మా రమణ మూర్తి సారు

స్మృతి 10

తలముడిపి హైస్కూలులో చివరి సంవత్సరం చాల హెక్టిక్ గా గడిచింది. జ్వర తీవ్రత అంటే ఏమిటో అప్పుడే అనుభవానికి వచ్చింది. తలముడిపి హైస్కూలులో చేరాక ఎనిమిది, తొమ్మిది తరగతులలో మా వూరి నుంచి స్కూలుకు రోజూ రాను పోను మూడు గంటల నడక. నడకలో… దొరికితే డిటెక్టివ్ నవలలు లేదా రాత్రి వచ్చే కలల కన్న బలమయిన నడక కలలు. కదం కదం ఒక స్వప్న శకలం.
నేను జయించగలననే ఒక నమ్మకమే ఆ కలల వెనుక బలం. నాలోని ఈ బలాన్ని, ఊహా బలాన్ని మరింత పెంచి, దాన్ని ఒక ఆయధంగా మలిచి ఇచ్చి, లోక వ్యూహం లోనికి పంపిన ‘శిల్పి’ మా రమణ మూర్తి సారు. ఈ శిల్పం బాలేకపోతే, తప్పు రాయిదే, శిల్పిది కాదు.
ఎనిమిదో తరగతి నుంచీ మా క్లాస్ టీచరు అవధానం వేంకట రమణమూర్తి సారు.
ఆయన మాటలతో ఉత్తేజం పొందే వరకు… అందరి లాగే నాకూ… చదువంటే ‘బట్టీ పట్టడమే’. బట్టీ అంటే ‘భట్టీయం’ వేయడం లేదా కంఠతా పట్టడం అని అర్థం. ఒక్కో పదాన్ని చాల సార్లు వల్లె వేసి, ఆ పదాన్ని తరువాతి పదంతో కలిపి మరి కొన్ని సార్లు వల్లె వేసి, … అలా ఒక వాక్యం.. ఆ వాక్యాన్ని తరువాత వాక్యంతో కలిపి… అలా ‘స్టోరీ’ అంతా వల్లె వేయడమన్న మాట. కథ, వ్యాసం ఏదైనా అది మాకు ‘స్టోరీ’నే. నేర్చుకునే పదాలకు అర్థం ముఖ్యం కాదు.‘చెప్పడం’ కాస్త ఆగిందా, స్టోరీ గోవిందా. ఇక సాగదు. ‘పాట’ మళ్లీ మొదట్నుంచి మొదలెట్టాల్సిందే.
బట్టీ పట్టడం ఎంత ఘోరంగా వుండేదంటే… కొందరు పిల్లలు లెటర్ రైటింగులో విరామ చిహ్నాల్ని కూడా బట్టీ పట్టీ వారు, ‘మిట్టకందాల కామా డేట్ ఫుల్ స్టాప్” అంటో. అది మా హెడ్మాస్టరు బామ్మరిది గొంతు. మిట్టకందాల వాళ్ల వూరి పేరు.
ఎనిమిదో తరగతి చివర్లో రమణ మూర్తి సారు చెప్పారు:. “కథను ఒకటికి పది సార్లు కథగానే చదవండి. దేని తరువాత ఏమి జరిగిందో తెలుస్తుంది. మీకు తెలిసినవి కాకుండా స్టోరీలో వచ్చిన కొత్త పదాలు ఏమిటో చూడండి. కొత్త పదాల అర్థం తెలుసుకుని, వాటిని మాత్రం ఎక్కువ సార్లు మననం చేయండి. ఇక పరీక్షలో మీకు గుర్తుకు వచ్చిందే రాయండి. గుర్తుకు వచ్చినట్టే రాయండి.”
ఆ తరువాత పరీక్షలో ఆయన మాటల్ని తుచ తప్పక పాటించాను. ఒక ఇంగ్లీషు పరీక్షకే కాకుండా సామాన్య, సాంఘిక అన్నిటిలో అదే పని చేశాను. ఈ పరీక్షల్లో మనం ఔట్ అనే అనుకున్నాను.
