చెలో ఆంధ్ర లొయొలా

స్మృతి 11

నేను మొట్టమొదటి సారి పట్నం చూడడం అదే.
అదీ విజయవాడ.
ఒహ్హో. కాదు, కాదు. మొదటి సారి కాదు.
దానికి కొన్ని నెలల ముందు ముగ్గురు వీరులం కర్నూలు వెళ్లాం కదూ?!
జ్ఞాపకాలు కలగాపులగం.
చౌడీశ్వర రెడ్డి, అబ్దుల్ మునాఫ్, నేనూ… మా వూరి నుంచి తలముడిపి హైస్కూలుకు వెళ్లే వాళ్లం. ముగ్గురం ప్రతి రోజూ నడిచి వెళ్లే వాళ్లం. ఎప్పుడైనా బస్సులో వెళ్లే వాళ్లం. అది పదో తరగతి చివరి వరకు. ఆ తరువాత ఒక ఏడాది వాళ్లిద్దరు అదే పని చేశారు.
మేము ఎప్పుడైనా వెళ్లే ఆ బస్సు డ్రైవరు పేరు నారాయణ. టెన్త్ చివర్నో ఎస్సెస్సెల్సీ చివర్నో… డ్రైవరు నారాయణ… ‘ఇన్నాళ్లు నా బస్సులో వచ్చెటోళ్లు. ఇంగ కొన్నాళ్లే. తరువాత, ఇట్టా రారు గదా. మీరు కర్నూలెప్పుడు సూసిండరు. ముగ్గురు రారి. టిక్కెట్టు ల్యాకుండా తీస్కపొయి తీస్కొస్త. టౌన్ ఎట్టుంటాదో సూసొస్తురు’ అన్నాడు. పొద్దున వెళ్లి సాయంత్రం రావడం. సరేనని వెళ్లాం.
నా మస్తిష్కంలో రెండే రెండు చెరగని ముద్రలు.
ఒకటి: మా బస్సు కర్నూలు చేరుకోడానికి పావు గంట ముందు.. తాండ్రపాడు గుట్ట ఎక్కగానే…. వూరు పెద్దగా తెల్లగా ఒక పేద్ద కోడి గుడ్డులా కనిపించి మమ్మల్ని అబ్బుర పరిచింది. మా అశ్చర్యాన్ని మా మధ్య మేం పంచుకున్నాం కూడా. కోడి గుడ్డు అనే మాట నిజానికి చౌడీశ్వర రెడ్డిది. అప్పుడు మేము పొందిన నిబిడాశ్చర్యాన్ని వాళ్లిద్దరు కూడా మర్చిపోలేదు. ఆ తరువాత ఎన్నో సార్లు గుర్తు చేసుకున్నాం. బస్సు బాగా దగ్గరికి వెళ్ళే కొద్దీ… ఒకే వూరు… అంతూ దరి లేనట్టు… విశాలంగా పరుచుకుంది మా కళ్ల ముందు.
రెండు: కర్నూలులో అప్పుడు మేము పెద్దగా ఏమీ చూడలేదు. కర్నూలు చూడడమే మహా విశేషం. అప్పటి బస్టాండు పక్కనే వుంటుంది కాబట్టి కొండా రెడ్డి బురుజు చూశాం. కొండా రెడ్డి బురుజుకు దగ్గరగా వున్న పెద్ద పోస్టాఫీసుకు వెళ్లాం. మురళి అని మా వూరి నుంచి వెళ్లి అప్పటికి కర్నూల్లో వుంటున్న ఒక సావాసకాడి వాళ్ల నాన్న పోస్టాఫీసులో పని చేస్తాడు. ఆఫీసు చూపిస్తానని మురళి మమ్మల్ని తీసుకెళ్లాడు.
జనాలు దొడ్డికి పోవడానికి చెంబు చేత పట్టుకుని దూరంగా వూరి బయటికి పోవడం మాత్రమే మాకు తెలుసు. కర్నూల్లో సెప్టిక్ లావెటరీలు అనేవి వుంటాయని, అవి ఇండ్లు, బిల్డింగుల లోపలే వుంటాయని మురళి చెప్పాడు. ఇంట్లోనే…. పోనీ ఇంటి పక్కనే మరుగు దొడ్డి…. నాకు నమ్మశక్యం గాని విషయం.
