ఒక ఒంటరి ఉల్ఫ్-డాగ్ కథ

స్మృతి 1

(This is a column, స్మృతి, have started in a group called Kavisangamam in Face Book. Following was the piece that appeared last Thursday there. Will be posting ‘today’s’ column next week in the same way as it is being done now.) 

వారం వారం ఏమైనా రాయరాదూ అన్నాడు యాకూబ్. మరీ ఏమైనా అని కాదు లెండి. కవిత్వమూ-నేనూ లాంటిదన్న మాట. ఇదైతే నాక్కూడా ఇష్టమే, రాస్తానన్నాను. అయినా భయం. సరిగ్గా చేయలేనని. క్రమం తప్పకుండా చేయలేనని. మూడ్ కుదరదని, బద్ధకిస్తానని, అబద్ధాలు చెబుతానేమో అని… ఇంకెన్నో అని.

ప్రింట్ మీడియంలో పని చేస్తున్నప్పుడు, దాన్ని వదిలేసిన కొత్తలోనూ… సన్నిహిత జర్నలిస్టు మిత్రులు కలిసినప్పుడు అడిగే వారు కాలమ్ రాయొచ్చు కదా అని. పైకి ఏవేవో కబుర్లు చెప్పే వాడిని, ఐడియాలజీ అదీ ఏవేవో. అసలు సంగతి అది కాదు. భయమేసేది.  క్రమం తప్పకుండా రాయడం అంటే మందలో కలిసి తిరిగే పాడి అవు గుర్తుకొచ్చేది. ఎక్కడ ఏ గడ్డి మేస్తున్నా ఇంటికెళ్లి దూడకు ఇవ్వాల్సిన పాలు మోసుకుంటూ తిరిగే ఆవు. ఎప్పుడూ అదే ధ్యాస కదా ఆవుకు?!

అసలు ఇట్టాంటి భయం రెగ్యులర్ ఉద్యోగం చెయ్యాలన్నా వుండేది గాని, 1984 ప్రాంతాల్లో యాక్టివ్ రాజకీయాలు వదిలేసి రోడ్డున పడ్డాను. అచ్చంగా రోడ్డున పడడమే. అప్పటికి మాదంటూ ఒక ఇల్లు లేదు. అన్ని ఇళ్లూ మావే. బతుకు యొక్క మెయిన్ డోర్ వద్దకు చేరాం. ఇంకే మాత్రం అవాయిడ్ చెయ్యలేం. లోనికి వెళ్లక తప్పదు. నేను ఏదో ఒక పని చూసుకోవాలి.

మీకు చెబితే నవ్వుతారు. నాకు ఏ పని దొరకదని, దొరికినా చెయ్యలేననిన్నీ చాల గట్టిగా అనుకునే వాడిని. మమ్మిగాడు మా దగ్గరికి వచ్చేశాక, మాకంటూ ఒక ఇల్లు, కుంచెం ఆదాయం తప్పని సరి అయిపోయాయి, నేను ‘ఉదయం’ లో అస్తమించాక.. .చిత్రం… పద్ధతిగా పని చెయ్యడం కొద్ది రోజులకే అలవాటయ్యింది.

అలవాటయ్యింది గాని లోపల ఎక్కడో ఒక ఊహా అడివి (ది వైల్డ్).  వెన్నెట్లోకి మోర ఎత్తి అరుస్తున్న మనసు.

ఔనూ, మీరు ‘కాల్ అఫ్ ది వైల్డ్’ చదివారా?  అదేనండీ జాక్ లండన్ రాసిన ‘కాల్ అఫ్ ది వైల్డ్’ నవల. కొడవటిగంటి కుటుంబరావు దాన్ని ‘అడివి పిలుపు’ అని అనువదించారు కూడా. చదవండి భలే వుంటుంది. మీకు ఇంగ్లీషు వస్తే ఇంగ్లీషే చదవండి. జాక్ లండన్ వచనం అద్భుతం. అద్భుతం అంటే కేవలం గొప్ప అని కాదు. నిజంగా అద్భుతమే,  అంతా నిజమే అయ్యుండీ ఫాంటాస్టిక్ గా వుంటుంది. మీ లోపలి అడివి (వైల్డ్ నెస్) మిమ్మల్ని కేకేసి… కాదు… ఊళ వేసి… పిలుస్తూనే వుంటుంది పుస్తకం చదువుతున్నంత సేపూ.  మీ చుట్టూ వెన్నెల కురుస్తూనే వుంటుంది. మంచులో కలుస్తూనే వుంటుంది.

