దగ్ధ కవిత

స్మృతి 5

(This is a column స్మృతి I have started in a group called Kavisangamam in Face Book.The following was the column that appeared last Thursday there. I will be posting today’s column next week in the same way as it is being done now.) 

నేను రాసేది నాకు తెలిసిందై వుండాలి. అది నా బాధై వుండాలి. బాధకు సామాజిక కారణాలుండాలి. కారణాలు చెప్పే కొద్దీ కొందరికి కోపం రావాలి. వాళ్లు నన్ను కోప్పడాలి. ఆ కోపం నాకు ఇష్టం. నా వ్రాతలో బలం వుందనడానికి… దానికి మండే గుణం వుందనడానికి…. వాళ్ల కోపం మొదటి రుజువు. ఇలా కోపాలు తెప్పించడం మంచి పని అనుకునే వాడికి, ఇక ఎలాంటి సత్కారాలుంటాయి? అలాంటి సత్కారాలు ఓ కవిగా, రచయితగా నాకు బాగానే దొరికాయి.  

‘ఏం రాసినా ఏం చెప్పినా పాజిటివ్ గా వుండా’లంటారు. అది మంచి నీతి కాదు. అది ఆరంభంలోనే అబద్ధానికి పట్టాభిషేకం. అసలు సంగతేంటంటే, నా బోటి వాడికి ఒకే సారి  ‘పాజిటివ్’ గానూ, ట్రూత్ఫుల్ గానూ వుండడం కుదరదు. పాజిటివ్ గా వుండి వుంటే నా దృష్టిలో నేనెప్పడో చచ్చిపొయ్యుండే వాడిని. నెగటివ్లకు నెగటివ్గా నిలబడడం వల్లనే బతికున్నాను.

నాకే కాదు, ఈ తలకిందుల లోకంలో, సత్యాన్వేషులెవరికీ అలాంటి సకారాత్మకత మంచిది కాదు. ప్రతి మంచి కవీ ప్రాథమికంగా తిరుగుబాటు దారుడే. ఉన్నది బాగో లేదని తిరు గబడిన వాడే. మంచి ఉయ్యాల పాటలోనూ ఒక ఫిర్యాదుంటుంది, చూడండి. J.  

గత వారమంతా వేరే ఇంకేవో పనుల్లో వుండిపోయాను. ఓ వ్యాసం, ఓ కథ రాసేశాను. అవి ఒక పట్టాన కుదర్లేదు. రెండు మూడు సార్లు తిరుగ రాయాల్సి వచ్చింది. ఇవి కాకుండా మరో మంచి పని కూడా చేశాను. ‘రిలిజియన్’ మీద మార్క్స్, ఎంగెల్స్ రచనల సంపుటి (పాత సోవియెట్ ప్రచురణ) చదవడం మొదలెట్టాను. వ్యాసాల్ని అనువదించే వుద్దేశంతో చదివాను. రాయడంలో, రాయడం కోసం చదవడంలో ఒక వేదన వుంటుంది. అదే నన్నిలా తొలి తొలి వ్రాతల కాలానికి తీసుకుపోయింది. ఇప్పుడు అక్కడి నుంచే మాట్లాడుతున్నా.  

తలముడిపి హైస్కూలులో చదువుకుంటున్నప్పుడు, ఇంకా సత్రాల నుంచి పక్కా బిల్డింగ్ కు మా స్కూలు మారక ముందు, నేన్రాసిన ఓ కవిత గురించి, దానికి గాను నాకు దొరికిన సత్కారం గురించి మొదట చెప్పాలి.

కథ, కవిత… డక్కి కథ, చందమామ కథలు కూడా కాదు…, ఇవాళ అందరూ దేన్ని పెద్దాళ్ల కథ, కవిత అంటారో అవి కూడా… నాకు ఆరు, ఏడు తరగతుల్లోనే పరిచయమయ్యాయి. బహుశా మీకూ అలాగే అయ్యుంటుంది.

