సంక్లిష్ట జీవితం సరళ నిర్వచనం

Ga Na Cover

(గరిమెళ్ల నారాయణ కవితా సంపుటి ‘సరళ నిర్వచనం’ కు ముందుమాట)

నాకొక మితృడున్నాడు. అర్టిస్టు. ‘బతుకు ఎలాగూ సంక్లిష్టం, దాన్ని మరింత సంక్లిష్టం చేయడం ఆర్ట్ అవుతుందా’ అని కోప్పడుతుంటాడు. కవిత్వమైనా ఏ కళ అయినా జీవితాన్ని మరింత ఎక్కువగా ఆస్వాదయోగ్యం చేయడానికే గాని బతుకు నుంచి దూరం చేయడానికి కాదని తన అభిమతం.

చిన్న పిల్లలు బొమ్మలు గీయడంలో వున్న సరళత్వాన్ని అందుకోవడం చాల మంది చిత్రకారులకు చాత కాదని, అది చాతనయ్యే కొద్దీ అతడు గొప్ప కళాకారుడవుతాడనీ పెద్దలు అంటారు. పికాసో, డాలీ వంటి కళాకారులు తమ అతి పరిణత దశలో అలా చేశారు. గుయెర్నికా బొమ్మ దాని లోని గీతల వల్ల ఎంత భయపెడుతుందో, ఆ గీతల సారళ్యం వల్ల అంత భయపెడుతుంది. ఆ బొమ్మ లోని గీతలు సంక్లిష్టం అయ్యుంటే చూపరి తన భయాన్ని సంక్లిష్టత వెనుక దాచుకునే వాడు. ఇప్పుడు తనకు దాక్కోడానికి చోటు లేదు. భయంకరమైన దానితో ముఖాముఖి తలపడాల్సిందే. భయంకర వాస్తవికతను వాస్తవికతగా ఎదుర్కొనవలసిందే.

సరళమైనదే, సామాన్యమైనదే నిజంగా భయపెడుతుంది. సరళ వాక్కులో అబద్ధం వుంటానికి అవకాశం తక్కువ. రాసే వాడు తన అజ్జ్ఞానాన్ని దాచుకుని ఏదో వుందనిపించి తప్పుకోడం ‘సరళ’ మార్గంలో కుదరదు.

నరేన్ గరిమెళ్ల తన కవిత్వం పుస్తకం పేరు లోనే సరళత్వాన్ని ఆవాహన చేయడం బాగుంది.

కవిత్వం బతుకును నిర్వచిస్తుందా? డిఫైన్ చేస్తుందా అని మరొక సందేహం.

తన ‘రోబో’ నాటకానికి ముందు మాటలో అనుకుంటాను చెక్ రచయిత కార్ల్ చాపెక్ ఓ మాట అన్నాడు. సైన్సు లాగే, మతం లాగే బతుకును తెలుసుకోడానికి (కాగ్నైజ్)  మనిషి దగ్గరున్న పనిముట్లలో సాహిత్యం కూడా ఒకటి అన్నాడాయన. సైన్సు, మతం రెండూ ఇవ్వని ఒక వెసులుబాటును కవిత్వం ఇస్తుంది. భారతీయ ఆలంకారికులు అన్నట్టు కవిత్వం ‘కాంతా సమ్మితం’. దానిలో కొంత ఫెమినైనిటీ తప్పక వుంటుంది. చెప్పదలిచింది నయతారంగా చెప్పడం, అన్ని భావోద్వేగాలకన్న ప్రేమకు ఎక్కువగా లోబడడం స్త్రీత్వంలో వుంటుంది. అమ్మ కావొచ్చు ప్రేయసి కావొచ్చు ‘అమె’ స్వభావమది. మతం లోని ఆధికారం, సైన్సు లోని ‘సూత్ర బద్దత’ కవిత్వంలో కదరవు. కవి నయతారమైన భాష మీద, ప్రేమగా చెప్పే వైఖరి మీద ఆధారపడక తప్పదు.

