సన్నాఫ్ సంజీవ రెడ్డి

స్మృతి 8
 
శీర్షిక చూసి సీతారాం ‘సన్ అఫ్ మాణిక్యం’ పుస్తకం గుర్తొస్తే సంతోషమే.
సంజీవ రెడ్డి మా నాన్న పేరు. వాళ్ల నాన్న పేరు అనిమి రెడ్డి. నిజానికి నా పేరు కూడా అనిమి రెడ్డి నే. మా జేజి కి వాళ్లాయన పేరు పలకడం ఇష్టం లేక, మన పేరు పలక్కుండా వుండడం ఇష్టం లేక అనిమి రెడ్డి కాస్తా హనుమంత రెడ్డి అయిపోయాడు.
ఆరా తీయడం కష్టం కాని, మా అబ్బ వాళ్ల నాన్న తన తలిదండ్రులకు మొదటి కొడుకు అయ్యుంటే ఆయన పేరు కూడా సంజీవ రెడ్డి, లేదా కొండా రెడ్డి అలా… ఏదో ఒక ఆంజనేయుడి పేరే అయ్యుంటుంది. (అబ్బ అంటే నాన్న నాన్న).
మా నాన్న పేరు సరే, ఆయన తరువాత పుట్టిన మా అత్త పేరు సంజమ్మ. చిరకాలం జీవించి మొన్న మొన్ననే చనిపోయిందామె. ఇక మా దాయాదుల ఇళ్లకు వెళ్తే హనుమంత రెడ్డి పేర్లు మరీ ఎక్కువైపోయి చిన్ననుమంత్రెడ్డి, పెద్దనుమంత్రెడ్డి, నడిపి అనుమంత్రెడ్డి…. అని వుంటాయి. సంజీవ రెడ్డి, కొండా రెడ్డి సీరీస్ కూడా అలాగే … పెద్ద, నడిపి, చిన్న అని వుంటాయి. అనిమి రెడ్డి అంటే ఏంటని ఎవరికైనా అనుమానం రావొచ్చు. అయ్యా, అది హనుమ రెడ్డి కి ‘అశిష్ట’ వ్యావహారికం.
మొదటి సారి మా దాయాది తమ్ముళ్లలో ఒకడికి సమీర కుమార రెడ్డి అని కాస్త నైసు పేరు పెట్టారు. తనను అందరు సవీర కుమార్ అనో సైర్ కొమాడ్డి అనో అనే వారు. సవీర మనేది ఒక విషం అనుకుంటాను. అదెవరికి పట్టింది. కొత్త వాటిని పరిచితాల పరిధిలోకి తీసుకొచ్చి సొంతం చేసుకోడం ఇలాగే వుంటుంది. లేకుంటే, కొత్తవి మనకు కంఫర్టబుల్ గా వుండవు. మొన్న మొన్నటి వరకు నాక్కూడా ఈ హనుమంతుని సెంటిమెంటు వుండింది. సరదాగా వుంచుకున్న సెంటిమెంటు.
మా చిట్టి తల్లి మాకు ఒకే కూతురు. (పెద్ద, చిన్న అన్నీ తనే). సంప్రదాయానికి గుడుబై చెప్పకపొయ్యుంటే తనకు సంజీవిని అనో సమీర కుమారి అనో పేరు పెట్టాల్సి వచ్చేది.