పరీక్షల శలవులు అయిపోయాయి. మళ్లీ బడి మొదలైంది. క్లాసులో పరీక్ష పేపర్లు ఇస్తూ రమణమూర్తి సారు నాకు ఇరవయ్యయిదుకు ఇరవై రెండు మార్కులు వచ్చాయని చెప్పడం క్లాసులో సెన్ఫ్సేషన్ అయిపోయింది. అయినా మిగతా పిల్లలు కొత్త పద్డతిని తీసుకోలేదు. ఆ తరువాత నేను దాన్ని వదిలెయ్యనూ లేదు. దీని వల్ల తక్కువ సమయంలో ఎక్కువ చదువుకోవచ్చు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుస్తుంది.. అని నాకు తెలసిపోయింది. ఇతర పిల్లలు ఆందోళనగా చదువుకుంటున్నప్పుడు కూడా నేను నింపాదిగా వుండగలిగే వాడిని.
పరీక్షలప్పుడు, అందరూ పరీక్ష హాలుకు పుస్తకాలు తెచ్చుకుంటారు. లోపలికి రమ్మని బెల్లు కొట్టాక, పుస్తకాలు జాగర్తగా ఒక చోట పెట్టి లోపలికి వెళ్తారు. అంత వరకు అటు ఇటు తిరుగుతూనో ఒక చోట కూర్చునో చదువుతూనే వుంటారు.
నేను ఇక్కడ కూడా సారు మాటను పట్టించుకునే వాడిని. సరిగ్గా పరీక్ష ముందు ఆందోళనగా చదవొద్దు. అప్పటి వరకు చదవకపోతే ఆ అరగంటలో ఏమీ రాదు అనే వారాయన. నేను పరీక్ష హాలుకు పుస్తకం తీసుకెళ్లే వాడిని కాదు. ప్రెండ్సు చదువుకుంటూ వుంటే నేను వూరికే వుండడం వాళ్లకు విచిత్రంగా, తరువాత కాస్త ఫ్ఫ్యాసినేటింగ్ గా వుండేది. నాలో భయం లేక కాదు. భయపడి చేసేదేమీ లేదని అనుకోడం వల్ల. ఇలా ‘ఎక్కువగా చదువకపోవడం’ వల్ల మనకు ఇంటెల్లిజెంట్ అనే పేరొచ్చింది.
అలా పేరు రావడానికి రమణ మూర్తి సారు చాల దోహదం చేశారు. పాఠం చెబుతున్నప్పుడు వాక్యం మధ్యలో ఆపి నా వైపు చూసే వారు. నేను వాక్యం పూరించాలన్నమాట. ఇలా చేసినప్పుడంతా నా మీద నాకు గొప్ప విశ్వాసం కలిగేది. ఆ ఆత్మవిశ్వాసం తరువాత్తరువాత నాకు మిరకిల్స్ చేసి పెట్టింది.
సారు తను చేసినవేవీ డ్యూటీ అనుకుని చేయలేదు. అది ఆయన స్వభావం.
చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక రోజు సాయంత్రం స్కూలులో ఆలస్యమయ్యింది. ఇంటికి నడిచి వెళ్లడం కష్టం. లేక బద్డకించానో. జేబులో టికెట్ డబ్బు లేక పోయినా బస్సు ఎక్కాను. కండక్టరు ఏం గమనిస్తాడులే అని ఆశ. ఆ రోజు కండక్టరు నన్ను గట్టిగా టికెట్ అడిగే సరికి ఏం చేయాలో తెలీలేదు. ఏడ్చేశాను. అప్పుడు వెనక సీటు లోంచి పిలుపు. రమణ మూర్తి సారు. ఆయన ఎక్కడికో వెళ్తూ బస్సులో వున్నారు. నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నారు. కండక్టరుకు నా టికెట్ డబ్బులిచ్చి, ‘అలా ఏడవడం వల్ల ఏమీ రాద’ని, ‘ఏం చెయాలో అది చేయాలి గాని ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాద’ని ఎంత బాగా చెప్పారంటే, నేను ఇప్పటికీ ఏడుస్తాను గాని, ఏడుస్తో ఆయన మాటల్ని గుర్తు చేసుకుని వూరడించుకుంటాను.
