నా శ్వేత రాత్రులు

స్మృతి 12

ఒంటరి గది. గంటల తరబడి. రోజుల తరబడి.
నా క్లాస్ మేట్ జయరామి రెడ్డి వుండే వాడు, రూమ్మేట్ గా కూడా.
అయినా ఒంటరి తనమే.
సైలెన్స్, స్టడీ అవర్స్ పేరిట చెవులు దిబ్బెళ్లు పడే నిశ్శబ్దం.
అది నాకు జీవితంలో మొదటి సారి. మరీ అంత చిన్న వయసులో ఆ నొప్పి పరిచయం కావలసింది కాదు. అంతకు ముందు… మరీ అంతగా… నాలో నేను…. ఒక్కడినే… రాత్రంతా… అన్ని రాత్రులు, ఎప్పుడూ లేను.
భయం కాదు. దిగులు. నిరంతరం వెంటాడే దిగులు. భయంకరమైన దిగులు. అప్పుడు లోనికి ఇంకిన ఆ దిగులును ఇప్పటికీ పిండేసుకుంటూనే వున్నాను. తరగదు. లోపలి చిత్తడి వదలదు.
డొస్టాయెవ్ స్కీ ‘శ్వేత రాత్రులు’ (‘వైట్ నైట్స్’) చదివారుగా. అందులోని పెయిన్ గుర్తుందిగా. ఆ చీకటి. ఆ లో-చిత్తడి. అంత కన్న గొప్పగా చెప్పిన వారెవరుంటారు, ఎడతెగని ఒంటరి రాత్రుల వేదనని.
మీ మాటని కూడా కాదనను. ఆ దిగులు నాలో అప్పుడే పుట్టినది కాదేమో. నాకు పుటకతో వచ్చినదేమో. (అలా ఏవైనా పుటకతో వస్తాయా?) అప్పటికి పరిస్టితులు పరిపక్వమై తనను తాను అలా వ్యక్తంచేసుకుందేమో. ఇంకే అడ్డంకి లేక బయటికి వచ్చి తన వికృతితో తనని తాను నాకు పరిచయం చేసుకుందేమో.
పీయూసీ చదువుతున్నప్పుడు కాలేజీలో ‘మోరల్ ఇన్స్ట్రక్షన్’ అనే ఒక్క పీరియడ్ మాత్రమే నాకు బాగుండేది. అందులో మార్కులు వచ్చినా ప్రయోజనం లేదు. ఆ పీరియడ్ లో మా టీచరు ఫాదర్ ఆల్ఫొన్సే మిరాండా. ఆయన మా హాస్టల్ వార్డెన్ కూడా. చాల మంచి ఆరేటర్.
అది తప్ప ఇక ఏ పీరియడూ బాగుండేది కాదు. ఏ ఒక్క పీరియడూ క్లాసులో కూర్చోవాలని ఆసక్తి కలిగేది కాదు. కూర్చోవడం పెద్ద శిక్షలా వుండేది. మా సెక్షన్ కు వచ్చిన టీచర్లు కూడా, బట్టీ పట్టుకొచ్చి అప్పగిస్తున్నారని ఆట్టే తెల్సిపోయేది. అంతటి కాలేజీలో అలాంటి టీచర్లా అంటే, నేనేం చేయను? అది నిజం!
నాకు ఒక అనుమానం కూడా వుంది. కాలేజీలో పిల్లలు చాల మంది చేరడం వల్ల మా నేపధ్యాల్ని బట్టి, మా మార్కుల్ని బట్టి ‘వెనుక బడిన’ విద్యార్థులతో ఒక సెక్షన్ వేసి, దానికి బాగా చెప్పడం రాని టీచర్లను వేసే వారేమో. ఏమో. కాలేజీలో కొందరు మంచి టీచర్లుండే వారు. వాళ్ళు ఎప్పుడైనా ఆపద్ధర్మంగా వచ్చి పాఠం చెప్పే వారు. ఇంగ్లీషులో సురేష్, తెలుగులో నాగళ్ళ గురుప్రసాదరావు, బాటనీలో సింగ్, ఎసెన్ రామస్వామి, ఫిజిక్స్ లో బసవపున్నయ్య, ఇంకో సారు… ఇలాగ. అయితే వీరెవరూ నాకు ఆ నాలుగేళ్లలోనూ క్లాసు టీచర్లు కారు. frown emoticon అంటారు గాని. ఒక భాషలో వినడం, ఆలోచించడం చిన్ననాడే