విషాదాలూ విప్లవాలు

స్మృతి 20

చెప్పాను కదూ, ఒకే ఒక్క రంగుల మేడ, మా తెలుగు డిపార్ట్మెంట్ వున్న బిల్డింగు… మొత్తం యూనివర్సిటీ ఆవరణలో బాగా ఇటు చివర… అంటే విశాఖ నగరం వైపు వుండేదని… ఇక ఆ తరువాత ప్రొఫెసర్స్ క్వార్టర్సే అని.
ప్రొఫెసర్స్ క్వార్టర్స్ కు మూడే మూడు సార్లు వెళ్ళాన్నేను.
అందులో మొదటిది ఒక పెను విషాదం.
మా డిపార్ట్మెంట్ హెడ్ కాకర్ల వేంకట రామనర్సింహం. మంచి వ్యక్తి. ఎమ్మేలో చేరడానికి వెళ్లినప్పుడు, ‘నీకు జువాలజీలో సీటు వచ్చింది కదా ఎందుకొచ్చిన తెలుగెమ్మే అబ్బాయ్’ అని సిన్సియర్ గా సలహా ఇచ్చిన మంచి వ్యక్తి. ఆయనకు ఒకే ఒక్క కొడుకు. పేరు హరనాథ్. మాకు బాగానో, కొంచెమో… సీనియర్. తరచు కనిపించడం వల్ల ఆ ‘దూరం’ ఫీలయ్యే వాళ్ళం కాదు. తను కూడా కలుపుగోలు మనిషి. అంతే కాదు, తను తరచు శ్రీశ్రీ మహా ప్రస్టానంలో పద్యాల్ని ధారాళంగా అప్పజెప్పే వాడు. ఉపన్యాసాల్లో, కబుర్లలో శ్రీశ్రీని విరివిగా కోట్ చేసే వాడు. ఇంతా చేసి అతడు కమిటెడ్ ఆరెసెస్. బహుశా వెంకయ్య నాయుడి రాజకీయ గుంపులో ఒకడయ్యుంటాడు. అప్పుడు ఆరెసెస్ వాళ్ళు శ్రీశ్రీ కోట్స్ ని విపరీతంగా వుపయోగించే వారు. వెంకయ్య నాయుడు కూడా. ఇప్పటికీ కనిపించే నాయుడి ప్రాసాయాసానికి మూలమదే.
హరనాధ్ చదివింది కూడా తెలుగెమ్మేనే. అక్కడే, వాళ్ళ నాన్న డిపార్ట్మెంటులోనే.
మేము రెండో ఏడాదిలో వుండగా అనుకుంటాను. లేక మొదటి ఏడాది చివర్లోనో. హరనాథ్ ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒకే ఒక్క కొడుకును పోగొట్టుకుని మా ప్రొఫెసరు పొందే ఆవేదన మమ్మల్ని కలచి వేసింది. అదీ, పోస్ట్ గ్రాజ్యుయేషన్ కూడా అయిపోయి ఇక ఏదో వుద్యోగంలోకి వెళ్ళాల్సిన వాడు. ప్రొఫెసరేమో రిటైర్మెంటుకు చేరువగా వున్న వృద్ధుడు. చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకు పోయి, ఆయన ఎలా తట్టుకుని నిలబడ్డారో. హరనాథ్ చనిపోయినప్పుడే వాళ్ల ఇంటికి వెళ్లాం. ఒక ప్రొఫెసర్ ఇల్లు ఎలా వుంటుందో ఆ విధంగా చూశాన్నేను.