కొండమీది బొల్లవరంలో ఒక పిన్ని వుండేదని, ఆకలేస్తోందా అని అడిగి నాకు పప్పు రొట్టే ఇచ్చేదని చెప్పాను కదూ. అమె పేరు లక్ష్మి దేవి. నా కంటె బాగా పెద్దది. అప్పటికింకా ఆమెకు పెండ్లి కాలేదు. కాలక్షేపానికి గడివేముల నుంచి  ఆంద్ర పత్రిక (వార పత్రిక) తెప్పించుకుని చదివేది. ఆ పత్రికలో నాకు బాగా నచ్చిన ఐటమ్ పేజీ పేజీకి మూలల్లో వుండే జోకులు, కార్టూన్లు. అందులో కొన్ని కథలు, కవితలు, సీరియల్స్ కూడా చదివాను. మొదటి సారి రంగనాయకమ్మ నవల ‘స్త్రీ’ ఆ రోజుల్లోనే చదివానని బలమైన నమ్మకం. ఇంకో  సీరియల్ నవల సులోచన రాణిదో మరెవరిదో.

అప్పుడు చదివిన ఒక సీరియల్ లో ఒక చోట… ప్రేయసీ ప్రియుల మధ్య సంభాషణలో… పార్కులో గడ్డి పరక కొరుకుతూ కూర్చున్న ఆమెను అతడు ఆవుతో పోల్చితే ఆమె అతడిని ఆంబోతుతో పోల్చుతుంది. ఆ జోకులకు ఇద్దరూ నవ్వుకుంటారు. అది చదివి, అదేంటీ అని నాలో కలిగిన వ్యతిరేక భావన ఇంకా గుర్తుంది.

తలముడిపి స్కూలులో…. నా క్లాసు మేట్లలో ఒకబ్బాయి పేరు రాజేశ్వర రావు. అతడిది కూడా తలముడిపి కాదు. మా వూరికి తలముడిపికి మధ్యలో వుండే మంచాల కట్ట. కరణం కొడుకు, మేము మా వూరి నుంచి బయల్దేరి మంచాల కట్ట మీదుగానే తలముడిపికి రావాలి.

రాజేశ్వర రావు నా పక్కనే నా డెస్కులోనే కూర్చునే వాడు. ఒక రోజు ఏమయ్యిందో ఏమో రాజేశ్వర రావు నన్ను ‘సూద్దరోడా’ అని తిట్టాఢు. (అది తిట్టా, నేను శూద్రుడినే కదా? ఏమో, తను తిట్టుగానే అన్నాడు, నేను అలాగే తీసుకున్నాను.). నాకు రోషం పొడుచుకొచ్చింది. డెస్కు మీద తెరిచి వున్న నోట్ బుక్కు లో ఫట్ మని ఒక కవిత రాసేశాను. రాశాక రోషం సంగతేమో గాని నాకు భలే సంతోషం వేసింది. కాగితం చించి తనకే ఇచ్చాను చదవమని.  ఆ కవిత ఇప్పుడు నా దగ్గర్లేదు గాని, దానిలో కంటెంట్ గుర్తుంది. నన్ను సూద్దరోడా అన్నావు, బాపనోళ్లు గొప్పేం కాదు. బయటికి శాకాహారం అంటారు, చాటుగా మాంసాహారం తింటారు, ఏం గొప్ప అని. (అయ్యా, ఇక్కడ నాతో హేతువాదం ఒద్దు, నేన్రాసింది అదే).

