సుబ్బారావ్ సుబ్బారావ్ సుబ్బారావ్

స్మృతి 17

మొదటి వాక్యం: మీకు, యాకూబ్ కు, కపిల రామ్ కుమార్ కు, అందరికీ..’సారీ’, చెప్పా పెట్టకుండా పని ఎగ్గొట్టినందుకు.
కారణం చెప్పకపోవడానికి కూడా కారణం లేదు.
ప్రతిదీ ఇంతే. హేతువాదమని, కార్యకారణ సంబంధమనీ ప్రగల్భిస్తానా! నా చేసే పనులకు, చేయని పనులకు కారణం ఏమీ వుండదు.
కాసేపు బీరువా అడుగున చీకట్లోకి, కాసేపు ఏదో పసిగడుతున్నట్టు మీసాలు కదిలిస్తూ మంచం కిందికి… వెళ్లే బొద్దింక… అలా వెళ్లడానికి ఏదో కారణం వుండే వుంటుంది. బువ్వ… సెక్సు… భయం… ఏదో. నేను చేసే/చేయని పనులకు చాల సార్లు నాకు తెలిసిన కారణం ఏదీ వుండదు. పిచ్చి వాళ్ళు మేలు నా కన్న.
లొయోలాలో బిఎస్సీ మూడో ఏడాది పరీక్షలు ఎగ్గొట్టడానికి కారణం భయం అని ముమ్మారు చెప్పి మిమ్మల్ని అదరగొట్టానా?! ఆ భయం ఎందుకూ… అంటే తెలీదని అన్నానా? నా యవ్వారం అన్నీ అంతే. తెలీదు. తెలీదు కదా అని వురుకుంటానా? వూరుకోను.
ఏడాది పాటు మా జయమ్మకు సైటు కొట్టడం వినా ఏమీ చేయకుండా నందికొట్కూరు రోడ్ల మీద గడిపి, ఆ ఏడాది చివర, చివరాఖరిగా విజయవాడ వెళ్లి, రవీద్ర రెస్టారెంటు సింగిల్ గదిలో ఆ వూరికి పరమ ఆగంతకుడిగా అద్దెకు వుండి, పరీక్షలు రాసి వచ్చేశాను, అప్పుడే అత్తారింటి నుంచి వచ్చి వాళ్లింటి ముందు కూర్చుని చెరుకు గడను చీల్చి నముల్తున్న నా మొదటి తిరస్కృత వాంఛ నుంచి ఒక వయ్యారపు సానుభూతి నవ్వును కూడా స్వీకరించి.
ప్రాణ మిత్రుడు తమ్మినేని పుల్లయ్య అప్పటికే విశాఖపట్నంలో బాటనీ ఎమ్మెస్సీ ఒక సంవత్సరం పూర్తి చేశాడు. నేను వెళ్లి తెలుగెమ్మేలో చేరాను. వెంటనే హాస్టల్లో ఎందుకు చేరలేదో గుర్తు లేదు గాని, నా మొదటేడాది మొదట కొద్ది నెలలు నేనూ పుల్లయ్య చిన వాల్తేరులో అద్దె గదిలో వున్నాం. మొదట ఆ కొద్ది రోజులు తప్ప ఎక్కువగా హర్షవర్ఢన హాస్టల్ లో వున్నాను. చిన వాల్తేరు. ఇంగ్లీషు స్పెల్లింగు వల్ల దాన్ని చైనా వాల్తేరు అని చదివి, అరే ఇక్కడ చైనా వాళ్ళున్నట్టున్నారు, వాళ్ళ వూళ్లో వాళ్లు విప్లవం ఎలా చేశారో అడిగి తెలుసుకోవాలని ఆమాయకంగా అనుకోడం బాగా గుర్తుంది.