రెండో సారి మా మరో మాస్టారు సుబ్రహ్మణ్య శాస్త్రి సర్వైకల్ స్పాండిలోసిస్ జబ్బుతో బెడ్ రెస్ట్ లో వున్నప్పుడు వెళ్లాను ఆయన్ని పలకరించడానికి. ఆయన రోజూ క్లాసుకు ధోవతి, షర్టు… భుజం మీద ఒక తెల్లని వలెవాటు కప్పుకుని వచ్చేవారు. అందుకని ఆయనకు ‘దుప్పటి శాస్త్రి’ అని అడ్డపేరుతో వ్యహరించే వాళ్ళం. ఆయనకు బ్రాహ్మణ కులాభిమానం ఎక్కువ అనే ఒక అపోహ ప్రచారంలో వుండేది. ఆయనకు ఇష్టులం కావాలంటే మా పేర్లు హనుమచ్ఛాస్త్రి, నరసింహ శర్మ, ప్రేమసాగర శాస్త్రి అని మార్చుకోవాలని జోకులేసుకునే వాళ్ళం.
ఔను, ఆయన కూడా నిబద్ధ అరెసెస్సే. ఆరెస్సెస్ లో ఏదో రాష్ట్రస్థాయి పదవి కూడా వుండేదాయనకు. అయినా కమ్యూనిస్టులమని చెప్పుకునే వాళ్ళ కన్న ఆయన మీదే నాకు కాస్త ఎక్కువ గౌరవం వుండిపోయింది. నా అభిప్రాయాలు తెలిసి కూడా ఎప్పుడూ ఆయన ‘విరసపు’ మాటలు మాట్లాడలేదు. ఇవ్వాల్సి వచ్చినప్పుడు మంచి సలహా, గౌరవం రెండూ ఇచ్చారు.
చిన్న తమాషా: ఇటీవల ‘చినుకు’ పత్రిక’లో నా నెల వారీ కాలమ్ రాస్తూ వాడుకున్న ఒక ఐడియాను… అప్పుడు తెలుగెమ్మేలో… ప్రాచీన సాహిత్యాధ్యయనంలో భాగమైన మహా భారత భాగం విషయంలో వుపయోగించి ఆ మాస్టారు నుంచి ప్రశంసలు, మార్కులు కొట్టేసిన తీపి గుర్తు వుంది నాకు.
రీసెంట్ ‘చినుకు’ చూడని వాళ్ళ కోసం, చూసినా దాన్ని ఎమ్మేలో నేనెలా వాడుకున్నానో అని ఆసక్తి వున్న వాళ్ళ కోసం… ఆ కథ… బ్రీఫ్ గా:
భారతంలో అర్జునుని పాత్ర చిత్రణ ఎలా జరిగిందో వివరించమని మా ఇంటర్నల్ పరీక్ష ప్రశ్న. నేను అర్జునుడు ఒక గొప్ప కాల్పనిక (రొమాంటిక్) పాత్ర అని పేర్కొన్నాను. అత్యంత ఆధునికులతో పోటీ పడేలా ఆ పాత్రను మహా భారత కర్త ఎలా చిత్రించాడో నా సమాధాన వ్యాసంలో నిరూపించాను. కౌబాయ్ సినిమాల్లో హీరోలు రెండు చేతులతో గురి తప్పకుండా పిస్తోళ్లు కాలుస్తారు. వెనుక ఎక్కడో వున్న మనిషిని గురి తప్పకుండా కాల్చి పడగొడతారు. ఆ హీరోలంటే ఆడపిల్లలు పడి చస్తారు. వాళ్ళందరూ ధీర లలితులుగానే వుంటారు. (ధీరత్వ వీరత్వాలు, స్త్రీత్వానికి దగ్గరగా వుండే లాలిత్యమూ కలగలిసి వుండే పురుషుడిని దీర లలితుడంటారు). అర్జునుని పాత్ర చిత్రణలో ఆ గుణాలన్నీ వున్నాయి. ఇలాంటి కాల్పనిక పాత్రను ఆంత ప్రాచీన కాలంలో సృష్టించడం గొప్ప విషయం అని రాశాను.