అయినా సైన్సు, మతాల్లాగే కవిత్వం కూడా తన దారిలో తాను జీవితాన్ని నిర్వచిస్తుంది. జీవితాన్ని కొద్ది మాటల్లోకి తెచ్చి మనకు అర్థం చేస్తుంది

నారాయణ గరిమెళ్ల ఈ పని చేశారా, చేస్తే ఎలా చేశారు… అది కదా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి.

జీవితాన్ని ఒక స్థలంలో ఒక కాలంలో పెట్టి చూస్తేనే బాగా అర్థమవుతుంది. దాన్నే సందర్భం అని కూడా అంటారు. చాల సార్లు భావాల్ని సందర్భానికి అతీతంగా చూడబోయి చతికిల బడుతుంటాం. గరిమెళ్లతో ఆ సమస్య వుండదు. ఆయన సందర్భాలు దాదాపు అన్నీ సార్వజనీనాలు. బహుశా ఆయన సారళ్యతకు అదే మూలం. పర్యావరణం, మానవ విలువలు ఛిద్రమై ఈ భూగోళం ఇంకెన్నాళ్లుంటుందబ్బా అనిపించే కాలానికి అద్దం పట్టే ప్రయత్నం చేశారు గరిమెళ్ల.

‘జీవ యోగ్యమైన మరొక గ్రహాన్ని

కనుగొనాలని చేసే ప్రయత్నాల పరంపర కన్నా,

తనతో భాగమై, మమేకమై,

కోటానుకోట్ల జీవకణాల కలబోతై

కలసి మెలసి మనగలగాలనుకునే తోటి జీవాల్ని

సాకి, సమున్నతంగా కాపాడుకోవడంలోనే మొదటి అడుగు’ పడాలన్న కవి ఆకాంక్ష ఈ సంపుటి కవితలు చాల వాటిలో వ్యక్తమయ్యింది.

ఇవాళ మన చుట్టూ జీవితంలో ఏవీ కవి ఆకాంక్షకు అనుగుణంగా లేవు. మానవుడు దిద్దుబాట పట్టి, కొత్త బంగారు లోకం తయారు చేసుకోక తప్పదు. దానికి ఒకరికి ఒకరు అండగా నిలిచే మనుషులు కావాలి. నా కన్న మానవ జాతి మిన్న అనే స్పృహ పెరగకపోతే అలాంటి లోకం కోసం పని చేయడానికి కనీస ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) వుండదు.

అందరం పోయే వాళ్లమే. అది అందరికీ తెలుసు. నేను రేపు వుండను అనుకునే కొద్దీ ఏం అనుభవించినా ఇప్పుడే ఇక్కడే అనుభవించాలని అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? నేను అనుభవించాలంటే వస్తువులు అపరిమితంగా నా చేతిలో వుండాలి. నా చేతికి అడ్డం వచ్చే మరో మానవ హస్తం వుండకూడదు. అసలు మిగిలిన మానవ హస్తాలన్నీ నా అనుభవం కోసమే వుండాలి.

నేను చూస్తున్నాను కాబట్టే సూర్య, చంద్రులు, విశ్వగోళం వున్నాయి అనే ‘స్వీయమానసిక వాదా’న్ని కేవలం ఫిలాసఫీగా చెబితే ఎవరూ కాదనరు. పోగా దానికి ఓటేస్తారు. భౌతికం, వస్తుగతం అయిన భావనల మీద దాడికి ఆ ఫిలాసఫీని వుపయోగించుకుంటారు. కాని మనిషిలోని స్వార్థానికి మూలం కూడా ఈ స్వీయ మానసిక భావనే. ఎందుకంటే, అలా భావించే మనిషి ఇంకొకరి కోసం… అదీ రేపు ఎప్పుడో రానున్న మనుషుల (తరాల) కోసం ఎందుకు ఆలోచించాలి? ఇతర్ల కోసం ఆలోచించడానికి అతడికి వున్న ప్రోత్సాహకం ఏమటి?