అలవాటు కావాలి. అవుతాయి. అలా అలవాటు కాని భాషలో… తరువాతెప్పుడో మొదలెట్టిన కొత్త మీడియంలో… విని, చదివి అర్థం చేసుకోవలసి రావడం…. దానికదే ఒక నరకం. అప్పుడు సరే. మరీ కొత్త. ఆ పని నాకు ఇప్పటికీ అలవడలేదు. ఇప్పటికీ ఇంగ్లీషు పాటలు విని అర్థం చేసుకో(లే)ను. ఎంజాయ్ చెయ్య(లే)ను. పాటల్లో పదాలు తెలియకపోయినా, సంగీతాన్ని ఆనందించడం నాకు బాగోదు. ఇంగ్లీషులో పుస్తకాల్ని బలవంత మాఘ స్నానంగా చదువుకోవచ్చు గాని, ఇష్టంగా చదవ(లే)ను. కారణం మాతృభాష మొదలైన సెంటిమెంటల్ ఇస్యూస్ కాదు. దానికి నా స్కూలు (బాల్యం, కౌమారం) నన్ను తయారు చేయలేదు. పబ్లిక్ స్కూళ్లనబడే వాటిలో జరిగేది నా ప్రభుత్వ స్కూలులో జరగలేదు.
చిన్న నాటి నుంచీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదువుకుని దానికి ఆలవాటు పడిన వాళ్లకూ…. స్కూలు దినాలన్నీ తెలుగు మీడియంలో చదువుకుని వెళ్లి, కాలేజీ నుంచి మాత్రమే ఇంగ్లీషు మీడియం మొదలెట్టిన వాళ్లకూ…. మధ్య ఈ వస్తుగత (ఆబ్జెక్టివ్) వ్యత్యాసం ఎప్పుడూ వుంటుంది. వ్యత్యాసానికి పిల్లలు కారణం కాదు. వాళ్ల మానసిక/బౌద్డిక శక్తులూ కారణం కాదు. వ్యత్యాసానికి కారణం వాళ్లలో కొందరికి వుండి కొందరికి లేని శిక్షణే (ట్రెయినింగ్). ట్రెయినింగుని ‘ఇంటెలిజెన్స్’ అనుకోవడం, అనడం అన్యాయం.
సరిగ్గా ఇందుకే.. పేదపిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య అందుబాటులో వుండాలని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వుండాలని అంటున్న కంచె ఐలయ్య వంటి దళిత బహుజన మేధావుల వాదం పూర్తిగా సమర్థనీయం.
దాన్ని వ్యతిరేకించే వారి వాదం… సారాంశంలో… చిన్న నాటి నుండి సో కాల్డ్ పబ్లిక్ స్కూళ్లలో, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న తమ ప్రివిలేజెస్ ను కాపాడుకునే ప్రయత్నమే. అలా చదువుకోబోతున్న తమ పిల్లల ప్రివిలేజేస్ ని కాపాడుకునే ప్రయత్నమే.
నా వరకు నాకు ఈ అభిప్రాయం అకాడెమిక్ చర్చనీయాంశం కాదు. కేవలం విద్యైక విషయం కాదు. ఇదొక రోజువారీ జీవితాంశం. గ్రాంసీ మాటల్లో చెప్పాలంటే ఇది ‘లోకజ్ఞాన’ (కామన్ సెన్స్) విషయం. సంస్కృతీ పరి రక్షణను వంటిళ్ల ఆడవాళ్ల కట్టు బొట్లకు, భాషా పరి రక్షణను గవర్నమెంటు స్కూళ్ల పేద పిల్లలకు అప్పగించడమంటే… ఒక సనాతన దుర్మార్గాన్ని అధునాతన రూపంలో కొనసాగించడమేనని…. నా ఆచరణాత్మక, అనుభవ పూర్వక ఫిర్యాదు.