కూతురి విషయంలో సెంటిమెంటు వదిలేశాను గాని, నా మేరకు దాన్ని బాగానే వాడేసుకున్నాను. ఈనాడులో పని చేస్తున్నప్పుడు దొంగ పేరుతో కవిత్వం రాసే వాడిని. అప్పుడు నా పేరు కె సంజీవి. కొన్ని పద్యాలు భలే నచ్చి కెకె రంగనాథాచార్యులు గారు తన శిష్యులకు, మిత్రులకు చెప్పారు…. ఈ కె సంజీవి ఎవడో కాస్త గమనించండి బాగా రాస్తున్నాడు అని. ఈ సంగతి చెప్పి, అప్పటికి అచ్చయిన నా ‘సెకండ్ ఫ్రంట్’ అనే పొయెమ్ ని ప్రశంసించిన మిత్రుడు శీనుకు… ఇక వుండబట్టలేక…. ‘హి అది నేనే’ అని చెప్పుకుని… నా వుబలాటానికి నేనే సిగ్గుపడడం ఎప్పటికీ మరువలేను.
అట్టాంటిదే ఇంకో అనుభవముంది. ఆ రోజుల్లో సాహిత్య చర్చల్లో పొస్ట్ మోడర్నిజం ఇత్యాది అమాంబాపతు టాపిక్స్ రగులుతున్నప్పుడు వూరికే వుండలేక వ్యాసాలు రాసి ఆంద్రప్రభలో పవన కుమార పేరుతో అచ్చేసే వాడిని. ఒక సారి కల్లూరి భాస్కరం కాలమ్ ఒకటి బాగా నచ్చి అవి బాగున్నాయని ఆ పేరుతోనే లేఖ రాస్తే, భాస్కరం తన పుస్తకం అచ్చేస్తున్నప్పుడు పవన కుమార అనే ఆయనకు థాంక్సు చెప్పారు. నేనని తెలిస్తే నా పేరే రాసే వారు.
ఓహ్… అప్పుడే ఈ పేర్ల కథ హనుమంతుని వాలం లా పెరిగిపోయింది కదూ. ఇంతకూ ఇలా పేర్ల వెంట పడ్డానేమిటి ఈ ఎపిసొడ్ లో. గ్రామ నామాల్లాగా వ్యక్తి నామాల మీద పరిశోధన చేసి ఏదో ఒక పిచ్డీ కొట్టేద్దామనుకుంటున్నానని అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదు.
మా కొడిదెలోల్ల ఇళ్లల్లో ఎవరింట్లోనైనా తొలిచూలు బిడ్డ పేరు ఆంజనేయుడిది కావలసిందే. ఆంజనేయుడు మా ‘ఇంటి’ దేవుడు. దాని వెనుక ఒక కథ వుంది. ఈ కథ మా ఇళ్లల్లో ఇప్పటి పిల్లలు ఎంత మందికి తెలుసో తెలియదు. నాకు మా పెద్దవాళ్లు చెప్పిన కథ ఇది.
ఒకప్పుడు మా పెద్దలకు చాల ఆవులుండేవి. చాల అంటే చాలా…. అన్న మాట. ఆవులే వాళ్ల జీవనాధారం. ఆవులను కాపాడుకోవడం వాళ్లకు అత్యంత ముఖ్యం. వాళ్లకే అని ఏమిటి, ఆవులు మనుషులకు జీవనాధారం అనడానికి ఆది కాలం నుంచీ దృష్టాంతాలున్నాయి. ఉత్తరాంధ్రలో ఇప్పటికీ సొమ్ములు అంటే ఆవులే. రావి శాస్త్రి ‘సొమ్ములు పోనాయండి’ నవల చదివారా? ఇలా ‘సొమ్ములు’ నాబడు ఆవులు పోవడం, వాటిని వెదుక్కోడం, వాటి కోసం యుద్ధాలు చెయ్యడం ఎప్పటి నుంచో వుంది. భారతంలో ఉత్తర గోగ్రహణం చాల కీలకమైన ఘట్టం కదా? (మీరు నర్తన శాల సైన్మ చూసే వుంటారు) విరాట రాజు ఆవులను కౌరవులు మళ్లేసుకుపోతే, ఆఁ… ఆవులే కదా… పోతే పోనీ అని వూరుకోలేదు. మహా వీరుడైన ఉత్తర కుమారుడు, సొంతంగా రాజు కొడుకు, సొంతంగా రథమెక్కి బృహన్నల సారథ్యంలో యుద్ధానికి పోవాల్సి వచ్చింది. ఇక జోకులు కుదరవని అర్జునుడు ఆడంగి వేషం చాలించి జమ్మి చెట్టు మీది నుంచి గాండీవం దించాల్సి వచ్చింది. భీష్మ ద్రోణ కర్ణాదులను వంచాల్సి వచ్చింది. అదీ ఆవుల ప్రాముఖ్యం.