మురళి చెప్పడమే గాక, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి చూపించాడు. అంతటితో వూరుకోలేదు. లోపల ఎలా వుంటుందో చూపించాలనుకున్నాడు. ఖాళీగా వుందనుకుని ఒక లావెటరీ తలుపు లాగాడు. లోపల గడియ పెట్టుకోడం మరిచిపోయిన మనిషి కంగారుగా ప్యాంటు సర్దుకుంటూ లేచి నుంచోడాన్ని… ఆ దృశ్యాన్ని ఎవరమైనా ఎట్టా మరిచిపోతాం మీరే చెప్పండి.
అంతే. అంతకు మించి కర్నూలు గాని, మరేదైనా చిన్న టౌను గాని అప్పటికి మేమూ చూడలేదు.
ఎస్సెస్సెల్సీతో చౌడీశ్వర రెడ్డి, మునాఫ్ ఇద్దరూ చదువులు మానేశారు.
చౌడీశ్వర రెడ్డి గురించి ఇప్పటికే కాస్త చెప్పాను. తన చేతి వ్రాత ముత్యాల చాలులా వుండేదనీ ఎట్సెటరా. వాళ్లది ‘శెనిక పల్లె’ అని మా వూరికి దగ్గరగా వుండిన ఒక వూరు. మీరు సరిగ్గానే చదివారు. ‘ఉన్న’ వూరు కాదు ‘వుండిన’ వూరు. ఇప్పుడు లేదు. ఇప్పుడే కాదు, ఈ కథ జరిగేప్పటికి కూడా లేదు. మేం పుట్టక ముందే జనాలు అందరూ ఆ వూరు వదిలేసి పక్కన మా వూరిలో, మంచాల కట్ట అనే ఇంకో వూరిలో సర్దుకున్నారు.
ఇదొక ఆసక్తి కర విశేషం.
అలా ఖాళీ అయిన మరో ఊరిని కూడా చూశాన్నేను. పేరు కాశి పేట. ఆ వూరు ఖాళీ అయిపోయి బాగా దూరంగా మరో చోట అదే పేరుతోనే వెలిసింది. పాత కాశి పేట వుండిన చోట ఇండ్ల శిధిలాల్ని, శిధిలాల పక్కన ఒక జెండా మాను, అరుగు, ఆ మాను మీద ఎవరో ఎగరేసిన ఆకుపచ్చ త్రికోణ పతాకాల్ని… ఆ దారిలో నడుస్తూ నేను రెండు మూడు సార్లు చూశాను. ఇండ్ల శిధిలాలు ఓ రకం ‘ప్రేత కళ’ను కల్పించేవి. నా ‘ఎండ’ కథ లోని జెండా మాను అక్కడిదే. కథలో ఫకీరు నా కల్పన.
ఏదైనా వూళ్లో కలరా వంటి అంటు వ్యాధి మొదలైతే ఇక అంతే. ఆ ఊరు నాశనం. తగిన మందులు వుండేవి కావు. పోయినది పొట్టు, వున్నది గట్టి. పరిస్థితి మరీ శ్రుతి మించితే… చనిపోయిన వాళ్లు చనిపోగా, చాల మంది ఆ వూరు వదిలి వెళ్లి పోయే వారు. వీలయితే, కాశీ పేట మాదిరిగా, అదే వూరు, కాస్త దూరంగా మరో చోట వెలిసేది. లేదా ఆ వూరి వాళ్లు తమకు బంధువులున్న పక్క వూళ్లకు శాశ్వతంగా వలస పోయే వారు. వాళ్ల పొలాలు ఎలాగూ ఎక్కడున్నవి అక్కడే వుంటాయి. అవి కదలవు. వాటికి జబ్బు చేయదు. జనం మరో వూళ్లో వుంటూ ఆ పొలాలు దున్నుకుని జీవిస్తారు. పొలాలున్నప్పుడు, వాటి లెక్కలు చూసే వాళ్ళు కూడా వుంటారు.
శెనికపల్లె వూరి కరణం పక్కన మంచాల కట్ట చేరాడు. ఆయన కొడుకు రాజేశ్వర రావు కూడా స్కూల్లో నా తరగతే. నా మొదటి ‘బ్రాహ్మణాధిక్షేప” మహా కవితను తీసుకెళ్లి వాళ్ల చిన్నాన్నకు, అనగా మా రాఘవయ్య సారుకు చూపించి నాకు నా మొదటి సన్మానంగా తగినన్ని బెత్తం దెబ్బలు ఏర్పాటు చేయించిన రాజేశ్వర రావు తనే.
