యత్ర నార్యస్తు పూజ్యంతే…..

స్మృతి 7

గత వారం అమ్మలకు వందనాలు చెప్పాను. చాల మంది నాతో గొంతు కలిపారు. అలా ఆమోదం రికార్డు చేయని వారు, అసలు నా కాలమ్ చదవని వారు ఇంకా చాల మంది గళం కలుపుతారనడంలో సందేహం లేదు. ‘మా తుఝే సలామ్…’ అని జెండాలెత్తి ఎగరడం ప్రతి ఒక్కరికీ ఆస్కార్ అవార్డంత ఇష్టం. మన నోళ్లలో బాగా నాని చీకిపోయిన నానుడి ఒకటుంది; ‘యత్ర నార్యస్తు పూజ్యంతే….’ అని. ఆడవాళ్లు పూజలు అందుకోవడమంటే ఆ పేరుతో వాళ్ల శ్రమను వుచితంగా కొట్టేయడం. వాళ్ల శ్రమ ‘అమూల్యమ’ని, దానికి ఖరీదు కట్టే షరాబు లేడ’ని ప్రతిఫలం ఎగ్గొట్టడం. ఆపైన… అది ఖరీదు లేని శ్రమ కాబట్టి ఆమెను ‘భరించ’డానికి గాను భర్తకు కాంపెన్సేషన్ గా వరకట్నం. పూజ అంటే వ్యంగ్యార్థంలో హింస అనుకుంటే తప్ప, ఆడవాళ్లు ఎక్కడా ఆడతనం కోసం పూజింప బడడం లేదు. హీనమైన హింసకు లోనవుతున్నారు. అవమానింప బడుతున్నారు. అవమానింపబడడం సరైంది అని చాల మంది ఆడవాళ్లే అనుకుంటున్నారు.

ఈ ఇంటింటి ఘోరాన్ని.. మా ఇంటి నుంచే మొదలెడతాను.

మా ఇల్లు ఎలా వుంటుందో చాల సార్లు చెప్పాను. కథల్లో, వ్యాసాల్లో… సందు దొరికినప్పుడంతా చెప్పాను. ఈ తరువాత కూడా చెబుతాను .ఇప్పడు మా ఇంటి ముందు భాగం గురించి మాత్రమే. మూడంఖణాల మా ఇంటిలో మొదటి భాగం… కుడివైపు ఒక పెద్దరుగు, ఎడమ వైపు ఎత్తైన కొట్టిడిల్లు. ఈ రెండింటికి మధ్య లోపలికి నడిచే దారి. వీటికి ముందు, పైన మెత్తు (టెర్రేస్) నుంచి సగం వరకు కిందికి దింపిన చూరు, వారపాకు. వారపాకులోని గూళ్లలో పిట్టల కిచకిచలు.

ఒక మధ్యాహ్నం. మా అమ్మ, జీతగాడు హుసేన్ జొన్నలు విసురుతున్నారు. హుసేన్ పెద్దరుగు మీద కూర్చుని, అమ్మ కింద నుంచుని. వారపాకు కింద పట్టె మంచం. మంచం మీద దూది పరుపు. మా ఇంట్లో అదొక్కటే పట్టె మంచం, అదొక్కటే దూది పరుపు. అవెప్పుడూ నాన్నకు రిజర్వుడు. నేను తమ్ముడు (అప్పటికి బాగా చిన్నాడు) దూది పరుపు మీద నాన్న దగ్గర వున్నాం. పక్కన ఇంకో నులక మంచం మీద మా పండ్ల సంజిరెడ్డి చిన్నాయ్న అనుకుంటా తనూ, ఇంకా ఎవరో కూర్చుని వున్నారు. నాన్న చాల హుషారుగా వున్నాడు. ఫరాకత్ గా పడుకుని, ‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట…’ అంటూ చింతామణి లోని పద్యాలు పాడుతున్నాడు. నాకు ఆ పద్యాలు ఇష్టముండేవి కావు. (ఇప్పటికీ ఇష్టం లేవు). ‘కౌరవ పాండవుల్ పెనగు కాలము దాపురించె….’ అని అందించాను.