అది కాదు. నా అమాయకత్వానికి పరకాష్ఠ. ఎమ్మేలో ఫ్రెషర్లమయిన మమ్మల్ని ఆహ్వానించడానికి మా సీనియర్లు జరిపిన సభలో నేను మాట్లాడాను? ఏం మాట్లాడానో వూహించగలరా? ఇంపాజిబుల్. మీరూహించ లేరు. ఛాలెంజ్. తరువాత వాక్యాలు చదవక ముందు, మీ ఊహను కాగితం మీద రాసి వుంచుకోండి, నేనేం మాట్లాడి వుంటానో. తరువాత వాక్యాలు చదివాక, మీ వూహ కరెక్టయితే మీకు చాల పెద్ద బహుమతి.
ఆ సభలో మొదట సీనియర్లు మాట్లాడారు. తరువాత మా ఫ్రెషర్ల వంతు. మా శ్రీనివాస రెడ్డి వెళ్లి మాట్లాడిన మాటల్లో ‘మాచే యొనరించబడు దొసంగులను మన్నించగలరు’ అనే వాక్యం గుర్తు చేసుకుని ఎన్ని సార్లు నవ్వుకుంటానో ఇప్పటికీ. ఆ తరువాత నేను వేదిక ఎక్కి చెప్పిన మొదటి మాట ‘నేను చదువుకోడానికి రాలేదు’ అనేది. రెండవది ‘నేను విప్లవాలు చేయడానికి వచ్చాను’ అనేది. ‘తెలుగెమ్మేలో చదవడానికి ఏముంటుంది, పెద్ద క్యాంపస్ లో నా వయసు వాళ్లతో కలవడం, విప్లవాలు ఎలా చేయాలో మాట్లాడడం కోసమే నేను వచ్చాను’ అని మాట్లాడాను. అలాంటి వారితో స్నేహం చేయడానికి, కలిసి పని చేయడానికి వచ్చానని చెప్పాను.
నా మాటలు విన్న వాళ్ళు అప్పటికే నేను ఏదైనా అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ మనిషని అనుకుని వుంటారా? ఏమో. నా క్లాసుమేట్లు అత్తలూరి నరసింహ రావు, ప్రేమ సాగర్ అయితే అలా అనుకుని వుండరు. నిజంగా అలాంటి సంబంధాలు, అనుభవాలు వున్న వాడు అలా మాట్లాడడని తెలుసుకోడానికి తగినంత కంటె పిసరంత ఎక్కువే అనుభవాలున్న వాళ్లు అప్పటికే వాళ్లు.
ప్రేమ సాగర్ ది అనంతపురం జిల్లాలో ఏదో ఒక వూరు. అప్పటికే ఒకటి రెండు విప్లవకవిత్వాలు రాసి ఇతర్లతో కలిసి ‘రక్త గానం’ వంటి కవితా సంపుటాలలో పాల్గొన్న అనుభవజ్ఞుడు. అత్తలూరి నరసింహ రావు అప్పటికే విరసం కార్య వర్గ సభ్యుడు. ఆ గుంపులోనే తరువాత్తరువాత నాకు స్నేహితులైన తేళ్ల సత్యవతి గారు, మా గాజు బొమ్మ సుజాత, మా టీచరమ్మ రజని వుండి వుంటారు. వాళ్లందరు నా వాగాడంబరాన్ని ఎలా ఎంజాయ్ చేసి వుంటారో ఆ రోజు. 🙂
ఫ్రెషర్స్ రోజు ఆ ఇంక్రెడిబుల్ ‘ప్రసంగ’మే కాదు. నాదంతా ఎప్పటికప్పుడు మనసు చెప్పిన మాట వినడమే. దాన్ని కాదని పోయే శక్తి నాకు లేదు. కాదని పోవడానికి అవసరమైన స్థిర చిత్తం లేదు. స్నేహాల్లోనూ అంతే. నాకు నేను నాకు కావలసిన స్నేహం చేసుకోలేను. అలా చేసుకున్న స్నేహం ఒక్కటీ నాకు లేదు. అవసరమై చాల కాసేపు చేసిన స్నేహం ఒక్కటి కూడా లేదు. అలా కావాలని వదులుకున్నది కూదా లేదు. ఏదైనా కలిసి రావలిసిందే, పోవలసిందే; మంచైనా చెడైనా.