శెనిక పల్లెకు రెడ్డి(విలేజ్ మున్సబు)గా పని చేసిన సుబ్బారెడ్డి మా వూరు, గని కి చేరాడు. ఆయన కొడుకే మా చౌడీశ్వరరెడ్డి. వాళ్లు రెడ్డి కులం కాదు. వాళ్ల నాన్న రెడ్డి పని చేయడం వల్ల సుబ్బారెడ్డి అయ్యారు. ఆయన కుమారుడు, నా స్నేహితుడు, చౌడీశ్వర రెడ్డి అయ్యాడు.
అంతే కాదు. చౌడీశ్వర రెడ్డి పెరిగి పెద్ద వాడయ్యే వరకు…. శెనిక పల్లె అనే వూరు లేకపోయినా…. ఆ వూరి ‘రెడ్ది’ ఉద్యోగం తన కోసం అలాగే వుండింది. అదలా వుందని మాకు చిన్నప్పట్నించీ తెలుసు. ఎస్సెస్సెల్సీ తరువాత తను రెడ్డి పరీక్ష ప్యాసయి వంశ పారంపర్యాన్ని తీసేసుకున్నాడు. ఎన్ టీ యార్ హయాంలో కరణాలూ, రెడ్లను రెవిన్యూ శాఖలో కలిపేశారు. చౌడీశ్వర రెడ్డి రెవిన్యూ శాఖ వుద్యోగంలో చేరాడు. తనను కర్నూల్లో ఇటీవలే కలిశాను. మా చిట్టి తల్లి కర్నూలు ఆసుపత్రిలో పుట్టి వుండడం వల్ల తన బర్త్ సర్టిఫికెట్ తీసుకోడానికి నేను మ్యునిసిపల్ ఆఫీసు, రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ యజ్ఞాన్ని సులభ సాధ్యం చేసి పెట్టిన చలవ మా చౌడీశ్వర రెడ్డిదే. అబ్దుల్ మునాఫ్ ను మళ్లీ కలవడం కుదర లేదు. తను నంద్యాల మార్కెట్ యార్డులో ఏదో ఉద్యోగంలో కుదురుకున్నాడని విన్నాను.
వాళ్లిద్దర్నీ అలా వాళ్ళ పరిణామాలకు వదిలేసే ముందు, మేం ముగ్గురం కలిసి చూసిన పట్నం కర్నూలు. ఆ తరువాత చాన్నాళ్ళ వరకు మేము కలిసినప్పుడంతా అదే మా కబుర్లలో దొర్లేది. కర్నూలు మేము మొదటి సారి చూసిన పట్నం, నగరం అన్నీ. అదీ నా పధ్నాలుగో ఏట అనుకుంటా.
రెండో సారి చూసింది, నేరుగా ఆంధ్రుల వాణిజ్య రాజధాని విజయ వాడ. నేను నిజంగా విజయవాడ చూశానా? ఇప్పటికీ అదొక పజిల్ నాకు. పజిల్ ఎందుకో తరువాత చెబుతా.
విజయవాడ వెళ్లాలని ఆంధ్ర లొయోలా కాలేజీలో చదువుకోవాలని మాకు ఎవరు చెప్పారో ఏమో. చెప్పి నాకు చాల నష్టం చేశారు. అక్కడ బాగా చదువు చెబుతారని తప్ప, దాని గురించి మాకెవరికీ ఏమీ తెలీదు. మాలో చాల మంది చేయనిదేదో మేము చేయబోతున్నామనే ఒక పనికి మాలిన పోటీ ఆనందం. వెనుక బడిన ప్రాంతాల ప్రజలు ఇలంటి ఆనందాల నుంచి బయట పడే లోగానే వాళ్ల జీవితాలు అయిపోతాయి.
అవును విజయ వాడ వెళ్లడానికి ముందు అక్కడికి వెళ్తున్నట్టు రాత్రులు నేను కలలు కనడం నాకు గుర్తుంది. అదేమిటో తెలీకుండా దాని గురించి కల. నా మట్టుకు నేను చేసిన మొదటి తీవ్ర తప్పిదం ఆ కలను నిజం చేసుకోడం. అనగా చదువుకోడానికి విజయవాడ వెళ్లడం. ఎంచక్కా కర్నూలు వెళ్లి ఉస్మానియా కాలేజీలో చేరి వుంటే భలే వుండేది.