‘కండక్టరు నిన్ను దించేస్తే ఏమవుతుంది, రోజూ లాగే ఇప్పుడు నడిచే వాడివి, అంతేగా” అనే మాట నా మీద మంత్రంలా పని చేసింది. చాల మందిలా ఆయన ‘డబ్బుల్లేకుండా బస్సెందుకెక్కావ్రా’ అని కోప్పడి వుంటే అది నా అత్మవిశ్వాసాన్ని పెంచడానికి కాకుండా, తుంచడానికి వుపయోగపడేది. ఆయన నా కోసం అర్ధ రూపాయి ఖర్చు పెట్టడం చాల ఇన్ఫార్మల్ గా చేశారు. నాకు నేను చేసుకున్నట్లుగా చేశారు. లేదా తనకు తాను చేసుకున్నట్లుగా చేశారు. (ఆ రోజుల్లోఅర్థ రూపాయి ఎక్కువ డబ్బే).
ఇలాంటిదే ఇంకో ఉదాహరణ వుంది. దానికి ముందు మరి కొన్ని విషయాలు చెప్పాలి.
అప్పుడు 11+1 పద్డతి వుండేది. ఇప్పటిలా 10+2 పద్డతి కాదు.
పదో క్లాసు తరువాత ‘పబ్లిక్’ ఎగ్జామ్, ఆ పైన రెండేండ్ల ఇంటర్మీడియట్ ఇప్పటి పద్డతి. పదకొండో క్లాసు చివర ‘పబ్లిక్’ ఎగ్జామ్, ఆ పైన ఒక ఏడాది ‘ప్రీ యూనివర్సిటీ కోర్సు’ అప్పటి పద్డతి.
పదకొండవ తరగతిని ఎస్సెస్సెల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) అనే వారు. ఎస్సెస్సెల్సీ ఒక పెద్ద గండం. చాల మంది చదువులు అక్కడితో ఆగిపోయేవి. లేదా అక్కడే కొన్ని ఏండ్లు తీసుకుని తీసుకుని ఆగిపోయేవి. మార్చి, సెప్టెంబరు’ అనే మాట దాంతోనే ప్రచారంలోకి వచ్చిందనుకుంటాను.
ఈ సంగతులు ఇప్పుడు చాల మంది విద్యాధికులకు తెలిసివుండవని ఇంత వివరంగా చెబుతున్నాను. మా వూళ్లో ఎస్సెస్సెల్సీ పాసయిన వాళ్లు…. మా కన్న ముందు నాగన్న అనే ఒక సీనియర్ తప్ప ఎవరూ లేరు. నాతో పాటు ఎస్సెస్సెల్సీ పాసయిన మరి ముగ్గురిలో ఒక అబ్బాయి పేరు మద్దులేటి. ఆ రోజుల్లో ఎస్సెస్సెల్సీ పాస్ కావడం కష్టమని ఎంతగా అనుకునే వారంటే, మద్దులేటిని వాళ్ల బజారులో ‘బడెన్న’ అనే వారు. (బడికి పోయే వాడు బడెన్న).
(ఈ మద్దులేటి ఉరఫ్ మధు జీవితం ఆధారంగా ఆర్థిక స్పెక్యులేషన్ మీద నేనో ‘మాంఛి’ కథ రాశా. ‘నవ్య’ పత్రికలో ‘కనిపించని చెయ్యి’ అనే పేరుతో అచ్చయ్యింది. మధు నిజంగానే ఇప్పుడు ‘కనిపించడం లేదు’)
అలాంటి ఎస్సెస్సెల్సీ గండం గడవాలంటే రోజుకు మూడు గంటల ప్రయాణం కుదరదని అనుకున్నారు పెద్దాళ్లు. ఆ ఒక్క ఏడాది నేను తలముడిపిలోనే వుండి చదువుకోవాల్సి వచ్చింది. సేమ్ ప్రాబ్లెమ్. ఎక్కడుండాలి? ఉండడం సరే. గడివేములలో చేసిన పనే చెయ్యొచ్చు. తినడం? తలముడిపిలో హోటల్ లేదు. వాట్టుడూ?
ఆ యేడాదే అనుకుంటాను, మా స్కూలుకు అనుబంధంగా ఒక ‘పూర్ బాయ్స్ హాస్టల్’ మొదలెట్టారు. ప్రభుత్వ నిధులతో నడిచే హాస్టల్. ఎస్ సీ, ఎస్ టీ విద్యార్థులకే ప్రవేశం. కాకపోతే, ఆ ఊరి పెద్ద మనిషి, వంగాల శేషి రెడ్డన్న మా శివారెడ్డి చిన్నాన్న స్నేహితుడు. చాల మంచి వాడు.
