ఎందరో అమ్మలు, అందరికీ వందనాలు

స్మృతి 6

ఇంకొకరికి పెట్టడం అనేది ఇంకొకరి కోసం కాదు తన కోసమే, తాను ఇంకొకరికి పెడుతున్నది తన సంతోషం కోసమే… అని నిరపేక్షిక ప్రేమతో అన్నం పెట్టి ప్రతి స్త్రీ ఒక అమ్మ.

ఏ మనిషికైనా, ఆ మాటకొస్తే  ఏ స్తన్య జీవికైనా మొదటి ఆహారం ఆ విధంగా అమ్మ నుంచి దొరికిందే కదా?!. ఎంత దరిద్రుడికైనా తన మొదటి ఆహారం అమ్మ నుంచి అంత ప్రేమగానే దొరికి వుంటుంది. ఎంత పేద తల్లి అయినా అలా అమిత ప్రేమతో, ఇవ్వడం తన అవసరమై, బిడ్డకు పాలిచ్చి వుంటుంది. ఆహారానికి, అమ్మకు అంత సాన్నిహిత్యం వుంది.   

అమ్మ లాంటి వ్యక్తిత్వం కొందరు మగాళ్లకు కూడా వుంటే వుండొచ్చు. నాకు తెలీదు. నాతో సహా ఏ మగాడిలోనూ నేను అమ్మను చూడ లేదు. నా సంగతి సరే. నేనొక కబుర్ల రాయుడి ననుకుందాం. వంట బాగా చేసే మగాడిలో, చాల సేపు పిల్లలతో గడిపే మగాడిలో, భార్య ఆఫీసుకు వెళిపోతే తను ఇంటి పనులు చూసుకునే మగాడిలో కూడా…. అలాంటి వ్యక్తిత్వాన్ని నేను చూడలేదు. అతడి పనిలో అధికారం, యుక్తి, ప్రదర్శన వుంటాయి. అమ్మ ప్రేమలో ఆ మూడూ వుండవు.

మనిషి మొదటి ఆహారం అమ్మపాలు. ‍

అమ్మపాలు నాకు దొరికినంత బాగా చాల తక్కువ మందికి దొరికి వుంటాయి. మా అమ్మ నాకు నాలుగో ఏడు పూర్తయ్యే వరకు పాలిచ్చింది. ఒక్కడే కొడుకైన మా పక్కింటి సంజిరెడ్డి చిన్నాయ్న, నేను… ఇద్దరం మా అమ్మల వొళ్లలో పైట కొంగుల మాటు నుంచి తలలు బయటికి పెట్టి చూస్తూ పాలు తాగిన దృశ్యం నాకు గుర్తుంది. నాకు నాలుగేళ్లు నిండాక. మా తమ్ముడు, శివుడు పుట్టాక కూడా అమ్మ మీదికి ఎగబడి పాలు తాగి వామిటింగ్ చేసుకున్న తరువాతే మానేశానట.

అది తప్పో ఒప్పో నాకు తెలీదు. జరిగింది మాత్రం అదే. దాని వల్లనే, ఎన్ని తిరుగుళ్లు తిరిగినా నా ఆరోగ్యం బాగుంటోందని నా తమ్ముళ్లు, మరదళ్లు నవ్వుతాలుగా అంటూ వుంటారు.  

నాకు అమ్మ తరువాత ఇంకా చాల మంది అమ్మలున్నారు. అలాంటి అమ్మలు ప్రతి మగవాడి జీవితంలో వుంటారు. నా పదుగురమ్మల గురించి చెప్పడం ఈ వారం ఎపిసోడ్.

నా అమ్మ తరువాత అమ్మల్లో మొదటిది జేజి. మా నాన్న వాళ్లమ్మ. నేను ఆరో తరగతి చేరీ చేరక ముందే అమె చనిపోయింది.

