ఒక ఆకలి, మరొక ఆకలి

స్మృతి 3

(This is a column స్మృతి I have started in a group called Kavisangamam in Face Book.The following was the column that appeared last Thursday there. I will be posting today’s column next week in the same way as it is being done now.) 

హంగర్ చాల రకాలు. ఒక రకం ఆకలుంటే ఇంకో రకం కూడా వుండే అవకాశముంది. నేను రెండు రకాల ఆకలి గురించి చెప్పాలనుకుంటున్నా. అవి నా బతుకు బాటను నిర్దేశించాయి. అదెలాగంటారా? ప్లీజ్ రీడ్.   

(రెండు రకాలూ కాకుండా, వేరే ఆకలి గురించి ఇంకో రోజు, నేను కాస్త పెద్దయ్యాక, మాట్లాడుకుందాం).

ఇప్పుడు చూస్తే నమ్మకపోవచ్చు మీరు. బడిలో చేరడానికి ముందు… అంటే నాకు తొమ్మిదేండ్లు పడక ముందు భలే లావుగా వుండే వాణ్ని తెలుసా? ‘ఈడు లావెంకల మనిసి రో’ అని పెద్దోళ్లు మెచ్చుకునే వాళ్లు. (లావెంకలు అంటే లావు ఎముకలు).

పెద్దోళ్లది మెచ్చికోలు. పిల్లలది ఆట…

‘దుబ్బోని కడుపులో దూడపిల్ల

సొప్ప కట్ట తేరా కాల్చేద్దాం’

అని నా చుట్టూ ఎగిరే వాళ్లు. (కాల్చేయడమేంటో నాకు తెలీదు). తొమ్మిదో ఏట నాకు పుట్టెంటికలు తీయిస్తే, ఆ గుండును కూడా కలిపేసి…

‘బోడి గుండు బొక్క లెయ్

రోట్లేసి తొక్క లెయ్’

అని పాడే వాళ్లు. నాకు చాల కోపం వచ్చేది. చెప్పాను కదా, పిల్లలందరికి మనమే లోకువ.

అది గాదు గాని, ఇంకో సంగతి గుర్తొస్తే కుంచెం బాధేస్తుంది.

అప్పుడు మా ఇంట్లో ఈంత పెద్ద కంచు తల్లెలు వుండేవి. తల్లె అంటే బువ్వ తినే ప్లేటు. కంచు తల్లెలు చుట్టూ పైకి వంచిన అంచులతో వుండేవి. ఒక్కో దానిలో…ఇప్పటి ప్లేట్ల లెక్కన మూడు నాలుగు ప్లేట్ల అన్నం పట్టేది. స్టెయిన్ లెస్ స్టీలు సామాన్లు వచ్చాక కంచు చెంబులు, లోటాలు, తల్లెలు అన్నీ మాయమయిపోయాయి.

నేను ఒక కంచు తల్లె నిండా సంకటి లేదా కొర్రన్నం పెడితే అంతా హుష్ కాకి అనిపించే వాడిని. ఎట్టా తినే వాడి నంటే, తల్లె చుట్టూ… అదే ప్లేటు చుట్టూ… బీభత్సం, కురుక్షేత్రం.

మా నాన్న తన తలి దండ్రులకు ఒక్కడే కొడుకు. ఆయనకు ఐదుగురు చెల్లెళ్లు. వాళ్లలో అప్పటికి ముగ్గురికి పెళ్లిళ్లయిపోయి, ఇద్దరికి కావలసి వుండింది. ఇక్కడ మా అత్తల సంగతెందుకు తెచ్చానంటే, వాళ్లలో ఎవరు నా తిండి యుద్ధం చూసినా… ‘దొంగ నా బట్ట, ఈడు తిన్నీకెనే సాల్దు సంసారం, ఇగ ఈ అన్న గాడు మనకు వడిబియ్యాలేం బోచ్చాడు, మిగిల్నోళ్ల పెండ్లిండ్లేం జేచ్చాడు. థూ, యాతరి నా బట్టా! మట్టసంగ కూకోని సరీగ్గ తిన్లేవూ… తల్లె సుట్టు అట్ట పొయ్యకపోతె…?’ అని తిట్టి నా ప్లేటు తీసి, బండలు తుడుచే వారు,

వాళ్లు ఈ మాటలు అంటున్నప్పుడు ఆ చుట్టు పక్కల మా జేజి… అంటే… వాళ్లమ్మ వుంటే, వాళ్ల కథ మటాష్.  ‘సిన్న పిల్లోనికి మీ దిష్టి తగుల్తాదే, గవ్వ సేన్దాన్లారా, పారి అవుతలికి’ అని వాళ్లను కొట్టడానిక పోయేది. (గవ్వ సేన్దాన్లారా, పారి అంటే గవ్వ విలువ చెయ్యని వాళ్లారా, పొండి).

