జీవితానికీ టాక్టికల్ లైన్

స్మృతి 4

(This is a column స్మృతి I have started in a group called Kavisangamam in Face Book.The following was the column that appeared last Thursday there. I will be posting today’s column next week in the same way as it is being done now.) 

అనుకుంటాం గాని, చాల సంగతులు మనకు చిన్న నాడే తెలిసిపోతాయ్. దిబ్బ మీద దొరికిన మొదటి విజయంతో నాకు ఎన్ని విషయాలు తెలిసిపోయాయో చెప్పానుగా!

అలివి గాని కష్టాలు వచ్చినప్పుడు పారిపోకుండా, హెడ్లాంగ్ తలపడకుండా ఒడుపుగా ఎదుర్కోవాలని పెద్దాళ్లు చెబుతారు. పాలిటిక్స్ లో టాక్టిక్స్ అనీ, ఉద్యమానికి ‘టాక్టికిల్ లైన్’ అనీ వుంటాయి. అవి వ్యక్తిగత జీవితానికి కూడా అవసరమే. అ సంగతి కూడా మనకు చిన్న నాడే తెలిసిపోతుంది. నాకెలా తెలిసిందంటారా? చెబుతా.

ఈలోగా ఇంకొంచెం కథ చెప్పాలి. అందులో కొంచెం కిక్కిచ్చే సంగతులున్నాయి గాని పద్దెమినిమిదేండ్ల లోపు వాళ్లు కూడా చదవొచ్చనుకుంటా. J

గడివేములలో ఏడో తరగతి అయిపోయింది. దాంతో నా చదువే అయిపోయిందనిపించింది. ‘ఎద్దు గుద్ద పొడుసుకుంట బతకాల్సినోళ్లం మన గ్గుడ్క సదువులంటె యాడైతాదిలే బ్బా’ అనుకున్నాడు మా నాయ్న. సేద్యం పనుల్లో పెడదామనుకున్నాడు. మరీ పన్నెండేండ్ల పిల్లోన్ని యా సేద్యానికి తీస్కపోతాడు. అందుకని ఓం ప్రథమంగా బర్రెగొడ్లు కాయడానికి పంపించారు. బక్క రైతులు, రైతు కూలీల పిల్లల అప్రెంటిస్ షిప్ బర్రెగొడ్లు కాయడంతోనే మొదలవుతుంది.

అంతెందుకు, పిల్లలు సరిగ్గా చదువుకోక పోతే, ‘సదువుకోకుండా బర్రెగొడ్లు గాయ బోతవా’ అని తిడుతుంటారు.

నా చదువు మాన్పించిన తరువాత మొదట చేసింది బర్రెగొడ్లు కాయడానికి పంపడమే.

పొద్దున్నే అమ్మ అన్నం, పప్పు ఒక తెల్లని గుడ్డలో మూట గట్టి చేతికిచ్చేది. దాన్నే మేము సద్ది అనే వాళ్లం. ఎందువల్లనో టిఫిన్ బాక్స్ అయితే సద్ది అనే వాళ్లం కాదు. టిఫిన్ అనే అనేవాళ్లం.

మావి నాలుగు బర్రెగొడ్లుండేవి. ఒకటి ఇచ్చే బర్రెగొడ్డు, మూడు వట్టిపోయినవి. (పాలిచ్చే దాన్ని సింపుల్ గా ఇచ్చే బర్రెగొడ్డు అనే వారు). ఒక కట్టె తీసుకుని వాటిని తోల్కొని వాగు దగ్గర చిన్న మర్రి చెట్టు వద్దకు వెళ్లే వాన్ని. అప్పటికే నా లాగే ఏడెనిమిది మంది పిల్లలు, ముసిలోళ్లు అక్కడికి వచ్చేవారు. వాళ్లు వాళ్లవే కాకుండా వేరే వాళ్ల బర్రెల్ని కూడా తోలుకొస్తారు. వేరే వాళ్లవి కాసినందుకు వాళ్లకు బర్రెకింత అని జీతం ఇస్తారు.

మిగతా కథ చెప్పే ముందు అసలీ బర్రెలు కాసే కథనే చెప్పాలి. ఇది భలే ‘రుచి’గా కూడా వుంటుంది మరి.

