భయం భయం భయం

స్మృతి 16

 

లొయోలా కాలేజీలో ఆ నాలుగేళ్ళు చాల ట్యుమల్టస్ గా గడిచిపోయాయి. తుపాను అంతా నా మనసులోనే. బయట ఏమీ లేదు. ఏమైనా వుండి వుంటే అది నాకు తెలీదు. తెలిసి వుంటే బాగుండు. చివరికి కూడా…. నేను వెదుక్కుని వెదుక్కుని కనుక్కున్నాను బయటి తుపాన్లను.
లోపలి తుపానుల కారణంగానే అనుకుంటాను….. మనస్సును మరింత డిస్టర్బ్ చేసే ఆల్కహాల్ వంటివి నాకు పెద్దగా ఇష్టం వుండదు. లోపలి ఉద్వేగాల్ని అణిచేసే సిగరెట్లకు ఓకే అంటాను. నా ప్రాణ మిత్రుడు గుడిహాళం రఘునాధం బాగా తాగే వాడు. తను అనే వాడు, ‘మేము వస్తుతః శాంతులం. కవిత్వానికి కావలసిన అశాంతి కోసం మందు కొడతాం. నువ్వు వస్తుతః అశాంతుడివి. మందు కొడితే మరింత అశాంతి, దాన్ని భరించ లేవు’అని.
అది కూడా కరెక్టు కాదేమో. రఘునాథం అశాంతి అని పేర్కొన్న నా లోపలి తుపానుకు అశాంతి అని కాకుండా, భయం అని పేరు పెట్టాలేమో.
లొయోలాలో బి ఎస్సీ రెండో ఏడాది పరీక్షలు రాశాను గాని, మూడో ఏడాది రాయలేదు. ఒక ఏడాది ఆగి ఆ పరీక్షలు రాసి, ఆ తరువాత ఎమ్మే కోసం విశాఖ వెళ్ళాను. బి ఎస్సీ చివర…. పరీక్షలు ఎగ్గొట్టడం మొదటి సారి. ఆఖరి సారి కాదు. మళ్లీ ఎమ్మేలో మొదటేడాది పరీక్షలు రాయలేదు. రెండూ కలిసి రెండో ఏడాది చివర్నే రాశాను.
ఎందుకు? భయం. భయమెందుకు? చదవలేదు. ఎందుకు చదవలేదు? చదవనివ్వని భయం? చదవనివ్వని భయమెందుకు? తెలీదు. బహుశా, భయం నా వ్యక్తిత్వమేమో.
‘నిన్ను నడిపించే, నీ చోదక శక్తి ఏమిటి?’ అని అడిగితే కవిత్వమనో, సాహిత్యమనో, ప్రజా వుద్యమమనో, జన సేవా కాంక్ష అనో చెప్పగలిగే వాళ్ళు అదృష్టవంతులు. కొందరు మిత్రులు అలా చెప్పుకోడం నేను విన్నాను. వాళ్ళంటే నాకు చాల అసూయ. పైన చెప్పినవన్నీ నాకు చాల చాల చాలం జాల ఇష్టం. ప్రాణ సమానం. కాని, నన్ను నడిపించేవి అవి కాదు. నేను ఏం చేశానో, ఏం చేయలేదో…. ఆయా పనుల్ని నాతో చేయించినది, చేయించనిది ఒకే ఒకటి: భయం.
భయమే నన్ను నడిపించింది. భయమే నాతో ఈ మాత్రమైనా చదివించింది. భయమే నన్ను ఈ మాత్రమైనా సహచరులతో పోటీలో పాల్గొనేట్టు చేసింది. ఉద్యమాల లోనికి తీసుకెళ్లింది. ఉద్యమాల లోంచి బయటికి తీసుకొచ్చింది. భయమే నాతో ‘ఉదయం’లో, ‘ఈనాడు’లో ఉద్యోగాలు చేయించింది. ఉద్యోగాలు మానిపించింది.