నా వాక్- లౌల్యం వల్ల నాకు మంచి స్నేహితులుండరని ప్రేమసాగర్ ఎన్ని సార్లు చెప్పాడో, విన్నానా? నేనేదో చమత్కారంగా మాట్లాడి చాల ఎంటర్టైన్ చేస్తానని కాదు. అదీ వుంటుంది ఎప్పుడేనా. ఉదాహరణకు ప్రేమ సాగర్ తో ‘నీ పేరు ఇంగ్లీషులో బాగుంటుంది’ అన్నానొక సారి. ‘ఏం’ అని ఆడిగితే, ‘ఇంగ్లీషులో నీ పేరు prema sagar. అంటే pre ma sagar. మొదటి సంవత్సరం (pre) ఎమ్మే (ma) సాగర్’ అని అనే వాడిని. అది సరే. అవతలి వాళ్ళు నొచ్చుకుంటారని చూడాకుండా శ్లేష వుపయోగించి భంగ పడుతుంటాను ఇప్పటికీ. శ్లేష అనే కాదు. కాస్త చమక్కుగా, ఆకర్షణీయంగా కనిపించే ఎక్స్ప్రెషన్, విషయం ఏదైనా… దాని పర్యవసానాలు చూడకుండా వాడేసి, మళ్లీ ‘నిజాయితీ’ వెనుక దాక్కుంటూ వుంటాను. నిజాయితీ, లౌక్య రాహిత్యం రెండూ ఒకటి కావు.
ప్రేమ సాగర్ ఇప్పుడు బేతంచెర్ల దగ్గర ‘సిమెంటు నగర్’ కాలేజీలో పని చేస్తున్నాడు. నిరుడొక ఉత్తరం కూడా రాశాను. కలుసుకోడం మాత్రం విశాఖ వదిలాక మళ్లీ లేదు.
సాగర్ కాకుండా మరొక స్నేహితుడి గురించి ఇక్కడే చెప్పాలి. క్లాసులో మొదట్లోనే ఒక రోజు రీడర్ సుబ్రమణ్య శాస్త్రి గారు స్టూడెంట్ల స్వీయ పరిచయ కార్యక్రమం పెట్టారు. ఎవరిని వాళ్ళు పరిచయం చేసుకోండి అన్నారు. అందరితో పాటు నేనూ వూరు, పేరు చెప్పాను. క్లాసు అయిపోగానే మా కాశి రెడ్డి వచ్చి స్నేహం చేశాడు. తను నాతో స్నేహం చేయడానికి నా పూర్తి పేరు వల్ల తెలిసిన కులం వినా మరే కారణం లేదు. ఆ రకం స్నేహం నాకు ఇష్టం లేదు. అలాగని, తను తన ఉద్దేశం నాకు చెప్పిన తరువాత కూడా తనతో స్నేహం మానేయ లేదు. ఎన్నికలప్పుడు నేను దళిత నాయకుడు అగస్టీన్ కు, తను ఎబివిపి నాయకుడు (ఇప్పటి కేంద్ర మంత్రి) వెంకయ్య నాయుడుకు ఓట్లేశాం. అయినా ఇద్దరం సన్నిహిత స్నేహితులుగానే వున్నాం. అలా వుండడంలో డెసిషన్ తనదే, నాది కాదు. మొన్న ఇక్కడికి రావడానికి ముందు కూడా తను పని చేసి రిటైరైన తిరుపతి నుంచి ఫోన్ చేశాడు.
కాశి రెడ్డితో ఒక ఇంటరెస్టింగ్ ఎపిసోడ్ చెప్పాలి. చెప్పడానికి మళ్లీ మళ్లీ సందర్భం వస్తుందో రాదో.
