అమ్మపాలు జొన్న రొట్టె రెండు వూళ్లు ఒక అబ్బాయి

Preserving from the previous blog

అనగనగా ఒక ఊరు. చాల చిన్న ఊరు. రెండొందల ఇళ్లు ఉండీ లేక. ఆ ఊరు ఒక కొండ మీద ఉంటుంది. అసలు ఆ ఊరి పేరే కొండమీది బొల్లవరం. కింది నుంచి చూస్తే, ఆ ఇళ్లు పువ్వుల్లా కనిపిస్తాయి. ఊరు ఒక పుష్ప గుచ్ఛం(బొకే)లా కనిపిస్తుంది. పుష్ప గుచ్ఛంలో ఆకు పచ్చని ఆకులు, రెమ్మల్లా ఆ ఇళ్ల చుట్టూ మర్రిమాన్లు, గుల్మొహర్, దేవగన్నెరు చెట్లు, రేగు, బలుసు పొదలు. కొండ కింది నుంచి చూస్తే అవన్నీ పుష్ప గుచ్ఛంలోని ఆకులూ రెమ్మల లాగే కనిపిస్తాయి.

ఆ ఊళ్లో వాళ్ల మాటలు కూడా తమాషాగా ఉంటాయి. ఏదయినా చాల బాగుందని చెప్పాలంటే ‘బద్రంగ’ ఉందని అంటారు. చస్తావురోయ్ అనాలనుకుంటే ‘గుంత నారకు వోతావు’ అంటారు. వేరే ఊళ్ల గురించి మాట్లాడాలనుకుంటే ‘దిగోన’ అంటారు. (దిగోన… దిగువన… కొండకు దిగువన). ఇన్ని మాటలెందుకు, ఆ ఊరికి ఒక ప్రత్యేక భాష ఉందనుకోరాదూ!

కొండ దిగితే కాస్త దూరం నల్లరేగడి నేల. వెంటనే మళ్లీ ఇంకో కొండ. రెండో కొండ కూడా ఎక్కి దిగితే, ఇక, అంతా నేల. పంటల కాలమైతే పచ్చని పొలాలు. జొన్న ఒగుళ్లు రాసుకుంటూ, కంది రెమ్మలు తోసుకుంటూ లేదా బుడ్డల చెట్లు (వేరుశనగ) తొక్కుకుంటూ నడిస్తే ఒక వాగు వస్తుంది. పెద్ద వాన వస్తే దాటనివ్వదు. వాగు దాటి ఇంకాస్త నడిస్తే ఒక పెద్ద ఊరు. ఆ ఊళ్లో అప్పుడు (1961) ఒక హైస్కూలు ఉండేది. (ఇప్పుడా ఊళ్లో ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీ కూడా ఉంది). ఆ ఊరి పేరు గడివేముల.

ఒక పిల్లాడు- పదకొండేళ్ల వాడు- ఇంకొందరు పిల్లలతో కలిసి ప్రతి ఉదయం, సాయంత్రం ఆ రెండు కొండల మీదుగా నడిచే వాడు. కొండ మీది బొల్లవరంలో మేనమామ ఇంట్లో ఉంటూ గడివేములలో చదువుకు వెళ్లి వచ్చే వాడు.

అత్త మంచిదే. పిల్లాడికి విపరీతంగా ఆకలి వేసేది. భయమూ వేసేది. అడగడానికి అమ్మ లేదని దిగులు వేసేది. దిగులు వాడి శరీరంలో ఒక అవయవమైపోయింది.

ఆ ఊరి చుట్టూ పెద్ద పెద్ద ఎర్ర రంగు కొండ రాళ్లు. వాడు కొండరాళ్ల మధ్య చేరి ఎవరూ చూడకుండా కడుపు నిండా ఏడ్చే వాడు. లేకుంటే కొండరాళ్ల మధ్య గాఠ్టిగా అరుస్తూ పాటలు పాడుకునే వా‍డు. పుస్తకాల్లోనివి కాదు. అవి పూర్తిగా వాడి సొంత పాటలు. ఆ కుర్రాడిప్పుడు ( మొదట ఇది రాసేప్పుడు) నలభయ్యారేళ్ల వాడయ్యాడు. ఇప్పటికీ అంతే. తన పాటలే తాను పాడుకుంటాడు. ఇతర్లు చాటుగా విని, తన పాటలు బాగున్నాయని మెచ్చుకోవాలని కోరుకుంటాడు.