భయం నా మాత్రు దేవత. నా శరీరానికి తల్లి సుబ్బమ్మ కావొచ్చు. నా మనసుకు తల్లి భయం. ఆ యిద్దరు తల్లులు వేర్వేరు కాదేమో. ఆ ఇద్దరు ఒక్కరే నేమో. ఆమ్మ గుర్తొస్తే భయం గుర్తొస్తుంది. పొడుగాటి, సొరంగం లాంటి, మూడంఖణాల ఇంట్లో పరమ ఇన్సిగ్నిఫికెంట్ గా తిరుగుతూ ఒకే ఒక స్త్రీ. తన దురదృష్టం తనకు నలుగురమూ కొడుకులమే, శైశవంలో చనిపోయిన బిడ్డ కూడ కొడుకే. తనకు మనుషుల్ని గుర్తుపట్టే వయసు రాక ముందే తన తల్లి (మా అమ్మమ్మ) చనిపోయింది. ఆమెను ‘కుంటి నాగమ్మ అని అనే వారట’ అని టకారాంతాలతో చెప్పేది వాళ్ళమ్మ గురించి మా అమ్మ.
అమ్మ నాన్న పేరు చెంచు రెడ్డి. కూతురు తల్లి కడుపులో వుండగానే ఫ్యాక్షన్ కొట్లాటలో చనిపోయాడాయన. ఆ కథ అయితే ఏ టకారాలు లేకుండా, అప్పుడే కళ్ళ ముందు జరుగుతున్నట్టు చెప్పేది అమ్మ. జొన్న చేనికి కాపలా వెళ్ళాడట ఆ రాత్రి చెంచు రెడ్డి. అర్ధ రాత్రి పగ వాళ్ళు వచ్చారు బాణా కర్రలు, వంకర కత్తులు పట్టుకుని. తాను ఒక్కడు, వాళ్లు చాల మంది. అయినా కర్ర సాముతో అంత మందిని చాన సేపు దూరం పెట్టినాడంట. పొద్దున చూస్తే చేనిలో జొన్న కర్రలన్నీ పశువులు తొక్కినట్టు పడిపోయి వున్నాయంట. చెంచురెడ్డి ఒళ్లంత గాయాలై నెత్తురోడుతూ పడి వున్నాడట.
అమ్మ ఈ కథ ఎంత మైమరిచి చెప్పేదంటే నేను అడిగి అడిగి చెప్పించుకునేది తనతో. తను అస్సలు మాటకారి కాదు. ఈ కథ చెబుతున్నప్పుడు… ఒళ్లు మరిచిపోయేది. అంతే. ఆ వీరత్వం ఆమె జీవితంలో లేదు. ఇంట్లో డొమెస్టిక్ వైలెన్సు వుండే అవకాశంలేదు. అమె అస్సలు నాన్నను ఎదిరించి మాట్లాడేది కాదు. అది పతి భక్తి అయ్యుంటే ఇక్కడ రాసే వాడిని కాదు. అది పతి భక్తి కాదు. భయం. భయం.
భయం, కన్నీళ్ళు కలిసి మనిషి రూపంలో తిరుగుతున్నట్టుండేది అమ్మ.