చరిత్రకే కాదు ఒక మనిషి జీవితానికి కూడా ఇఫ్ లు బట్ లు లేవు. వుండవు. నేనొక్కడినేనా? మా నలుగురమేనా? కాదు. మా క్లాసులో ఎవ్వరమూ కర్నూలు ఉస్మానియాలో చేరలేదు. ఎందుకు? అదొక రకం భావ దారిద్ర్యమనే నేను అనుకుంటాను. పనికి మాలిన అనుకరణ. గొర్రె దాటు మనస్తత్వం.
మేము నలుగురం కాకుండా మిగిలిన వాళ్లు… నా ఆత్మ మిత్రుడు వంగాల సిద్డా రెడ్ది, నాగి రెడ్డి…. పరీక్షలప్పుడు నేనెవరి చొక్కా తొడుక్కుని డిఈఓ పద్మావతి గారిని ఆకర్షించి భంగపడ్డానో ఆ నాగి రెడ్డి… మా కన్న ఇంకా దూరం… ఇక భూమి లేదనే దాక… ప్రయాణం చేసి బందరు హిందూ కాలేజీలో చేరారు. క్లాసు మేట్ కాకున్నా నా ఇయర్ మేట్, ‘కనిపించని చెయ్యి’ అనే నా కథ హీరో, మా వూరి వాడు మద్దిలేటి నరసరావు పేట కాలేజీలో చేరాడు.
ఎందుకలా? ఎందుకని కర్నూలు అన్నా, ఉస్మానియా అన్నా మాకు, మా సలహాదారులకు చిన్న చూపు?
చదువంతా అయ్యాక ‘పి.డి.ఎస్.యూ.’ నిర్మాణంలో భాగంగా కర్నూలు ఉస్మానియా కాలేజీకి వెళ్లాను. మంచి క్యాంపస్. ప్రజాతంత్ర వాతావరణం.
పిడిఎస్యూ పని మీద వెళ్ళేప్పటికి కర్నూల్లో నాకు తెలిసిన వారు పిడికెడే. ఏం చేసినా నాకు నేను చేయాల్సి వుండింది. అప్పుడు…. పిడిఎస్యూ చేపట్టిన ‘అధిక ధరల వ్యతిరేక ఉద్యమానికి, ‘ఫిబ్రవరి 25 (1974) ర్యాలీ’కి విద్యార్థుల్ని కూడగట్టే పని నాది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో లో జంపాల ప్రసాద్, శంకరన్న, లలిత, గీత వంటి నా సహచరుల ఉద్యమానుభవాలు విని వున్నాను. నేను వాళ్లను అనుకరించాలని అనుకున్నాను. ప్రిన్సిపాల్ ను కలిశాను. క్లాసు రూం లకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడతానన్నాను. ఆయన, విషయం తెలుసుకుని, వెంటనే ఒప్పేసుకున్నారు. క్లాసుల్లో మాట్లాడుతున్నప్పుడు అశ్విని, అజయ్ మొదలైన విద్యార్థులు హాస్టల్ కు వచ్చి మాట్లాడాలని నన్ను ఆహ్వానించారు. హాస్టళ్లలో వాళ్లతో స్నేహం పెరుగుతుండగా ఎమర్జెన్సీ, జైలూ….
కర్నూల్ ఉస్మానియా క్యాంపస్ లో ఒక బయటి మనిషిగా నాకు దొరికిన అవకాశం మహత్తరమైన ఆంధ్ర లొయొలా కాలేజీలో అనూహ్యం. ఒక సామాజిక కార్యకర్తకు సాదర ఆహ్వానం కాదు, అసలు క్యాంపస్ లో ప్రవేశమే అనూహ్యం. అదొక చదువుల జైలు. ఇప్పుడేమో గాని అప్పుడు అదొక పర్ఫెక్ట్ జైలు.
అట్టాంటి కాలేజీకి బయల్దేరాం మేము నలుగురం. ఎట్టాంటి నలుగురం.
రైలు ఎక్కడం నాకు అదే మొదటి సారి. రైలును చూడడం కూడా… అది రెండో సారో మూడో సారో. మా చిన్నత్తను నంద్యాల పక్కన మూలసాగరం అనే వూరికి ఇచ్చారు. తనను చూడడానికి వెళ్లినప్పుడు, ఆ వూరి బయట రైలు పట్టాల వద్దకు వెళ్లే వాళ్లం. అక్కడ నిలబడి వచ్చి పొయ్యే రైళ్లు చూశాను. ఓసారి రైలు చక్రాల కింద వుంచిన నాణెం సాగి, పల్చగా అయిపోయిన దృశ్యమొకటి నా మనస్సులో వుండిపోయింది. పట్టాల పక్కన నిలబడితే, వెళ్లిపోయే రైలు కీటికీల లోంచి బయటికి చూసే మానవ ముఖాలు విచిత్రంగా కనిపించేవి. అవి మానవులవని కాకుండా గంధర్వ, కిన్నెర, కిఫురుషుల ముఖాలని అనిపించేది. చీకటి పడ్డాక మరీను. లోపలి విద్యుద్దీపాల కాంతికి వాళ్ల ముఖాల నీడల్లో మరో లోకం కదులుతున్న అనుభూతి.