లొయోలా కాలేజీ గోగినేని హాస్టల్ ఒంటరి గది జీవితంలో నాకు తెలుగు నవలలు దొరికేవి కాదు. ఇంగ్లీషులో నవలలు చదవడం అప్పుడే అలవాటయింది. అతడి పేరు గుర్తు లేదు. ఒక క్రైస్తవ మిత్రుడు నాకు కౌ బాయ్ నవలలు పరిచయం చేశాడు. లూయీ లామోర్, జేన్ గ్రే, స్లిఫామర్… ఇంకా ఎవరెవరో. ఈ కౌబాయిలు నిజానికి అమెరికాలోని మూల వాసుల (నేటివ్ అమెరికన్ తెగల) మీద దారుణ హింసను ప్రయోగించి, వారిని నాశనం చేసి, నాశనం కాని వాళ్లను లొంగ దీసిన విలనస్ యోధులు. లేదా ఆ విలన్ల చేతి కింది గూండాలు. వాళ్ల మధ్య కూడా కొట్లాటలుంటాయి. నవలల్లో అవే ఎక్కువగా చెబుతారు. కాని వాళ్ల పుట్టుక, పెరుగుదలల నేపధ్యం మాత్రం స్థానిక మూల వాసుల మీద పెత్తనమే. మన గూండాలు గళ్ల లుంగీలు కట్టుకుని కర్రలు పట్టుకుంటారు. కౌబాయిలు ఓ రకం రఫ్ ప్యాంట్లు, బూట్లు తొడుక్కుని తుపాకులు పట్టుకుంటారు. కౌబాయిలను చాల పాజిటివ్ గా, నీతికి నిలబడే వీరులుగా చిత్రించి, పాఠకుల్ని ఒప్పించడంలో ఆ రచయితల నేర్పరితనం ఉంది. అసలు ‘అమెరికన్ వే అఫ్ లైఫ్’ అనబడే దానిలోనే ఈ కన్నింగ్నెస్ వుందేమో.
హెమింగ్ వే, స్టీన్ బెక్ వంటి రచయితలలో అలాంటి జాతి విచక్షణ కనిపించదు. నాకు చాల ఇష్టుడైన జాక్ లండన్ లో ఆ చిన్నెలు కొద్దిగా వుంటాయనిపిస్తుంది. పాపులర్ ఫిక్షన్ లో ఇది చాల ఎక్కువ. ఆల్మోస్ట్ ఒక్ ప్లాన్ ప్రకారం జరిగిందా అనిపించేంత ఎక్కువ.
కౌబాయ్ నవలల్లో అసలు వున్నదే జాతి విచక్షణ అని చెప్పినా తప్పు కాదేమో.
అయినా లూయో లామోర్ వంటి రచయితలు ఇంగ్లీషు పాఠకుల సంఖ్యను పెంచడంలో… అంటే పుస్తకాలు చదివే వాళ్ల సంఖ్యను పెంచడంలో… అద్భుతాలు చేశారు. (తెలుగులో తొలి రోజులలో కొవ్వలి, జంపన వంటి వారు, ఆ తరువాత కొమ్మూరి సాంబశివరావు, కృష్ణమోహన్, విజయాత్రేయ వంటి వారు, మొన్న మొన్న యండమూరి, మల్లాది, యద్దనపూడి వంటి వారు… ఇప్పటికీ కొనసాగుతున్న మధుబాబు… చేసిన, చేస్తున్న ఈ పనిని గుర్తించకతప్పదు. అదే సమయంలో వాళ్లు పాఠకుల మెదళ్ళను ఎలా ఖరాబు చేస్తారో కూడా (చేస్తున్నట్లయితే) చెప్పాల్సిందే.
కొన్నాళ్ళ పాటు నన్ను కౌబాయ్ నవలలు ఊపేశాయి. జేన్ గ్రే తన నవలల్లో వయోమింగ్ (అమెరికా) రాష్ట్రంలోని అటవీ సౌందర్యంలో ముంచెత్తే వాడు. ప్రస్తుతం అమెరికాలోనే వుంటున్నాను కదా, ఇక్కడ వుండగానే ఆ సౌందర్యం ఒక సారి చూడాలని వుంది, చూడ్దానికి వెళ్ళొద్దని కూడా వుంది. తీరా వెళ్తే, అక్కడంతా ‘డెవెలప్’ అయిపోయి వుంటుందేమో, దృశ్యాలు నా మనస్సులోని అందమైన అనుభూతిని హేళన చేస్తాయేమో…. ఏమో ఏమిటి?…. చేస్తాయి, వెళ్ళను.
