చర్నాకోల స్వామ్యం….

స్మృతి 9

చిట్టి పొట్టి దొంగతనాల్ని మహా నేరంగా పరిగణించడమంటే నాకు ‍అసయ్యం.
అవి నేరమైతే, నా ‘దొంగబుద్ధి’కి గాను నన్ను యావజ్జీవ ఖైదులో వుంచాలి.
రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక డవిలాగు వింటుంటాం. మొన్న రెండెకరాలోడు ఇవాళ కోటీశ్వరుడెట్టా అయినాడు అని. ఒక కోటీశ్వరుడు ఇంకా చాలా కోట్లకు ఈశ్వరుడెట్టా అయినాడో అట్టాగే రెండెకరాలోడు కోటీశ్వరుడు అయ్యుంటాడు. ఇక్కడ అక్కసు దోపిడి మీద కాదు, చిన్నోళ్లు చేసే దొంగతనాల మీదే. వాడు ఎంత చిన్న వాడైతే అంత అక్కసు. ఎంత ఉన్నోడైతే అంతగా వాడి బూట్లు నాకడానికి తయారు.
నీతి శాస్త్ర కోవిదులకు ఈ చిన్న అవుడియా ఎందుకు తట్టదని నా ఫిర్యాదు.
బాగా పెద్ద దొంగతనాలు పూర్తిగా లీగల్. బడా దొంగలు తయారు చేసిన లీగాలిటీయే మన బతుకులు.
చిటి పొటి దొంగల పట్ల నాకు చాల సానుభూతి వుంది.
రాబిన్ హుడ్ కథలు విన్నప్పట్నించీ దొంగతనం మీద ఒక రొమాంటిక్ అభిమానం. రాబిన్ హుడ్ కథలు వినక ముందు నుంచి కూడా అలాంటి దొంగల మీద సానుభూతి వుంది. దాన్ని సానుభూతి అనడం కన్న సహానుభూతి అనడం సరైంది. వాళ్లు నేనే కాబట్టి.
నేను సాధారణంగా దొంగతనం చేయను. అది నీతి కాదని కాదు. భయం. పట్టుబడను అని ఫూల్ ప్రూఫ్ ప్లాన్ మనసులో వుంటే ఎంచక్కా దొంగతనం చేసేస్తాను. పట్టుబడడానికి ఏమాత్రం వీలుందనుకున్నా చేయను. సో, నన్ను దొంగతనం నుంచి ఆపేది భయమే.
ప్రేమ కాదు, కేవలం భయం.
ప్రేమ మీద కాకుండా భయం మీద ఆధారపడిన ఏ నీతి అయినా, దాని మూలం చెడ్డదే అని నా స్వయం పాకం ఫిలాసఫీ.
దొంగతనం అంటే భయం నాకు చాల చిన్నప్పుప్పటి నుంచీ. కొంచెం కాదు, వణికించే భయం. అదెలా ఏర్పడిందో చెప్పడమే ఈ స్మృతి. దొంగతనం మరియు భయం మరియు నీతి అనే అంశాన్ని ఈ వారం చర్చించెదము గాక.
నా మొదటి దొంగతనం గురించి మీకు ఎప్పుడో చెప్పేశాను. వంటింట్లో వుట్టి మీద పాల కుండలోంచి మీగడ దొంగిలించి చిన్నత్త చేతిలో పొరక దెబ్బలు తిన్నానే, ఆ కథ గుర్తుంది కదా. అవి సున్నితమైన పొరక దెబ్బలు కదా. దెయ్యం వదల లేదు.
మా కొట్టిడింటిలో ఒక పెద్ద కాగు వుండేది. అమ్మ కాగులో బెల్లం దాచేది. అమ్మ ఏ పని మీదైనా కొట్టిడిల్లు తెరిచి, తిరిగి తాళం వేయడం మరిచిపోయి ఇంట్లోకి పోయిందా, బెల్లం కాగు గోవిందా. పాల కుండ దగ్గర పిల్లి అయినా ఏమారుతుందేమో గాని. మనం పిల్లి కన్న మెత్తగా కొట్టిడింటిలో దూరి, బెల్లం వుంటలు తీసుకుని వుడాయించక మానం.