తనలో సెన్సాఫ్ హ్యూమర్ లేదా అంటే, వుంది. చిన్న ఉదాహరణ. అప్పటికి నాకు నా మరదలు జయమ్మ అంటే ఇష్టమని, తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పి వున్నాను, అయినా సరే కట్నం రాకపోతుందా అని నాన్న అనుకుంటూ వుండినాడు, అది వేరే సంగతి. అప్పుడు చలి కాలం మా ఇంటి మంచాలు బయట కాకుండా లోపలి పడ్సాలలో వుండేవి. ఒక మంచం వంటింట్లో కూడా వుండేది. అమ్మ వంట పనిలో వుంటే నేను వంటింట్లో మంచం మీద పడుకుని… అదేదో సినిమా పాట ‘పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా” అని హమ్ చేస్తున్నాను. ‘ఆ వస్తుందిలే జయమ్మ పగలైతే దొరవేరా అనుకుంటా..’ అని అనేసే సరికి అమ్మలో ఇంత సెన్సఫ్ హ్యూమర్ వుందా… అదీ స్త్రీ పురుష ప్రేమ విషయంలో… అని ఆశ్చర్య పోయాను. ఆలాంటి సందర్భాలు అరుదు. ఇంట్లో జోకులేసుకుని పగలబడి నవ్వుకోడం మగపిల్లలం మేము చేసే వుంటాం, అమ్మ అలా ఎప్పుడూ నవ్వ లేదు.
కొండమీది బొల్లవరం, అమ్మ పుట్టిన వూరు దాదాపు ఆడివిలో, కొండ మీద వుంటుంది. ఉప్పు పప్పు వంటివి కూడా కాస్త ఎక్కువగా కొనాలంటే ‘దిగోన’ గడివేములకు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. దానికి తోడు పుట్టిన ఇంట్లో తను, వాళ్ల అన్న తప్ప మరెవరూ వుండే వారు కాదు. ఏ పదేళ్ల ప్రాయం నుంచో ఇంట్లో వంట, ఇల్లు చూసుకోడం తనే. అంటే బాల్యంలోనే నెత్తి మీద పెద్ద బాధ్యతలు. తను మా ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక అత్త, ముగ్గురు ఆడపడచులు. తొందరలోనే వాళ్లందరూ వెళ్లిపోయి, మళ్లీ ఒక్కతె స్త్రీ అయిపోయింది.
దానికి తోడు… కుత్తుక బంటి అప్పులతో నాన్న. ఆ అప్పులు సహజమైనవి కాదు. పంతానికి పోయి నెత్తికి ఎత్తుకున్నవి. కాస్త తరచి చూస్తే ప్రతి ఇల్లూ ఒక మహాభారతం అనేది ఉబుసుపోక మాట కాదు. వాస్తవం. మహాభారతం వంటి ఎపిక్ కథలో వుండే సరుకంతా… చూసుకుంటే… మన జీవితాల్లో వుంటుంది. మన జీవితాల్లోని చాల ఘటనలకు మహాభారతంలో ప్యారలల్స్ కనిపిస్తాయి (ఒక్క మహిమలు, ధర్మ బోధలు తప్ప).
ఈ కాలమ్ మొదట్లోనే నా పేరు హనుమంతరెడ్డి ఎందుకయిందో, మా దాయాదుల్లో ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు హనుమన్నామకులు ఎందుకు వుంటారో చెప్పాను. అది ‘ఆది పర్వం’ కాదా? అలా ఎపిక్ గుణమున్నవే మా చిన్నాన్న శివారెడ్డి కుటుంబంతో మా ఇంటి తదనంతర సంబంధాలు కూడా.
చిన్నాన్న వాళ్ళ నాన్న పేరు పెద్ద అనిమిరెడ్డి. ఆయన బయట అరుగు మీద కూర్చుని చిన్న పోర్టబుల్ ఇనుప రోలులో ఆకు వక్క దంచుకుంటూ, నోట్లో పెట్టుకుని నముల్తూ పెద్దమనిషి వ్యవహారాలు చేయడం లీలగా గుర్తు. ఆయన కన్న మా నాన్న తండ్రి చిన్న వాడు, కాని త్వరగా చనిపోయాడు. నాన్న పెళ్లి చేసుకుని సంసారాన్ని చేతిలోకి తీసుకుని, పెద్ద చెల్లెలికి పెళ్లి చేసిన ఉత్సాహంలో వుండగా ఒక సంఘటన జరిగింది. అది మా జీవితాల్ని ఒక ‘యుగాంతం’ వరకు నడిపించిన సంఘటన. (నాన్న జీవిత కాలం మాకు ఒక ‘యుగం’మరి).