రాజేశ్వర రావు నన్నేమీ అనలేదు. దాన్ని తీసుకుని గప్ చుప్ బయటికి వెళ్లాడు. రాఘవయ్య అనే మా సారుకు ఇచ్చాడు. రాఘవయ్య సారు మా క్లాస్ టీచరు. ఆ పిల్లాడికి చిన్నాన్న. రాఘవయ్య సారు నన్ను పిల్చి ఇది రాసింది నువ్వేనా అని అడిగాడు. ‘అవ్, సార్’, అన్నా. ‘ఎట్టా రాశావు రా, రాయడం నీకెట్టా వచ్చింది’ అని మెచ్చుకుంటాడనుకున్నా. ఆయన అలా ఏం చేయలేదు. చెయ్యి చాపమని ఈత బెత్తంతో అరిచెయ్యి కందిపొయ్యేలా కొట్టాడు. వాతలు తేలాయి.

ఇప్పుడు అది గుర్తొస్తే నాకు దుఃఖం అనిపించదు. అది నా మొదటి కవిత, అది నా మొదటి సత్కారం అనిపిస్తుంది. రెండో సత్కారం ఎమర్జెన్సీ  చెర. రెండూ నాకు అర్హమైన సత్కారాలే అనుకుంటాను.

రామ రావణ యుద్దం గురించి ఎవరో చెప్పగా విన్నాను. రావణుని రొమ్ము మీద రెండు మూడు బాణాలు గుచ్చుకున్నాయట. అవి అడ్డదిడ్డంగా గుచ్చుకోవడం ఆయనకు నచ్చ లేదట. తరువాత రాబోయే బాణాలకు అనుగుణంగా తన రొమ్ము చాచి, బాణాలన్నీ కలిసి అందంగా ఒక నక్షత్రంలా కనిపించేట్టు చేసుకున్నాడట. తన రొమ్మున తూణీర నక్షత్రాన్ని గర్వంగా చూసుకున్నాడట. భలే స్పిరిట్ కదా?! ఆ ‘స్పిరిట్’ నేనూ ఒకింత తాగానుకుంటాను.

ఆ రోజుల్లో మాకు సైన్సు రికార్డు అని వుండేది. దానిలో మేము చేసినవో, చేస్తున్నట్టు వూరికినేనో సైన్సు ప్రయోగాలు రాయాలి. ఓ సారి నేను రికార్డు రాసుకు రాకుండా స్కూలుకు బయల్దేరాను. క్లాస్ మేట్లు మునాఫ్, చౌడీశ్వర రెడ్డి రాశారు. (చౌడీశ్వర రెడ్డి చేతి వ్రాత చాల అందంగా వుండేది, అంత అందమైన చేవ్రాలు తరువాతెక్కడా నేను చూడలేదు). కాసేపుంటే మంచాల కట్ట వస్తుందనగా వాగు ఒడ్డున కంది చేనిలో నడుస్తూ ఆ సంగతి గుర్తు చేసుకున్నాం. బడికి వెళ్తే ఈశ్వర రెడ్డి సారు బెత్తం విరగ్గొడ్తాడు, ఎండలో నిలవెడ్తాడు. ‘నేను ఇక్కడే వుంటా, మీరు బడికి పోయి వచ్చేటప్పుడు మీతో కలిసి ఇంటికొస్తా’ అని చెప్పి ఆ చేనిలో కంది చాలు నీడన వుండిపోయాను. నా డ్రాయింగు బుక్కులో ఓ కథ రాశాను. రాము, సీత అని ఇద్దరు పిల్లలు పొరపాటున విమానం ఎక్కబోయి రాకెట్టు ఎక్కి దాని మీటలు తిప్పే సరికి రాకెట్విమానం రోదసి లోకి వెళిపోతుంది. పైకి పోయే కొద్దీ వేడి పెరుగుతుందని, గాలి తగ్గుతుందని ఇలాంటివేవో రాస్తూ డ్రాయింగు బుక్క నిండుగా కథ లాగాను. అది నా రెండో రచన.