‘ఔ మల్ల అందుకే మా చాయ్ వాలాకు అవులంటే అంతిష్టం, ఆయిన గారి రాజ్జెంలో ఆవు మాంసం తిన్నోళ్లను అమాంతం చంపేసినా శిక్షలు పడవు తెల్సా’ అని అంటారేమో. ఏమో సార్, అవాళ జనం ఆవుల నుంచి పాలు మాత్రమే పితుక్కుని తాగారా, ఎంచక్కా గోమాంసం కబాబులు చేసుకుని తిన్నారా లేదా అనేది ఏ కొడవటిగంటి కుటుంబరావు గారో చెప్పాలి. ఆయనే ఎందుకు చెప్పాలంటే, నా బోటి అబ్రాహ్మణుడెవరైనా చెబితే అది ‘ద్వేషం’ కేటగిరీలోకి వస్తుంది కదా?!
వెల్… ఆవుల ప్రాముఖ్యం భారత కాలం నుంచి మా పెద్దల కాలం వరకు చెక్కు చెదరకుండా కొనసాగింది. ఒకానొక దురదృష్టం వల్ల మా వాళ్ల ఆల మందలు పోయాయి. పోయాయి అంటే, కొండల్లో కనిపించకుండా పోయాయి. దొంగలు తోలుకుపోయారో, అవే గడ్డి గాదం మేస్తూ మేస్తూ తప్పిపోయావో ఆ డీటెయిలు నాకు పెద్దాళ్లు చెప్ప లేదు. చిన్న వాడిని కదా, నేనూ అడగలేదు, పోయాయి అంటే పోయాయి అనుకున్నానంతే. అదీ గాక కథ రసపట్టులోవుందాయె. ఆవులు పోతే ఏమయ్యిందీ?
మా వాళ్లు వాళ్ల ఆవులను వెదుక్కుంటూ వెళ్లారు. ఆ రోజుల్లో బస్సులు లేవు. అడవుల్లో ఆవులను వెదకడానికి సవారి బండి కట్టుకుని వెళ్లలేరు కదా. వాళ్లు గోసులు ఎగ్గట్టుకుని అడవుల్లో కొండల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఆవులు కనిపించలేదు. చివరికి అవి ఎక్కడ కనిపించాయని కథలో చెబుతారో ఆ వూరిని నేను బాగా పెద్దాడినయ్యాక చూశాను. అక్కడ మా వూరి కన్న చాల పెద్ద అడివి, పెద్ద కొండలు వున్నాయి ఇప్పటికీ. కర్నూలు నుంచి నంద్యాల వెళ్తూ ఎక్కడో ఒక చోట డీవియేట్ అయ్యి బనగాని పల్లె వైపు వెళ్తారు. ఆ దారిలో వుంటుంది బేతంచెర్ల అనే వూరు. బేతంచెర్ల అంటే గుర్తుకొస్తోందా? బేతంచెర్ల బండలు బాగా ప్రసిద్ధి. సొంతంగా ఇల్లు కట్టుకుని వుంటే, దానికి పాలిష్డ్ బండలు వాడి వుంటే మీరు బేతంచెర్ల పేరు వినుండే అవకాశం వుంది. అక్కడికి దగ్గర్లోనే ఎప్పటి నుండో ఒక సిమెంటు ఫ్యాక్టరీ కూడా వుంది, ఆ రాళ్లు ఆధారంగానే.