అట్టాంటిది నేనే ఒక కింపురుషుడినై రైలెక్కాను, లొయోలా కాలేజీలో చేరడం కోసం.
రైలెక్కడానికి ముందు నంద్యాలలో నేను నా మొదటి చెప్పుల జత కొనుక్కున్నాను. మాకు ఎవరో చెప్పారు. చెప్పులు లేకపోతే కాలేజీలో క్లాసులకు రానివ్వరని. అందుకని నంద్యాలలో బస్సు దిగి రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో చెప్పుల షాపు దగ్గర ఆగి చెప్పులు కొన్నాం.
అంత వరకు నాకు చెప్పులు లేవు. చేలకు వెళ్లినప్పుడు తుమ్మ, రేగు ముండ్లల్లో, జొన్న, కంది కొయ్యకాళ్లున్న చేలల్లో నడవాల్సి వచ్చినప్పుడు అమ్మవో నాన్నవో చెప్పులు వేసుకునే వాడిని. మా వూరి నుంచి స్కూలుకు నడవడానికి కూడా నో చెప్పల్స్.
రైలెక్కడానికి స్టేషన్ కు నేను ఒక్కడినే వెళ్ళానో ఎవరైనా నాతో వచ్చారో గుర్తు లేదు.
వెళ్లి మిగిలిన ముగ్గురితో కలిసి కూర్చున్నాక, ఇక పావుగంటకు రైలు కదుల్తుందనగా రమణా రెడ్డి వాళ్ల చిన్నాన్న అనుకుంటా వచ్చి “అందరి టిక్కెట్లు జాగ్రత్తగా వున్నాయా?” అని అడిగారు. నాకు అర్థం కాలేదు. “ఇంకా రైలు బయల్దేరలేదు. కండక్టరు వస్తాడు కదా, టిక్కెట్లు తీసుకుంటాం” అన్నాన్నేను. సరిగ్గా అలాగే అన్నానో, లేదో. మొత్తమ్మీద సారాంశం అదే. నాలాగే చెప్పిన వాళ్లు ఇంకెవరైనా వుండినారా, నేనొక్కడినేనా, ఏమో?
రమణా రెడ్డి వాళ్ల చిన్నాన్న నా/మా సంగతి గ్రహించాడు. డబ్బు తీసుకుని పరిగెత్తి వెళ్లి టిక్కెట్టు తెచ్చి ఇచ్చాడు. రైల్లో ముందుగా టికెట్టు తీసుకుని ఎక్కాలని అలా తెలిసి వచ్చింది నాకు.
ఆ ప్రయాణం అలాగే నన్ను మరో జీవితానికి తీసుకుపోయింది. దారిలో అడివిలో ‘స్వింగ్ బ్రిడ్జ్’ ఒక అబ్బురం. అది నాకే కాదు, ఎవరికైనా అబ్బురమేనని తరువాత అర్థమయ్యింది. దాదాపు రైలంత పొడవు, అంతకన్నఎక్కువేనో వుంటుందా వంతెన. గొలుసులు ఆధారంగా. బ్రిడ్జి మీద రైలు కొద్దిగా వూగుతూ వెళ్లడం, కిటికీ లోంచి నల్లమల ఆకుపచ్చని అందాల లోతయిన లోయను చూడడం…. ఆ తరువాత మరి నాలుగేళ్లు పలుమార్లు ఎదురైన అనుభవం. అసలంత దూరం అడివిలో ప్రయాణం!
అప్పటికింకా కర్నూలు జిల్లా నుంచి విడిపోలేదనుకుంటాను.. మార్కాపురం, గిద్దలూరు పరిసర ప్రాంతాల…. తెలుగు యాసలో మార్పులను కూడా మొదటి సారి అప్పుడే గమనించాను.
