అన్న ద్వేషం- బ్రహ్మ ద్వేషం:ఒక భావుకుని డైలెమా

(గత సోమ వారం, March 14 వివిధ (ఆంద్రజ్యోతి)లో నా వ్యాసం)

http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE2MDMxNDAzMTQwMjEzNDU2ODQuanBn&day=20160314

అడగాలనిపిస్తోంది. అడిగితే అరుస్తారని, మనస్సును స్వేచ్చగా విచ్చుకోనివ్వరని సందేహం తొలుస్తోంది. ఆరోగ్యకరమైన చర్చ జరగొచ్చని ఆశ కూడా వుంది.

శరీరానికి అతీతంగా ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, దివ్యానుభూతి, అలౌకికానందం… వంటి మాటలు విన్నప్పుడంతా ఎందుకనో మనస్సు వికలమవుతుంది. విముఖమవుతుంది. అవి బాగుంటాయి కాని బాగోవు.

ఆత్మ వాదులు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మనిషి అంతరంగం, దాని లోని పెయిన్ అండ్ ప్లెజర్ సంగతే కాదు. వాళ్లు ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు. వినాలి. తెలుసుకోవాలి. తెలుసుకోడానికి చదువుకోవాలి. కాని చాల అనుమానంగా వుంటుంది. భయంగా వుంటుంది. మళ్లీ మునుపటి ‘బానిసత్వం’ లోనికి తోసేస్తారనే భయం…  గుండె మీద ముల్లై గుచ్చుకుంటూ వుంటుంది. కలత నిద్దట్లో మగత మెలకువలో పక్కలో బల్లెమై…. శవ శీతలంగా తగులుతూ వుంటుది.

 ఏది సత్యం ఏది అసత్యం, ఓ మహాత్మా ఓ మహర్షీ!

‘మహాత్మా, మహర్షీ అన్నావు కదా, ఇంకేం, మహర్షులు చెప్పింది విను, ఏల విచికిత్స?’ అంటారు వెల్ మీనింగ్ స్నేహితులే కొందరు.

నిజమే గాని; ఒక వశిష్టుడు, మరొక విశ్వామిత్రుడే మహర్షులా? జాబాలి కొడుకు సత్యకాముడు, నల్ల కంబళి కప్పుకుని తిరిగిన సాధువు, భౌతికమైన దాన్ని ముందుగా పట్టించుకోరా నాయినా అని చెప్పిన చార్వాకుడు, నేనూ తెలుసుకుంటాను అని బయల్దేరి రామచంద్రుడి కత్తికి తల వదులుకున్న యువకుడు శంబూకుడు, గౌతమ బుద్ధుడు …. వీళ్లు మాత్రం ఎందుకు మహర్షులు కారు? వీళ్లూ మహర్షులే!

ఇదంతా మహర్షుల మధ్య వివాదం. విభేదం కొత్తది కాదు. మహర్షుల కాలం నుంచీ వున్నది. ఇప్పటికైనా మాట్లాడుకుని కలిసి పోవడం మంచిది. దాని వల్ల లోక కల్యాణం. దేశ కల్యాణం.

ఇదంతా కన్వెన్షన్ కు, కన్సెంట్ కు సంబంధించినది. సంప్రదాయానికి, (ప్రజా) సమ్మతికి సంబంధించినది. కన్వెన్షన్, కన్సెంట్ రెండూ వుత్పత్తి చేయబడేవే. నిర్మించబడేవే. ఏదీ స్వయంభువు కాదు. ఏదీ అపౌరుషేయం కాదు.

రాను రాను చీకటి పెరుగుతున్న అడివి ఇవాళ దేశం. పార్లమెంటు నిండోలగంలో స్వయంగా మంత్రులు ‘దివ్య’ విషయాలతో సెంటిమెంట్లు పండిస్తున్నారు.

