మనస్సుకు రెండు కొసలు

స్మృతి 19

నేను వెళ్లే నాటికి, ఆంధ్ర యూనివర్సిటీలో ‘తెలుగు డిపార్ట్మెంట్’ తాజా చేరిక కావొచ్చని అని నా అనుమానం. లేక ఆ భవనం మాత్రమే కొత్తది కావొచ్చు. ఎందుకంటే, తెలుగు శాఖ బిల్డింగు… మొత్తం యూనివర్సిటీ ఆవరణలో ఈ చివరగా, ఈ మూలగా వుండేది. ఆ తరువాత ప్రొఫెసర్స్ క్వార్టర్సే. అంతే కాదు. మిగిలినవన్నీ పాత భవనాల స్టైల్లో వుంటే, మా బిల్డింగ్ మాత్రం రంగులు రంగులుగా వుండేది. మొత్తం యూనివర్సిటీలో రంగుల మేడ మా డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఒక్కటే.

అందులో, కింద ఒక వైపు తెలుగు శాఖ గదులు. ఇంకో వైపు సంస్కృతం శాఖ వాళ్ళ గదులు. మధ్యలో స్టెయిర్ కేస్. దిగువ కులాలలో ఒక కులానికి ఇంకో కులం మీద చిన్న చూపు వున్నట్టు మా వాళ్ళకు సంస్కృతం వాళ్ళంటే తక్కువ చూపు వుండేది. మా పై అంతస్తులో అప్పుడప్పుడే మొదలైన సైకాలజీ శాఖ వుండేది. వాళ్ళతో మాత్రం మేము కాస్త స్నేహంగా వుండే వాళ్ళం. అందులో … అజంతా కుమారి లేదా ఎ జనతా కుమారి అని ఒకమ్మాయి, ఇంకో పిల్లాడు జీడి మామిడి చెట్ల కింద కబుర్లలో తరచు కలిసే వారు. వాళ్లిద్దరు చాల సరదాగా వుండే వాళ్లు, అందుకని గుర్తు. బై ఎనీ ఛాన్స్ వాళ్లు ఈ వ్యాసం చూస్తే …… బాగుణ్ను.

జీడిమామిడి చెట్లు. వాటిని నేను చూడడం మొదటి సారి అక్కడే. అవి కేవలం సముద్ర తీరంలో పెరిగే చెట్లు అనుకుంటాను. యూనివర్సిటీ ఆవరణ నిండా అవే. చెట్లు వున్నంతలో గుబురుగా వుండేవి. వాటి కింద నీడలు… పొదల కింద నీడల వలె దోబూచులాడేవి. ఆ నీడల్లో ఇసుకలో నుంచుని కబుర్లు చెప్పుకోడం ఒక ‘కూల్’ భావన. మరెప్పుడూ, ఎక్కడా ఆ భావన నాకు కలగలేదు. పొద్దున్నే తడి తడి ఎండ. కాల్చే ఎండలు తెలిసిన నాకు అవెంత బాగుండి వుంటాయో కదా?!

రీసెస్ లో మా డిపార్ట్మెంటు వెనుక వైపున జీడిమామిడి చెట్ల కిందనే కాస్త పక్కకి నడిస్తే ఒక చిన్న టీ కొట్టు వుండేది. కొన్ని బిస్కెట్లు, టీ. అక్కడా కబుర్లు. అటు వైపున ఎకనామిక్స్ వంటి శాఖలేవో. వాళ్లూ అక్కడికి వచ్చే వారు. యూనివర్సిటీలో ఒకే ఒక ‘ఎస్ ఎఫ్ ఐ’ ఫ్రెండు, ప్రసాద్ అనే అతడు అలాగే పరిచయమయ్యాడు.

చెప్పాను కదూ. విజయవాడలో పీయూసీ లో చేరుతూ మేము నలుగురం మొదటి సారి చెప్పులు కొన్నాం. ఎవరేనా చెప్పారో, నాకే అలా అనిపించిందో ఎమ్మేలో చేరగానే చెప్పులు కాదు, షూస్ (బూట్లు) వేసుకోవాలని. అప్పుడే మొదటి సారి షూస్ కొన్నాను. క్లాసులకు పుస్తకాలు పట్టుకెళ్ళడం ఎమ్మే వాళ్ల స్టైల్ కాదు. అందుకని, నేను ఒక చిన్న ఫైలులో కాగితాలు పెట్టుకుని వెళ్ళే వాడిని. మొదట్లో టక్ చేసుకుని, షూస్ వేసుకుని, చిన్న ఫైల్ పట్టుకుని వెళ్ళడం, ఒక్కొక్కరికి ఒకటిగా వుండే కుర్చీల్లో కూర్చుని ఉపన్యాసాలు వినడం నా క్కాస్త ఫ్యాన్సీగా వుండేది. ఫ్యాన్సీ తో పాటు, పెద్దవాళ్ళమయ్యామనే స్పృహ కూడా. తరువాత్తరువాత ఇన్ షర్టు తరహా వేషాలు మానేసినట్టున్నాను.

