అపీజ్మెంటు మతవాదం

(‘నవతెలంగాణా’లో మొన్న సోమవారం అచ్చయిన వ్యాసం)bujjaginchudu mathavaadam

రెండో ప్రపంచ యుద్ఢంలో హిట్లరు సేనలు ఒక్కో చిన్న దేశాన్ని అక్రమిస్తుంటే, ఇతర పెద్ద దేశాలు ‘సరే, ఆ చిన్న ముక్క తిని తృప్తి పడండి, మా మీదికి రాకండి’ అని బుజ్జగించాలని చూశాయి. దీన్ని అపీజ్మెంటు పాలసీ అంటారు. ఆక్రమణ దారులను సంతృప్తి పరిచి, పోరాటం తప్పించుకునే విధానం. దాని వల్ల ఆనాటి ప్రపంచ పెద్ద మనుషులు సాధించింది ఏమీలేదు. పెద్ద గుణపాఠం తప్ప. చివరికి ‘ఇరుసు’ శక్తులు (యాక్సిస్ పవర్స్) పేట్రేగి ‘పెద్దమనుషుల’ ముడ్డి కిందికి నీళ్లు తెచ్చాకే వీళ్ళు  మేల్కొన్నారు. భారీ మూల్యం చెల్లించారు. పేద దేశాలు వెంటనే లేవ లేనంతగా వాటి నడుములు విరిగాయి. లక్షల్లో జనం ధన మాన ప్రాణాలు కోల్పోయారు.

మన దేశంలో కుల, మతాల విషయమై ఇటీవల పలువురు ‘ప్రగతి శీల మిత్రుల’లో కనిపిస్తున్న అపీజ్మెంటు పాలసీ చూస్తుంటే, ఒక సందేహం కలుగుతుంది. అసలు వీళ్లు ప్రగతి శీలురేనా? లేక కీర్తి ప్రతిష్టల కోసం, కీర్తితో పాటు దొరికే సౌకర్యాల కోసం ఎడమ వైపు మొగ్గినట్టు కనిపించి, ఇప్పుడు రొట్టెకు వెన్న అటేపు కనబడే సరికి ప్లేటు మార్చారా అనిపిస్తున్నది.

భూస్వామ్యం పోవాలి కాని భూస్వాములకు కొంచెం కూడా బాధ కలగకూడదు… అంటే ఎలా వుంటుంది? భూస్వామ్యం గాలిలో వుండదు. భూస్వామ్యం వద్దనడం అంటే లోకంలో భూస్వాములు వుండొద్దని అనడమే. భూస్వాములు వుండొద్దనడమంటే వాళ్లను ఒక్కొక్కర్ని ఖతం చేయడం కాదు. గిల్లొటిన్ పెట్టి తలలు నరికేయడం కాదు. ప్రజల న్యాయమైన ఆకాంక్షల్ని గ్రహించి కొందరు భూస్వాములు తమకు తాము భూస్వాములుగా వుండడం మానేస్తారు. అలా ముందుకు రాని వాళ్ల నుంచి ప్రజలు భూముల్ని  తీసేసుకుని ఎవరి దగ్గరా ఎక్సెసివ్ (భూస్వామ్యపు) భూములు లేకుండా చేస్తారు. ఆ పని భూస్వాములే స్వయంగా చేసుకోవచ్చు. లేదా సమాజం తన శక్తియుక్తులు వుపయోగించీ చెయొచ్చు. ఇది కాకుండా ఇంకో మార్గం వుందా భూస్వామ్యం పోవడానికి? భూస్వామ్యం పోతుంది. పోయేది మాత్రం ఇలాగే. ఇంకో దారి లేదు.  

ఈ పని జరుగుతున్నప్పుడు మనం కేవలం భూమి యాజమాన్యం గురించే మాట్లాడం. భూస్వాములు, వారి తాబేదార్లు అనుభవించే అన్ని అప్రజాస్వామిక సౌకర్యాల గురించి, వాటి వల్ల ఇతర్లు అనుభవించే కష్టాల గురించి మాట్లాడుతాం. విమర్శిస్తాం. వారిలో కొందరు విమర్శ విని మారుతారు. మారని వాళ్ళను ప్రజలు మారుస్తారు. ఇదే లాజిక్ ను కులానికి, కుల-స్వామ్యానికి అన్వయించి మట్లాడితే కొందరికి ఎక్కడ లేని రోషాలు పుట్టుకొస్తాయి.

