గంగిరెడ్డి వెంకట కొండా రెడ్డికి జోహార్లు

(ఫిబ్రవరి, 24న ఆయన వర్ధంతి సందర్భంగా సభలో చదివి వినిపించిన నా నోట్)

కొండా రెడ్డి అన్న అంటే నాకూ మా ఆవిడకు బలే ఇష్టం. కర్నూలు టౌన్ హాలులో, పెద్ద వాళ్లను కాదని మా పెళ్లి మేమే చేసుకున్నాం. మాకు అండగా నిలబడిన మనిషి కొండా రెడ్డి. నా రాజకీయ జీవితానికి మార్గదర్శి గంగి రెడ్డి వెంకట కొండా రెడ్డి.

నేను నా ఎమ్మే అయిపోగానే మా వూరు గనిలో వుంటూ, వుద్యోగం సంగతి తరువాత చూడొచ్చు, ఉద్యమంలో పని చేయాలి అని అనుకున్నాను. అవి భారత దేశమంతటా విప్లవోద్యమ కెరటాలు చెలరేగుతున్న కాలం. మేము మా వూళ్లో చిన్న రైతు కూలి సంఘంగా రూపొంది మాకు తోచినట్లు పని చేసే వాళ్లం.

మేమూ, మా చిన్న రైతుకూలీ సంఘం వాళ్లం కమ్యూనిస్టు విప్లవోద్యమంలో పాల్గొనాలని తీర్మానించుకున్నాం. ఎవరితో కలసి పని చేయాలి అనేది నిర్ణయించుకోడానికి, ముందుగా ఆనాటి డివి రావు గ్రూపు నాయకుడు మండ్ల సుబ్బారెడ్డి గారిని ఆహ్వానించి వాళ్ల రాజకీయ పంథా తెలుసుకున్నాం. ఆయన మూడు రోజల పాటు చెప్పారు.

ఆ తరువాత సిపి గ్రూపు నుంచి గంగి రెడ్డి అన్నను పిలిపించుకున్నాం. తన వాక్కు ఎంత సూటిగా ఎంత స్పష్టంగా వుందంటే, ఆదే రోజు సాయంత్రం నేను సంచి భుజానేసుకుని గంగి రెడ్డి అన్నతో పాటు పార్టీలో పని చేయడానికి కర్నూలు వచ్చేశాను. కర్నూలు జిల్లాలో పిడిఎస్యూ నిర్మాణం కోసం పని చేయడం మొదెలెట్టినప్పటి నుంచి గంగి రెడ్డి అన్న అండదండలు, సలహాలు నాకు గొప్పగా వుపయోగపడ్డాయి.

గంగి రెడ్డి అన్న ఎలాంటి భేషజాల్లేని స్నేహ శీలి. తన కన్న చిన్న వాళ్లతో పాలలో పంచదారలా కలిసిపోయే వాడు. చిన్న వాళ్లకు తెలియనివి చెప్పడమే గాని, పెద్దరికం పోకడలకు పోయే వాడు కాదు. గతి తార్కిక భౌతిక వాదం పాఠం చెబితే మరి మరి వినాలని అనిపించేది. ఆ రోజుల్లో కర్నూల్లో అన్న వాళ్ల ఇల్లు పార్టీ ఆఫీసుకు దగ్గరగా వుండేది. నేను చాల ఎక్కువగా ఇంట్లో తనతో చర్చించి మరీ నా పనుల్లోకి వెళ్లే వాడిని.

ఎమర్జెన్సీలో నేను అరెస్టయ్యి, తిరిగి బయటికి వచ్చాక పార్టీ పత్రిక పని చూస్తూ హైదరాబాదులోనే వుండిపోయాను. అన్నను పెద్దగా కలవకపోయాను. అయినా, కలిసినప్పుడంతా భలే ఆనందం అనిపించేది. ఈలోగా ఆయన వాళ్ల వూరు కాశి పురం వెళ్లారని, అక్కడి రాజకీయాల్లో పాల్గొంటున్నారని విన్నాను తప్ప, అప్పటి సంగతులు నాకు పూర్తిగా తెలియవు. కలిసిన ఒకటి రెండు సార్లు ‘నువ్వు ప్రజల కోసం బాగా పని చేస్తున్నావు’ అని భుజం తట్టే వారు.

ఆయన రాసిన ‘నాంది’ నాటకం కర్నూలు జిల్లాలో ప్రకంపనాలు సృష్టించింది. రాత్రి ఆ నాటకం చూసి పొద్దున లేచి కూలీ రేట్ల సమ్మెకు దిగిన గ్రామాలున్నాయి. అది ఒక సాహిత్య రూపంగా గొప్పగా వుందని గుర్తు చేస్తూ, ఇంకో నాటకం రాయాలనీ, వేరే రచనలు చేయాలనీ నేను పదే పదే అడిగే వాడిని. ‘ప్రస్తావన’ పేరుతో ఇంకో నాటకం రాస్తున్నానని చెప్పేవారు. రాసి వుంటే అది పిల్లలకు తెలిసి వుంటుంది. నాటకం కాకుండా ఆయన రచనలు ఇంకేమైనా వుండొచ్చు. వాటిని ఒక పుస్తకంగా ప్రచురించడం బాగుంటుందని నా సూచన.

అన్నను ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నందుకు చాల విషాదంగానూ, సంతోషంగా కూడా వుంది. తక్కువ కాలం జీవించినా నిండుగా జీవించిన మనిషి. ప్రజల కోసం జీవించిన మనిషి.. ప్రజల కోసం తపించిన మనిషి.

ఇవాళ గంగిరెడ్డి లేరు. ఆయన అక్షరం వుంది. ఆయన జనం కోసం పడిన తపన వుంది. ఆ తపనను మనం అంది పుచ్చుకుందాం. దాన్ని నెరవేర్చడానికి శాయశక్తులా పని చేద్దాం. ఆయన జీవితాన్ని బలి తీసుకున్న రాజకీయాల నుంచి రాసీమ విముక్తి కోసం కృషి చేద్దాం. జగమంతా మానవాళికి మంచి కాలం రహించే రోజుల కోసం పని చేద్దాం.
గంగి రెడ్డి వెంకట కొండా రెడ్డికి జోహార్లు

24-02-2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s