మా జేజి చాల మంచిది. పొద్దున్నే మజ్జిగ చేస్తున్నప్పుడు పోతే, లోటాలో వెన్న తీయని మజ్జిగ ఇచ్చేది. దాన్ని ‘కాను’ అంటారు. లస్సీ గిస్సీ ఏం పనికి రాదు దాని ముందు. ఇంకాసేపుండి, వెచ్చని జొన్న రొట్టె మీద వేలెడు మందం వెన్న పూసి ఇచ్చేది. బ్రెడ్ అండ్ బట్టర్ మడిసి పక్కన పెట్టాల్సిందే దాని ముందు.

బహుశా ఆ రుచుల వల్లనే మన యాపిటైట్ అట్టా పెరిగిపోయినట్టుంది. ఎప్పుడూ తినాలనిపించేది. ఆ తిండి యావ చాల కష్టాలకు దారి తీసింది.

తక్షణ కష్టం ఆరో తరగతికి గడివేములలో చేరి, కొండ మీది బొల్లవరంలో వుండగా మొదలైంది.

చెప్పానుగా?! కొండ మీది బొల్లవరం మా మామ వాళ్లూరు. మా మామ పేరు ఏలంపల్లి వీరా రెడ్డి. ఆ ఒకే ఒక అన్నకు ఒకే ఒక చెల్లెలు మా అమ్మ. మా అమ్మ పుట్టిన ఏడాదే వాళ్ల నాన్నను… ఎదిరి ఫ్యాక్షనిస్టులు… జొన్న చేనికి కాపలా వున్న వాడిని… ఒక్కడిని పది మంది చుట్టుముట్టి చంపేశారు. ‘అబిమన్నున్లెక్క కొట్లాడి సచ్చిపాయ’ అని చెప్పేది మా అమ్మ, పేద్ద తను అక్కడ వుండి చూసినట్టు.

మరి రెండు మూడేళ్లకే వాళ్ల అమ్మ కూడా చనిపోయింది. అన్న, చెల్లెలు ఇద్దరే ఇంట్లో. దాయాదులుండే వారు గాని, ఇంట్లో ఒకరికొకరు ఇద్దరే. దాని వల్ల ఆల్మోస్ట్ కవలల మాదిరి పెరిగారు. మా అమ్మంటే, మేమంటే  ప్రాణం మామకు.  

అత్త అలా కాదు. తప్పు ఆమెది కాదు. ఆమెకు కూడా చిన్న నాడే తలిదండ్రులు పోయారు. తనకు ఎవరూ లేరు. ఆల్మోస్ట్ అనాథ. మామ మాతో చాల బాగుండే వాడు గాని, అత్తను తరచు కొట్టే వాడు. ఆమె ఫ్రస్ట్రేషన్ నా మీద కాస్త పడింది. ఎంతైనా మా అమ్మ కాదు కదా, ఆకలి తెలిసి బువ్వ పెట్టడం వుండేది కాదు. నాకేమో ఎప్పుడూ ఆకలి. అమ్మ లేదు. ఏం చేయాలో తెలీదు.

దూరంగా ఇంకో మామ ఇల్లు. ఆయన చెల్లెలు, మా పిన్ని లక్ష్మిదేవి. పోగానే ‘ఏమ్రా రొట్టె దింటావా’ అని అడిగి రొట్టె మీద పప్పు పెట్టి చేతికిచ్చేది. మంచి తల్లి. ఎక్కడున్నా, చల్లగా ఉండాల.