లూయీ లామోర్ నవలల్లో క్యారెక్టరైజేషన్ నాకు భలే నచ్చేది. ఆ పాత్రలలోని ధీర లాలిత్యం తెలియాలంటే లూయీ లామోర్ నవలలు చదవాలి. కుదరకపోతే, క్లింట్ ఈస్ట్ వుడ్ నటించిన కౌ బాయ్ సినిమాలు చూడండి. లామోర్ కథల్లోని హీరోని చూసి ఈస్ట్ వుడ్ ‘హీరోయిజా’న్ని మలచారా, ఈస్ట్ వుడ్ ని చూసి లామోర్ తన పాత్రలని మలిచాడా అని సందేహం కలుగుతుంది. మొదటి మాటే కరెక్ట్ అనుకుంటాను. ఒకటి రెండు లామోర్ రచనలు ఈస్ట్ వుడ్ హీరోగా సినిమాలుగా వచ్చాయి. ఈస్ట్ వుడ్ ని చూస్తో అదే పీలయ్యాన్నేను. జేన్ గ్రే నవలల్లో అడివి వుంటుంది. లామోర్ నవలల్లో ఇసుసుక ఎడారి. ఎడారి ఇసుక మీద గాలికి దొర్లే టంబుల్ వీడ్ … నవలలో ఎక్కడో ఒక చోట ఇది లేకుండా, లామోర్ నవల వుండేది కాదని గుర్తు. ఎండకు మెరిసే ఎడారి ఇసుక, ఒంటరి కౌబాయ్, దొర్లుకుంటూ వచ్చి అతడిని పలకరించే టంబుల్ వీడ్ …. తన పదాలతో ఆ నావలికుడు గీసిన బొమ్మ, ఆ అనుభూతి అలా వుండిపోతాయి మనలో.
బహుశా ఆ ఏడాదేనో అ తరువాతనో చదివిన ఒక మరుపు రాని పుస్తకం… డేల్ కార్నీ రాసిన ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’. నాకు స్నేహితులు లేరని, నేను స్నేహితుల్ని చేసుకోలేనని. దొరికిన వాళ్లను వుంచుకోలేనని… తీవ్రమైన దిగులు నాకు. ఈ సమస్య వెనుక వున్న మానవ మనస్తత్వాన్ని విశ్లేషించి చూపి, రోజు వారీ జీవితానికి పనికొచ్చే సలహాలు ఇస్తుందీ పుస్తకం. మనుషుల్లోని “ఐ” (‘నేను’) కి వున్న కీలక ప్రాధాన్యం, సమస్యల్ని వూరికే ముడేసుకుంటూ పోకుండా ‘డే టైట్ కంపార్ట్మెంట్స్ లో జీవించాల’ని కార్నీ ఇచ్చిన సలహా…. ఇవి నాకు ప్రాక్టికల్ గా వుపయోగపడ్డాయి. ఈ రంగంలో కార్నీ, ఆయన ఇన్స్టిట్యూట్ రెండూ పయోనీరింగ్ ఎఫర్ట్స్ అనుకుంటాను.
‘డే టైట్ కంపార్ట్మెంట్స్’ ఆలోచననే చూడండి. ఏ రోజుకు ఆ రోజును జీవించు అంటాడు కార్నీ. తీసుకోవలసిన పాఠం తీసుకుని నిన్నని వదిలేయ్. రేపటి సంగతి…. ఇప్పటికి… వదిలెయ్, రేపు చూద్దాం. ఇప్పుడు ఈ రోజు చేయాల్సిన పని మీద ఫోకస్ చెయ్యి. ఈ పనే నిన్నటి లోని మంచిని పెంచుతుంది. రేపటికి అవసరమైన తయ్యారీలనీ చేస్తుంది… అంటాడాయన.
అంతకంటే మనం చేయగలిగిందీ ఏమీ లేదు కదా?!
అది కాదు గాని, ఈ మాటలు చదువుతుంటే మీకింకేం గుర్తు రాలేదా? ‘నిన్న మరలి రాదు, భవితవ్యము సంశయాంధకారావృతంబు, నేడె తధ్యము, సాఖి, చషకమిమ్మ’ని దువ్వూరి అనువాదంలో ఉమర్ ఖయ్యాం అనడం గుర్తొచ్చింది నాకు. ఆ మాటను కేవలం అందం కోసం, తక్షణానందం కోసం కాకుండా బతకడానికి పనికొచ్చే సత్యంగా డేల్ కార్నీ మనకు చెప్పారనిపించింది.
డేల్ కార్నీ ఇలాగే, దైనందిన సమస్యల మీద మరెన్నో పుస్తకాలు రాశారు.
