పునాది రాళ్లు 

స్మృతి 13

విజయవాడలో నా రాజకీయ ‘కదలిక’ కుంచెం కుంచెం మొదలయింది. విశాఖలో ఆ కదలిక ఒక రూపం తీసుకుంది. నిజానికది చాల కాలంగా నిద్రాణం (డోర్మాంట్) గా వుండి, కాస్త వూపిరందాక మొలకెత్తిన విత్తనమే. అసలు విత్తనం మా వూరిదే.
ఉళ్లో మా చిన్నాన్న గుండప్పగారి శివారెడ్డికి కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలుండేవి. ఎర్రజెండాతో పరిచయం అలా ఏర్పడినదే. చిన్నాన్న నా మొదటి లీడరు. తనను అర్థం చేసుకోడమంటే మా వూరిని అర్థం చేసుకోడం. అలాంటి చాల వూళ్లను అర్థం చేసుకోడం
మా వూళ్లో రెండు రైతు వర్గాలుండేవి. ఉన్నాయి. ఒకటి రెడ్లది. ఇంకోటి కురుమలది.
రెడ్లలో రెండు శాఖలుండేవి. ఉన్నాయి. మోటాటి అనే శాఖ ఒకటి. వాళ్లు, నాలుగైదు కుటుంబాలు, బాగా ధనవంతులు. నెరవాటి అనే శాఖ రెండోది. వీళ్ళు జనం ఎక్కువ, ధనం తక్కువ.
నెరవాటి రెడ్ల వైపు నుంచి వూరి పెద్ద మనిషి, మా శివారెడ్డి చిన్నాన్న.
ఊరి పెద్దమనిషి అంటే వూరి పంచాయితీలన్నిటిలో ఒక బృందానికి ప్రతినిధిగా కూర్చునే మనిషి. మా బృందానికి పెద్ద మనిషి చిన్నాన్న.
మాలో మాకు చాల తగాదాలుండేవి. కొన్ని తగాదాలు మరీ విచిత్రంగా వుండేవి. అవి తర తరాల జ్ఞాపకాలు. ఊరికే అలా వుంటాయి. అజాగ్రత్తగా వుంటే, ఎప్పుడేనా ప్రజ్వరిల్లుతాయి కూడా. తరతరాల జ్ఞాపకాలు కాబట్టి నిజ నిర్ధారణ సులభం కాదు. ఊరికే చెప్పుకోడానికి బాగుంటాయి కథలు. అవి ఇతిహాసాల (ఎపిక్) స్థాయిలో వుంటాయి. ‘ఆసమ్’ అనిపిస్తాయి. మనకు తెలిసిన మన పెద్ద ఇతిహాసాలలో మాత్రం నిజమెంత, అనిజమెంత? నిగ్గు తేల్చేదెవరు? కొట్టుకు చావడమే గాని, వాటి లోంచి గౌరవాగౌరవాల్ని పిండుకునే ప్రయత్నాలే గాని. అవి ఎప్పటికీ తేలవు. తేలవని వదిలేయడమూ కుదరదు. అవి తర తరాలని ప్రభావితం చేస్తూనే వుంటాయి.
నాకు మరి ఇద్దరు దాయాది చిన్నాన్నలుండే వారు. ముని రెడ్డి, చిన్న సంజీవ రెడ్డి. శివారెడ్డి చిన్నాన్న వాళ్ల నాన్న, మా నాన్న నాన్న, ఆ ఇద్దరు చిన్నాన్నల నాన్నలు నలుగురు కలిసి ఒకే కుటుంబంగా వుండే వారు. వాళ్లంతా ఒక తల్లిదండ్రి బిడ్డలు కాదు. పెద్దవాడు పెంచుకోబడిన వాడు. ఆ పెద్దవాడే మా చిన్నాన్న వాళ్ళ నాన్న.
వాళ్లందరూ బాగా పెద్దవాళ్లయ్యక, అందరి పెళ్లిళ్లయిపోయాక, పెద్దవాడు ఆస్తిని అయిదు భాగాలు చేశాడు. తనకు తనదిగా ఒక భాగం, ప్లస్ జ్యేష్ఠ భాగంగా తనకే ఇంకో భాగం ఇచ్చుకున్నాడు. (జ్యేష్ఠ భాగమని పూర్వం ఒక సంప్రదాయముండేది). మిగిలిన వాళ్ళకు ఒక్కో భాగం. ఆ విధంగా ఆ నలుగురిలో, మిగిలిన ఎవరితో పోల్చినా రెండింతల ఆస్తిపరుడయ్యాడు చిన్నాన్న వాళ్ళ నాన్న. మిగతా నెరవాటి ఇండ్లన్నిటిలోనూ అప్పటికి ఆయనే వున్న వాడు. ఆయన ఒకే ఒక కొడుకుగా మా శివారెడ్డి చిన్నాన్న మాలో ‘అత్యంత ధనవంతుడు’. మా ఇండ్లన్నిటి తరుఫున ఆటోమాటిక్ గా తనే పెద్ద మనిషి.