చాల ఎక్కువ మంది ఆ పుస్తకం చదివి వుండరని నా ప్రగాఢ అనుమానం. పోనీ, ఆ కథ చెప్పనా?

నేను ఒక కుక్కను. ఆ సంగతి మొదటి సారి ఎట్టా గుర్తు పట్టానో చెప్పనా? …నా… ఏమిటీ, చెప్పడం మొదలెట్టేశాను…. ఇక చెప్పడమే.

చాల కోజీగా వుండే ఒక జడ్జి గారిల్లు. ఇల్లంటే ఏదో చిన్నపాటి ఇల్లు కాదు, బాగా పెద్దది, చుట్టూ తోటా అదీ. ఆ ఇంట్లో ఒక కుక్క రాజం.  దుష్ట సమాసమా? పోనీండి, ఇదంతా ఒక దుష్టుని కథ. ఇందులో సమాసాలు అవీ అన్నీ దుష్టుగానే వుంటాయి.

అదీ గాక. మన చుట్టూ ఏదీ నిజంగా నిజం కాదబ్బా. కల్పనకీ నిజానికి, కలకూ నిజానికి పెద్ద తేడా లేదని నేను తెలుసుకుని చాన్నాళ్లయింది. మీకూ తెలిసిపోయి వుంటుంది. లేదా తెలుస్తుంది. కలలో కాలం మెలికలు మెలికలు తిరుగుతుంది. సరళ రేఖలా వుండదు. ఉన్నట్టుండి మలుపులు, అబౌట్టర్నులు. అయినా, అదేమిటో, కల ఎప్పుడూ తేట తెల్లంగానే వుంటుంది. కలలన్నీ స్మృతులు. కలగలిసిన స్మృతులు, అంతే. ఈ స్మృతి కూడా అలాంటిదే. ఒక కల వంటిదే. అంతా నిజమే చెబుతాను గాని, చెప్పిందంతా నిజమే అయ్యుంటుందని చెప్పలేను. వీలైనంత సరళంగా చెబుతాను గాని సరళత్వం కోసం కల మెలికల్ని సవరదీయను. కల గనడం మీకు రాదా ఏమిటి?! వచ్చుగా, ఇంకేం.

ఆ కోజీ జడ్జి గారింట్లో… పోనీ జడ్జి గారి కోజీ ఇంట్లో, తోటలో ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఆ యొక్క శునక రాజమూ వుండేది. ఈంత్త పెద్దది. దాని మెడలో పట్టీ వుండేది గాని ఎప్పుడూ కట్టేసే వారు కాదు. స్వేచ్చగా తిరిగేది. స్వేచ్ఛ చాల విలువైనది. విలువైనవి ఏవైనా పోగొట్టుకు పోయే ప్రమాదం వుంటుంది. విలువైన వాటినే దొంగిలిస్తారు. ప్రమాద వశాత్తు కుక్క… ఓహ్, దాని పేరు చెప్పలేదు కదూ, దాని పేరు బక్. బక్క కుక్క కాదండోయ్. బక్ అనే పేరున్న ఆ యొక్క కుక్క ఒక రోజు తన విలువైన స్వేచ్ఛను పోగొట్టుకుంది. ఆ సంగతి దానికి తెలియడానికి కాస్త కాలం పట్టింది. అందుకోసం, కాస్త కాకుండా, బాగానే దెబ్బలు తింది.