మా కళ్లంలో ఒక పెద్ద వేప చెట్టు వుండేది. చాల పెద్దది. అదీ దాని కొమ్మలు కళ్లం సగభాగం ఆక్రమించేవి. ఎందుకో మా నాన్నకు ఆ చెట్టు కొట్టేసి అక్కడ ఎద్దులకు కొట్టం వేయాలనిపించింది. ఆ పని చేసేశాడు. అలా చెట్టు కొట్టేయడం వల్లనే మా ఇంట్లో అందరి కన్న పెద్దది, జేజి చనిపోయిందని అందరూ నాన్నను కోప్పడ్డారు. అలాంటి సెంటిమెంట్లు చాల మంచివి.  చెట్టును పుట్టను పూజించడంలో ఇలాంటి మతలబులున్నాయి. మనం సంప్రదాయాల్లో సారం తీసేసి కట్టలు వుంచుకుని వాటితో కొట్టుకు చస్తుంటాం.

జేజి వున్నంత కాలం, పొద్దున నిద్దర్లేవగానే కవ్వం దగ్గర తను, కండ్లు నులుముకుంటూ నేను తయారు. కంచు లోటా నిండా కాను (వెన్న తీయని మజ్జిగ) తో నాకు ఆ రోజు షురూ. కాసేపున్నాక తనే… జొన్నరొట్టె తగినంత వెచ్చగా వుండగానే దాని మీద ఇంత మందం వెన్న పూసి ఇచ్చేది.

ఆ రుచి ఇక దేనికీ రాదు. అందుకే ఇప్పటికీ నాకు వెచ్చని జొన్న రొట్టె అన్నా, వెన్న అన్నా విపరీతమైన ఇష్టం. హైదరాబాదులో ఏ ఇంట్లోంచైనా రొట్టె కొట్టే చప్పుడు వినిపిస్తే అక్కడ కాసేపు ఆగిపోతుంటాను.

అప్పడు మా ఇంట్లో నేనొక ప్రసిద్ధి పొందిన వెన్న, మీగడ దొంగని. ఇంట్లో వుట్టి మీద పెరుగు కుండను బతకనిచ్చే వాడిని కాదు. ఏది దొరికితే అది ఎత్తు వేసుకుని వుట్టి మీద పాల కుండ లోంచి మీగడ చేత్తో తీసి తినేసే వాడిని. నా బాధ పడలేక పెరుగు కుండను దేవుడి గూటిలో పెట్టి, ఆ గూటికి తాళం వేసే వారు. వాళ్లు తాళం వేయడం మరిచిపోయి అందుకు తగిన మూల్యం చెల్లించిన సందర్భాలు బాగానే వున్నాయి.

ఒక రోజేం జరిగిందో తెలుసా?

అప్పటికి మా జేజి చనిపోయిందనుకుంటాను. అమ్మ ఇంట్లో లేదు. గడ్డికి పొయ్యంది. ఇంట్లో మా చిన్నత్తా నేనే. చిన్నత్త చూడకుండా ఇంట్లోకి వెళ్లి ఏదో ఎత్తు పీట వేసుకుని పెరుగు కుండ లోంచి మీగడ తీసేసుకున్నాను. కాస్త తిన్నానో లేదో, చేతిలో మీగడ వుండగానే చిన్నత్త వంటింట్లోకి వస్తున్న అడుగుల చప్పుడు. ఏం చేయాలో తోచలేదు. చెయ్యి కడుక్కోడం అప్పటికప్పుడు కుదరరదు. వెళ్లి మంచినీళ్ల కాగులో చెయ్యి పెట్టి విదిలించేశా. అత్తకు అర్థమయ్యింది. కాగులో చూస్తే, మంచినీళ్లు ఖరాబు. మా వూళ్లో మంచినీళ్లు కావాలంటే అంత దూరం వాగు దగ్గరికి వెళ్లి భుజం మీద కడవల్లో తెచ్చుకోవాలి. అత్తకు కోపం వచ్చి కొట్టింది చూడూ. భలే కొట్టింది. నిన్న మొన్నటి వరకు చిన్నత్త మా ఇంటికి వస్తే చాలు ఆ కథ చెప్పుకుని భలే నవ్వుకునే వాళ్లం. ఆ రోజు మా ఇంటి మంచినీటి అవసరాలు ఎట్టా తీరాయో?! మీగడ కలిసిన నీళ్లే కదా, ఏం కాదని అవి అట్టాగే వుపయోగించామనుకుంటా.