నాన్న ఆ పద్యం పాడుతూ మధ్యలో నురుగు గుర్తు రాక ఆగిపోయాడు. మీకు చెప్పలేదనుకుంటా, మా నాన్నకు కొంచెం కొంచెం చదవడం వచ్చు. గాసగాని కుంట్లు (పనిలోకి రాని రోజులు) అవీ రాయడం కూడా వచ్చు. మా ఇంట్లో ఎక్కడిదో గోధుమ రంగు అట్టలు కుట్టిన ఒక పుస్తకం వుండేది. ముక్కుతిమ్మన ‘…. నరుగానరుగా’ పద్యాలు కొన్ని, భారతం పద్యాలు కొన్ని ఇంకేవో దానిలో వుండేవి. ఏదో క్లాసు తెలుగు పుస్తకం అయ్యుండొచ్చు. నాన్నకు పద్యం గుర్తుకు రాకపోయే సరికి, “గూట్లో పుస్తకం వుంటాది, తీస్కరా’ అని అమ్మకు ఆర్డరేశాడు. అమ్మ అప్పటికే పనితో అలసిపోయి వుంది. అప్పుడు పనిలో వుంది. ‘తీస్కపోగుడ్దూ’ అన్నది. నాన్న ఒక క్షణం వుండి ‘నీకే చెప్పేది’ అని కేకేశాడు. అమ్మ పని ఆపి, ఆ పుస్తకం తీసుకొచ్చి చేతికి ఇవ్వకుండా మంచం మీద వేసింది. అంతే. నాన్న పడుకున్న వాడు పడుకున్నట్టే చాచి అమ్మ చెంప మీద కొట్టాడు. అమ్మ ఒక్క క్షణం మానులా నిలబడి, గిరుక్కున అటు తిరిగి వెళ్లి ఇసుర్రాయి విసరడం మొదలెట్టింది.

ఇంతే జరిగింది. వాళ్లిద్దరి మధ్య ఇంతకు మించి భౌతికమైన డొమెస్టిక్ వైలెన్స్ నేను చూడలేదు.

ఆ క్షణంలో అమ్మ మనసులో ఎన్ని మంథరాలు తిరిగుంటాయి. కడుపున మోసి కన్న బిడ్డలు ఇద్దరు చూస్తుండగా, మంచం మీద ఫరాకత్ గా పడుకున్నవాడు….. పని మధ్య తను కాస్త విసుగు కనపర్చినందుకు… అంత అవమానం. నాకైతే స్పష్టంగానే వుంది. దానికి నాన్నను అమ్మ ఎన్నడూ క్షమించలేదు. నాన్న కూడా క్షమాపణ అడిగివుండడు. మరింకేవేవో కలిసి వాళ్ల మధ్య సంబంధాలు కొద్ది కొద్దిగా దిగజారిపోయి వుంటాయి.

ఆ మధ్య ఓ చిన్న సమావేశంలో మాట్లాడుతూ కథయిత్రి పి. సత్యవతి అన్నారు. చివరి రోజల్లో చీటికి మాటికి సేవలు చేయించుకునే భర్తలు ఎపుడు పోతారా అని భార్యలు ఎదురు చూస్తారు… అని. ఆమె సరదాగా అన్నారేమో గాని, అది నిజమేనని నేను అనుకుంటున్నాను, అదీ ఆ చివరి రోజుల సేవలకే గాదు…. అంతకు ముందు కనిపించే, కనిపించని హింసలకు కూడా.

కర్నూలు ఆసుపత్రిలో చనిపోయిన మా నాన్నను మా వూరికి తీసుకెళ్లి, వూరి బయట టాక్సీ నుంచి తీసి ఎడ్ల బండి మీద పడకోబెట్టి, ఇంటికి తీసుకెళ్లాం. దారంతా అమ్మ నాన్న కాళ్ల దగ్గర తల వంచుకుని కూర్చుంది. అప్పుడు ఆమె ఘనీవించిన నిశ్శబ్దంలా కూర్చుని వుంది. అప్పుడు ఆమె మనసులో ఏయే దుఃఖాలు సుడి తిరిగి వుంటాయి? నాన్న మీద ప్రేమ మాత్రమేనా? ఇంతటితోనైనా విముక్తి వుందా అనే ఎప్పటికీ దొరకని సాంత్వన ఆమె మనసులో పెను కెరటమై తిరిగి వుంటుందా? ఏమో!