ఇది వట్టి చీకటి అడివి కాదు. దారి లేని చీకటి అడివి. దారి కొరకు మునుపు జరిగిన అన్వేషణలేవీ ఇప్పుడు పనికొచ్చేలా లేవు. దారి చూపుతామని ప్రగల్భించిన వారు తక్షణ స్వార్థాల వల్ల దారి తప్పారు. తప్పదు మన దారి మనం కనుక్కోవలసిందే. బోట్రాళ్లు తగుల్తాయి. పాదాలు నెత్తురు నెత్తురవుతాయి. ముందుకు నడవాల్సిందే.

నిర్మిత సత్యాల పద్మవ్యూహమిది. దీని లోంచి మనం బయట పడాలి. మన దారి మనం కనుక్కోవాలి. అభిమన్యు స్మృతి గీతాలు పాడుకుంటూ కూర్చుంటే మరణమే.

ఇలాంటప్పుడు ఒక కాన్షియస్ శూద్రుడి మనసులో ఎలాంటి భావాలు కదిలే అవకాశముంది? పూర్వుల మాదిరి కాకుండా అతడు చదువులకు, మానవ హుందా తనానికి మరీ దూరం కాకుండా బతుకుతున్నాడు. తలెత్తి మాట్లాడగలుగుతున్నాను. ఆలోచనల తప్పొప్పులలో భాగస్వామి అవుతున్నాడు. కొంచెం గర్వమే. ఇది బాగుంది. కాని భయ్యం, ఎప్పటి నుంచో పేరుకు పోయిన భయం.

మళ్లీ పడిపోతామని భయ్యం. పాత చీకటి శక్తులు పడదోస్తాయని భయ్యం. ఇటీవల అవి మరీ ఎక్కువగా భయపెడుతన్నాయి.

ఈ వ్యాస రచయిత తనదైన ఒక అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాడు. ఇతడొక శూద్రుడు.

వాళ్ల వూళ్లో నాలుగు బ్రాహ్మణ కుటుంబాలుండేవి. అందులో ఒక కుటుంబంతో అతడికి బాగా ప్రేమానుబంధం. వాళ్లు మంచి వాళ్లు. ఆ కుటుంబ పెద్ద పండితుడు. వాళ్ల ఇంటి నిండా కథల పుస్తకాలు. మన వాడు ఎప్పుడూ ఆ ఇంట్లో గడిపే వాడు.

వాడు ఎస్ ఎస్ ఎల్ సీ చాల మంచి మార్కులతో పాసయ్యాడు. పరిగెట్టుకెళ్లి ఆ పండితునితో చెప్పాడు. పండితునికి భలే సంతోషమయ్యింది. వాడిని మెచ్చుకుంటూ, పక్కన మనిషితో ‘వీడు ఏ తప్పిపోయిన బ్రాహ్మణ పిల్లవాడో’ అన్నాడు. వాడికి సంతోషం వేయ లేదు. ఏం, శూద్ర పిల్ల వాడికి చదువు బాగా రాకూడాదా అని రోషం పుట్టింది. చాల సార్లు ఇలాంటి రోషమే పలు మంచి ఊహల్ని ప్రేమించనీయక, వాటికి వాడిని దూరం చేసింది.

ఆ పిల్లాడు పండితుని దగ్గర కూర్చుని అవీ ఇవీ మాట్లాడే వాడు. వాడి గొంతులో ఆ నొప్పి తరచు గరగరలాడేది. అలాంటి ఒక నిమేషాన ‘అయ్యా, ఈ కులాలెందుకు, బ్రాహ్మణులు ఎక్కువ ఇతర్లు  తక్కువని ఎందుకు’ అని అడిగాడు.

ఆయన చెప్పలేదు. ఊరక వుండనూ లేదు.

‘అన్న ద్వేషం, బ్రహ్మ ద్వేషం మంచిది కాదు రా’ అన్నాడు. సందర్భం స్పష్టమే. ఇక్కడ బ్రహ్మ అంటే దేవుడు కాదు బ్రాహ్మణుడు అని వేరే చెప్పనవసరం లేదు.