లెక్చరర్ల వుపన్యాసాలు బోరు కొడితే….? మా క్లాసులో మొత్తం పదహారు మంది మగపిల్లలు. ముప్పై రెండు మంది ఆడపిల్లలు. వనీస్టు టు నిష్పత్తన్నమాట. బోరు కొడితే అటేపు చూస్తూ కూర్చోడమే. నేను ఏ ఆడపిల్లతోనూ మాట్లాడే వాడిని కాదు. క్లాసులో అమ్మాయిలు నాకు బుద్దావతారం అని పేరు పెట్టేశారు. ఒకరు మాత్రం… ‘కాదులే, బుద్ధిమంతుడు’ అని కన్సెషన్ ఇచ్చారు. ఆడపిల్లలు ఎవరితో మాట్లాడేది కాదు గాని, లెక్చరర్లతో మాత్రం చాల ‘బోల్డ్’గా వుండే వాడిని.

టిమిడిటీ, బోల్డ్ నెస్… రెండు కొసలు ఒకే మనసుకి.

ఒక వైపు ఎంత ముడుచుకుపోవడమో మరో వైపు అంత దూసుకుపోవడం.
ఎంత బోల్డ్ అంటే, మీరూహించలేరు.

ఒక సారి మా ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టారు ‘బాల వ్యాకరణం’ చెబుతున్నారు. నేను పక్కన ఎవరిదో బాల వ్యాకరణం పుస్తకమే, చూస్తున్నాను. పుస్తకం చూస్తున్నాను గాని తన మాటలు వినడం లేదని ఆయనకు అనిపించింది. ఆయన నా వైపు చాక్ పీస్ విసిరి ‘ఏం స్వామీ ఏం చూస్తున్నావు’ అన్నారు. నేను ఆయన విసిరిన చాక్ పీస్ ని ఇదేంటన్నట్టు ఇండిగ్నేషన్ తో చూసి, తాపీగా పక్కన పెట్టి ‘ఇక్కడొక స్వామిని చూస్తున్నాను స్వామీ’ అనేశాను. ఆయన చాక్ పీసు విసరకపోయి వుంటే అంత కోపం వచ్చేది కాదేమో. అలా అనడం దుస్సాహసమే. ఆ మాట అనడమే కాదు. అప్పుడు నేను చూస్తూ వుండిన నిలువు నామాల చిన్నయ సూరి బొమ్మను ఎత్తి ఆయనకు చూపించాను, స్వామి అనే మాటతో పాటు. చిన్నయసూరి, కృష్ణమాచారి, నిలువుబొట్లు, వైష్ణవం, స్వామి… ఒక్క దెబ్బతో అన్నీ కలగలిసిపోయాయి.

నిజానికి ఆ ఎదిరింపుల పాపం వూరికే పోలేదు. నేనలా మాట్లాడినందుకే అని చెప్పను గాని, అదీ ఒక కారణం కావొచ్చు. ఆయన, ఇంటర్నల్స్ రూపంలో తన చేతిలో వున్న మా 25 పర్సెంటు మార్కుల మీద తన ప్రతాపం చూపించారు. క్లాసులో వామపక్షం అనుకున్న విద్యార్థులకు బాగా తక్కువ మార్కులు వేశారు. ఉదాహరణకు నాకు 25 కు 9 మార్కులు వేశారు. డిపార్ట్మెంటులో ఇదొక పెద్ద స్కాండల్ అయ్యింది. విచారణ సంఘం వేసి విచారించారు. నేను కూడా విచారణ సంఘం ముందు కూర్చుని స్టేట్ మెంటు ఇచ్చాను. పేపర్లను మళ్లీ దిద్దిస్తే, ఎన్నో గుర్తు లేదు గాని, చాల ఎక్కువ మార్కులు వచ్చాయి. అదే విడతగా ఆయన వుద్యోగం వూడింది.