ఇదీ నా మొదటి ఆకలి సంగతి. ఆ ఊళ్లో వుండగానే ఇంకో ఆకలి సంగతి తెలిసొచ్చింది. రెండో ఆకలి కూడా అప్పుడు పెద్దగా తీరలేదు. యాపిటైట్ పెరిగిందంతే. తరువాత్తరువాత ఈ ఆకలే నన్ను బతికించింది.

దాని సంగతి చెప్పాలంటే, మనం తిరిగి కథ రెగ్యులర్ ఫ్లో లోనికి వెళిపోవాలి.

కొండ మీద బొల్లవరం భలే ఊరు.

కర్నూలు- నంద్యాల దారిలో ఓర్వకల్ అనే పర్యాటక/పిక్నిక్ స్థలం గురించి మీరు వినుంటారు. ఒకట్రెండు సినిమాలు కూడా వచ్చినట్టున్నాయి ఓర్వకల్ కొండల లొకేషన్ తో. ఇక్కడ గ్రీనరీ ఉంటుంది గాని బాగా తక్కువ. ఇటీవల మరీ తక్కువయింది. ఈ కొండల్ని ఎర్రమల కొండలంటారు. అంటారు గాని, అది ఎరుపు కాదు. బంగారానికి దగ్గరగా వుండే లేత పసుపు రంగు. కొండలు ఎండలో బంగారంలా మెరుస్తాయి.

ఆ ఎర్రమల కొండల వరుసలోనే, చాల దూరంలో, ఒక పెద్ద గుట్ట మీద… భోగేశ్వరం అనే తీర్థ స్థలం దగ్గరి గుట్ట మీద ఉంటుంది ఈ బొల్లవరం అనే వూరు. మూడొందల ఇండ్లు వుండీ లేక. బంగారం పండే పొలాలు. కొండల రంగూ బంగారమే.

ఆ బండ రాళ్ల మధ్యకు వెళితే చాలు; ఆకాశం, చెట్లు, బయలు అన్నీ వుండి కూడా మనుషుల్లేని అద్భుత వైశాల్యం. గొప్ప ఏకాంతం. ఆ బండరాళ్ల మధ్య ఎన్ని పాటలు పాడుకున్నానో, పాటలంటే ఏమిటో కూడా నాకు తెలవక ముందు.  

నేను, మా రాం చెంద్రా రెడ్డి చిన్నాయ్న, పక్కింటి పిల్లోడు పాపి రెడ్డి, కనుమ మీది వెంకటయ్య, తెలుగు రాముడు… ఇంకా కొందరం ఎర్రమల కొండల్లో ఒక గుట్ట మీద వున్న ఆ వూరి నుంచి బయల్దేరే వాళ్లం. ఆ గుట్ట దిగే లోపు కనీసం ఐదారు చిన్ని మజిలీలు. నాకు బాగా ఇష్ఠమైన మజిలీ… ఒక చోట కాలి బాట పక్కనే కొండ రాయి పగులు వారి ఏర్పడిన చిన్న రాతి గుంట, దానిలో ఎక్కడి నుంచి వస్తాయో ఏమో ఎండా కాలం కూడా తేట తేట నీళ్లు వుండేవి. నీల్లు చాల రుచిగా వుండేవి. నీళ్లలో గున గున తిరిగే చిన్ని నత్తలు, అవి కప్పుకున్న నల్లని గుల్లలు…

ఇప్పుడు ఆ గుట్ట వాలు దిగువన కొండను పేల్చి కాలువ చేశారు. తెలుగు గంగ. నీళ్లు ఆ వూరి పొలాలకు రావు. ఆ చిన్ని చెర్రె, దానిలో చిన్ని నత్త గుల్లలు మాత్రం అలాగే వున్నాయి.

గుట్ట సాంతం దిగి పొలాల్లో కాస్త నడిస్తే ఇంకో చిన్న గుట్ట. అది కూడా ఎక్కి దిగితే మా వూరి మీదుగా వచ్చే మద్దులేటి వాగు. 

ఇప్పుడు రెండో చిన్న గుట్ట మీద ఇసుక తయారీ పరిశ్రమ లాంటిదేదో వెలిసింది. అది కొండకు పక్కలో బల్లెమని వేరే చెప్పనవసరం లేదు.