వావ్, కవిత, కథ… మన వాడు ఉభయ ప్రక్రియా ప్రవీణుడు కదూ?! J J

మా వూళ్లో విజయాత్రేయ గురించి చెప్పాను కదా? ఆయన బామ్మర్ది (భార్య తమ్ముడు) పేరు శ్రీరామ్. నా కన్న పెద్ద వాడు. తను గని కి వచ్చినప్పుడు నవలల మీద నా అసక్తిని మెచ్చుకునే వాడు. నేనూ రాయగలనని శ్రీరామ్ కు చెప్పాలనిపించిందొక సారి, ఎనిమిదో తరగతి చివర్లో. ఆ రాత్రి ఇంట్లో ఓ నవల ఒక ఛాప్టర్ రాసి తీసుకెళ్లాను. మా గుమ్మడి కొండ మీద రాతి బండ మీద ఒక పెద్ద పగులు వుందట. (పగులు నా కల్పన). పూర్వం మా వూరి మీదికి ఎవరో దండెత్తి వస్తే భీముడు అనే అబ్బాయి వాళ్లను ఎదిరించి పోరాడడట. ఆ పోరాటంలో అతడి గద వెళ్లి కొండ మీద పడిందట. దాని వల్ల ఏర్పడిన పగులు అలాగే వుండిపోయిందట. తరువాతి చాప్టర్లలో ఆ యుద్దంలో ఎవరు గెల్చారు, ఎవరు ఓడారో రాయాల్సి వుండింది. నేను రాయలేదు. కాని, ‘అరె, నీకు రాయడం వచ్చు’ అని శ్రీరామ్ మెచ్చుకోడం మాత్రం గుర్తుంది. ఆ తరువాత తనకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సీటొచ్చింది. మేం కలుసుకోలేదు. కలిస్తే నా పుస్తకమేదైనా తనకు ఇవ్వాలని భలే ఇదిగా వుంది.

ఇపుడొక చిన్న జోకు. మొదట్లో విజయాత్రేయ మాదిరి నేను కూడా చందోబద్ధ పద్యాలు రాయాలనుకున్నాను. క్లాసులో చెప్పక ముందే కొన్ని పద్యాల ఛందస్సు విరివింటి వెంకటశ్వర్లు అనే పురోహిత బ్రాహ్మణుడి వద్ద నేర్చుకున్నాను. కొన్ని పద్యాలు రాశాను కూడా. కాస్త సులభం కనుక సీసపద్యం. దానితోపాటు ఆటవెలది లేదా తేటగీతి కిట్టించి నా భజం నేను తట్టుకునే వాడిని. నేను హైస్కూల్లో వుండగానే ఓసారి మా వూరిలో నాటకం వేయడానికి బుర్రా సుబ్రమణ్య శాస్త్రి వచ్చారు. రాత్రి ఆయన వేసిన స్త్రీ వేషం… మోహిని అనుకుంటాను.. చూసి నేను సాంతం పడిపోయాను. పొద్దున చూస్తే తను స్త్రీ కాదు. అద్భుతంగా నటించిన పురుషుడు. నాకు అబ్బురం అనిపించింది. నా గ్రాఫు బుక్కులో కాగితం చింపి చాతనయినంత అందమైన అక్షరాల్లో సీసపద్యం, ఆటవెలది రాసి ఆయనకు ఇచ్చాను. ఆయన బాగుంది అన్నట్టు చూసి ఊరుకున్నాడు. ఆయన వెళ్లిపోయిన తరువాత సుందర రావు గారు నవ్వి ‘పద్యం బాగానే రాశావు రా కాని శాస్త్రిని ‘కంతునిల్లు’ అని పొగిడావు’ అన్నాడు. మన్మథుడు అత్యంత సుందరుడు కదా అతని ఇల్లు చాల గొప్పగా వుంటుంది కదా అని రాశాను. సుందర రావు చెప్పిన తరువాత కూడా ‘ఆఁ అయ్య అట్టానే అంటాడులే’ అనుకున్నాను. ఎప్పడో శ్రీనాధుని చాటువులో ‘మదనుని కొంప ఒక చెంప కానుపింప’ అనే వాక్యం చదవి… అయ్యో ఆ మహా నటుడిని అలా అన్నానేమిటి అని భలే నొచ్చుకున్నాను. J

 కవితకు సత్కారంగా వాతలు రాఘవయ్య సారు బెత్తంతో అయిపోలేదు. ఇంకా వున్నాయి.   