ఇంకో అమ్మ కొండ మీద బొల్లవరంలో లక్ష్మీదేవి పిన్ని. స్కూలు నుంచి వచ్చి వాళ్లింటికి వెళ్తే, అడిగి మరీ పప్పు రొట్టె ఇచ్చేది. అది వెచ్చని రొట్టె కానక్కర్లేదు. ఎండిపోయిన రొట్టె అయినా సరే మజ్జిగలో కాసేపు నానబెట్టి మెత్తబడ్డాక దాని మీదే పప్పు పెట్టి ఇచ్చేది. రొట్టె లేకుంటే వూరుకునేది కాదు. ఆర్కల తో చేసిన అన్నం పెట్టేది. అదేంటో నేను జొన్న సంకటి, కొర్ర అన్నం… మా ఇంట్లోనే గాక చాల చోట్ల తిన్నాను గాని, ఆర్కల అన్నం ఆ పిన్ని దగ్గర తప్ప మరెక్కడా తిన లేదు. ఆర్కలు కొర్రల్లాగే సన్నగా వుంటాయి గాని, నలుపు రంగులో వుంటాయని గుర్తు. చాల రోజులయ్యింది వాటిని చూసి. ఆకలి వల్ల కావొచ్చు, పిన్ని లోని అమ్మతనం వల్ల కావొచ్చు అప్పుడు ఆ ఆర్కల అన్నం భలే వుండేది. లక్ష్మిదేవి పిన్ని, ఆ విధంగా పెళ్లి కాకుండానే అమ్మ అయ్యింది, నాకు.

అప్పుడు కాదు గాని, ఆ మరుసటి ఏడాది తెలిసింది ఆకలి అంటే ఏమిటో, ప్రేమగా దొరికే అన్నం అంటే ఏమిటో.

ఆరో తరగతి తరువాత ఎందు వల్లనో ఇక నన్ను కొండమీద బొల్లవరంలో మామ వాళ్లింట్లో వుంచడం వద్దులే అనుకున్నారు. ఏడో తరగతికి నా స్కూలు అదే గాని, మకాం మారిపోయింది, గడివేములకు.

గడివేములలో అప్పుడు రెండు హోటళ్లుండేవి. ఒకటి మైసూరయ్య హోటల్. రెండవది వుడిపి హోటల్. ఉడిపి హోటల్ లో నా భోజనం. నెలకు పదిహేను రూపాయలు. పొద్దున ఒక దోసె లేక దానికి సమానమైన బ్రేక్ ఫాస్ట్. మిగిలిన రెండు పూటలా భోజనం.

మరి రాత్రి ఎక్కడ నిద్దరోవడం? ఎక్కడంటే అక్కడే! ఎవరి ఇంటి అరుగు మీద వుండనిస్తే ఆ అరుగు మీదే. ఆ అరుగు మీది గూటిలోనే నా పుస్తకాల రేకు పెట్టె పెట్టుకోడం. దానిలోనే ఒకటి రెండు జతల బట్టలు. అంతకు మించి వస్తువులేం వుండవు.

అమ్మలు ఎంత ప్రేమ మూర్తులో అంత నిస్సహాయలు అనడానికి పనికొచ్చే కథ ఒకటి ఇక్కడ చెప్పాలని వుంది.  

గడివేములలో కొన్నాళ్లు నా క్లాస్ మేట్ రఘు అనే కోమట్ల పిల్లాడి ఇంటరుగు మీ పడుకునే వాళ్ల, నేనూ సుగాలి తాండా నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే నా సీనియర్ సుగాలి రాముడు. ఓ రోజు వుదయం నిద్ర లేచే సరికి ఆ ఇంట్లో అంతా గంభీరంగా వుంది. కాసేపటికి రాముడు చెప్పాడు. ఆ ఇంట్లో ఏదో చిన్న వస్తువు పోయిందిట. మేము తీశామేమో అని ఇంటి వాళ్ల అనుమానం. అది రాముడి ఉవాచ. నిజమేమిటో తెలియదు. నాకు చాల భయమేసింది. తరువాతేమవుతుందో తెలియదు. నేను వున్న ఫళాన నడుచుకుంటూ బయల్దేరాను. కనీసం ఇరవై మైళ్లుంటుంది మా వూరు. నడుచుకుంటూ మా వూరు చేరే సరికి మధ్యాహ్నమయ్యింది. ‍అమ్మకు సంగతి చెప్పాను. తను ఏమీ అనలేదు. కాళ్లు కడుక్కు రమ్మని చెప్పి అన్నం పెట్టింది. తింటుండగా నాన్న వచ్చాడు.