మద్దులేటి వాగు దాటి గడివేముల వూళ్లోకి వెళ్లీ వెళ్లక ముందే; ఒక సొరంగం లాంటి నాలు గైదు గదుల పొడుగాటి ఇల్లు. అదే మా హై స్కూలు.  

అదిగో ఆ చివరి గదిలోనే… పరీక్షల కోసం కాకుండా ఇష్టంగా చదువుకునే పుస్తకాలుంటాయని నాకు మొదటి సారి తెలిసింది. నా రెండో ఆకలి మొదలైంది.

మేము బళ్లో చేరిన ఏడాదే స్కూలుకు లైబ్రరీ పుస్తకాలు వచ్చాయి. స్కూలు అంటే దానికొక లైబ్రరీ వుంటుందని అప్పడే తెలిసింది. దానికొక గది వుంటుందని అప్పటికి కూడా తెలీ లేదు. లైబ్రరీ అంటే స్కూలు సొంత పుస్తకాలు. పాఠాల పుస్తకాలు కాదు, కథల పుస్తకాలు. ఇదే మాకు తెలిసింది. ఆ పుస్తకాలు వూరక మా హెడ్మాష్టరు బజార్రెడ్డి సారు గదిలో పడి వుండేవి. ఒక రోజు మా క్లాసు టీచరు హుసేన్ సారు పుస్తకాలు తెచ్చి క్లాసులో ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చారు.

నాకు వచ్చిన పుస్తకం పేరు ‘బంగారు దీవి’. అది రావూరి భరద్వాజ అనువదించిన జూల్స్ వెర్న్ నవల అని నాకు గట్టి జ్జ్ఞాపకం. కాకపోవచ్చు.

ఆ మర్నాడు ఆదివారం వుండేట్టు చూసి ఇచ్చినట్టున్నాడు హుసేన్ సారు. నా ‘బంగారా’న్ని ఏక బిగిన చదివేశాను. ఆకలి తీర లేదు. ఇంకా కావాలనిపిస్తోంది. పక్కింటి పాపి రెడ్డి పుస్తకం చదివాను. తీరలేదు. కనమ్మీది వెంకటయ్యది, తెలుగు రామునిది, రాం చెంద్రాడ్డి సిన్నాయ్నది అన్నీ అడిగి తీసుకుని చదివేశాను.

అది సార్. అప్పుడు మొదలైంది రెండో ఆకలి. అయితే ఇది ఏ పుస్తకమైనా సరే అనే ఆకలి కాదు. కథ. కథ కావాలి, కథ.

ఇది పుస్తకం ఆకలి కాదు, కథల ఆకలి. ఈ ఆకలి అంతకు ముందే.. ఒక నడిచే పుస్తకంతో మొదలైంది.

ఆ పుస్తకం పేరు కత జెప్పే పుల్లన్న.

పుల్లన్నది మా వూరు కాదు. యా వూరో తెలియదు. అసలు యా వూరూ కాదేమో. మా వూర్లో వున్నన్నాళ్లు మా వూరే అనిపించేది. ఒక పెద్ద వీణ భుజం మీద పెట్టుకుని, దాన్ని ఏక్తార లా టున్ టున్ అని లయ బద్ధంగా మీటుతూ పాడే వాడు. పక్కన ఆయన భార్య  టం టం ఠ అని డక్కి (గుమ్మెట) కొడుతూ తందాన తానా అనీ, ఆ…హ్హా… అనీ వంత పలికేది. పుల్లన్న తన మరో చేత్తో అందెలు మోగిస్తూ….

‘అరెరేయ్… బుగుల్ బుగుల్ రంగం పేటా శివారెడ్డి రా సై

నవాబు గుర్రం కల్లెం తానే ఒడిసి పట్టినాడా సై

అప్పుడు దిన్నా పప్పూ రొట్టే ఇప్పుడు గక్కాలన్నాడా

అరె ఇప్పుడు గక్కాలన్నాడా

అరెరే… బుగుల్ బుగుల్ రంగం పేటా శివారెడ్డి రా సై’

‘తందాన తానా తందాన తానా, తానే తందానా…’

వారెవ్వా, పుల్లన్నా! నామొదటి ఉపాధ్యాయుడా! నీకు దండాలు.