గుడ్డి రంగారెడ్డి అనే ఒకాయన ఎందువల్లనో మా వూరు వదిలి వెళ్లిపోతూ తన ఆస్తి పాస్తులు అమ్ముకున్నాడు. ఆయన అస్తులలో ముఖ్యమైనది ఒక కళ్ళం. కళ్లం అంటే రాసీమ రైతు మాసూలు తెచ్చుకుని, పంట తదనంతర (పోస్ట్ హార్వెస్టింగ్) పనులు చేసుకునే పర్మ నెంటు ఆవరణ. ఆ కళ్ళం తను కొనుక్కోవాలని మా నాన్న కోరిక. తాను కొనుక్కోవాలని మా అనిమిరెడ్డి అబ్బ (శివారెడ్డి చిన్నాన్న వాళ్ళ నాన్న) కోరిక కూడా. చివరికి ఆ కళ్ళాన్ని సవాలు వేశారు. సవాలు వేయడం అంటే వేలం వేయడం.
ఈ పెదతండ్రీ, కొడుకులు సవాలులో పోటీ పడ్డారు. పంచాయతీలు, యవ్వరాలు జరిగే మఠం అరుగుల మీదనే జరిగిందట ఈ సవాలు ఘటన. మా నాన్న చెల్లెలి భర్త, నాన్న కన్న పెద్దవాడు… అంటే తన బావ, గాలి రెడ్డి మామ ఆ రోజు నాన్నతో వున్నాడు. ఆయన కూడా నాన్నను ప్రోత్సహించాడు. మిగతా పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు ఆశ్చర్యపోతూ, భయపడిపోతూ ‘సభాపర్వ’పు చోద్యం చూశారు. మా నాన్న తన పెదతండ్రిని ఎదిరించి ఆయన సవాలు (వేలం) పాడినప్పుడంతా వేలం పెంచి పాడుతూ పోయాడు. చివరి పాట మా నాన్నదే అయ్యింది. ఆ రోజు ఆ కళ్ళం ధర నాలుగు వేలు. అందుకు గాను గుడ్డి రంగారెడ్డికి రాసి ఇచ్చిన బాండు (ప్రామిసరీ నోట్) ను నేను చూశాను. అప్పటికి అది అలివి గాని ధర. దాన్ని తీర్చలేక వడ్డీ పెరిగిపోయి, కుటుంబం అప్పుల పాలయి, చదువుకుని పడబొడుస్తాడనుకున్న పెద్ద కొడుకు ‘దేశాలు పట్టుకుని పోయి’… చివరి వరకు కోలుకోలేని దుఃఖంలో మునకలేసి… యాభై నిండీ నిండక ముందే చనిపోయాడాయన.
అమ్మ కుంతి లాగ, ద్రౌపది లాగ ధీరోదాత్త కాదు. చాల అమాయకురాలు. భయస్తురాలు. ఒక సారి నేను, అమ్మ ఆమె పుట్టినింటికి వెళ్లి గడివేములలో బస్సెక్కి మా వూరు వచ్చాం. బస్సులో అమ్మ చీరె పెట్టుకున్న సంచీ పోయింది. చీరె పోతే ఒక పల్లెటూరి స్త్రీగా అమ్మ బాధ పడడం మామూలే. అమ్మ బాగా ఏడ్చింది. చీరె పోయినందుకు కాదు. చీరె పోయిందని తెలిసి నాన్న ఏమంటాడో అని. అంత భయం నాన్నంటే తనకు. నాన్న మమ్మల్ని కొట్టడాన్ని అమ్మ అసలు సహించగలిగేది కాదు. మనసు చాల కష్టపెట్టుకునేది. కాని, ఎదిరించేది కాదు. గుడ్ల నీళ్ళు కుక్కుకుంటూ నిలబడేది.