మేము వాగు ఒడ్డు వెంట బయల్దేరి వూరికి చాల దూరం కొండల అంచుల్లోకి వెళ్లేది. మధ్యాన్నానికి వాగు వంపు దిరిగి మడుగు కట్టే చోట ఆగే వాళ్లం. అలాంటి చోట వాగు ఒడ్డున పొలాలు లేని ఖాళీ స్థలం ఎక్కువగా వుంటుంది. బర్రెలకు గడ్డి గాదం ఎక్కువగా వుంటాయి. వాగు ఒడ్డున ఒకటి రెండు నీడ చెట్లు. వాటి కింద మా మకాం.

వాగు పక్కన చిన్న చిన్న మడుగులుంటాయి. ఆ నీటిని తువ్వాళ్లతో బయిటికి కొట్టే వాళ్లం. నీటితో పాటు చిన్ని చిన్ని చేపలు గడ్డిలో పడి ఎగిరేవి. అక్కడికక్కడే చెత్త ఏరుకొచ్చి మంట పెట్టి ఆ చిన్న చేపల్ని కాల్చి పక్కన పెట్టుకుని, ఇక మా సద్ది మూటలు విప్పే వాళ్లం. ఫ్రెష్ గా కాల్చిన చిన్న చేపలు నంజుకుంటూ బోజనాలు. ఆ ఎండలో, చెట్ల కింద కదిలే నీడల్లో, పిల్లోల్ల అరుపుల మధ్య సద్దులు…. సూర్యున్ని నంజుకుని తినడమని అన్నాడొక కవి దీన్నే.

అది కాదు. అసల్సంగతి ఇంకోటుంది. సద్దులు తిని కాసేపున్నాక, ఎవరికో గుర్తుకొచ్చేది. అక్కడ నీడ నిచ్చే చెట్లు రెండు మూడే అన్నాను కదా?! మిగిలినవన్నీ ఈత చెట్లు. వూరికి దూరంగా వచ్చాం కదా! వాటిని ఈదులు అనే వారు. ఈత చెట్ల వనాలన్న మాట. ఈత చెట్లంటే మీకేం తట్టడం లేదా? తాటి చెట్లయితే వెంటనే తట్టేదనుకుంటా!

మా వూరి చుట్టు పక్కల తాటి చెట్లు తక్కువ. వాగు పొడుగున అటు ఇటు అన్నీ ఈత చెట్లే. ఈత చెట్లంటే ఈత కల్లు. ఎక్కడో ఎమ్మిగనూరు ప్రాంతం వాళ్లు వేలం పాడుకనే వారు. ఇక ఆ ఏడాదంతా ఈదులు వాళ్లవే. ప్రతి చెట్టు మువ్వకు గీత గీసి లొట్లు (చిన్న కడవలు) కట్టి వెళ్తారు. తగినంత సమయం అలా వుంచి లొట్లు దించుకుంటారు. అదీ ఈత కల్లు.

మేము బర్రె గొడ్ల పిల్లోల్లం చుట్టు పక్కల ఎవరూ లేకుండా చూసి ఈత చెట్లెక్కి ఒకటి రెండు లొట్లు దింపుకునే వాళ్లం. ఒకరికి ఒకరం దోసిళ్లలో పోసుకుని తాగే వాళ్లం. ఎంత తీయగా వుంటుందో తాజా కల్లు?! ఆప్పటి కల్లు రుచి యిప్పటికీ వుంది నా నాలుక మీద.

అదీ సార్ సంగతి. చెప్పొద్దూ నేను బర్రెలు కాసింది ఏడు రోజులే. ఎనిమిదో రోజు బర్రెల్ని తోలుకుని మర్రి చెట్టు కిందికి చేరాను. కాసేపుంటే అందరం కలిసి వాగు వెంట బయల్దేరాలి. ఇంతలో మా నాన్న వచ్చాడు. తన వెంట గుమ్మడి అని నా కన్న కొంచెం పెద్ద పిల్లవాడు. వాళ్లు తెలుగోళ్లు. (చెప్పానుగా, మా ఊళ్లల్లో ‘తెలుగు’ అనేది ‘కాపు’ లాగే ఒక కులం).

‘ఏం రొడ్డీ నువ్వొచ్చినావు’ అని అడిగింది మాతో పాటు వచ్చే ముసిలామె, పేరు మద్దమ్మ.