మా ఇంటి చూట్టూరా నేను ఇంత కంటే ఎక్కువే ‘స్త్రీ హింస’ను చూశాను. మా ఇంట్లో ఆ ఒక్క ఘటన తప్ప కొట్టడం అనేది లేదు. ఆత్మలు కాలిపోతున్న ఒక వాసన మాత్రం వుండేది. ఇంటి చుట్టూరా భార్యా హింస ఒక మగతనంగా చెలామణి కావడం నేను బాగానే చూశాను. పక్కింటి చిన్నాయన ఒకరు పిన్నిని కట్టె తీసుకుని కొడుతుంటే ఎవరూ అడ్డు వెళ్లలేదు. చోద్యం చూస్తూ వుండిపోయారు. ఆమె… అంత పెద్దామె… చిన్న పిల్ల మాదిరి, ఏమాత్రం ఎదురు తిరగకుండా, దెబ్బలకు చేతులు ఆడ్డం పెట్టుకుంటూ వల వల ఏడుస్తూ అలాగే బండల మీద పొర్లింది. ఒక మానవ స్త్రీ…. కట్టేయబడిన కుక్క మాదిరి.

బాగా చిన్నప్పుడు నాకొక థీరీ వుండేది. అది మగపిల్లవాడిగా నా థీరీ. మా నారాయణ రెడ్డి అబ్బతో ఈ థీరీ మీద వాదించే వాడిని. (అబ్బ అంటే నాన్నకునాన్న లేదా ఆ వరుసయ్యే మనిషి). మగ వాడు పెండ్లి ఎందుకు చేసుకోవాలి? ప్రేమ కోసం. (మా అబ్బ బాగా పెద్ద వాడు కదా, ఆయనతో ‘సెక్సు కోసం’ అని అనలేదు, సెక్సు లేని ప్రేమ ఆయన వూహకు తట్టదు కూడా). కాళ్ల దగ్గర పడుండే మరో మనిషి మనల్ని ఎట్టా ప్రేమిస్తుంది? మనం దేవున్ని ప్రేమిస్తామా? పూజిస్తాం, ప్రేమించం కదా? మరి ప్రేమ కావాలంటే ఆమె మన కాళ్ల దగ్గర పడి వుండేది కాకూడదు. సమానమైనది కావాలి. అందువల్లనే స్త్రీలకు సమానత్వం వుండాలి. ఈ చివరి మాట మాత్రం వాళ్లకు చాల విచిత్రంగా వుండేది. మిగిలిన మాటలకు నారాయణ రెడ్డబ్బ నాకు జవాబు చెప్పలేకపోవడం చూసి, తన కొడుకు వాదనా పటిమకు మా నాన్న మురిసిపోయే వాడు. నేను ఇప్పటికీ ఈ స్వార్థంతోనే స్త్రీ సమానత్వాన్ని స్త్రీ స్వాతంత్ర్యాన్ని కోరుతానేమో. ‘స్వార్థం’ ఏమీ లేకుండా దేన్నైనా నేనైనా ఎవరైనా ఎందుకు గౌరవించాలి, ఎందుకు గౌరవిస్తారు?

ఆడవాళ్లు లోలోపల కుళ్లుకునే హింస ఎలా వుంటుందో, కొండ మీది బొల్లవరంలో చూశాను. మామ మంచోడే గాని, అత్త నన్ను బాగా చూసుకునేది కాదు అన్నట్టు రాశాను కదూ? అలా రాసి వుంటే అది తప్పు. మామ నాకు మంచి వాడు. మా అమ్మకు మంచి వాడు. వాళ్లావిడకు మంచి వాడు కాదు. అత్త పేరు రామ చంద్రమ్మ. వెనుదిరిగి చూసుకుంటే ఆమె అంటే చాల జాలి వేస్తుంది. అత్త వాళ్లది ఏవూరో తెలీదు. వాళ్ల వాళ్లెవరో తెలీదు. అమెకు ఒక చెల్లి వుందనే విషయం చాల ఏండ్లకు ఓర్వకల్లులో ఆ చెల్లిని చూపి ఎవరో చెబితే తెలిసింది. అత్తకు ఎవరూ లేరు. మామకు అది రెండో పెళ్లి. మామ మాతోనే కాదు, తన పిల్లలతోనూ బాగా వుండే వాడు. కాని అత్తతో మాత్రం ఆమె ఒక వస్తువు, తనకు పనికొచ్చే ఒక వస్తువు అన్నట్టుగా వుండేవాడు.