ఇంతకూ కొండమీది బొల్లవరం ఆ అబ్బాయి అవ్వ (అమ్మమ్మ) గారి ఊరు. అవ్వ, తాతలను వాడు చూడలేదు. వాళ్లు వాడు పుట్టక ముందే చనిపోయారు. అవ్వ, తాతల ఒళ్లో కుర్చుని కతలు వినడం అంటారే అదేమిటో వాడికి తెలియదు. ఆ భాగ్యం వాడికి నాన్న వైపు నుంచి కూడా కలగలేదు. ఆ రోజుల్లో మనుషుల ఆయుర్దాయం చాల తక్కువ.

ఆ ఊరి నుంచి కొండ మీదే మరో దిక్కుగా మూడు మైళ్లు నడిస్తే కొండవారన మరో ఊరుంది. మధ్యలో చాల దూరం ఒక ఆకుపచ్చని లోయ అంచు మీద నడవాలి. లోయలోంచి పిచికలు,  బెల్లంగోళ్లు, నెమళ్లు ఎప్పు డూ ఏవేవో పాటలు పాడుతుంటాయి. కొండవారన ఉన్న ఆ మరో ఊరి పేరు గని. మనది పితృస్వామిక సమాజం కనుక ఆ అబ్బాయి ఊరు అదేనని చెప్పాలి. 

అబ్బ (తండ్రి తండ్రి) ఎప్పుడో చనిపోయాడు గనుక తెలియదు గాని, ఆయన గొప్ప సేద్యగాడని ఇతర్లు చెప్పే వారు. జేజి (నానమ్మ) మాత్రం వాడికి బాగా గుర్తుంది. ఆమె దయ గల ముఖం, తేనెటీగల్లాంటి నల్లని కురులు, ముఖ్యంగా ఆమె వాడికి రోజూ ఇచ్చిన వేలెడు మందం వెన్న పూసిన జొన్నరొట్టె- వాడి మనసులో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. నిజానికి వాడికి ఏ ఎనిమిదేళ్లో వుండగా- అఖరున వాడు పోసిన తులసి నీళ్లతోనే ఆమె చివరి గుటక వేసింది.

జేజి గ్నాపకాలు వాడికి ప్రాణం.

ఆరో తరగతి చదువుతూ బొల్లవరంలో ఉన్నప్పుడు వాడికి ఒక కల వచ్చింది. మేనమామ ఇంటి ముందు కొండరాళ్లతో కట్టిన బురుజు పక్కన మంచం మీద వాడు నిద్ర పోతున్నాడు. అదొక వెన్నెల రాత్రి. వెన్నెట్లోంచి ఒకామె వాడి కాళ్ల వైపు నడిచి వచ్చింది. ఆమె చాల అందంగా ఉంది. ధగధగ మెరిసే చీర కట్టుకుంది. ఎన్నెన్నో బంగారు సొమ్ములు పెట్టుకుంది. ఆమె గొప్పగా, మెత్తగా, హాయిగా, వెచ్చని రొట్టె మీద పరుచుకున్న వెన్నలా, గనిలో వాళ్ల కళ్లంలో చిన్నత్త పెంచిన ఇచ్చెమల్లె చెట్టులా ఉంది. ఆమె చాల ప్రేమగా నవ్వింది. ఆ తరువాత వాడి మీదికి ఒరిగిపోయింది. ఆమె శరీరమంతా వాడి శరీరంలో కలిసిపోయింది. వాడికి చాల చాల ఆనందం కలిగింది, వాడిలో గొప్ప బలం చేరింది. సందేహం లేదు. ఆమె వాడి జేజి.