అప్పుడు ఇప్పటి కంటే సన్నగా వుండే వాడిని. కాస్త లావయితే బాగుంటానని ఒక భ్రమ వుండేది. లావు కావడానికి… నా అభిమాన నటి జమున బంగాళ దుంప చిప్స్ తినేదని విజయ చిత్రలో చదివి ఆ ప్రయత్నం కూడా చేశాను. ఒకరోజు కాశి రెడ్ది చెప్పాడు ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగితే లావవుతారని. కొన్నాళ్ళ తరువాత తను నా గదికి వచ్చాడు. అప్పుడే నేను సీసా అల్మెరాలో పెడుతున్నాను. ‘ఏం చేస్తున్నావు’ అని ఆరా తీసి, సంగతి తెలుసుకుని పడి పడి నవ్వాడు. సంగతేమిటంటే, నేను ఒక క్వార్టర్ బాటిల్ మెక్ డొవెల్ విస్కీ కొని తెచ్చుకున్నాను. దాన్ని రోజూ అదే సీసా మూతతో ఒక మూత తాగి, సీసా మళ్లీ జాగర్త చేసే వాడిని.
అప్పుడు వివరించాడు మందు కొట్టడమంటే ఏమిటో. ఆ మొదటి బాల్య చేష్ట ఆ తరువాత యవ్వన చేష్టగా మారింది. ఒక రోజు జగదాంబ సెంటర్ లోని అలంకార్ హోటల్ కి వెళ్లాను. నాన్ వెజ్ హోటల్. విశాఖలో ఇప్పుడా హోటల్ వుండే అవకాశం లేదు. ఉన్నా నేను చూసిన, కూర్చున్న రూపంలో వుండదు. ఆ హోటల్లో గోడ వెంట చిన్న చిన్న క్యూబికల్స్ వుండేవి, కర్టెన్ దాపుగా వుండేది. అడిగిన వారికి బేరర్ బయటి నుంచి ‘మందు’ తెచ్చి పెట్టే వాడు. అందులో కూర్చుని పరోటా చికెన్ కర్రీ, ఒక గోల్దెన్ ఈగిల్ బీర్. మొదటి సారి నిజంగా స్వర్గం. ఆ సాయంత్రం నా కయిన ఖర్చు గుర్తుంది. రెండూ కలిపి.. పది రూపాయలు.
మొదట బీరు తాగే సమయానికి నా లోన్ స్కాలర్ షిప్ డబ్బు వచ్చి వుండింది. పదో తరగతిలో ఏ డెభ్భై అయిదు రూపాయలతోనో మొదలైన స్కాలర్ షిప్ బిఎస్సీ లో ఏడాదికి ఏడొందలయ్యింది. నాన్నకు అది మాత్రమే తెలుసు. ఎమ్మేలో అది తొమ్మిది వందలైన సంగతి తనకు చెప్ప లేదు. మిగతా రెండొందల మీద మనదే హక్కు. ఇంకేం, అలంకార్ హోటల్లో వీలు చిక్కినప్పుడల్లా చికెన్ కర్రీ, గోల్దెన్ ఈగిల్ బీరు. ఎమ్మే అయిపోయి విశాఖ వదిలే దాక వారం వారం అదొక పర్సనల్ రిచువల్ నాకు.
ఈ సంగతి ఎప్పుడూ కాశి రెడ్డికి చెప్పలేదు. ఒక లెఫ్టిస్టు విద్యార్థిగా అతడి ముందు లెఫ్ట్ పరువు కాపాడడానికే అది రహస్యంగా వుండిపోయింది. అది తప్ప తనతో నాకు రహస్యాలేం వుండేవి కావు. సెక్సు కబుర్లు, ప్రేమ కబుర్లు అన్నీ మాట్లాడుకునే వాళ్ళం.
