పాశ్చాత్య దుర్వాసనా కారణం?

స్మృతి 14

మా శివారెడ్డి చిన్నాన్నకు నాకు తెలియక ముందు నుంచే కమ్యూనిస్టు పార్టీతో సంబ‍ంధాలు వుండినయ్.
నంద్యాలకు దగ్గరగా, మా వూరికి కాస్త దూరంగా వెల్గోడు అని ఒక వూరుంది. ఆ వూరి నుంచి బయల్దేరిన కమ్యూనిస్టు నాయకుడు చండ్ర పుల్లా రెడ్డి. మరో కమ్యూనిస్టు నాయకుడు మండ్ల సుబ్బారెడ్డిది కూడా ఆ వూరే. చిన్నాన్న, మరి కొందరు పుల్లారెడ్డిని అనుసరించే వారు. నాకు మామ వరుసయ్యే ఏరాసు అయ్యపు రెడ్దినీ, ఆయన రాజకీయాల్నీ వ్యతిరేకించే వారు. చండ్ర పుల్లారెడ్డి కోసం ఎర్ర జెండా పట్టుకుని వూరేగింపులో నడవడం ఉద్యమ జీవితానికి సంబంధించి నా మొదటి లీలా మాత్ర జ్ఞాపకం. అదీ ఎప్పుడో పుల్లా రెడ్డి ఎన్నికల రాజకీయాల్లో పాల్గొన్న రోజుల్లో.
చిన్నాన్న దర్బారు ఒక విచిత్ర సమాగమం. తన ఇంటికి కమ్యూనిస్టులే గాక, నాస్తికులు, చెట్ల పసర్ల వాళ్ళు, గుప్త నిధులు వెలికి తీసే వాళ్ళు ఎవరెవరో వచ్చే వారు. గుప్త నిధుల పిచ్చి చిన్నాన్నకు చివరి వరకు వుండేది. ఒక్కోసారి అది నవ్వు తెప్పించే స్థాయిలో వుండేది. నా అనుమానం అలాంటి పిచ్చి ఏదో ఒకటి లేకుండా మనుషులు మన లేరేమో. మనస్వులు అయిన మనుషులు అసలే వుండలేరేమో. ఎప్పుడూ ఏదో ఒక అబ్సెషన్ మనస్సును ఎంగేజ్ చెయ్యక పోతే మనస్సు ఓనరు దాన్ని భరించలేడేమో.
చిన్నాన్న ఇంటికి వచ్చే నాస్తికులతో నేను దేవుడున్నాడు అని వాదించే వాడిని. ఆస్తికుల స్టాండర్డు వాదం ఒకటుందిగా?! దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావూ… అని, అమ్మ నాన్నల నుంచి అయితే, వాళ్లెక్కడి నుంచి వచ్చారూ… అని జీడి పాకంలా సాగదీసే వాదం. ఆ టెక్నిక్కే అప్పుడు నాది కూడా. బిగ్ బ్యాంగ్ సంగతి అప్పుడు నాకు తెలీదు. వాళ్ళకూ తెల్సినట్లు లేదు. మా మధ్య డవిలాగు ఏ అమీబా దగ్గరో ఆగిపోయేది. చివరాఖరికి ఆ ఆమీబాక్కారణం దేవుడు అని నేను అరిచే వాడిని. దేవుడికి కారణం ఎవరూ… అని వాళ్ళు అరిచినట్లు నాకు గుర్తు లేదు.
దేవుడున్నాడని అన్నాను కదా, వూరికే అనడం కాదు, గట్టిగా వాదించాను కూడా, మరి నా దేవుడెవరు? ఇంకెవరు, నా పేరు తెలుసుగా… మరి, ఇక నా దేవుడు రాముడే అని అనుకునే వాడిని. నిజం చెప్పొద్దూ. మా వూళ్ళో ఆరెసెస్ శాఖ లేదు గాని, వుండుంటే వెళ్లి కనీసం కర్ర సామైనా నేర్చుకునే వాడిని. అంతకు మించి వాళ్ళు ఏమీ నేర్పరని ఇటీవల జే ఎన్యూ కన్నయ్య మీద చెప్పులు విసిరిన మహా మేధావుల వల్ల సవివరంగా తెలిసిపోయింది.