వాడి ప్రశ్నకి జవాబు ఆ తరువాత కూడా దొరకలేదు. దరిమిలా వాడిలో బ్రహ్మ అన్నా, బ్రాహ్మణుడన్నా వ్యతిరేకత మొలకెత్తితే అది వట్టి ద్వేషమని మీరు అంటారా? అది ద్వేషం మీది ద్వేషం కనుక, ఎప్పటికైనా ద్వేష రాహిత్యానికి బాట వేస్తుందని సంతోషిస్తారా? చాల మంది మొదటి సరళిలోనే ఆలోచిస్తున్నారని అభియోగం, అనుభవం. దాన్ని విమర్శించడానికే ఈ వ్యాసం.

ఇటీవల ఇలాంటి మాటలు పట్టణాలలో పుట్టి పెరిగిన ఆంగ్ల విద్యాధికుల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఇదేదో క్యాజువల్ టాక్ అనో సున్నిత విషయమనో పక్కన పెట్టలేం. దైనందిన సమస్య కావడం వల్ల, సున్నితమని పక్కన పెడితే అలా పక్కన వుండి పోదు. పదే పదే ముందుకొచ్చి మనుషుల్ని.. మనల్ని… విడదీస్తూనే వుంటుంది.

ఏ మంచి పుస్తకం తీసుకున్నా ఎక్కడో ఒక చోట ఇది తల  బైట పెట్టి మనల్ని వెక్కిరిస్తూనే వుంటుంది. దాన్ని చేతిలోకీ తీసుకుని చూసి దూరంగా విసిరేయగలిగితేనే మనం ‘మనం’ అవుతాం. లేకుంటే బయటికి ఎన్ని కబుర్లు చెప్పినా ‘మీరు’ వేరు ‘మేము’ వేరుగానే వుండిపోతాం.

మహా భారతమే వున్నది. సంస్కృతం సరే, చదవడం అందరికీ కుదరదు. నాకు రాదు. తెలుగులో కవిత్రయం రాసిన శ్రీమదాంధ్ర మహా భారతం వున్నది. చదువుకోబోతే…. ఎన్నెన్నో సౌందర్యాల మధ్య… పదే పదే… పదీ ఇరవై పద్యాలకొక సారి….

గోవులను, బ్రాహ్మణులను పూజించాలని, సంతృప్తి పరచాలని వుంటుంది. అదొక గొప్ప వర్చ్యూ అని కవి గారు చెబుతూనే వుంటారు.

రాసిన వాడు బ్రాహ్మణుడు. చదువుతున్నది శూద్రుడు. ఆఁ, బలె చెప్పినావులే, ‘బాపనోళ్లను నేనెందుకు పూజించాల, వాళ్లేం గింజలు పండిస్తారా, బట్టలు నేస్తారా, బర్రెలు కాస్తారా’ అని ఒక శూద్ర పాఠకునికి అనిపిస్తే అది బ్రాహ్మణ వ్యతిరేకతే… బ్రహ్మ వ్యతిరేకతే… గాని, అన్న వ్యతిరేకత అవుతుందా? అంటే ఒక తీవ్ర రోగం అవుతుందా?  అవుతుందని కవి వుద్దేశం. లేకుంటే అదొక గొప్ప గుణమని ఎందుకు రాస్తాడు?

ఇటీవల ‘మన సంస్కృతి, మన దేవుళ్లు’ అంటూ ఊదర గొట్టడం మరీ ఎక్కువై పోయింది. గోబ్రాహ్మణ పదబంధంలో బ్రాహ్మణులతో కలిసి వున్న ఆవులకు చట్టంలోనే చోటు దొరికింది. వాటిని పూజించాలి. మిగతా జంతువుల్లా వాటిని చంపగూడదు. ఆవు మాంసం తింటే చట్ట రీత్యా నేరమట. బీఫ్ తిన్నారని అనుమానం వచ్చినా సరే, వాళ్లని చంపేసే గండర గండలకు ప్రభుత్వం అండదండలు, దానికి పౌర సమాజం నుంచి ఆమోదాలు దొరుకుతున్నాయి. ఛీ అనిపించడం లేదు మనకు.