‘ఏం ల్యా మద్దమా! ఇంటి కాడ నన్ను తిడుతొండారు. ఇయాల్టి వరకు ఒక సారి గూడ ఫేల్ కాకుండ వచ్చొండాడు పిల్లోడు. సదువు మానిపియ్యాకు అంటొండారు. ఇగ సర్లె గాని, నువు ఇంటికి పా రా. మన గుమ్మడి గాన్ని మాట్లాడినాన్లే. నువ్వు ఇంటికి పా’ అన్నాడు నాన్న. నాకు ఏం చెప్పాలో తోచలేదు. ఒక పక్క పైటాల సద్దిబువ్వలో కాల్చుకు తిన్న చిన్న చేపలు, సొంతంగా లొట్లు దింపుకుని ఒంపుకుని తాగిన కల్లు కుండలు; ఇంకో పక్క పుస్తకాలు, కథలూ కాకర కాయలు… అయినా నాన్న చెప్పాక చేసేది ఏముంది? చేతిలో కర్ర… అదేదో రాజదండమైనట్టు గుమ్మడికి ఇచ్చి, నా సద్దిమూట కూడా తనకే ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాను. మరునాడు మా శివారెడ్డి చిన్నాయిన వెంట గడివేములకు వెళ్లి టీసీ తెచ్చుకోడం, తరువాత తలముడిపికి వెళ్లి ఎనిమిదో తరగతిలో చేరడం చక చకా జరిగిపోయాయి.

(చాల ఏండ్ల తరువాత వూళ్లో గుమ్మడి కనిపించాడు. మనసారా పలకరించాడు. నాకు చాల గిల్టీ అనిపించింది. ఆ రోజు ఉదయం మర్రి చెట్టు కింద నేను నా కష్టాల్ని తనకు ఇచ్చి వచ్చానని తెలుసు. గుమ్మడి కి ఆ స్పృహ లేదు. అది తనకు చాల సహజం అనుకుంటాడు. అదీ భారతం).

గడివేములలో మా బడి ఒక సొరంగం లాంటి పొడుగాటి ఇంటిలో వుండేదని చెప్పాను కదూ. కొత్తగా ఎనిమిదో తరగతిలో చేరింది తలముడిపి అనే వూరిలో. అక్కడ మా హైస్కూలు… కుందు అనే వాగు పక్కన,  ఏనాడో బిచ్చగాళ్ల కోసం కట్టించిన సత్రాలు. సత్రానికి మూడు పక్కల మాత్రమే గోడలు వుంటాయి. ముందు వైపంతా ఓపెన్ గా వుంటుంది. మా కోసం ఓపెన్ గా వుండే వైపు వాకిలితో కూడిన పెద్ద తడకలు చేయించి కట్టారు. లోపల మా డెస్కులు.

(ఆ మరుసటి సంవత్సరమే రెండు వూళ్లలో స్కూళ్లకు పక్కా బిల్డింగులు వచ్చాయి గాని, ఆ సొరంగం, సత్రాలే రొమాంటిక్ గా గుర్తుంటాయి నాకు. J )

మా వూరి నుంచి హైస్కూలు కు వెళ్లాలంటే ఎటు వైపు వెళ్లినా మద్దులేటి వాగు దాటాల్సిందే. పూర్తిగా కాలి-బాటలో వెళ్లాలంటే వూరి నుంచి చాల దూరం వెళ్లాక మంచాల కట్ట అనే ఇంకో వూరి దగ్గర వాగు దాటాలి. బస్సులు వెళ్లే రోడ్డు మీద బడికి పోవాలంటే, మా వూరి దగ్గరే వాగు దాటాలి.

మిగిలిన రోజులు ఎలా వీలయితే అలా వెళ్లే వాళ్లం. వాగొచ్చినవ్పుడు… అంటే వాగుకు వరదొచ్చినప్పుడు అలా కుదరదు. ఎక్కడో మనుషులు లేని చోట వరదలెత్తిన వాగు దాటడం పిల్లలకు మరీ సాహసికం. అందుకని వూరి దగ్గరే దాటాలి.

వానకాలంలో నాలుగైదు సార్లన్నా మాకీ కష్టం వచ్చేది. అప్పుడు వాగు దాటడం అదొక సాహస కార్యం.