దానిలో చేరినా అక్కడ వుండిపోయే వాడిని కాదనుకుంటాను. దాన్నుంచి నన్ను కాపాడ్దానికి పుస్తకాలు వుండినయ్. అప్పుడు పుస్తకాలు చాల వరకు ప్రగతి శీలంగా వుండేవి. బాగా చిన్నప్పుడే కుంచెం రంగనాయకమ్మ, కుంచెం శ్రీశ్రీ పరిచయం వున్నారు. ఈవెన్ మామూలు కథలు కూడా అప్పుడు బాగా సెక్యులర్ గా వుండేవి. గొడుగు చెప్పులు ఎవరో ముని వల్ల సూర్యుడి నుంచి వచ్చాయనే చెత్త కథలు టెక్స్టు పుస్తకాల్లో వుండేవి. అవి బట్టీ పట్టి పరీక్షల్రాయడానికే, తెలివి కోసం కాదని … వెంటనే తెలిసిపోయేది.
ఇప్పుడు వినోదం పుస్తకాలు అలా లేవేమోనని, అబ్స్కురాంటిజం, కుల మత వాదం పాఠ్యేతర పుస్తకాల్ని బాగా పట్టేసిందేమో అని నా అనుమానం. లేకుంటే ఫేస్ బుక్ వంటి పబ్లిక్ స్థలాల్లో ఆ వాసనలు ఇంతగా కనిపించేవి కాదు. ప్రస్తుతం వూళ్ళతో సంబంధాలు సజీవంగా వున్న మిత్రులు చెప్పాలి వాస్తవం.
అసలు సంగతి… చిన్నాన్న దర్బారుకు వచ్చే నాస్తికుల వాదాలు నాకు నచ్చేవి కావు. వాళ్ళు చెప్పింది విన్నాక చాల ప్రశ్నలు అలాగే మిగిలిపోయేవి. చావు పుటకలకు ఆవల, అంతిమంగా ఏదో వుంది అదేమిటో మనకు తెలియదు. ఆస్తికులు చెప్పే జవాబు బాగో లేదు గాని, మీరు చెప్పేది అసలేమీ బాగోలేదు కదా అని వాళ్ళతో పేచీ పడే వాడిని. అప్పటికి వున్నంతలో నాకు ఆస్తికులు చెప్పేదే బాగుందనిపించేది.
అలా మొదలైంది నా బౌద్డిక జీవితం. అయితే అప్పుడు కూడా ఒక మంచి కన్విక్షన్ మాత్రం వుండేది. ఊర్నే ఏమీ చెప్పొద్దు, చెప్పింది చేయాలి అని. లేదా చెప్పడం మానేయాలని. అందుకే రాత్రులు రామాలయానికి వెళ్లి భజనలో పాల్గొనే వాడిని. ఏటవతల సాధుల మఠంలో జరిగే భజనలకు వెళ్ళే వాడిని. పొరుగున కురుమ కులస్థుల ఇళ్ళకు బయటి నుంచి బ్రహ్మం గారి కల్ట్ కు చెందిన మనుషులు వచ్చి తత్వాలు పాడుతుంటే వెళ్లి కూర్చుని భక్తిగా వినే వాడిని. నాస్తికులను మాత్రం ఎక్కువగా పట్టించుకునే వాడిని కాదు.
నేను విజయవాడ వెళ్ళే నాటికి గోరా గారు జీవించి వున్నారు. అక్కడి నాస్తిక కేంద్రంలో జరిగే సభలకు వెళ్ళే వాడిని. వాళ్లు మాట్లాడుకునేది వినే వాడిని. అదంతా చాల అనవసర విషయం అనిపించేది. వందో ఇంకొంచెం ఎక్కువ మందో హాజరైన ఒక అంతర్జాతీయ సమావేశంలో … నేను కింద కూర్చోవడం వల్ల బెంచీ మీద కూర్చున్న ఒక తెల్లామె స్కర్టు కింద ఆమె జఘన సౌందర్యం ఆస్వాదిస్తో, నేనేం చేస్తున్నానో నాకే తెలీని నా వేపు ఆమె కోపంగా చూసే సరికి, చేసిన తప్పు అర్థమై, లోలోపల పెను సిగ్గుతో తల దించుకోడం మాత్రం చాల బలంగా, కర్రు కాల్చి పెట్టిన వాతలా నాతో వుండిపోయింది.