ఊరి మిగతా గుంపులతో మాట్లాడాల్సింది తనే. మిగిలిన గుంపుల వాళ్లతో ‘తగాదాలు’ ఏర్పడితే మా తరుఫున వెళ్లి మాట్లాడాల్సింది తనే. మాట్లాడి వచ్చాక తను ఏం చెబితే అది మా వాళ్ళు వినాల్సిందే. దీనికొక చిన్న వుదాహరణ చెబుతాను. ఆ ఉదాహరణ ఇప్పటికీ నా కుడిచేతి మణి కట్టు మీద వుంది.
నా కుడి చేతి మణికట్టు మీద అడ్డంగా ఒక చిన్ననాటి గాయం మచ్చ వుంది. దానికొక ఫ్యామిలీ హిస్టరీ వుంది.
మా వూరికి దూరంగా, పడమటి దిక్కున ‘గంగన్న తోట’ అనే పేరుతో వాగు ఒడ్డున కొన్ని చేలు వున్నాయి. వాగు ఒడ్డు చేలు, నీటికి దగ్గర, బాగా ప్రెషియస్. అందులో ఒక ఐదెకరాల చేను ఖాసిం సాహెబ్ ఆనే రైతుది. ఆయన నుంచి ఆ చేనును మా నాన్న కొన్నాడు. అందులో చీనీ చెట్లు పెంచి ధనవంతుడైపోవాలని నాన్న ఆశ. తన ఆశ పునాది లేనిది కాదు. చీనీ చెట్లు పెంచి ధనవంతులైపోయిన వాళ్లు అప్పటికి మా వూళ్లో చాల మంది వున్నారు.
నాన్న కర్నూలు నుంచో ఎక్కడి నుంచో చీనీ చెట్లు తెచ్చి ఆ చేనిలో చాళ్ళు చాళ్లుగా నాటాడు. కొన్నాళ్ళ పాటు ఆ చిన్న చెట్లకు వాగు నుంచి కడవలతో నీళ్లు తెచ్చి పోయాలని, కొన్నాళ్ళయాక ఆప్పు చేసి ఆయిల్ ఇంజను కొనాలని ప్లాను. అమ్మ, నాన్న, మేం ముగ్గురం అన్నదమ్ములం… ఎండ తగ్గుముఖం పట్టాక వెళ్లి ఆ చెట్లకు నీళ్లు పోసే వాళ్లం. నేను ఎప్పుడూ ‘పనికి బాతి గానో’ డినే. పని చేయడం నాకు ఇష్టం వుండనే వుండదు. (ఈ రాయడం కూడా ‘పని’అనిపిస్తోంది. ఎప్పుడో ఎగ్గొట్టేస్తాను smile emoticon ) అలా ‘ఏడ్చుకుంటూ’ నీళ్లు మోస్తూ చేనిలో పడిపోయాను. నీళ్ల కడవ మీద వేసుకున్నాను. కడవ పెంకు చేతి మీద కొట్టుకుని గాయమైంది. రక్తం రక్తం… ’ఈనితొ గాదు ఒద్దంటె ఇనవు’ అని నాన్నను కోప్పడుతూ అమ్మ. ‘అన్న ఎప్పుడూ ఇంతే’ అంటూ ఇప్పుడు లేని మా శివుడు, చంద్రన్న. ఆ గాయం…. మచ్చ కాస్త చెదరినా…. ఇప్పటికీ వుంది.
మచ్చ వుంది గాని ఆ చేను లేదు. అదే అసలు కథ.