అదిగో ఆ అమ్మ బిడ్డను నేను. ఆమె పెద్ద కండ్లు నాకు వచ్చాయని అంటారు. అదేమో గాని. అమె లోని భయం, నాన్న లోని అసహనం అలాగే వచ్చేశాయి నాకు. బిఎస్సీ మూడో ఏడాది పరీక్షలు ఎగ్గొట్టి ఇంటికి పోవడానికి… అంతకు మించి వేరే కారణం నాకు కనిపించదు. ఇంటికి వచ్చి చదువులకు దూరంగా ఏడాది గడిపి తిరిగి పరీక్ష రాస్తే వచ్చిన మార్కులతో ఎమ్మెస్సీ జువాలజీ సీటొచ్చింది. (సీటు రావడానికి అప్పటి విసీ బుల్లెయ్యకు ఎమ్మెల్యే అయ్యపు రెడ్ది రాసిచ్చిన ఉత్తరం వుపయోగపడిందా?, అది సరిగ్గా గుర్తు లేదు). నేను ఇక సైన్సు వద్దనుకున్నాను.
తెలుగెమ్మే చదువుతానన్నాను వీసీ బుల్లెయ్యతో. ఆయన నవ్వి ‘అదయితే, ఇంకేం, వెళ్లి కాకర్ల వేంకట రామ నర్సింహం గారిని కలు’ అని చెప్పారు. నర్సింహం గారే అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంటు హెడ్. అయన దగ్గరికి వెళ్తే, ‘లొయొలా నుంచి వచ్చావు, నీకు జువాలజీలో సీటొచ్చించి కదా, ఈ తెలుగెమ్మే ఎందుకు పనికి రాదని నీకు తెలీదా’ అన్నారు. అయినా మనం చేరిపోయాం. నా అనుమానం, మరే సబ్జెక్టయినా అయితే అసలు చదివే వాడిని కాను. తెలుగు భాషా సాహిత్యాలు కాబట్టి ఆ రెండేళ్లు గడప గలిగాను.
కాదు. ఆ రెండేళ్ళు నన్ను బతికించింది తెలుగెమ్మే కాదు. విశాఖపట్నం. ఆ వూళ్ళోని సముద్ర తీరం. సముద్ర తీరపు ఇసుకలో (‘సీ శాండ్స్’ లో) దొరికిన ఒక మంచి కుటుంబం. నేను మరీ అంత వ్యర్ఠుడిని కాదని, నా లోపలి అతి భావుకుడిని ఇష్ట పడే లోకం కూడా ఒకటుందని… కృష్ణక్క కుటుంబాన్ని చూశాకే నాకు నమ్మకం కలిగింది. అక్కడ నాకు మరొక అదృష్టం కూడా కలిసొచ్చింది. అప్పటికే వుండిన నిబద్డత వల్ల ఆ అదృష్టాన్ని వద్దనుకున్నాను. అందుకు ఏమీ రెగ్రెట్స్ లేవు, ఏవో కొన్ని ఇన్నాక్యువస్ తీపి వూహలు తప్ప.
నిబద్ఢతేమిటి అంటారా? అది అంతకు ముందే వుండింది గాని, ఒక ఏడాది ‘అచదువు వాసం’లో గట్టి పడింది. ఆ నిబద్ధత పేరు జయమ్మ.