అంతే, అంతకు మించి నాస్తికత్వం నాకు పట్టేది కాదు. చాల నేలబారుగా, ఏమాత్రం సౌందర్యం లేనిదిగా, పనికిరానిదిగా అనిపించేది. చిన్నాన్న దర్బారులో పరిచయమైన ఐడియాల్లో కమ్యూనిజం మాత్రం చాల మొదట్లోనే ‘భలే’ అనిపించి, ఆ ‘భలే’ అలాగే వుండిపోయింది. దిగులేసినప్పుడంతా నన్ను బతికించింది ఆ ‘భలే’నే. నన్ను భయపెట్టి లొంగదీయజూసే జీవితాన్ని తిరిగి భయపెట్టి వెక్కిరించే స్థైర్యమిచ్చిందీ, ఇస్తున్నదీ ఆ ‘భలే’నే. అందుకే కమ్యూనిజం ఐడియాని నా నుంచి లాక్కో జూసేది..అది ఏదైనా, ఎవరైనా నాకు ఆగర్భ శత్రువుగానే కనిపిస్తారు.
దిగులు భయంకర రూపాన్ని విజయవాడలోనే చూశాను. ఒంటరి తనం దయ్యంలా వెంటాడేది. భయ వలయం లోంచి బయటికి చేయి చాచడం మొదలెట్టిందీ అక్కడే. ఆ అండాకార హాస్టల్ నామక చెర గదులకు బయట ఎక్కడో జీవించదగ్గ ప్రదేశాలున్నాయని అప్పుడు వూహా మాత్రంగా తెలుసు. పుస్తకాల వల్ల తెలుసు. వినికిడి వల్ల తెలుసు. ఆ ప్రదేశాల్ని అందుకోవాలని ఆరాట పడే వాడిని. లేదా అప్పటి నా అయిష్టం నుంచి బయట పడితే తరువాత సంగతి తరువాత అనే నిస్సహాయమైన తెగింపులో ఓలలాడే వాడిని. అందుకోవాలనే ఆరాటం, బయట పడాలనే తెగింపు.. రెండూ ఒకటే. ఒక నాణానికి రెండు ముఖాలు.
ఈ కాలమ్ లో ముందుగానే అనుకున్నాం, గతం యొక్క పునశ్చరణ ఒక కల వంటిదని. కలలో కాలం తలకిందులవుతుంది. మెలికలుతిరుగుతుంది.హాస్టల్ గదిలో ఆ ఒంటరి కిటికీ, చేతికి అందినట్లుండే యూకలిప్టస్ చెట్టు ఆకులు, ఎక్కడో స్విడ్జర్లాండు నుంచి ‘స్ఫుట్నిక్’ ద్వారా కలిసిన నా కలం స్నేహితురాలు గుల్లన్ నెల్సన్ అనే అమ్మాయి నాకు నిజంగానే కనిపిస్తున్నట్లు కిటికీ లోంచి ఆకాశంలోనికి గుచ్చుకుపోయే చూపులు. క్లాసుల మధ్య కాలేజీ ఆవరణ లోని అశోక వృక్షాలు, పగళ్లు వాటి మధ్యలోకి వెళ్లి నేనొక్కడినే ఇక లోకం లేదని అనుకోడాలు… అవన్నీ… ఆ మనస్సు అలలన్నీ… ఏవి ఎప్పుడో కచ్చితంగా చెప్పడం కుదరదు. అవన్నీ మొత్తం మీద లొయోలా నాలుగేళ్ళ లోనివి. అందులోంచి కూడా ఒక ఏడాదిని తీసెయ్యాలనుకుంటా.
పీయూసీ ఒక ఏడాదితో లొయోలా అనుబంధం తెగి పోలేదు. ఆదయ్యాక, ఇంకేం చేయాలో తెలియక, అక్కడే బి ఎస్సీ లో చేరాను. చేరడం ఆలస్యమయింది. హాస్టల్ లో సీటు దొరకలేదు. అప్పటికి గుణదలలో (నాకు తెలిసి) ఒకే ఒక హోటల్ కమ్ లాడ్జ్ వుండేది. దాని పేరు ‘రవీంద్ర రెస్టారెంటు’. ఏడాది పాటు అక్కడే అద్దె గది. బ్రేక్ఫాస్టు ఆ ‘రెస్టారెంటు’వాళ్ల తాటాకు హోటల్లో. భోజనాలు దగ్గర్లోనే ఒక కుటుంబం నడిపే మెస్సులో.