అంత నమ్మకం వాడికి. అందుకే వాడు- పెద్దయ్యాక ఈనాటికి కూడా- తన భార్యనూ కూతురునూ- వాళ్ల మీద ప్రేమ పొంగినప్పుడల్లా- ‘నా చిట్టి నానమ్మా’ అని పిలుస్తాడు, కలవరిస్తున్నట్లు.

పెద్దవాడయ్యాక, ఆ అబ్బాయి జీవితం చాల రఫ్ గా గడిచింది. కాలేజి చదువుల కోసం ఊరూరు తిరిగాడు, ఆకలికి నానా‍ గడ్డి తిన్నాడు. నక్సలైట్‍ పార్టీలో కార్యకర్తగా పదేళ్లు మరీ రఫ్ గా బతికాడు. విపరీతంగా సిగరెట్లకు అలవాటు పడ్డాడు. అయినా- యాభైకి దగ్గరవుతున్నా- వాడికి పెద్దగా డాక్టరు అవసరం రాలేదంటే- దానికి రెండు కారణాలున్నాయని వాడికి గట్టి నమ్మకం. ఒకటి- వాడి జేజి ఇచ్చిన వెన్న పూసిన జొన్న రొట్టె, రెండవది- సుమారు ఐదో ఏడు నిండే వరకు వాడు తాగిన అమ్మ పాలు.

వాడి తల్లి పేరు సుబ్బమ్మ. ఆమె చాల అందగత్తె. వాడి కళ్లకు మరింత అందగత్తె. చాల ఆరోగ్యవంతురాలు. వాడి తరువాత సుమారు ఐదేండ్లకు ఆమెకు రెండో కొడుకు పుట్టాడు. తమ్ముడు పుట్టాక కూడా మన వాడు అమ్మ పాలు తాగబోయి, పొట్టలో ఇమడక, ఇక మానేశాడు. ఒక తమాషా చెప్పనా! మామూలుగా ఎవరికీ తాము అమ్మ పాలు తాగడం గుర్తుండదు. వాడికి మాత్రం- అమ్మ పైట, అందులో తన తల, పాల రుచి ఎంచక్కా గుర్తున్నాయి. అంత పెద్దయ్యేవరకు అమ్మ పాలు తాగాడన్న మాట భడవ.

వాడి జేజికి ఐదుగురు కూతుళ్లు. వారందరి కన్న ముందుగా ఒకే కొడుకు. పేరు సంజీవ రెడ్డి. మన వాడు పుట్టి బుద్ధీ గ్యానం తెలిసే నాటికి ఆ బక్క రైతు (సంజీవ రెడ్డి) నిండుగా అప్పుల్లో మునిగిపోయాడు. చివరి వరకూ ఆ సుడిగుండంలోనే ఈది అలసిపొయి, యాభై నిండకముందే చివరి మునక వేశాడు.

కొడుకు తన లాగే అణగారిపోగూడదని ఎలాగో చదివించాడు. అందులో భాగమే ఆరో తరగతి కోసం మేనమామ ఇంట కుర్రాడి ప్రవాసం. ఆ తరువాత అదీ కుదరలేదు. గడివేములలోనే పూట కూలి తిండి. ఎవరి అరుగు మీద స్థలమిస్తే వారి అరుగు మీద భయంకరమైన రాత్రులు గడపడం. ఇక్కడ మరో అమ్మ గురించి చెప్పాలి.

