దేవుడు వద్దనుకుంటే ఎన్నెన్ని కష్టాలో…

మైనారిటీ బాధ తరువాత ముగ్గరు మిత్రులతో పేచీలు

పేచీ 1

నిరాడంబరమంటే మతాన్ని వదలకపోవడం?

సో, తమకు మతం లేదు అని ప్రకటించుకోలేదు కాబట్టి, కోరు కాబట్టి ఖాదరాదులు నిఖార్సయిన నిజాయితీ పరులు. తన మతస్థులకు వేరే మతం నుంచి వున్న బాధలు (మాత్రమే) చెప్పి వల వల ఏడ్చే ఖాదరు నిరాడంబరుడు. తమ మతంలోని పేదలకు, స్త్రీలకు ఆ మతం వల్ల వున్న కష్టాలు చెప్పే ఖాజా, షాజహానా, స్కై, నస్రీన్, రష్దీ ఆడంబరులు. ఖాదర్! నా మతం వల్ల నా జనానికి వున్న కష్టనష్టాల వల్లనే నేను దాన్ని వదులుకుంటున్నాను. ఇది ఆడంబరమైతే, ఇక అంబరం నీదే.
04-02-2016

పేచీ 2

డోంట్ కేరె హూట్

డానీ కి నా అస్తి పంజరం కనిపిస్తోందిట.

తను ఆస్తికుడు అంటో శర్మ కామెంటిన మెచ్చికోలు చూసి అదేంటని ఆశ్చర్యంతో ప్రశ్నించినందుకు డానీ పదకొండో కృష్ణుడి వేషంలో చక్రం తిప్పుకుంటూ వచ్చి మాట్లాడిన మాట ఇది.

డానీ! నువ్వు ఆస్తికుడివని విని కలిగిన ఆశ్చర్యంతో అడిగాను. దానికి జవాబివ్వు. అది మానేసి ఈ వక్కలు, పక్కలు,అత్తలు, గిత్తలు ఏంది భై.

నోటికి ఏమొస్తే అది కూస్తారా నువ్వూ శర్మా?!

ఈ వాగాడంబరాల్ని ఇకనైనా ఆపండి. లేదా మీదగ్గరున్న చక్ర-వ్యూహాలేమిటో అవి మొదలెట్టండి. నా క్లాజెట్ లో మీకు కనిపించే అస్తిపంజరాలేమిటో బయట పెట్టండి. ఏదో ఒకటి యాడవండి.

‘మైనారిటీ’ అనే ఆంగ్ల పదాన్ని నైఘంటికార్థంలో వాడితే, నన్ను మైనారిటీ ముసుగేసుకున్న అగ్రవర్ణుడని ఒక సకల భ్రష్టుని హుంకరింపు. నీకేమో నిన్ను కృష్ణుడుగా అప్పాయింట్ చేసుకని నన్ను శిశిపాలుడిని చేసేంత అహంకారం. ఎవరు మీరు, ఎందుకు ఈ ఏడుపు? ‘మైనారిటీ’ అనే పదం ఎవడబ్బ సొమ్ము? ఎవరి సొంత ఆస్తి?

ఎస్ డానీ, నేను అన్నది నిజం కాదా?

విరసం సభ్యత్వానికి గీటురాయిగా మా. లె. మావో ఆలోచన అనేది అవసరం లేదని, విరసం విస్తరణకు అది ప్రతిబంధకమని, ప్రజా పోరాటాల సమర్థకులైతే చాలు అని… నేనూ మరి కొందరం, కాదు ఆ గీటురాయి వుండి తీరాలని నువ్వు మరి కొందరు… చర్చ జరిగిందనే మాట నిజం కాదా?

చర్చలో ఒక సందర్భంలో, ఇదిగో ఇట్టాగే స్పృహ కోల్పోయి నువ్వు నా మీదికి ‘కొట్ట’బోయినట్టు లేవ లేదా? నేను ‘ఏం లేస్తున్నావు, ఏం చేస్తావు భై’ అని అడగలేదా?

ఈ విషయం ఇప్పుడెందుకో ఇక్కడి మితృలకు చెప్పాలి.