ఈ వాస్తవికతను అధిగమించడానికి ఊహలు అవసరమవుతాయి. కలలు అవసరమవుతాయి. మంచి తనాన్ని ‘ఊహించి’ నిలబెట్టుకోవాలి, తప్పదు. మృత్యు శయ్య మీద చివరి ఊపిరిలో కూడా కలలు కనాలి ఊహల ఆవశ్యకత మీద ఓ చక్కని కవిత రాశారు గరిమెళ్ల…

.

‘ఊహించే కదా

విధ్వంసకులు

ఆకాశ సౌధాలను

విమానాలతో ఢీకొట్టారు!

ఊహించే కదా

హిరోషిమా నాగసాకి లలో

అణుబాంబుల చలగాటమాడారు!

అని ఊహ చేసే విధ్వంసాన్ని పలు విధాలుగా బొమ్మ కట్టిన కవి మానవ రక్షణ కోసం కూడా ఊహనే ఆశ్రయించడం హేతుబద్ధం. ‘ జీవితాన్ని స్వప్న-దూరాలలో మాత్రమే కొలవడం సాధ్యమని’ మరొక చోట అంటాడీ కవి.

‘ఊహలు

మరింక ఏ విధ్వంసాల కూ

వడిగట్టకుండా నిలువరించేందుకైనా

ఊహించు’  

మనిషి తన ఊహలలోని వినాశాన్ని ఎంత పకడ్బందీగా వూహిస్తాడో కదా? విమానం ఎవరు నడపాలి, అతడిని మానసికంగా ఆ పనికి ఎట్టా తయారు చేయాలి. విమానాశ్రయంలోని యంత్రాంగాన్ని ఎట్టా వాడుకోవాలి, దాడి తరువాత పట్టుబడకుండా ఎలా తప్పుకోవాలి.. ఎన్ని విధాలుగా ఎన్ని ఊహలు చేసి వెరిఫికేషన్ పాల్సిఫికేషన్ పద్దతిలో చివరికొక గట్టి ఊహను ఎన్నుకుని…. ఓహ్, అంత శ్రమించీ చేస్తున్నదేమిటి? జస్ట్ ఒక భారీ విధ్వంసం. భారీ ప్రాణ హరణం.

ఊహలు చేయడంలో మనిషికి చాల ఇష్టమైనదేదో వుంది. మీ ఇంట్లో ఐదారేళ్ల పాప వుంటే తను కాలాన్ని ఎలా వినియోగిస్తున్నదో ఒక సారి చూడండి. తన ఆటలు మాటలు అన్నీ ఊహలే. పాపలో మనల్ని కట్టి పడేసేవి తన ఊహలే. పెద్దయ్యాక కూడా మనల్ని చివరి వరకూ ‘బతికించే’ది ఊహలే.

సో, తిరిగి మనల్ని కాపాడుకోడానికి కూడా ఊహలే. ‘అందుకే  ఊహించు’ అంటాడు కవి.

‘వినాశాన్ని దారి మళ్ళించి

శాంతి కాంతులు  దానికి చూపేందుకైనా

ఊహించు’

అనేసి, బాబోయ్ అంత ఊహించడం మనతో అయ్యే పనేనా అని నిష్క్రియుల మైపోకుండా తిరిగి తానే

‘ఊహించడానికేం ఖర్చు కాదులే!’

అని ఊరడిస్తాడు. ‘ఊహించడానికేం ఖర్చు కాదులే!’ అనేదే ఈ పద్యం శీర్షిక. ఈ మాట ఒకే సారి ఊరటా, ఎత్తిపొడుపూ. ఖర్చు కాని పని అంటే ఇంకొంచెం శ్రద్ధగా వింటాం కదా మనం. J అది నిజం కూడా. మంచి పనులకు పెద్దగా ఖర్చు కాదు.