‘అబ్బే అలా కాదు లెండి. మేమంటున్నది ఏమంటే… మరే… కులాలు వుండనీ, అయ్యో కులాల వల్ల ఎన్ని మేళ్లో… తమది ఫలానా కులమని చెప్పుకునే వాళ్లూ వుండనీ, కులాల వల్ల జరిగే హింస మాత్రం వుండొద్దు’ అని నంగి నంగిగా మాట్లాడుతుంటారు. కుల, మతాలు వద్దనడం చాల దుందుడుకు దుస్సాహసిక చర్య అయినట్టు, సిగ్గుతో తల వంచుకోవాల్సిన సంగతి అయినట్టు మాట్లాడుతుంటారు. ఇది విచిత్రం. ఇది విచిత్రంగా కనిపించకపోవడం మరింత విచిత్రం.

 

2.

బ్రాహ్మణ వాదం మీద విమర్శ పెడుతున్నప్పుడు చాల జాగర్తగా, ‘నా విమర్శ బ్రాహ్మణుల మీద కాదండీ, బ్రాహ్మణ వాదం మీద మాత్రమే’ అని పదే పదే చెప్పాల్సి వస్తోంది. బ్రాహ్మణ వాదం వల్ల ఎవరెవరు లాభ పడుతున్నారో వాళ్లంతా ఆ లాభాలకు మూలమైన తమ కులాల్ని వదులుకోనంత కాలం బ్రాహ్మణ వాదం ఎలా పోతుంది? మరి బ్రాహ్మణ వాదం వేరు బ్రాహ్మణులు వేరు అని ప్రతిసారి రైడర్లు పెట్టుకుంటూ, ప్రతి వాక్యానికి సవరణలు చెప్పుకుంటూ మాట్లాడాల్సిన ఈ సైద్ధాంతిక దుర్గతి ఎందుకు? ఇది ఎవరిని బుజ్జగించడానికి? బుజ్జగించడం వల్ల వాళ్ళు మారుతారా? ప్రగతిశీల బృందాల్లో ఈ ధియరిటికల్ కవర్డైస్ ఎందుకు?

తాము బ్రాహ్మణులమనీ, తమ మాటలన్నీ ఆ పొజిషన్స్ లోంచే వుంటాయనీ అనే వాళ్లను ఎందుకు విమర్శించగూడదు? నేను రెడ్డిని, కమ్మను, వెలమను… నా వాదాలు నా కులం పొజిషన్ నుంచే వుంటాయి అనే వాళ్లను ఎందుకు విమర్శించకూడదు? అలాంటి వాళ్లు (మారి) పోకుండా కులాలు ఎలా పోతాయి? కులస్థులుగా వుండాలని చాల మంది అనుకుంటున్నంత కాలం కులవాదం ఎలా పోతుంది? ఉన్న కుల వాదాన్ని … అది ఏ మేరకు వుంటే ఆ మేరకు… ఎందుకు విమర్శించకూడదు? విమర్శించకుండా సో కాల్డ్ తక్కువ కులస్థుల బాధలు ఎప్పటికీ పోవు.

రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లున్నారు. చుండూరు, కారంచేడు ఘటనల్లో ‘దళితులు కూడా తప్పులు చేశారు తెల్సా, ‘మనోళ్ల’యినా ఎన్నాళ్లూరుకుంటారబ్బా’ అని నసిగే వాళ్లున్నారు. అవన్నీ వాళ్ల కులాల పొజిషన్స్ లోంచి మాట్లాడే మాటలు. తమది ఏ కులమో ఆ కులస్థులుగా మాట్లాడే మాటలు. వాళ్లది ఆ కులం కాకపోతే అలా మాట్లాడే వారు కాదు. మరి; రెడ్లు, చౌదర్లు, రావులు పోకుండా ఆ కుల వాదాలు ఎలా పోతాయి? ఇక్కడ కూడా వాళ్లు పోవడమంటే ఆ మనుషుల్ని ఏసెయ్యడం కాదు. వాళ్లు ఆ కులస్థులుగా వుండకుండా వుండడమే.