మార్క్సిజం గీటురాయిగా వుండాలని నువ్వు వాదించిన ఆ సంస్థలో ఆనాడు నువ్వు ఇంకొకరిని కొట్టొచ్చేటంత క్రియాశీల సభ్యుడివి. మరి, నువ్వు ప్రాథమికంగా ఆస్తికుడివెలా అవుతావు? శర్మ చెప్పింది అబద్ధమై ఉండాలనుకున్నాను. కాని, నువ్వు అది అబద్ధమని అనడం లేదంటే, ఆయన చెప్పింది నిజమై ఉండాలనీ అనుకున్నాను. అంటే, అబద్ధం నీ చక్రవ్యూహంలో ముఖ్య భాగమై వుండాలి. ఇదీ నేను మాట్లాడింది. విషయం తప్పైతే చెప్పు. అంతే గాని, ఆ రంకెలేంటి? తలకాయ తిరుగుతోందా?

ఖాదర్! చిచ్చు పెట్టి పక్కన కూర్చున్నావేం? చెప్పు. నీ మీద కోపం రావట్లేదు. నా వరకు ఈ చర్చ సర్దాగానే మొదలైంది. కాని నీ పక్షాన మాట్లాడే వాళ్ల తీరు చూస్తే ఏదో సీరియస్ యవ్వారమే వున్నట్టుంది. నీతో వున్న చనువుతోనే అడుగుతున్నా, ‘మైనారిటీ’ అనే పదం నీ సొంత ఆస్తినా? దాన్నెవరూ ఇంకో రకంగా వాడ గూడదా?

లోకమంతా దేవుడిని, తత్సంబంధ క్రతువులను నమ్మి ఆచరించే వాళ్లే వున్నప్పుడు అది తప్పు అని భావించే వాళ్లకు మైనారిటీ మనషులు పడే బాధలు వుండవా? ఆ పదాన్ని ఇలా వాడడం వల్ల నీదైనా మరొకరిదైనా రిలిజియస్ మైనారిటీ స్టేటస్ కు ఏం నష్టం వచ్చింది? ఎందుకు మొదలెట్టారు ఈ కంప? డామిట్, ఇన్ని తిట్లా?.

మీరు, డానీ ఏ మతాన్ని అవలంబిస్తే నాకేంటి భై. మీ మీ మతాల్తో మీరు ఊరేగండి. దానిలో నన్ను కలుపుకుని ‘మనలాగ హేతువాదులు’ అనే ప్రిటెన్షన్సు ఎందుకు?

ఓకే, ఆస్తికత్వమే సరైనదని మీరు చెప్పదలిచారా? చెప్పండి.

మా అజ్జ్ఞేయవాదం/హేతుత్వం ఎలా తప్పో చెప్పండి.

అలా చెప్పడానికైనా మీరు హేతు బద్ధంగా వుండక తప్పదనడంలోనే మీ వాదాల బలహీనత తెలియడం లేదా? ఔను అందుకే నువ్వు, డానీ, శర్మ శేషం కోపేన పూరయేత్ అని తిట్ల దండకానికి దిగారు. హేతువుకు తిలోదకాలిచ్చి కాకి రెట్ట కామెంట్ల బాట పట్టారు.

తిడతారని మీకు తల వంచేది లేదు. మీకే కాదు ఎవరికీ. ఏ మతంలోని బ్రాహ్మణ వాదులకూ తల వంచేది లేదు. సారీ. ముగ్గురు మితృలారా, మీరు అన్యాయపు బాటలో నడుస్తున్నారు. యు వో యాన్ అపాలజీ టు మి.

కాదని, చక్రాలు తిప్పుతారా?

ఓఖే.

డోంట్ కేరె హూట్.

04-02-2016

 

పేచీ 3

ఎన్నాళ్లీ అపీజ్మెంటు పాలసీ

హిట్లరు సేనలు ఒక్కో దేశాన్నీ అక్రమిస్తూ వెళ్తుంటే, ఇతర దేశాలు ‘సరే, ఆ చిన్న భూమి ముక్కతో తీసుకుని తృప్తి పడండి, మా మీదికి రాకండి’ అన్నట్టు ప్రవర్తించే అపీజ్మెంటు పాలసీని (ఆక్రమణ దారును సంతృప్తి పరిచి, పోరాటం తప్పించుకునే విధానం) అనురించి ఘోరమైన తప్పు చేశాయని చరిత్ర.. దాని ఫలితం తెలిసిందే. చాల ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

కులమతాల విషయమై ఇటీవల నా మితృలలో మరీ ఎక్కువగా కనిపిస్తున్న అపీజ్మెంటు పాలసీ చూస్తుంటే, నాలో ఒక సందేహం తొలుస్తోంది.