ఇప్పటికీ ఎవరేనా నాతో మతం, కులం వంటి కారణాల్తో స్నేహం చేసినా, నేను తమలా వుండాలని కోరనంత వరకు, ఆయా విషయాల్లో నా నోరు కట్టేయనంతవరకు… వాళ్ళు నన్నెంత ఇష్టపడతారో అంతగా నేనూ ఇష్టపడతాను. కులం వేరు స్నేహం వేరు అని మాత్రమే కాదు, ఐడియాలజీ వేరు స్నేహం వేరు అని కూడా అనుకుంటాన్నేను. ఒక దానికోసం ఒకటి వదులుకోను. ఒకటి మరో దాని బలి కోరితే… అప్పుడు ఏది నాకిష్టం అని కాకుండా… ఏది సరైనది అని ఆలోచిస్తాను.
సి వి సుబ్బారావు పేరు విన్నారా? సివిల్ లిబర్టీస్ తో పరిచయం వున్న మిత్రులకు ఈ పేరు తెలిసే అవకాశం వుంది. తను అప్పటికి విశాఖ ఎవిఎన్ కాలేజీలో బియ్యే చివరి సంవత్సరం చదువుతుండే వాడు. జడ్జి గారి అబ్బాయి. కాలేజీలో చలసాని ప్రసాదు సుబ్బారావు వాళ్ళకు లెక్చరర్. యూనివర్సిటీలో ప్రసాదు చొరవతో జరిగే మార్క్సిస్టు స్టడీ సర్కిల్ కు వచ్చి… అనుకుంటాను…. సుబ్బారావు నాకు పరిచయమయ్యాడు. పరిచయమైన మరుక్షణమే విడదీయరాని స్నేహితులమయ్యాం. (నా గోల్డెన్ ఈగిల్+ కోడి కూర యవ్వారమయితే తనక్కూడ తెలీదనుకోండి).
విశాఖలో ఇద్దరం కలిసి గడిపిన కాలం నాకొక అద్భుతం. ఇద్దరం బీచ్ కి వెళ్లి గంటల తరబడి గడిపే వాళ్ళం. ఒక సారి ఎవరో ఫారిన్ జంట బీచ్ రోడ్లో నడుస్తున్నారు. మాకు ఆసక్తి కలిగించారు. వాళ్ళది ఏ దేశం, వాళ్ళతో మాట్లాడితే ఏమంటారు అని మాకు ఆసక్తి కలిగింది. నేను అడగనన్నాను. ఇంగ్లీషులో తడబడతానన్నాను. సుబ్బారావు కాస్త పొట్టి. అప్పుడు మరీను. తను తన తెల్ల షర్టు, తెల్ల పల్చని ప్యాంటూ. ఆ ఎత్తరుల ముఖాల్ని ఎక్కడో కింది నుంచి దృష్టి సారిస్తున్నట్టు పైకి చూస్తూ తను ఏదో అడిగాడు. వాళ్లాయనతో మాంచి ప్రేమ కబుర్లలో వుందో ఏమో, ఆమె చాల చిరాగ్గా, కసురుకుంటున్నట్టుగా చూసి వెళ్లింది. సుబ్బారావు జారిపోతున్న తన డిగ్నిటీని పైకి లాక్కుంటూ నాతో ఏదో చెబుతూ నడిచాడు. పాపం సుబ్బారావు.