ఒకరోజు ఇంట్లోకి వెళ్లే సరికి, వంటింటి చీకట్లో సన్నగా ఎవరో కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారనిపించింది. కళ్లు చికిలించి చూస్తే మూలగా అత్త కూర్చుని ఏడుస్తోంది. దానికి రెన్నిమిషాల ముందు మామ ఎద్దుల మెడకు గంటలు కట్టే వారు తీసుకుని వెళ్లి ఎగబెట్టడం చూశాను. నాకు అర్థమయ్యింది. మామ అత్తను ఆ ఎద్దుల మెడ పట్టెడతో కొట్టాడు. అయినా ఆమె బయట బజారులోకి తన ఏడుపు వినిపించకుండా నోట్లో కొంగు కుక్కుకుని వుండిపోయింది. వాళ్ల మాటలేవీ నాకు వినిపించలేదు. కొట్టడానికి పెద్ద కారణం వుండి వుండదు. ఇప్పుడు విశ్లేషించుకుంటే ఒకటే అనిపిస్తుంది. మామ సెక్సు కోసం ప్రయత్నిస్తే ఆమె నిరాకరించి వుంటుంది. లేకుంటే అంత నిశ్శబ్దంగా అంత హింస…. ?

అత్త అప్పుడే కాదు, ఎప్పుడూ ఇల్లు వదిలి బయటికి వెళ్లేది కాదు. ఆమెకు ఎవరితోనూ సామాజిక సంబంధాలుండేవి కాదు. ఆ ఇంట్లో తను ఒక సమాధి లోపలి చీకటిలో నడుస్తున్నట్టుండేది. ఆమె మాత్రమేనా? మా అమ్మ, మరో అమ్మ అందరూ అంతేనేమో. మా వూళ్లో నలుగురమ్మలు కూర్చుని మాట్లాడుకుంటే, ‘ఆడోళ్ల యవ్వారాలు’ అనే వాళ్లు, చాల తక్కువ చూపుతో. చుట్టు పక్కల మగవాళ్లు లేని సమయంలో ఎక్కడో ఇరుకు అరుగు మీద కూర్చుని మాట్లాడుకోవాలి, తప్పు చేస్తున్న వాళ్ల లాగ.

మగ వాడు ఇంట్లో భార్యాబిడ్డల్ని వదిలేసి బయట రచ్చబండ మీద గంటల తరబడి కాలక్షేపం చేస్తాడు. వెల్.. అతడు ‘రచ్చబండ మీద కూర్చున్న రాజేంద్ర భోగి’. మగవాడిని స్త్రీ ‘భోగి’ అనుకోడంలోనే, అనడంలోనే వుంది తిరకాసు. ఇట్టాంటి పాటలు రాసినోళ్ల జ్జ్ఞానపీఠాల చెంత కూర్చుని నేర్చుకునే సంస్కృతి కదా మనది.

మా వూరిలోమరో విశేషం పెద్ద బజారు. ఇంకే వూరిలో చూడలేదు అలా తెంపు, ఒంపు లేని అంత పొడుగాటి బజారు. వూరు ఆ చివర నుంచుని చూస్తే ఈ చివరి మా కళ్లాలు కనిపించేవి. అటు వైపు, పడమరగా మిట్ట, ఇటు వైపు తూర్పున పల్లం. అంతే. వేరే వంపులు ఏమీ వుండవు. నేను దాదాపు ప్రతి సాయంత్రం పడమర వైపు వాగు ఒడ్డున ఇసుకలో కాసేపయినా కూర్చుని రావలసిందే. అలా ఆ బజారులో నడుస్తున్నప్పుడు వచ్చే ఒక ఇల్లు, ఆ ఇంట్లో జరిగిన కథ గుర్తు తెచ్చకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఛ, అలా జరిగుండదు, వట్టి వదంతి అనిపిస్తుంది. కాని అది జరిగింది.