మా వూరి పేరు గని. గని నుంచి మా పెద్ద వాళ్లు నెత్తికి సెల్లాలు చుట్టుకుని, గోచీలు పైకి కట్టుకుని నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ రోజుల్లో మరీ దట్టంగా వున్న ఆ బేతంచెర్ల అడవుల్లో ఒక చోట ఆగారు. చీకటి పడింది. రాత్రయ్యింది. ఆ పక్కనే ఒక దేవాలయం కనిపించింది. తమ దగ్గరున్నదేదో తినేసి వాళ్లు దేవాలయం ముందు పడుకున్నారు. నడిచి నడిచి అలసిపోయారేమో బాగా నిద్ర పట్టింది. ఇక కాసేపుంటే తెల్లారతుందనగా, చీకటి గాఢంగా వుండగానే అక్కడ పడుకున్న వారందరికీ తమ వీపున ఎవరో చరిచినట్టు అనిపించింది. ఎవరో ఒకరికి కాదు. ఆ గుంపులో ముగ్గురో నలుగురో…. ఎందరున్నారో అందరికీ, ఒకే రీతిగా ‘లెయ్యండి రా, ఇంగ పండుకున్న్యారు. ఆవులొచ్చినాయి’ అని అన్నట్టు, వీపున చరిచినట్టు అనిపించింది. అందరు దిగ్గున లేచి కూర్చున్నారు. చుట్టూ చూస్తే ఏముంది?! వాళ్ల ఆవులు అక్కడే పచ్చ గడ్డి మేస్తూ కనిపించాయి.
వాళ్లు ఆవులను చూసుకుని సంబర పడ్డారు. ఆ ముగ్గురు నలుగురు పెద్దలు అక్కడే కాళ్లు మొగం కడుక్కుని దేవాలయంలోనికి వెళ్లి ఆంజనేయ సామికి మొక్కినారంట. మొక్కుతున్నప్పుడు వాళ్లందరికి ఒకే సారి అర్థమయ్యిందంట. తమను పొద్దున వీపు మీద చరిచి లేపింది ఎవరో కాదు, బేతంచెర్ల సంజీవరాయుడే అని. ఇంకేం. సామికి సాష్టాంగ నమస్కారం చేసి, అందరు కలిసి… ‘సామీ మా వంశం నిలబెట్టినావు. ఇయ్యాల్టి నుంచి మా ఇండ్లల్లో తొలి చూలు బిడ్డ మగ పిల్లోడు గాని ఆడిపిల్ల గాని నీ పేరే పెట్టుకుంటాం. ఇయాల్టి నుంచి మా ఇంటి దేవుడు నువ్వే’ అని మొక్కుకున్నారంట.
అంట, అంట అంటున్నాను గాని…. నాకు తెలిసి కనీసం మూడు నాలుగు తరాలుగా అదే నియమం కొనసాగిందంటే, వాళ్లు అలా మొక్కుకున్న మాట నిజమనడంలో సందేహం లేదు. అదీ మదీయ నామధేయం వెనుక భూమి…అనగా బ్యాక్ గ్రౌండ్.
నిజానికి నేను దేవుడి గురించి లోకంతో తీవ్ర భిన్నాభిప్రాయానికి వచ్చి, అంతటి దేవున్ని పట్టుకుని పో పో వోయ్ అంటున్నాను కదా, ఇలా అనడం కన్న బాగా ముందు నుంచే నా పేరేం బాగోలేదని అనుకునే వాడిని. దానికి చాల కారణాలున్నాయి, ఆ పేరు మీద వున్న జోకులు మొదటి కారణం. హనుమంతుని ముందు కుప్పి గంతులా అనేదొకటి అందరికి తెలుసు. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన దేవుడూ యీయనే. అయ్యవారిని చెయ్యబోతే కోతి కావడం ఎవరికి ఇష్టం వుంటుంది చెబుదురూ?!