మా వూరి పైనే అలుగు వాగు అని ఇంకో వాగు వచ్చి మా మద్దులేటి వాగులో కలుస్తుంది. వరద ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. మామూలు దినాలలో రెండు మూడు మీటర్లకు మించని వాగు వరదొస్తే ఫర్లాంగు వెడల్పు అవుతుంది. నీళ్లు కళ్లెలు కొడుతూ భలే భయపెడుతాయి. (ఇటీవల ఇసుక తరలించడం వల్ల వరద వెడల్పు పెరిగింది, వరద నీరు వూళ్లోకి వస్తోంది.)

నాకు అప్పటికే ఈత వచ్చు. ఎండా కాలం సెలవుల్లో చిన్న హనుమంత్రెడ్డి బావి అని ఒక పొలాల్లోని బావిలో దూకి నేర్చుకున్న ఈత. బావిలో ఈత వేరు. వాగులో ఈత వేరు. వాగులో కొత్త నీళ్లు పైనుంచి విరుచుకు పడి పరవళ్లు తొక్కుతూ వస్తాయి. కాసేపు ఆగితే వరద పోతుందనుకోలేం. ఎక్కడో కొండల్లో కురిసిన వాన నీళ్లు. వరద తగ్గడానికి ఒక్కోసారి రెండ్రోజులైనా పడుతుంది. పొద్దున వాగు ఎలా వుంటే అలా దాటి వెళ్లాల్సిందే మేము.

వరదలెత్తి వచ్చే నీళ్లలో, పెద్ద వాళ్లకే అడుగున కాళ్లందవు, పిల్లలం మా సంగతేముంది. బావిలో నేర్చిన ఈతతో మేము మునగకుండా తేల గలం. ఏ అడ్డు లేకపోతే ముందుకు పోగలం. ఇక్కడ అలా ఈదితే, వాగు వాలుకు కొట్టుకుపోవడమే, అవతలి ఒడ్డు చేరడం వుండదు. కొట్టుకుపోతూ కాసేపటికి కాల్జేతులు ఆడక మునిగిపోయి, ఏ నంద్యాల పెద్దేరు దగ్గర్నో శవాలై తేలాల్సిందే. తగిన గైడెన్సు లేకుండా ఆలాంటి ప్రయత్నాలు చేసి ఎక్కడో ఈత వనాలలో శవాలై తేలిన వాళ్లు బాగానే వున్నారు.

మేము మాతో పాటు ఒకరో ఇద్దరో పెద్ద వాళ్లు వస్తున్నది చూసుకుని బయల్దేరే వాళ్లం. పుస్తకాల సంచీ. బువ్వ సద్ది, చివరికి అంగీ నిక్కరు కూడా విడిచి… ఇంటి నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ కాగితంలో చుట్టే వాళ్లం. ఆ ప్లాస్టిక్ చుట్టను ఎవరికి వాళ్లం నెత్తుల మీద కట్టుకునే వాళ్లం. ఇక ఆ చుట్ట మాతో పాటే. ఈదినంత సేపు తల నీళ్ల పైన వుండక తప్పదు. అందుకే దాన్ని నెత్తి మీద కట్టుకోడం.

అప్పుడు మొదలవుతుంది రేసు. కొద్దిగా దూరం నడిచే లోగా లోతు పెరిగేది. నెత్తులు మునుగుతాయనగా ఈత మొదలు.

మేము వెళ్లాల్సింది వాగులో ఆవలి గట్టుకు. ఉత్తరం దిక్కు గట్టుకు. మేము చేరాల్సిన పాయింటుకు మొగం పెట్టి వాగుకు లంబకోణంలో ఈదితే కాసేపట్లో అవతలికి చేరుతాం కదా?

అయ్యా ఇక్కడే టాక్టిక్స్ ముందుకొస్తాయి. పూర్తిగా ఆ దిక్కు మొగం చేసి ఈదితే పైనుంచి వచ్చే వదర  వుధ్ధతిని ఎలా ఎదిరిస్తావు? బలం వున్నంత వరకు తేలి వుంటావు. ముందుకు పోవడం కన్న దిగువకు ఎక్కువగా పోతావు. వరద వుద్ధతికి వాగు వాలులో పడిపోతావు. కాసేపటికి వాగులో దిగువన పెద్ద మడుగులున్న చోటికి చేరుతావు. (మాకైతే గంగమ్మ, మడుగు అనేది వుండేది, మేము దిగే చోటికి దిగువన). అప్పుడిక ఆ లోతుల్లో ఈదడం ఎవరి వల్లా కాదు. వాగు నీరు అలాంటి చోట సుడులు తిరిగి ముంచేస్తుంది.

