తెగిన వేర్లు

for FB

ఒక్కొక్క రాత్రి’… 1993 నుంచి 1995 వరకు నా పద్యాల సంపుటి. దీన్ని 1995 లో ప్రచురించాను. అప్పటికి నేను‘ఈనాడు’లో పని చేస్తున్నాను, దొంగ పేర్లతో వారానికి రెండో మూడో వ్యాసాలు రాస్తూనో, ఇతరులతో రాయిస్తూనో వున్నాను.

‘ఒక్కొక్క రాత్రి’ పుస్తకంలో చాల ఎక్కువ కవిత్వానికి ప్రాణం అప్పటికి నేను పోగొట్టుకుని, ఇక తిరిగి దొరకదని నొప్పి పడుతూ వుండిన జీవితం, దాని విహ్వలత్వాలే. చాల మంది మితృలు ఆ పుస్తకాన్నే చూడలేదని నాకు అనిపించింది. అందులోంచి నాకు చాల ఇష్టమైన కొన్ని పద్యాల్ని అప్పుడప్పుడిలా మీతో పంచుకుందామని ప్రయత్నం. (ఆధునిక సాంకేతికతకు కృతజ్ఞతలు)

ఇటీవల మళ్లీ… … కొందరు నేతల తొందరపాటూ, నక్క బుద్ధి, స్వార్థపరత్వం కారణంగా రాయలసీమ మళ్లీ రగులుతోంది. రాజకీయం స్కౌండ్రల్స్ ఆఖరి ఆశ్రయమన్నారు. అలాంటి స్కౌండ్రల్స్ కారణంగానే రాష్ట్రం ఒక సారి ముక్కలయ్యింది. తక్షణ లాభాల్ని తప్ప మరేమీ చూడలేని ఈ హ్రస్వ దృష్టుల వల్ల ఉన్న ఆంధ్ర ప్రదేశ్ మరో రెండు ముక్కలయినా ఆశ్చర్య పడను. అసంతృప్తి రగలి, రగిలి ఏమవుతుందనేది దానిలోని ప్రాణ శక్తిని బట్టి, రాసీమకు దొరికే నాయకత్వాన్ని బట్టి వుంటుంది. నా మట్టుకు నేను ఈ నొప్పిలో పాలు పంచుకుంటున్నాను. తరువాతేమిటనేది తరువాతే తేలనీ .
జై రాయల సీమ
వివా లా రాయల సీమ

_______

తెగిన వేర్లు

(ఒక ప్రవాసి వేదన)