చిన్నాన్న ఒక రోజు నాతో పాటు వచ్చి శేషి రెడ్డన్నతో మాట్లాడాడు.
ప్రభుత్వం హాస్టల్ లో పిల్లల కోసం తలసరి నెలకు పదిహేను రూపాయలు ఇస్తుంది. నేను స్వయంగా నెలకు పదిహేను రూపాయలు చెల్లించాలని ఒప్పందం. రెండు పూటలా సంకటి. మా ఇంట్లో కూడా అదే కాబట్టి నో ప్రాబ్లెం. పొద్దున జొన్న రొట్టె. గడివేముల లాగా పొద్దున ఫలారం చాలదనే బాధ కూడా లేదు.
ఆ ఏడాది నిజంగా ఒక యజ్ఞం. పొద్దున, సాయంత్రం రమణ మూర్తి సారు దగ్గర ట్యూషన్. ఒక పూట ఇంగ్లీషు గ్రామర్, ఇంకో పూట కాంపోజిట్ లెక్కలు. (అప్పుడు కాంపోజిట్ లెక్కలు… అనగా, అల్జీబ్రా తప్పని సరి).
రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం చదివిస్తూ సారు చాల గొప్పగా పాఠం చెప్పారు. ‘ట్రిక్కులు’ అనిపించే మంచి అధ్యయన పద్డతులెన్నో చెప్పారు.
ఉదాహరణకు. ఒక రోజు నేను వెళ్లే సరికి ఆయన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ చదువుతున్నారు. ఆయన పక్కనే పెద్ద డిక్ష్నరీ వుంది. నేను వెళ్లాక ఏదో పదం కోసం నిఘంటువు చూశారు. ‘సారుకు ఇంగ్లీషు బాగా రాదేమో, డిక్ష్నరీ చూస్తున్నారు’ అని ఆశ్చర్యపోయాను.
ఆయన నవ్వి చెప్పారు. “ఏ భాషలోనైనా, బాగా చదువుకున్న వాళ్లక్కూడా తెలియని పదాలు పుస్తకాల్లో తగులుతాయి. ఆ పదం మన సొంతం అయ్యే వరకు, ప్రతిసారీ దాని అర్థం ఏమిటో చూడాలి. ఇది మనకు మనం భాష నేర్చుకునే పద్డతి”.
ఈ మాట నాకు భలే వుపయోగపడింది.
నా చదువు అయిపోయాక రెండు మూడేళ్లకు నక్సలైట్ కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ, పార్టీ పత్రిక ‘విమోచన’ ఎడిట్ చేయాల్సి వచ్చింది. చదువులో భాగంగా నాలుగేళ్లు ఆంధ్ర లొయోలా కాలేజీలో ఇంగ్లీషు మీడియం. దాని వల్ల పొందిన దాని కన్న పోగొట్టుకున్నదే ఎక్కువ. అదెలాగో తరువాత చెబుతా. దాని తరువాత చదివింది తెలుగెమ్మే. దేర్ఫోర్ మన ఆంగ్ల భాషా పరిజ్ఞానం మరీ అన్యాయం కాకపోయినా, చాల పరిమితం. ఇంగ్లీషు బాగా రాకపోతే, ‘ఈనాడు’ వంటి దిన పత్రికనే కాదు, పార్టీ పత్రిక ‘విమోచన’ వంటి టాబ్లాయిడ్ ను ఎడిట్ చేయడమూ కష్టమే.
నేను దిగులు పడలేదు. దానికి బదులు రమణ మూర్తి సారును గుర్తు చేసుకున్నాను. సుమారు ఆర్నెళ్ల పాటు రోజూ హిందూ చదివే వాడిని. అందులో ఎడిటోరియల్ పేజీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వాడిని. కొత్త పదం వస్తే చాలు డిక్షనరీ చూసే వాడిని. ఆర్నెళ్ల తరువాత పదా-ర్థాల కోసం తడుముకునే అవసరం తగ్గిపోయింది. ‘పబ్లిక్’ స్కూలుకు వెళ్లి చదువుకున్న అదృష్టవంతులలాగే మంచి మంచి పుస్తకాలెన్నో చదువుకోగలిగాను.