గరిమెళ్ల ఇలా అన్నీ మాక్రో విషయాలే రాశాడనుకోనక్కర్లేదు, ఆయన సంసారం, ప్రయాణం. దైనందిన జీవితంలోని ఈతి బాధల వంటి మైక్రో విషయాలనూ వదిలెయ్య లేదు. మనుషుల మధ్య మానవ సంబంధాల కన్న డబ్బు సంబంధాలు ఎక్కువై పోయాయి. అది కల్పించే బాధను…. అదేం పెద్ద బాధ కాదు, మామూలే అన్నట్టు… తేలిగ్గా చెప్పిన తీరు బాగుంది.

ప్రేయసి… ఇంకా భార్య కాదు… కాబోతోంది, ఆమెకు అబ్బాయి రాసే ఉత్తరం ఎలా వుండొచ్చు?  అబ్బాయి ఆమె క్షేమం కోరడంతో లేఖ మొదలవుతుంది. అయితే ఈయన గారు అమె క్షేమం ఎందుకు కోరుతున్నాడటా?! “హాస్పిటల్ కి అనవసరం ఖర్చు చెయ్యాల్సిలేకుండా/ నువ్వూ క్షేమమనే తలుస్తాను”. తరువాత్తరువాత ఈయనకు ఆసుపత్రి ఖర్చు లేకపోవడమనే మహత్తర అవసరం కోసమే ఆమె ఆరోగ్యంగా వుండాలి. ఆమె చాల అందగత్తె అట. ఎంత అందగత్తె? “అష్ట ‘ఐశ్వర్యా’లను తలపించే అంద”మట. పోగా ఆమె అష్టైశ్వర్యాల్ని ‘తలచి తలచి తన కళ్లు ఫస్టు తారీఖు నాటి జేబుల్లా ఉబ్బిపోతున్నాయి’ట. 

డబ్బు రూపంలో ‘లాభాల’ లెక్క చూసుకోడంతోనే ఎన్నిసంసారాలు ‘సాగు’తున్నాయో చెప్పలేం. ప్రేయసీ ప్రియుల మధ్య సంబంధం మరే మానవ సంబంధం కన్న వున్నతమైనది. దాని గతి ఇలా వుంటే, ఇక ఇతర సంబంధాల గురించి చెప్పేదేముంది?

కొన్నాళ్ల క్రితం ఒకరిద్దరు ఫెమినిస్టు కవులు ఈ నొప్పిని గొప్పగా చెప్పారు. రాత్రి భార్యా భర్త ఒక్కటయ్యే వేళ ఆయన గారు ‘మీ జీతం ఇచ్చారా, ఈ సారి ఇంక్రిమెంటేమైనా వచ్చిందా’ లాంటి ప్రశ్న అడిగితే ఎంత నొప్పి కలుగుతుందో అని ఒక కవిత. అలాంటి ప్రశ్న భర్తను భార్య అడగదని ఏమీ లేదు. ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడం కొత్త కాబట్టి వారికి ఈ ప్రశ్న ఎదురవ్వడం కొత్త, అంతే. గరిమెళ్ల పద్యంలో పాత్రల్ని తారుమారు చేసినా తప్పేం కాదు.

గరిమెళ్ల కవితల్లో భార్య/ప్రేయసి తో సహా మానవ సంబంధాలు ఎలా నాశనమయ్యిందీ చెప్పినా; తల్లి, గురువు, బామ్మ వంటి సంబంధాల్ని కాస్త ఎక్కువగానే సమ్మానించారు. మంచి టీచర్ పాఠం ముగించినప్పుడు…

‘దేవున్ని నమ్మిన వాళ్ళకు
నమ్మని వాళ్ళకు కూడా
ఏదో సాక్షాత్కారం జరిగినట్టు ఉంటుంది’

అనడం పాఠకులను వాళ్ల వాళ్ల ఇష్ట ఉపాధ్యాయుల వద్దకు తీసుకెళ్తుంది. భక్తి కన్న ఉన్నతమైన భావన కలుగుతుంది. నాకైతే మా రమణ మూర్తి సారు, ఆయన చెప్పిన  పాఠం గుర్తొచ్చి కళ్లు చెమర్చాయి.