పుల్లన్నతో నా అత్మీయత ఆకస్మికం కాదు, విచిత్రమూ కాదు. అది గ్రామ జీవితంలో ఒక ఇన్ బిల్ట్ కాంపొనెంట్.

పుల్లన్న ఇంటి ముందుకు వచ్చి తాంబూర మీటితే మా అమ్మే కాదు ఏ అమ్మా ‘పొయి రా పో న్నో’ అని అనదు. మా అమ్మ తన చెయ్యితో జొన్నలు తీసి వాటిని దేంట్లోనైనా పోసి ఇచ్చేది. తను పనిలో లేకపోయినా సరే, మనమే వెళ్లాలి పుల్లన్న కాడికి.

పుల్లన్న “ఏం రొడ్డీ ఇంగ బడికి వోల్యా” అని తెల్లని దంతాలతో నవ్వే వాడు. ‘పిల్లోడు వుశారు సుబ్బమ్మ తల్లీ, ఎట్టనన్న జేసి సదువు మానిపియ్యాకరి. కార్కూన అయితాడు. సంజి రెడ్డి పేరు నిలవెడ్తాడు’ అనే సరికి నాకూ అమ్మకు ఏదో గెల్చినంత సంతోషమయ్యేది. (కార్కూన అంటే రెవిన్యూ ఇన్స్పెక్టరు).

పుల్లన్న అడుక్కోడానికి వచ్చినప్పడే కాకుండా, ఎవరయినా గింజలు కొలుస్తామంటే, వాళ్లింటి ముందు తనూ తన భార్య చాప వేసుకుని కూర్చుని లాంపు వెలుగులో కత జెప్పే వారు. వాళ్ల డక్కి శబ్దం వినిపిస్తే చాలు మనం ఉరుకులు పరుగులు. కథ విన్నంత సేపు విని అక్కడే నిద్ర పోతే నాయిన్నో, దాసరయ్యనో వచ్చి నన్నెత్తుకు పోయి మంచం మీద పడుకోబెట్టే వాళ్లు. (దాసరయ్య తెలుగు కులం వాళ్లు, మా నాన్నకు ప్రాణ స్నేహితుడు).

అప్పుడలా పరిచయమైంది కథ. పుల్లన్న లెక్క కత జెప్పే వాళ్లు లేకున్నా, దాన్ని పుస్తకంలో చదువుకోవచ్చు అని నాకు తెలిసింది ‘బంగారు దీవి’తోనే. ఆ వారం స్నేహితుల పుస్తకాలు కూడా చదివేశాక, మాకు పాఠాలుగా వుండిన గలివర్స్ ట్రావెల్స్ అబ్రిడ్జ్డ్ నవలను, ఒక కాలి మీద ట్రౌజర్ పైకి మడిచిన బొమ్మతో ఏబ్ లింకన్ కథను కూడా చదివేశాను. దీని వల్ల భాష మీద ఏదో మమకారం, చిన్ని అధికారం కూడా పుట్టుకొచ్చాయి. ఏడో తరగతిలో తెలుగు సారు ‘దివి’ అంటే ఏందిరా అంటే  ఆకాశం అని చెప్పి…. అరే,  నాకు వేరే పదాలు కూడా తెలుసే అని అశ్చర్యపోయాను. అలా ఆశ్చర్యపోవడం ఇప్పటికీ ఇష్టం.

నాన్ డిటెయిల్డ్ టెక్స్టులలో కథలుంటాయని తెలిశాక, కథలకు అదొక వనరు అయిపోయింది. సీనియర్ క్లాసు పిల్లల్ని అడిగి వాళ్ల నాన్ డిటెయిల్డ్ టెక్స్టు లు తీసుకుని చదువుకునేది.

ఇది కాకుండా ఇంకో వనరు గురించి చెప్పక పోతే నా రెండో ఆకలి కథ పూర్తి కాదు.

మా వూర్లో నాలుగైదు బ్రాహ్మణ కుటుంబాలు వుండేవి. అందులో ఒకటి కలుగొట్ల సుందర రావు కుటుంబం. ఆయన అన్న కొడుకు విజయాత్రేయ. ఒకే కుటుంబం.