బహుశా ఆ తరువాత ఆయన రీ ఇన్ స్టేట్ కాలేదనుకుంటాను. ఆ తరువాత పూర్తికాలం హోమియో వైద్యం మీద, ఆధ్యాత్మిక సేవ మీద కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధులైనట్టున్నారు. యూనివర్సిటీ విచారణకు బాగా ముందు మిత్రుడు కాశి రెడ్డి తీసుకెళితే ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టారు ఇంటికి వెళ్లి చూశాను… గుంపులు గుంపులుగా జనాల్ని… ఆయన కాళ్ళకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేసే వారిని. అలాంటి వారిని చూడడం నాకు అదే మొదటి సారి. ఆఖరి సారి కూడా అదే. చాల జాలి వేసింది. ఎంతో దుఃఖితులై, ఆర్తులై, తమ ఆర్తిని తీర్చే వాడనుకుని అలా ఒక మనిషి కాళ్ళకు తల ఆన్చి మొక్కే వారిని చూసి బాధ పడ్డాను. హోమియో వైద్యంలో ఏమైనా ‘విషయం’ వుంటే వుండొచ్చు. డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి చెబుతున్నట్టు అది సైన్సు అనే అనుకుందాం. ఈ కాళ్ళకు మొక్కే వైద్యమేమిటి? సో కాల్డ్ ఆధ్యాత్మికుల భాషలో చెప్పాలన్నా, ఇలా ఒక మర్త్యుడి కాళ్ళకు మొక్కడమేమిటి, అదీ మరి కొన్నాళ్ళు ఎక్కువ బతకడమనే స్వల్ప కామనతో?

బోల్డ్ గా వుండడం సరే. అలా కాకుండా ఇంకో విధంగా వుండడం ఎలాగూ నాకు రాదు. ఆ రెండేండ్లూ సంతోషంగా వుంటానికి చాల కారణాలున్నాయి, అందులో ఒకటి మరీ బలమైన కారణం. ఎప్పుడు గుర్తు చేసుకున్నా… ఒకే సారి గొప్ప సంతోషాన్ని, గొప్ప దిగులును కలిగించే కారణం.

ఆమె పేరు చెప్పను. ఎమ్మే ఆ రెండేళ్ళు ఆమె ప్రొఫైల్ చూస్తూనే గడిపాన్నేను. నేను కూర్చునే చోటు నుంచి చూస్తే ఆమె ఎడమ వైపు మొహం వెలుగుతూ కనిపించేది. అలా కూర్చుండి పోయే వాడిని. ఆమెను చూస్తూ గడపొచ్చు కదా అని క్లాసులు ఎగ్గొట్టకుండా వెళ్ళే వాడిని. పొద్దున ఆమె వస్తుందని డిపార్ట్మెంటు ముందు అరుగుల వద్ద కాపు కాసే వాడిని, ఎవరితోనైనా మాట్లాడుతూ లేదా నేనొక్కడినే.

అప్పుడే నాకు ఒక జ్ఞానోదయం అయ్యింది. ఆడపిల్లలు తెల్లగా లేదా ఎర్రగా వుంటే అందమని అంటారు. అది నిజం కాదు. నేను మోహపడిన ఆడపిల్లలు ఎవరూ తెలుపు లేదా ఎరుపు కాదు. అందరూ మెరిసే నలుపు. మా జయమ్మ అంటే నాకు ఎందుకంత ప్రాణమో కూడా అప్పుడే తెలిసింది. ఆమె కూడా నలుపే. (‘మరో చరిత్ర’ సినిమా చూసొచ్చి కొన్నాళ్లు మా జయమ్మను ‘నల్ల పొన్ను అంటే నల్ల పిల్లా’ అని పిలిచి ఆట పట్టించే వాడిని. తను విని విని విసుగేసి ‘ఏం తెల్ల పిల్లోడా’ అనేశాక ఆ పిలుపు మానేశాను. నేను సైతం నల్ల పొన్నుడనే).