అంతే గాకుండా, మనకు… అనగా నాకు… ముందు నుంచే దేవుడంటే కంపరం, దాని వెనకాల అంతా మోసమేనని నమ్మకం. ఏ దేవుడు సక్కగుండాడు? ఏ దేవుని కథ సక్కగుంది? ఆమెను ఎవరో ఒకాయన ఎత్తుకు పోతే, యుద్ధం చేసి ఓడించి, అమెను తిరిగి ఏలుకోడానికి ముందు అక్కడ ఏమీ జరగలేదని నిరూపణ కావాలికదా అని పెళ్లాన్ని అగ్గిలో దుంకి చూపించాలన్నోడు, ఎక్కడికి పోతే అక్కడ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి, దొంగ దెబ్బలు కొట్టి గెలిచినోడు…. అని…. అంతటి రామచంద్రుడినే అవుతల పెట్టేస్తుంటాను, అలాంటి నాకు ఈ ‘బానిస’ దేవుడి పేరేందిరబ్బా అనుకుంటూ వుంటాను.
నాకు ఇంకోటి కూడా నచ్చలేదు. పెండ్లి చేసుకోడం చేసుకోకపోవడం ఎవరిష్టం వాళ్లది గాని, నాకు మాత్రం అది ఏనాడూ ఏ రూపంలోనూ ఆదర్శం కాదు. పోగా, మన దొరగారు తన ప్రేయసి కోసం కాకుండా ఎవరి ప్రేయసి కోసమో అంత దూరం ఏరు దుంకి, ఒక వూరు తగలబెట్టి వచ్చి, అంతా అయ్యాక రాజు కాళ్ల కాడ పడుండడం ఎలా ఆదర్శం అవుతుంది? నేనే కాదు, ఎవరూ అలా అనుకోరాదని నా వుద్దేశం, అలాంటిది నేనే ఆ ఆదర్శాన్ని ఎట్టా మోసుకు తిరగడం.
ఈయన్ని వదిలించుకోడానికి ఏం చేయాలి? మనిషన్నాక ఏదో ఒక పేరుండాలి కదా?! ఏది ఆలోచించినా అది కుల మతాలను సూచించేదిగానే వుంది. ఇంత దూరం వచ్చాక కుల మతాలే కాదు ప్రాంతీయ, సాంస్కృతికి సూచన కూడా వుండొద్దనుకున్నాను. ఫలితం. అమ్మ నాన్న పెట్టిన పేరునే కుదించి ఇదిగో ఇలా హెచ్చార్కె అయిపోయాను.
నా పేరు సంగతేమో గాని, మా ‘ఇంటి’ సంగతుల్లో ఒకటి చెప్పేశాను. ఇట్టాంటిదే ఇంకోటి చెప్పాలి.
మా ఇంట్లో మత సంబంధమైన నిబంధనలేవీ పెద్దగా పాటించరు. జీవితంలో ముస్లిములకు సుంతీ వంటివి వుంటాయి, క్రైస్తవులకు బాప్తిజం అవీ వుంటాయి. మాకు ఒక పుట్టెంటికలు తీయించే ‘ఉత్సవం’ తప్ప అలాంటి సంబరాలేవీ వుండవు. యాయ్యా! పండగలుంటాయి. ఆరోజు దేవుళ్లకు, భూదేవుళ్లకు నైవేద్యం పెట్టి నా ‘లొంగుబాటును’ పవిత్రంగా ప్రకటించుకోవాలి. యాయ్యాయ్యా! పెళ్లిళ్లూ అవీ వుంటాయి. ఆడపిల్లకు ఇంకెవరెవరితోనో కలిపి ముందుగా బ్రాహ్మణుడికి, అదయ్యాక ఐదు తనాల్లో ఐదో తనంగా భర్తకు ఆమె మీద అధికారమిచ్చే హీనత్వాన్ని ఆమె మోయడం వినా, ఆ క్రతువులోనైనా మా దంటూ వున్నదేమిటి?