ఒక రోజది తన విలువైన స్వేచ్ఛతో తోటలో విహరిస్తూ విహరిస్తూ, గేటు దాటి బయటికి వెళ్లింది. ఒకానొక దొంగ కుక్కల మనిషి…. దొంగ కోళ్ల మనిషి కాదు…. ఆ రోజుల్లో అమెరికాలో కుక్కలకు చాల ధర పలికేది. . కుక్కల దొంగతనమే బాగా లాభ సాటి కనుక ఆ దొంగ కుక్కల మనిషి బక్ ని చూశాడు. ఎవరూ తనను చూడనప్పుడు ఉచ్చు వేసి మన కుక్కనకాన్ని పట్టుకుని ఎంతో కొంత కనకానికి ఒక రెడ్ స్వెటర్ మనిషికి అమ్మేశాడు.

ఔను మరి. అవి అమెరికాలో కనకపు పరుగుల రోజులు. గోల్డ్ రష్ రోజులు. మంచు భూముల్లో బంగారం దొరుకుతోంది. ఆ పసుప్పచ్చ మెరుగు పదార్థం ఎక్కడ దొరుకుతుందో కనిపెట్టి, ఆ స్థలం మీద కబ్జా పెట్టి, ఇక తవ్వుకోడమే లేదా కూలీల్తో తవ్వించుకోడమే. అందరూ అక్కడికి వెళ్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్.. ఇలా అన్ని చోట్ల నుంచి వాయువ్య కెనడా లోని క్లాండ్ లైక్ ప్రాంతానికి (1886-89) వెళ్తున్నారు.. అక్కడంతా మంచు. ఆ మంచులో స్లెడ్జి బండ్లు తప్ప ఇంకే బండ్లు నడవ్వు. స్లెడ్జి బండికి ఎద్దులైనా గుర్రాలైనా కుక్కలే. ఇంకేం, కుక్కలకు గిరాకీ. బలమైన గ్రామ సింహాలకు, గ్రావృకోదరాలకు… నా సంస్కృతం తగలెయ్య… ఊరి తోడేళ్లకు… బలమైన కుక్కలకు… భలే గిరాకీ.

ఔను. మన బక్ కేవలం శునకం కాదు. హైబ్రిడ్. అది కుక్క తల్లికి, తోడేలు తండ్రికి లేదా ఇటు నుంచి అటో…  ఎటైతే నేం పుట్టిన వృక శునకం. తోడేలు లాగే ఫెరోషియస్సూ, బలమైనదిన్నూ. సో, దొంగ కుక్కల వాడికి  బాగా ధర పలికింది.

దాన్ని కొనుక్కున్న రెడ్ స్వెటర్ మనిషి స్లెడ్జి కుక్కల శిక్షకుడు, ట్రైనర్. ట్రెయినింగ్ ఇచ్చి ఇంకో యజమానికి ఎక్కువ ధరకు అమ్మేస్తాడు.

బక్ మెడ పట్టీకి నిజంగానే మాంఛి గొలుసు కట్టి ఒక చేత్తో ఆ గొలుసు పట్టుకుని, ఇంకో చేత్తో మంచి రూళ్ల కర్ర పట్టుకుని రెడ్ స్వెటర్ మనిషి ట్రెయినింగ్ ఇచ్చే పేజీలు మీరు చదివి తీరాలి.

అతడు బక్ కు ఒక ఆజ్ఞ ఇస్తాడు. అది వెంటనే చెయ్యాలి. లేకుంటే దాని ముట్టె మీద కొడతాడు. బక్ అతడిని కరవడానికి ఎగురుతుంది. అతడు ఒడుపుగా సరిగ్గా ముట్టె మీద బలంగా కొడతాడు. ఎగిరింది ఎగిరినట్టే నొప్పితో లుంగలు చుట్టుకుపోతూ కింద పడుతుతుంది. అది తన మీదికి ఎగరడం మానేసి లొంగుబాటు కళ్లతో తనను చూసే వరకు ఇదే వరుస. ఎంత కొడితే దానికి బాధ కలిగి తన మాట వింటుందో అంతే గట్టిగా కొడతాడు. కోపంతో కాదు, కసితో కాదు, దాన్ని తన మాట వినేలా చేయడానికి ఎంత గట్టిగా కొట్టాలో అంతే గట్టిగా మెజర్డ్ గా కొడతాడు. అదయ్యాక, దానికి ఆహారం ఇస్తాడు. బక్ తనను దెబ్బలు కొట్టిన చేతి నుంచే ఆహారం తీసుకుని తినాలి. తింటూ కరవబోతే మళ్లీ దెబ్బలు. కుక్క ఎంత బాగా తన మాట వింటే అంత మంచి ఆహారం. మాట సరిగ్గా వినకపోతే, దాన్ని ఆకలితో చావనివ్వడు, తక్కువ రకం ఆహారం ఇస్తాడు, బతికి వుండేట్టు. అది తన ఆస్తి కదా, చావనిస్తే ఎట్టా?!