విజయవాడలో ముందుగా ఎక్కడికెళ్లామో గుర్తు లేదు. అక్కడికి వెళ్లాక, కాలేజీలో చేరడానికి అప్లికేషన్ తీసుకుని పూర్తి చేస్తున్నప్పుడే ఏ గ్రూపు తీసుకోవాలనే ఆలోచన ముందుకొచ్చింది. మిగిలిన వాళ్లకేమో గాని, నేను అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లెక్కల పరీక్షలో పద్మావతమ్మ దెబ్బ వల్ల, ఇక లెక్కల కన్న బయాలజీ మేలు అనుకున్నానేమో, లేక డాక్టరు కావడానికి సి బి జెడ్ (కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ) గ్రూపు తీసుకోవాలని మిగిలిన ముగ్గురు అనుకోడం వల్లనో… నేనూ ఆ పనే చేశాను. లైనులో పడి నడవడం తప్ప మెదడుతో చేసిందేమీ లేదు.
అక్కడి నుంచి అలాగే వెళ్లి గోగినేని హాస్టల్ లో చేరిపోయాం నలుగురం. నేనూ జయరామి రెడ్డి ఒక రూం. విశ్వనాథ రెడ్డి, రమణా రెడ్డి ఒక రూం.
అపుడు నాకు పట్ట లేదు గాని బ్యూటిఫుల్ క్యాంపస్ లొయోలా కాలేజీది. విజయవాడలో భాగమయిపోయిన గుణదల గ్రామానికి ఒక చివర, ఒక వైపు పచ్చని కొండ కనిపించేలా వుండేది క్యాంపస్. గోగినేని హాస్టల్ పి.యు.సి. (ప్రీ యూనివర్సిటీ కోర్స్) విద్యార్థుల కోసం. దాని పక్కనే న్యూ హాస్టల్ ‘డిగ్రీ’ విద్యార్థుల కోసం. ఇవి రెండూ ఇంగ్లీషు ఓ ఆకారాల్లో వుండేవి. క్లాసులు జరిగే కాలేజీ బిల్డింగులు రెండు ఎల్ ఆకారాల్లో వుండేవి. క్యాంటీన్, లైబ్రరీ బ్లిల్డింగులు, ఫాదర్స్ క్వార్టర్స్… అవి వై, ఏ ఆకారాల్లో వుండేవి. అన్నీ వరుసగా.. పై నుంచి చూస్తే… LOYOLA కనిపిస్తుందని అనే వాళ్లు. (ఆ కాలేజీ పూర్వ విద్యార్థులెవరైనా ఈ కాలమ్ చదివితే, నేను చెప్పింది కరెక్టు కాకపోతే, సరి చేయండి). హాస్టళ్ల ఓ ఆకారానికీ మాత్రం నేనే గ్యారంటీ. రెండు హాస్టళ్ఖ మధ్య గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సొరంగం లాంటి దారి. వానొస్తే న్యూ హాస్టల్ నుంచి ఓల్డ్ హాస్టల్ కు, అంటే గోగినేని హాస్టల్ కు తడవకుండా వెళ్ళొచ్చు.
హాస్టళ్లు దేనికది తనలోకి తాను ముడుచుకుంటున్నట్టు వుండేది. హాస్టల్ వృత్తంలో ఎక్కడ నుంచున్నా, బయటికి దారి లేని సెల్ఫ్ కంటెయిండ్ స్ట్రక్చర్ లో ఇరుక్కుపోయిన ఫీలింగ్.
జీవితంలో పంక్చువాలిటీ అని ఒకటి వుంటుందని, మనుషులు గడియారం ప్రకారం పని చేస్తారని నాకు తెలిసింది గోగినేని హాస్టల్ లో చేరాకనే. నిద్ర లేవగానే ‘సైలెన్స్ అవర్’. నిశ్శబ్దంగా లేచి, ఎవరికి వాళ్లం వెళ్లి ఎవరి టంబ్లర్ లో వాళ్లం కాఫీ తెచ్చుకోవాలి. అలా పొద్దున్నే, ముఖం కడుక్కోకుండా కాఫీ తాగొచ్చని, దాన్ని ‘బెడ్ కాఫీ’ అంటారని అప్పుడే తెలిసింది. చీకటి చీకట్లో లేచి వేడి వేడి కాఫీ, భలే వుండేది.