ఔనూ, బస్సులో టికెట్ డబ్బులు లేక ఏడ్చి, సారు మాటలతో పొందిన సంతోషం గురించి చెబుతూ ఇలాంటిదే ఇంకో ఘటన… అని ‍అన్నాను కదూ?! ఆ ఘటనేమిటో చెప్పొద్దూ?!
ఓ రోజు ఉదయం ట్యూషన్ లో నా సహాద్యాయులలో ఎవరో ‘ట్యూషన్ టైము మార్చాల’ని సారును అడిగారు. ఎందుకు అని అడిగారు సారు. ‘పొద్దున్నే స్నానం అదీ చేసి, తయారై రావడం కష్టమవుతోంద’ని జవాబు. ట్యూషన్లో ఇంకా ముగ్గురు నలుగురు వంత పాడారు.
నాకు అర్థం కాలేదు. ‘తయారు కావడం ఎంత సేపు, నిద్ర లేచిన వెంటనే పుస్తకాలు తీసుకుని రావొచ్చు కదా’ అన్నాన్నేను. ‘ఇంట్లో అప్పటికి వేన్నీళ్లు వుండవని, స్నానం కష్టమ’ని సహాధ్యాయి పట్టు. ‘స్నానానిదేముంది, ఆదివారం ఎట్టాగూ లేటుగానే వస్తాం కదా’ అన్నాన్నేను. అందరూ ఫక్కున నవ్వేశారు.
ఇక్కడ జోకేమిటో మీకు అర్థమయ్యుండదు. ‘స్నానం వారానికొక సారి చాలుగా’ అని అంటున్నాన్నేను.
తలముడిపి వంటి పరాయి వూళ్లోనయినా, అంతకు ముందు మా వూళ్లోనైనా నేను స్నానం చేసింది వారానికి ఒక్క సారే. కొందరు ఎక్కువ సార్లు చేస్తారని తెలుసు. బ్రాహ్మలు పూజ కోసం మరీ ఎక్కువ సార్లు స్నానం చేసి మడి అదీ పాటిస్తారనీ తెలుసు. రోజూ స్నానం అనేది నాకు అప్పటి వరకు తెలీదు. నా స్నేహితులు పగలబడి నవ్వడానికి అదీ కారణం.
ఒకరిద్దరు మిత్రులు ‘నువ్వు స్నానం చేసేది వారానికొక సారేనా, రోజూ చెయ్యవా’ అని అడిగారు. ఔనన్నాను. ఆ కొద్ది సేపట్లోనే అర్థమయిపోయింది. అక్కడి నాగరిక సమూహంలో నేనొక్కడినే పరమ అనాగరికుడినని. సిగ్గుతో తల వంచుకున్నాను. కళ్లలో నీళ్లు వుబికాయి.
ఎస్, సర్, అక్కడ నవ్వనిది రమణ మూర్తి సారు ఒక్కడే.
ఆయన నవ్వకపోగా, నవ్విన నా స్నేహితులను కోపంగా చూశారు. నన్ను చూసి “ఏడవొద్దు, ఇప్పట్నించి రోజూ స్నానం చెయ్యి” అన్నారు. నేను ఎవరిదో మేడ మీది సింగిల్ గదిలో వుంటానని ఆయనకు తెలుసు. నాకు అందుబాటులో బాత్ రూములుండవు. ‘పొద్దున్నే వాగుకు వెళ్తావుగా, అప్పుడు వాగులోనే స్నానం చెయ్యి’ అని చెప్పారాయన ఓపిగ్గా. అప్పట్నించి ‘రోజు స్నానం’ అనేది నేనూ చేస్తున్నాను. ఆ రోజు సారు నా పక్షాన నిలబడిన తీరును మరువను.
పేద వాడి పక్షాన నిలబడతామని కొందరు అంటూ వుంటారు. వాళ్లు అలా నిలబడడం, నిలబడుతున్నట్లు కనిపించడం ‘దీన జన బాంధవుల’ని అనిపించుకోడానికి కావొచ్చు. రకరకాల ‘ఓట్ల’ కోసం కావొచ్చు. రమణ మూర్తి సారు ప్రవర్తనలో నటన లేదు. ఈ సహజ సిద్ధ ‘సామాజిక స్పృహ’ ఆయనకు ఏ మేనిఫేస్టో నుంచీ వచ్చింది కాదు. బహుశా, అది తన రాజకీయ మేనిఫెస్టోని కాదని వచ్చింది.