ఇట్టా సాగే ఆ ట్రెయినింగు ఇచ్చే పేజీల్ని నేను చదివిందెక్కడో, ఎప్పుడో తెలుసా? ‘ఉదయం’లో చేరిన కొత్తలో (1985), నా కంటె ఒకటి రెండేళ్లు చిన్న వాళ్లు, నా మోస్తరు జ్జ్ఞానం కూడా లేదని నేను గట్టిగా నమ్మిన వాళ్లు నాకు పని ఇస్తుంటే నేను చేయాలి. పని ఎలా వుండాలని వాళ్లు కోరుకుంటారో అలా చెయ్యాలి. వాళ్లలోని అజ్జానాన్ని సైతం సహించి, మారు మాట్లాడకుండా చెప్పింది చేయాలి. అలా చేస్తూ చదివాను ‘కాల్ అఫ్ ది వైల్డ్’. అప్పటికి కొద్ది నెలల క్రితమే నాసొంత  వైల్డ్ ని వదిలి వచ్చిన ఒక టేమ్డ్ తోడేలుని కదా. సగం కుక్క సగం తోడేలుని. పూర్తి కుక్కగా మారక ముందటి పాత స్వేచ్ఛను… జడ్జి గారింట్లోని స్వేచ్చను… పార్టీలోని స్వేచ్ఛను వదిలి … అచ్చంగా నెల కూలీ మెడ పట్టీ గొలుసు ధరించిన కుక్కని.

‘కాల్ అఫ్ ది వైల్డ్’ నవలలో ఇంకా చాల కథ వుంది. బక్ చాల గొప్ప కుక్క గా పేరు తెచ్చుకుంటుంది. స్లెడ్జి బండికి కట్టే కుక్కల దళానికి తానే లీడర్ అవుతుంది. తన లీడర్ గిరీకి అడ్డొచ్చే కుక్కల్ని ఓడిస్తుంది. బరువులు లాగడం, వేగంగా పరిగెత్తడం వంటి పోటీల్లో పాల్గొని  బహుమతులు గెల్చి యజమాని మెప్పులు పొందుతుంది. ఇతర కుక్కలతో గోదా లో దిగి నెత్తురు నెత్తురుగా పోరాడి గెలిచి, యజమాని ప్రశంసలను ఎంజాయ్ చేస్తుంది. ఇంత చేస్తున్నా, దాని లోని అడివి (ది వైల్డ్) నిద్ర పోదు. లోపల్నించి పిలుస్తూనే వుంటుంది. అరుస్తూనే వుంటుంది. ఆ అరుపులు మనకు వినిపిస్తూనే వుంటాయి. ఎందుకంటే మనమూ పోటీలు పడి ఏవేవో గెలుస్తూనే వుంటాం. సబ్ ఎడిటర్ ట్రెయినీగా చేరి, ఏడాది తిరిగే సరికి ఛీఫ్ సబ్ ఎడిటర్ అయిపోయా తెలుసా? మా ఛీఫ్ ఎడిటర్ నాకు నెలకు ఒకటైనా ‘గుడ్’లు పెడతాడు తెలుసా? ఈ ఏడాది నా ఎర్న్ఢ లీవ్స్ ఏవీ వాడుకోలేదు, ఒక నెల జీతం ఎక్కువ వచ్చింది తెలుసా?! అని చెప్పుకుంటూ వుంటాం. నెల నెలా పేస్లిప్ చూసుకుని మురిసిపోతూనే వుంటాం. ఆ డబ్బుతో పాప చక్కగా చదువుకుని మన లాగే జర్నలిస్టో ఇంకా పెద్దది ఏదో అయిపోతుందని కలలు కంటూ వుంటాం. అయినా మన లోని అడివి మనల్ని పిలుస్తూనే వుంటుంది. దాన్ని సరిగ్గా గుర్తించలేకపోతే ‘ఏంటో, నాకేం బాగుంట్లేదు’ అని అబ్స్ట్రాక్ట్ గా అనుకుని, కాసేపాగి, మళ్లీ పనిలో పడిపోతుంటాం. లేదా, ఆధ్యాత్మకం పుస్తకాలు చదువుకుని సాంత్వన పొందుతుంటాం.