విజయాత్రేయ ఛందోబద్ద పద్యాలు బాగా రాసే వారు. ‘భాగీరథీ నది పరవళ్ల నురవళ్ల చిట్టి ముత్తెపు జల్లు చింది పడగ… ’ అని శ్రావ్యంగా చదివే వారు. మద్రాసు లోని ఎం వి ఎస్ పబ్లికేషన్స్ కోసం నెల కొక పేపర్ బ్యాక్ నవల కూడా రాసే వారు. ఎంవిఎస్ వాళ్లు ఈయన అచ్చైన నవల కాపీలతో పాటు అప్పుడే అచ్చయిన మరి కొన్ని నవలలు పంపే వారు. కృష్ణమోహన్, ఆర్ విఎస్ ప్రసాద్, వి ఎస్ చెన్నూరి, భయంకర్, పాంచాలి….  వాళ్లతో పాటు కొమ్మూరి సాంబశివరావు, విశ్వ ప్రసాద్, గిరిజ శ్రీ భగవాన్ కూడా ఆ ఊపులోనే పరిచయమయ్యారు.

శలవు దొరికితే చాలు సుందర రావు ఇంటికి వెళ్లి పేపర్ బ్యాక్స్ చదువుకునే వాడిని. పగలు వుంటే స్కూళ్లో లేదా సుందర రావు ఇంట్లో అన్నట్టుండే వాడిని. ఆదివారాలన్నీ అక్కడే కాబట్టి ఆ ఇంట్లో నాకు ‘ఆదివారం గాడ’ని పేరు పడిపోయింది.

అంతెందుకు, విజయాత్రేయ చనిపోవడానికి ఒక ఏడాది ముందు నేను హైదరాబాదు నుంచి వాళ్లింటికి వెళితే, బయటి అరుగు మీద కూర్చుని చీకటిలోంచి ఎవరూ అని అడిగి, నా పేరు చెబితే ‘ఓ, అదివారం గాడు కదూ” అని గుర్తు చేసుకోవలిసి వచ్చిందాయనకు.

ఎప్పుడూ ఆ ఇంట్లో వుండడం వల్ల అమ్మయ్య వాళ్లు అంగడికి వెళ్లి తీసుకు రావలసిన వస్తువుల కోసం నన్ను పంపించే వారు. ఇది చూసి నా నేస్తులు కొందరు ‘సుందర రావు పెద్ద జీత గాడు’ అని గేళి చేసే వారు. మనకేం లెక్క. కథల పుస్తకాలు ముఖ్యం. (అమ్మయ్య అంటే……శూద్రులు బ్రాహ్మణ పురుషులను అయ్యా అని, బ్రాహ్మణ స్త్రీలను అమ్మయ్య అని పిలవడం మా వూళ్లో ఆనవాయితీ).

వాళ్లింట్లోనే కాదు ఇక ఎవరింట్లో డిటెక్టివ్ నవలలున్నా మనం అక్కడ వాలాల్సిందే. మా ఇంట్లో ఆ నవలలు చదివితే, క్లాసు పుస్తకాలు కావని నాన్నకు తెలిసి, చర్నాకోల పుచ్చుకునేది. అందుకని, అవి ఎక్కడ దొరకితే అక్కడే చదువుకునేది. అక్కడ చీకటి పడిపోతే, అలాగే కళ్లు చికిలించి చదువుకోడం, రాత్రి టెక్స్టు పుస్తకాల మధ్యన పెట్టుకుని చదువుకోడం… నా ‘కథాకలి’లో ఇంకొన్ని విశేషాలు.

చిట్ట చివర ఓ చిన్న తమాషా.

తలముడిపి బడిలో చేరాక నా నడక స్నేహితులు చౌడేశ్వర రెడ్డి, అబ్దుల్ మునాఫ్ గురించి చెప్పాను కదూ?!

స్కూలు నుంచి మా వూరికి నడవడానికి గంటన్నర పట్టేది. దారి పొడుగునా, పొలాల్లో… నా ముందు మునాఫ్, వెనుక చౌడేశ్వర రెడ్డి కబుర్లు చెప్పుకుంటూ నడిచే వారు. మధ్యలో నేను, నవల చదువుకుంటూ.

అనుకోవడమే గాని, నేను ఇప్పటికీ అంతే నేమో. ఇప్పుడు నా ముందెవరు? నా వెనుక ఎవరు? గెస్ హూ న్ హూ!

24-02-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s