పగళ్లు కాదు. రాత్రులు మా వీరంగం. సుబ్బారావు ఏ సాయంత్రమో వచ్చే వాడు యూనివర్సిటీకి. అప్పటికి యూనివర్సిటీ గోడల మీద ‘మార్క్సిజం మేధావుల మత్తు మందు’ అంటూనో, మరొకటో ఎ బి వి పి వాళ్ళ నినాదాలుండేవి. వాళ్ళ సృజనాత్మకతను మనసారా మెచ్చుకుంటూ తిరిగే వాళ్ళం. మరి మనమేం చేస్తున్నాం అని మమ్మల్ని మేం ప్రశ్నించుకునే వాళ్ళం. మా వంటి ఎక్స్త్రీమ్ లెఫ్ట్ వాళ్ళు అక్కడ తక్కువ. ప్రేమ సాగర్, అత్తలూరి ‘బాగా పెద్ద మనుషులు’, ఇలాంటి పనులకి రారు. సో, మేమే కొన్ని పోస్టర్లు రాసుకునే వాళ్లం. సుబ్బారావు మరెక్కడి నుంచో రాసిన పోస్టర్లు తెచ్చే వాడు. ఎక్కడి నుంచి అనేది నాకు తెలీదు. (అది వేరే పాలిటిక్స్). ఇద్దరం బయల్దేరి యూనివర్సిటీ గోడల మీద రాయడం, పోస్టర్లేయడం. అదే వూపులో గాని, ఆ తరువాత రాత్రి గాని, పోస్టర్లు పేస్ట్ పట్టుకుని వూళ్లోకీ వెళ్ళే వాళ్ళం.
తెల వారు ఝాము దాకా రోడ్ల మీదే. తిరిగి తిరిగి, తిరిగి జగదాంబ సెంటర్ కు చేరే వాళ్ళం. అప్పుడు అక్కడ ఒక కొట్టం హోటల్ వుండేది. తెల్లవారు ఝామున బాగా ముందే తెరిచే వారు. దాని పేరు ‘శర్మా పంజాబ్ హోటల్’. కూర్చోడానికి టేబుళ్లు, కుర్చీలు మామూలే. టీ మాత్రం ధాభాల పద్డతిలో పెద్ద గాజు గ్లాసుల్లో ఇచ్చే వారు. తెలవారు ఝాము చలి చలి చీకటి. పని చేసి వచ్చి, వేడి వేడి తేనీరు. నేను గబ గబ తాగితే సుబ్బారావు కోప్పడే వాడు. టీ తాగేది టీ తాగడం కోసం కాదు. ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క సిప్ తాగాలి అని చాల తన్మయత్వపు ముఖం పెట్టి చెప్పే వాడు. అప్పుడు కాదు గాని, హైదరాబాదు వచ్చాక ఇరానీ హోటళ్లలో టీని అలా ఎంజాయ్ చేశాను, స్నేహితులతో కలిసీ, ఒక్కడినీ.
సుబ్బారావుతో స్నేహం విశాఖతో అయిపోలేదు. నేను హైదరాబాదు వచ్చాక తను డిల్లీ యూనివర్సిటీలో టీచర్ అయ్యాడు. లూసున్ జయంతి సభలకు డిల్లీ వెళ్లి తనను కలిశాను. అదే హడవిడి సుబ్బారావు. అదే కొత్తగా ఏమైనా చెబుదామని రావి శాస్త్రి భాషా విరుపులతో ఆరాటపడే సుబ్బారావు. అదే సూత్రాలు చేయడానికి ఉత్సాహ పడే సుబ్బారావు.
డిల్లీలో మా కబుర్ల మధ్య విప్లవోద్యమం గురించి తను ఒక మాట అన్నాడు: ‘లెటజ్ నాట్ పే ఫార్ అవర్ ఇగ్నొరెన్స్’. అన్నాడు గాని ఆ మాట స్వారస్యాన్ని తను అర్ఠం చేసుకోలేదని నా అనుమానం. కనీసం, ఆ అవగాహనను దాని లాజికల్ కంక్లూజన్ కు తీసుకెళ్లలేదు. తీసుకెళ్లాల్సి వుండింది. ఆ పని చేసి వుంటే తను వున్న స్థలం (యూనివర్సిటీ) రీత్యా, ఇతర అవకాశాల రీత్యా తన నుంచి చాల కాంట్రిబ్యూషన్ వుండేది. చాల మందిమి మన అజ్ఞానానికే గాక, మొహమాటాలకు కూడా బలవుతున్నాం. దేన్నైనా తమ బాగు కోసం వుపయోగించుకోగల తెలివి పరుల మధ్య బతుకుతున్నప్పుడు, ఇలాంటి మంచి మనసు మొహమాటాలకి కూడా పెద్ద మూల్యమే చెల్లించాల్సి వుంటుంది.
