డ్యుయల్ ఆన్ ఎ డంగ్ హీప్

స్మృతి 2

(This is a column స్మృతి I have started in a group called Kavisangamam in Face Book.The following was the column that appeared last Thursday there. I will be posting today’s column next week in the same way as it is being done now.) 

తొలి విజయం చాల గొప్పగా వుంటుంది.

ఆ తరువాత ఎన్నో గెలుపులు, ఎన్నో ఓటములు. అలవాటు పడిపోతాం. పెద్దగా ఆశ్చర్యం వేయదు.

తొలి ఓటముల ముద్ర ఎన్నటికీ చెరగదు. అది మన దిగులు అవుతుంది. తొలి గెలుపు ముద్ర కూడా అంతే. అది మన ధైర్యం.

అట్టడుగు నుంచి పాక్కుంటూ పైకి వెళ్లి మెయిన్ స్ట్రీమ్ ని సవాలు చేసే వాళ్లు చెప్పినంత బాగా మరెవరూ చెప్పలేరు గెలుపోటముల కథను. ఈ కథ ఒక ఉప్పునీళ్ల బావి దగ్గర మొదలవుతుంది.

మా వూళ్లో బావులన్ని ఉప్పు నీళ్లే. కొత్తగా ఎక్కడ తవ్వినా ఉప్పునేళ్లే పడతాయి. తాగే నీళ్లు… వాన కాలమైతే వాగు నుంచి తెచ్చుకునేది. దాని పేరు మద్దులేటి వాగు. ఎండా కాలమైతే వాగు గర్భంలో చెలిమలు తీసి లోటా లోటా తోడుకుని తెచ్చుకునేది. ఊళ్లోని రెండు బావుల్లోనూ ఉప్పు నీళ్లే. అయినా, ఎందుకో మా ఇంటికి దగ్గరి దాన్నే ఉప్పునీళ్ల బావి అనే వాళ్లం.

ఆ బావి మెట్ల మీదే నేను భయమంటే ఏమిటో తెలుసుకున్నాను. పోటీ, ఓటమి అనేవి పరిచయమైంది కూడా అక్కడే.

ఆ బావికి పక్కగోడల్ని, మెట్లను…. నేల మట్టానికి పైన.మాత్రమే వేరే రాళ్లు తెచ్చి కట్టారు. కింద అంతా తవ్విన బావి తవ్వినట్లుగానే వుండేది. కారణం, అదంతా అంతకు ముందే ముదురు గోధుమ రంగు కొండ రాయి. ఆ బావిని తవ్వారు అనడం కన్న తొలిచారు అనడం ఎక్కువ సబబు. దాని మెట్లు కూడా అలా తొలచబడినవే. సమంగా వుండేవి కాదు. మెట్ల మీద మనుషులు చాల కాలంగా నడవడం వల్ల అవి అరిగిపోయి నున్నగా జారుడు జారుడుగా వుండేవి. పోగా పై నుంచి దిగి కింద నీళ్ల దగ్గరికి చేరే లోగా మూడు నాలుగు మలుపులు తిరగాలి. నీటి మట్టానికి దగ్గరగా వుండే మలుపు మరీ షార్ప్. చాల జారుడుగా వుండేది. మెట్లు ఎక్కుతూ/దిగుతూనే మలుపులు తిరగాలి. భలే భయమేసేది.

నేనూ మా పక్కింటి పిల్లోడు శివరామి రెడ్డి ఇద్దరం మా కడవలు తీసుకుని నీళ్లకు వెళ్లే వాళ్లం.

పొగాకు మండె తిప్పుతుండగా తేలు కుట్టి రాత్రంతా ఏడ్చి ఏడ్చి తెల్లారే సరికి చనిపోయి, నాకు ఎప్పటికీ మరుపురాని సావాసకాడు శివరాము. భాస్కర శత కోత్పలమాలావృత భయంకర బాల్య సశేషం నా జీవితమని చెప్పుకున్నానొకసారి. ఆ భాస్కర శతక సహాధ్యాయి శివరాము.