అందువల్ల వాగు ప్రవాహానికి ఎదురు ఈదాలి. దీన్నుంచే ‘ఎదురీత’ అనే మాట పుట్టింది. వేగంగా వత్తున్న నీటికి రొమ్ములిచ్చి ఈదాలి. పోనీ సరిగ్గా వాగు వాలుకు ఎదురుగా మొగం పెట్టి ఈదితే? అలాగయితే, మరి ఆవలి గట్టు వైపు ఈదేది ఎవరమ్మా, మీ నాయిన నా?! నువ్వు ఎక్కడికీ పోవు. కాసేపట్లో అలిసిపోయి మునిగిపోతావు.

సో, సోదరా ఆవలి ఒడ్డున నువ్వు చేరాల్సిన స్థలం ఏమిటో ముందు నిర్ణయించుకోవాలి. దానికి బాగా ఎగువన ఆవలి గట్టుననే మరో స్థలాన్ని గుర్తించాలి. నువ్వు ఆ రెండో స్థలాన్ని గురిగా పెట్టుకుని… అంటే అక్కడికి చేరాలి అనుకుని దానికి రొమ్మిచ్చి ఈదాలి.

నువ్వు లక్ష్యంగా పెట్టుకున్న ‘ఉన్నత’ స్థలానికి చేరవు. అది నీ ‘గురి’ మాత్రమే. అది నీ కళ్లకు నువ్వు పెట్టిన ధ్యేయం, అంతే. నువ్వు చేరేది, దానికి బాగా దిగువన నువ్వు చేరాలనుకున్న నీ స్థలానికి. లేదా దాని కన్న ఇంకాస్త దిగువకు చేరి, ఒడ్డుకు చేరాక పైకి నడుస్తావు.

అప్పుడిక యుద్ధం ముగిసినట్టు. పిల్లలు అందరూ నెత్తులకు కట్టుకున్న ప్లాస్టిక్ చుట్టలు విప్పుకుని, అంగీ నిక్కర్లు వేసుకుంటారు. ప్లాస్టిక్ సంచిని మడిచి పుస్తకాల సంచిలో పెట్టుకుంటారు. (మళ్లీ రేపటి యుద్దానికి కావొద్దూ?!) పుస్తకాల సంచి భుజానేసుకుని బస్సు రోడ్డు మీద తలముడిపి గ్రామంలోని స్కూలుకు నడుస్తారు. (బస్సులో పోవచ్చు గాని, దానికి… అటు అర్థ రూపాయి ఇటు అర్థ రూపాయి. ఎవురిస్తారు?)

ఈత దానికది పెద్ద విశేషం కాదు. నాలుగు మునగ బెండ్లు నడుముకు కట్టుకుని బావిలో దూకితే రెండు మూడు సార్లకు మునగ బెండ్ల కట్ట చిరాకనిపించి నువ్వే దాన్ని తీసేసి ఈదుతావు.

బతుకు ఆక్వేరియం కాదు. వరదలెత్తిన వాగు. ఎదురీదాల్సిందే. ఎదరీదే విధము తెలియాల్సిందే.

నేనొక వుద్యమ కారుడినై సంఘానికి ఎదురీదే వేళల, ఆ చిన్న నాటి ‘టాక్టిక్స్’ అనుభవం గుర్తుకొచ్చి నా లోపలి కవి గాడు మేల్కొన్న ఒకానొక క్షణం, ఇదిగో ఇక్కడ:

ఈత

అలల మీద పడుకుని

ఈదడం మానేసి

ఆసనాలు వేసే వాడు

రేపటికి వుబ్బి తేలిపోతాడు

అలలు పల్లకీలనుకుని

అలవోకగా ఆవలి తీరం

చేరిపోవచ్చునని

లంబకోణంలో ఈదే వాడు

తీరం చేరక ముందే

కళ్లు తేలేస్తాడు

అలల మీద సవాలు జేసి

నది వాలును పసి గట్టి

ఎదురీదే దమ్ములున్న వాడే

అవలి ఒడ్డున జెండా ఎగరేస్తాడు

ఇవాళ సంఘర్షించని వాడు

రేపటి విజయోత్సవంలో వుండడు

(‘లావా” (1984) నుంచి)

Lava poem

lava cover

02-03-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s