నయాగరా చూసిన అనుభవాన్ని నయాగరా దూకుడును తలపించేలా చిన్న చిన్న చరణాలతో రాయడం వంటి కవితా నిర్మాణ పద్ధతులను మెచ్చుకోకుండా వుండలేం. విమాన ప్రయాణం వంటి స్వీయ అనుభవాల విషయంలోనూ అదే పద్ధతి అనుసరించారు గరిమెళ్ల,

నిర్భయ ఘటన సమయంలో అనుకుంటా

‘ఒక తుపాకీ అయ్యుంటె ఎంత బాగుండేది?

అవును, ఆ సమయంలో ఆమె, నిజంగానే

ఒక తుపాకీ అయ్యుంటే ఎంత బాగుండేది?

చండ్రనిప్పులు కక్కుతూ, ఉరుముతూ, గర్జిస్తూ 

మృగాల ప్రాణాలు తీయగలిగే బలమైన ఆయుధమయ్యుంటే ఎంత బాగుండేది?’

అని అలాంటప్పుడు తుపాకి పట్టినా తప్పు లేదని ఆగ్రహం ప్రకటించినా…

‘తుపాకీ ఎప్పుడూ తుపాకీయే….

తుత్తునియలు చేయాలనే అనుకుంటుంది

ఛిద్రాన్నీ, విచ్ఛిన్నాన్నీ  సాకారం చేసుకుని

స్మశానాలకు కొత్త బాటలు వెయ్యాలనే అనుకుంటుంది.

ప్రతి సమస్యకు పరిష్కారాన్ని

పేలడంలోనే కనుగోవాలనుకుంటుంది’

అని ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో తుపాకి-స్వేచ్ఛ సృష్టిస్తున్న ఘోరకలిని నిర్మొహమాటంగా విమర్శించారు. సమస్యల పరిష్కారం కేవలం తుపాకి పేలుడులోనే లేదని స్ఫురణ కల్పించారు.

భూగోళం మీద మానవ జాతి నాశనం కావడానికి శాస్త్రజ్జ్ఞులు చెబుతున్నట్టు ఏ ఉల్కాపాతమో, మంచుయుగం రావడమో అక్కర్లేదు. మనిషి లోని దౌష్ట్యం చాలునని కవి చేస్తున్న హెచ్చరికను (‘ఉల్క పడింది’) మనుషులు వింటారా? వినరు. ఎప్పుడూ ఇంకొకరి మీద అధికారం చెలాయించాలని, బలిమిని అనుభవించాలని చూసే మానవ హీనత్వం పోనంత వరకు కవి ఆశ ఒక కలే. ఆయనే అంటున్నట్టు

‘ఎక్కడ చూడు…!  
ఆ రెండే….!

‘ఒక పై చెయ్యి
ఒక కింద చెయ్యి

పై చెయ్యెప్పుడూ హుకుం జారీ చేస్తానంటుంది
మీసం మెలేస్తుంటుంది.
కిందది బానిసలా పడుండి
కిందనే,
కింద కిందనే అణిగిమణిగి ఉండాలంటుంది’

అలా అనుకునే వరకు వినాశం దిశగా ఈ ప్రయాణం ఆగదు. అయినా, కవి ఆశను కోల్పోలేదు. .

‘చేతులు రెండూ కలిసి కరచాలనమయ్యే
అపురూప ప్రాంతాలకి
ఎన్ని వ్యయప్రయాసలకోర్చైనా
నేను తప్పక ప్రయాణం కడతాను

అంటున్నాడు. మనమూ వెళ్దాం, కవితో కరచాలనం చేసి…

9-12-2015                                                                                    హెచ్చార్కె

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s