బావికి నా కడవ కన్న పెద్దది తెచ్చే వాడు శివరాం. నా చిన్ని కడవను చూసి గేళి చేసే వాడు. నిండు కడవను ఎగరేసినట్టు ఒక్కసారిగా భుజం మీదికి చేర్చుకుని నువ్విలా చెయ్యగలవా అని గేళిగా నవ్వే వాడు. నాకది చాత గాక సిగ్గు పడే వాడిని.

తనతో కలిసీ, ఒక్కడిగా కూడా… ఆ బావిలో ఎన్నో సార్లు దిగి, కడవలో నీళ్లు తీసుకుని, ఎత్తుకుని, మళ్లీ ఎక్కివుంటాను. ఎన్నో సార్లు చేసిన పని. అయినా, ప్రతి సారీ, కడవ భుజాన పెట్టుకుని ఒక్కొక్క మెట్టు దిగడం, లేదా ఎక్కడం ఒక్కొక్క జీవితంలా అనిపించేది. మెట్టు మీద కాలు జారుతుందని, పడిపోతానని భయం. ఆ కాసేపు కాదు. జారుడు మెట్టు భయం రాత్రులు కలలో వచ్చేది. ఇప్పటికీ వస్తుంది కల… ఎక్కడో జారుడు మెట్ల మీద భయపడుతూ నడుస్తున్నట్టు.

ఆ బావీ ఆ మెట్లూ చాల సార్లు నా కవిత్వమయ్యాయి.

అక్కడ మొదలైంది నా ఓటమిక భావన. ఆ జారుడు మెట్ల వల్ల కొంతా, శివ రామి రెడ్డి వల్ల కొంతా. బావిలో తను చులాగ్గా కడవ ఎత్తుకుని చలాగ్గా ఆ మెట్ల మీద నడిచి వెళ్లే వాడు. నా కేమో భయం. భయం గురించి మరో సంగతి కూడా చెప్పాలి. అది తరువాత.

ఇప్పుడిక, ఒక విజయం గురించి చెప్పాలి. మీరు నవ్వుతారు, ఇదీ ఒక విజయమా అంటారు. అది నాకు చాల ముఖ్యమైన విజయం.

అది ఒక పెంట దిబ్బ మీద సాధించిన విజయం. ఆ విజయ గాథ కోసం వేరే వూరికి వెళ్లాలి. వెళదాం.

మా వూరి పేరు గని, మా వూళ్లో ప్రభుత్వ పాఠశాలను సర్కారు బడి అనే వాళ్లు. అందులో ఐదో తరగతి వరకు వుండేది. నేను సర్కారు బడికి దాదాపు వెళ్లలేదు. నంబి రామయ్య అని ఒక అందమైన అయ్య వారు మాకు ప్రైవేటు చెప్పే వారు. తలా నెలకు ఒక రూపాయో అర్ధ రూపాయో ఇచ్చేవాళ్లం. పెద్ద బాల శిక్ష, కృష్ణ శతకం, గజేంద్ర మోక్షం, భాస్కర శతకం, వడ్డీ లెక్కల వరకు ఎక్కాలూ లెక్కలు…. అదీ మా సిలబస్. నాకు గుర్తున్నంత వరకు మాకు పుస్తకాలే గాని, తరగతులు గిరగతులు ఉండేవి కావు. శతకాల్లో పద్యాలకు అర్థాలు చెప్పే వారు కాదు. ఊరికే బట్టీ పట్టించే వారు.

తొమ్మిది దాటి పదో ఏడు రాబోతుండగా నన్ను సర్కారు బడికి తీసుకుపోయి ఒకే సారి ఐదో తరగతిలో కూర్చోబెట్టారు. ఓ ఆర్నెళ్ల తరువాత ఎంట్రన్సు టెస్టు. ఆ ఆరు నెలలు శంకరయ్య సారు అని సర్కారు బడి హెడ్మాష్టరే రాత్రులు కూర్చోబెట్టి చదివించే వారు. అందుకు మా నాన్న ఆయనకివ్వాల్సిన యాభై రూపాయలో ఎంతో ఇవ్వ లేక ఓ బస్తా జొన్నలు కొలిచి ఇచ్చిన దృశ్యం మనసు మీద మరో చెరగని ముద్ర.