భూస్వామ్యం పోవాలి కాని భూస్వాముల్ని ఏమీ అనకూడదు అంటే ఎలా వుంటుంది? భూస్వామ్యం గాలిలో వుండదు. భూస్వామ్యం వద్దనడం అంటే భూస్వాములు వద్దని అనడమే. భూస్వాములు వద్దనడమంటే వాళ్లను ఒక్కొక్కర్ని ఖతం చేయడం కాదు. గిల్లొటిన్ పెట్టి తలలు నరికేయడం కాదు. భూస్వాములు తమకు తాము భూస్వాములుగా వుండడం మానెయ్యాలి. లేదా వాళ్ల నుంచి భూములు తీసేసుకుని ఎవరి దగ్గరా అంత భూమి లేకుండా చేయాలి. వాళ్ల దగ్గర ఆ ఎక్ససివ్ (భూస్వామ్యపు) భూములు లేకుండా చేయాలి. ఆ పని వాళ్లే స్వయంగా చేసుకోవచ్చు. లేదా సమాజం తన శక్తియుక్తులు ఉపయోగించి చేయాల్సుంటుంది. ఇది కాకుండా ఇంకో మార్గం వుందా భూస్వామ్యం పోవడానికి?

ఈ పని జరుగుతున్నప్పుడు మనం కేవలం భూమి యాజమాన్యం గురించే మాట్లాడం. భూస్వాములు అనుభవిస్తున్న అన్ని అప్రజాస్వామిక ప్రివిలేజెస్ గురించి, వాటి వల్ల ఇతర్లు అనుభవించే కష్టాల గురించి మాట్లాడుతాం. ఆపైన భూస్వామ్యం అనే విధాన పర భావన గురించీ మాట్లాడుతాం.

ఇంత వరకు నా మాటల్ని ఎవరూ కాదనరు. ఇవాళ కాదనరు. ఒక నాడు ఇలా మాట్లాడితే కత్తికి ఒక కండగా కోసే వారు. యాంటీ సోషల్ అని నిందించి మరీ చంపే వారు. ఇవాళ ఈ మాటలకు ఎవరూ ఏమీ అనరు.

ఇదే లాజిక్ ను కులానికి, కుల-స్వామ్యానికి అన్వయించి మట్లాడితే ఎక్కడ లేని రోషాలు పుట్టుకొస్తాయి.

ఇలాంటప్పుడే, ‘అబ్బే అలా కాదు లెండి. మేమంటున్నది ఏమంటే… మరే… కులాలు వుండనీ, అయ్యో కులాల వల్ల ఎన్ని మేళ్లో… తమది ఫలానా కులమని చెప్పుకునే వాళ్లూ వుండనీ, కులాల వల్ల జరిగే హింస మాత్రం వుండొద్దు’ అని చాల డొంక తిరుగుడుగా, నంగి నంగిగా మాట్లాడుతుంటారు. కుల, మతాలు వద్దనడం చాల దుందుడుకు చర్య అయినట్టు, సిగ్గు పడాల్సిన సంగతి అయినట్టు మాట్లాడుతుంటారు. ఇది విచిత్రం. ఇది విచిత్రంగా కనిపించకపోవడం మరింత విచిత్రం..
2.

బ్రాహ్మణ వాదం మీద విమర్శ పెడుతున్నప్పుడు చాల జాగర్తగా, ‘నా విమర్శ బ్రాహ్మణుల మీద కాదండీ, బ్రాహ్మణ వాదం మీద మాత్రమే’ అని చెప్పాల్సి వస్తోంది. బ్రాహ్మణ వాదం వల్ల ఎవరెవరు లాభ పడుతున్నారో వాళ్లంతా ఆ లాభాలకు మూలమైన తమ కులాల్ని వదులుకోనంత కాలం బ్రాహ్మణ వాదం ఎట్టా పోతుంది? మరి బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణ వాదం వేరు అని ప్రతిసారి రైడర్లు పెట్టుకుని మాట్లాడాల్సిన ఈ సైద్ధాంతిక దుర్గతి ఎందుకు? ఈ ధియరిటికల్ కవర్డైస్ ఎందుకు?