నాన్న చేనిలో పని మొదలెట్టే సరికి, అది లాభసాటి యవ్వారమని తేలిపోయింది. అప్పటి మా ఊరి ప్రెసిడెంటు (సర్పంచ్) వెంకటయ్యకు ఆ చేను కావాలని అనిపించింది. ఖాసిం సాహెబుతో బేరం మొదలెట్టాడు. ఆయన మా నాన్నకు మాట ఇవ్వడమే గాక, సంచుకారం (అడ్వాన్స్) కూడా తీసుకుని వున్నాడు. వెనక్కి పోలేడు. అయినా, చేను ఎక్కువ ధరకు పోయేదని నసగడం మొదలెట్టాడు. మేము చేను మాదే అనుకుని చీనీ చెట్లు నాటి, కడవలతో నీళ్లు పొయ్యడం, కడవలు చేతుల మీద వేసుకుని గాయాలు చేసుకోడం మొదలెట్టేశాం. ఎట్టా వదిలేస్తాం. వెంకటయ్య పుల్లలు పెట్టడం మానలేదు. ఖాసిం సాహెబు రిజిస్ట్రేషన్ కు రావడం లేదు.
ఖాసిం సాహెబు మాట తప్పి పోకుండా చూడడానికి, మాట్లాడడానికి నాన్న తరుఫున చిన్నాన్న వెళ్లాడు. తను మాట్లాడి వచ్చి చెప్పింది మాకు అన్యాయమైంది. నాన్నకు ఖాసిం సాహెబు డబ్బులు వెనక్కి ఇచ్చేట్టు, నాన్న దానికి ఒప్పుకోక తప్పదని ఖరారు. చిన్నాన్న అలా ఎందుకు చేశాడు? ఊరి రాజకీయాల్లో తనకు ఏదో లాభం ఉండే అలా చేశాడని నాన్న అభిప్రాయం. చిన్నాన్న కన్న మా నాన్న కనీసం ఐదేండ్లు పెద్దవాడు. (ఆస్తి రీత్యా బాగా చిన్నవాడు). చిన్నాన్న మా ఇండ్ల పెద్దమనిషి. నాన్న చిన్నాన్న మాట వినక తప్పలేదు. ఆ చేను మాది కాలేదు. కష్టం నష్టం, న్యాయం అన్యాయం ఏమైనా ‘మన’ ఇండ్ల పెద్ద మనిషి మాట ‘మనం’ వినవలసిందే.
వినకపోతే ఏమవుతుంది? ఊళ్లలో మనుషులు కులాల వారీగా, అందులోనూ శాఖల వారీగా… బృందాలు బృందాలుగా కలిసి వుంటారు. అనగా విడిపోయి వుంటారు. గుంపులు లోపల్లోపల ఎన్ని మల్లగుల్లాలు పడినా బయటికి చెప్పరు. ఎన్నికల్లో కలిసి ఎవరో ఒకరికే ఓట్లు వేస్తారు. బయటి నుంచి వచ్చిన వాళ్లు ఆ బృంద నాయకులను ముందుగా కలిసి, వారితో పాటు వెళ్లి ఓట్లు అడగాల్సి వుంటుంది.
ఊళ్లోని యీ బృందాల మధ్య చాల వైషమ్యాలుంటాయి. అవి ఆర్ఠికమైనవి కావొచ్చు. కేవలం అధికార ప్రదర్శనలూ కావొచ్చు. వైషమ్యాలు ఒక్కో సారి ‘ప్రాణాంతక’మవుతాయి. స్వీయ రక్షణ కోసం ఎవరికి వారు కలిసి వుండక తప్పదు. గ్రామ రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు అవసరమవుతాయి. దానికి గుంపులో కాస్త తెలివి మంతుడు, యుక్తిపరుడు నాయకుడై వుండక తప్పదు.
మా వూరిలో మొత్తంగా రెండు బలమైన రైతు వర్గాలుండేవి. వాటి మధ్య ‘శత్రుత్వం’ అనదగిన వైషమ్యాలుండేవి. ఒకటి రెడ్ల వర్గం. రెండవది కురుమలది. అందరూ ప్రాథమికంగా రైతులే. అందరి దగ్గరా ఆవులు బర్రెలతో పాటు ఒకటి రెండు మేకలు గొర్లు కూడా వుండేవి. కాని; రెడ్లు పూర్తిగా భూమి మీద, సేద్యం మీద ఆధారపడే వారు. కురుమలు గొర్లు మేకల మీడ ఆధారపడే వారు. ఈ ఆర్థిక స్థితులలోనే తగాదాలకు బీజాలుండేవి.