ఆ పరీక్షలో మాస్టారు నాకు చాల ఎక్కువ మార్కులు వేయడమే గాక, ఆ పేపర్ ను క్లాసులో అందరికీ చదివి వినిపించారు. అదొక్కటే కాదు. ఒక సారి క్లాసులో నేను బద్ధకంగా వొళ్ళు విరుచుకుంటూ కూర్చున్నాను. నేనలా కనిపించడం అది మొదటి సారి అయ్యుండదు. మాస్టారు క్లాసు అంతా అయ్యాక వెళ్తూ వెళ్తూ నన్ను తన గదికి పిలిచారు. వెళ్ళాను. నేను అలా వళ్లు విరుచుకుంటూ కూర్చోడాన్ని ఆయన ‘నిర్లక్ష్య వైఖరి’గా అర్థం చేసుకుని ‘నువ్వు మిగిలిన వారి కన్న స్పెషల్ అనుకోవడం వల్ల ఆ నిర్లక్ష్య వైఖరి ఏర్పడుతుంది’ అని మందలించారు. విచిత్రం ఏమిటంటే, ‘నేను స్పెషల్’ అని నేను అనుకుంటూ వుండిన మాట నిజమే. ‘ఔనండీ నేను స్పెషల్ అనే అనుకుంటున్నాను. క్లాసులో ఇక నుంచి జాగర్త తీసుకుంటాను’ అని చెప్పి వచ్చాను. ఆ రోజు ఆయనతో విభేదించినందుకు పెద్ద రిగ్రెట్స్ ఏమీ లేవు. నా నిజం నేను చెప్పాను. కాని, ఆయన మాటల్లో సత్యముంది. ఎవరైనా ‘నేను స్పెషల్’ అనుకోవడంలో చాల దుఃఖం వుంది. పరమ అనవసరమైన దుఃఖం. ఎవరూ స్పెషల్ కాదు. ఎవరూ ఏమీ కాదు. పిడికెడు మట్టి మాత్రమే. ఈలోగా చేయాల్సిన పోరాటాలన్నీ చేయాల్సిందే, అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క పిడికెడు మట్టి మాత్రమే.
ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి మాస్టారుకు మనసులో ప్రేమగా నమస్కరిస్తాను. తను చెప్పదలచిన మాటను అలా సున్నితంగా, నా అహం దెబ్బ తినకుండా చెప్పినందుకు. ఐడియాలజీ ముఖ్యమే, అది మనల్ని సమూహాలుగా నడిపిస్తుంది. కాని, మనుషుల అంతస్సులలో మానవ గుణాలు లేకపోతే ఆ వ్యక్తులు ఆ ఐడియాలజీలకు పనికి మాలిన భారమే అవుతారు. ఆ సంగతి నాకు చాల పాజిటివ్ గా గుర్తు చేసిన మరొక ఆరెసెస్ నిబద్ధుడు సుబ్రహ్మణ్య శాస్త్రి మాస్టారు. మొదటి వ్యక్తి మీకు గుర్తుండే వుంటారు, మా రమణ మూర్తి సారు.
ఇక మూడోది పూర్తిగా నాలోని హిపొక్రసీకి సంబంధించినది. మా సంస్కృతం మాస్టారు పేరు మధుసూదన షొడంగి. ఒరియా వారనుకుంటాను. తెలుగు సరిగ్గా రాదు. రఘు మహారాజు వచ్చాడు, ధేనువు వచ్చారు అనే వాడు. కుక్కగారు వచ్చారు అని కూడా అనే వాడాయన. తెలుగులో ఏది గౌరవ వాచకమో ఏది కాదో తెలియక. ఆడపిల్లలు మన్నించాలి, ఇక్కడొక సెక్సు జోకు గుర్తు చేసుకోకుండా వుండలేను. ఒక పుస్తకం అయిపోయి రేపు మరో పుస్తకం మొదలెట్టాల్సి వుంది క్లాసులో. అది కాళిదాసు ‘కుమార సంభవం’ కావ్యం. మధుసూదన షొడంగి మాస్టారు క్లాసులోంచి వెళ్లిపోతూ ‘రేపు కుమారసంభవం చేస్తాన’ని చెప్పి వెళ్లిపోయారు, మా నవ్వుల మానాన మమ్మల్ని వదిలేసి.