ఎందుకలా చూస్తావు దిగులుగా నా కళ్లలోకి

ఒక్కొక్క ఓటమినీ పొది లోంచి తీసి గురి చూసి

ఎందుకు విసురుతావు నా దుర్బల దేహం మీదికి

నీ దిగులులో కాలి కరుకెక్కడానికి నాకు తీరికేదీ

ఓటమి చక్రం మీద పదునెక్కడానికి నాకు అంచులేవీ

ప్రవాసుల మధ్య పోటీలో నా కాళ్లకు చక్రాలు లేవని

చేతులకు బాక్సింగ్ తొడుగుల్లేవని నా హైబ్రిడ్ కన్నీళ్లలో నేను

నువ్వు గుర్తొచ్చినప్పుడంతా ఓ నా ప్రియమైన రాయలసీమా

సంఘ స్పృహ కోల్పోయి నగరం నడి వీధుల్లో విలవిల్లాడుతాను

ఎర్రమల కొండల్లో ఎండగుర్రాలు క్షేమమా

అదనుకు కురియని రాకాసి ఆకాశాలు

వేపమండల మధ్య దాహార్త మండూకాలు

కత్తుల కోలాటాల కథలు జెప్పే కోటలు

పెట్టుబడి చేతిలో పాలెగాళ్ల పట్టా కత్తులు

నీలకంఠేశ్వరాలయ ప్రాకారం పక్కన

నిద్రగన్నెరు పొదల్లో రక్తపింజరులు క్షేమమా

వునిపించు తల్లీ నీ యోగ క్షామాలు మారణ హోమాలు

కదిలించవమ్మా నా లోని నిద్రాణ మృత్ శకటికాలు

నడుస్తున్నప్పుడు ఎవడూ చెప్పలేడు

నిజంగా తాను ఎక్కడికి నడుస్తున్నాడో

తొలుస్తున్నప్పుడు ఎవడూ చెప్పలేడు

నిజంగా తనను తొలుస్తున్నదేమిటో

చర్మం రేపర్ కింద వికృత శిల్పాలమయిపోయి

ఏ షాపులోనో కళాంజలి ఘటించాక

వేర్లు తెగనమ్ముకుని ఆ డబ్బుతో రెక్కలు కొనుక్కుని

గాలిలో గిరికీలు కొట్టే చెట్లమయ్యాక కూడా

శిల్పికి అందని లోలోపలి శిల ద్రవించి

మరుగుతూనే వుంటుంది మాగ్మా వలె

ఎవరి ఇంట్లో నుంచో జొన్న రొట్టెలు చేస్తున్న చప్పుడు

చేతిలో ఇరానీ టీ కప్పు గజగజ వణుకుతుంది

వార్తా పత్రికలో ఓ మూల బాక్సు కట్టిన బాంబులు

మాతృ హంతక హీనులపై నిష్ఫల క్రోథమవుతాను

పదవి వూడిన వాడి నోట సీమ బాధల బోసి పాట

నా లోపల నేను పెను వికట హాసమవుతాను

మద్దులేటి వాగు ఇసుకలో పోగొట్టుకున్న కలలకై

అప్పుడప్పుడు ట్యాంక్ బండ్ విగ్రహాల్లో వెదుక్కుంటాను

మళ్లీ పే స్లిప్ చిరుగులు లెక్కెట్టుకుంటూ, నన్నూ

వికృతం కాక మునుపటి నా భాషను మరిచిపోతాను

నేనేమయినా ఏమీ కాకున్నా, నాకు దేహమిచ్చిన

నల్లరేగడి మట్టీ! నువ్వు నిజం నీ శోకం నిజం

రెడీమెడ్ చర్మాల కింద ఈ నా దేహమెంత నిజమో

ఎప్పుడూ మట్టి మండుతున్నట్లుండే నీ దుఃఖమంత నిజం

కానీ నువ్వు పోరాడుతున్నావనే మాట నిజమేనా, లేక

నువ్వు ఇప్పటికీ బియ్యం పారబోసి రాళ్లుంచుకునే చాటవేనా

పోటీలో నిలిచి గెవగలవనే మాట నిజమేనా, లేక

నాలాగే నువ్వూ పరారీలో వున్న పాత పాటవేనా

(28-4-1995)

(‘ఒక్కొక్క రాత్రి’ పేజెస్: 32, 33)

నోట్స్:

 1. ఎర్రమల కొండలు: నల్లమల కొండల ఎక్స్ టెన్షన్. నంద్యాల, పాణ్యం, గడివేముల, గని (మా ఊరు) ప్రాంతాలు ఎర్రమల కొండల్లోనే వుంటాయి.
 2. ఎండ గుర్రాలు: ఎండ మావులను ఎండ గుర్రాలని కూడా అంటారు.
 3. వానలు రావాలని కోరికుంటూ చేసే కప్పల పెళ్లిళ్లు. కప్పను వేపమండల మధ్య కట్టి వూరంతా తిప్పుతారు. ఇంటింటి దగ్గరా అమ్మలు కప్ప మీద చెంబెడు నీల్లు పోస్తారు.
 4. పెట్టుబడి: క్యాపిటలిజం
 5. పాలెగాళ్లు: ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో రాజ్యాలేలిన చిన్న చిన్న రాజులు.
 6. నీల కంఠేఋశ్వరాలయం: మా వూరి బయట బాగా పెద్ద గుడి. సాయంత్రాలు ఆ గుడి ప్రాకారం మీదే మా యవ్వారాలు నడిచేవి.
 7. రక్తపింజరి:  అదొక పాము. కాటేస్తే ఇక అంతే.
 8. యోగక్షేమాలు కాదిక్కడ క్షామాలే.
 9. మృత్ శకటికం: మృచ్ఛకటికం: మట్టి బండి (ఆ పేరుతో శూద్రకుని నాటకం. నాటకంలో మట్టి బండి కి కీలక పాత్ర వుంది.
 10. మాగ్మా: భగర్భం లోని శిలా ద్రవం.ఇది బయటికి పొంగితే లావా గా ప్రవహిస్తుంది.
 11. మా వూరు, గడివేముల, చిందుకూరు మరి చాల వూళ్ల మీదుగా ప్రవహించి నంద్యాల దగ్గర‘పెద్దేరు’ లో కలిసే వాగు. ఇది మద్దిలేటి స్వామి గుడివద్ద పుట్టి మరి కొన్ని వాగులను కలుపుకుని ముందుకు వెళ్తుంది.
 12. రెడీ మేడ్ చర్మాలు: చెర్మాస్, హైదరాబాదులో ప్రసిద్ధ బట్టల దుకాణం.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s