తాము బ్రాహ్మణులమనీ, తమ మాటలన్నీ ఆ పొజిషన్స్ లోంచే వుంటాయనీ అనే వాళ్లను ఎందుకు విమర్శించగూడదు? నేను రెడ్డిని, కమ్మను, వెలమను… నా వాదాలు నా కులం పొజిషన్ నుంచే వుంటాయి అనే వాళ్లను ఎందుకు విమర్శించకూడదు? అలాంటి వాళ్లు పోకుండా కులాలు ఎట్టా పోతాయి,. అవి పోకుండా కులవాదం ఎట్టా పోతుంది?

ఉదాహరణకు రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లున్నారు. చుండూరు, కారంచేడు ఘటనల్లో ‘దళితులు కూడా తప్పులు చేశారు తెల్సా, ‘మనోళ్ల’యినా ఎన్నాళ్లూరుకుంటారబ్బా’ అని నసిగే వాళ్లున్నారు. అవన్నీ వాళ్ల కులాల పొజిషన్స్ లోంచే మాట్లాడే మాటలు. వాళ్లది ఆ కులం కాకపోతే అలా మాట్లాడే వారు కాదు. మరి; రెడ్లు, చౌదర్లు, రావులు పోకుండా ఆ కుల వాదాలు ఎట్టా పోతాయి? ఇక్కడ కూడా వాళ్లు పోవడమంటే ఆ మనుషుల్ని ఏసెయ్యడం కాదు. వాళ్లు ఆ కులస్థులుగా వుండకుండా వుండడమే.

బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్లు తాము బ్రాహ్మణులమని చెప్పుకుంటూ వున్నంత కాలం బ్రాహ్మణ వాదం పోదు.

నిజమే పుటక ఒక యాక్సిడెంటు. ఎవరూ ఫలానా అమ్మా నాన్నలకు పుట్టాలనుకుని పుట్టరు. కాని పుట్టాక బతుకు మీద మన ‘విల్’ కి అవకాశముంది. మన ఎంపికకి అవకాశముంది. ఒక కులం నుంచి మరో కులానికి మారడానికి కాదు, కులమే లేకుండా బతకడానికి అవకాశముంది. మతమే లేకుండా బతకడానకి అవకాశముంది. కుల, మతాల్ని వదులుకుంటే తాము బతకలేమనీ, అందుకే వదులుకోలేదనీ అనడం అబద్ధం. మనం మన కులాల్ని వదులుకోవచ్చు. అలా వదులుకోవడం ఆడంబరం కాదు. ఒక అవసరం. ఒక ఆబ్లిగేషన్.

‘పుట్టేశాను కదా, పోన్లెద్దురూ, ఏదో ఇలా ఈ సౌకర్యాలు అనుభవిస్తూ వుండనివ్వండి, అయితే, దిగువ కులాల వాళ్లకు రాజ్యాంగం ఇచ్చే సౌకర్యాలున్నాయి చూశారూ, అది మాత్రం చాల అన్యాయం ‘అనే వాళ్లు పోనంత కాలం కులం పోదు. కులానికి మూలం మతం. కుల వాదులకు మతం అవసరం ఎప్పుడూ వుంటుంది. రిజర్వేషన్లను, ప్రజాతంత్ర హక్కుల్ని ఇచ్చేది రాజ్యంగం. మతం రిజర్వషన్లు ఇవ్వదు. అది ఇచ్చే పూజరిత్వం వంటి రిజర్వేషన్లున్నాయి గాని, అవి పోవాలని కుల వాదులు అనరు. అందుకే రాజ్యాంగం మీద వీళ్ల నసుగుడు, మతం మీద అమితానురాగం.