కురుమలు గొర్లు మేకలను తమ చేలల్లో మేపారని రెడ్ల ఫిర్యాదు. ఒక్క గొర్రె, ఒక్క మేక ఏ చేనిలో పడకుండా చూసుకోడం ఎంత జాగర్తగా వున్నా కురుమలకు అసాధ్యం. సో, తగాదా అనూచానం. నిరంతరం. మిరప తోట తరహా చేలలో, పత్తి చేలల్లో గొర్లు మేకలు పడకుండా చేల రైతులు కుక్కల్ని పెంచడం, అవి గొర్లను ఎత్తుకుపోయాయని ఫిర్యాదులు కూడా వుండేచి.
నా లీలా మాత్ర జ్ఞాపకాల్లో ఒక గోధుమ రంగు బలమైన కుక్క వుంది. నాన్న పెంచుకున్న కుక్క. అది గొర్ల మందల మీద పడుతోందని కురుమ రైతులు మా ఇంటికి వచ్చి, నాన్నను ఒప్పించి ఒక సాయంత్రమంతా కష్టపడి ఆ కుక్కను పట్టుకెళ్ళారు. నాన్న దానికి కాదనలేదు గాని, తనూ మా జేజి ఆ కుక్కను తల్చుకుని చాల బాధ పడ్డం ఒక విషాద స్మృతి.
ఒక్కోసారి ఈ వైషమ్యాలు తీవ్రమయ్యేవి. కారణాలు ఆర్థికం, రాజకీయం ఏమైనా కావొచ్చు. అప్పుడు అటు వాళ్లు ఇటు వాళ్ళు గులక రాళ్లు ఏరుకొచ్చి మిద్దెల పైకప్పుల మీద కుప్పలు పోసుకునే వాళ్ళు. రాళ్ల కుప్పల పక్కన నిలబడి ఒకరికొకరు సవాళ్ళు విసురుకునే వారు. అలా మిద్దెల మీద రాళ్లు పోసుకుని అందరూ మిద్దెల కెక్కిన దృశ్యమొకటి నా మనసులో పదిలంగా వుంది. ఆ రోజు అన్నీ మాటలే. రాళ్లు రువ్వుకోడం జరగలేదు. చిన్నాన్న వంటి వాళ్ళు ఈ రాళ్ళను, చివరికి తుపాకుల వంటి మాటల్ని కూడా ప్రత్యర్ఠులను భయపెట్టడానికి, స్వపక్ష యోధులను ‘మనమూ పోట్లాడగలమని’ తృప్తి పరిచి నిద్ర పుచ్చడానికే వుపయోగించే వారు. యవ్వారాలు అంతకు మించి పోకుండా చూడ్డానికి వాళ్ళ తెలివి తేటలు వుపయోగ పడేవి.
చిన్నాన్న లోని ఈ శాంత వీరం నాకు చాల నచ్చేది. రాజకీయాలోచనల్లో చాల వరకు నేను తనను అనుసరించడానికి తన లోని ఈ శాంత గుణమే కారణం.
చదువూ అదీ అయిపోయి, కమ్యూనిస్టు కార్యకర్తలమయ్యి, నేనూ జయ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇతరేతర కారణాల వల్ల మా పెళ్లికి జనాన్ని పిలవడం నుంచి అన్ని పనులూ మేమే చేసుకున్నాం. అప్పుడు మా వూరిలో నేను చేసిన ఒకే ఒక పని. మా వాళ్లు ఎవరూ చేయనిది. కత్తి పుల్లన్న, వెంకటయ్య మొదలైన కురుమ పెద్దల ఇంటింటికి వెళ్లి మేము మా కోసం ముద్రించిన ‘చిత్రమైన’ పెళ్లి కార్డు ఇచ్చి, ఆహ్వానించి వచ్చాను. మోతుబరి కురుమ రైతు కత్తి పుల్లన్న బయటరుగు మీద కూర్చుని ‘అవు మల్ల, రాకుంటె ఎట్టయితాది. పెండ్లికి రావాల్సిందే’ అని విరసపు గొంతుతో అనడం, అయినా అలా వెళ్లినందుకు నాకు సంతోషం కలగడం… ఒక గొప్ప అనుభూతి. ఇటీవ్ల ఆయన కొడుకు కృష్ణ మూర్తి, మా చిన్నాన్న కొడుకు సమీరుడు రాజకీయాల్లో కలిసి కనిపించడం నాకు భలే సంతోషమే ఇచ్చింది, ఆ రాజకీయాలలో నేలబారు అవకాశ వాదం తప్ప ఏం వుండదని తెలిసినా.
