ఆమె మా అక్క

girl n tree

ఇది ఒక అమ్మాయి సంగతి

ఒహ్హో, చాల అందం తనది

తను ఇవాల్టి మీద నిలబడి

రేపటి చిటారు కొమ్మకు చెయ్యి సాచి

మా కోసం పండ్లు కోస్తూ వుండింది

కొమ్మ కొమ్మ పట్టుకుని చెట్టెక్కి

మాకు చాల పండ్లు తెచ్చిస్తుందని

ఆశగా నిలబడ్డాం, నేను తన చిన్ని తమ్ముడిని

ఇంతలో, ఎవరో అటుగా వచ్చారు

ఎవరో మాటకారి ఎవరో పాటకారి

వావ్ ఏమి గొంతు ఆహా ఏమి యాస

అచ్చం బతుకే ఒక పాటగా మారినట్టు

పెను ప్రళయమై శివనాట్యమై సాగినట్టు

ధీర గంభీర స్వరం, పచ్చని రాగాల తీగెలు

చెట్టు చుట్టూ వలయమై అల్లుకున్నాయి

అక్క చుట్టూ పరిమళమై చుట్టుకున్నాయి

పాటలో ఓ గాథ వుంది నేటిది కాదది

ఎప్పటిదో, కాలం సెలయేటి అడుగున

నునుపు దేలిన అరుదైన రాయి

ఎక్కడో అడివిలో ఓ పెద్ద పుట్ట వుందట

పుట్ట నిండా పాములు, పాముల కోరల

నిండా కాలకూట గరళం

పాములు పగళ్ల లోని పగుళ్ల లోంచి

రాత్రి వెలుతురు ముక్కల మధ్య చీకట్ల లోంచి

ఊళ్ల మీదికి వచ్చి విషం చిమ్ముతున్నాయి

మత్తుగా సోలిన మనుషుల్ని మింగేస్తున్నాయి

వాటికి కారణాలు చూపే పని లేదు

అవ తమ అంతులేని ఆకలిని కనిపించనీయవు

పడగల మీద మణులు చూపించి

జిగేల్ మెరుపులతో మనుషుల కళ్లు మూయించి

కొంచెం కొంచెం మానవత్వాన్ని ఆరగించే పాములు

ఆ పుట్టను పగలగొట్టి అన్ని పాములను మట్టువెట్టి

వస్తామని చెప్పి వెళ్లిన అక్కలూ అన్నల కథ అది

వారెవ్వరు తిరిగి రాలేదు,

ఊళ్లకు సర్ప భయం తీరిపోలేదు

నువ్వూ వెళ్లు పద పద వెళ్లు నువ్వూ అంటోంది పాట

వెళ్లు, ఇదిగో ఈ కర్ర ముక్క నీ వీపున కట్టుకెళ్లు

సర్ప సేన మీద పోరాడు, నువ్వక్కడ మరణిస్తే అమరం

అంటోంది పాట. పాటలో ఎంత భయమో అంత మోహం

మా కోసం రేపటి పండ్లు కోసే అక్క మత్తు మత్తుగా

నడుస్తోంది, పని మానేసి పుట్టలున్న చోటికి అడివికి

అక్కా అక్కా, చిన్ని నీ తమ్ముడను నేను చెపుతున్నా విను

అది ఒక పాము కాదు, చిన్న గూండా పాముల గుంపు కాదు

మనుషుల్లోనే కొందరికి తర్ఫీదిచ్చి తయారు చేసిన పాముల సైన్యం

పాము పడగల మీద మణి కాంతులకు మురిసిన మనుషుల సేన

నీ భుజం మీది ఈ కర్ర చాలదు, మన ఊళ్లలో అందరితో మాట్లాడు

చాలా చాల మందిరికి పాము మంత్రం నేర్పు, యుద్ధ తంత్రం నేర్పు

నేనూ వస్తానక్కా అడవులకైనా అనంత ఆకాశాలకయినా

మనాళ్లు ఎంత ఎక్కువ మంది వీలయితే అంత మందిమీ

మనమూ సైన్యమై నిలబడదాం, దాడికి వచ్చిన పాములను

మన చెప్పుల కింద నలిపేద్దాం, అప్పుడిక అడివి పుట్టను కొట్టి

ఆ మట్టిని పంట చేలలో ఎరువుగా వేద్దాం, పాముల సేనను

వాటి ప్రాచీన నివాసాలలో, పాతాళంలో సమాధి చేద్దాం

మనందరం రేపటి పళ్లు తిని వూళ్లను అమరం చేద్దాం

ఊళ్ల జ్ఞాపకాలలో మనమూ వుందామక్కా ఎంచక్కా

వెళ్లొద్దక్కా, అక్కా అక్కా ఆ కర్ర చాలదు ఈ పోరుకు

నేనూ వస్తానక్కా తానూ వస్తాడక్కా నీతో వూరే వొస్తుందక్కా

28-9-2015

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s