నేను ఎందుకు వచ్చానో అమ్మ చెప్పింది. అంతే నాన్న అగ్రహోదగ్రుడయ్యాడు. దొంగతనం గింగతనం ఏం లేదు, అది నేను చెప్పే కత, నేను బడి ఎగ్గొట్టి వచ్చానని అరవడం మొదలెట్టాడు. అప్పుడే చేని నుంచి రావడం వల్ల చేతిలో ఎద్దులను తోలే ముల్లుగర్ర వుంది. ఆలసటతో ఎర్ర బడిన కన్నులు. ఆ కన్నుల వెనుక ఇంకేవేవో ఫ్రస్ట్రేషన్లు. ముల్లు గర్ర ఎత్తి కొట్టం మొదలెట్టాడు. నేను తినడం ఆపేసి, లేచి, ఏడుస్తో తిరిగి బయల్దేరాను. అమ్మ వైపు నేను దీనంగా చూస్తే, ‘ఇదంతా అన్యాయమే, నేనేం చేయలేను’ అన్నట్లు అమ్మ చూసిన బేల చూపు.  

‘బువ్వ దిని పోనీలే’ అన్నదొక్కటే ఆమె గొంతు పెగిలి వచ్చిన మాట. తన కళ్లలో వేయి సముద్రాలు. నేను అలాగే ఏడుస్తో తిరిగి నడుస్తో గడివేముల చేరాను. అప్పటికి అక్కడ దొంగతనం చర్చలు ఏమీ లేవు. సుగాలి రాముడిని నేను అడగనూ లేదు. బహుశా అదంతా అతడి కల్పన కావొచ్చు. పిల్లలు అలాంటి కల్పనలు చేస్తుంటారు. తమ కంటే చిన్న వాళ్లను ఏడిపిస్తుంటారు. అది మామూలే. కాని ఆ రోజు నాన్న కళ్లలోని ఫ్రస్ట్రేషన్, అమ్మ నిస్సహాయమైన కన్నీరు ఎప్పటికీ మరుపు రావు.

ఇక్కడే మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి.

విషయం చిన్నదే గాని, అప్పుడు నేను మరీ చిన్నాడిని కదా? నాకు నిద్దట్లో పాస్ పోసుకునే ‘జబ్బు’ వుండేది. ఊళ్లో మా ఇంట్లో వున్నంత వరకు దాని వల్ల పొద్దున్నే తిట్లు, చీవాట్లుండేవి. అంతే. వేరే వూళ్లలో వుండాల్సి వచ్చే సరికి ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. కొండ మీద బొల్లవరంలో అత్త బాగా తిట్టేది. అయినా ఆ జబ్బు పోలేదు.

గడివేములలో వేరే వాళ్ల అరుగుల మీద. రాత్రులు పక్క సాంతం తడిసిపోయి, దాన్నేం చేయాలో తెలీక లేచి కూర్చునేది.  లేదా పక్కను వదిలేసి, బండ మీద పడి నిద్రయేది. అలా నిద్ర లేచి, ఒక్కడినే కూర్చుని లోలో ఏడ్చిన రాత్రులు గుర్తుకొస్తే, పాపం ఆ పిల్లాడి మీద చెప్పరాని జాలి, దిగులు వేస్తాయి ఇప్పటికీ నాకు

నన్ను ఆ ‘జబ్బు’ నుంచి బయట పడేయడానికి అమ్మ బాగానే ప్రయత్నించింది. ఒక సూఫీ సాధువుతో మం త్రం వేయించి, రాగి రేకు కట్టించింది కూడా. ఎవరో చెబితే, చాటలో జొన్నలు పోసి, వాటిలో నాతో పాస్ పోయించి, ఆ జొన్నలతో పేలాలు చేసి నాతో తినిపించింది. (మొరార్జీ మాటలు వినక ముందే నేను ఆయన చెప్పిన ఔషధం సేవించానన్నమాట). అయినా ఆ జబ్బు పోలేదు.