బహుశా దీనికి పరాకాష్ట ఇటీవల మన ఘనత వహించిన పార్లమెంటులో స్మృతి ఇరానీ అనే మంత్రిణి…  చేతులు చాచి అరుస్తూ, గుడ్లురుముతూ, అటు ఇటు భావస్ఫోరకంగా కదులుతూ, గొంతును వణికిస్తూ…. నవరసాలొలికిస్తూ జె. ఎన్. యూ. కరపత్రమో, పోస్టరో ఏదో ఒక దానిలో దుర్గా దేవి మీద ఎవరో ఏదో రాశారంటూ చెప్పిన కథ, దానిపై ఆమె వ్యాఖ్య, ఆ వ్యాఖ్యకు మనం మంచోళ్లనుకునే వారే కొందరి నుంచి పెల్లుబికిన హర్షాతిరేకాలు.

అసలు సంగతేంటి?  ఆ కరపత్రం లోని కథ ఏమిటి? మహిషాసురుడు అనే మూల వాసిని దురాక్రమణ దారులు ఓడించ లేక ఒక స్త్రీ ద్వారా మోసం చేసి ఓడించారని, ఆమెయే దుర్గ అని ఆ కరపత్రం/పోస్టరులో వుంది. కరపత్ర రచయితలు ఆమెను సెక్స్ వర్కర్ అన్నారు. దుర్గ ను ఇంత మాట అంటారా అని మంత్రి ఉచ్ఛైస్వరంతో చేసిన ఉపన్యాసం. ఆహా మంత్రి ఏమి మాట్లాడారో అని దేశమంతటా ఛీర్ లీడర్ల పొలి కేకలు.

మహిషాసురుడు మూల వాసులు కొలిచే ఒక దైవం. వాళ్ల నాయకుడు. అతడిని ‘డెమన్’ అనీ, పాపి అనీ అతడిని చంపిన దుర్గ గొప్ప అనీ ఎన్నాళ్లుగానో అంటున్నారు. ఇది విని అతడిని దేవుడిగా భావించే వాళ్లకు మండి వుండదా? ఇప్పుడు ఒక కరపత్రంలో తమ మూల వాసి రాజును మోసగించి చంపిన స్త్రీని వాళ్లు ఏదో అన్నారని అంతటి పార్లమెంటులో అంతగా వూగిపోయి ‘డిప్రేవిటీ’ అంటో అరుస్తారా? దానికి ఛీర్ లీడర్లు చప్పట్లు కొడతారా? ఇదంతా సహజ న్యాయం కిందికి వస్తుందా? ప్రజాస్వామ్యం కిందికి వస్తుందా?

ఈ భావ వైపరీత్యానికి కారణం ఏమిటి? ఇన్నాళ్లుగా దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రవర్ధిల్లినన ‘ప్రగతి వాదం’ లోనే ఏదో పెద్ద లోపం వుంది. ఏదో బలహీనత వుంది. ఆ బలహీనతకు తగిన ఉదాహరణలు కూడా వున్నాయి.

ఉదాహరణకి చెలం ‘బ్రాహ్మణీకం’ కథలోని ఘోరాన్ని విమర్శనాత్మకంగా చూడకపోగా, అదేదో మహద్రచన అయినట్టు నాటకం కట్టి ఆడే ప్రగతి వాద ఫెమినిస్టులున్న దేశం మనది? అలాంటి వారి తెలివి తేటలకు కేంద్ర సాహిత్య సత్కారాలు లభించడం, బహుశా, కాకతాళీయం కాకపోవచ్చు. 