సమాజం మారే కొద్దీ వూరిలో ఈక్వేషన్లు మారి పోతాయి. మారిపోవాలి.
మా చిన్నాన్న మా ఇండ్ల మేరకు (అప్పటికి) ధనికుడే గాని, వూరిని ఒక యూనిట్ గా తీసుకుంటే కాదు. దేశం రామిరెడ్డి మామ వంటి మోటాటి రెడ్లు బాగా వున్న వాళ్ళు. చిన్నాన్నకు తన ప్రత్యర్ఠులు కొందరి నుంచి చిరు ప్రమాదాలు కూడా వుండేవి.
ఈ దిగువ మధ్య తరగతి నాయకుడికి సహజమైన రాజకీయం ఆ నాటికి కమ్యూనిస్టు పార్టీయే. పక్కన మంచాలకట్ట తదితర గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ వెనుక నున్న రామచంద్రా రెడ్డి వంటి వారిని చూసినా… గ్రామాలలో మొదటి శ్రేణి రాజకీయులు కాంగ్రెస్ నేతలు కాగా, వారిని ఎదిరించి బతకాల్సిన స్థితిలో వున్న మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి నేతలు కమ్యూనిస్టు పార్టీ గొడుగు కింద నిలదొక్కుకోజూచారు.
మీరెన్నైనా చెప్పండి. మనమేమి విశ్వసించాలో పూర్తిగా, పరమ నిరపేక్షికంగా మనమే నిర్ణయించుకోడం లేదు. ఈ అర్థంలో మనలో ప్రతి ఒక్కరం ‘మాతృ గర్భంలో మరణ వ్యూహం’… జీవన వ్యూహం… తెలుసుకున్న వాళ్ళమే. దానికొక ఉదాహరణ మా శివారెడ్డి చిన్నాన్న. తన నుంచి నాకు తెలిసిన గొప్ప ఐడియా కమ్యూనిజం. ఈ ఐడియాను మోసుకుంటూ, అలసిపోతే దాన్నే దించి ఊతకర్రగా నేలకు పొడుచుకుంటూ, దాని పేరిటనే సత్యాసత్య ప్రమాణాలు ప్రకటించుకుంటూ నడుస్తున్నాను.
ఆ ఐడియాను ఊరికే మనసులో ప్రేమించడం కాకుండా ఆచరించి చూడాలని అనిపించింది మాత్రం… కొద్దిగా విజయవాడలో, తరువాత మరి కొద్దిగా విశాఖ పట్నంలో.
భవనాల గోడలలో అటు ఇటు పెద్ద రాళ్లు అమర్చి ఆ రెండు వరుసల మధ్య గులక రాళ్ళు పోస్తారు. నా దేహంలోని ఆ గులకరాళ్లు రాయలసీమవి.
ఆ రాళ్ళు ఎలా వుంటాయో మిమ్మల్ని అక్కడి మిద్దెల మీదికి తీసుకెళ్లి చూపించాను. ఇంకొంచం వివరంగా చూపడానికి నా ‘వానలో కొబ్బరి చెట్టు’ సంపుటి నుంచి ఒక పద్యం ఇక్కడ:
//రాయి రాయి రాసుకుంటున్నాయి//
రాళ్ల చేనిలో గుంటక తోలే రైతుతో మట్టి గురించి మాట్లాడకు
అవి, మనుషుల నెత్తురూ చెమట తాగి మత్తుగా నిద్ర పోయే రాళ్ళు
దేవుళ్లకు ఆకారాలిచ్చి కుంకుమ వానల్లో తడిసిపోయే రాళ్ళు
ఉద్రిక్త సాయంత్రాలు మిద్దెల మీద కుప్పలు కుప్పలుగా చేరి
మిద్దె నుంచి మిద్దెకు రక్త రాయబారాలు నడిపించే రాళ్లు
ఆడుగున మిగిలిన తేమలో తేళ్లకు నీడనిచ్చే రాళ్ళు
చెంచులు యాట మాంసానికి ఉప్పు కారం నూరుకునే రాళ్ళు
ఊరి నుంచి వూరికి నడిచే మనుషులకు దారి చూపే రాళ్లు
చెప్పులు లేని కాళ్ళకు నెత్తురు పువ్వులు చెక్కి పంపే రాళ్ళు
పాలకులకు గుండెలు ఉండాల్సిన చోట ఉండిపోయిన బండరాళ్ళు
అతడు, బండరాళ్ళ పగుళ్ల లోంచి మోసులెత్తే మొండి మొక్క
ఊరూరికి ఒక కోట, లేదా, ఒకట్రెండు బురుజులు