తొమ్మిదో తరగతి మధ్యలో అనుకుంటా ఒక రోజు స్కూలు నుంచి ఇంటికి వచ్చే సరికి మా ఇంటి అరుగు మీద నాన్న, చిన్నాన్న కూర్చుని వున్నారు. ‘ఒర్యా ఇట్రా రా’ అని పిల్చారు. నేను పుస్తకాల సంచి గూట్లో పెట్టి వచ్చాను. నాయిన నా లెక్కల నోట్ బుక్కు తన వెనుక నుంచి తీసి నాకు చూపించి ‘ఇదేంది?’ అని అడిగాడు. పరిస్థితి గంభీరంగా వుంది. నేను వూరుకున్నాను. అదేమిటో నాకు తెలుసు. లెక్కల పుస్తకంలోఅడ్డంగా పెద్ద లైన్లు రాయడానికి బాగుంటుందని, లెక్కలకు బదులు కవిత్వం కథలు రాసుకుంటూ వుండినాను,

“బరగొడ్లు గాయడానికి పంపకుండ బడికి పంపిచ్చె నువ్వు ఏం జొచ్చొండావురా. ఏంటివివి?”

“…… …… …… “

“బడికి వొయ్యి పుస్తకాలు సదువుకుంటొండావులే అనుకుంటొండాం. నువ్వు…. “

“…… ……. ……. “

“ నువ్వు కాపోనివా బాపనోనివా?”

మొట్టమొదటి సారి అలాంటి ‘తిట్టు’ఒకటి వుంటుందని నాకు అర్థమయ్యింది. కవిత్వం కథల వంటివన్నీ బ్రాహ్మణులకే, కాపోల్ల పిల్లలు క్లాసు పుస్తకాలూ చదువుకుని పరీక్షలు పాసయి బతుకు తెరువు మాత్రమే చూసుకోవాలి లేదా బర్రెగొడ్లు కాసుకోవాలి.. అనేది అర్థమయ్యింది కూడా అప్పుడే. “ఇంగొక సారి ఇట్ట జేస్తే కొడుకా చొల్కాల తెగుతాది సూడు. ఈడ నేను గుద్ద జీల పన్జేసి బడికి పంపిచ్చొంటే నువ్వు జేసే గన కార్యాలియా?” అన్నాడాన, తన తమ్ముడు వెంట రాగా, ఆ పుస్తకం పట్టుకుని ఇంట్లోకి నడిచాడు. నేనూ తన వెంట వెళ్లాను నా పుస్తకం తీసుకుందామని. ఆయన నా కవిత్వం కథల మొదటి పుస్తకాన్ని పొయ్యిలో పెట్టి అది కాలేలా లోపలి తోసి, నా వైపు తిరిగి “ఏం మల్ల మల్ల ఇట్టా చేస్తావా?” అని అడిగాడు గుడ్లురుముతూ.  “ఇగ జెయ్యన్లే, రాయన్లే” అన్నాన్నేను, కాలిపోతున్న నా కవిత్వాన్ని చూసుకుంటూ.. చాల రోజులు రాయలేదు కూడా. బహుశా ఆంద్ర లొయోలా పియుసిలో చేరే వరకు, అంటే మా నాన్న కళ్ల కింది నుంచి దూరం అయ్యే వరకు.