విశాఖలో ఎమ్మేలో వుండగా విరసంలో సభ్యుడి మాదిరిగా, అంతకంటె కాస్త ఎక్కువగానే యాక్టివ్ గా వున్నాన్నేను. అక్కడ ప్రతి యూనిట్ సమావేశంలో పాల్గొన్నాను. పాటల్లో చిందులు తొక్కాను. ఆ ఆనందాలు తరువాత చెబుతా. సుబ్బారావుకు సంబంధించి ఒక మాట చెప్పాలిక్కడ. తను ఆ యూనిట్ కన్వీనర్ అనుకుంటాను (?). విరసం కార్యవర్గ సభ్యుడు కూడా అనుకుంటాను. చివర్లో నాకు విరసం సభ్యత్వం కాగితం ఏదో ఇవ్వబోయాడు. ఇవ్వబోతూ, ‘అక్కడికి వెళ్ళాక నువ్వు మరో పార్టీకి చెయ్యి ఎత్తవు కదా?’ అని అడిగాడు.
అలాంటి ఇబ్బందికరమైన ప్రశ్న నాకెదురవుతుందని వూహించి వుండలేదు. ‘ఇప్పుడు నేను ఏ పార్టీ అనుకుంటున్నావు. ఇప్పుడు నేను ఏ పార్టీ కాదు. నిర్ణయించుకోలేదు. విప్లవం అనివార్యం, గొప్పది అని మాత్రమే నిర్ణయించుకున్నాను. ఆ పని సరిగ్గా ఎవరు చేస్తారు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.” అన్నాను. తను ఏమీ అనకముందే మళ్లీ కల్పించుకుని, “అయితే, వర్గశత్రు నిర్మూలన అనేది విప్లవానికి మంచి ఎత్తుగడ అని మాత్రం నేను అనుకోడం లేదు. అది కాకుండా ఏ పార్టీ అనేది నేను తరువాత తేల్చుకోవాలి. ఇప్పటికి, నేను విరసం వాడిని” అని కాగితం కోసం చేయి చాపాను. కాగితంలో వివరాలు పూర్తి చేసి సుబ్బారావుకు ఇచ్చాను. అది ఏమయ్యిందో తెలీదు.
తరువాత ఎప్పుడో నేను విరసం సభ్యుడినయ్యాను. ఆ కాగితం ద్వారా కాదు. సుబ్బారావు తరువాత హైదరాబాదుకు వచ్చి చాల రోజులు వున్నాడు. నేను మునుపటి స్నేహం కోసం నా లోపల నేను కొట్టుకునే వాడిని. తను ఎప్పుడేనా కలిసే వాడు. కలిసినప్పుడు, విమోచన ఆఫీసులో కలిసినప్పుడు కూడా తను మా జయమ్మతో మాట్లాడినంత స్నేహంగా కూడా నాతో మాట్లాడే వాడు కాదు. అయినా, నాకు చాల సంతోషంగా వుండేది తనను చూడడం.
విరసం హైదరాబాదు యూనిట్ మీటింగ్ లో… నామిని కి సంబంధించి చర్చ వస్తే… అప్పటికి నేను ‘ఉదయం’లో వుద్యోగంలో చేరాను…. నేను నామినిని సమర్థించినందుకు, ఆ విధమైన వైవిధ్యం వుండాలని అన్నందుకు… నా మీద ఇంతెత్తు ఎగరడం తన గురించి నా చిట్ట చివరి జ్ఞాపకం. ఆ తరువాత తను పౌరహక్కుల విషయమై యాక్టివ్ గా వుండడం గట్రా తెలుసు.. కలుసుకున్నది చాల తక్కువ.