ఎమ్మే రెండో ఏడాది చివర్న అనుకుంటాను. ఎవరో చెప్పారు. ప్రొఫెసర్లను పర్సనల్ గా కలుసుకోడం మంచి దని, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు తల్చుకుంటే మేలు/కీడు చేయగలరని. ఆ సలహాను పాటించి ఒక్క మధుసూదన షొడంగి మాస్టారును మాత్రమే ప్రొఫెసర్ల కార్టర్స్ కు వెళ్లి కలిశాను. అలా ‘పైరవీ’ తరహా పని కడుపులో వుంచుకుని ఒక మనిషిని కలిసినప్పుడు ఏం చేయాలో ఎలా మాట్లాడాలో నాకు అప్పుడూ తెలియదు, ఇప్పుడూ తెలియదు. ఇంటికి వెళితే ఆయన చాల ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. నాకు శ్రమ లేకుండా అక్కడున్నంత సేపు ఆయనే మాట్లాడారు. అలా… మాట్లాడే పనంతా తామే చేసే వారంటే నాకు భలే ఇష్టం. ఆ పనికి వాళ్ళు బాగా అలవాటు పడి వుంటారు. మనం శ్రద్ధగా వింటున్నట్టు మొహం పెడితే చాలు. నిజంగా వినక్కర్లేదు. వేరుగా మన పగటి కలలు మనం కనొచ్చు. వాళ్లు తాము మాట్లాడిన దాని మీద ప్రశ్నలూ అవీ వేసి మనం నిజంగా వింటున్నామో లేదో తెలుసుకునే దుష్ప్రయత్నం చేయరు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడకుండా వుండడమే వాళ్ళకు ముఖ్యం. కవుల్లాగ. కవి గారి కవిత్వం అవతలి వాడికి అర్థమయ్యిందో లేదో ఎవడిక్కావాలి. వినేసి కాస్త మెరిసే కళ్ళతో చూస్తే అదే పది వేలు. వీలయితే రెండు లైన్లు కోట్ చేసి‘భలే’ అన్నా సరే. ‘భలే’ అని ఎందుకన్నావని అడగరు.
మొత్తానికి షొడంగి మాస్టారు దర్శనం నాకు వృధా పోలేదు. దాని వల్ల ఎమ్మేలో కొన్ని అదనపు మార్కులు వచ్చాయనే అనుకుంటాను. 🙂
అక్కడ వుండగా జరిగిన మరో విషాదం ఎన్నెస్ ప్రకాశ రావు మరణం. ఆదిలోనే నా మనసును తాకిన విషాదమది. ఎన్నెస్ పేరు వినగానే విశాఖ తెలిసిన లెఫ్టిస్టులకు రెండు విషయాలు గుర్తుకు రావాలి. మొదటిది మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైన విశాఖ విద్యార్ఠులు వేసిన చరిత్రాత్మక కరపత్రం: ‘రచయితలారా మీరెటువైపు’ అనేది. దాని వల్లనే రచయితలు తామెటువైపో నిర్ణయించుకుని వుంటారా? అలా ఏం కాదు గాని, ఒక చారిత్రక మలుపు వద్ద అతి ముఖ్య ఘటనల్లో ఆ కరపత్రం ఒకటి.