తెలుగులో ఇలాంటి ‘సలహా’లకు వున్న ప్రాధాన్యాని గుర్తించి దాన్నే ఒక న్యూస్ పేపర్ కాలమ్ గా నిర్వహించింది మొదట దేవీ ప్రియ (ఉదయంలో) నే అనుకుంటా. దాని మీద డబ్బులు చేసుకున్న పుస్తకాలు ఆ తరువాత చాలానే వచ్చాయి. డేల్ కార్నీ పుస్తకం, నా దగ్గర లేదనుకున్న ప్రతి సారీ, ఒక కాపీ కొనడం జరుగుతోంది, ప్రత్యేకించి అనుకోకుండానే.
పీయూసీ, మరి మూడేళ్ల బిఎస్సీ… ఆ నాలుగేళ్లు… నా బతుకు పుస్తకంలో ఒకే ఛాప్టర్. ఒకే వేదన. ఒకే ఆరాటం. ‘జైల్ బ్రేక్’ కోసం ఒకే తపన. ఆ ఏడాది మొదలై, ఒకటి రెండేళ్ళు మరీ వెర్రి తలలు వేసి, ఇప్పటికీ వుండిపోయిన కాంక్ష సినిమా.
పీయూసీలో వారం వారం, ఆదివారం అదొక గొప్ప రిలీఫ్.
ఔను, అంతకు ముందు నాకు సినిమా పరిచయం లేదు. జయ వాళ్ల వూరు మండ్లెం వెళ్లినప్పుడు ఒకసారి, అత్తమ్మ వాళ్లతో పాటు ఎడ్ల బండి మీద వెళ్లి పాత సత్యహరిశ్చంద్ర సినిమా చూశాను, పక్కన నందికొట్కూరులోని డేరా టాకీసులో. అంతే అదొక్కటే అప్పటికి నేను చూసిన సినిమా. అది బ్లాక్ అండ్ వైట్. విజయ వాడలో చూసిన మొదటి సినిమా, రంగుల సినిమా, ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’. ఆ మూడు గంటలు ఏదో స్వర్గంలో వున్న అనుభూతి. నా పరిసరాలు సర్వం మరిచిపోయి, ఆ కథలో… కథలో కూడా కాదు…. ఆ దృశ్యాలలో లీనమైపోయాను.
అ తరువాత అది మహా వ్యసనమయిపోయింది. ఆ అనుభవం కోసం వారమంతా ఎదురు చూస్తో. చివరికి, ఏడాది చివర ప్రిపరేటరీ హాలిడేస్ అని ఇచ్చి, మమ్మల్ని రోజూ మధ్యాహ్నం బయటికి వెళ్లనిచ్చేసరికి ఆ సెలవుల్లో దాదాపు రోజూ సినిమా చూసే వాడిని. అప్పటికే చదువుకు విముఖమయ్యాను. ‘ముడ్డి బండకేసి’ కూర్చున్నాను. పరీక్షల్లో ఏం గుర్తొస్తే అది రాద్దామనుకున్నాను.
చదువుకోకపోతే వూరికే వుండొచ్చు కదా. ఉండలేను. దిగులు. చేయాల్సింది చేయకుండా వున్నానని. దిగులు నుంచి పారిపోవడానికి సినిమా. చుట్టు వున్నదేమిటో అది నాకు నచ్చేది కాదు. దాన్నించి ‘గ్రేట్ ఎస్కేప్’ గా సినిమా. సినిమా అనేది నేను సీరియస్ గా అధ్యయనం చేసిన కళ కాదు. చాల మంది లాగ నాకు సినిమా పాటల్ని తిరిగి పాడడం రాదు. చూసిన సినిమా కథను తిరిగి చెప్పలేను. ఆ మాటకొస్తే మొన్న చూసిన సినిమా పేరు ఇవాళ కరెక్టుగా చెబుతానని నమ్మకం లేదు. నేను నా ‘దీన హీన’ స్టితిని మరిచిపోవడానికి ఒక తాత్కాలిక సమాధి సినిమా. తాత్కాలిక మరణం. నాకే కాదు నా బోటి చాల మందికి అంతే అనుకుంటాను. అందుకే, దీన్ని నగరం యొక్క ఒక అవాంఛనీయమైన ఫీచర్ గానే చూస్తూ…