గడివేములలో ఒక పొలీస్ స్టేషన్ ఉండేది. (ఇప్పటికీ ఉంది). అందులో ఒక ముస్లిమ్ ‘హెడ్డు’గా పని చేసే వాడు. వాళ్లబ్బాయి- ఇస్మాయిల్‍- మన వాడికి సహాధ్యాయి. వీడు వాళ్ల ఇంటి అరుగు మీద రాత్రులు గడపడం మొదలెట్టాడు. ఇస్మాయిల్ వాళ్లమ్మ వీడికి కూడా అమ్మ అయిపోయింది. దగ్గరికి తీసింది. తలలో పేలు చూసింది. తల దువ్వింది. అన్నం పెట్టింది. ఒక పండగ పూట “తురక వాళ్లమని బయపడాకు, నీకు నువ్వు తినగూడనివి పెట్టన్లే” అంటు వాడి తల మీద తన చల్లని చేతితో నిమరడాన్ని వాడెన్నటికీ మరిచి పోలేడు. ఆ హెడ్డుగారు ఇప్పుడెక్కడున్నారో? ఎదురుపడితే తెలుస్తుందా? అమ్మా మీరు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి అనుకుంటాడు ఆమెను గుర్తు చేసుకుని ఇప్పటికీ.

మన వాడు ఎనిమిదో తరగతి నుంచి; ఇక సొంతూరు (గని) నుంచే నాలుగైదు మైళ్ల దూరంలోని మరో ఊరి (తలముడిపి) హైస్కూలుకు రోజువారీ నడక మొదలెట్టాడు. ఏ ఏడాదికా ఏడాది చదువు మాన్పించాలని వాడి నాన్న తలపోసే వాడు. ఏడో తరగతి తరువాత నిజంగానే మాన్పించాడు. ఆ అబ్బాయి మిగిలిన పేద పిల్లలతో కలిసి బర్రెలు కాసే పని మొదలెట్టాడు. పదిహేను రోజులయ్యే సరికి వాడి నాన్న ఉండలేకపోయాడు. తిరిగి స్కూళ్లో చేర్పించాడు.

ఆ పదిహేను రోజుల్లోనే పలు అనుభవాలు. ఊరికి దూరంగా ఏటి ఒడ్డున పశువులు ఆపి, చేతులతో చిన్న చిన్న చేపలను బయటికి కొట్టి, వాటిని మంటల్లో కాల్చి, ఇంటి నుంచి తెచ్చుకున్న సద్దిమూటలు విప్పి, కాల్చిన చేపలు నంజుకుంటూ బువ్వ తినడం ఎంత బాగుంటుందో ఆ అబ్బాయినే అడగాలి. లేదా; శ్రీకృష్ణుని పశుల కాపరి వేళలను వర్ణిస్తూ-‘వేళ్ల సందున మంచి మాగాయ పచ్చడి పసందు’ అని రాసిన పోతన గారినయినా అడగాలి.

మరొక రోజు ఆ అబ్బాయి ఇతర పిల్లలతో కలిసి-ఏటి గట్టున ఈత చెట్ల మీంచి కుండలు దించుకుని దొంగతనంగా కల్లు తాగాడు. పిల్లలూ, పెద్దలూ! వాళ్లను- ఆ పిల్లలను- కోప్పడకండి. కోప్పడక తప్పదనుకుంటే, ముందుగా వెన్నదొంగ కృష్ణయ్యను కోప్పడండి.

ఇంకా ఆ పిల్లవాడి గురించి ఏం చెప్పను?!

చలికాలం ఇంటి నడవాలో గొడ్లకు కాస్త దూరంగా వరుసగా మంచాలేసుకుని పడుకునే వాళ్లు కుటుంబమంతా. అమ్మ, నాన్నలకు వేరు గదులుంటాయనే విషయం వాడికి తెలియదు. రాత్రులు వాడికి అమ్మనాన్నల గుసగులు వినిపించేవి. వాడికి అప్పటికే సెక్సు గురించి వినికిడి మాటలు తెలుసు. మొదట ఆ సస్పెన్సుతో చెవులు రిక్కించి వినేవాడు. వాళ్ల మాటలు సరిగ్గా వినిపించిన రోజున వాడి గుండె- పాల సముద్రంలో మంథర పర్వతంలా- సుడులు తిరిగింది. వాళ్ల గుసగుసల్లో సెక్సు లేదు. ప్రేమ కూడా లేదు. భయం, ఆందోళన, నిలువునా దహించే దిగులు తప్ప మరేమీ లేవు. వాళ్లు అప్పుల గురించి- పిల్లలకు వినిపించగూడదని- గుసగుసలాడే వాళ్లు. అప్పుల ఊబి లోంచి ఎప్పటికయినా బయట పడతామా- అని నిరాశగా మాట్లాడుకునే వాళ్లు. పగళ్లు- తన నిరాశకు తట్టుకోలేక మన వాడిలో చిన్న తప్పు కనిపించినా చచ్చేట్టు కొట్టే వాడు నాన్న. అమ్మ భయం బయంగా నిప్పుల మధ్య నడుస్తున్నట్లుగా తిరుగుతుండేది.