దళితులు, వెనుకబడిన కులాల వారు, మైనారిటీలు కూడా తమకు పుటకతో వచ్చిన లీగల్, కాన్ స్టిట్యూషనల్ అవకాశాల్ని వుపయోగించుకుంటూ మిగిలిన అన్ని సందర్భాలలో కులాన్ని వదులుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు క్రైస్తవం లోనికి మారిన దళితులు లీగల్ గా, కాన్స్టిట్యూషనల్ గా తమకు పుటకతో వచ్చిన అవకాశాల్ని వుపయోగించుకుంటారు. ఎవరైనా అలాగే చేయవచ్చు. ముస్లిముగా పుట్టిన వ్యక్తి ముస్లిం మైనారిటీకి రాజ్యాంగమిచ్చే సౌకర్యాల్ని తీసుకోడం ప్రజాతంత్రయుతం. ఆ పేరుతో తాను మతాన్ని వుంచుకోడం అదేదో అత్యవసరమైన నిరాడంబరమైన వ్యవహారమనడం మాత్రం మత వాదానికి డొంకతిరుగుడు సమర్థనే.

నీ మతం నీకు ‘అవసరం’ అని వాదించినంత కాలం ఇంకో మతాన్ని కోప్పడలేవు. అసలు మతవాదాన్నే కోప్పడలేవు. మతవాదాన్ని కోప్పడనంత కాలం మతం కారణంగా చెలరేగే ఏ హింసను.. నీ మీద నీ వాళ్ల మీద హింసను కూడా… నిజాయితీగా ఖండించలేవు. ఊర్నే వేడుకుంటావంతే. ఎందుకంటే మరొక చోట నీ మతం వాళ్లు ఇట్టాంటి ఘోరాలే చేస్తున్నారు. ఇక్కడ ఎవరో నీ మీద చేస్తున్నారు. మతం అంటే శాంతి కానే కాదు. మతం అంటే నాలాగే నువ్వుండాలని కోరడం, అది వినని వాడిని కాఫిర్ అనీ, నాస్తికుడనీ, దైవ దూషకుడనీ నిందించడం. ఎవరికి బలముంటే వాళ్లు ఇతర్ల తలలు నరకడం.

కుల, మతాల్ని వదులుకోడం ఎవరు చేసినా అది ఆడంబరం, ప్రదర్శన కాదు. పెద్ద పెద్ద పండాల్సు కట్టి, ట్రాఫిక్ జామ్స్ చేయడం, కర్ణ కఠోరంగా చప్పుళ్లు చేయడం, అరవడం.. అదీ ప్రదర్శన. కులమతాలు వద్దనడం ప్రదర్శన కాదు. అదొక మంచి పని అనే భావన ఎంత పెరిగితే సంఘానికి అంత మేలు. హేతువాదులు, నాస్తికులు తమ అభిప్రాయ కోసం కత్తులు నూరిన ఘటన ఏ చరిత్రలోనూ ఇంత వరకు లేదు. వుండే అవకాశం లేదు.

నేను కులమతాలు వద్దనడమంటే నిన్ను నాలా ఉండమనడం కాదు. నిన్ను హిందువు కమ్మని ;ఘర్ వాపసీ’కి పిలిస్తే, అప్పుడు నిన్ను నాలా వుండమని బలవంతం చేసినట్టు. ఏ మతం లేకపోతే, నువ్వు నా లాగ ఏమీ కావు, గ్యారంటీ

3.

వైవిధ్యం మన్నూ మశానమని వాదాలు చేస్తున్న వాళ్లు తమ రాజ్యాంగేతర/ మత పర లాభాల్ని వదులుకోలేకనే ఆ వాదాలు చేస్తున్నారని నా ఆభియోగం. జీవన వైవిధ్యం అనేది మానవ శ్రమ వల్లనే పుడుతుంది. పూజల వల్ల కాదు. నిజానికి శ్రమైక జీవనంలో పుట్టే వైవిధ్యాన్ని, ఆ సౌందర్యాన్ని మిసప్రాప్రియేట్ చేయడమే పూజారులు చేసే ఘన కార్యం.

