మైనారిటీ బాధ

(ఒక మెలాంఖొలీ మొనొలాగ్)

నిన్న ఒక ఇంటికి వెళ్లాను. వాళ్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్సు. అదాటుగా వెళ్లాను. వెళ్లే సరికి మరో కుటుంబం వాళ్లు వచ్చివున్నారు. వాళ్లూ మాకు ఫ్రెండ్సే. భలే సంతోషం వేసింది. మూడు కుటుంబాల వాళ్లం బారతీయులం. కాపోతే భిన్న రాష్ట్రాల వాళ్లం. పిల్లలు ఆటల్లో పెద్దలు మాటల్లో. సోఫాలో నా పక్కన వున్న మధ్య వయస్కుడైన మితృడితో ఏమైనా మాట్లాడాలనిపించింది, ‘మీకు తీరిక దొరికితే ఆ తీరిక సమయాన్ని ఎలా గడుపుతారు’ అని అడిగాను. ఇది నా ఎత్తుగడ. నా మోస్ట్ పాపులర్ కొశ్చన్. ఎవరైనా తీరిక వేళల్లో ఏం చేస్తారో అదే వాళ్లు… అని నాకొక అంచనా.
అయన వారంలో తప్పకుండా ఒక సారి, వీలైతే వారంలో రెండు సార్లు ఒక సమావేశానికి వెళ్తానని చెప్పారు,

“ఏం సమావేశం?” నా ఉత్సాహం.

“అక్కడ ఫిలాసఫీ మాట్లాడుకుంటాం”, ఉత్సాహం ఇంకో డిగ్రీ పెరిగింది.

“భగవద్గీత గురించీ, అట్టాంటివే ఇంకేమయినా. వేరే మతాల వాళ్లు కూడా వస్తారు. అందుకని దానికి ఏ మతం పేరు పెట్టం. మానవ శాంతి వంటి పేర్లు పెట్టుకుంటాం”

“ఓహ్” నాకు తెలిసిపోయింది నేనెక్కడున్నానో.

అమెరికాలో ఇట్టాంటివి బానే వుంటాయి. హైదరాబాదులో అయితే కొదువే లేదు. పీఠాలు పీఠాలు. ఎకరాలకు ఎకరాలు. నాకు బయమేసింది. ఇక ముందు నేనేం తప్పు మాట్లాడుతానో అని నా బయం. ఆగి పోయాను.

ఆయన ఆగిపోలేదు. అదే కబుర్లు చెబుతున్నారు. అప్పుడు చూడాల్సింది మీరు నన్ను. అప్పుటి నా అంతటి అబద్ధీకుడిని, హిపోక్రైట్ ని మీరు ఇంకెక్కడా చూడరు. నిజం చెప్పనా?! అలా వుండగలిగినందుకు నా కనిపించని చేయితో నా కనిపించని బుజాన్ని బొబ్బలెక్కేలా కొట్టుకున్నాను.
ఆయన వాక్ఝరి వున్నట్టుండి ఆగింది. చూస్తే ఏముంది ఆయన తన ఆండ్రాయిడ్ ను ఆ ఇంటి వాళ్ల పెద్ద టీవీకి అనుసంధానించి, తమ ‘సమావేశం’లో ఒక యువ గుండు ఉపన్యాసం వీడియో పెట్టారు. గుండు యువకుడు చాల ఆరోగ్యంగా లేత పసుపు బట్టలు ధరించి అత్యంత ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు.

‘వేదాంతం. వేదాంతం అంటే మరేం లేదు. ఇందులో రెండు పదాలున్నాయి. వేదం అంటే జ్జ్ఞానం,. జ్జ్ఞానం అంటే తెలిసినది. అంతం అంటే ఎండ్ లేక కల్మినేషన్. జ్జ్ఞానం యొక్క అంతం, దాని చివరి కల్మినేషన్ వేదాంతం’

అంత సేపు ఊరికే కూర్చున్నానా. కూర్చోగలిగినందుకు బజాలు చరుచుకున్నానా. ఇక వుండబట్టలేదు. అదో రకం జిహ్వా చాపల్యం.

‘జ్జ్ఞానానికి అంతం వుందంటున్నారు ఆయన. అదంతా ఒక దానిలో కల్మినేట్ కావడం వల్ల అక్కడితో ఆగుతుందని అంటున్నాడు. సో మనకు… వేదాంతానికి… అన్నీ తెలిసి పోయాయన్న మాట. ఎందుకో ఇది చాల ఎక్కువ మాట అనిపిస్తోంది’ అన్నాను.

తరువాత ఆ ఇంటి సారు పియానో వాయిస్తుంటే అతిధి-పాప ఏదో హిందీ పాట పాడింది. నాకు హిందీ రాకపోయినా టెక్స్టు ఏమీ తెలియకపోయినా ఇష్టంగా పాట వింటూ వుండిపోయా. రెండింటిలో ఏదైనా ఒకటి బాంటుంది కదా అన్నాను అతిధి-తండ్రితో. యువ గుండు ‘వేదంతం’ గానీ పాపాయి పాట గానీ అని. పాప వాళ్లమ్మాయే కదా అని ఆ ధైర్యం. ఆయన చాల అయిష్టంగానే టీవీ కట్టేశారు.

కాని, నాకు తెలుసు, ఒక స్నేహితుడిని పోగొట్టుకున్నాను.

ఇలా ఎందరిని పోగొట్టుకున్నానో చెప్పలేను.

పెండ్లి పేరిట, మరణం పేరిట, పండగ పేరిట జరిగే తంతులలో మనుషులను వదులుకోలేక అంత దూరం వెళ్లడం, ఆ తంతు మీద ‘శ్రద్ధ’ను నటించలేక ‘ఆడ్ మ్యాన్ ఔట్’ గా వుండడం.