కాట్ పిల్లి ర్యాట్ ఎలుక ఎంట్రెన్సు తరువాత, మా బ్లాక్ (మండల) కేంద్రం, గడివేముల అనే ఊళ్లో ఆరో తరగతి.

అంత వరకు మా ఊళ్లో ప్రతి పిల్లవాడికీ నేను లోకువే. మేం వున్న వాళ్లం కాము. రెడ్లమే గాని బాగా పేద వాళ్లం. సబ్సిస్టెన్స్ ఫార్మర్స్. ఉన్న వాళ్లు కొనుక్కునేవన్నీ నేను కొనలేను. వాళ్లు మంచి బట్టలు వేసుకునే వారు. నాకవి వుండేవి కాదు. ఎవరింటికైనా వెళ్లినప్పుడు వాళ్లింట్లో తీపి పదార్థాలు తింటూ వుంటే ‘సీపిరోన్లెక్క’ చూసుకుంటూ వుండడం. వాళ్ల ఇళ్లల్లో చాల ఎక్కువ సార్లు వరి అన్నం తినే వాళ్లు. మా ఇంట్లో ఎప్పుడూ జొన్న సంకటే. ఎప్పుడైనా కొర్ర అన్నం వుండేది. దీపావళి నాడు వాళ్లు బాణాలు (టపాసులు) కొని కాలుస్తుంటే దూరంగా నిలబడి చూడడం. తీవ్రమైన ఇన్ఫిరియారిటీ భావన వుండేది లోలో. దానికి తోడు, లేదా ఆ కారణం వల్లనేనేమో, ఎవరు ఏమాత్రం కాస్త బెదిరించినట్టు మాట్టాడినా ముడుచుకుపోయే వాడిని.

గింగిర గోల్, చిల్లం గొడె (బిల్లం గోడు), అచ్చిబిల్లల ఆట, చెడుగుడు ఏ ఆటలోనైనా మొదటి ఓటమి నాదే. ఓడిపోయిన వాళ్లు గెల్చిన వాళ్లకు అప్పచ్చులు ఇవ్వాలి. ఓడిన వాళ్లు చెయ్యి ముందుకు చాచి, హస్తం భాగం నిలువుగా ఉంచాలి. గెల్చిన వాళ్లు ఆ హస్తం అటు ఇటు తగిలేలా తమ రెండు హస్తాల (పామ్స్)తో కొడతారు. అదేం పెద్ద నొప్పెట్టదు. ఓడిపోయిన బాధ, అంతే. ఎప్పుడూ నేనే అప్పచ్చులు ఇచ్చే వాడిని. ఎప్పుడూ గెల్చే మా సంజి రెడ్డి చిన్నాయిన ను (తను నా కంటే ఆర్నెళ్లు పెద్ద), శివరామి రెడ్డిని చూసి లోపల కుళ్లుకునే వాడిని. మన కుళ్లు యవ్వారం చూసి నా యీడు వాళ్లు వూరికూరికినే గిల్లుకుని నన్ను కొట్టే వాళ్లు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లే వాడిని.

అయ్యగారి బళ్లో కూడా అవమానాలే. ఎప్పుడూ ధ్యానాలు పోతూ వుండే వాడిని. పలక మీద ఇరవై ఎక్కాలు రాస్తే అరవై తప్పులు పోయేవి. అయ్య తిట్టి, చెయ్యి వెనక్కి తిప్పి, వేళ్ల ముణుకుల మీద బెత్తంతో కొట్టే వాడు. ఇది నొప్పీ, అవమానం. ఇవన్నీ కలిసి… నేను చాల తక్కువ అనే భావన, నేను గెలవడం అనేది ఎప్పటికీ వుండదనే భావన నాలో గాఢంగా పాతుకుపోయి వుండేది. సావాస కాళ్ల మీద విపరీతమైన అసూయ. లోకం ఇట్టా ఎందుకుండాలని ఏడుపు.