లేచాక అరగంట తరువాత స్టడీ అవరు. కేవలం నిశ్శబ్దంగా వుంటే చాలదు. పుస్తకాలు తీసుకుని చదువుకోవాలి. చదువుకుంటున్నామో లేదో వార్డెన్ గా పని చేసే ఫాదర్ తనిఖీ చేస్తుంటారు. ప్రతి గది తలుపుకీ పైన మెష్ తో కూడిన కంత వుంటుంది. రోజూ ఏం చదువుకుంటాం? కుర్చీకి అమర్చిన కదిలే ప్లాంక్ మీద అటు ఇటు వరుసగా పుస్తకాలుంచి మధ్యలో డిటెక్టివ్ నవల ఉంచుకుని ‘స్టడీ’ చేసేది నేను. ఎనిమిదిన్నరకు అనుకుంటా బ్రేక్ ఫాస్ట్ గంట కొట్టే వారు. తిన్నాక కాలేజీకి వెళ్లే వరకు సైలెన్స్ అవర్, కాలేజీకి తయారు కావడానికి. బ్రేక్ ఫాస్ట్. లంచ్, డిన్నర్ సమయాల్లో ముప్పావు గంట.అప్పుడు తినడంతో పాటు ‘ఖైదీలు’ మాట్లాడుకోవచ్చు.
సాయంత్రం కాలేజీ తరువాత ఆరు గంటల వరకు, కాలేజీ క్యాంపస్లోనే బయట తిరగొచ్చు. మొదటి సారి బయటికి వెళ్లినప్పుడే తెలిసింది.. పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్ళకు, పట్నాల్లో చదువుకుని వచ్చిన పిల్లలకు మధ్య తేడా. మాకు అప్పుడప్పుడే ప్యాంట్లు అలవాటవుతున్నాయి. నేను నిక్కర్లు వదిలేసి ప్యాంట్లు మొదలెట్టింది ఎస్సెస్సెల్సీలోనే. అదీ మా వూరి కాశింసాబు కుట్టిన ప్యాంట్లు. మేం కాలేజీకీ వెళ్ళే సమయానికి బిగుతు ప్యాంట్ల శకం నడుస్తోంది. మేం నిక్కర్లు కాకుండా ప్యాంట్లు వేసుకోడమే ఎక్కువ. ఇంకా ఫ్యాషన్లు కూడానా? ఊళ్లో కుట్టిన లొడుగు బుడుగు ప్యాంట్లతో బయటికి వెళ్తే పట్నాల నుంచి వచ్చిన పిల్లలు గేళిగా చూసే వారు. కొందరు గేళి చేసే వారు.
లుంగీలు మాకెప్పుడు తెలిశాయో ఏమో. క్యాంపస్ లోపల కదా అని లుంగీతో అలాగే తిరిగే వాళ్లం. దానికి మరింత హేళనకు గురయ్యే వాళ్లం. మేము కొత్తగా ‘న్యారో ప్యాంట్లు’ కుట్టించుకుని, ఫ్యాషన్ ప్రపంచంలో కలవడానికీ, హాస్టల్ గదిలో చదువుకునేప్పుడు, నిద్రపోయేప్పుడు మాత్రమే లుంగీ వుపయోగించడం నేర్చుకోడానికీ కొన్ని నెలలు పట్టింది.
మేము ఎదుర్కొన్న అతి ముఖ్యమైన సమస్య. భాష. విజయవాడలో కోస్తా మాండలికం దానికదే పెద్ద ప్రాబ్లెం. లొయోలాలో అసలు తెలుగు భాషతోనే సమస్య. కాలేజ్ లో, హాస్టల్ లో ఎవరితో మాట్లాడినా ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఆంక్ష వంటిది వుండేది.
లొయోలా కాలేజ్ లో పట్నాల నుంచి, అదీ సైనిక్ స్కూలు నుంచి, ఖరీదైన పబ్లిక్ స్లూళ్ల నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువ. వాళ్ళు చక్కని ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు. వార్డెన్, ప్రిన్సిపాల్, రెక్టర్ వంటి ముఖ్యమైన పదవుల్లో వున్న ‘ఫాదర్ల’కు తెలుగు అస్సలే రాదు. వాళ్లతో మాట్లాడక తప్పదు. ఇంగ్లీషులోనే మాట్లాడాలి. మా బ్రోకెన్ ఇంగ్లీషు మాకే నవ్వు తెప్పించేది.
క్యాంపస్ లో ఒక చిన్న జోకు ప్రచారంలో వుండేది. మా ప్రిన్సిపాల్ పేరు ఫ్ర్రాన్సిస్. ఆయన ఇండియన్ కాదు. తెలుగు తెలిసే అవకాశం లేదు. ఆయనతో ఏదో పని వుండి వెళ్ళాడొక విద్యార్థి. ఫాదర్ ఫ్రాన్సిస్ ఆ పిల్లాడితో ఏదో చెబుతున్నాడు. ఆయన తన బాధను అర్థం చేసుకోకుండా మాట్లాడేస్తున్నాడని పిల్లాడి బాధ. ఆయనను కాస్త ఆగండి, నేను చెప్పేది వినండి అని చెప్పాలనుకున్నాడు. “ఫాదర్, యూ షటప్, ఐ టాక్’ అని పిల్లాడు అనే సరికి ఫాదర్ ఫ్రాన్సిస్ నిజంగానే ‘అవాక్కయి’పోయాడట.