లొయొలా వదిలేశాక, తిరిగి పరీక్షల వరకు ఏం చేయాలో తెలియలేదు. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటానని దాని వల్ల ఏమైనా ఉద్యోగం వస్తుందని చెప్పాను ఇంట్లో. మా తమ్ముడు,శివా రెడ్డి అప్పుడు నందికొట్కూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వెళ్లి తన గదిలో వుండే వాడిని. సాయంత్రాలు ‘వాకింగ్’ పేరిట రోడ్ మీదికి వెళ్ళే వాడిని. ఆ వూళ్లో ఒక్కటే పెద్ద రోడ్డు. నందికొట్కూరు నుంచి ఆత్మకూరు, శ్రీశైలం వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు మీద నందికొట్కూరు దాటగానే వచ్చే వూరి పేరు మండ్లెం. మండ్లెం మా జయమ్మ వాళ్ళ వూరు. జయమ్మ నా మరదలు. తను కూడా మా తమ్ముని కాలేజీలోనే ఇంటర్మీడియట్. తమ్ముడికి ఒక సంవత్సరం సీనియరు. రోజూ గుర్రం బండిలో నందికొట్కూరు కాలేజీకి వచ్చి వెళ్ళేది. నేను సాయంత్రాలు ఆ రోడ్డు మీద ఎక్కువగా కనిపించడానికీ కారణం తనే అని పాపం తనకు అప్పుడు తెలిసింది కాదు. తెలిసుంటే ముంచుకు రానున్న ప్రమాదం గురించి జాగర్త పడేదేమో 🙂
అలా గడిచించి ఆ నిర్విద్యా నిరుద్యోగ సంవత్సరం. పరీక్షలూ అవీ వున్నప్పుడు జయ, అమె చెల్లెలు మహేశ్వరి వచ్చి మా గదిలోనే చదువుకునే వారు. అప్పుడు నేను అనే ఒక పెద్ద మనిషి అదే గదిలో.. చదువుకుంటున్న తనను దొంగచాటుగా చూసుకుంటూ వుండే వాడు అని కూడా.. తనకు అప్పుడు తెలీదు. 🙂
విజయవాడలో తమ్మినేని పుల్లయ్య వంటి మనసున్న మిత్రుడు, విశాఖలో క్లాసులోనే నన్ను ఇష్టపడే మగ్గురు నలుగురు స్నేహితులు, కొండంత అండ అనిపించే ఒక మనస్వి కుటుంబం, నీ కన్నీళ్ళు ఎంతరా పిచ్చోడా అని నిరతం నన్ను వూరడించే సముద్రం… అప్పటికి మనసులోనికి ఇంకి నాకొక వ్యక్తిత్వాన్నిచ్చిన కొన్ని మంచి పుస్తకాల పరిచయం… ఇన్ని వున్నా…. అప్పుడు, ఆ అ తరువాత… ఎస్… ఇప్పుడు కూడా నన్ను నడిపిస్తున్నది భయమే. భయం పట్ల నాకొక ఫెటిష్ వున్నదేమో అని నా మీద నాకు అనుమానం.
అయినా, మనల్ని వెన్నాడే, వేటాడే భయం గురింది భయపడాల్సిందేమీ లేదు. భయాన్ని మనకు తగినట్లు మలచుకోవాలి. మనక్కావలసిన దాన్ని మనం అందుకోడం కోసం ఈ భయంకరత్వంలో నుంచే చేయి చాచాలి.
//అమ్మా!//
ఏం, మృత్యువు లోంచి చేతులు చాచ లేనా!
కాళిందుడి తల మీద చిన్ని కృష్ణుని వలె
మృత్యువు పడగపై తాండవమాడలేనా!
సాధ్వి సావిత్రి నుంచి ఒక పురాతన స్వప్నాన్ని అరువు తెచ్చుకోలేనా!
తెలియనితనమే అద్భుతాయుధమై రహస్య శత్రువును మట్టడించలేనా!