వైవిధ్యం దానికది గొప్పది కూడా కాదు. సాంస్కృతిక వైవిధ్యం పేరిట సతీ సహగమనాన్ని సమర్థించే హీనులు కూడా వున్నారు. చిన్న చిన్న దొంగతనాలకు పేదవాళ్లను, అడల్టరీకి ఆడపిల్లల్ని చేతులు నరికించడం, రాళ్లతో కొట్టి చంపడం, రేఫులు చేయించడం కూడా కొందరికి వైవిధ్యంగా కనిపించొచ్చు. దీనికి అంతు లేదు. ఇవి నేనుఊహించి ఇస్తున్న ఉదాహరణలు కాదు. అలాంటి హీనులు ఈనాటి లోకం లోనే మన మధ్యనే వున్నారు. వధూ దహనాల్ని సైతం కుటుంబాల ప్రైవేటు వ్యవహారాలుగా చర్చించే ప్రబుద్ధులకయితే లెక్కే లేదు ఇప్పటికీ.

ఊళ్లలో అప్పటికప్పుడు తీర్పులు చెప్పి శిక్షలు అమలు చేసే పంచాయతీలు పోయాయని బాధ పడే పెదరాయుళ్లు, చిన రాయుళ్ల చుట్టూ ఎంత గ్లామర్? దానికి గాంధీ పేరుతో ఎంత పొలిటికల్ మైలేజీ? డెమోక్రటిక్ గా ఎంపికైన న్యాయస్థానాల్లోనే ఇంత అన్యాయం. ఇక పిడచగట్టిన గ్రామీణ వ్యవస్థను కాపాడే స్వతంత్ర పంచాయతీలలో న్యాయం గురించి చెప్పాలా?

ఏమి వైవిధ్యం, ఏమి సంప్రదాయం. దానెబ్బ. ఆ మఠం కాడ కట్టేసి కొట్టడాలు. కడ్డీలు కాల్చి వాతలు పెట్టడాలు. నా పెండ్లాం నా ఇష్టమని బజాట్లో ఆడవాళ్లను తన్నడాలు…. అవన్నీ వందలేళ్ల నుంచి జరిగే వైవిధ్య భరిత సంప్రదాయం కాదా? దానికి మన మతాలు … ఒకటి కాదు, హిందూ, ముస్లిం, క్రైస్తవాది అన్ని ,మతాల్లో అన్ని కులాల్లో శాంక్టిటీ ఉన్న మాట నిజం కాదా?.

4.
యాక్సిడెంటు అనే ఇంగ్లీషు మాటను తెలుగు/హిందీ చేయాల్సి వచ్చినప్పడు ఎదురయ్యే విచిత్ర కష్టం చూశారా? అది తెలుగులో ప్రమాదం, హిందీలో దుర్ఘటన్. దళిత కులాలకు అది నిజంగా ‘ప్రమాదమే’, దుర్ఘటనే. సో కాల్డ్ ఉన్నత కులాలకు అదేం ప్రమాదం కాదు. వరం. ఈ పుట్టు వరాల్ని, శాపాల్ని గుర్తించి తొలగించుకోకపోతే పుటకను ఆధారం చేసుకుని బతికే వాదాలు… బ్రాహ్మణ వాదం, కుల వాదం, మత వాదం ఎట్టా పోతాయి సార్?

పోవు. వాటిని కాన్షియస్ గా ప్రయత్నించి పోగొట్టుకోవాలి.

వీటిని పోగొట్టే మన స్ట్రగుల్స్ మునుపటి కన్న ఎక్కువ పదును దేరాలి.

4.

తమ మాటల్లో వాచ్యార్థాలు కాదు ఇంకేవో అర్థాలు చూడమని ఊదరగొడుతున్నారు కొందరు కులాల సమర్థకులు . పొడుపు కథలొద్దు. ఇది వినోదం కాదు. బతుకు. ఆ వ్యంగ్యార్థాలేమిటో చెప్పండి. ఆ గూఢార్థాలేవో చెప్పండి. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి మాత్రమే చదువు చెప్పడం మన సంప్రదాయమంటో రాసే తండ్రుల బయోగ్రఫీల వెనుక దాక్కునే వితర్కాలు ఇక చాలు, అలాంటి తండ్రిని నేను అసయ్యించుకుంటాను. నా అసయ్యాన్ని సపోర్ట్ చెయ్యడం మానవుడిగా, మితృడిగా మీ థర్మమని నా డిమాండు. నా డిమాండును ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పండి. అది చెప్పకుండా…. ఓటుకు నోటు గురించి ప్రశ్న అడిగితే, అసలా వీడియో ఎట్టా తీస్తారండీ అని వాదించే రాజకీయం ఇన్ని వేల ఏండ్లు సాగింది, చాలు.