ఔను విపరీతంగా ఏడ్చే వాడిని. ప్రతి దానికీ ప్రాణం పుచ్చుకుని ఏడ్చేవాడిని. నవ్వుకోడం ఎప్పుడూ వుండదన్నట్టుగా ఏడ్చేవాడిని. గుక్క పట్టి ఏడిస్తే ఇక ఆ గుక్క తిరిగేది కాదు. ఊపిరాడక చచ్చిపోతానని అమ్మ భయపడేది. ఒళ్లోకి లాగి కూర్చోబెట్టుకుని, నా రెండు చెవులు గట్టిగా మూసి వుంచేది, గుక్క తిరిగి నేను ఊపిరి పీల్చే వరకు.

అట్టాంటి వాడిని ఆరో తరగతిలో చేరాను. హై స్కూలు వున్న గడివేముల మా వూరికి పదిహేనిరవై కిలో మీటర్ల దూరం. మా వూర్నించి ఆ వూరికి నడిచి వెళ్లడం కుదరదు. గడివేములకు ఐదు కిలో మీటర్ల దూరంలో మా మామయ్య వాళ్లూరు. ఆ వూరి పేరు కొండ మీది బొల్లవరం. ఊరు నిజంగానే కొండ మీద ఉండేది. ఆ వూరి కొండ దిగి, కాస్త నడిచి, ఇంకో కొండ ఎక్కి దిగి, మరి కాస్త నడిస్తే గడివేముల. ఆ వూళ్లో మా స్కూలు. అక్కడ మన ఆరో తరగతి చదువు.

స్కూలు నుంచి ఇంటికొచ్చినాక కలిసి తిరిగే స్నేహితులు మా బామ్మర్ది పరమేశ్వర రెడ్డి, పక్కింటి చంద్ర శేఖర రెడ్డి, బోయ బాలుడు (ఔను తన పేరే బాలుడు, బోయ కులం), కోంటి ఎల్లయ్య కొడుకు సామి శెట్టి, కురుగ మద్దులేటి. అందరం కొండల్లో భలే తిరిగే వాళ్లం. ఎర్రెర్ర పూల సుంకేశుల చెట్లు ఎక్కే వాళ్లం. ఈరన్న కుంట అనే ఎర్ర నీళ్ల కుంటలో ఈదులాడేవాళ్లం. ఎనకయ్య గుండం అనే ఖాళీ స్థలంలో పరుగులు తీసే వాళ్లం.

అంతా బాగానే వుంది గాని…. ఆటల్లో కొట్లాటల్లో… షరా మామూలే, ఎప్పుడూ మనదే ఓటమి. చంద్ర శేఖర రెడ్డికి నేను అదువ చిక్కాను. (అదువ చిక్కడమంటే, వీడిని ఏమైనా చెయ్యొచ్చని ఇంకొకరికి అనిపించడం, లోకువ). అతడు నన్ను చీటికి మాటికి కొట్టే వాడు. అది నాకు వేరే వూరు. ఏడ్చి చెప్పుకోడానికి అమ్మ లేదు. నాలో నేను ఏడ్చుకునే వాడిని.