అదండీ ‘పని’కి సంబంధించి నా తొలి అనుభవం. పుస్తకం ఒక మనిషిని ఏం చేస్తుందో కూడా ఈ కాస్తలో కాస్త చెప్పాననుకుంటా.

అంటే నేనంతకు ముందు ఏ పనీ చేయలేదని కాదు. ఎప్పుడూ శ్రమ చేయని తిండి తిన లేదు. ఏ తాబేటి చిప్పనో చేత బట్టి, అకలేసినప్పుడు నాలుగు ముద్దలు అడుక్కుని తినేసి, ఏ యాపసెట్ట కిందనో, దర్గా నీడలోనో నిద్దరోయిన సూఫీ సాధువును కాను. ఆకలేసినప్పుడు నాలుగు ముద్దలు అడిగి పెట్టించుకుని తిన్న మాట నిజమే. బట్టలు మరీ పాత వడితే నా వయసుకాళ్లు ఎవరో ఒకరి ప్యాంటు షర్టు వేసుకుని జబర్దస్తీగా వెల్లిపోయిన మాట కూడా నిజమే. ఆ నాలుగు ముద్దలు పెట్టి, ప్యాంటు షర్టు ఇచ్చిన వాళ్లవో, వాళ్లు చేయాలనుకుని చేయలేకపోయినవో ఏవో పనులు మాత్రం చేశాను.

అయినా అది దాదాపుగా ఒక స్వేచ్ఛాటవిలో (ది వైల్డ్ లో) బాగమే. కాకపోతే అది జడ్జిగారింటి లోపలి తోట వంటి అడివి కావొచ్చు. ముందు ముందు ఆ స్వేచ్ఛ సంగతి కూడా చెబుతాను. రాజకీయం మితి మీరకుండా చూసుకుంటాన్లెండి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా కథ, కవిత్వం నాకు రక్త సమానం. బాగా రాశానంటే కడుపు నిండిపోతాది. లేకుంటే హృదయ కుహరం సంకోచించి లోపల ఇరుకు ఇరుగ్గా కొట్టుకుంటాది. నేనే రాయాలని కాదు, మంచి పుస్తకం దొరికినప్పుడు చదువుకోడం కూడా రాయడమంత ఆనందం.

అంతెందుకు ‘ఉదయం’ న్యూస్ డెస్కులో కూర్చుని వార్తకు వార్తకు మధ్య (అంటే, ఒక వార్త రాయడానకి మరో వార్త రాయడానిక మధ్య) చదువుకుని పక్కన ప్రాణ మితృడు గుడిహాళం రఘునాథంతో నా ఫీలింగ్స్ చెప్పి తన నగుమోము చూసి సంతోషపడిన క్షణాలెన్నో ‘కాల్ అఫ్ ది వైల్డ్’ పఠనంతో ముడివడి గుర్తుకొస్తాయి.

పార్టీలో క్రియాశీల జీవితం వదిలేసిన కొత్తలో, మొదట కె, సంజీవి అనే దొంగ పేరుతో రాసి, తరువాత సొంత పేరుతో ప్రచురించిన ‘అబద్ధం’లో ఇరవయ్యారు కవితలున్నాయి. ఇరవయ్యారూ నా హృదయం ముక్కలే. ఆ పద్యాలు రాయడం మొదలెట్టింది ఉదయం డెస్కులోనే.