తెలుగులో విజయవాడ వాళ్ళకు వేరే మాండలికం వుంటుందని నాకు తెల్సిందప్పుడే. బారాడు (పొడుగైన వాడు) వంటి మామూలు పదాలు, తల్దెంగ వంటి తిట్లు విని, ఇదేదో ‘తమాషాగా’ వుందే అనుకోడం కూడా అప్పుడే. రెస్టారెంటు ఓనరు… ఆయన పేరు గుర్తు లేదు… అలాంటి పదాలు తరచు వుపయోగించే వాడు. అక్కడ దొరికిన స్నేహాలు రెండు. ఒకటి బండాత్మకూరు మద్దిలేటి రెడ్డి. రెండు తమ్మినేని పుల్లయ్య.
మద్దిలేటి రెడ్డి నా కన్న ఒక ఏడాది సీనియరు. తను వామపక్ష భావుకుడు. అక్కడ వున్నప్పుడే మధుశ్రీ పేరుతో తను రాసిన కథ… ఎమెస్కో ప్రచురించిన యువ కథకుల సంకలనంలో వచ్చింది. తరువాత మధు వాళ్ళ వూరి దగ్గర వెల్గోడు కాలేజీలో టీచరుగా పని చేశాడు. తరువాత ప్రిన్సిపాల్ అయ్యాడనుకుంటాను. అక్కడ ఆత్మకు చేరువ అయిన స్నేహితుడు పుల్లయ్య. అప్పుడు బిఎస్సీ మొదటి ఏడాది పరీక్షలుండేవి కావు. పుల్లయ్య నేనూ దాదాపు ప్రతి రోజూ సినిమా చూశాం.
ఏ రోజయినా తనకు వీలు కాకపోతే నేనొక్కడినే వెళ్ళే వాడిని. మాకు దగ్గరి టాకీసులో ‘అంతస్టులు’ సినిమా వచ్చింది. నా దగ్గర డబ్బు లేదు. ఎవరినో అడిగితే అర్ధ రూపాయి దొరికింది. అది నేల క్లాసు టికెట్ కు మాత్రమే సరిపోతుంది. అయినా వెళ్లాను. కళ్ళ ముందు అనంతాకాశం పైకి లేచినట్లున్న తెర మీద, ‘నిను వీడని నీడను నేనే’ పాటకు దయ్యం నడక భలే వుండింది. ‘దులపర బుల్లోడా’ అని భానుమతి నాట్యం చేస్తుంటే, ఆమె చాల లావుగా కనిపించడం కూడా భలే వుండింది.
పుల్లయ్య తో స్నేహం ఆ తరువాత కూడా కొనసాగింది. ఇప్పటికీ ‘నీ బెస్ట్ ఫ్రెండు ఎవరం’టే తన పేరే చెబుతాను. ఇ మెయిళ్ళు, జాబులు రాయడు గాని తనూ అలాగే అంటాడని నాకు తెలుసు. బిఎస్సీ రెండో ఏడాది ‘న్యూ హాస్టల్’ లో చేరాం ఇద్దరం. మూడో ఏడు నేను పరీక్షలు ఎగ్గొట్టి వెళ్లి, ఒక ఏడాది ‘అచదువు’ వాసం తరువాత తెలుగెమ్మేకి విశాఖ వెళ్లాక, తిరిగి రెండేళ్ళు ఇద్దరం కలిసి తిరిగాం, తను బాటనీ, నేను తెలుగు అయినప్పటికీ.
గుణదల రవీంద్ర రెస్టారెంటు జీవితాన్ని మరెన్నో కారణాల వల్ల మరువలేను. అన్నిటి కన్న ముఖ్యమైంది సెక్సు గురించిన నా అమాయకత్వం. రెస్టారెంటులో మా గదులు పై అంతస్తులో వుండేవి. పక్కింటిలో కింద ఓ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయితో నా స్నేహితులకు ‘సంబంధాలు’. నా స్నేహితులు తమ ఎక్స్ ప్లాయిటేషన్స్ ని వర్ణించి చెబుతుంటే, ఆ సాహసం నేనెందుకు చేయాలేనూ… అని తెగ గింజుకునే వాడిని.