గడివేములలో ఏడో తరగతి చదువుతున్నప్పుడు సుగాలి రాముడి మాటలు విని, మేము పడుకునే ఇంట్లో దొంగతనం జరిగిందని, నేరం మా మీదికి రావొచ్చనే భయంతో మిట్ట మధ్యాహ్నం మా వూరికి నడిచి, మా నాన్న ములుగర్ర దెబ్బలు తిని, తిరిగి అంత దూరం నడిచి గడివేముల చేరిన కథ కూడ మీకు చెప్పాను కదూ?!
అవన్నీ అప్పటికప్పుడు అయిపోయే కథలు. సింగిల్ ఇన్సిడెంట్ స్టోరీస్ అన్న మాట. కొన్ని కథలుంటాయి. ఒక ఘటనతో అయిపోవు. కొన్నాళ్లు సాగుతాయి. అన్నాళ్లూ వాటి అనుభూతి మనతో వుంటుంది. ఇక్కడ ఆ అనుభూతి పేరు భయం. రూపం దొంగతనం.నన్ను ఎవరో దొంగిలిస్తారని కాదు, నేను ఎవరినో దొంగిలిస్తానని భయం.
కొట్టిడింటి కాగు సంగతి చెప్పినప్పుడే మీకు తెలిసిపోయి వుంటుంది. బెల్లం అంటే మనకు ఎంతిష్టమో. బెల్లం వుపయోగించే చోట, దానికి బదులు చక్కెర వుపయోగిస్తే చాల ఖోపం. ఒకప్పడు ఇళ్లల్లో పండగలప్పుడు, పెళ్లిళ్లలో పాయసం తప్పకుండా వుండేది. శనగ బ్యాళ్లు, బెల్లంతో చేసిన పాయసం. అది నాకెంత ప్రాణమంటే, ఏ పెళ్లికైనా వెళ్తూ పెద్దాళ్లు నన్ను తీసుకెళ్లరో ఏమో అని తెగ దిగులు పడే వాణ్ని, విషయం తెలిస్తే, పాయసం కోసం కనిపెట్టుకుని వుండే వాడిని. నేను టీన్స్ లో వున్న కాలంలోనే, పెళ్లిళ్లలో బెల్లం పాయసం మానేసి సగ్గు బియ్యం, చక్కెరతో ‘కీర’ అని చేయడం మొదలైంది. ఈ మార్పుతో పెళ్లిళ్ల, పండుగల గ్లామరే పోయింది. జీవితం లోంచి ఒక అద్భత సౌందర్యమేదో వెళ్లి పోయింది.
విశాఖ పట్నంలో ఎమ్మే చదువుతుండగా కొందరు మిత్రులం సరదాగా జగదాంబ సెంటర్ వైపు వెళ్లాం. నాకు గుర్తున్నంత వరకు అందులో అందరం వామపక్షీయులమే. తిరుగుతూ తిరుగుతూ ఒక షాపు దగ్గర నేను ఆగిపోయాను. ఫ్రెండ్సు ముందుకు వెళిపోయారు. మా క్లాసులో ఏకైన ‘ఎ ఐ ఎస్ ఎఫ్’ (సిపిఐ) నాయకుడు నాగేశ్వర రావు. నేను గుంపుతో కలిసి రావడం లేదని గమనించి నాగేశ్వర రావు వెనక్కి చూశాడు. నేను ఆ షాపు దగ్గర ఎందుకు నిలబడిపోయానో అర్థం కాక వెనక్కి వచ్చాడు. తను వచ్చి భుజం మీద చెయ్యేసే దాకా నాకు తెలీదు, నేనలా నిలబడిపోయానని.
ఏమిటి అన్నట్లు చూశాడు నాగేశ్వర రావు. నేను సిగ్గు పడుతూ, షాపులో బుట్టలు బుట్టలుగా పేర్చిన బెల్లం చూపించి “నాకు బెల్లం చాల ఇష్టం. తిని చాల రోజులయ్యింది. కొనుక్కుంటే మన వాళ్లు నవ్వుతారమో” అన్నాను కాస్త సిగ్గు పడుతూ.
“ఎహే, ఎవరు నవ్వేదేంది. మనిష్టం మనది” అని నాగేశ్వరరావు కొంత బెల్లం కొని కాగితం పొట్లాం అలాగే నా చేతికిచ్చాడు. నేను జనం చూడకుండా కొంచెం కొంచెం బెల్లం తింటూ ఆ సాయంత్రం సౌందర్యాన్ని ఆస్వాదించాను.