ఆ అమ్మాయి పేరు రంగమ్మ అనుకుందాం.

చామన ఛాయ. చాల అందంగా వుండేది. అందం అనడం కన్న ఆరోగ్యం అనడం సరైంది. ఆరోగ్యం వల్ల మిసమిసలాడుతున్నట్టుండేది. తల్లి లేదు. తండ్రి, అన్న, వదిన, తను… అంతే ఆ ఇంట్లో. ఆ ఇంటి మీదుగా వెళ్తున్నప్పుడు రంగమ్మ ఇంటి దగ్గరుంటే, తనను కాసేపు చూడకపోవడం నాకు సాధ్యమయ్యేది కాదు.

ఇంతలో ఆ అమ్మాయికి పెళ్లైంది. వేరే వూళ్లో బాగా వున్న వాళ్ల ఇంటికి ఇచ్చి చేశారు. పెళ్లిలో ఇవ్వాల్సిన కట్నం డబ్బులకు సంబంధించి ఒక కథ చెప్పే వారు. అది నిజం కావొచ్చు. వాళ్ల దగ్గర అంత డబ్బు లేదు. ఒక నడి వయస్కుడైన ధనికుడు, తను చూట్టానికి బాగుంటాడు కూడా, ఆ ఆమ్మాయి మీద మోజు పడ్డాడు. ఆ అమ్మాయిని తన దగ్గరికి పంపిస్తే తను డబ్బు సర్దుతానన్నాడు. ఇంటి వాళ్లు దానికి సరేనన్నారు. అది తప్పు ఒప్పు అని విగడించుకునే స్థితి కాదు ఆ అమ్మాయిది. పెళ్లైంది. వేరే వూరెళ్లింది.

పెళ్లైన కొద్ది రోజుల నుంచీ తన గురించి ఏవేవో ‘వార్తలు’. ఇక్కడ కట్నం డబ్బుల కోసం, ఇంట్లో తెలిసి, ధనికుడి వద్దకు వెళ్లడం వల్ల, దానిలో ఏ తప్పూ కనిపించక, ఆమె ఆ వూళ్లో వేరే సంబంధాల్లోకి వెళ్లిందని, ఇక్కడ తండ్రి, అన్నా, వదినలు చెప్పినా వినిపించుకోడం లేదని.

ఆ తరువాత కూడా మా వూరికి వచ్చినప్పుడు రంగమ్మను చూసే వాడిని. నేనూ యవ్వనం తలుపు తడుతున్నవాడినే. ఆమె చుట్టూ వున్న కథల వల్ల తను మరింత ఆసక్తికరం అయ్యుంటుంది నాకు. ఉన్నట్టుండి ఆ అమ్మాయి చనిపోయిందని అన్నారు. నిన్న సాయంత్రం అంత ఆరోగ్యంగా కనిపించిన అమ్మాయి? తరువాత తెలిసింది, ఇంట్లోనే ఆమె అన్నా, తండ్రీ కలిసి, ఆమె గొంతు నులిమి చంపారని. ఎలా? తను ఎంత ఏడ్చి మొత్తుకుని వుంటుంది… అంత ఆరోగ్యవంతురాలు…. ఒక పట్టాన ప్రాణ పోక ఎంత గిలగిల్లాడి వుంటుంది… సొంత అన్న, సొంత తండ్రి… తను కాపాడమని మొరపెట్టుకోవాల్సిన వాళ్లే హంతకులై…

ఆ రోజు వూరిలో వున్నాన్నేను. ఎవరూ ఏమీ అనలేదు. ఆమెను తీసుకెళ్లి ఖననమో, దహనమో చేశారు. అక్కడొక హత్య జరిగిందని ఎవరూ అనుకోలేదు. అసలెవరూ మాట్లాడలేదు.

వాళ్ల కారణం వాళ్లకుంది. వాళ్ల ఇంటి పరువు. ఇంటి పరువుల కోసం ఆడతనం వున్న ఆడపిల్లలు చావాలి? ఈ పరువు వెనుక భావజాలం ఏమిటి? ‘రచ్చకట్ట మీది రాజేంద్రభోగి’ భావన కాదా? పెళ్లాం అనేది తను కోరిక తీర్చుకునే ఒక వస్తువు అనే భావన కాదా? మొగుడు ఆర్డరేస్తే వినాలంతే… అనే భావన కాదా?