దేశ దేశాల దీటి దొంగల నుంచి కాపాడుకోడానికి
సోంతూరి దీటి దొంగలు దాక్కోడానికి దాపునిచ్చిన బురుజులు
ఝాన్సీ లక్ష్మి కన్న ముందు సొతంత్రం ప్రకటించిన బురుజులు
యుగయుగాల భయద చరిత్రను మౌనంగా రాస్తూ
సున్నితంగా నిలబడ్డ రాళ్ళకు వ్యాసపీఠాలైన బురుజులు
అతడు, దప్పికేసినప్పుడు దోసెడు నీళ్ళు లేకున్నా
ఆకలేసినప్పుడు పిడికెడు సంకటి లేకున్నా
రాయి మీద రాయి పేర్చి కోటలు, బురుజులు కట్టిన వాడు
ఆలయాలకు దేవిడీలకు పనికి రాని బరక రాళ్ల ఇళ్లలో
రాళ్ల మధ్య తానూ ఒక రాయిగా మారిపోయిన వాడు
అతడు ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నాడు
నలుదిక్కుల కొత్త గాలులు పీల్చుకుంటున్నాడు
బతుకులో రకరకాల రాళ్ళు ఎత్తి పోసుకుంటున్నాడు
రాయి రాయి రాసుకుని పుట్టే మంట అవుతున్నాడు
నల్లమలలూ ఎర్రమలలు వట్ఠి బ్యారికేడ్లు కావొద్దని
కృష్ణా తుంగభద్ర పెన్నా ఊరికే పొర్లి పోవద్దని
రాయల నాటి చెరువులు మరుగున పడిపోవద్దని
వాడు అమ్మితే వీడికి వీడు అమ్మితే వాడికి దత్తమై పోవద్దని
కాసేపు వాడితో కాసేపు వీడితో సరసమాడే సొంతూరి దొరల
పాచికలాటలో పందెమై నిండు సభలో వివస్త్రుడు కావొద్దని
తన కోసం తాను, రాళ్ల కింది తనదైన మట్టి కోసం తాను
నిలబడక తప్పదని తెలుసుకుంటున్నాడు
కళ్ళు తుడుచుకుంటున్నాడు
‘నేనెవుర్ని’ అని ప్రశ్నించుకుని జవాబు వెదుక్కుంటున్నాడు
అతడితో…. రాళ్ళ గురించి రాళ్ళ కింది మట్టి పొరల గురించి
గుండె అరల గురించి తరతరాల చెరల గురించి మాట్లాడు
రాళ్ళు ఎత్తి పోసుకునే పనిలో చేతులు కలిపి మాట్లాడు
చాళ్ళు చాళ్లుగా తీర్చిన మట్టిని మొరటు వేళ్ళతో మీటి
వీర బ్రహ్మం, యోగి వేమన తత్వ రీతుల సాక్షైగా
చెప్పలేదంటనగ వొయ్యెరు నరులార మీరని
భూత భవిష్యత్ వర్తమానాలను విప్పి చెబుతారు
చిల్లర రాళ్లకు మొక్కి చెడకని అనుభవ రాగం ఆలపిస్తారు
(వానలో కొబ్బరి చెట్టు, 201, పేజ్ 40, 41)
(లొయోలా విశ్వనాథ సంగతి ఇక వచ్చే వారమే సారూ:-) )

A comment by Prasada charasala: ఆశ్చర్యంగా మన ప్రాంతాలు చాలా దగ్గరివైనా, మా వైపు ఇలా గుంపుకో నాయకుడుండి, మంచైనా, చెడైనా అంతా అతనిమాట తప్పక వినడమనే ఆచారం లేదు.

My comment in reply:  ఫ్రసాదు గారు, మరీ అంత ఖచ్చితంగా గుంపు పెద్దమనిషి మాట వింటారని కూడా కాదు. తన మాట వాళ్ళు వినిపించుకునేలా చేయడంలో, ‘ఎక్కడి వాళ్ళను అక్కడ వుంచడంలో ‘ అతడు చూపే కుశలత్వం మీద ఆతడి పెద్దమనిషి తరహా ఆధారపడేది. The group needed him for leading but he needed to keep the group in his grip too.
Advertisements

About hrk

Publishing mostly in Telugu. Not only poetry but every thing I write.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s