ఇప్పుడు కొందరు స్నేహితుల గురించి వున్నట్టే… ఎందుకిలా అనే ఆవేదన మాత్రం సుబ్బారావు గురించి వుండేది. ఉంది. తను హార్ట్ అటాక్ తో చనిపోయాడని తెలిసినప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక, నాలోనే దుఃఖ పడి నాలోంచి నేను రగిలిన మంచు మంట ఈ పద్యం:
//వెన్నెలపక్షీ ఎప్పుడొస్తావు మళ్లీ//
ఎప్పుడు కలుద్దాం మళ్లీ మనం
టి ఎస్ ఎలియట్ పిడికిట్లోని మట్టిలో
జీవుని వేదనను ఎప్పుడు శ్లేషిద్దాం మళ్లీ
హర్ష వర్ధన హాస్టల్ టెర్రెస్ మీంచి
డాల్ఫిన్ ముక్కు మీద వాలిన
వెన్నెల పక్షికి కలల గింజలు
ఎప్పుడు చల్లుదాం మళ్లీ మనం
రెవల్యూషన్ రెక్కలు కట్టుకుని
సోర్బాన్ కుర్రాళ్ళ మధ్య ఎప్పుడు వాలుదాం
అసహనపు సుబ్బారావ్ అతి సహనపు సుబ్బారావ్
అసహజపు సుబ్బారావ్ అతిసహజపు సుబ్బారావ్
ఎప్పుడు కలుద్దాం
ఎప్పుడు గెలుద్దాం మళ్లీ మనం
రామకృష్ణా బీచ్ తడి ఇసుక మీద
ఎప్పుడు రాద్దాం పాదాలతో పల్లే పాట
విశాఖపట్నం దిగులు దిగులు గోడలకు
జేగురు రంగు హసనాలు అతికించి
పోస్టరేసి పోస్టరేసి జిమ్మె వాయెనా
నాయన్నా ఓ కామ్రేడా అని గద్దర్నూ
కార్ల్ మార్క్సునూ కలిపి తిట్టుకుంటూ
జగదాంబ సెంటర్ నడి రోడ్డు మీద
ఎప్పుడు సోలిపోదాం మళ్లీ మనం
తెలవారు ఝాము శర్మా పంజాబు హోటల్
తేనీటి వెచ్చదనం ఎప్పుడు పంచుకుందాం
కృష్ణక్క ఇంటికెళ్లి అడుగుతోంది
ప్రతి సాయంత్రం నా ఆత్మ
అత్తలూరిని నిలబెట్టి అడుగుతోంది
ప్రతి ఉదయం నా ఆత్మ
ఆరెసెస్ వాళ్ళు కరపత్రమేశారు
ఏడీ, సుబ్బారావు కనిపించడేం
సుబ్బారావ్ సుబ్బారావ్ సుబ్బారావ్
ఎప్పుడెక్కడెలా కలుద్దాం మళ్లీ మనం
విశాఖ జీడిమామిడి నీడల్లో నాకు మాటలు నేర్పిన సుబ్బారావ్
మాకివలస సదస్సులో నన్ను మాట్లాడనీయని సుబ్బారావ్
విడిపోయినప్పుడల్లా అనుకునే మాటే కదా, ఎప్పుడు కలుద్దాం మళ్లీ
నువ్వు చెబితే కొన్న చరిత్ర పుస్తకాలు
పూర్తిగా చదవనే లేదింకా
అవి కొన్నామని చెప్పినప్పుడు
జయమ్మ నుదుట నీ ముద్దు
తడి కూడా ఆరిపోలేదింకా
అప్పుడే అప్పుడే అదేమిటి ఎందుకిలా
విడిపోయినప్పుడల్లా చేసుకునే బాసలే కాదా, ఎప్పుడు కలుద్దాం మళ్లీ మనం
(02-0-5-1994)
‘ఒక్కొక్క రాత్రి’ కవితా సంపుటి (1993-95)
(వచ్చేవారం కలుద్దాం, విశాఖలోనే…… )

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s