సాయంత్రాలు ‘స్వేచ్చా సమయం’లో పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్లి రావొచ్చు. ఆ కాస్త సమయంలో ఎక్కడికీ వెళ్లి రాలేం. సినిమాలూ అవీ చూడ్డం కుదరదు, వారంలో ఒక రోజు, ఆది వారం నాడు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు వరకు మాత్రం క్యాంపస్ విడిచి వెళ్ళొచ్చు. ఆ సమయంలోనే సినిమాకు వెళ్లి రావాలి. ఏ కారణం వల్లనైనా సాయంత్రం ఆలస్యమైతే హాస్టల్ గేటు తీయరు. అప్పుడేం చేయాలో తెలీదు. ఆందాక రానిచ్చే సాహసం నేను గాని, నా దోస్తులు గాని ఎప్పుడూ చేయలేదు కనుక మాకు తెలీదు. సినిమా తరువాత లేటయితే ఏ స్కూటరు వాలానో ఆడుక్కుని గూడు చేరే వాళ్లం. ‘లయలైట్ల’మంటే ఎవరూ లిఫ్ట్ నిరాకరించే వారు కాదు.
ఆదివారం కాస్త ఆలస్యానికే సాహసం లేకపోతే ఇక దేనికి సాహసం వుంటుంది మాకు. ఇక్కడ నా ఫ్రెండ్సు క్షమిస్తే, ఒక సెక్సిస్టు జోకు చెప్పాలని వుంది. అశ్లీలం కాదు, సెక్సిస్టు జోకు. నేను బి ఎస్సీలో వుండగా పత్రికల్లో వచ్చిన ఒక చవక బారు సీరియల్లో హీరో హీరోయిన్ ఆంధ్ర లొయొలా కాలేజీలో చదువుకుంటున్నట్టు రాశారు. ‘అదేంటి ఇక్కడ కో ఎద్యుకేషన్ లేదు కదా. ఇక్కడ అందరూ ఆడపిల్లలే కదా’ అని కాలేజీలో ఒక చమత్కారం ఆ కొద్ది రోజులు పచార్లు చేసింది.
సాయంత్రాలు మాకు దొరికే కాస్త సమయాన్ని ‘బెంజ్ కంపెనీ దాక’ వెళ్లి రావడానికి వెచ్చించే వాళ్ళం, అక్కడొక డ్రై క్లీనింగ్ షాపు వుండేది. మాలో ఎవరో ఒకరం షాపులో బట్టలు ఇస్త్రీ చేయించే పని పెట్టుకుని, నలుగురైదుగురం కలిసి పర్మిషన్ తీసుకుని వెళ్లి వచ్చే వాళ్ళం. దానికి ప్రధాన కారణం…. ఆ దారిలో వున్న మేరీ స్టెల్లా కాలేజీ. ఆంధ్ర లొయోలా కాలేజీ కేవల్ం బాయ్స్ కోసమే అయినట్లే. మేరీ స్టెల్లా కాలేజీ కేవలం ఆడపిల్లల కోసం. వాళ్ళకు సైతం మా కున్నంత స్వేచ్చ వుండేది. లేక, అంత కన్న ఇంకా ఘోరమో. ఆ దారిలో వాళ్లు కనిపించిన సందర్భాలు చాల తక్కువ. రోడ్డు అన్నాక వేరే ఇంకెవరో గర్ల్స్ కనిపిస్తారుగా. అది చాలు మా మొహాలకి.
అయినా, ఈ రెండు కాలేజీల్ని కలిపి ఇంకో జోకు వుండేది. ఆంధ్ర లొయొలా కాలేజ్ + మేరీ స్టెల్లా కాలేజ్ = నిర్మలా కాన్వెంట్ అని. నిర్మల కాన్వెంట్ అనేది బెంజ్ కంపెనీ దగ్గర ఓ చిన్న పిల్లల స్కూలు.

(వచ్చేవారం కలుద్దాం, బహుశ లొయొలా క్యాంపస్ లోనే :-))

 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s