నాకిప్పుడనిపిస్తుంది. ఆ జబ్బు మరేమో కాదు, నాలోని అతి స్వాప్నికుడేనని. నిద్రలో మూత్రం వచ్చిన విషయం తెలిసేది. నేను పక్క మీది నుంచి లేచి వెళ్లినట్టు, పక్కన ఎక్కడో మీగాళ్ల మీద కూర్చుని పాస్ పోస్తున్నట్టు కల గనే వాడిని. పాస్ పోస్తున్నప్పటి భౌతికమైన హాయి ఫీలింగ్ కూడా కలిగేది. కాసేపటికి తడిసిపోయిన పక్క చల్లగా తగిలి మెలకువ వచ్చేది. అసలు జరిగేదేమిటంటే, నేను పక్క మీది నుంచి లేచి వెళ్లడం, మీగాళ్ల మీద కూర్చోవడం కల. మిగిలిందంతా నిజం. అదీ సంగతి.

ఇలా కల, నిజం కలగలసి పోవడం నాకు చాలసార్లు చాల విషయాల్లో అనుభవమయ్యింది. ఎంతో కొంత మీకూ అనుభవమయి వుంటుందనుకుంటాను.

గడివేములలో అలా ఇతర్ల ఇంటరుగుల మీద నిద్రపోతూ రాత్రులు లేచి తడిసిన పక్క పక్కన  కూర్చుని ఒక్కడినే ఏడ్వడం కొన్ని సార్లయ్యాక…. బహుశా ఆ వొత్తిడి వల్లనేనేమో… ఆ జబ్బు పోయింది. ఏడో తరగతి మధ్యలో ఎప్పుడో దాన్నుంచి విముక్తుడిని అయిపోయాను.  

గడివేములలో వుండగా నా అసలు సమస్య తిండి. ముఖ్యంగా పొద్దున. ఒక్క దోసె. పెద్దదే గాని, నాకు అస్సలు చాలేది కాదు. ఆ ఏడాది మధ్యలో కొన్నాళ్లు నరసింహా రెడ్డి అని క్లాస్ మేట్ ఇంటి అరుగు మీద నిద్రపోయే వాడిని. పొద్దున్నే నేను నా హోటల్ నుంచి దోసె తెచ్చుకుంటే నరసింహా రెడ్డి తన ఇంట్లోంచి ఒక జొన్న రొట్టె తెచ్చే వాడు. తనకు హోటల్ దోసె తినాలని వుండేది. ఇద్దరం మారుబేరం చేసుకుని తినేసే వాళ్లం. నా దోసె చట్నీతనకు, తన రొట్టె పప్పు నాకు.

ఎప్పుడేనా మధ్యహ్నం అన్నం తినాలనిపించకపోతే రెండు ప్లేట్ల కేసరీ బాత్ ఇచ్చే వాడు వుడిపి అయ్య. ఆ ఏర్పాటు నాకు భలే నచ్చేది. ఓసారి మా అమ్మ మా జీతగాడితో బండి కట్టించుకుని బొల్లవరం వెళ్తూ గడివేములలో నా కోసం ఆగింది. అమ్మొచ్చిందని సంబరం. ఆ మద్యాహ్నం రెండు ప్లేట్ల కేసరీ బాత్ తీసుకుని అమ్మ దగ్గరికెళ్లాను. ఒక ప్లేటు అమ్మకు ఇచ్చి, ఇంకోటి నేను తిన్నాను. అది గుర్తు చేసుకుంటే అలాంటి ఐడియా వచ్చినందుకు ఆ పిల్లాడిని ఎంత అభినందిస్తానో.

ఆ ఏడాది చివరి మూడు నెలలు, హోటల్ కు దూరంగా, వుడిపి అయ్య ఇంటికి దగ్గర్లో నా క్లాస్ మేట్ ఇస్మాయిల్ ఇంట్లో వున్నాను. ఇస్మాయిల్ వాళ్ల నాన్న గడివేముల పోలీస్ స్టేషన్ హెడ్డు. ఆయన భార్య, పేరు గుర్తు లేదు, నా మరో అమ్మ. బొల్లవరం లక్ష్మీదేవి తరువాత పరిచయమైనప్పటికీ, నాకు మా సొంతమ్మ తరువాత అమ్మ అంటే ఆమే.