‘కనడానికి కలలేమీ మిగలనప్పుడు
మూడు రూపాయలు ఖర్చు పెట్టి
మూడు గంటలు ఛావు కొనుక్కుంటా’

నని రాసుకున్నాను ‘లావా’ సంపుటిలో ‘నగరం’ అనే కవితలో.
సినిమా టెక్కెట్టు మూడు రూపాయలున్న రోజుల్లో రాసి వుంటాను ఆ పద్యం. అంటే నాకు సినిమా పరిచయమైన చాల రోజులకు రాసి వుంటాను.

గోగినేని హాస్టల్లో రాత్రి అందరూ చదువుకుంటూ వుంటే, నేనూ చదువుకోడానికి ప్రయత్నించి, బుద్ధి పుట్టక గింజుకునే వాడిని. నిద్ర రాకపోయినా మంచం మీద బొక్క బోర్లా పడుకుని, పనిగట్టుకుని సెక్సు కలలు కనడం నేర్చుకున్నది అప్పుడే. రేపు మాపు పరీక్షలనగా రెండు మూడు రోజుల ముందు, ఎందుకో, నాగి రెడ్డి, సిద్దారెడ్డి బందరు నుంచి మా వద్దకు వచ్చారు. నాగిరెడ్డి నా సంగతి గమనించాడు. కెమిస్ట్రీకి తులసీ దాస్ గైడు చదివి చూడమని తాను ఇచ్చిన సలహా భలే పని చేసింది. టెక్స్టు బుక్కులే చదవాలన్న అప్పటి వరకటి నా నియమాన్ని సడలించి ఐదార్రోజుల పాటు గైడు పుస్తకాలు చదివి మిగిలిన వాళ్లతో పాటు ఫస్ట్ క్లాసులో పాసయ్యాను.
గొప్ప చెప్పుకోవాలనే మానవ సహజ వాంఛ వల్లనేమో ఇక్కడొక మాట చెప్పాలని వుంది.
ఆ ఏడాది మెడిసిన్ సీటు రావడానికి నాకు మూడు శాతం మార్కులు తక్కువ వచ్చాయి. (అప్పుడు ఎంట్రెన్సు టెస్టులూ, ర్యాంకుల గోల లేదు. మార్కులూ, శాతాలే ప్రమాణం). ‘గ్రూపు’లో మూడు శాతమంటే మొత్తం పన్నెండు మార్కులు. బాటనీ పరీక్షలో ఒక ప్రశ్న చాల ట్రిక్కీగా వచ్చింది. దాని అసలు జవాబు మియాసిస్ (సంతానోత్పత్తిలో జరిగే జీవ కణ విభజన). ప్రశ్న చదివితే మైటాసిస్ (శరీరం పెరుగుదలలో జీవ కణ విభజన) అని అర్థం వస్తోంది. మా సారు గది గదికీ వచ్చి అది మైటాసిస్ అనీ మియాసిస్ కాదనీ చెప్పారు. ప్రశ్నను నేను మరి మరి చూశాను. మియాసిస్ అని నాకనిపిస్తోంది. నాకు ఏమనిపిస్తోందో అదే రా(చే)యాలి కదా. అదే చేశాను. సారే రైటు. ఆ జవాబుకు రావలసిన పదిహేను మార్కులో ఎన్నో పోయాయి. అవి వచ్చి వుంటే నాకు మెడిసిన్ సీటు వచ్చి వుండేది. రాకపోవడం వల్ల జరిగింది మంచా చెడా? ఏమో?! ఇంతకు ముందే అనుకున్నాం చరిత్రకు మాదిరిగానే మనిషి జీవితానికీ ఇఫ్ లు బట్ లు వుండవు.
ఏం జరిగిందో అదే జరిగింది. ఏం వున్నదో అదే వున్నది. ఇది బాగున్నది.
ఇప్పుడు సరే, నో రిగ్రెట్స్. ఆల్బర్ట్ కామూ ‘ది స్ట్రేంజర్’ నవలలో కథానాయకుడు మ్యూర్ సాల్ట్ మాదిరే ఇప్పడు నేనూ… ‘నో కన్పేషన్స్’.
అప్పుడు… ఆ చీకటి… ఆసరా లేని చీకటిగానే వుండింది… ఆసరా కోసం అలమటింతగా కూడా వుండింది.
ఆ అనుభవాన్ని కవిత్వం చేస్తో అప్పుడు బతకాలనే కాంక్షను పెంచిన సామూహిక కార్యాచరణను సైతం వ్యక్తం చేసిన నా ‘రస్తా’ రోజుల నాటి పద్యమొకటి… ఇక్కడ.
దీన్ని రాసింది పీయూసీ కాలంలోనే గాని, తరువాత అచ్చేస్తున్నప్పుడు తిరుగ రాశాను.