సరిగ్గా ఇందుకే కంచె ఐలయ్య పుస్తకం పేరు గుర్తొస్తుంది. ‘నేను హిందువునెట్లైత?’ నేను హిందువును కాను అని స్పష్టంగా అనిపిస్తుంది. నాతో గాని, నా ప్రయోజనాలతో గాని ఎలాంటి సంబంధం లేని మహిషాసుర, నరకాసుర వధలను…. లేదా మోస్ట్ ప్రాబబ్లీ నా పూర్వీకుల హత్యలను… పండుగ చేసుకునే బానిస సంస్కృతి నాది. నాది అంటే నా వంటి శూద్రులందరిదీనూ.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తవ్వగలిగితే, నా చరిత్రకు పట్టిన మకిలిని ఓపిగ్గా గీరి గీరి వదిలించుకోగలిగితే నాకూ నాదైన ఒక సంస్కృతి వుండే వుంటుంది. నా పూర్వీకుల శత్రువులు నా చరిత్రను ఎంత కలుషితం చేశారంటే ఆ సంగతులనే ‘సామూహికంగా’ మరిచిపోయాను. ఏవో కొన్ని మాటలే గాని… ఏ నమ్మకం ఎందుకోసం అనే సంగతి చెప్పే వారు లేని వాడినయ్యాను. ఇది నాకు ప్రత్యేకం కాదు. లోకంలో ఇలా చాల మందికి జరిగింది. దీని వెనుక ఘోరమైన అణిచివేత, దోపిడీ యవ్వారాలున్నాయి.
ఇదే రకం విచికిత్సకు లోనైన వారిలో ఎలిక్స్ హేలీ అనే నల్లజాతి అమెరికన్ రచయిత ఒకరు. ఆయనకు నా కథకు ఏమిటి సంబంధం అంటారా? ఆయనకే కాదు, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ పుస్తకానికి నాకూ కూడా సంబంధం వుంది. అదెలాగో చెబుతాను.
మా ఇంట్లో ఒక నిబంధన వుండేది. మేము మేక లేదా మేకపోతు మాంసం తినగూడదు. అదేంటమ్మా అని అడిగితే మేక, మేకపోతు మన అవ్వతాతలు రా అని చెప్పేది మా అమ్మ. వేరే పెద్దాళ్లను ఎవరినడిగినా అదే సమాధానం. చాలా ఏళ్ల తరవాత గాని నాకు జవాబు దొరక లేదు.
ఎలిక్స్ హేలీ రాసిన ‘రూట్స్’ నవల చదివారా? సహవాసి గారి తెలుగు సంక్షిప్తీకరణ ‘ఏడు తరాలు’ (హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురణ) చదివినా చాలు. ఎలిక్స్ హేలీ అనే నల్లజాతి రచయిత తనకూ ఒక ‘వంశం’ వుండాలి కదా అదేమిటి అని పరిశోధించాడు. ఆ శోధన అతడిని ఏడు తరాల వెనక్కి, ఆఫ్రికాలో అతడి పూర్వీకుడి వద్దకు తీసుకెళ్లింది. ఆప్రికాలో వంశ క్రమం చెప్పే వృత్తి గాయకుల గానం, అక్కడి వాళ్లు పాటించే ‘టోటెమ్’ (వంశ చిహ్నం) ఆధారంగానే ఎలిక్స్ తన నుంచి వెనక్కి ఏడు తరాల వరకు తన వంశ చరిత్రను ట్రేస్ చెయ్యగలిగాడు.