ఒక రోజు ఊరి బయట దిబ్బ మీద ఆడుకుంటున్నాం. దిబ్బ అంటే పశువుల పేడ వేసిన గుంట. గుంట నిండి ఆ పైన గుట్టగా పేడ వుండేది. పేడ ఎండి పోవడం వల్ల దాని మీద ఎగిరి దూకినా ఏమీ కాదు. కాళ్ల కింద మెత్తగా వుంటుందంతే. ఒక దిబ్బ మీద ఆడుకుంటున్నప్పుడు చంద్రశేఖర రెడ్డి నన్ను ఆట పట్టించడం, కొట్టడం మొదలెట్టాడు. అది ఎట్టా మొదలయ్యిందో ఏమో గుర్తు లేదు. ఉన్నట్టుండి మేమిద్దరం కలెబడ్డాం. కలెబడడం అంటే చేయి చేయి కలిపి ఒకరిని మరొకరు కింద పడేయడానికి ప్రయత్నించడం. పడిన వాడిని లేవకుండా ‘సచ్చినా’ అనే వరకు అదిమి వుంచితే గెలిచినట్టు. మేము ఎంత సేపు కలెబడ్డామో చెప్పలేను. మా పరమేశుడు, సామి శెట్టి నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేనేమిటీ తిరుగబడి కలెబడడమేమిటీ అని. వాళ్లకు తెలిసినంత వరకు నాకు చాతనయ్యింది తన్నులు తినడం, ఏడవడమే. నేను కింద పడి లేవలేనని, ఆపైన బాగా తన్నులు తింటానని వాళ్లు అనుకున్నారు. తీరా చూస్తే చంద్రశేఖర రెడ్డి కింద పడిపోయాడు. నేను తన మీద పడి పైకి లేవనీయకుండా అదిమి పట్టుకున్నాను. తను ఏడ్చి గీపెట్టే వరకు వదల్లేదు. ఓఖే. కాని అది కాదు ముఖ్యం. ఆ తరువాత ఇంకెప్పుడూ అతడు గాని ఇంకో సావాస కాడు గాని నన్ను కొట్టడానికి వచ్చేవాడు కాదు. నన్ను చాల మర్యాదగా చూసే వారు. కలెబడితే గెలవలేం అన్నట్టు చూసే వారు.

కొండ మీద బొల్లవరం వదిలి తిరిగి మా వూరు గని కి వెళ్లిన తరువాత కొద్ది రోజులకే గని సావాస కాళ్లకు కూడా ఆ సంగతి అర్థమై పోయింది.

అదీ సార్, నా మొట్ట మొదటి విజయం. దానికి నా జీవితంలో చాల విలువ వుంది. ఇప్పటికీ ఎవరితోనైనా పేచీ వస్తే ఆ డ్యుయల్ ఆన్ డంగ్ హీప్ గుర్తు చేసుకుంటాను. ఆ గెలుపు తరువాత నాలో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటాను. దాని తరువాత నాకు ఒక విషయం అర్థమైపోయింది. సమాన బలం ఉన్నప్పుడు అవతలి వాడే గెలుస్తాడనేమీ అనుకోనక్కర్లేదు. నేను కూడా గెలవొచ్చు. తప్పు అవతలి వాడిది అయినప్పుడు, పక్కన వుండి చూసే వాళ్ల బలం కూడా నాకే వుంటుంది. అప్పుడు గెలుపు నాదయ్యే అవకాశం చాల చాల ఎక్కువగా వుంటుంది.

ఓహ్, కాదు…. కాస్త ఆగండి.

ఆ భావన అప్పుడు నాలో అన్ కాన్షస్ గా ఏర్పడి, వుపయోగపడిన మాట నిజమే గాని; దాన్ని నేను గుర్తించింది, నిర్దిష్ట చేతనగా మార్చుకున్నది మాత్రం ఆ తరువాతే.

అది మళ్లీ నా అభిమాన రచయిత జాక్ లండన్ వల్లనే జరిగింది. అచ్చంగా జాక్ లండన్ వాక్యాల వల్ల కూడా కాదు. ఇర్వింగ్ స్టోన్ రాసిన జాక్ లండన్ జీవిత కథ ‘సెయిలర్ ఆన్ హార్స్ బ్యాక్’ లో స్టోన్ వ్యాఖ్యానం వల్ల.

పిల్లవాడుగా జాక్ లండన్ తనకంటూ ఎవరూ లేని వాడు. దాదాపుగా అనాథ. కాస్త పెరిగాక ఒక ట్రాంప్, వ్యాగబాండ్. ఒక పైరేట్… ఫార్మల్ చదువు పెద్దగా లేని వాడు, చదువుల సమయంలో తనను తాను సపోర్ట్ చేసుకోలేని పేద వాడు. అలాంటి వాడు రచయిత కావాలనుకున్నాడు. విపరీతంగా శ్రమించాడు. భాషా, సాహిత్యాలపై పట్టు సంపాదించి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నాడు. చాల డబ్బు సంపాదించాడు.