ఒక ప్రయత్నం
జొన్న చేను
అర్ధరాత్రి,
ఒకే ఒక్క యువకుడు
విరుచుకుపడిన బాణా కర్రలు
పిల్లలకు అన్నంగా మారాల్సిన మట్టి నిస్సహాయంగా ఆక్రోశించింది
అధర్మం అధర్మం అధర్మం అతడొక్కడు
మాత్రుగర్భంలో తెలుసుకున్న మరణ రహస్యాన్ని మోసిన వాడు
రాయల సీమ రైతు
బాణా కర్రలు, వంకర కత్తులే నిట్టాళ్లుగా ఇల్లు కట్టుకున్న వాడు
మనుషులు ఎప్పుడో మరణించారక్కడ బతికున్నది బాణాకర్రలే
బాణా కర్రలు మాట్లాడాయి బాణా కర్రలు పడగెలెత్తాయి
సెంచు రెడ్డీ! నా పురాస్మృతీ! నీ మరణమేనా నేను?
అమ్మ లేదనుకున్నాను, అబద్ధం
అమ్మ చెప్పిన పాటవు నువ్వు కూడా బతికే వున్నావు పచ్చి పచ్చిగా
మృత్యువు లోంచి జీవితాన్ని మాట్లాడాలి
జన్యుపదార్థపు రంగులతో కొత్త చరిత్రను గీయాలి
కాలాన్ని కకావికలం చేయాలి, సృష్టించడం కోసం మరణించాలి
కొండమీది బొల్లవరం
కడుపులో బంగారం దాచుకున్న నల్ల మట్టి
తరతరాలుగా
భయానికి భయానికి మధ్య తెగించే బతుకు వేరు
ఎండకు తడుస్తూ వానకు ఎండుతూ
బాబెల్ గోపుర శిథిలంలా
‘….. అయినా సరే, బతుకు పోరు ఆగద’ని
తర్జని వలె ఆకాశాన్ని బెదిరిస్తూ
ఊరి నడిబొడ్డున నిటారుగా నుంచున్న బురుజు
మీ ఇల్లు సరిగ్గా ఆ బురుజు నీడలోనే ఎందుకుందమ్మా!
ఒక్క రాయి జారి పడితే నెత్తి పగిలే బురుజు కింద అంత నిర్భీతిగా
ఎలా ఆడావు ఎలా పాడావు?
అమ్మా అమ్మా అప్పుడు కూడా నువ్వున్నావా?
ఊరు లేనప్పుడు చేను లేనప్పుడు
ఆకాశంలాగే నేల అనంతమై వుండినప్పుడు
ఎప్పటి ఆకలికి అప్పుడు ఆహారం సేకరించుకుంటున్నప్పుడు
బహుశా, నీ పదును దంతాలతో నువ్వే బొడ్డుతాడు కొరికి
నా వంటి మీద ఎర్రని మురికిని చేత్తోనో నాలుకతోనో తుడిచి
నీ రొమ్మును ఆబగా నోటిలో పెట్టుకున్న బిడ్డను
అపుడు కూడా ఇంత గర్వంగానే చూసుకున్నావా?
ఎవరికి వారు బతకాల్సిన చోట తనకు తాను బతకలేని బిడ్డను
ఇలాగే నీ నడుం వంపులో మోశావా?
అప్పుడు కూడా నువ్వు వున్నావనేది నిజమైనప్పుడు
ఇప్పుడు లేవని ఎలా అనుకుంటాను, వున్నావు నువ్వు
నా పేగుల్లో, నా నోటిలో, నాలుక మీద, గొంతులో
మధుర పయస్వినివై, పాల సముద్రమై, మోసం చేయని మోహినివై
నా కోసం కడవలో తియ్యని జొన్న అంబలివై
పిల్లులకు అందని ఎత్తున వుట్టి మీద
ఆవటీలేసిన పంది మాంసం ముక్కవై
నువ్వు వున్నావు
బిడ్డలు వున్నంత కాలం నువ్వుంటావు
(1996-2012)
(ఎమెస్కో ప్రచురించిన నా ‘గొడ్డలి బుజం’ కవితా సంపుటి, ‘అమ్మా’ కవితలో చివరి భాగం)
(వచ్చే వారం ‘వామ్మో ఎన్ని నీళ్లో… ?!”)
01-06-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s