ఇప్పటికీ నాకు నాగేశ్వర రావు… తను నేర్పించిన ‘భిక్షు వర్షీయసి’ గీతాలాపన, ఆ రోజు కొని పెట్టిన బెల్లం పొట్లంతో పాటు భలే గుర్తుకు వస్తుంటాడు.
అంతిష్టం బెల్లమంటే. మొదటి దొంగతనం మీగడ కోసమైతే, రెండవ దొంగతనం బెల్లం కోసం చేశాను. కాకపోతే రెండోది నిజమైన దొంగతనానికి బాగా దగ్గరగా వుండే దొంగతనం. దాని రిపర్కషన్స్ కూడా అలాగే వుండినయ్.
అప్పుటికి నేను తలముడిపి హైస్కూల్లో చేరాను. మా స్కూలు వదలగానే, మేము సంచులు భుజాలకు తగిలించుకుని వూరికి బయల్దేరే వాళ్లం. వాగు వైపు దిగువగా వున్న స్కూలు (సత్రాల) నుంచి మేము మిట్ట ఎక్కగానే ఒక అంగడి వచ్చేది. నా ఫ్రెండ్సు అక్కడ కాస్త ఆగి ఏమైనా కొనుక్కునే వాళ్లు. నేను ఏమీ కొనే వాడిని కాదు, దగ్గర డబ్బులు లేక.
చాల రోజుల తరువాత ఒక రోజు శెట్టి అడిగాడు “నీకేం వద్దా” అని. జస్ట్ ‘వద్దు’ అని చెప్పాలనిపించలేదు. “ఇప్పుడు దుడ్లు లేవు” అన్నాను (నా దగ్గర డబ్బులు లేకపోవడం ఎప్పుడూ వుండేది కాదు, ఇప్పుడు లేవంతే అన్నట్టు). “మళ్లిత్తువులే” అన్నాడు శెట్టి. ఒక అణా బెల్లం కొనుక్కున్నాను. వావ్, ఎంత బాగుండిందో. నాకు నేను కొనుక్కున్న బెల్లం. అది తిన్నప్పట్నించీ శెట్టికి అణా ఎలా ఇవ్వాలనేది మనసులో పీకుతూనే వుండేది. శెట్టి మరిచి పోవచ్చులే అని కూడా ఆశ పడేది. (అణా: రూపాయిలో పదారో వంతు).
రెండు మూడు రోజులాగి శెట్టి బాకీ అడగడం మొదలెట్టాడు. నేను ‘రేపిచ్చా’ అని అనే వాడిని. ఇక ఆయన అవమానకరంగా అడగడం మొదలెట్టాడు. ఏం చేయాలో తోచలేదు.
ఒకరోజు పగలు. ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఒక్కడిని. అమ్మ నాన్న సాయంత్రానికి గాని రారు. ఉన్నట్టుండి ఒక అవిడియా వచ్చింది. ఒకటి రెండు సార్లు ఇంట్లోకి బయటికి తిరిగాను. ఎవరూ నన్ను చూడడం లేదని నిర్ధారణ చేసుకున్నాను. వంటింట్లో ఎడం పక్కగా వున్న గరిసెల అరుగు ఎక్కాను. ఒక గరిసెలో దిగాను. చీకట్లో జొన్నలు గుండ్రంగా చల్లగా మెత్తగా తగిలాయి. నిక్కరు జేబుల్లో ఎన్ని జొన్నలు పడితే అన్ని జొన్నలు పోసుకుని పైకెక్కాను. ఇక నేరుగా ఒక అంగడికి వెళ్లి అమ్మ కొనుక్కు రమ్మనిందని చెప్పి బెల్లం తీసుకున్నాను. అందులో కొన్ని గింజలకు, స్కూల్లో ఇవ్వాల్సి వుందని చెప్పి, ఒక అణా కాసు కూడా తీసుకున్నాను.
వావ్. ఆ రోజు పండగ. ఆ రోజంతా కావసినంత బెల్లం. మర్నాడు స్కూలుకు వెళ్లి దర్జాగా బాకీ చెల్లించడం. భలే. మరునాటి నుంచి చిన్ని భయం. ఏమో నేను గరిసెలో దిగడం, గింజలు నిక్కరు జేబుల్లో పోసుకుని వెళ్లడం ఎవరైనా చూశారేమో, నాన్నకు చెబుతారేమో అని. నాలుగైదు రోజులకు గాని ఆ భయం పోలేదు. భయంపోయిన తరువాత, ఆ రోజు తిన్న బెల్లం రుచి గుర్తుకు వస్తోంది.
