వుండను. మేము వుండము. ఇప్పటికే చాల వరకు లేము. ఇక ముందు అసలే వుండము. అందుకే మాలో మృత్యువుని ధిక్కరించి మిగిలిపోయిన వాళ్లం మా సత్యం వేరే వుందని అంటూనే వుంటాం.

మా మహర్షులు మాకున్నారు. మా మహాత్ములు మాకున్నారు. ఉంటారు.

పాజిటివ్ గా మాత్రమే వుండడం సాధ్యం కాదు. నెగటివ్ గా వుండడం, నెగటివ్ గా మాట్లాడడం కూడా తప్పని సరి. లేకుంటే మమ్మల్ని మేం, మా మహర్షుల్ని, మా మహాత్ముల్ని మేం వదులుకోవాల్సి వుంటుంది. కుదరదు.

ఈ నెగటివ్ శక్తి లేకపోయి వుంటే, స్పార్టకస్ నుంచి నేటి వరకు బానిసలు…. బానిసలుగానే వుండిపోయే వారు. మీ పాజిటివిజం…. నథింగ్ బట్ స్టేటస్కోయిజం. మంచి వైపు నిలబడాలంటే చెడును ధిక్కరించాల్సిందే. ఈ ఉన్న వ్యవస్థ వున్నట్టుగా మాకు వద్దు. వి యార్ అపోజ్డ్ టు ఇట్. ఇదే జీవితం పట్ల సానుకూల వాదం.

ఏది మంచి ఏది చెడు? ఓ మహర్షీ ఓ మహాత్మా!!

ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే. నా నిర్ణయం నువ్వు చేసి పెట్టడానికి, పాపం, నువ్వెప్పుడూ రెడీనే.

దానికి నేను రెడీ కాను.

నేనూ నువ్వూ కలిసి మనం అయ్యే వరకు నీ నిర్ణయం నువ్వు చేసుకున్నట్టే, నా నిర్ణయం నేను చేసుకోవాలి. బద్ధకిస్తే చస్తాను. నిర్ణయాల మధ్య సంఘర్షణ వల్లనే, నిర్ణయాల మధ్య డైలాగు వల్లనే నిజం నిగ్గు తేలాలి. వంచన వల్ల కాదు.

డబుల్ నెగటివ్స్ మేక్ ఎ పాజిటివ్ అనే వ్యాకరణ సూత్రం ఒక రణ సూత్రం కూడా.

పరిమాణామాత్మక మార్పు గుణాత్మకమై, అబావం అభావం చెందుతుంది. నెగేషన్ గెట్స్ నెగేటెడ్. కొత్త లోకం వికసిస్తుంది. ఆ లోకంలో నేను, నువ్వు… కాకుండా… మనం వుంటాం…. మరెవరితోనో, మరి దేని తోనో సంఘర్శిస్తుస్తో.

హెచ్చార్కె

01-04-2016 J

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s