ఒకసారి గడివేములలో, ఊరి వాళ్ల అరుగుల మీద రాత్రులు గడుపుతున్న కాలంలో- వాడు పడుకున్న ఇంటిలో చిన్న దొంగతనం జరిగింది. కొంచెం డబ్బు పోయింది. ఇంటి వాళ్లు అరుగు మీద పడుకున్న వాడి వైపు అనుమానంగా చూశారు. వాడికి చాల భయం వేసింది. వెంటనే బయల్దేరి పది మైళ్లు నడిచి సొంతూరు (గని) కి వెళ్లాడు. పొలం నుంచి అప్పుడే ఇంటికి వచ్చాడు నాన్న. వీడు రావడం చూసి మారు మాట్లాడకుండా చేతి లోని ములుగర్ర విరిగిపోయే వరకు కొట్టి, “మా సావు మేము సస్తొంటే, నువ్వు బడి ఎగ్గొట్టి వస్తావా? ఏముందీడ! ఎట్ట బతుకుతావు” వెనక్కు పంపేశాడు. వాడు అన్నమయినా తినకుండా, ఊరు దాటాక వాగులో నీళ్లు తాగి, ఏడుస్తూ, తిరిగి పది మైళ్లు నడిచి రాత్రికి అదే అరుగు మీదికి చేరాడు.

తలముడిపి స్కూలులో చేరాక; బడి నుంచి సొంతూరికి వెళ్లే దారిలోని అంగడిలో వాడి సావాసకాడొకడు- డబ్బున్న వాడు- పప్పులు, బెల్లం (పుట్నాలు, బెల్లం) కొన్నాడొక రోజు. అంగడిలో శెట్టి ‘నీకేం ఒద్దా’ అన్నట్టు చూశాడు మన వాడి వైపు. ‘దుడ్లు లేవు’ అన్నాడు వాడు. ‘మల్లిత్తువులే’ అన్నాడు శెట్టి. వాడు ఒక అణా బాకీ పెట్టి బెల్లం కొనుక్కుని తిన్నాడు. అప్పుడే కాదు, ఎప్పుడయినా వాడి దగ్గర అణా ఏదీ? శెట్టి రెండు మూడు సార్లు బాకీ సంగతి అడిగాడు. వాడికి దిక్కు తోచలేదు. ఒక రోజున- ఇంట్లో ఎవరూ లేనప్పుడు- గరిసెలో దిగి నిక్కరు జేబు నిండా జొన్నలు పోసుకుని, వాటిని అమ్మి అణా సంపాదించాడు. బాకీ తీరింది గాని, వాడికి బెల్లం మీద కోరిక తీర లేదు. నాలుగైదు సార్లు నిక్కరు జేబు దొంగతనాలయ్యాక, నాన్నకు పట్టు బడ్డాడు. ఎద్దుల్ని తోలే చెల్కాల (చర్నాకోల) చివర ఉండే వార్లు వాడి వీపు మీద తెగిపోయాయి. బెల్లం మమకారం మాత్రం వాడితోనే ఉండిపోయింది.

ఇప్పటికీ వాడికి నాన్న అంటే- ఒక ములుగర్ర, ఒక చర్నాకోల, నిస్సహాయమైన కసితో ఎర్రబడిన రెండు కళ్లు మాత్రమే. అమ్మ అంటే- భర్తను ఏమీ అనలేక, కొడుకు దెబ్బలు తినడం చూడలేక, బేలగా ద్రవించే రెండు కళ్లు మాత్రమే.