ఆ రెండేండ్లు. ఒక మోహావేశం. నాకేమవుతున్నదో నాకు తెలుసు. ఆమెకూ తెలుసని నా నమ్మకం. కాని, ఇద్దరం ఎప్పుడూ నోరు విడిచి చెప్పుకోలేదు. మరెన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకేనా మంచిదని నా కబుర్లలో నేను జయ గురించి ఆమెకు చెప్పాను. ఊరికే కాదు. గట్టిగానే చెప్పాను, ఎలాంటి ఇల్యూజన్స్ వుండగూడదని. అయినా ఒకరంటే ఒకరం గొప్ప గౌరవంతో, గొప్ప మమకారంతో గడిపాం ఆ రెండేండ్లు. మా సంభాషణల్లో నాకు బాగా గుర్తున్నది గోర్కీ ‘అమ్మ’ నవల ఎంత గొప్పదో చెబుతూ నేనిచ్చిన ‘ఉపన్యాసం’. అప్పటి వరకు నాకూ తెలీదు నేను ఒక పుస్తకాన్ని అంత బాగా జ్ఞాపకం పెట్టుకుని దాని గురించి అంత సేపు మాట్లాడగలనని.

అమె అంటే నాకెంత ఇష్టమో చెబుతూ, అందులోని పెయిన్ అండ్ ప్లెజర్ తో నేను రాసిన పద్యాల్ని ఒక చిన్న పుస్తకంలా కుట్టి చాన్నాళ్ళు నా దగ్గర వుంచుకున్నాను. దాన్ని ఎప్పటికైనా ఆమెకు ఇవ్వాలని అనుకున్నాను. ఇవ్వ లేక పోయాను. దగ్గరుంచుకోడం మంచిది కాదని ఆ పుస్తకాన్ని తరువాత కాల్చేశాను.

ఎందుకో ఏమో తెలీదు, చిట్ట చివర్లో మేము మాట్లాడుకోడం మానేశాం. మా మధ్య ఆకర్షణ తీవ్రత, దాని నిష్ప్రయోజకత్వం ఇద్దరికీ లోలోపల తెలిసిపోవడం దానికి కారణమయ్యుంటుంది. అంతకు ముందు మేమిద్దరం బీచిలో కూర్చుని కూడా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అప్పుడప్పుడు ఆమె స్నేహితులెవరైనా మాతో వుండే వారు లేదా ఇద్దరమే పొద్దు పోయే దాకా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. చివరాఖర్న ఎప్పుడు కలుసుకున్నామో గుర్తుంది.

ఆ రోజు ఎందుకో బాగా విండీగా వుంది. ఈదురు గాలి వీస్తోంది. మసక చీకటిగా వుంది. వాన ఇప్పుడిప్పుడే రాదు గాని, వాన వచ్చే ముందు వున్నట్టుగా వుంది. గాలికి ఇసుక కొద్ది కొద్దిగా ఎగురుతోంది. మేము మాట్లాడుకుంటూనే వున్నాం. ఆగి ఆగి మాట్లాడుకున్నాం. అది జ్ఞాపక మొస్తే ఎందుకో నాకు ఎవరో వెక్కిళ్ళు వెక్కిళ్ళుగా దుఃఖిస్తున్నట్టనిపిస్తుంది. అప్పుడు ఇద్దరికీ తెలుసు ఇంకెప్పుడూ మేము కలవమని. త్వరలోనే, బహుశా, ఇంకెప్పుడూ ఒకరికొకరం కనిపించం కూడా అని మాకు తెలుసు. ఇప్పటి మాదిరి కమ్యూనికేషన్స్ పెరిగిన కాలం కాదది. ఎక్కడి కర్నూలు జిల్లాలోని గని గ్రామం, ఎక్కడ విశాఖ మహా నగరం. ఎమ్మే అయిపోతే ఇంకెందుకు వస్తాను విశాఖ.

ఎమ్మే తరువాత మరి కొన్ని రోజులు విశాఖలో వుండాలని ఆశ పడ్డాను నాన్న డబ్బులు మరి కొన్ని ఖర్చు పెట్టయినా సరే, రిసెర్చ్ లో చేరాలని ప్రయత్నించాను. నాకు గైడ్ గా ఎవరేనా వుండాలి కదా?! దానికన్న ముందు, నేనేం చేయాలో ఎలా చేయాలో చెప్పే వారుండాలి కదా?! మరే లెక్చరర్నీ అడగలేను, వాళ్ల ఐడియాలజీల రీత్యా. మాకు లింగ్విస్టిక్స్ చెప్పిన తూమాటి దొనప్ప దగ్గరికి వెళ్లి నా అభిలాష చెప్పాను. ఆయన నన్ను తీసుకోలేదు. పోనీ ఇలా చెయ్యి అని ఒక దారి చూపనూ లేదు. ఒక టీచర్ అంత ఇండిఫరెంట్ గా ప్రవర్తించడాన్ని నేను అర్థం చేసుకోలేను. అతడిని తల్చుకుంటే బాధేస్తుంది, ఆతడి కోసమూ నా కోసమూ. ఆయన సిపిఐ అని చెప్పేవారు. అందుకే, ఆయనతో అయితే నేను పని చేయగలనని అనిపించి వెళ్లి అడిగాను. ఇంకే కన్సిడరేషన్ లేకుండా నిజయితీగా వచ్చి మాట్లాడిన ఒక విద్యార్ఠి పట్ల అలాంటి నిర్లిప్త ప్రవర్తనను ఏ కమ్యూనిస్టులోనూ నేను ఇష్టపడలేను.