//గొంతు//

అయ్యో ఏమిటిది
హృద్రక్తం పోటెత్తిన సముద్రం
సుడి చిక్కిన మనస్సు
ఒకదానికొకటి రాసుకుని
నరాల విద్యుత్తీగలు
ఝటక్ ఫటక్
టక్ టక్ టక్ టక్
ఎవరది తలుపులు తట్టేది?

చూళ్లేను నిన్ను
పో పో పోవే …. ఏ …. ఏ ….. ఏ …..
చీకటి చీకటి
నల్లగా, శవం కన్న చల్లగా
ఒళ్లంతా ఆరిపోయిన నెత్తురు
కత్తుల్ని స్వప్నంలో కంటున్నా కాబోలు
భయం భయం భయం భయం
ఎప్పుడో ఎక్కడో ఎందుకో
అణిచేసుకున్న ఆవేశం

ఈ నల్లని చల్లని రాత్రి
తోడెవ్వరు లేని ధాత్రి
హృద్రక్తం పోటెత్తిన సముద్రం
హర హర హర హర హరోం హరా
కర కర కర కర కర కర
ఎముకల్ని తింటున్న ఎముకలు
నరాల్ని నముల్తున్న నరాలు

అగ్గిపెట్టె అయిపోయింది
కొవ్వొత్తి ఆరిపోయింది
పోవే నువ్వూ పో…. పో… ఓ…. ఓ….
భూతం భూతం నువ్వు
నడక మిగిలిన శవానివి
అరె నువ్వు నవ్వగలవ్
ఏం నవ్వు?
శవాన్ని తినేసిన ప్రేతం నవ్వు

నువ్వు పోవు, నేను పోలేను
అగ్గిపుల్లలు గీసి గీసి
కనులు చించుకు చూసి చూసి
పరిగెత్తి పరిగెత్తి
నొప్పి నొప్పి కళ్లూ కాళ్లూ….
గొంతు… ఔను మిగిలింది గొంతు
వేయిన్నొక్క విద్యుత్తుల వంతు
రండో రండో రండి రండి
రండో రండో….. ఓ….. ఓ….. ఓ….

అరె అదేమిటి?
ఎవరు మీరు?
చీకటి రాక్షసి ఏదీ?
మీ చేతులు అడ్డంగా
జగజ్జేగీయమానంగా
కొవ్వొత్తులు
రండి రండి పదండి మరి
ఇట్లా ఎన్నెన్ని గదులో
ఏడుస్తో ఎన్నెన్ని ఎదలో
పదండి వెలుగిద్దాం
పదండి నవ్విద్దాం

ఒకటి ఒకటి ఒకటి ఒకటి
కలిశామా అనంత కోటి
భూమి భూమంతా
కొవ్వొత్తులు నాటి
వెలుగు పంటలు పండిద్దాం

(చెరసాలకు తీసిపోని ఆంధ్ర లొయోలా కాలేజ్ హాస్టల్ గదిలో ఒంటరినై —– 1970)
(నా రెండో కవితా సంపుటి ‘రస్తా’ నుంచి)

(వచ్చేవారం.. లొయోలాలో విశ్వనాథ మరి కొన్ని సంగతులు..)

04–5-2016

Hecchar Ke's photo.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s