కతలు చెప్పడానికి అవ్వ, జేజి లేకపోయినా; బండచాకిరీ, భయం జీవితం వల్ల అమ్మకు ఆ తీరిక లేకపోయినా- వాడి బాల్యం శూన్యం కాలేదు. ఆ ఖాళీని పుస్తకాలు పూరించాయి. ఆరో తరగతిలో ఉండగా మొదటి సారి వాళ్ల క్లాసు టీచరు పిల్లలందరికీ లైబ్రరీ నుంచి కతల పుస్తకాలు తీసి ఇచ్చాడు. అలా వాడు చదివిన మొదటి పుస్తకం ‘బంగారు దీవి’ అనే సాహస గాథ. వాడిలో కొత్త లోకమొకటి తెరుచుకున్నట్లయ్యింది. అది చదివేసి, సహాధ్యాయులకు ఇచ్చిన పుస్తకాలూ కూడా తీసుకుని చదివాడు. ఇక, ఎక్కడ కథల పుస్తకం దొరికినా వాడికి పండుగ అయ్యేది. రాను రాను కవిత్వం చదవడం మొదలెట్టాడు. చదివిన ప్రతి దానికీ చలించి పోయి, ప్రభావితుడయ్యే వాడు. ఆ పైన చదివిందాన్ని అనుకరిస్తూ తానూ రాయడం మొదలెట్టాడు. నాన్-డిటెయిల్డ్ టెక్స్టుగా రవీంద్రుని నవల ‘రాజర్షి’ చదివేసి, వాడూ ఒక నవల రాశాడు. అదీ, ఇంకేవో లొల్లాయి పదాలు ఒక లెక్కల నోట్‍బుక్‍ నిండా ఉండేవి. వాళ్ల నాన్న దాన్ని చూసి, ‘చదువుకోడం మాని ఇట్టాంటి పిచ్చిపనులు చేస్తావా’ అని కోప్పడి నోట్‍బుక్‍ను పొయ్యిలో పెట్టేశాడు.

తొమ్మిదో తరగతిలో వాడికి ఒక గొప్ప టీచరు దొరికాడు. ఆయన పేరు అవధానం వేంకట రమణమూర్తి. అయన అర్.ఎస్. ఎస్. అభిమాని. మన వాడు సోషల్ స్టడీస్ పుస్తకం చదువుతూ రష్యా గురించి తెలుసుకుని అటువైపు మొగ్గాడు. అది తెలిసి రమణమూర్తి సారు వాడికి రష్యా గురించి మరెన్నో సంగతులు చెప్పాడు. స్వయంగా ‘మహా ప్రస్థానం’ పుస్తకం కొని వాడికి ఇచ్చాడు. వాడి మొదటి ‘మహా ప్రస్థానం’ ఆయన ఇచ్చినదే. ఆ రోజుల్లోనే వాడికి దొరికిన మరో పుస్తకం ‘కృష్ణ పక్షం’. అందులో వాడిని చాల కాలం వెన్నాడిని రెండు నురుగులు మీకు చెప్పనా. అంతా సంస్కృత సమాసాలుగా ఉన్నా, వాటి అర్థాలు తెలుసుకున్నప్పట్నించి ఆ పద్యమంటే చాల ఇష్టం వాడికి.

‘ప్రళయ కాల మహోగ్ర భయద జీమూతోరు

గళ ఘోర గంభీర ఫెళ ఫెళార్భటులలో

మెరపేలా?

వికృత క్రూర క్షుధా క్షుభిత మృత్యు కఠోర

వికట పాండుర శుష్క వదన దంష్ట్రాగ్నిలో

నవ్వేలా?

పోనీ, మీరు చెప్పండి, అలాంటి చోట మెరుపు ఎలా? అలాంటప్పుడు నవ్వు ఎలా?

 

9-9-1997

(1997లో ‘ప్రజాసాహితి’ లో ప్రచురితమైనప్పుడు ఎడిట్ చేసిన కొన్ని పంక్తులను ఇందులో తిరిగి చేర్చాను.)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s