మరో రోజు అమ్మ గంపలో జొన్నలు పోసి ఇచ్చి, పిండి పట్టించుకు రమ్మని పంపింది. జొన్న పిండి పట్టే గిర్నీని మేము జిన్ను అనే వాళ్లం. ఒక జిన్ను మా ఇంటికి దూరంగా ఏటి ఒడ్డున వుండేది. అది మా పెద్దనుమంత్రెడ్డి అబ్బ వాళ్లది. ఎందుకో మేము ఆ జిన్నుకే ఎక్కువగా వెళ్లే వాళ్లం.
నేను గంప భుజం మీద పెట్టుకుని బయల్దేరే వాడిని. అమ్మ జొన్నల్ని అందాజాగా గంపలో పోసి ఇచ్చేది. ఎట్టాగూ జిన్ను వాళ్లు కొలిచి, వాళ్ల కూలి కింద రావలసిన జొన్నలు తీసుకుని, మిగిలినవి పిండి పట్టి ఇస్తారు. భలే మంచి అవకాశం. ఇంటి నుంచి ఏటి ఒడ్డుకు చేరే లోగా కనీసం ఐదు అంగళ్లుండేవి. ఇంటికి బాగా దూరంగా దాదాపు ఏటి ఒడ్డున వుండే ఆంగడికి వెళ్లి ఒక చటాకు జొన్నలు ఇచ్చి బెల్లంతో చేసిన తియ్య కారాలు కొనుక్కుని జేబులో పోసుకుని వెళ్లే వాడిని. (మా దగ్గర ధాన్యం కొలిచే పనిముట్టు పేరు ‘పడి’. పడిలో పదారవ వంతు చటాకు. కారాలు: కారప్పూస. అయితే ఇవి తియ్య కారాలు. కారం వుండవు, తియ్యగా వుంటాయి).
ఇది కొన్నాళ్లు సాగింది. వావ్. అబ్బాయి గారికి రాజ భోగం. అదే సమయంలో భయం. తప్పు అనే ఫీలింగ్ ఎప్పుడూ లేదు. భయం మాత్రం వుండేది.
ఒక రోజు. బహుశా, అంత వరకు పట్టు బడకపోవడం వల్ల ధైర్యం మరీ ఎక్కువైనట్టుంది. నాన్న ఇంట్లో వుండగా తియ్య కారాలు తినాలని కోరిక పుట్టింది. నాన్న అమ్మ ఇద్దరూ బయట వారపాకు కింద వున్నారు. నేను మెల్లగా వంటింట్లోకి వెళ్లి గరిసెలో దిగి, జొన్నలతో జేబులు నింపుకుని బయటికి వచ్చాను. నాన్న ఎలా చూశాడో ఏమో, నా నిక్కరు జేబులు వుబ్బి వుండడం చూశాడు. “ఇట్రా రా” అన్నాడు. పట్టుబడి పోయాను.
ఆ రోజు తిన్న దెబ్బల్ని ఎప్పటికీ మరిచిపోను. అది తల్చుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతుంది. నేను ఇంకెప్పుడూ చేయకుండా వుంటానికి తగినన్ని దెబ్బలు కొట్టాడు నాన్న, చర్నాకోల తెచ్చి మరీ. అమ్మ చూస్తూ వుండిపోయింది, కండ్లల్లో నీరు కుక్కుకుంటూ.
ఆ తరువాత నేను ఇంట్లో ఎప్పుడూ దొంగతనం చెయ్యలేదు. ఇంట్లో చెయ్యలేదంటే బయట చేశానని కాదు. బయట చేయడం మరీ కష్టం కదా. అందుకని చెయ్యలేదు. కాని, సినిమా కథల్లో చిన్నపిల్లలు ఏదో అంగట్లో వున్నట్టుండి కాస్త బ్రెడ్డు లేదా జిలేబీ ఎతుకెళ్తే, దానికి గాను వాళ్ల వెంట పడి, దొరకబుచ్చుకుని హింసించే పెద్ద వాళ్లంటే విపరీతమైన అసయ్యం వేస్తుంది.