దీన్ని అదిగమించకుండా ఆడవాళ్లు, మగ వాళ్ల మధ్యన వుండాల్సిన అద్భుతమైన సంబంధం సాద్యమేనా? చిన్న నాడు మా నారాయణ రెడ్డి అబ్బతో చేసిన వాదమే నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నానా? మనం గత శతాబ్ది మధ్యలో ఎక్కడున్నామో ఇప్పటికీ అక్కడే వున్నామా? మనల్ని అక్కడే వుంచుతున్నదేమిటి?

నా ‘లావా’ కవితా సంపుటి అంటే తనకు చాల ఇష్టమని అంటాడు… కవి, మాణిక్యమ్మ కొడుకు సీతారాం. ఎందుకూ అని అడిగానొకసారి. అందులో ఒక పద్యంలో..

‘పిల్లలు నిద్దర్లు పోయాక ‍
అమ్మలు లీగల్ గా రేప్ చేయబడతారు’

అన్నావు చూడు, అందుకూ అన్నాడు సీతారాం.

సరిగ్గా అందుకే నాక్కూడా నా ‘ఒక్కొక్క రాత్రి’ సంపుటిలో ఒక పద్యం మరీ ఎక్కువగా ఇష్టం. అది:

//స్వభావోక్తి//

ఈ అరుగు మీద
కుక్కి మంచంలో చల్లని బొంత మీద నేను
ఆ అరుగు మీద
కుక్కి మంచంలో పిల్లాడితో బొంత మీద ఆమె
ఆ మంచం పక్కన
గోడకు వాలి కూర్చుని అతడి చిత్రమైన ముఖం
కళ్లంలో ఇంకా తొక్కించని కంకుల కుప్ప
అతడు కాపలాకు వెళ్లాలి కదా ఇంకా వెళ్లడేం
బంగారు దీవి దారిలో రాక్షసుడిని ఎదుర్కొనే
రాకుమారిడిగా మారిపొతూ నిద్దట్లోకి నేను

అంతలోనే మెలకువ ఏదో చప్పడవుతోంది
ఆ అరుగు బండతో తాళం చెవుల గుత్తి గుసగుస
ఒక సారి, ఆగి మరో సారి, కాసేపుండి ఇంకో సారి
‘కల్లానికి పొవ్వా….’ ఆమె గొంతులో విసుగో నిరసనో
‘నిన్న గాక మొన్ననే కద…’ ఆమె గొంతులో కోపమో ఏడుపో
‘మన్సులా బర్రెగొడ్లా నా శాత గాదు…’ ఏమీ కాదది, ఏడుపే
అతడు మాట్లాడడు నిద్దరా పోనివ్వడు ఆమె లేచింది
లేచి ఇంట్లోకి నడిచింది ఆమె వెంట అతడు

లోపల్నించి వాకిలి గడియ పెట్టిన చప్పుడు
ఇంట్లోనూ అరుగులున్నయ్ మంచాల్లేవు పరపుల్లేవు
ఒక పక్క ఎండు మిపకాయల మండె
ఇంకొక పక్క శనక్కాయల సంచులు
ఏం బాగుంటుంది
నా లోపల ఏదో కోసుకుపోతున్న నొప్పి
అలాంటప్పుడు రక్తం బురద బురదగా వుంటుంది

వాకిలి గడియ తీసిన శబ్దం
పాత సామాన్లు అటక మీదికి విసిరేసినట్టు
ఆమె తనను తాను పిల్లాడి పక్క లోకి విసిరేసుకుంది
బిచ్చగాడి బొచ్చెలోంచి అన్నం దొంగిలించిన వాడి వలె
అతడు దిక్కులు చూస్తూ విస విసా కళ్లం వైపు
నాకు నిద్ర లేదు
ఎప్పటి మాట
ఇప్పటికీ నిద్ర లేదు వుండదు
(2-12-1995)
పేజ్: 38, 39. ‘ ఒక్కొక్క రాత్రి’

(వచ్చేవారం ఇంకొన్ని కథలతో)

23-03-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s