నేను అక్కడ వుండిన చివరి రోజులలో ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. పెళ్లి పనులు మొదలయ్యాక, ఆమె ఎందుకో, కొద్ది రోజుల కోసం, వేరుగా నా గది పక్క గదిలో వుండేది. అన్నాళ్ళు స్నేహితుల కబుర్ల ద్వారా నన్ను వూరించిన అమ్మాయి, ఇక కొద్ది రోజులకు పెళ్లయి వెళ్లిపోబోతోంది. నన్ను ఏ దయ్యం ఆవహించిందో ఏమో తెగించి ఓ కామ లేఖ రాసి రహస్యంగా ఆ అమ్మాయికి అందించాను. ఆ చిట్టీని అమ్మాయి పెద్దలకు ఇచ్చి వుంటే ఏమయ్యేదో ఏమో. మరుసటి రోజు ఆమె నా కోరిక తీరేది కాదని చాల ‘ప్రేమ’గా చెబుతూ లెటరు రాసి ఇచ్చింది. ఇంతకూ ఆ అమ్మాయి ఆ కొద్ది రోజులు నా గది పక్క గదిలో ఎందుకుందో తెలుసా? అప్పుడు తనకు నెలసరి అట. అలాంటప్పుడు పెళ్లింటిలో వుండడం వద్దని కొద్ది రోజుల కోసం తనూ మరో అమ్మాయి నా పక్క గదిలో వుండే వారు. అదీ సంగతి. ఆ తరువాత నేను చాల మంది అమ్మాయిలను ‘కోరుకు’న్న మాట నిజమే గాని, ఎవ్వరికీ ఉత్తర రచయితను మాత్రం కాలేదు. (మా జయమ్మకు రాశాను గాని, అవి ప్రేమలేఖలు).
బయట వున్నా హాస్టల్లో వున్నా, ఆ నాలుగేళ్ళు నాకు నేను ఎన్నడూ లేను. నన్ను నేను కనుక్కోడానికి కాస్త ప్రయత్నించకపోలేదు. బిఎస్సీ రెండో ఏడాది తిరిగి హాస్టల్ లో చేరాక అనుకుంటాను, మొదటి సారి ‘మార్చ్’ అనే పత్రిక చూసి, నేన్రాసిన ఒక విప్లవ పద్యాన్ని ఆ పత్రికకు పంపాను. ఆ పత్రిక వాళ్ళు మా హాస్టల్ అఫీసుకు నా కోసం ఫోన్ చేశారు. ఫోన్ లో విజయవాడలోనే ఏదో పేటలో ఒక చిరునామా ఇచ్చి అతడిని కలుసుకొమ్మన్నారు. వెళ్లి అతడిని కలిశాను. తానొక పూజారి కొడుకు. తన ఇంటి మీద కాంగ్రెస్ జెండా వుంది. అది భద్రత కోసం అని చెప్పాడు కాని అప్పటికే తను ఉద్యమానికి దూరమై వున్నాడు. తను ఏమాత్రం హిపోక్రిట్ కాదు. నిజాయితీ పరుడు. తానెందుకు దూరమైంది చెబుతూ నా నిర్ణయాన్ని నాకు వదిలేశాడు.
తనను కలుసుకున్నది ఒకే ఒక సారి. నాకు చాల ఇష్టమయ్యాడు. మళ్లీ కలుసు కోడం కుదరలేదు. తన పేరు, చిరునామా కూడా మరిచిపోయాను. తన మీద ఏర్పడిన ఆ స్నేహ భావన వల్ల కావొచ్చు, వుద్యమానికి దూరమైన వాళ్ళలో చాల మంచి వాళ్ళు కూడా వుంటారు, ఆ ఫ్యాక్ట్ కారణంగా ఏ నిర్ణయానికి రాగూడదనే ఫీలింగ్ నాలో బలంగా నాటుకు పోయింది. ఉద్యమంలో తలమునకలవుతున్న కాలంలో కూడా బయటి మిత్రులతో, ఇనాక్టివ్ అయిన వారితో అరమరికలు లేకుండ వుంటానికి, నేనే దూరం కావాలనుకున్నప్పుడు మానసికంగా కుంగిపోకుండా వుండడానికి ఆ ఫీలింగ్ నాకు చాల పనికొచ్చింది.