ఆ మాటకొస్తే పెద్దవాళ్లయిన తరువాత కూడా పేదరికం కారణంగా దొంగతనం చేసిన వాళ్ల మీద ‘నీతిమంతులు’ చూపించే ప్రతాపమన్నా నాకు అసయ్యమే.
ఒక దృశ్యం నాకు కర్రు కాల్చి మనసు మీద వాత పెట్టినంత స్పష్టంగా గుర్తుంది.
మా వూళ్లో ఒక రచ్చ బండ వుంది. అది మా ఇంటికి దగ్గర్లోనే వుంది. అది కాకుండా పెద్ద బజారులోనే, వూరికి నడిమధ్యన మఠం అని ఒక కూడలి వుంటుంది. బజారు వైపు వున్న భాగమంతా పొడుగాటి అరుగులు. ఆ అరుగుల మధ్యన రెండు చోట్ల బాగా పెద్ద ద్వారాలుంటాయి. తలుపులు లేని ద్వారాలు. వాటి కిందుగా లోపలికి వెళ్తే రెండు మూడు శైవుల ఇండ్లు వుండేవి. అవి వీరశైవుల ఇళ్లు. తమను తాము జంగమోళ్లు అని వ్యవహరించుకునే వాళ్లు.మా చిన్నప్పటి కాలానికి శైవం సంగతి శైవులకే తెలియదు గాని, ఆ పేద్ద అరుగులూ అవీ, అది వీర శైవుల మఠమే..
మఠం అనబడే ఆ పెద్ద అరుగుల మీదే వూరి యవ్వారాలన్నీ జరిగేవి. ఊరి పంచాయతీలు ఏమి జరిగినా అక్కడే. ఎవరైనా హరికథలు, బుర్ర కథలు చెప్పినా అన్నీ అక్కడే.
ఒకరోజు ఉదయం. మా ఇంటికి దూరంగా మఠం వద్ద హడావిడిగా వుంది. నేను కుతూహలంగా వెళ్లాను. మావూరి పెద్దలు…. ప్రెసిడెంటు వెంకటయ్య, దేశం రామిరెడ్డి మామ, మా శివారెడ్డి చిన్నాయ్న, రెడ్డి (మున్సబు) నాగి రెడ్డి మామ, కలుగోట్ల సుందర రావయ్య అందరూ అరుగుల మీద కూర్చుని వున్నారు. ప్రస్తుతం వీరిలో ఎవరూ జీవించి లేరు. అప్పటికీ అందరూ యువకులు లేదా ఇంకా చిన్న వాళ్లు.
అరుగుల ముందు బజారులో అంతా గంభీరంగా వుంది. నల్లగా, బక్కగా వున్న ఒక సుగాలీ యువకుడు ఒక పక్కగాచేతులు కట్టుకుని, తల పొట్టలోకి వంచుకుని కూర్చుని వున్నాడు. అతడి ఒంటి మీద నడుం వద్ద దోపిన ధోవతి తప్ప ఏమీ లేదు. అతడి దగ్గర కొందరు సుగాలీ ఆడవాళ్లు, మగవాళ్లు వున్నారు. ఒక పక్కగా మూడు రాళ్లు పెట్టి నిప్పు రాజేశారు. మంటలో ఇనుప సలాకులు (శలాకలు) ఎర్రగా కాలుతున్నాయి. బజారులోనే కొందరు వూరి యువకులు భుజాల మీద చర్నాకోలలు వేసుకుని అక్కడ ఆధికారమంతా తమదే అన్నట్టు తిరుగుతున్నారు.
పెద్దమనుషులు సుగాలీ యువకుడిని ఏదో అడుగుతున్నారు. అప్పటికి నేను బాగా చిన్న వాడిని. మాటలు గుర్తు లేవు. ఎవరి ఇంట్లోనో, చేనిలోనో దొంగతనం జరిగింది. నేరం సుగాలీ యువకుడిది అని పెద్ద మనషుల ఆరోపణ. యువకుడు కాదంటున్నాడు. కాదనడంలో ఏదో బలహీనత కనిపిస్తోంది. పేదరికమే బలహీనత.