వాళ్ళు తమ పేర్లను కాస్త మార్చుకుంటే చాలదు. కులాన్నే వదులుకోవాలి. బ్రాహ్మణులను, రెడ్లను, కమ్మలను… బ్రాహ్మణులుగా, రెడ్లుగా, కమ్మలుగా విమర్శిస్తే… దానికి జవాబుగా అగ్రకుల పేదోళ్లు అంటూ చెత్త సెంటిమెంట్లు పండించకుండా, ఆ విమర్శతో చేయి కలపాలి. ఇవాళ జరుగుతున్నది దానికి పూర్తిగా విరుద్డం. బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్లు తాము బ్రాహ్మణులమని చెప్పుకుంటూ వున్నంత కాలం, అలా చెప్పుకోడం వాళ్లకు బాగున్నంత కాలం బ్రాహ్మణ వాదం పోదు.

 

3.

నిజమే పుటక ఒక యాక్సిడెంటు. ఎవరూ ఫలానా అమ్మా నాన్నలకు పుట్టాలనుకుని పుట్టరు. కాని పుట్టాక బతుకు మీద మన  ‘విల్’ కి అవకాశముంది. మన ఎంపికకి అవకాశముంది. ఒక కులం నుంచి మరో కులానికి మారడానికి కాదు, కులమే లేకుండా బతకడానికి అవకాశముంది. మతమే లేకుండా బతకడానికి అవకాశముంది.

ఇండియాలో కుల, మతాల్ని వదులుకుంటే ఒకప్పుడు బతకడం అసాధ్యమయ్యేది. ఇవాళ కులం అత్యవసరం కాదు. జీవనాధారం కాదు. ఇవాళ కులంతో వుండడం తప్పని సరైనందువల్ల వదులుకోడం లేదని ఎవరైనా అంటే అది పచ్చి అబద్ధం. మనం మన కులాల్ని, మతాల్ని  వదులుకోవచ్చు. అలా వదులుకోవడం ఆడంబరం కాదు. ఒక అవసరం. చాల మంచి పని.

‘పుట్టేశాను కదా, పోన్లెద్దురూ, ఏదో ఇలా ఈ కుల సౌకర్యాలు అనుభవిస్తూ వుండనివ్వండి. దిగువ కులాల వాళ్లకు రాజ్యాంగం ఇచ్చే సౌకర్యాలున్నాయి చూశారూ, అవి మాత్రం అన్యాయం‘ అనే వాళ్లు పోనంత కాలం కులం పోదు.

యాక్సిడెంటు అనే ఇంగ్లీషు మాటను తెలుగు/హిందీ చేయాల్సి వచ్చినప్పడు ఎదురయ్యే విచిత్ర కష్టం చూశారా? అది తెలుగులో ప్రమాదం, హిందీలో దుర్ఘటన్. దళిత కులాలకు అది నిజంగా ‘ప్రమాదమే’, ‘దుర్ఘటనే’. సో కాల్డ్ ఉన్నత కులాలకు అదేం ప్రమాదం కాదు. వరం. ఈ పుట్టు వరాల్ని, పుట్టు శాపాల్ని గుర్తించి తొలగించుకోకపోతే పుటకను ఆధారం చేసుకుని బతికే వాదాలు… బ్రాహ్మణ వాదం, కుల వాదం, మత వాదం ఎట్టా పోతాయి సార్?పోవు. వాటిని కాన్షియస్ గా ప్రయత్నించి పోగొట్టుకోవాలి. వీటిని పోగొట్టే స్ట్రగుల్స్ మునుపటి కన్న ఎక్కువ పదును దేరాలి.

Advertisements

About hrk

Publishing mostly in Telugu. Not only poetry but every thing I write.
This entry was posted in సంవాదాలు వివాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s