రమణ మూర్తి సారు వామ పక్షీయుడు కాదు. ఏ పక్షం లేని వాడు కూడా కాదు. ఆరెసెస్. తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. తను చనిపోవడానికి ఒకటి రెండేళ్ల ముందు హైదరాబాదులో ఆయన రెండో కొడుకు, వామ పక్ష భావాలున్న నా స్నేహితుడు అవధానం రఘు కుమార్ ఇంటికి వెళ్లి కలిశాను. అదే ఆత్మీయత. అవే అభిప్రాయాలు. అయోధ్యలో మసీదు కూలిపోవడం ఆయనకు కష్టం కలిగించ లేదు. అక్కడ రామాలయం కట్టాలని ఆయన కోరిక. రఘు, నేనూ ఆయనతో వాదించాం.
వాదం వాదమే. ప్రేమ ప్రేమే.
నేను కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తున్నానని తెలిసి. ‘నువ్వు సమాజం కోసం పని చేస్తున్నావని తెలిసింది. గర్వపడ్డాను’ అని పని గట్టుకుని జాబు రాశారాయన.
క్లాసు రూంలో కూడా ఆయన రాజకీయం కాకుండా, సొంత స్వభావమే కనిపించేది. పదో తరగతిలో అనుకుంటాను. మాకు ఆయన సోషల్ స్టడీస్ పాఠం చెప్పారు. అప్పటి రష్యా అనుసరిస్తూ వుండిన ప్రణాళికా బద్డ అభివృద్డి గురించి చెబుతూ సోషలిజం, మార్క్సిజం, దాస్ క్యాపిటల్, లెనిన్, వసుధైక కుటుంబ భావన, కమ్యూనిస్టుల ఇంటర్నేషనలిజం వంటి సంగతులు పుస్తకంలో వున్నవీ లేనివి ఎన్నో విషయాల్ని అలవోకగా అద్భుతంగా పిల్లలకు పరిచయం చేశారు.
వ్యాస రచన పోటీలలో నేనొక సారి ఏవో కల్పిత వ్యాపారుల ఉదాహరణతో శ్రమ దోపిడీ గురించి నాకు తెలిసిందేమిటో రాస్తే, ‘నీకీ అధిక ప్రసంగమెందుకురా’ అని తిట్టేయలేదు. మెచ్చుకుని దువ్వానో, పెన్నో బహుమతి ఇచ్చారు. నా మొదటి ‘మహా ప్రస్థానం’ కాపీ రమణ మూర్తి సారు బహుమతిగా ఇచ్చినదే.
ఆ ఏడాది నేను కేవలం పాసుకావడానికి పరిమితం కాలేదు. పలు మార్లు నాకు ఫస్టు మార్కులు వచ్ఛేవి. నలుగురు విద్యార్థుల మధ్య పోటీ వుండేది. లెక్కల్లో దాదాపు ఎప్పుడూ నేనే ఫస్టు. మా నలుగురికి ఎలా కుదిరిందో తెలియదు. అందరి గదులు మేడ మీద వుండేవి. రాత్రులు ఒకరి దీపం ఒకరికి కనిపించేది. నిద్ర పోయే ముందు మిగతా వాళ్లు ఇంకా మేలుకున్నారా అని చూసే వాళ్లం
నేను క్రైం నవలలూ అవీ చదవడం మానలేదు గాని, టెక్స్టు పుస్తకాలకు చాల ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది ఆ ఒక్క ఏడాదే. చివరాఖరి పరీక్షల్లో నేను క్లాసులో నాల్గవ వాడినే అయ్యాను. ఒక రకంగా ‘ఓడిపోయాను’. అయినా ఆ ‘ఓటమి’ ఒప్పుకోబుద్డి కాదు.
ఆ ఓటమి హేతువు: పద్మావతి అనే ఒక స్త్రీ. అదెలా, అదేం కథా.. అంటారా? వినాలి మరి.
ఆ ఏడాది మా ఎస్సెస్సెల్సీ పరీక్షల సెంటర్ నందికొట్కూరులో పడింది. తెలుగు, ఇంగ్లీషు బాగా రాశాను. లెక్కల పరీక్ష రోజు ఎందుకో నా షర్టు బాగా మాసిపోయిందని నాగిరెడ్డి అని క్లాసు మేట్ షర్టు వేసుకుని వెళ్లాను. నాగి రెడ్డి నా కన్న బాగా ఎత్తు, లావు కూడా. తన షర్టు నాకు పెద్దది అయ్యింది. చేతులు పైకి మడుచుకున్నాను.