జాక్ లండన్ ట్రాంప్/పైరేట్ కాలంలో ఒక సంఘటనను ఇర్వింగ్ స్టోన్ భలే వర్ణిస్తాడు. తను ఎవరి కంటే తక్కువ కానని నిరూపించుకోడానికి జాక్ లండన్ ఎంతకైనా తెగించే వాడు. అతి ప్రమాదకర పరిస్థితుల్లో పైరసీ (సముద్ర దొంతనాలు) లో పాల్గొనే వాడు. తన చిన్న వయసు చూసి ఎవరైనా తక్కువ చేయబోతే సహించే వాడు కాదు. ఓసారి, అతడి స్నేహితులలో ఒకరు తనంత ఎక్కువగా ఇంకెవరు తాగ లేరని ఛాలెంజ్ చేస్తాడు. చాల ఎక్కువగా తాగి హరాయించుకోడం ఆనాడు మనిషి చేవకు గుర్తు. జాక్ అతడి కంటె బాగా చిన్న వాడు. టీనేజర్. కాని పెద్ద స్నేహితుడితో పోటీ పడి తాగుతాడు. చివరికి జాక్ చెక్కు చెదరకుండా కూర్చుని వుంటాడు. స్నేహితుడు ఇక తాగలేనంతగా తాగి పడిపోతాడు. ఆ సంఘటన తరువాత తాను ఎవరితోనైనా పోటీ పడి గెలవగలనని జాక్ ఆనుకుంటాడని ఇర్వింగ్ స్టోన్ సూచిస్తాడు.

నేను ‘సెయిలర్ ఆన్ హార్స్ బ్యాక్’ పుస్తకం చదువుతూ, ఆ ఘటన వద్ద ఆగిపోయాను. కొండ మీది బొల్లవరంలో దిబ్బ మీది నా కుస్తీని జ్జ్ఞాపకం చేసుకున్నాను. ఆ మొదటి గెలుపు నన్ను మనిషిని చేసింది. అదొక దిబ్బ మీద చిన్న పిల్లల కొట్లాటలో చిట్టి గెలుపు. నా మనసు మీద దాని ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు.

ఫేస్ ది వర్ల్డ్. యు కెన్ విన్. జస్ట్ ఫేసిట్, మ్యాన్.

ఈ పాఠాన్ని ఆ తరువాత… దిబ్బ మీది కొట్లాట తరువాత… నాకు తెలీకుండానే చాల వాటికి అన్వయించుకున్నాను.

ఒక ఉదాహరణ. దయ్యాలు దేవుళ్ల మీద నాకు ఏనాడూ గురి లేదు గాని, నేను బాగా పిరికి వాడిని. మా తమ్ముడు శివారెడ్డి (వాడిప్పుడు లేడు) నా కన్న ధైర్య శాలి అని ఇంట్లో పెద్దవాళ్లు అనే వారు. రాత్రి చీకటి పడ్డాక పెద్దవాళ్లు బయట వారపాకు కింద మంచాల మీద కూర్చుని ‘ఒరే ఇంట్లోకి వొయి సెంబు నిండ నీల్లు తీస్కరా పో’ అని చెప్పే వారు. నా చేతి తులసి నీళ్లు తాగి, నా కళ్ల ముందు ప్రాణం వొదిలిన మా జేజి (నానమ్మ) దయ్యమై ఇంట్లో వుంటుందని నా భయం. మా మూడంఖణాల ఇంట్లో వారపాకు నుంచి తల వాకిలి/గడప దాటి, ఎద్దులు బర్రెలు వుండే గాడి పాడు దాటి, మధ్య నడవా దాటి వంటింట్లోకి వెళ్లి, మంచి నీళ్ల కాగులో చెంబు ముంచి, నీళ్లు తీసుకుని, తిరిగి రావడమంటే మాటలా? ఈ మధ్యలో కదిలే చీకటి నీడలు. బుడ్డి దీపం మసక వెలుతురు కదలికలు… వామ్మో.