కరపత్రం వెనుకనున్న విద్యార్థులలో ఒకరు ఎన్నెస్ ప్రకాశ రావు. మొగ్గలోనే రాలిపోయిన మంచి కథకుడు. తన ‘కాగితం పులి’ అనే కథ సుప్రసిద్ధం. తన మరణానంతరం వెలువడిన కథల పుస్తకం పేరు కూడా అదే అనుకుంటాను. ఎన్నెస్ ప్రకాశ రావును ఒకటి రెండు సార్లు మాత్రమే చూశాను. చాల అందమైన మనిషి. తన మృదు స్వభావం కళ్లలో ప్రతిఫలిస్తుండేది. నేను చూసినప్పుడు తను వేసుకున్న మెరుపు పసుపు షర్టు మనసు మీద అచ్చు గుద్దినట్టుండిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు.
చదువు తరువాత విశాఖలోనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే వాడు. ప్రొఫెసర్ వేణుగోపాల రావు, కృష్ణక్క వాళ్ల కూతురు డాక్టర్ నళినిని పెళ్లి చేసుకున్నాడు. ఎన్నెస్ తో పరిచయమయ్యాక, తనను మళ్లీ మళ్లీ కలుసుకోవాలని చాల కోరుకున్నాను. బహుశా, మేము మొదటి సంవత్సరంలో వుండగానే అనుకుంటాను. ఎన్నెస్ ప్రకాశరావు కెమికల్ ఫ్యాక్టరీలో ఏదో ప్రమాదం జరిగి చనిపోయాడు. కెమికల్స్ ప్రమాదం. హాస్పిటల్ కు వెళ్దామని అనుకుని ఎందుకో వెళ్ల లేదు గాని, ఆ రోజు చాల బాధ పడ్డాం.
ప్రొఫెసరు గారి అబ్బాయి హరనాథ్, ఎన్నెస్ ప్రకాశ రావు… ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకొక విషయం అర్థమై వుంటుంది. ఎక్స్ ట్రీమ్ రైట్, ఎక్స్ ట్రీమ్ లెఫ్ట్…. రెండూ ఆనాడు యూనివర్సిటీలో చాల క్రియాశీలంగా వున్నాయి. ప్రొఫెసర్ గారి అబ్బాయి మొదటి దానికి, ఎన్నెస్ ప్రకాశరావు రెండవ దానికి ప్రతినిధులు. కులాల సమస్యలుండేవి. వాటిని మరిపించేంతగా రాజకీయ సమస్యలు మమ్మల్ని ఎంగేజ్ చేసేవి. నా మిత్రుడు కాశి రెడ్డి వెంకయ్య నాయుడి గుంపులో ఆరెసెస్ తో వుండే వాడు. నా యాక్టివ్ స్నేహితులు చాల వరకు వెంకయ్య నాయుడి కులం వాళ్ళే కాకపోతే కమ్యూనిస్టులు. పోలరైజేషన్ సైధ్ధాంతిక విషయాల మీదే ఎక్కువగా వుంటం వల్ల… కులం… ఇవాళ కనిపిస్తున్నంత బలంగా ఆనాడు కనిపించలేదేమో.
రాజకీయం, సాహిత్యం… ఇవి రెండే అప్పుడైనా ఇప్పుడైనా నా మానవ సంబంధాల గీటురాళ్ళు. ఈ దృక్కోణం, ఈ ఆలోచన పద్ధతి నాకు చాల మేలు చేసింది. చదవబుద్ధయితే చదువుకోడానికి చాల మంచి పుస్తకాలు దొరికింది కూడా అప్పుడే, ఆంధ్ర యూనివర్సిటీ హర్షవర్ధన హాస్టలు లోనే. చాల పుస్తకాలు చదివాను గాని, నా ఆలోచనల్ని మలుపు తిప్పిన పుస్తకాలు రెండు.
