పచ్చి పాట

hcu

ఆహా
ఇప్పడు కదా
పదును పిడికిళ్ల
తోరణాల కింద
నువ్వూ నేనూ
రోడ్ల కెక్కి నడవడం
ఎవడి కడుపులో
ఏముందో వాడితోనే
బయటికి కక్కించడం

ఉరేయ్
ఇవి తుపాకులు కాదు
పిడికిళ్లు,
వీటిలో తూటాలు
ఎప్పటికీ అయిపోవు
ఇవి అడవులు కావు
రోడ్లు
రోడ్లు ఎక్కడికీ పోవు
రోడ్ల మీద మనుషులం
ఎక్కడికి కావాలంటే
అక్కడికి పోతాం
ఎవడాప గలడు
ఎవడోప గలడు
ఇన్నాళ్లు అంతా
బాగుందనుకున్నాం
అందరం మంచోళ్లం
అనుకున్నాం కదూ
ఈ పేవ్మెంట్ల
పగుళ్ల కింద
తేళ్లు గూళ్లు పెట్టాయని
చూసుకోలేదు
ఇదిగో చూడు
గట్టిగా నడవడానికి
రెండడుగులు వేసే సరికే
పగుళ్లు కదిలిపోయాయి
ఏమనుకుంటున్నామో
అది చెబుతూ
ముద్దాడాలనిపిస్తే
ముద్దాడుతూ
తప్పు అని అనుకోకుండా
ఒకరినొకరం
యథేచ్ఛగా
ముట్టుకుంటూ
అన్ని అంటరాని తనాల్ని
దూరంగా నెట్టుకుంటూ
బతకుదామని
అనుకున్నాం
ఎండ వానలకు
రాళ్లు కదిలిపోయాయి
బండల కింద
తేళ్లు కూడా కాదు
ఒక్కొక్కటీ
వేయి పడగలున్న
పాములు

ఇప్పుడు
పాములు
మాట్లాడుతున్నాయి
అగ్రులు నిమ్న స్త్రీలతో
పడుకోవచ్చు
రేస్ పురోగమిస్తుంది
నిమ్నులు అగ్రజలను
కోరుకో గూడదు
జాతి సంకరమవుతుంది
ఇది కాదన్నోళ్లను
చంపి ఆపై
శాంతిగా పడుకోబెట్టి కాదు
బతికుండగానే
నిలువు రాటలకు
కట్టి కాల్చాలన్నాడు
మనువు
మనువు మాటలను
కథలు కథలుగా రాశాం
కొత్త కొత్తగా
పురాణాలు కూడా సిద్దం
ఇంతకు మించి
కుయిక్కుమన్నారా, బిడ్డా
లాఠీలు తూటాలు
మీ చేతుల లోంచి
మీ మెడకు చుట్టుకునే
ఉరితాళ్లు రెడీ
ఉరి తాళ్ల తలార్లుగా
అనుభవజ్జ్ఞులయిన
అధికారులు పదే పదే రెడీ
ఆడేది క్రికెట్ అయినా
‘హర హర మహదేవ్’
పాడేది నేషనలాంథమయినా
భారత మాతాకీ జై
కాషాయం కట్టిన వాడికి
మొక్కడానికి నువ్వు వంగు
స్వామికి ఎకరాలిచ్చినోడు
నీ మీద స్వారీ చేస్తాడు

పాములే కాదు
మనుషులూ
మాట్లాడుతారు
ఒరేయ్
ఇప్పుడు ఇది
ఎరుపు కింద దాగిన
యథాతథం కాదు
ఇది
ఎరు పెక్కిన నీలిమ
రక్తం యొక్క
రెండు రంగులూ మావే
మాలో ఒకరు
ఓపలేక ఒరిగిపోవచ్చు
ఇంకొకరు లాఠీలకు
గాయపడవచ్చు
ఇక దాపరికం లేదు
మేము ఏం చేసినా
వీధుల్లోనే
గిరి గీసినా
బరి నిలిచినా
అంతా
సూర్య నేత్రావధానమే
గాయాల నుంచి స్రవించేది
నిరుటి వలె, చీకటి కాదు
కాస్త ఎండ చాల వెన్నెల
ఇక ఏ మరణం రహస్యం కాదు
దొంగ కథలకు లొంగదు
దెబ్బ తగిలే కొద్దీ ఈ దేహాలు
పదునెక్కే కత్తుల అంచులు

22-03-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s