‘రూట్స్’ చదువుతున్నప్పుడు నేను ఈ ‘టోటెమ్’ అనే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ పుస్తకం ‘ఇండియన్ ఫిలాసఫీ’, ఆ తరువాత ఆయనదే ‘లోకాయత’ చదివాక మబ్బులన్నీ కదిలిపోయాయి. ఈ టోటెమ్ మనకూ వుంది. ప్రతి వంశం లేక హౌస్ హోల్డ్ ఏదైనా ఒక జంతువునో, మొక్కనో, పువ్వునో, కాయనో తన సంకేతంగా భావించేది. ఆ జంతువు లేదా వృక్ష విశేషాన్ని తమ ఒరిజినల్ పూర్వీకుడిగా భావించేది. ఇలాంటి టోటెమ్ ను పట్టుకుని ఎలిక్స్ హేలీ తన పూర్వీకుడిని గుర్తిస్తాడు.
ఇండియాలో ఒక నాడు గణాలు అనేవి వుండేవి. గణతంత్రం పేరిట ఒక ప్రిమిటివ్ ప్రజాస్వామ్యం వుండేది. దాన్ని నాశనం చేసి రాజరికాలు వచ్చాయి.
రాజరికాలు గణాల్ని ఆక్రమించడం అనేది వూరికే జరగలేదు. ఘోర హింసాకాండ సాగింది. గణాలు తమను తాము కాపాడుకోడం కోసం చివరి వరకు పోరాటం చేశాయి. అవి దురాక్రమణదారుల కింద ఓడిపోయే కొద్దీ అడవుల్లో దాక్కుని కూడా పోరాడాయి. రాత్రులు దాడి చేసే ప్రిమిటివ్ గెరిల్లా పద్ధతులనూ అనుసరించాయి.
అందుకే శివుడిని దేవుడిగా భావించే ‘ప్రమథ గణాల’ను మొరటు మనుషులుగా, తక్కువరకం మనషులుగా, ఒక రకం చీకటి శక్తులుగా హిందూ పురాణాలు చిత్రిస్తాయి.
తాము ఎవరి భూముల్ని అక్రమించారో, ఎవరిని నాశనం చేయడం ద్వారా తాము బతికారో వారిని నీచంగా చిత్రించడమనేది ఆర్య సంప్రదాయాలలో అతి ముఖ్యం. బహుశా ఆక్రమణ దారులందరూ అనుసరించే పద్ధతే అది.
గణనాధుడి కథే వున్నది. ఆయన శరీరం మనిషిది, ముఖం ఏనుగుది అనే మాట అబద్ధం. కల్పన. ఏనుగు ఆయన టోటెమ్. ఆయన ఏ గణాలకు నాయకత్వం వహించాడో ఆ గణాలకు ఏనుగు టోటెమ్. గణేశుడు చేసిన పని దేవతల (సో కాల్డ్ దేవతల) పనులను విఘ్నం చేయడం. ఆ పనులు తన గణాలకు నష్ట కరం, రాజరికాలకు వుపయోగకరం కాబట్టి వాటిని గణాలు, గణ నాథుడు ఎదిరించారు. అందుకే, పనికి ముందు, విఘ్నం రాకుండా గణ నాధుడిని ‘పూజించాల’ని ఆచారం వచ్చింది.
గణేశుడి విగ్రహాన్ని తయారు చేసే, ఉత్సవం చేసి ఆ తరువాత ఏట్లో పారేయడం కూడా ప్రతీకాత్మకమే.