ఒకటి టెడ్ అలెన్, సిడ్నీ గోర్డన్ రాయగా… కంభంపాటి అనుకుంటాను అనువదించిన పుస్తకం: ‘గతి తార్కిక భౌతిక వాదం’. డయలెక్టిక్స్ గురించి అంతకు ముందు కాస్త ‘శ్రుత పాండిత్యం’ వుండింది. చదివి తెలుసుకోడం మొదటి సారి ఆ పుస్తకంతోనే. నా ప్రతి ఆలోచనకు, ఆ పుస్తకంతో పరిచయమైన ఆలోచన పద్ధతిని అనుసరించడం మొదలెట్టేశాను. ప్రతిదీ వొలిచిన ఆరెంజ్ తొనల్లా కనుల ముందు వెలిగేది. ఇప్పటికీ అంతే. తరువాత మారిస్ కాన్ఫోర్త్ పుస్తకం మరి కొన్ని పుస్తకాలు చదివాను గాని, టెడ్ అలెన్, గోర్డన్ డయలెక్టిక్స్ ను పరిచయం చేసిన తీరు మనసులో అలాగే వుండిపోయింది.
ఈనాడులో ఉద్యోగం చేస్తుండగా వికారాబాదు గోవర్ధన్ ఒక విద్యార్థిని తీసుకుని మా ఇంటికి వస్తే, ఆ విద్యార్థి చదువుకోడానికి ఆ పుస్తకం, కాళోజి ‘జీవన గీత’గా అనువదించిన ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ ఇచ్చాను. ఇవి తప్పకుండా వెనక్కి ఇవ్వాలని చెప్పి ఇచ్చాను. అవి తిరిగి రాలేదు. (గోవర్ధన్ ఆ తరువాత ‘ప్రతిఘటన పులుల’ పేరుతో కొన్నాళ్లు ఒక మిలిటెంటు గ్రూపు నడిపినట్టున్నాడు. జీవించి వున్నాడో లేడో). ఆ పుస్తకం (తెలుగు కాపీ) దొరికితే మరోసారి చూడాలని వుంది. విశాలాంధ్ర వాళ్లు ఆ పని చేస్తే బాగుండు.
ఆ రోజుల్లో నన్ను వూపేసిన రెండో పుస్తకం ‘రెక్క విప్పిన రెవల్యూషన్’. టామ్ నెయిర్న్, ఏంజిలో కాట్రోచ్చీ ‘బిగినింగ్ అఫ్ ది ఎండ్’ పేరుతో రికార్డు చేసిన 1968 ఫ్రెంచి విద్యార్థుల అద్భుత వుద్యమం. నా వుద్దేశంలో అతి తక్కువ ప్రాణ నష్టంతో ప్రపంచం మీద చాల ఎక్కువ ప్రభావం వేసిన వుద్యమమది. పుస్తకం విరసం ప్రచురణ. చలసాని ప్రసాదు ప్రత్యేక శ్రద్ధతో ప్రచురించినది. ఈ పుస్తకం మరో ముద్రణ కూడా పొందింది. మార్కెట్ లో అందుబాటులో వుంది. షాపులో దొరక్కపోతే విరసం వాళ్ళ నుండి తీసుకోవచ్చు. న్యారేటివ్ భాగాన్ని టామ్ నెయిర్న్, ఆవేశాత్మక భాగాన్ని ఏంజిలో కాట్రోచ్చీ రాశారు. కాట్రోచ్చీ రాసిన భాగాన్ని శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ గా అనువదించారు.
ఈ పుస్తకం నాకెంత ఇష్టమో చెబితే చలసాని ప్రసాదు, గిట్టని వాళ్ళు దాన్ని రెక్క ‘తిప్పిన’ రెవల్యూషన్ అన్నారులే అని నవ్వేశారు. ఆ సంగతేమో గాని దానిలో ఒక్కొక్క స్లోగన్ ఒక మహా కావ్యం. ‘రాళ్ల వానలో నేనింకా బతికే వున్నా’ నని ఒక విద్యార్థి గోడ మీద బొగ్గుముక్కతో రాసిన నినాదం ఒక్కటి చాలదా? మేము బూర్జువా పిల్లలం అని నగ్న భాషలో యవ్వనం పలవరించిన సందర్భమది.’ మాకు అన్నం కావాలి, పువ్వులు కూడా కావాలి’ అన్నారు వాళ్ళు. ఎలా ప్రేమించకుండా వుంటారు ఎవరేనా ఆ పిల్లల్ని. పోనీ, దానికి నాయకత్వం వహించిన కాన్ బాందీ తదితరులు రాజకీయ నాయకులై పోదామని అనుకున్నారా? అలాంటి ‘ప్రమాదం’ లేకుండా వుద్యమానంతరం దాన్ని ఎలా రికార్డు చేయాలో అలా రికార్దు చేసి మరీ కనుమరుగయ్యారు. చనిపోలేదు. నిజంగా జనంలో కలిసిపోయారు. ఒక గొప్ప ఇంపాక్ట్ మిగిల్చి.