చెలం ‘బ్రాహ్మణీకం’ కథలో రామయ్య నాయుడు అనే గవళ్ల కులస్థుడు… ‘బ్రాహ్మణ వ్యతిరేక వుద్యమం’ మనిషి… అదర్వైజ్ చాల మంచి వాడు….. సుందరమ్మ అనే బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె దీన స్థితిని ఆసరా చేసుకుని అనుభవించాడు… అని కథ. చావు బతుకులలో వున్న చిన్ని పాప పక్కన వున్న నిస్సహాయను అనుభవించడం వంటి  ఇన్క్రెడిబుల్ హీన కార్యం…. ఆ మంచి వాడు… ఎందుకు చేశాడట? చెలం ప్రకారం… అతడు కాముకుడయ్యి కాదు. అమె అందం కోసం కూడా కాదు. నిర్దయుడు కూడా కాదు. అమాయక స్త్రీకి సాయం చేద్దామనే అక్కడికి వచ్చాడు. మరి అలా ఎందుకు జరిగింది? బ్రాహ్మణ స్త్రీని అలా చేయాలనిపించిన విపరీత మనస్తత్వం వల్ల అలా చేశాడట. మరో మాటలో బ్రాహ్మణ-వ్యతిరేకోద్యమ మనస్తత్వంతో అలా చేశాడు అని చెలం పలు విధాలుగా ఎస్టాబ్లిష్ చేశాడు కథలో. అక్కడితో ఆగాడా కథకుడు? లేదు. ఉన్నట్టుండి అక్కడి బుడ్డి దీపం కింద పడిపోయిందో, తర తరాల బ్రాహ్మణీకపు మహిమ వల్లనో (ఇవి చెలం మాటలే) గవళ్ల రామయ్య నాయుడి ధోవతి… అదీ అతడి కాళ్ల మధ్య నుంచి అంటుకుని… కాలి దగ్ధమైపోయాడట. అది కూడా ఒక మహిషాసురుడి వలె…. ఈ వుపమానం కూడా చెలానిదే. ఓర్నీ…., ఏమి మహాత్మ్యం?

(అంతకు ముందు సుందరమ్మను వంచించి, అనుభవించి, బలిమిని వితంతు వివాహం చేసుకుని మరీ బాథ పెట్టిన చంద్ర శేఖర్ అనే త్రాష్టునికి ఏమీ కాదు. అతడు బ్రాహ్మణుడు).

ఫెమినిజం సంగతేమో గాని, ఇక్కడ తగలడిన చెలం కుల విచక్షణ మన ప్రోగ్రెసివుల కళ్లకు కనిపించ లేదు. ఇది మన తెలుగు రచయితల అవగాహన స్థాయి. 

చారిత్రకంగా అయినా… చెలం ఆ కథ రాసే నాటికైనా… ఆమాట కొస్తే ఈనాటికైనా… ‘బ్రాహ్మణ వాద-వ్యతిరేకత’ ఎందువల్ల తప్పు? కథలో చెలం స్పష్టంగానే, వాచ్యంగానే చెప్పాడు… రామయ్య నాయుడిది బ్రాహ్మణ వ్యక్తుల మీద కోపం కాదు, అది తరతరాల బ్రాహ్మణీకం మీద…. ఇప్పటి మాటల్లో చెప్పాలంటే… బ్రాహ్మణ వాదం మీద వ్యతిరేకత అని.

బ్రాహ్మణ వ్యతిరేకతను…. కుల రాహిత్యం కోణం లోంచి కాకుండా బ్రాహ్మణ కులానుకూల కోణం లోంచి చూసి గేళి చేశాడు చెలం. ఆయన పండించిన ఆ చెత్త సెంటిమెంటుకు ప్రగతివాదులు అంతగా మురిసిపోయారెందుకు? ఆడవాళ్లను మోసం చేసి వుపయోగించుకోడం బ్రాహ్మణ-వ్యతిరేక వుద్యమ కారులే చేస్తారా? బ్రాహ్మణులు చేయరా?

ఈ కథ ఫలశ్రతి ఏమిటి? బ్రాహ్మణ స్త్రీని ఆశించిన అబ్రాహ్మణుడు మాడి మసై పొతాడని చెప్పడమేగా?  

ఈ ‘బ్రాహ్మణీకం’ కథ వంటిదే, పార్లమెంటులో మంత్రి ప్రస్తావించిన మహిషాసురుని కథ వంటిదే… … ఈ రెండూ కాకుండా ఇంకో కథ వుంది. ఆ ఇంకో కథను తెలుగు వాళ్లు చాల మంది విని వుంటారు. ఈ వ్యాస కర్త చాల చిన్న నాడు విన్న జానపద కథ ఇది. 