ఆ నాటి నా సొంత చీకటి నుంచి వెలుగు లోనికి చెయ్యి చాచడానికి నేను చేసిన మరో ప్రయత్నం నేరుగా సీపీ తోనే. కాకపోతే అప్పటికి అయన నా కోసం సిద్డంగా లేరు. ఒక ఆదివారం అద్దె సైకిలు తీసుకుని విజయ వాడలో సి పి ఎం ఆఫీసుకు వెళ్ళాను. (ఇంతకు ముందే చెప్పాను. నేను నాలుగేళ్ళు విజయ వాడలో వున్నాను, ఎప్పుడూ లేను అని. ఆ వూళ్ళో ఏ పేటా నాకు తెలీదు. ఆ నాటి నుంచి నాకు సంక్రమించిన ఒక్క స్నేహితుడూ ఆ వూళ్లో నాకు లేడు). నేరుగా ఆఫీసుకు వెళ్లి చండ్ర పుల్లా రెడ్డి కావాలని అడిగాను. అదృష్టం. ఆ రోజు తను వున్నాడు. మేడ మీద ఒక మంచం మీద కూర్చుని వున్నాడు. మా వూరు, మా చిన్నాన్న పేరు చెప్పి పరిచయం చేసుకున్నా ను. నాకు ప్రజల కోసం పని చేయాలని వుంది అని చెప్పాను. (చదువుకోవాలని లేదు అని చెప్పలేదు). ఆయన ఓపిగ్గా మాట్లాడాడు. ఉత్తేజకరంగా మాట్లాడలేదు. ఉత్తేజపరచడం కాకుండా, నిరుత్సాహ పరచడమే తన వుద్దేశం అయ్యుంటుంది.
అసలప్పుడు నేను చండ్ర పుల్లా రెడ్డిని సిపిఎం ఆఫీసులో కలవడం ఎట్టా సాధ్యమయ్యింది? అప్పటికి సీపీ, టిఎన్ ఎట్సెటరా ఆ పార్టీని వదలలేదు, వదిలేసే క్రమంలో వుండి వుంటారు. ఒక పార్టీని వదిలేసి, ఇంకో పార్టీ.. అదీ ఒక విప్లవ పార్టీని నిర్మించే దశ చాల సంక్లిష్టమయినది. వేయి రాస్తాలు, వేయి ఆలోచనలు పరస్పరం తలపడుతుంటాయి. నా వంటి ఒక సందేహ మనస్కుడికి మానసిక చేయూతనిచ్చి ఒక దారిలో పెట్టే తీరిక అప్పుడు సీపీకి వుండి వుండదు. మొత్తమ్మీద, నేను తిరిగి అదే అద్దె సైకిలు మీద న్యూ హాస్టల్ అనే నా అండాకార పంజరం లోనికి చేరి రెక్కలు ముడుచుకున్నాను.
లొయోలా కాలేజీలో ఒక చిన్న సాంస్కృతిక వేదిక వుండేది. ఆ వేదిక మీదే ఓసారి ‘ఏది ప్రజాస్వామ్యం?’ అనే టాపిక్ మీద డిబేట్ జరిగితే పాల్గొన్నాను. చదువుల్లో కాంపెటీషన్, ఇందులో డాక్టరో ఇంజనీరో కావడం పరమ ధ్యేయంగా వుండడం… ఇది పరమ అప్రజాస్వామికమని నేను వాదించాను. దీని వల్ల యువకులు స్వేచ్ఛగా తమకు ఏం కావాలో తాము నిర్ణయించుకోలేరని, ఇది ప్రజాస్వామ్యం కాదని అన్నాను. ‘అవన్నీ కమ్మని నిన్ను ఎవరు బలవంతపెట్టారు. అవి కాకుండా వుండే హక్కు నీకు వుంది కాబట్టి మన దేశంలో ప్రజాస్వామ్యం వున్నట్టు’ అని నన్ను ఖండించిన స్టూడెంటుకు ఏమి జవాబు చెప్పాలో నాకు తోచలేదు. అది ఇప్పటికీ తోచడం లేదు, సర్వులకు ఆమోదయోగ్యమైన రీతిలో.