నేను హైదరాబాదులో ఈనాడులో ఉద్యోగంలో చేరాక ఆమె నేను ఒక సారి కలిశాం. ఈనాడులో కింద సెక్యూరిటీ నుంచి ఆమె ఫోన్ చేస్తే… ‘జయా, బిజీ గా వున్నా, పైకి వచ్చెయ్’ అన్నాన్నేను. ఆమె నవ్వి ‘నేను జయను కాదు…’ అన్నారు. ఆమె ఆ మాట అనడం నేను వినడం రెండూ…. నిన్న సాయంత్రం విడిపోయిన వాళ్ళు ఇవాళ వుదయం పలకరించుకున్నట్టుగా వుంది. అది జరగడం నేను విశాఖ వదిలాక పదిహేనేళ్ళకు. ఆ తరువాత, ఆపైన, మరి ఇరవయ్యేళ్ళయిపోయింది. మేము మళ్లీ కలవలేదు. 🙂

అదిగో అలా గడిచింది ఎమ్మే రెండేండ్లూ. క్లాసులో ఆమెతో, ఆమె స్నేహితులు కావడం వల్ల మరి ఇద్దరు అమ్మాయిలతో మాత్రం మాట్లాడే వాడిని. ఇంకే అమ్మాయితో మాట్లాడే వాడిని కాదు. ఒకసారి మాత్రం నాకు నేను ఒక పరీక్ష పెట్టుకున్నాను, అత్యవసరమైతే మాట్లాడడం నాకు చాతనవుతుందా లేదా అని. ‘దుష్యంత్ బాబు’ పేరుతో శ్రీరామచంద్ర మూర్తి రాసిన విప్లవ కవిత్వాల పుస్తకాలు అమ్ముదామని తెచ్చారెవరో. అత్తలూరి అనుకుంటాను. నేను కొన్ని పుస్తకాలు తీసుకున్నాను అమ్మకానికి. మొదటి కాపీ ఎవరైనా మా క్లాసులోని ఒకమ్మాయికి అమ్మాలనుకున్నాను. నా పక్క కుర్చీలో కూర్చున్న అమ్మాయి పేరు నాకు తెలుసు. ఆమెతో ఎప్పుడూ… అంతకు ముందూ, ఆ తరువాత ఎప్పుడూ… మాట్లాడలేదు. ‘రామలక్ష్మి గారు, ఇది మా స్నేహితుని కవిత్వం. ఇది మీరు కొని చదవాలి’ అన్నాను ధైర్యం చేసి. రామలక్ష్మి వెంటనే పుస్తకం వెల పావలా ఇచ్చి పుస్తకం తీసుకున్నారు. క్లాసులో ఎందువల్లనో నా మీద మంచి అభిప్రాయం వుండేది. చదవడు కాని మార్కులకు ధోకా లేదు అని ఒక రకమైన గౌరవం.

‘దరిద్రుడు తల కడిగితే వడగళ్ళ వాన’ అని సామెత.

అంత మంచి స్నేహాలు. కృష్ణక్క, చలసాని ప్రసాదు … అంత మంచి పెద్దవాళ్లు. అంత స్వేచ్చాయుత వాతావరణం. అయినా విపరీతమైన దిగులు. రాత్రులు ఒక్కడినే నడిచి ఆ నల్లని మెలికల రోడ్డు మీది కిందికి దిగి బీచిలోని చిన్న పార్కులో ఏనుగు బొమ్మ మీద కూర్చుని దుఃఖించే వాడిని.

సంతోషం, దుఃఖం మరో రెండు కొసలు ఒకే మనసుకి. ఒకే సిచువేషన్ లోని మనసుకి.

పున్నమి రాత్రులలో సముద్రం భలే వుండేది.