మాటల తతంగం ఎంతో సేపు నడవలేదు. అతడిని బజారులో నడి మధ్యన నిలబడమన్నారు. భుజాల మీద చర్నాకోలలు వున్న యువకులు ఆ యువకుడి చుట్టూ నిలబడ్డారు. నిలబడి అతడిని కొట్టడం మొలెట్టారు.
ఒక్కడు. వాళ్లు కనీసం పది మంది. పది చర్నాకోలలు.
యువకుడు ఏడుస్తో అరుస్తో శరీరానికి చేతులు అడ్డుపెట్టుకోడానికి వృథాగా ప్రయత్నిస్తో….
చర్నాకోల యువకుల వలయానికి అవతల్నించి…. సుగాలీ యువకుని అమ్మలో అక్క చెల్లెళ్లో భార్యయో… చాల మంది ఆడవాళ్లు అతడిని దయ చూడమని కాసర బీసరగా అరుస్తో…..
ఆ హింస ఎంత సేపు నడిచిందో నాకు గుర్తు లేదు. రెండు మూడు నిమిషాలయినా జరిగి వుంటుంది. ఆ తరువాత నిప్పుల్లో ఎర్రగా కాలిన సలాకులు చేతిలో పట్టించి ఆ యువకుడితో ప్రమాణం చేయించారో లేదో కూడా గుర్తు లేదు. కాకపోతే, నాలుగైదు రోజుల తరువాత దొంగతనం ఆ యువకుడు ‘చేయలేదులే’ అని పెద్ద మనుషులు నవ్వుతాలుగా అనుకోడం మాత్రం లీలగా గుర్తుంది.
ఇంకో సారి, ఆ మఠం దగ్గరే అలా దొంగతనం ఆరోపణతోనే ఒక నడి వయస్కుడిని బాగా కొట్టి, చీకటి పడ్డాక అక్కడే బండి చక్రానికి కట్టేసి వదిలేశారు. పొద్దున లేచి చూస్తే అతడు లేడు. అతడి స్నేహితులెవరో రాత్రి అతడిని విడిపించాడని అన్నారు. పెద్ద మనుషులే అతడు నేరం చేయలేదని తెలిసి, రాత్రి కట్లు విప్పేశారని ఇంకొంచెం గట్టిగా వినిపించింది.
వాళ్లిద్దరు దొంగతనం చేయలేదు.
చేసి వుంటే మాత్రం అది ఎంత పెద్ద దొంగతనం అయ్యుంటుంది?
మా వూరు మా కుటుంబం వంటిదే, కాకపోతే బాగా పెద్దది. అలాంటప్పుడు పేద యువకులు చేసిన (?) దొంగతనాలు మా ఇంట్లో నేను చేసిన దొంగతనాల కన్న ఏమీ ఎక్కువ కాదు? ఎక్కువ కాదని మీరు కూడా అనుకుంటున్నట్టయితే దయచేసి ఈ ప్రశ్నకు కూడా అంతే నిజయితీగా జవాబివ్వండి. ఇంటిలోనో, బడిలోనో, ఇంకో చోటనో ఇట్టాంటి దొంగతనాలు చేయని వాళ్లు మీలో ఎంత మంది?
అదీ సారు!, అందుకే నాకు నాభి నుంచి ఖోపం …
పిత్రుస్వామ్యం అంటే, చర్నాకోల అంటే, చిటి పొటి దొంగతనాలు మహా నేరమని అనడమంటే, నిప్పుల్లో కాల్చిన సలాకులంటే, పాతకాలపు భూస్వామ్య పంచాయతీలంటే, స్వయం ముకుళిత గ్రామాల గాంధీ వాదమంటే, దాన్ని ఎక్కువ చేసి కీర్తించే కవిత్వాలంటే, నీతి సూత్ర ముక్తావళులంటే…
కమ్యూనిజం కల సంగతి సరే, ముందుగా ఈ చర్నాకోలస్వామ్యాన్ని… పాతిపెట్టడానికి తగిన గొయ్యి వెదకాలని నా కోరిక. నేనంటే ఇప్పటి నేను కాదు. భోగ భోగ్యాల కోసం కాదు, ఖరీదైన క్యాండీ కోసం కాదు, ఒక అణా బెల్లం కోసం, ఒక చటాకు గింజల తియ్య కారాల కోసం చావు దెబ్బలు తిన్న పిల్లాడిని అడుగుతున్నాను సార్, చర్నాకోలను పాతి పెడదామా?