నాకు బాగా జ్జ్ఞాపకం వుంది. మా వూళ్లో కుమ్మరి కులస్థులు మట్టితో తయారు చేసిన జోకరయ్య అనే విగ్రహాన్ని ఒక గంపలో పెట్టుకుని వచ్చేవారు. అలా రావడం వినాయక చవితితో మొదలయి, మాల పున్నం అనే రోజు వరకు సాగేదని గుర్తుంది. అమ్మలు వాళ్లకు జొన్నలు ఇచ్చి, జోకరయ్య నోట్లో కాస్త వెన్న పెట్టి పంపే వారు. చివరి రోజు తాము కోడి కోసుకుని నైవేద్యాలు పెట్టి, ఒక ఎముకను జోకరయ్య నోటిలో వుంచి, ఒక నీళ్లు లేని కుంటలో పడేసే వారు. జోకరయ్యకు దప్పికేసి వెళ్లి వాళ్ల అమ్మ నాన్నలకు మొరపెట్టుకుంటాడని, అప్పుడు శివ పార్వతులు భూలోకంలో మనుషుల కష్టాలు అర్థం చేసుకుని వానలు కురిపిస్తారని కథ చెప్పే వారు. అది గణేశుని విగ్రహమే. అలా గణేశుడిని మట్టితో చేయడం, పారేయడం గణనాధుడిని తక్కువ చేయడం, వదిలించుకోడం….. గణ తంత్ర సమాజాల పట్ల పురోహితుల, రాజుల ఆయిష్టానికి ఉత్సవ రూపం కల్పించడమే.
గణేశుడి గణ నాయకత్వం ఎక్సెటరా కథలను దేవీ ప్రసాద్ ఛటోపాధ్యాయ ‘లోకాయత’ నుంచి పురాణం సుబ్రహ్మణ్య శర్మ, హరి మొదలైన వారు అనువదించారు. ఆ పుస్తకాల్ని హైదరాబాద్ బుక్ ట్రస్టు వారు ప్రచురించినట్టున్నారు.
మా ఇంట్లో మేము మేక, మేకపోతు తినగూడదనే నియమం వెనుక వున్నదేమిటో నాకు దేవీప్రసాద్ పుస్తకం చదివాకే అర్థమయ్యింది. దాన్నీ, ఎలిక్స్ హేలీ ‘రూట్స్’ నీ కలిపి చూస్తే నాకు వెలుగు కనిపించింది. మేక మా టోటెమ్.
నా పూర్వీకులెవరో గాని…. వాళ్లు మా ఊరి పక్కనే వున్న లక్ష్మయ్య కుంట తండా లోని సుగాలీల (లంబాడీల) సాంఘిక దశలో జీవించిన వారు మాత్రమే. లేకుంటే ‘టోటెమ్’ విశ్వసాల వంటివి ఈ మాత్రమైనా మాలో ఇంకా బతికుండడం సాధ్యం కాదు. లక్ష్మయ్య కుంట తండా లోని సుగాలీల ప్రధాన వృత్తి ఆవులు కాయడమే. ఆవులు వాళ్ల ప్రధాన ఆస్తి. (ఇప్పుడిప్పుడు పరిస్థితి మారింది. వాళ్లు స్థిర వ్యవసాయం లోనికి వచ్చేశారు).
మొన్న మొన్నటి వరకు పశుల కాపరి జీవితంలో వుండి, వ్యవసాయం లోనికి వచ్చిన నా పూర్వీకుల చరిత్రను ఇంకా తెలుసుకోవాలని వుంది. ఇలా, మొదట హైదరాబాదుకు, తరువాత అమెరికాలో కూతురి వద్దకు గెంతిన ‘హనుమంతుడు’ ఆ పని చెయ్యలేడు. ఇంకెవరికైనా ‍అలాంటి పని చేయడానికి ఈ మాటలు ప్రేరణ అయితే ధన్యం.
ఔను, ఈ మాటలు కొందరికి కంటగింపు అవుతాయి. నిర్మొహమాటంగా మాట్లాడుకోనంత వరకు మనుషుల మధ్య మంచి సాన్నిహిత్యాలు బలపడవు. ఉంటే ఎక్కువ తక్కువ సంబంధాలు లేకుంటే శత్రుత్వాలు మాత్రమే వుంటాయి. మాట్లాడుకోడం ఒక్కటే సరైన మార్గం.
(వచ్చే వారం మరి కొన్ని కథలు)
30-03-2016
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s