లెక్కల పరీక్ష మొదలయ్యింది. అరగంట గడిచిందేమో. ఒకామె హాల్లోకి వచ్చింది. తరువాత తెలిసింది. ఆమె పేరు పద్మావతి. జిల్లా విద్యాధికారి. డీఈఓ. ‘షర్టు పైకి మడిచావెందుకు’ అడిగిందామె నా దగ్గరికి వచ్చి. ఎందుకు మడవగూడదో నాకు తెలీదు.
మా అమ్మ, జేజి లేదా నాకు తెలిసిన వాళ్లు కాకుండా మరెవరో స్త్రీ నా దగ్గరికి వచ్చి అనుమానంగా ఏదో ఆడిగే సరికి ముచ్చెమట్లు పోశాయి. చాల భయం వేసింది. ఆమె నా షర్టు చేతి మడతలు విప్పించి చూసే సరికి, అదేదో బట్టలు విప్పించినట్లయి, మన పని పూర్తిగా అయిపోయింది.
అంత వరకు క్లాసులో లెక్కల పరీక్షలో ఎప్పుడూ నూటికి తొంభై మార్కుల కన్న తక్కువ వచ్చింది లేదు. చివరాఖరి పరీక్షలో వచ్చింది సరిగ్గా సగం , నలభై అయిదు.
ఇప్పటికీ అనుకుంటాను, అమ్మా పద్మావతీ, నా కొంప ముంచావు కదా తల్లీ అని.
ఇంతకూ, ఇంత జరిగాక కూడా మా క్లాసులో నేను నాల్గవ వాడినయ్యాను. నాల్గవ వాడినంటే ఎలాగో తెలుసా సారూ! మా క్లాసు ఫస్టు మార్కు కన్న నాలుగు మార్కులు తక్కువ. 75 నుంచి 71 వరకు మార్కుల్లో నలుగురం. ఈ నలుగురం వెళ్లి విజయవాడ ఆంధ్ర లొయోలా కాలేజలో చేరాం. అక్కడేం జరిగిందో తరువాత చెప్పుకుందాం.
లెక్కల పరీక్ష అంతగా చెడగొట్టినా, మనం ఆ మేరకు బతికి బట్ట కట్టాడానికి కారణం మా రమణ మూర్తి సారు.
ఆ రోజు పరీక్ష అయిపోయి ఇంటికి వెళ్లి ఏడుస్తూ కూర్చున్నాను. నా పని అయిపోయిందని ఇక ఇంటికి ఎట్టా పోతానని ఏడుపు. సారు వచ్చి ‘ఏం లెక్కల్లో ఫేలవుతానని భయమా’ అని అడిగారు. కాదన్నాను. ఇక నాకు మంచి మార్కులు రావు అని ఏడ్చాను. “లెక్కల్లో పాసవుతావు గాని మంచి మార్కులు రావు, మిగిలిన అన్నిట్లో చాల మంచి మార్కులు వస్తే అప్పుడో…” అన్నారాయన. ఆయన చెప్పిన తీరులో ఏముందో ఏమో “ఔను కదా” అనిపించింది నాకు. ఇక మిగిలిన సైన్సు, సోషల్ అన్నీ ‘యిరగదీశాను’.
నా కన్నీళ్లు చూసి, వాటిని తన మాటలతో తుడిచి, ప్రతి అవసర సమయంలో నా మీద నా నమ్మకాన్ని పెంచిన మహా మనీషి మా సారు. ఇంకెన్ని ఎదురు కెరటాలు చెలరేగినా ఎదురీదడానికి వూతమిచ్చే జ్ఞాపకం మా సారు.
నా ఎస్సెస్సెల్సీ రిజిష్టరు, కాండక్టు సర్టిఫికెట్ లో రమణ మూర్తి సారు రాసిన మాట నా కరదీపిక. “ఇంటెల్లిజెంట్ బట్ గల్లిబుల్”.
ఔను. అదే నేను. మై ఐసాయీ హూ.
థాంక్స్ ఎ లాట్ సర్

13-042016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s