వారం వారం ప్రతి సారీ ఇలా ఒక పద్యం ఇస్తానని కాదు గాని, ఓం ప్రథమంగా ఈ సారి అలా ఆ రోజుల్లో రాసిన ‘పునరపి…?’ అనే ఒక పద్యాన్నీ, దానికి నేను ఎంపిక చేసుకున్న (ఎక్కడో దొంగిలించిన) బొమ్మతో ఆ పద్యం మొదటి పేజీనీ ‘అబద్దం’ లోంచి తీసి ఇస్తున్నా, ఈ కాలమ్ లో భాగంగా. వెన్నెట్లో నగరం మధ్య లోంచి ఆకసానికి చేతులెత్తిన ఆ మనిషి,. పద్యం లోని బక్ అనే కుక్క… అది నేనే.

అలా అనుకుంటే, ఇదంతా ఒక లోన్ ఉల్ఫ్-డాగ్ కథే.

//పునరపి..?//

బహుశా

ఈ రాత్రికి ఇక ఇంతే

చుక్కల్లోంచి ఎవరూ

కిందికి దిగి రారు

తుప్పు పట్టిన పెట్టె విప్పరు

రహస్యం చెప్పరు

ఊరేగింపుల్లో నీ కోసం నీ

అన్వేషణ ఫలించదిక ఫలించదు

లోకం తెల్లగా రగుల్తున్న వేళ

నగరం నడి వీధిలో మీగాళ్ల మీ కూర్చుని

అదే పనిగా మొరుగుతుందొక కుక్క

కాసేపు భౌ భౌ మని తుంపులు తుంపులుగా

ఇంకాసేపు ఓ ఓ యని దీర్ఘశ్రుతిలో

వీధులు రూపొందని యుగాల జ్జ్ఞాపకాలు

పొట్టలో చెయిపెట్టి కెలుకుతున్నై కాబోలు

అది శునకమా

సూపర్నోవా శకలమా?

కుక్కయితే, దాని పేరు బక్

జడ్జిగారి ఇల్లొదిలి

రెడ్ స్వెటర్ మనిషినొదిలి

స్లెడ్జిబండి టీమ్ నాయకత్వాన్నొదిలి

తెలి చలి పొట్లాల్లో పదుప్పచ్చ ఉద్రేకాలొదిలి

తోడేళ్లతో సావాసానికి రమ్మని

పిలుస్తోంది పొగులుతోంది రగులుతోంది బక్

పచ్చనాకు మీద చందమామ వాడి గోళ్లు

కాటుక కాన్వాసు మీద నేత్రాగ్నుల నాట్యం

భయంకరమైన ఆనందం అడివి

మురిపించే బీభత్సం అడివి

అణువు అణువులో బిగ్ బ్యాంగ్స్

విశృంఖల విశ్వ చైతన్యం

నక్షత్ర భాషకు నిఘంటువు అడివి

కాంక్రీట్ కౌగిట్లో అనాథ బాలుడు మనిషి

రెడ్ లైట్ ఏరియాలో చిరునామా మరవని బాలిక

ప్రమాద వీణ మీద మాత్రం స్వచ్ఛమైన స్వేచ్ఛా గీతం

నిజమే గాని, ఇది ఎన్నో ప్రారంభం?

ఒక్క కావ్యానికి ఎన్ని కృత్యాద్యవస్థలు?

ప్రతిసారీ ఇక్కడే ఆగిపోతోంది పాట

ప్రతిసారీ ఇక్కడే తప్పిపోతున్నాం ట్రాఫిక్ లో

ఈ రాత్రికి కూడా ఇంతేనా;

నెత్తురు నదు ఒడ్డున పలవరింతలేనా?

ఫుట్ నోట్: బక్: జాక్ లండన్ నవల ‘కాల్ అఫ్ ది వైల్డ్’ లో హీరో. మనిషి చేతి బందీగా బతుకుతూనే స్వేచ్ఛ కోసం కలలు మానదు, చివరికి అడివిలోకి పారిపోతుంది తోడేళ్లతో కలిసిపోతుంది.

(వచ్చేవారం ఉంకో కథ)

10-02-2016

call 3.1

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s