మా తమ్ముడు ఎంచక్కా వెళ్లి నీళ్లు తెచ్చే వాడు. నాతో అయ్యేది కాదు. పెద్దవాళ్లు ‘ఈడు బెదురు గొడ్డు రా’ అని నవ్వే వాళ్లు. కాని, కొండ మీది బొల్లవరంలో ఆ యేడాది గడిచాక ఇంకెప్పుడూ దయ్యాలకు భయపడలేదు. ఊరి బయట ఎక్కడో వుండే రేగడి చేనులో గొర్లు ఆపితే (గొర్లు మంద పెట్టడాన్ని మా వద్ద గొర్లు ఆపడమని అంటారు), కావలి వుంటానికి వెళ్లే వాడిని. అర్థరాత్రి లేచి… దయ్యాలుంటాయని అందరూ చెప్పే చౌడమ్మ దేవులం, పేద్ద మర్రిచెట్టు, పడిపోయిన కోట, కందకాలు… దాటి ఇంటికి వచ్చే వాడిని. ‘దయ్యాలు లేవు, వున్నది భయమే’ అని అర్థమైపోవడానికి… కొండ మీది బొల్లవరంలో దిబ్బ మీది విజయం పనికొచ్చిందని అనుకుంటాను.

ఔను, అనుకోడంలో చాల వుంది. నువ్వు గెలవలేవని అనుకున్నంత కాలం, మధ్యలో వచ్చే చిన్ని చిన్ని విజయాల్ని పక్కన పెట్టినంత కాలం ఓడిపోతూనే వుంటావు.

గడివేములలో ఏడో తరగతి వరకు అయ్యాక, మా వూరు గని కి దగ్గరగా వుండే తలముడిపి అనే వూళ్లో ఎనిమిదో తరగతి చేరాను. ఇక్కడ కూడా స్కూలుకు నడవాల్సిందే. దాదాపు అంతే దూరం. ఇక్కడ నా నడక స్నేహితులు అబ్దుల్ మునాఫ్, చౌడేశ్వర రెడ్డి. ఒక సారి దారిలో నడుస్తూ వాళ్లిద్దరూ చాల దిగులుగా మాట్లాడారు. క్లాసులో ఎవరెవరికో ఫస్టు మార్కులు వస్తున్నాయని, గనోళ్లు (గని వాళ్లు, అంటే మేము) ఎందుకు పనికి రానోళ్లని ఎవరో అన్నారట. ‘అదేం పెద్ద పని కాదు, ఇప్పటి నుంచి మనకెందుకు ఫస్టు మార్కు రాదో చూద్దాం’ అని నేను అన్నాను. వాళ్లు ‘సరేలే సంబడం’ అన్నట్టు చూశారు. ఆ రోజు నుంచి డిటెక్టివ్ నవలలు కొంచెం తగ్గించి క్లాసు పుస్తకాలు చదవడం మొదలెట్టాను. ఆ ఏడాది చివర మొదలైంది కొన్ని పరీక్షల్లో నాకూ ఫస్టు మార్కులు రావడం, ఇక ఆ ట్రెండ్ అట్టాగే కొనసాగింది హైస్కూలు చదువు ముగిసే వరకు.

ఎస్, సర్!

సందేహం లేదు. మనం గెలవగలం. ఓడిపోతాం గాని, గెలవ గలం కూడా.

దయ్యాల భయాన్ని గెలవ గలం. దేవుడి పేరిట ఆంక్షల్ని గెలవగలం. జీవితాన్ని గెలవగలం.

ఉప్పు నీళ్ల బావి జారుడు మెట్లను నువ్వు దిగ గలవు. ఇంటికి అవసరమైన నీళ్లు తీసుకుని భుజం మీద కడవ మోసుకుంటూ మెట్లు ఎక్కనూ గలవు.

భయపడ్డావా అయిపోయావే. పడిపోయావే.

భయమే దయ్యం.

భయమే దేవుడు.

లొంగుబాటే ఓటమి.

ఎందుకు భయం?

ఓడిపోతామేమో అని అనుమాన పడతారు అందరూ.

మనం మాత్రం

ఏమో, గెలుస్తామేమో

అని అనుమానపడదాం.

ఓటమి గెలుపులు రెండూ అనుమానమే అయినప్పుడు, రెండో అనుమానంతో పోరాడితే పోలా?!

మీరేమంటారు?!

17-02- 2016

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s