ఆ వేదిక మీదే ఎప్పుడైనా ప్రముఖ రచయితలతో మాట్లాడించే వారు. ఓ సారి గొల్లపూడి మారుతీ రావు తన రచనల గురించి మాట్లాడారు. ఇంకో సారి ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి అర్ కాలేజీ నుంచి అక్కడి తెలుగు లెక్చరర్ విశ్వనాథ సత్యనారాయణ వచ్చి మాట్లాడారు. అదొక అద్భుతమైన అనుభవం. తనకంటూ ఒక నిశ్చిత విశ్వాసం వున్న వాడు మాటకారి కూడా అయితే, ఎలా వుంటుందో మొదటి సారి చూశాను.
ఆ రోజు ఉపన్యాసానికి కేటాయించిన హాలు… వక్త రాక‍ ముందే శ్రోతలతో నిండిపోయింది. మా కాలేజీ లెక్చరర్లు వేదిక మీద గాని వేదిక దగ్గర గాని లేకుండా వెళ్లి స్టూడెంట్ల మధ్య, అదీ ఒక చోట కాకుండా అక్కడొకరు ఇక్కడొకరు కూర్చున్నారు. అదెందుకో మీలో చాల మందికి అర్థమై వుంటుంది. సభలో పిల్లలు అల్లరి చేయకుండా పెద్దలు తీసుకునే జాగర్తల్ని చూడడం నాకు అదే మొదటి సారి. తీరా విశ్వనాథ మాట్లాడుతుంటే అర్థమయ్యింది. ఆయన మాటలకు అల్లరి చేయకుండా వుండడం నాక్కూడా కష్టమే.
అంతటి పండితుడు, అంత గొప్ప కవి మాట్లాడిందేమిటి? ఇంగ్లీషు భాష కన్న తెలుగు భాష గొప్పది. ఇంగ్లీషు సాహిత్యం, సంస్కృతి కన్న భారత సాహిత్యం, సంస్కృతి గొప్పవి. ఓకే, సర్, అయితే, అవి ఎందుకు గొప్పవి?
ఇంగ్లీషోళ్లు వాళ్ల దేశంలో చలి కారణంగా ప్రతి రోజూ స్నానం, దంత ధావనం చేయరు. అందువల్ల వారి చెమట వాసన, నోటి దుర్వాసనలు అంటుకుని వాళ్ల భాషా సాహిత్యాలు కంపు గొడుతుంటాయిట. భలే చమత్ కారం కదా?! ఇంకో జోకు చెప్పారాయన. అది మరింత అన్యాయం. తెలుగు, సంస్కృత భాషల్లో పతివ్రత, పాతివ్రత్యం వంటి మాటలు వున్నాయి. ఇంగ్లీషు భాషలో అలాంటి మాటలు లేవు. వాటికి సమానార్థకాలు కూడా లేవు. ఎందుకు లేవట? ఇంగ్లీషు వాళ్ళలో పతివ్రతలు వుండరు. అందుకని ఆ భాషలో పతివ్రత పదం లేదట. ఇంగ్లీషు సాహిత్యం పాతివ్రత్యాన్ని ప్రోత్సహించదు. విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఆ సాహిత్యంలోనే పాతివ్ర్యత్యమనే కాన్సెప్ట్ లేదు, దానికి తగిన పదమూ లేదు.
మన జ్ఞానపీఠం నుంచి ఈ తర్కాన్ని విని సుమారు నలభయ్యయిదు ఏండ్లయింది. ఆ రోజు విశ్వనాథ నుంచి విన్న లాజిక్ అలాగే గుర్తుండిపోయింది. ఫ్యూడలిజం స్త్రీలకు ఎంత వినాశకరమో, దాన్ని పైకెత్తే సాహిత్యం ఎంత హానికరమో చెప్పాల్సి వచ్చినప్పుడంతా ఈ క్రూర జోకును గుర్తు చేస్తాను. నేను తప్పు చేస్తున్నానేమో, మహా కవి అనదగిన వ్యక్తి నుంచి గుర్తుంచుకోవలసింది ఇదేనా అని అనుకునే వాడిని. ఇటీవల ఇండియాలో, తెలుగు నాట పరిణామాల్ని చూశాక, కొందరు తెలుగు రచయితల పిల్లి మొగ్గలు చూశాక, విషయ పరంగా కఠినంగా వుండడం ఎంత అవసరమో తెలుస్తోంది. ఉండాల్సినంత కఠినంగా వుండకపోవడం వల్లనే దేశానికి హాని చేశామని అనిపిస్తోంది.
(వచ్చేవారం మరి కొన్ని కబుర్లతో… )
18-05-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s