అలా మా నాన్నకు దూరంగా విజయవాడ చేరాకే మళ్లీ కవిత్వం రాసి, ఈ సారి జ్వాల పత్రిక వారు వెలువరిస్తూ వుండిన ‘మినీ జ్వాల’ అనే కవితల అనుబంధానికి పంపితే వేసిన ‘చాటు మాటు” అనే కవిత నా అచ్చైన మొదటి కవిత.

విజయవాడ శీష్ మహల్ టాకీసులో హిందీ సినిమా చూసి హాస్టల్ కు వస్తుండగా భోరున వాన. మేము బస్ స్టాప్ చూరు కింద నిలబడ్డాం. మాకు దూరంగా గోడ పక్కను ఏ షెల్టర్ లేని చోట ముడుక్కున్న ఒక కుష్టు రోగి. ఆ వానలో తడిసి వణుకుతూ ఏడుస్తున్నాడు. మా దగ్గర చూరు కిందికి అతడు రాలేదు. మేము వున్నాము కదా?! మేము పిలవలేదు. మేము ఎంత వెధవలమో చెబుతూ రాసిన కవిత “చాటు మాటు”.

మరుసటి సంవత్సరం అనుకుంటా….. ‘జ్యోతి’ మంత్లీలో ‘జీవితం ఓ కాగితం’ అనే కవిత అచ్చులో రెండవది. కాగితం ఎవర్నీ ఏమీ అనలేదు. ఎవరెవరో ఏవేవో రాసి వెళ్తారు. ఏవేవో పెయింట్లు పోసి వెళ్తారు, కాగితం ఏమీ అన్లేదు, జీవితం అట్టా వుండగూడదు అని ఆ కవిత. ఇవేవీ నాదగ్గర్లేవు.

చివరగా ఈ కోవ సంఘటన మరొకటి చెప్పాలి.

 1999 ప్రాంతాలు. ‘ఈనాడు’లో ఉద్యోగం. 86 లో ఈనాడులో చేరాక మొదటి రెండు మూడేండ్లు కె.సంజీవి అనే దొంగ పేరుతో రాసి తరువాత ‘అప్పుడప్పుడు రాసినవ’ని రామోజీ రావుకు చెప్పి ‘అబద్ధం’ అనే పేరుతో సొంత పేరుతో ప్రచురించాను. ఆ తరువాత, సాహిత్య వ్యాసాలు పవనకుమార పేరిట వేరే పత్రికల్లో ప్రచురించినా, పొయమ్స్ మాత్రం హెచ్చార్కె అని సొంత పేరుతో (వేరే పత్రికల్లో)  ప్రచురించే సాహసం చేశాను. సాహసం ఏమీ కాదు. ఆఁ, కవిత్వం ఎవరు చదువుతార్లే, ఛేర్మన్ కు ఏం తెలుస్తుందిలే అని తెగింపు. కాని, ఎవరో మోశారు. ఆయన పిలిచి “ఇది నువ్వేనా” అని అడిగారు. అప్పుడెప్పుడో మా నాన్న “ఏమిటిది?” అని అడిగినట్టే. “ఔనండి అది నేనే” అని జవబిచ్చాను. ఆయన చాల కోప్పడ్డారు. ‘నీ మీద ఇంత ట్రస్టు పెట్టి బాధ్యతలు అప్పగిస్తే నువ్విలా చేస్తావా” అన్నారు. నాకు చాల బాధేసింది. “ఇక రాయనండి” అని అన్నాను. నిజంగానే రాయలేదు, మరి ఆరు నెలలకు, దైర్యం వచ్చి ఆ వుద్యోగానికి రాజినామా చేసే వరకు రాయలేదు. 99లో నేను రాజినామా చేసింది ‘ఈనాడు’ ఉద్యోగానికి కాదు, రాయకుండా వుండడానికి. చాల కాలం ఉద్యోగం లేని తనం నన్ను బాధించింది. పశ్చాత్తాప పడాలని అనిపించలేదు.

(వచ్చే వారం ఉంకో కథ)

 09-03-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s