బ్రాహ్మణులు నాస్తికులు, అంతే కాదు దైవ హంతకులు అని ఒక నయా బ్రాహ్మణ వాది చతురోక్తి. బహుశా ఇలాంటి అద్భుత ప్రకటనలే వీరు చెప్పే వ్యంగ్యార్థమో గూఢార్థమో అయ్యుంటాయి. అయ్య గారూ!, వాదం కోసం ఒప్పుకుంటాం. మరి, దేవాలయాల్లో ఈ దైవ హంతకులైన భూసురులు పూజారులుగా వుండొద్దని కొత్త రాష్ట్రం సెక్రటేరియట్ వద్ద ప్లాకార్డులు పట్టుకుని మీరు, మీ వాద సమర్థకులు డిమాండ్ చేయండి. మీకు మద్దతుగా మా ప్లకార్డులతో మేమూ వస్తాం. భలే మంచి ఐక్య సంఘటన అవుతుంది. దేవాలయాల్లోంచి బ్రాహ్మలను… అనగా దైవ హంతకులను తొలగించి, పూజారి ఉద్యోగాలలో వేల ఏండ్లుగా వున్న రిజర్వేషన్ విధానాన్ని తొలగించి వేద్దాం. శూద్రులకు, దళితులకు ఆ ఉద్యోగాలివ్వాలందాం. వీళ్లు భూసురులమని చెప్పుకోలేదు గనుక, దేవాంతకులు కారు కదా?! మితృడా సిద్ధమా?

అయినా అయ్య గారి మాటల్లో కుంచెం వ్యంగ్యార్థమో గూఢార్థమో ఒక అర్థం వున్న మాట నిజమే. బ్రాహ్మణులు తమను తాము దేవుళ్లుగా ప్రకటించుకోడమంటే అసలు దేవుడిని తీసెయ్యడమే అని వీరి కవిత్వం. (అయినా, బ్రాహ్మలు పాపం ఆకాశ దేవుళ్లమని చెప్పుకోలేదు, భూమ్మీది దేవుళ్లమని చెప్పుకున్నారు).

ఏది ఏమైనా, అలాంటి అబ్ స్ట్రాక్ట్ దేవుడి గురించి మేము మాట్లాడడం లేదు. మతానికి… మీ మతానికి గాని మరొకరి మతానికి గాని.. నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడైన దేవుడితో పని లేదు. అలాంటి దేవుడిని సైన్సు, హేతు వాదం విమర్శించదు. దాని గురించి మాట్లాడదు. పట్టించుకోదు. ఎందుకంటే, (ఆ) దేవుడు అగోచరం, అజ్జ్ఞేయం. నీకూ నాకు ఎవరికీ తెలియనిది. దాన్ని దేవుడని అనడం కేవలం భాషా సౌకర్యం మాత్రమే, దానికి…. ఇంకా జవాబు లేని ప్రశ్నఅనీ మరోటనీ… ఏమాటైనా ఉపయోగించొచ్చు. ఆ దేవుడికి మన లౌకిక జీవితంతో ఎలాంటి సంబంధం లేదు. ఏమైనా సంబంధం వుంటే ఆ సంగతి మనకు తెలీదు. ఆ దేవునికి ఏ మతానికీ….. సూఫీయిస్టు తాబేటి చిప్పలూ నెమలీకలకూ, బుద్ధ విగ్రహాలకూ, చెన్న బసవని శివునికి కూడా … ఏ మతానికి ఏ కులానికి ఆ దేవునితో సంబంధం లేదు. అందుకే మన సందర్భంలో ఈ పాయింటు తెచ్చిన మీ మాటల్ని దాట వేత వైఖరితో మత వాదానికి కొత్త సమర్థనగానే నేను భావించాను.

ఇప్పటికి ఇతిశ్రీ

08-02-2016

 Ends
 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s