ఆ మధ్య అయిన వాళ్ల ఇంట్లో… కొంచెం కాదు, బాగా అయిన వాళ్లింట్లో… పెళ్లి. పెళ్లికొడుకు నాకు కొడుకు వరుస. అక్కడ ఒక ఇంటి మనిషిగా నేను వుండక తప్పదు. నా లాంటి దగ్గరి వాళ్లకు పెళ్లి కొడుకు నుంచి బట్టలూ అవీ ఇచ్చుకోడం జరిగింది. నన్ను ఎంచక్కా పక్కన పెట్టేశారు. పెళ్లి నాడు నా మామూలు టీ షర్టు వేసుకున్నాను. నేను వేరుగా కొత్త షర్టు కొనుక్కుని వేసుకోవాల్సిందేమో, మందిలో కలిసి కనపడ్డానికి. ఇంట్లో ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకోకపోడానికి ఒకే ఒక కారణం… అందరిలో నేనొక్కడినే మతం లేని వాడిని కావడం, ఆ క్రతువుల్లో పాల్గొనే వుద్దేశం లేకపోవడం.

ఇతర్లకేమైనా ఇవ్వాల్సి వుంటే, ఇవ్వకుండా తప్పుకుంటే ఒప్పకోరు. నాకు ఇవ్వాల్సినవి వుంటే ‘ఇయ్యన్నీ నీకు పట్టదు లేబ్బా…’ అని ఒక ఖూని రాగం తీసి వూరుకుంటారు. నేనూ ఒక వెర్రి నవ్వు నవ్వి వూరుకుంటాను.

అయ్యా చెప్పండి.

ఎవరు మైనారిటీ?

వేణుడు అనే రాజును దేవుడు లేడన్నందుకు సొంత కొడుకు చంపాడని పురాణ కథ విన్నాను. రాజ్యం కోసం తండ్రిని కొడుకు చంపడం వింత కాదు గాని, వేణుడు నాస్తికుడు కనుక హత్యార్హుడనే పురాణ కథను అందరూ శ్రద్ధగా వింటారు. పితృహత్య పాపం కాదక్కడ.
ప్రహ్లాదుడు సొంత తండ్రిని ఎందుకు చంపించాడు. ప్రహ్లాదుడు దేవుడన్న వాడిని వాళ్ల నాన్న కాదన్నాడు అందుకేగా?

ఆ కాలం కథలు ఇప్పడెందుకని వుంకో క్రాస్ క్వశ్చనుంటాది. మరి దాన్ని పురాణం చెప్పడమెందుకు, సినిమా తీయడమెందుకు?

అలా చంపబడడానికి, కొడుకుల్లేరు గాని వుండి వుంటే వాళ్లతో చంపించబడడానికి నేను అర్హుడినే కదా?! (అట్టా ఆడపిల్లలు చంపినట్టు పురాణ కథల్లేవు, బతికి పోయా).

చెప్పండి సార్,

ఎవరు మైనారిటీ?

ఏ బౌద్ధం ఏ సూఫీ ఆదుకుంటుంది నన్ను. అవీ మతాలే కదా?! నమ్మను అంటే కుదరదు. నేను అగ్నాస్టిక్ ని, నాన్ బిలీవర్ ని అంటే కుదరదు. కుదరదు అంతే. చుట్టూరా అందరూ ఏదో ఒకటి ‘నమ్మిన’ వాళ్లే, వాళ్ల మధ్య ఎన్ని తగాదాలున్నా, అందుకు నరుక్కు చచ్చినా… అంతా కలసి ఒక మెజారిటీ అని ఇటీవల బాగా అర్థమయ్యింది. రోజువారీ బతుకులో :కమ్యూనిజాన్ని ఆచరించే వాళ్లు సరే, కమ్యూనిజాన్ని ‘నమ్మిన’ వాళ్లకు మాత్రం ఇతర నమ్మిక-వాళ్లతో పెద్ద పేచీ లేదని కూడా ఇటీవల బాగా అర్థమయ్యింది. అర్థం అవుతోంది. నమ్మని వాళ్లని నమ్మిన వాళ్లు ఒక సారి మెత్త మెత్తగా, ఇంకో సారి కాల్చుకునీ తింటారు. తింటూనే నానా బూతులు తిడుతుంటారు.
చెప్పండి సార్, ఎవరు మైనారిటీ?

దేవుని నమ్మకపోవడం, దేన్నో ఒక దాన్ని దేవుడిగా చేసుకుని దాన్ని నమ్మకపోవడం ఎంత పాపం? దానికి మెజారిటీ చూపించే నరకం కాదూ ఇది. ఓర్నాయినో సల సల కాగే నూనె నా చుట్టూరా.

ఛెళ్. నమ్మన్నేను అప్రత్యక్ష్యం, అహేతుకం అతార్కికం అయిన దేన్నీ.

నమ్మకు నువ్వూ, నమ్మకం కాసేపు సమ్మగా వున్నా, అందుకు గాను వ్యక్తిగతంగా ఒకట్రెండు బహుమతులు దొరికినా అది మానవ వినాశకరం. పేదకు అదనపు సంకెల.

దేవుడి వంటి దాని వెంట మతం, మతం వెంట హెయిరార్కీ, హెయిరార్కీ వెంట అణిచివేత… కావాలా? కులం, జెండర్ ఎట్సెటరా.

దేవుడే కాదు దేవుడి వంటిది ఏదైనా ఇంతే. దీన్ని ఎదిరించక్కర్లేదా? దీని గురించి నడి బజారులో నిలబడి మాట్లాడి లోకాలను హేతువు వైపు గెలుచుకో నవసరం లేదా?

02-02-2016

 
 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s