సరిగ్గా అదే సమయంలో చెలరేగిన అమెరికా వ్యతిరేక వీత్నాం సమరం, చైనా సాంస్కృతిక విప్లవం, ఇండియాలో నక్సల్బరీ, జేపీ టోటల్ రెవల్యూషన్…. పాలకులు ఎమర్జెన్సీ వంటి చర్యలు చేపడితే గాని బతకలేని పరిస్టితి కల్పించిన ఆ ప్రపంచ విజృంభణలో ఒక పెను కెరటం … 1968 ఫ్రెంచి విద్యార్థి వుద్యమం. ఆ వుద్యమం మీద తారిఖ్ అలీ రాసిన ‘స్ట్రీట్ ఫైటింగ్ ఇయర్స్” పుస్తకాన్ని నేను తరువాతెప్పుడో చదివాను, అదీ, ‘ఈనాడు’ లైబ్రరీ నుంచి.
‘రెక్కవిప్పిన రెవల్యూషన్’ లోని వీధిపోరాటాలు… విద్యార్థుల నుంచి బయల్దేరి శ్రామిక శ్రేణులకు విస్తరించిన వీధి పోరాటాలు.. చివరికి పోలీసులకు కూడా పాకి … తొందరగా సమస్యల్ని పరిష్కరించండి, లేకుంటే మీకు మా విధేయత ఇలాగే వుంటుందని అనుకోకండని అధ్యక్షుడు డిగాల్ ను ఆయన రియట్ పోలీసులు హెచ్చరించే దాక వెళ్లిన వీధి పోరాటాలు ….. అవే… ఈనాడు జరగాల్సిన పోరాటానికి గొప్ప నమూనా అవుతాయని, అందువల్ల ఇదింకా… ‘రెక్క విప్పు తున్న రెవల్యూషనే’…. అని అనుకుంటాన్నేను. ఆ కుర్రవాళ్ళ కోసం ఎదురు చూస్తూనే వుంటాను. ఈ మాట చెప్పడానికే 1990కి ముందు రాసిన ఒక పద్యం ‘1968’ ఇదిగో ఇక్కడ:
//1968//
ఔను, ఆ కుర్రాడే, నరమాంసం భోంచేసే పువ్వుల రేకులు తుంచి నడి వీధుల్లో వెదజల్లిన వాడే. వాడి కోసమే ఈఫిల్ గోపురం దుఃఖ భారంతో వంగిపోతోంది. ఆనాడు నా నుదుటి మీదొక నినాదం రాసి వెళ్ళాడు. ‘రాళ్లవానలో నేను ఇంకా బ్రతికే ఉన్నాన’ని. ఔ న్నిజం. రాళ్ళవానలో ఇంకా బ్రతికుండడమే ఘన విజయం. ఆ కుర్రాడు ఇప్పుడు లేడు. ఇంకెవరెవరో ఉన్నారు. వాడు లేడు. వాడు లేనప్పుడు ఉబ్బిన మాటలే గాని, పాటలుండవు. కుంటి నడకలే గాని, బాటలుండవు. ఓపెన్ గాయాలే గాని, గేయాలుండవు.