ఎవరి పిల్లవాడో కదా అని ఆమె అనుకునేది కాదు. ఇస్మాయిల్ ఎంతో నేనూ అంతే తనకు. నన్ను వొళ్లో కూర్చోబెట్టుకుని పేలు చూసింది. వాళ్ల బట్టలతో పాటు నా బట్టలు ఉతుక్కు వేసి తీసి పెట్టింది. వాళ్ల జాలాడిలోనే నేనూ నీళ్లుపోసుకున్నాను ఒకటి రెండు సార్లు. నేను తినేది హోటల్లోనే అయినా, వాళ్లింట్లో ప్రత్యేకం ఏం వండుకున్నా నాకు పెట్టకుండా తినే వాళ్లు కాదు.

రోజూ పొద్దున్నే నేనూ, ఇస్మాయిల్ గడివేముల ఈ మూల నుంచి ఆ మూల దాటి వాగుకు వెళ్లి స్నానం చేసి, ఈత కొట్టి వచ్చే వాళ్లం. దారిలో హోటల్. నేను నా దోసె తెచ్చుకునే వాడిని. ఇంటికి వచ్చాక ఇద్దరం కూర్చుని అమ్మ పెట్టినవి కూడా తినే వాళ్లం.

ఒక రోజు పండుగ. పండుగ ముస్లిములదో, హిందువలదో మరి. అందరం కలిసి భోంచేశాం. హెడ్డుగారు, ఆయన యూనిఫామ్ లోనే కూర్చున్నారెందుకో. నేను తినడం నిదానించానో ఏమో….

‘ఈ మాంసం నువ్వు తినొచ్చు. నువ్వు తినేదేలే” అందామె నా తల నిమురుతూ. వాళ్లు ముస్లిములు కదా బీఫ్ అని హెజిటేట్ చేస్తున్నానేమో, అదేం కాదని చెప్పడమది. సందేహం తీర్చి నేను మంచిగా తినేలా చెయ్యడమున్నూ.

ఇస్మాయిల్ వాళ్లు ఇఫ్పుడెక్కడున్నారో ఏమో. ఆ మధ్య గడివేముల వెళ్లినప్పుడు వాకబ్ చేస్తే ఇస్మాయిల్ కూడా పోలీసు డిపార్ట్మెంటులోనే చేరినట్టు చెప్పారు.

ఆమె ముఖం నాకు గుర్తు రావడం లేదు. చామన చాయగా మెరిసే ఆమె పాదాలు, పాదాల మీద తెల్లని వెండి పట్టీలు మాత్రం గుర్తున్నాయి.

అందరిలాగే నాకు అమ్మ అంటే ఇష్టం. అమ్మతనమంటే ఇష్టం.

మా ఆవిడ, జయ అప్పుడప్పుడు నన్ను కోప్పడుతుంటుంది, తను మా అమ్మ అని నేను గారాలు పోయినప్పుడు.

ఇది ఆడవాళ్ల శ్రమను దోచుకునే ఒక ఎత్తుగడ అంటుంది జయ. ఆమె చెబుతున్నది అబద్ధం కాదు. అమ్మతనాన్ని ఎక్స్ ప్లాయిట్ చేయడం వుంది. దాని మీద స్త్రీ వాదుల విమర్శతో ఏకీభవించాల్సిందే.

అయినా ఒక గొప్ప గుణంగా అమ్మతనం అనేది వుంది. ఆడ, మగ… అందరం అలవర్చుకోవలసిన గొప్ప గుణం.

అమ్మతనాన్ని అమ్మలు వద్దనుకుంటే ఇక లోకానికి దిక్కెవ్వరు? అలాగని అది అమ్మల భారం మాత్రమేనా? మగవాళ్లు, అమ్మలు కాని వాళ్లు కూడా అమ్మతనం భారాన్ని పంచుకోకపోతే అమ్మతనం ఈ లోకంలో ఎంతో కాలం నిలవదు. ఈ మాత్రం నివాస యోగ్యంగానైనా లోకం ఎంతో కాలం నిలవదు.

16-03-2016.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s