బీచిలో కూర్చున్నా, హర్ష వర్ధన హాస్టల్ టెర్రెస్ మీది నుంచి చూసినా ఒక అద్భుత దృశ్యం కనిపించేది. పున్నమి చంద్రుడు వెలుగుతున్న టార్చి లైటు ముఖంలా కనిపించే వాడు. ఆ టార్చి లైటు ముఖానికి చుట్టూరా చీకటితో గుండ్రని ఫ్రేం స్పష్టంగా కనిపించేది. బియాండ్ దట్, అటు ఇటు ఆకాశంలో చీకటి. కిందికి దిగే కొద్దీ టార్చ్ ఫోకస్ పరిధి పెరిగినట్టుగానే వెన్నెల-చక్రం పరిధి పెరిగేది. అంటే, చివరికి సముద్రంలో కూడా ఆ ఫోకస్ పడని వైపులలో చీకటి వుండేది. పున్నమి వెన్నెల రాత్రి సముద్రం ఒక విచిత్రం.

చాల సార్లు విని వుండటం వల్ల నాకలా అనిపించేదో ఏమో, పున్నమి రాత్రి సముద్రం బాగా ఆలజడిగా వుండేది. హోరు ఎక్కువగా వుండేది. అదంతా నా మనసు మీద ప్రభావం చూపించేది. ఒంటరిగా కూర్చున్నప్పుడు దూరంగా కదిలిపోతున్న స్టీమర్…. ఒక పెద్ద ఖగోళాన్ని రాసుకుంటూ మరో చిన్న ఖగోళం వెళ్తున్నట్టుండేది. నేను రోదసిలో ఎక్కడో తేలుతున్నట్టుండేది.

సముద్ర తీరం కవులకు ఎందుకంత ఇష్టమో విశాఖ సముద్రంతో సహవాసం చెయ్యకపోతే నాకెప్పటికీ అర్థమయ్యేది కాదు. కాని అంత సంతోషమూ ఎప్పటికప్పుడు కరిగిపోయి, సముద్రమూ నేనూ ఒకర్ని ఒకరం కావిలించుకుని విలపించే వాళ్ళం. ఎందుకు? ఏడవడమెందుకు?

ఎందుకంటే, బహుశా, ఇవేవీ నావి కాదని, నేను అక్కడ కాసేపుండి వెళిపోవాల్సుంటుందని మనసు అరుస్తుండేదనుకుంటాను. అప్పుల వూబిలోంచి నాన్న గొంతుతో ఎవరో అరుస్తున్నట్టు, రెండు నీటిపొర కళ్ళతో అమ్మ మొహంతో ఎవరో ప్రేమగా నవ్వుతున్నట్టు, నేను నా మెడకు చుట్టుకున్న ఒక నిస్సహాయతా సర్పాన్ని వదుల్చుకోలేక సతమతమవుతున్నట్తు…. వుండేది ఎప్పుడూ.
చాల రోజుల తరువాత, ఓ పద్యంలో నేను వ్యక్తం చేసిన ఒక రాత్రి అదే అనుకుంటాను.

//నిష్ప్రయత్నం//

ఉన్నట్టుండి
దేహం చుట్టూరా
పెను కన్రెప్ప మూసుకుంటుంది
గింజుకునే కొద్దీ బిగుసుకుంటుంది

గట్టిగా అరిస్తే ఎవరూ వినరు
నరాల బ్లేడు ముక్కలు కోసుకుపోగా
గట్టిగా మూల్గుతావు వినరెవరూ
ముందున్న టేబుల్ ను
రెండు చేతులతో గట్టిగా వూపేస్తావు
టేబుల్ కింద
రెండు కాళ్ళతో గట్టిగా తన్నేస్తావు
ఎవరూ వినరు కనరు మూచూడరు
నీ స్పర్శ నీ రుచి తగలదెవరికీ

అప్పుడు నువ్వు కల గంటున్నావు
ఒక సీరియల్ పీడకల
నువ్వు కలగననిదెప్పుడు
అది పీడకల కానిదెప్పుడు… ?

నువ్వొక నిషిద్ధ ఫలానివి
ఎవరి స్వర్గంలో వారు
నువ్వొక బోస్నియన్ ముస్లిం యువతివి
ఎవరి స్వర్గారోహణ యత్నంలో వారు
(15-8-1993)
_ ‘ఒక్కొక్క రాత్రి’ (1993-95) కవితా సంపుటి
(వచ్చేవారం కలుద్దాం)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s