//చర్నాకోల//

ఒక్కొక్క పక్షీ వచ్చి
చెట్టు మీద వాలుతోంది
ఇక్కడొక సాయంకాలాన్ని
పరుద్దామని ప్రయత్నం
ఆత్మ దొరకని అలమటింతలో నేను
ఇప్పుడే విశ్వాసాన్నీ కిరణించలేను
ఒక రోజును జీవించానని
తృప్తిగా నిదురించ లేను

ఎక్కడివో ఎప్పటివో
ఆశగా ఇంటికొస్తున్న ఎద్దుల
మెడగంటల చల్లని చప్పుడు
నాన్నా నాన్నా వద్దు వద్దు
అప్పుల బాధల పగ బట్టిన
పలు నాల్కల చర్నాకోల
నీ భజం మీద ఒద్దొద్దు వద్దు
నన్నొక ఎద్దును చెయ్యొద్దు
నువ్వొక చర్నాకోలగా గుర్తుండిపోవద్దు

బెల్లం తియ్యగుంటుందని చాల
బాగుంటుందని నా ఒక్కడికే తెలుసు
అమ్మ కనుగప్పి అంగడికెళ్లడానికి
నా నిక్కరు జేబులో దాగిన
పాపడి* జొన్నలకు కొంచెం తెలుసు
జేబు చూసిన నాన్న చేతిలోంచి
నన్ను కాటేసిన చర్నాకోలకు
ఆ తీపి మరింత బాగా తెలుసు

ఒద్దొద్దని కదా
ఉన్న ఉనికిని ఉన్మత్తంగా పేల్చుకుని
గగనానికెగసి గిరికీలుకొట్టింది
ఏ అవకాశం మీద వాలినా
రెక్క ముడవనివ్వని గుండు సూది మొన
నాన్నా నాన్నా నీ చర్నాకోల విశ్వ వ్యాప్త
మయి నన్నింకా భయపెడుతూనే ఉంది
ఒక బాలిస్టిక్ క్షిపణినై భూగోళం
పెన్ బండకు తల బాదుకోవాలనిపిస్తోంది

రాత్రవుతుంది
చెట్టు నిద్రపోతుంది
చెట్టు కొమ్మలు నిద్ర పోతాయి
కొమ్మలకు వేలాడే పక్షులూ నిద్రపోతాయి
విషం కురిసే తెలి మొయిలు పాల పుంత నుంచి
పారిపోవడానికి ప్రయత్నిస్తూ నేనుంటాను
తెల్లారే వరకూ

(*పాపడి: మా ఊళ్లో జొన్నలను కొలిచే పనిముట్టు పేరు ‘పడి’. అందులో సగం అరపడి. పావు భాగం పాపడి)

(29-1-1995)

(నా ‘ఒక్కొక్క రాత్రి’ సంపుటి, పేజెస్ 26, 27)

(వచ్చే వారం వేరే కథలతో)

06-04-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s