ఒక దళిత యువకుడు తన కులం చెప్పకుండా ఒక అగ్రవర్ణ స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. పెళ్లయ్యాక, కొడుకు కాపురం చూద్దామని యువకుని తల్లి వచ్చిందట. భోజనాల దగ్గర సేమ్యా పాయసాన్ని మెచ్చుకుంటూ ‘దూడ పేగుల్లా ఎంత బాగున్నదో’ అని మెచ్చుకున్నదట తల్లి. దాని వల్ల యువకుడి కులం తెలిసిపోయిందట. అగ్రవర్ణ యువతి ఆతడిని చంపేసి, దేవత ఐపోయి పూజలందుకున్నదట. ఈ కథలో యువకుడు మహిషాసురుడిలా మూల వాసుల రాజు కాడు. మామూలు దళితుడు. ఎదుర్కొన్న ఫేట్ మాత్రం ఒకటే. మరణం. చెలం కథలో రామయ్య నాయుడి మాదిరిగానే.

దీన్ని మరింత సాగదీసి కంచికచెర్ల కోటేశు ను గుర్తు చేసుకుంటే ఏం తప్పు? జానపద కథలోనూ, మహిషాసురుడి కథలోనూ ‘అమె’ అతడిని చంపింది. చలం కథలో ‘ఆమె’ కారణంగానే ఒక మహాత్మ్యం చంపింది, అంటే, ఆత్మో, బ్రహ్మో చంపారు. కోటేశును నేరుగా అగ్రవర్ణులే చంపారు. ఏం తేడా? చాతనైతే భౌతిక దాడి, లేదా సో కాల్డ్ ‘ఆధ్యాత్మిక’ వంచనాత్మక దాడి.

అసలీ యవ్వారాలన్నీ ఎందుకు పదే పదే ముందుకు వస్తున్నాయి. ఈ మహాత్మ్యాలకు, వంచనలకు లెజిటమసీ ఎక్కడి నుంచి దొరుకుతోంది. మనకు తెలియని ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ తెలిసి పోయినట్టు పోజు కొట్టే ప్రయత్నాలలో దారి తప్పి రాజకీయార్థిక ప్రయోజనాల వుచ్చుల్లో పడుతున్నామని నా విన్నపం.   

ఆత్మ, పరమాత్మ, బ్రహ్మజ్ఙానం, దివ్యజ్జ్ఞానం వంటి మాటల వెనుక వున్నది కేవలం కులాహంకారం కాదు. అందులో మానవ జిజ్జ్ఞాస వుంది. కాని; ఆ భావనల్ని ఆధారం చేసుకుని, గల్లిబుల్ జనాల్ని దేవాలయాల చుట్టూ, పూజారుల చుట్టూ, పూజారులుగా తమ వంటి బ్రాహ్మణుల చుట్టూ, ఆశ్రమాల చుట్టూ, ఆశ్రమాల వద్ద వేల ఎకరాల భూముల చుట్టూ తిప్పుకుంటున్న స్వార్థాన్ని చూడకుండా వుండలేం. మాట్లాడకుండా వుండలేం. అలా వుండలేకపోవడం, మాట్లాడడం…  ఇవాళ చాల అవసరం. ఇటీవల విజృంభించిన మత వాద శక్తులు ఈ అవసరాన్ని మరింతగా గుర్తు చేస్తున్నాయి. 

ఇలాంటప్పుడు అత్మ పరమాత్మల మీద వైముఖ్యం ఆరోగ్యకరమే అనుకుంటాను. ‘అనాత్మ వాదం’ ఆరోగ్యకరం అనుకుంటాను.

Advertisements

1 Comment

  1. నమో నమః!
    ఇంత స్పష్టంగా ఇంత సులభంగా ఆనాటి కథకు, ఈనాటి కథకు మర్మం విప్పిచెప్పడం నేనిదే చూడటం. ఓ ఇరవై ఏళ్ళకు పూర్వం మీరు నాకు దొరికి వుండాల్సింది.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s