నేనిప్పుడు రాళ్ళవాన గురించి పలవరించాలి
నెల నెలా జీతం రాళ్ల వాన గురించి
పోలీసు దెబ్బల్లాంటి తూనిక రాళ్ళ వాన గురించి
తిరిగి తిరిగి గుండెల్లో గుచ్చి తీసి గుచ్చి తీసి
గుచ్చి తీసే దినాల వాన గురించి
దీనోచితంగా విపపించాలి
ఔన్నిజమే. నిప్పుల వానైతే బాగుండేది. భూగోళం పుఠం పెట్టిన బంగారమయ్యేది. అమాయకుల నెత్తుట తడిసి అగ్ని గుండం ఆరిపోయింది. భూమి తుప్పు పడుతోంది. ఫేరో శవం వద్ద కిరాయి దుఃఖిత వలె దొంగేడ్పులు ఏడ్వడమెందుకు? ఒక చెట్టైనా లేని మైదానంలో నెత్తురోడుతూ పరిగెడుతూ పరిగెడుతూనే ఈ బాధను రికార్డు చేస్తాను.
కులమతాల జీమూతాల్ని తిట్టుకోడానికి
నేను ముస్లిమునూ కాను దళితుణ్నీ కాను
కన్న వాళ్లిచ్చిన కవచకుండలాల్ని
పిలిచి మరీ దానమిచ్చిన సూత పుత్రుణ్ణి
యురేకా అనడానికి ఏమీ లేకున్నా
నడివీథుల్లో నగ్నంగా పరిగెడుతున్న వాణ్ని
నేనొక నిఖార్సైన నిరాయుధ శరీరాన్ని
రాళ్ళవాన గురించి మాట్లాడ్డానికి
బహుశా నేనే తగిన వాణ్ణి
బాబ్రీ మసీదు గుమ్మటం మీద
గంతులేసే వాళ్ళ మతంలో పుట్టిన వాణ్ణి
చుండూరు నిందితుల శాఖోపశాఖల్లో
బంధువుల కోసం వెదుక్కోవలసిన వాణ్ని
ఒక స్త్రీకి మొగుణ్ని
ఒక పిల్లకు పిత్రుపాదుణ్ని
రాళ్లవానలో ఎంత ఎర్రబడితే
అంతగా ఆనందించాల్సిన వాణ్ని
అయితేనేం నాకూ ఒక అస్తిత్వముంది
నాకూ ఒక వీరగాథ వుంది
పే స్లిప్ గెడకర్ర మీద
నెల నుంచి నెలకు
పోల్ వాల్ట్ చేస్తున్న మొనగాణ్ని నేను
దేహాన్ని వేవిధాలుగా మెలికలు తిప్పుకుని
ఏ గుండుసూది మొన మీదైనా సర్దుకోగల కామరూపుణ్ని
ఆకలేసినా దాహమేసినా చలించక
తిప్పాల్సిన గానుగ పూర్తిగా తిప్పే వరకు
నెమరేయడానికి నోరు తెరవని స్థిర చిత్తుణ్ని
అన్ని రసాలూ అభాస అయ్యే కావ్యానికి
నేనే ధీరోదాత్త నాయకుణ్ని, గాయకుణ్ని
తెలిసింది కదూ. నేను నా గురించి మాట్లాడడం లేదు. రాళ్ల వాన గురించి మాట్లాడుతున్నాను. పాటకు రాళ్లు ద్రవించవని తెలుసు. ఆర్తనాదం విని ఆ కుర్రాడొస్తాడని. నినాదమై గుచ్చుకుని మాయమైన వాడు మళ్లీ సంభవించే వరకు నేను రాళ్ల వానను రోదిస్తూనే ఉంటాను.
(‘అబద్ధం’ (1987-1992). పేజెస్ 35-37).
(వచ్చేవారం కలుద్దాం విశాఖ లోనే)

 
Hecchar Ke's photo.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s